Saturday, June 02, 2018

సెలవు మాస్టారూ


   సెలవు  మాస్టారూ !
ఒకే చోట  ఏనుగుల మంద గుమికూడినట్లు వుండే నల్లటి  ఆకాశం, ఆ పైన వర్షం . టప టప చినుకులతో మొదలై, జల్లులై రాళ్ళు పడుతున్నంత భయంకరంగా మారడం ..ఎంతకీ ఆగని వర్షం .అందులో ముసురు .మళ్ళీ ప్రళయ భీకర మైన ఎండ బాణాల్లాగా గుచ్చుకునే సూర్య కిరణాలు ,నోరెండి పోయే దప్పిక ,బీళ్ళు పడిన భూమి .రెక్కలు అల్లారుస్తూ  అప్పుడప్పుడూ పక్షులు ,కాకులు గుంపులు గుంపులు.పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథల్లో తరుచుగా కనిపించే ప్రకృతి నేపథ్యం .అన్ని కథల వెనుక   సన్నగా వయొలిన్ మీద వినిపించే   .విషాదపు జీర .ఆ విషాదపు జీర కు మూలం తెలుసుకుంటే కోపమూ కరుణా ముప్పిరి గొని ప్రపంచమంతా దిగులు మేఘాలు కమ్మినా, ముఖం చూపించని సూర్యుడి మీద అసహాయతతో కూడిన కోపం వస్తుంది పాఠకులకి .తను ఏ వ్యాఖ్యానమూ చెయ్యడాయన.పాత్రలూ ఉద్వేగంతో ఊగిపోవు .ఆ దుఃఖంలో, దురదృష్టమే తమ భవితవ్యం అనుకుని గమ్మున వుండిపోతాయి. ఇదిగో ఇలా వుంది విషయం అని  చెప్పేసి చదువరులకి  కోపం తెప్పించి ఏంచేసుకుంటారో చేసుకోండి అని నిబ్బరంగా వుంటాడాయన .
సుబ్బరామయ్య గారికి సాహిత్య అకాడమి అవార్డు వచ్చినప్పుడు ఒక సమీక్ష కోసం ఆయన కథా సంపుటాలు కొత్తగా వేసినవి రెండూ చదివాను.  ప్రచురణ కర్తలు ఏ కథ క్రిందా ఆ కథ  ఏ పత్రిక లొ వచ్చిందో ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు.ఇటీవల అజోవిభో కందాళం ప్రచురణల తరఫున ఆయన విశిష్ట కథలు అని నలభై ఆరు కథలతో ఒక సంపుటం ప్రచురించారు .సుబ్బరామయ్య గారు నాకు రెండు నెలల క్రితం  ఫోన్ చేసి “ఒక సారి రా అమ్మాయ్! నీకో పుస్తకం ఇవ్వాలి” అంటే వెళ్లి తెచ్చుకున్నాను. .అందులోనూ తేదీలు లేవు.ఇది ఆయనకి   శ్రద్దాంజలి కనుక ఆ చర్చ అక్కర్లేదనుకుంటాను.అయన మీద పరిశోధన చేయాలనుకున్న సాహిత్య విద్యార్థులకి మాత్రం అవసరమే,. ఆయా కాలాల్లో రచయిత దృక్పథంలో, శైలిలో సామాజంలో , కాలానుగుణంగా వచ్చిన మార్పులను పట్టుకోవచ్చు.
