Wednesday, February 02, 2011

పి.సరళాదేవి

పంథొమ్మిదివందల యాభై అరవై దశకాలలో ఖాసా సుబ్బారావుగారు సంపాదకులుగా వున్న తెలుగు స్వతంత్ర,,ఆ పైన గోరాశాస్త్రి,శ్రీదేవి గార్ల సంపాదకత్వంలో నడిచి తరువాత ఆగిపోయిన స్వతంత్ర కొత్త రచయితలకి ఆత్మీయ స్వాగతం పలికేవి. రచయిత పేరు ప్రఖ్యాతులని బట్టి కాక రచనని పట్టి ప్రచురించి ఎందరో రచయితల్ని ప్రోత్సహించిన పత్రికలవి ..తన తొలికథలతోనే పాఠకులను ఆకట్టుకున్న రచయిత్రి సరళాదేవి చాలా కథలు స్వతంత్రలోనే వ్రాసారు.శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవల మీద ఒక ప్రశస్తి వ్యాసం కూడా వ్రాసారు.ఆమె తొలి కథబావ చూపిన బ్రతుకు బాట డిసెంబర్ 1955 లో ప్రజాతంత్ర లో ప్రచురితమైంది. మొదటి కథా సంకలనం కుంకుమ రేఖలు అర వై రెండులో వచ్చినా ఆమె 1956 నించీ స్వతంత్రలో దాదాపు ఏడెనిమిది కథలు వ్రాశారు.అవి కుంకుమ రేఖలు సంకలనంలో చేర్చలేదు .కుంకుమరేఖలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధారావాహికంగా ప్రసారం చేసింది. ఆమె కథనం, భాష ఆమె పేరుకి తగ్గట్టు అంత సరళంగానూ వుంటాయి.. అప్పుడు విజయవాడ కేంద్రంలో అనౌన్సర్ గా పనిచేసిన శ్యామసుందరిగారి కంఠం అత్యంత మధురమైనదీ, ఆమె మోడ్యులేషన్ అనితర సాధ్యమైనదీ కావడాన .సరళాదేవి కథకి ఆమె కంఠం జత జేరి ఆ ధారావాహికకు విశేషాదరణ లభించింది. ... కుంకుమ రేఖలు కథా సంకలనం రెండవ ముద్రణ పైన ముఖచిత్రం , కథా రచనలోనూ వ్యక్తిగతంగానూ ఆమెలో వచ్చిన ప్రౌఢతా, పరిణతి లకు అద్దంలా వుంటుంది. 1955 లో కథారచన ప్రాంభించిన సరళాదేవి అరవై,డెభై దశకాల లో ఎక్కువ వ్రాసారు. 77 లో రెండవ కథా సంకలనం సరళాదేవి కథలు ప్రచురితమైంది..79 లో యువ మాసపత్రికలో కొమ్మా బొమ్మా అనే నవలిక వ్రాశారు..అముద్రితమైన మరో నవలిక చిగురు తో కలిపి 2004 లో పుస్తకంగా తెచ్చారు.తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని 1986 లో ప్రచురించారు .స్వతంత్రలో నూ మరికొన్ని పత్రికల్లోనూ కవితలు వ్రాసారు.కొందరు రచయిత్రులతో కలిసి షణ్ముఖప్రియ ,,సప్తపది అనే రెండు గొలుసు నవలలు కూడా వ్రాశారు.