 ,సుబ్బరామయ్య గారిది  నిరాడంబరమైన శైలి .నిరాడంబరమైన భాష. చదివించే భాష .పంటి కింద  అక్కర్లేని ఆంగ్లపదాల రాళ్ళు లేని భాష .ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో వ్రాసే భాష కాదు  .పాండిత్య ప్రకర్ష అంతకన్నా లేదు. తెలుగు కథా సాహిత్యంలో ఒక విశిష్ట  స్థానాన్ని, ప్రశంసలనూ, పురస్కారాలనూ అందుకున్న రచయితగా ఆయన తను చదివిన గొప్ప గ్రంధాలను ఉదహరిస్తూనో, అందులోని ఆణిముత్యాలను ఉల్లేఖిస్తూనో తన మేధావిత్వాన్ని ప్రదర్శించుకోవచ్చు కానీ ఆయన ఆ వైపుకు చూడడు .కథ చెప్పడానికి ఎంచుకున్న వస్తువు పైనే దృష్టి   కేంద్రీకరిస్తాడు. ఆరు దశాబ్దాలకు పైగా బెజవాడ నివాసి ఆయన.  బెజవాడ పట్టణం  విజయవాడగా దిన దిన ప్రవర్థమానం అయి రాజధాని నగరంగా పరిణామం చెందడాన్ని దగ్గర్నుంచి చూసినవాడు .దాని అభివృద్ధినీ అభివృద్ది తాలూకు క్రీనీడలనీ పరిశీలించిన వాడు..వ్రాయడం బహుశా 1960 లలో మొదలు పెట్టి వుండవచ్చేమో.అప్పటి బెజవాడ పట్టణమే అయన కథల్లో ఎక్కువ కనిపిస్తుంది .ఎంత గొప్ప రచయితలయినా వాళ్ళు వ్రాసిన కథలన్నీఒకే ప్రమాణంలో వుండవు .కానీ రచయితకి . ఒక చూపు వుంటుంది .ఆయనది అధో జగత్తుపై కరుణ ప్రసరించే చూపు మనస్తత్వ విశ్లేషణ .కొంత తాత్వికత అన్ని కథలల్లోనూ అంతర్లీనంగా వుంటాయి.. సిద్ధాంతాలూ ఉపన్యాసాలూ లేని చిత్రణ.
.ఆయన వ్రాసిన అన్ని కథల్నీ ఇక్కడ ప్రస్తావించలేము కనుక ఆయన కథలు వ్రాయడం ప్రారంభించినప్పటి వాతావవరణాన్ని దాన్ని ఆయన చిత్రించిన కథలతో మొదలు పెడితే  పంతొమ్మిది వందల  అరవై దశకం ఎన్నో నిరాశలకూ నిస్ప్రుహలకూ  అలజడులకూ అందోళనలకూ నాంది పలికిన కాలం .నిరుద్యోగం పేదరికం అవినీతి ప్రస్పుటంగా బయట పడిన కాలం .అప్పుడు.నిరుద్యోగుల వ్యధల్ని  చిత్రిస్తూ ఆయన కొన్ని కథలు వ్రాసారు .చదువుకున్న యువకులకు ఉద్యోగం వస్తే సనస్య తీరుతుంది .కానీ యువతులకి అప్పటికే ఇప్పటికీ వివాహమే జీవన ప్రాధమ్యం.విద్యావంతురాలూ ఉద్యోగాస్తురాలూ అయిన మిస్ భారతి బి.ఎ తనకి పెళ్లి అయిందని అబద్ధాలు చెబుతుంది .ఆ కథకి ఆ పేరు పెట్టడం కూడా ఒక శిల్పమే అనుకుంటాను .అప్పుడప్పుడే అమ్మాయిలు కాలేజీల్లో చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తున్న రోజులు .చదువు కూడా పెళ్లి కి ఒక అనర్హతగా ఇంకా పరిగణిస్తున్న రోజులు.ఆడపిల్లకి చదువు ఉద్యోగం కన్నా పనిపాతలూ వినయం వందనం ముఖ్యం అనుకునే రోజులు ఇంకా పోలేదు .చాలా కథల్లో కుంపటి మీద కాఫీలు పెట్టుకోడాలు .విసనకర్రతో విసురుకోడాలు,చాపల మీద కూర్చోడాలు .ఆడపిల్లను మైనస్ అనడం మొగవాళ్ళని ప్లస్ అనడం పదహారేళ్ళకి పెళ్లి సంబంధాలు చూడ్డం వుంటాయి .అంటే సుబ్బరామయ్య గారు ఎక్కువ కథలు వ్రాసింది  అరవై డెభై దశాకాల్లోనే అనిపిస్తుంది.ఆయన బెజవాడ లొ అప్పట్లో రామాటాకీస్ దగ్గర కాలువ గట్ల పై నివసిస్తూ పడుపు వృత్తి చేసుకుని అత్యంత దౌర్భాగ్య జీవితం గడిపే స్త్రీలను గురించి  రెండుమూడు కథలు వ్రాసారు.ప్రత్యెక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడు పట్టణంలో పెట్టిన సుదీర్ఘ కర్ఫ్యూ  వలన వాళ్ళు కడుపు నింపుకోడానికి పడ్డ అవస్థలని  కళ్ళముందు పెట్టారు. కొందరు యువకులలో  వచ్చిన బ్రతుకు తెలివీ వ్యాపార దృక్పథాలను గురించి కూడా వ్రాసారు. పర్యావరణం గురించి వ్యాపార విద్యాలయాల గురించీ కూడా వ్రాసారు ఆయన ధ్రువతార ,ముక్తి ,పంజరం అర్జునుడు త్రిశంకు స్వర్గం ,లావా,చేదుమాత్ర,అంగార తల్పం అనే  ఎనిమిది నవలలు కూడా వ్రాసారు అవి 20113 లొ చినుకు పబ్లికేషన్స్ ప్రచురించింది నవలల కన్నా కథా రచయిత గానే సుప్ప్రసిద్ధుడు ఆయన .1980 తరువాత నవలలు వ్రాయకూడదని ఆయనే అనుకున్నానని చెప్పారు ఒక చోట .