గోరా శాస్త్రిగారి ముందుమాట తో ప్రచురితమైన కుంకుమరేఖలుసంకలనంలో ఎనిమిది కథలున్నాయి. సరళాదేవి కథలు సంకలనంలో పది కథలున్నాయి..కుంకుమరేఖలు లో హేమలత అనే అమ్మాయి అమాయకత్వంనించీ ముక్కు సూటితనం నించీ ప్రపంచపు పోకడలను అర్థంచేసుకుంటూ నొప్పింపక తానొవ్వక బ్రతకడం నేర్చుకున్న వైనం సహజంగా సరదాగా సాగేకథ.పుట్టింటి ఆర్థిక పరిస్థితులనూ అక్కడ డబ్బుతో వాళ్ళు వ్యవహరించే పద్ధతినీ గమనిస్తూ పెరిగిన హేమలత తనకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ పొదుపుచెయ్యాలనీ అట్లా పొదుపుచేస్తే అవసరపడ్డప్పుడు అప్పు చెసేపని వుండదనీ అనుకుంటూ ఆ రోజుకోసం ఎదురుచూస్తుంది.ఆమె భర్త కూడా తన సాదరు ఖర్చులకుంచుకుని తక్కిన జీతమంతా ఆమెకే ఇచ్చి ఇల్లు నడపమంటె సంతోషపడుతుంది.కానీ తక్కువ జీతాల సంసారాల్లో పొదుపు చెయ్యడం మిగల్చడం అంటే అప్పుచెయ్యకుండ వుండగలగడమే నని అర్థం చేసుకుని అటువైపునించీ దృష్టి మళ్ళించి ,తన ముక్కు సూటి స్వభావంతో చిక్కులు కొని తెచ్చుకుని ,అందరితో కలసి పోవాలంటే కొంత లౌక్యం,నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగే స్వభావం అవసరమని గుర్తించి..భర్త చేత ఫరవాలేదు హేమలత బ్రతకడం నేర్చుకుంది అనిపించుకుంటుంది. హేమలతకు ప్రయివేటుగా బి.ఎ చదవాలని వుంటుంది.పుస్తకాలు చదివే అలవాటు వుంటుంది.వాటిని జాగ్రత్త పెట్టుకునే అలవాటుకూడా వుంటుంది..పార్ధసారధి ఆమెను అర్ధం చేసుకున్న భర్త.అందువలన ఆమెకు జండర్ పరమైన ఇబ్బందులేమీ లేవు. సరళాదేవి ప్రచురించిన రెండు సంపుటులలోని పద్ధెనిమిది కథల్లొ దాదాపు అన్నీ స్త్రీల జీవితాలు,ముఖ్యంగా.ఆనాటి దిగువ మధ్య తరగతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లుకున్నవే..డబ్బు పొదుపు, లౌక్యంగా మెసలడంతో మొదలుపెట్టిన సరళాదేవి, స్త్రీల లైంగికత,,దాంపత్య సంబంధాలు,సమాజం స్త్రీ పురుషులకు కొన్ని ప్రత్యేక లక్షణాలనూ విధులనూ నిర్ణయించి నందువల్ల ఆ ఇద్దరూ కూడా కోల్పోతున్న జీవన ఆనందాలు మొదలైన అనేక విషయాల్ని తన కథల్లో చర్చకు పెట్టారు..ఆమె వ్రాసిన కాలం అప్పుడప్పుడే స్త్రీలు ఉన్నత విద్యను అందుకుంటున్న కాలం,.మధ్య తరగతిలో అప్పటికింకా ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడం కుటుంబానికి అప్రతిష్ట అనుకునే కాలం..స్త్రీ జీవన గమ్యం వివాహమే నని ,వాళ్ళకింకా పద్దెనిమిది రాకముందే పెళ్లి చెయ్యడానికి తొందరపడిన కాలం.అయితే ఈ పరిస్థితి అన్ని వర్గాలలోనూ లేదు.సంపన్నులూ ,వివిధ సంస్కరణ ఉద్యమాల వల్ల ప్రభావితమైన వాళ్ల కుటుంబాలలో ఆడపిల్లల చదువు పట్ల కొంత ఆసక్తి కనపరచడం ఆనాటికే వుంది..ఈ ఆసక్తిని సరళాదేవి గారి సరస్వతులను చెయ్యబోతేఅనే కథలోచూడవచ్చు అపురూపంగా పెంచుకున్న చెల్లెల్ని డాక్టర్ని చెయ్యాలని లేదా ఒక డాక్టర్ కిచ్చి పెళ్ళి చెయ్యాలని ఆశపడ్డ అన్నగార్ని నిరాశలో ముంచి ఒక సాధారణ ఉద్యోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది అతని చెల్లెలు.పోనీ ఆచెల్లెలు కూతుర్నైయినా బాగా చదివిద్దామంటే ఆపిల్ల కూడా అంతే చేసింది..మధ్య తరగతి సంసారాలలో కూతుళ్లకి పురుళ్ళు పోసి పంపడం ఎంత భారమైన విషయమో చెబుతూ కూతుళ్ళెంత బాధ్యతగా ప్రవర్తించాలో కూడా సూచించే మంచికథ కూతుళ్ళు కుటుంబ సభ్యుల పరస్పర ప్రేమల మధ్యనే చిట్టి పొట్టి అసూయలని సహజంగా వర్ణిస్తూ, దంపతుల మధ్య ఎంత సాన్నిహిత్యం వున్నా కొంత స్వంత స్పేస్ కూడా వుండాలని చెప్పిన కథ తిరిగిన మలుపుసరళాదేవి మొదటి సంపుటిలోని కథలకీ రెండవసపుటి లోని కథలకీ స్పష్టమైన పరిణామం వుంది. ఆమెకు జీవితం పట్ల ,స్త్రీ పురుష సంబంధాల పట్ల కల అభిప్రాయాల స్పష్టీకరణ వుంది.రెండవ సంపుటం సరళాదేవి కథలు(1977) లోని పది కథలలోనూ అవి కాక భూమిక ,,నూరేళ్లపంట లలో ప్రచురణ అయిన రెండుకథలలోనూ ఆమెలో జండర్ పరమైన అవగాహన కనిపిస్తుంది.ఒక ఇంటి కథ,వాడి కొమ్ములు భిన్నత్వంలో ఏకత్వం పేచీ” “మర్రి చెట్టినీడలోఅనే కథలు సరళాదేవి జీవన తాత్వికతను ప్రాపంచిక దృక్పథాన్ని తెలిపే కథలు.ఒక ఇంటి కథలో ఒక ఇల్లాలు షట్కర్మయుక్త. ను పాటిస్తూ సంసారం నెగ్గుకొచ్చి తనకూతురికి కూడా అట్లావుండడం స్త్రీ ధర్మమని చెప్పినప్పుడు ,ఆ కూతురు అశ్చర్యపడి ఒక మనిషికి ఇంకొక మనిషి ఇంత భారమా అమ్మా? అని అడుగుతుంది.తనతల్లి ఆషట్కర్మల భారాన్ని మోసింది కానీ తనవల్లయితే కాదనే ఉద్దేశంతో..ఆడపిల్లల ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకుంటున్న క్రమాన్నీ ఈ కథ అర్థం చేయిస్తుంది..స్త్రీ అనే కథలో పేదరికం కారణంగా శాంతను చెవిటివాడైన గోవిందుకిచ్చి చేస్తారు..చెవిటివాడూ చదువులేనివాడూ అయిన గోవిందుతో ఉంటూనే తమతో శారీరక వాంఛలు తీర్చుకోమని బంధువులే ఆమెకు సంకేతాలివ్వడమే కాక ప్రత్యక్షంగా అడుగుతారు.శాంత తన పరిస్థితిని అర్థం చేసుకుని, చెవిటితనం కాపురం చెయ్యడానికి అడ్డురాదని ,గోవిందు సైకిల్ షాపుకి తోడు తనూ మిషన్ కుట్టి సంపాదించి ఇద్దరు బిడ్దలకి తల్లై వాళ్ళ జీవితాలను దిద్దుతుంది.కానీ ఆమె కొడుకు ధనవంతుల బిడ్దను చేసుకుని వెళ్ళిపోయినప్పుడు తను చనిపోయినట్లే బాధపడుతుంది.పెద్దల నిర్ణయాలకు బద్దురాలై తనకు వాళ్ళు నిర్ణయించిన భవిష్యత్తుని మౌనంగా అంగీకరించి తనున్న చోటునే నివాసయోగ్యంగా మార్చుకున్న స్త్రీ శాంత.