  .సుబ్బరామయ్య గారు ఎక్కువగా నిరుపేద బ్రాహ్మణులను గురించి కలత చెందారు .అందుకే ఆయన్ని “దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడు “అంటాడు.వేగుంట  మోహన ప్రసాద్. పూర్ణాహుతి వారిని గురించి వ్రాసిన ప్రసిద్ధ కథ,మధ్య తరగతి జీవులను గురించి వ్రాసిన కథలలో కూడా బ్రాహ్మణ కుటుంబ వాతావరణమే వుంటుంది .తెలిసిన జీవితాన్నే వ్రాయాలను కోవడం వలన కావచ్చు .
 తెలుగు కథా  సాహిత్యంలో సుబ్బరామయ్య గారి పేరును చిరస్థాయి గా నిలబెట్టిన కథ “నీళ్ళు’ నీళ్ళకోసం తపించి తపించి పుష్కలంగా నీరున్న ప్రాంతానికి వచ్చిన జోగినాధం నీళ్ల బిందె పొరపాటున  దొర్లించి దెబ్బలు తిన్న చెల్లెల్ని .మంచినీళ్ళు, బిందె ఇంతని కొనుక్కుని జాగ్రత్తగా వాడుకోవలసిన పరిస్థితిని ,స్నానానికి నీళ్ళు దొరకని స్థితిని బావుల్లో పాతాళానికి దిగిపోయిన నీటి జలనీ తలుచుకుని తల్లినీ చేల్లెళ్లనీ తలుచుకుని వాళ్ల బదులు కూడా తనే నీళ్ళుతాగుతాడు .తాగే గ్లాసు వంక అపురూపంగా చూసుకుంటాడు .బాల్చీలకొద్దీ నీళ్ళు తోడుకుని స్నానం చేస్తాడు .నీళ్ళ పట్ల అతని “అపిని” అందరికీ ఎగతాళిగా మారుతుంది.ఒక రోజు  జోగినాధం తెల్లవారకుండానే కృష్ణ లొ స్నానానికి వెళ్లి లోలోపలికి పోయి సుడిలో చిక్కి పోతాడు.ప్రాకాశం జిల్లాలో నీళ్ళ ఎద్దడి ,కృష్ణా లొ పుష్కంలంగా నీరు .నీటిని బట్టి నాగరికత ,జోగినాధం మానసిక స్థితిని అలవోకగా చిత్రించినప్పుడే ఆయన ఒక పరిణతి చెందిన రచయితగా గుర్తింపు పొందాడు..తరువాత ఆయన దగ్ధ గీతం, ముసురు, గాలి, కళ్ళజోడు  తాతిగాడి కల ,ఏస్ రన్నర్,ఇంగువ వంటి కథలు వ్రాసాడు ఆయన వ్రాసిన కథల్లో నీళ్ళు తరువాత ప్రఖ్యాతి పొందిన కథ ఇంగువ..ఇంగువను ఒక ఉత్ప్రేక్షగా వాడుకుని మనిషికి తానెవరో ఏమిటో జీవితకాలంలో తెలియదు అని అర్థం చేసుకోవాలనుకుంటాను. ఈ కథలోనే ఒక చోట “ఉదాహరణకు నువ్వు రోడ్డు మీద పోతున్నావనుకో, అవతల దూరంగా వెడుతున్న ఎవరినో చూడాలనుకుంటావు...కానీ ఏ లారీయో ట్రక్కో అడ్డం వస్తుంది. అవతలి మనిషిని ఎప్పటికీ చూడలేవు. అలాగే ఎప్పుడో ఏదో అనుమానం వస్తుంది. అది తీరకుండానే ఉండిపోతుంది తీర్చుకుందామనే అనుకుంటాము. కానీ వీలుపడదు. ఎప్పటికీ వీలుపడదు ఏదో చూడాలని అనుకుంటాము .కానీ ఎప్పటికీ చూడడం  కుదరదు .