స్త్రీ పురుష సంబంధాలను గురించి సరళాదేవి గారి అభిప్రాయాలకు అద్దం లాంటి కథ వాడికొమ్ములు సాథారణంగా పూర్వపు అత్తగార్లు కోడళ్ళపై కొడుకులు చూపే ప్రేమకు ఒకింత ఈసు చెంది ముందొచ్చిన చెవులకంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటూండేవారు.ఈ కథలో యువకుడు అవును నిజం అవి వాడివేఅని తర్కం చెబుతాడు..అతనిలా అంటాడుమగవాడి జీవితంలో తల్లి ఎక్కువా? భార్య ఎక్కువా? అన్న సమస్య ,బహుశా భారత దేశంలోనే వుండి వుంటుంది..ఆడదాని జీవితంలోకి మొగుడు కావాలా,కొడుకు కావాలా అన్న ప్రశ్నను పంపించి ,అనేక సినిమాల్లోనూ పుస్తకాలలోనూ ఆడది మొగుణ్ణే ఎంచుకోడం చూపించి అదే ఆదర్శ మహిళత్వమని చాటారు..అదిచూసి మనందరం చప్పట్లు కొట్టాము.అదే రకంగా పురుషుడు భార్యే ఎక్కువని ఎంచుకుంటే తప్పట్లు కొట్టరెందుచేత?అతనింకా ఇలా అంటాడు, స్నేహ సంబంధమైన దాంపత్య బంధం నువ్వు వూహించగలవా,మామయ్యా?నాకు తెలుసు నువ్వు ఊహించలేవు.అందులో ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా లేదు ఉల్టా సీదాలు లేవు.గృహమే స్వర్గసీమ అన్నట్లు వుండాలని నా కోరిక.. వెనకొచ్చిన కొమ్ములు తప్పకుండా వాడివే మామయ్యా! నువ్వూ నేనూ ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా అవి వాడివేఅంటాడు.తల్లి తండ్రుల పట్ల బాధ్యతలు మరువకుండానే వాళ్ళ అత్యాశలను పక్కనపెట్టి,జీవనభాగస్వామిని ప్రేమించి గౌరవించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అంటాడు

భిన్నత్వంలో ఏకత్వం భర్తల చేతులో హీనమైన పరాభవాలకు గురౌతూ కూడా వారిని విడిచిపెట్టని ఇద్దరు స్త్రీల కథ.ఒక స్త్రీ పల్లేటూరిది .చదువురానిది..రెండవ ఆమెకు ఎవరూ కల్పించనవసరం లేనన్ని అవకాశాలు వున్నాయి .కానీ ఈమే భర్తకు విడాకులివ్వదు. ఈ కథకు సరళాదేవిగారి ముగింపు వాక్యాలు,దుర్మార్గుడైన పురుషుడిని రెచ్చగొట్టే స్త్రీ దుర్మార్గురాలు కాదా?ఈ నిర్ణయంతో వీళ్ళు సాధించదలిచింది ఏమిటి?భయంకరమైన సత్యమేదో కనిపించీ కనిపించనట్టుంది.అదే నిజమైతే వీళ్ల ప్రయాణం ఏ దిక్కుకి?

ఇదే కథలో విద్యావంతురాలైన రెండవ ఆమెతో ఆమె బాబాయి ,స్త్రీ విడాకులివ్వడం మళ్ళీ పెళ్లి చేసుకోడం లోకం హర్షించదేమోకానీ చరిత్ర హర్షిస్తుంది,ఉత్తినే కాలిపోయేకన్న ఒక ఆరోగ్యకరమైన పోరాటంలో నువ్వొక సమిధవై కాలిపోతే.. అంటాడు

పేచీఅనే కథలో కట్నం ఇచ్చి కూతురికి పెళ్లి చెయ్యలేని తండ్రి ,తనకూతురితో కేవలం స్నేహంచేస్తున్న హరికిషన్ అనే అబ్బాయిని సూటిగా నాకూతుర్ని పెళ్ళి చేసుకుంటావా? అని అడక్క ఎవరో పుట్టించినట్టు తనే వాళ్ల మీద పుకార్లు పుట్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేలా చేస్తాడు....ఈ పేచీ సంగతి తెలిసిన అల్లుడు భార్యని పుట్టింటి గుమ్మం తొక్కవద్దంటాడు.ఇక్కడ స్త్రీలకి నిర్ణయాధికారాలేమీ లేవు వాళ్ల జీవితాలతో ఆడుకునేది ఇద్దరూ పురుషులే...మర్రిచెట్టు నీడలో అనే కథలో మర్రిచెట్టు నీడలో ఇతర మొక్కలు విస్తరించనట్లు తల్లి అక్క చెళ్ళెళ్ల కు ఒక్కగానొక్క డైన కొడుకు/తమ్ముడు వాళ్ళ అతిప్రేమ అనే పొసెసివ్నెస్ లోపడి కొట్టుకున్నంతకాలం తనకి తన భార్యతో నిజమైన ప్రేమతో కూడిన జీవితం దొరకదని అర్థమై ట్రాన్స్ ఫర్ కి పెట్టుకుంటాడు.