అలాగే కాలం గడిచిపోతుంది చివరకు అట్లాగే చచ్చి పోతాము” అంటాడు. ఇంగువ గురించి తెలుసుకోకుండానే పోయిన మనిషి  ఈ కథ ను చాలా ఇష్ట పడి త్రిపుర గారు “ఒక కాఫ్కా సుబ్బరామయ్య ఇంగువ వృత్తాంతం “ అనే కవిత కూడా వ్రాసారు .ఈ  ఆలోచన సుబ్బరామయ్య గారి చాలా కథల్లో ఒక” లైట్ మోటీఫ్ “ Leit motif లాగా ఉంటుంది .కళ్ళజోడు కోసం తపించిపోయి తీరా దొరికినప్పుడు పగిలి పోవడం, గ్రామోఫోనే రికార్డ్ వినేటప్పుడు ఇయర్ ఫోన్ లొ బాటరీ అయిపోవడం, సినిమాలో చూడాలనుకున్న దృశ్యం తెగిపోవడం ,తండ్రికి గాలికోసం ఫ్యాన్ సంపాదించేసరికి ఆయన పోవడం .ఇట్లా చాలా కథల్లో .
.ముసురు కథలో సింహాచలం ,దగ్ధ గీతం కథలో సేతురామన్  పూర్ణాహుతిలో కథకుడు, సతీ సావిత్రిలో సావిత్రి,  లాంటి మనసున్న మంచి వ్యక్తులుంటారు .యౌవ్వనం లొ ఒక వెలుగు వెలిగి వృద్ధాప్యంలో దీనావస్థకు గురైన  చాంపియన్లున్నారు.ఎక్కువగా చింపిరి అనాథ బాలలున్నారు.బాధిత స్త్రీలున్నారు .సుబ్బరామయ్య గారికి స్త్రీల పట్ల సానుభూతి వుంది..సామాజంపట్ల ఒక నిరాశతో కూడిన ఆవేదన వుంది  .ఆయన  కాలంలో ఆంధ్ర దేశంలోనూ విజయవాడలోనూ ఎన్నో అలజడులూ ఆందోళనలూ సంభవించాయి అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి .తాతిగాడి కల అనే కథలోమాత్రమే ఆయన ఒక రాజకీయ పరిణామాన్ని  చూపించారు .ఒక మహానాయకుడికి చెప్పుల దండ వెయ్యడం చూసి చిన్నవాడైన తాతిగాడు జరగబోయే పరిణామాలను ఉహించుకుని దాన్ని తియ్యడానికి ప్రయత్నించి గుంపుకీ పోలీసులకీ దొరికి పోయి దెబ్బలు తిని పోలీసు స్టేషన్ లొ తేలి ,పోలీసులకి నిజం చెప్పినా నమ్మారో లేదో గాని నవ్వేసి వదిలేస్తాం అంటారు.
సుబ్బరామయ్య గారు నిరాడంబరుడు .స్నేహశీలి .అనారోగ్యం వలన ఎక్కడికీ స్వంతంగా రాలేకపోయి ,ఒంటరి అయిపోయానని బాధ పడేవాడు .ఆయన్ని అందరూ అభిమానించి వెళ్లి చూసి వచ్చేవాళ్ళు. అసంతృప్తి వుండేది. వృద్ధాప్యానికి కొన్ని సౌకర్యాలు అవసరం.ఆ ఎరుక కూడా ఇంగువ లాగే చివరిదాకానూ, చివరికి కూడానూ తెలిసిరాదనుకుంటాను.  తెలుగు పాఠకులకి కొన్ని గుర్తుండే కథలిచ్చి, మెడికల్ కాలేజి కి దేహాన్నిచ్చి  వెళ్ళిపోయారు మాస్టారు .”ఒక్క సారి రా అమ్మాయ్” అనే ఆయన ఫోన్ పిలుపు కలుక్కుమంటుంది .నన్ను అమ్మాయ్ అని మానాన్న తరువాత ,మావూరి వాళ్ల తరువాత ,సుబ్బరామయ్య గారే .వుంటాను మాస్టారూ!
పి .సత్యవతి  ( ఈ మాట జూన్ సంచికలో ..)
  


.

Thursday, May 24, 2018

ఫోన్లు                                 ఫోన్లు ఆగిపోయాయి .
ఉదయం పదకొండు గంటలకో సాయంత్రం నాలుగు అయిదు గంటల ప్పుడో ల్యాండ్ లైన్ మోగుతుంది .ల్యాండ్ లైన్ కి ఇద్దరు ముగ్గురు తప్ప ఫోన్ చెయ్యరు .చాలా తప్పుడు పిలుపులు వస్తాయి అందుకని నేను తియ్యను. శాంతి తీస్తుంది .పరుగెత్తుకుంటూ వచ్చి “సుబ్బరామయ్య గారు లైన్లో వున్నారు “అంటుంది .వారం రోజుల నాడు మాటల సందర్భంలో “సుబ్బరామయ్య గారు ఫోన్ చేయ్యట్లేదేం “అనడిగింది.అయ్యో నేను చేసి వుండాల్సింది అని కాస్త పశ్చాత్తాప పడ్డానే కానీ చెయ్యనే లేదు.సంజాయిషీలు లేని ఇటువంటి తప్పిదాలకి సుబ్బరామయ్య గారు నా మీద అలిగారు .నేను ఫోన్ చెయ్యాలనే పాటికి ఆయన వెంటిలేటర్ లోకి వెళ్ళిపోయారు..ఫోన్ చేసినప్పుడల్లా “ఒక్క సారి రా అమ్మాయ్ “అంటారు .నన్ను ,మానాన్న, మావూరి వాళ్ళు తప్ప ఎవరూ అమ్మాయ్ అనరు .నేను అమ్మాయ్ ని కాను అమ్మమ్మని. అయినా సుబ్బరామయ్య గారు ఎప్పుడూ నన్ను సత్యవతి గారూ అనో సత్యవతి అనో అనరు  .అమ్మాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు .ఉద్యోగాలూ పిల్లల్ని పెంచే బాధ్యతలూ సంఘ సేవలూ ఏవీ లేని నాకు కూడా తీరిక వుండదు .అట్లా లేకుండా చేసుకుని బ్రతికి వున్నానేమో .కొన్ని అనారోగ్య కారణాల వలన ఎట్లా అంటే అట్లా ఒక ఆటో ఎక్కేసి ఎక్కడికీ గభిక్కిన పోలేను .సౌకర్యాలు కావాలి .అందుకే  ఆయన ఇల్లు చాలా దగ్గరే అయినా అమ్మాయి ఆయన్ని చూడ్డానికి వాయిదాలు వేసి తనేం తప్పు చేసిందో తెలుసుకుంది. ఇంక నాతొ పలకరు. ఫోన్ చెయ్యరు .విజయవాడలో ఇద్దరం ఎప్పటినుంచో వున్నాం .కానే ఒక పదేళ్ళ నుంచే మా స్నేహం .పలకరింపులు. కలుసుకోడాలు .ఒక్కొక్క సారి చాలా అమాయకంగా కనిపిస్తారు.ఒక్కొక్క సారి ఆవేశంగా మాట్లాడతారు ‘ఒక సారి ఒక యువరచయిత గురించి మాట్లాడుతూ “అబ్బ! ఏం వ్రాస్తాడమ్మాయ్! ఆ మాండలికం ! అద్భుతం అనుకో ! చదివావా నువ్వు “ అని సంతోషంగా ఊగిపోతారు .సాహితీ లోకంలో అక్కడక్కడా కనపడే అసూయలు, ఎవరినైనా చిన్న బుచ్చే మాటలు ఆయనెప్పుడూ మాట్లాడరు. సహరచయిత్రులందర్నీ అమ్మాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు  .పేరు తెచ్చుకుని అందరి మెప్పు అవార్డులూ తెచ్చుకున్న రచయిత వృద్ధాప్యం అనారోగ్యంతో  ఎక్కడికీ స్వయంగా పోలేని పరిస్థితిలో కొంత విచారంతో ,ఎప్పుడు ఎవరు వచ్చి పలకరిస్తారా అని ఎదురు చూస్తూ గడిచింది  విజయవాడలో ఆయన్ని గురించి పట్టించుకోని వారూ వెళ్లి చూడని వారూ లేరు .అందరి మిత్రుడు .ఇంత  అనారోగ్యం వున్నా ఏటా తనపేర అవార్డులు ఇవ్వడానికి చాలా శ్రమ పడతారు .