సరళాదేవి రెండు నవలికలు లేదా పెద్ద కథలు కూడా ఇద్దరు స్త్రీ ల జీవితాలలోని సంక్షోబాన్నే చిత్రిస్తాయ. రెండు నవలికలలోని ప్రథాన స్త్రీ పాత్రలు దిగువ మధ్యతరగతి వాళ్ళే .చిగురు అనే నవలిక లో విమలని ,ఆ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె కన్న చాలా పెద్దవాడూ, మూడో పెళ్ళివాడూ,అయిదుగురు బిడ్డలతండ్రీ అయిన రమాపతికి ఇచ్చి పెళ్ళి చేస్తారు.అతను పెళ్ళి చూపుల్లోనే తానీ పెళ్ళి పిల్లల కోసమే చేసుకుంటున్నానని స్పష్టంగా చెప్పాడు.ఆ మేరకు అతను విమలను ఆ అయిదుగురు పిల్లలమధ్యా కుమ్మరించేసి చేతులు దులిపేసుకున్నాడు.ఆమెకేసి కన్నెత్తి చూడలేదు.రమాపతిది ఒక వింత మనస్తత్వం అతనేం చెప్పాలనుకున్నాడో సూటిగా చెప్పడు.పెద్ద దృశ్యం సృష్టిస్తాడు.దాన్ని అర్థంచేసుకుని ఇంట్లో వాళ్ళు మసలాలి.దాదాపు విమల ఈడువాడే అయిన రమాపతి పెద్దకొడుకు హరి ఒక్కడే ఆ ఇంట్లో ఆమెని అర్థం చేసుకున్నవాడు.అతను రమాపతి పెద్ద భార్య కొడుకు.తక్కినవాళ్ళు రెండవ భార్య పిల్లలు..రెండవ భార్య అతని చిత్త వృత్తులన్నింటినీ భరించి సమర్థంగా కాపురం నడుపుకొచ్చింది..విమల ఒక వంట మనిషి గా పిల్లల్ని చూసుకునే మనిషిగా మిగిలిందనీ స్త్రీలకైనా పురుషులకైనా సహజసిద్ధమైన శరీరక వాంఛలు తీరకపోవడం పెద్ద లోటనీ విమలకు అన్యాయంజరిగిందనీ తెలుసుకుని ఆమె తల్లి ఆ దిగులుతోనే మరణించింది. విమల తల్లి రమణమ్మ బాల వితంతువు.ఆమె పరిస్థితి చూసి రంగారావనే యువకుడు జాలి పడ్దాడు.రమణమ్మ కూడా అతనిపట్ల ఆకర్షితురాలైంది.స్నేహితుల సహాయంతో వేరే ఊర్లో వారికి వివాహం జరిగింది..శారీరక అవసరాలు స్త్రీకి వేరూ పురుషుడికి వేరూ వుండవనీ ప్రకృతి స్త్రీ పురుషులిద్దరిమధ్యా ఒకేరకం ప్రభావం చూపిస్తుందనీ సంప్రదాయం మాత్రమె స్త్రీలకు కళ్ళాలు బిగించిందనీ రమణమ్మ నమ్మకం.(రచయిత్రి నమ్మకం) అందుకే ఆమె తనకూతురికి తామే అన్యాయం చేశామని క్షోభించింది..రమాపతి కొడుకు హరి తండ్రిని సరిగ్గా అంచనా వేయగలిగాడు నాన్నకు ఆంగికంగా ఆడది కావాలి.కానీ దాన్ని సాధించడమెలాగో తెలియదు.సక్రమంగా కట్టుకున్న ఇల్లాలిని ఆదరించడమే తెలియదు.సూటిగా ప్రయత్నింఛడం ,మెల్లిగా స్నేహంచెయ్యడం తీయగా కవ్వించడం హాయిగా ఆకర్షించడం ఆయనకు చేతకాదు :సమాజం ఆనేర్పుని పురుషులలో చంపేసింది.ఆడదాని మీద హక్కులిచ్చి.పెళ్ళిపేరుతో ఎన్నో అవకాశాలిచ్చి:పాతివ్రత్యం పేరుతో ఆడదాన్ని కట్టిపడేసి:పురుషునిలో ఆ నేర్పుని చంపేసింది.పితృస్వామ్య వ్యవస్థ వల్ల లభించిన హక్కు అధికారాలు పురుషులను మానవసహజమైన అనుభూతులకెలా దూరంచేశాయో చెబుతుంది రచయిత్రి హరి మాటల్లో...