ఆయన కథల గురించి నేను ప్రత్యేకం ఇప్పుడు ఏం చెప్పాలి ? దేశమెరిగిన రచయితకదా? ఏపని మీద విజయవాడ వచ్చినా ఆయన్ని చూడకుండా ఏ రచయితా తిరిగి  వెళ్ళిపోరు  .అంత గౌరవాన్ని  ప్రోది చేసుకున్నారు ఆయన . పదేళ్ళ క్రిందట తోడుగా వచ్చిన సహచరి ని చేసుకున్న  గీతారాణిగారికి  సానుభూతి అనడం కూడా పేలవమే . ఒక్కసారిగా కమ్ముకొచ్చిన దుఃఖం నుంచీ బయట పడాలి ఆమె.సుబ్బరామయ్య గారి గురించి  “ వుండేవారు “ అని ఎప్పుడూ అనుకోలేను. ఆయన వున్నారు .వుంటారు. .వృద్ధాప్యం మృత్యువూ తప్పవు .వాటిని కాస్త సౌకర్యవంతంగా వుండే ఏర్పాటు చేసుకోడం లొ తప్పులేదు అవసరం కూడా అని నేను గ్రహించాను . మెడికల్ కాలేజికి దేహాన్నిచ్చి ఏవగింపు కలిగించే  కర్మల నుంచీ  ఆయన తప్పించుకోగలిగారు. బందువులనూ తప్పించ గలిగారు .విద్యార్థులకి సాయ పడ్డారు.ఆయన  కల్పించుకున్న సౌకర్యం అదే .మంచిపని చేశారు సర్ .
పి.సత్యవతి

Thursday, May 17, 2018
     నచ్చిన పుస్తకం

  సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో తెలిసిన మనిషి
                     నీల
 బహుమతి పొంది, చర్చలోకి వచ్చిన ఒక పుస్తకం పైన అందరికీ ఆసక్తి వుంటుంది. అలాగే నాకు కూడా. అందుకే చదువుతాను.. అది నన్ను పట్టుకుంటే ఎవరికైనా చెప్పాలని ఆత్రపడతాను. ఉద్దేశంతో జాగ్రత్తగా మళ్ళీ చదువుతాను.. నీల గురించి ఎక్కువమందితో పంచుకోవాలని. ఈ 540 పేజీల నవల ఎక్కడా విసుగు పుట్టకుండా చదివించింది నాచేత.  పుస్తకం అంతా మనుషులు తమను తాము నిలబెట్టుకునే క్రమంలోని వైవిధ్యం.. ముఖ్యంగా స్త్రీలు. వాళ్ళు పితృస్వామ్యం సృష్టించిన మూసలు కారు. ఎవరి పరిధిలో ఎవరి చైతన్యంతో వారు నిలబడడానికి పోరాటం చేస్తున్న స్త్రీలు ఆంధ్రప్రదేశంలోని  పాతిక సంవత్సరాల ఉద్విగ్న భరితమైన  రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక పరిణామాల నేపధ్యం. ఊపందుకుంటున్నఅస్తిత్వఉద్యమాలు, ప్రేమికుల సహచరుల మధ్య స్వేచ్చతో కూడిన  గౌరవం కోసం చేసిన ప్రయత్నాలు. విస్తృతమైన కాన్వాస్ మీద చిత్రించిన సాంఘిక జీవన చిత్రం ఇది. ఈ నవల వ్రాయడం వెనక రచయిత కృషి, శ్రద్ధ, తపన, అధ్యయనం, అవగాహన తెలిసిపోయింది. కథలకు కవిత్వానికి వచ్చిన పాఠకాదరణ, గుర్తింపు నవలలకు రాకపోవడానికి, వస్తూన్న నవలల సంఖ్య తక్కువ కావడమో లేక అవి సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకునే పాఠకులు ఆశించే  ప్రమాణాలను అందుకోక పోవడమో ఏ కారణమో కాని అప్పుడప్పుడూ వచ్చే గుర్తించవలసిన  నవలల ప్రస్తావన కూడా నలుగురు కలిసిన వేళల నోటిమాటల ద్వారా కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడం లేదేమో అన్పిస్తుంది. బహుళ ప్రచారంలో వున్న పత్రికల్లో పుస్తక సమీక్షలకు కొలతలుంటాయి. అంగుళాల లెక్కన. ముఖ పుస్తక పరిచయాలకు కూడా పైకి కనపడని సమీకరణాలుంటాయి.
జీవితం మొదటి కొసకే నిప్పు అంటుకున్న పిల్ల నీల. కుంచెలలో, కలాల్లో పంచవన్నెలూ, చల్లగాలులూ సుందర సోయగాలూ పోయే  పల్లెటూరుకాదు  ఆమె వుండేది. చీకట్లో గోతులతో దోమలు ముసిరే మురుగు కాలవల ఆలవాలం ఆమె వుండే చిన్నఇల్లు. ఏలూరును ఆనుకుని వుండే చోళదిబ్బ. తాగి వేధించే తండ్రి, కుట్టుపనితో కుటుంబానికి ఆసరా అయిన తల్లి, ఎక్కడా జీవితంలో ప్రేమకూ ఆదరణకూ కనీసపు ఆనందానికీ నోచుకోని ఆ తల్లి, ఒక చిన్న ప్రేమ నెలవు వెతుక్కున్న నేరానికి భర్త చేత హత్య చెయ్యబడి ఆ మచ్చను నీలమీద వొదిలి పోయింది. అప్పటి నించీ నీల జీవన పోరాటం మొదలైంది. తన జీవితమే ఒక పోరాటంగా బ్రతికిన నీల  ప్రజా పోరాటాలను జీవితంలో బాగం చేసుకునే దాకా ఎదిగింది. పాతిక సంవత్సరాల ఉమ్మడి అంధ్రప్రదేశ చరిత్రతో పాటు నీల జీవిత గమనాన్ని ఆమె ఆలోచనల్లో ఆచరణలో వచ్చిన పరిణామాలనూ పెనవేసుకుంటూ సాగింది నవల. ఇది నాయిక కేంద్రక నవల కాదు. ఒక జీవితం చుట్టూ కూడా అల్లిన నవల కూడా కాదు. ఇందులో చాలామంది స్త్రీ పురుషుల జీవితం వుంది. వాళ్ళు దానిని మలుచుకున్న తీర్లల్లో భిన్నత్వం వుంది.ఎవరి జీవితమూ వ్యక్తిత్వమూ నలుపు తెలుపు కాదు. వాళ్ళంతా జీవమున్నమనుషులు. జీవితాన్ని వారికి అనువైన తీరులో నిర్మించుకున్న వారు. అయితే రచయితకు గానీ పాఠకులకు గానీ కొన్నిపాత్రలు సన్నిహితంగా వస్తాయి. ఇంకొన్నిటిని చూసి జాలిపడతాం, వాటిలోని మానవ స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. అట్లా అర్థం చేయించడంలో రచయిత్రి సమతుల్యాన్ని సాధించింది. అందుకే పుస్తకం చివరిపేజీల్లో ఒకచోట “మనుషుల్ని ఎంత చివరికి వెళ్లి ప్రేమించవచ్చో తెలుసుకున్నాక.... తను గెలిచిన మజిలీలో నిలబడి గతాన్ని దయగా చూడ గలుగుతోంది.” అంటుంది నీల గురించి.