కొమ్మా బొమ్మానవలిక లో మంగ ఇంకా స్కూల్లో చదువుతూండగానే తండ్రి ఆమెకు పెళ్ళి నిశ్చయం చేస్తాడు.కానీ పెళ్ళినాటి రాత్రే ఆ భర్త పారిపోతాడు.అందుకు కారణం మంగేనని అత్తవారు యాగీ చేస్తారు.అసలు మొదటిరాత్రంటే ఏమిటో కూడా తెలీని మంగ భర్త ఎందుకు పారిపోయాడో తెలీని మంగ అన్ని అపవాదుల్ని భరించింది.కూతురికి జరిగిన అన్యాయానికి కలత పడి ఆ ఆవేదనతో తల్లి మరణించింది.తండ్రి ఆర్థికంగా చితికి పోయాడు.స్నేహితురాలి తల్లి కమలమ్మ ప్రోత్సాహంతో మళ్ళీ చదివి స్కూల్ టీచర్ గా చేరి చనిపోయిన అక్క పిల్లల బాధ్యతకూడా తీసుకుని తోటి టీచర్ అయిన ఆనందరావుని వివాహం చేసుకోవాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్న సమయంలో పారిపోయిన భర్తనంటూ నాయనమ్మని వెంటపెట్టుకుని ఒక వెంగళప్ప వస్తాడు.ఇరుగూ పొరుగూ పంచాయితీలు పెడతారు.అతన్ని అక్కడే వుండనియ్యమంటారు.స్త్రీధర్మాలు ప్రబోధిస్తారు.ఆడదానికిమగదిక్కు ఎంత అవసరమోనొక్కి వక్కాణిస్తారు. వచ్చినతను అసలో నకిలీయో తెలియదు.అంతకు ముందు అక్కభర్త వచ్చి ఆమెను బలవంతంచెయ్యబోయి .ఆమెప్రతిఘటించగా చూసుకో నిన్నేంచేస్తానో అని బెదిరించిపోయాడు..తన ఇంట్లో తన అరుగు కింద చేరి తన బ్రతుకుని పంచాయతీ చేసే హక్కు వీళ్ళకెవరిచ్చారు?తన జీవితంతన చేతుల్లోనించీ జారిపోయి ఎప్పటికప్పుడు ఎవరి చేతుల్లోనో పడుతోంది..ఈఆడదిఎందరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి.అని ఆవేదన పడింది.చివరికి వచ్చిన వాళ్లు చెప్పకుండా పారిపోవడంతో మంగ ఊపిరి పీల్చుకోగలిగింది..స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ ఎంత సంక్షోభాన్ని సృష్టిస్తోందో,చదువుకుని సంపాదిస్తున్న స్త్రీలుకూడా సంప్రదాయాల వలలో ఎట్లా చిక్కుకుపోతున్నారో సరళాదేవి ఈ నవలలో చెప్పారు..చిగురు నవలలో హరి,కొమ్మా బొమ్మా లో ఆనందరావు గోపీ రంగారావు హృదయమున్న పురుషపాత్రలు.రమణమ్మ,కమలమ్మ,రమ ఆలోచన కల స్త్రీలు.

స్త్రీల అంతరంగాన్ని ఎరిగిన సరళాదేవి డెభ్భైల తరువాత వ్రాయడం తగ్గించకపోతే ఎనభైల తరువాత స్త్రీలలో పెరిగిన జెండర్ స్పృహతో ఇంకా మంచి కథలు వ్రాసి వుండేవారు. సరళాదేవి నవలికలకు ముందుమాట వ్రాసిన మృణాళిని అన్నట్లు ఆమె ఇంకా వ్రాయవలసిన రచయిత్రి

రచయిత్రి శీలా సుభద్రాదేవికి అక్క..డాక్టర్ శ్రీదేవి స్నేహితురాలు అయిన సరళాదేవి 1937 లోజన్మించి 2007లో మరణించారు.

(భూమిక జనవరి సంచిక నుంచి)

1 comment:

malli said...

సత్యవతిగారూ,
మీరు పాత తరం రచయిత్రుల గురించి సీరీస్ గా రాస్తున్న వ్యాసాలూ బావుంటున్నాయి...ఇలాంటపుడు నాకు ఏం అన్పిస్తుందంటే...స్త్రీలు రాస్తున్నపుడు వాళ్లకి ఎదురైన వ్యక్తిగత,సాహిత్యానుభవాలను కూడా రికార్డ్ చెయ్యగలిగితే బావుంటుంది అని....మన చేతుల్లో లేనిదానికి ఏమీ చెయ్యలేము....
మరి మీ సాహిత్యానుభవాలు ఈ బ్లాగ్ ద్వారా నన్నా రికార్డ్ చెయ్యొచ్చుగా...మీరు ఆ పని చెయ్యక పొతే నేనే ఆడియో రికార్డర్ ఏదో పట్టుకుని సెలవల్లో మీ వూరు వచ్చేస్తా....అసలే బ్లేజ్ వాడ....అందులోనూ వేసవి....ఆపై మల్లీశ్వరి....ఎందుకు రిస్క్ చెప్పండి....?