 తల్లిని హత్య చేసి తండ్రి జైలుకి పోతే బంధువులెవరూ దగ్గరకు తియ్యని నీలని పాస్టర్ దంపతులు అక్కున చేర్చుకుని ఇంటర్ మొదటి సంవత్సరం దాకా చదువుకోనిచ్చారు. అందుకు కృతజ్ఞతగా ఆమె వాళ్లకి ఎంతో పని చేసి పెట్టేది. పొందికగావుండేది. పాస్టర్ దంపతులు ఆమెను అనాధగా చూడలేదు స్వంత బిడ్డలా చూసుకున్నారు. అందుకే వాళ్లకు స్థాన చలనం వచ్చినప్పుడు ఆమె భద్రత కోసం నీలని కావాలని కోరుకుని అడిగినవాడికి ఇచ్చి పదిహేడేళ్లకే పెళ్లిచేసి బాధ్యత నిర్వహించారు. అట్లా 1991 లో రాజమండ్రికి కాపురానికి వచ్చింది నీల. తన కన్న పన్నెండేళ్ళు పెద్దవాడైన అతను నిజంగా తనని మనసుతో కోరుకున్నాడని, అనాధ అయిన తనకు ఒక ఇల్లు అమరిందని ఇంక తన బ్రతుకు అతనితోనే ముడి వేసుకు పోయిందనీ తల్లిలా కాక తను ఒక్కరితోనే జీవితంలో ఇమిడిపోవాలనీ నిశ్చయించుకున్న నీల జీవితం అట్లా కొనసాగలేదు. ఆమె భర్త ఆమెను వెతుక్కుంటూ వొంటరిగా రాలేదు. బోలెడు గతాన్ని దాచిబెట్టుకు వచ్చాడు. పైగా ఆమె తల్లి మచ్చను అతను మర్చిపోలేదు. ఆమె సంసారం నిప్పుల కొలిమి అయింది. పద్దెనిమిదేళ్ళకే తల్లి అయిన నీలకి ఆమె భర్త ప్రసాద్ గతం వర్తమానం అన్నీ ఒక్కొక్కటే అర్థం అయి బ్రతుకుని ఉక్కిరి బిక్కిరి చేసాయి. అయినా అందులోనే ఇమడడానికి అతన్ని సంతోష పెట్టడానికి  చేతనైనన్ని విధాలుగా ప్రయత్నించింది. సునామీలను ఎదుర్కుంది. మానసిక శారీరక హింస అనుభవించింది. అయితే ఈ యుద్ధ కాలంలోనే ఆమె డిగ్రీ ప్రయివేటుగా చదువవుకోగలిగింది. సారా ఉద్యమంలో పాటలు పాడింది. లాయర్ వసుంధరతో పరిచయం అయింది. బయటి ప్రపంచాన్ని కొంత చూసింది. ఎం.ఎ లో కూడా చేరింది. భర్త అనుమానాలనీ అతను చేసే అవమానాలనూ పీకల మీదకు వచ్చే దాకా ఓర్చుకుని, తట్టుకుని చివరికి, ఇద్దరు స్త్రీలమధ్య నలిగిపోతున్న భర్తకు స్వేచ్చ ఇచ్చి తానూ ఆ బంధంలో నుంచీ  తప్పుకున్నది. రాజమండ్రిలో ప్రసాద్ తో చేసిన ఆరేళ్ళ కాపురం, చిన్నప్పుడు అంటుకున్న నిప్పుతోనే పరుగు. ఎమ్మే చదివినా నీలకు సరైన ఉద్యోగం రాలేదు. పాస్టర్ మామయ్య చనిపోగా పాస్టరమ్మ ఎక్కడో కర్ణాటకలో కష్టాలు పడుతోంది. మళ్ళీ తను పుట్టి పెరిగిన చోళ దిబ్బకే 1997లో తిరిగి వచ్చింది నీల. తల్లి మరణానికి ముందు జ్యూట్ మిల్ కార్మికుల ఆందోళనలో నాయక పాత్ర వహించిన ఆరంజోతికి, తమ్ముడు స్టాలిన్ సూర్యం అదృశ్యం, నీల తల్లి చంద్రకళ హత్యతో మతి చెడిపోయింది. ఆరంజోతి తమ్ముడు స్టాలిన్ సూర్యం అంటే నీలకు గౌరవం. అతన్ని పోలీసులు ఏం చేసారో అని ఆరంజోతి అల్లాడి పోయింది. మతి చెడిపోయింది. పోరాటాలకి ఎప్పుడూ ముందు వుండే ఆమె రెక్కలు కత్తిరింప బడ్డాయి. ఆమె కూతురు సంపూర్ణ నీలని ఆదరించి ఇల్లు ఇచ్చి బ్రతుకు తెరువుకు ట్యూషన్లు కుదిర్చింది. సంపూర్ణ ఇప్పుడు, గొడవలు జరిగితే కోళ్ళగంప చాటున దాక్కునే పిరికి పిల్ల కాదు. డ్వాక్రా సంఘాలకి పొదుపుసంఘాలకి నాయకురాలు. బుద్దిమాంధ్యపు భర్తనూ మానసికంగా ఎదగని  కొడుకునూ మతిచెడిన  తల్లినీ చూసుకుంటూనే ఊరి రాజకీయాల్లోకి వచ్చింది. అధికార పక్షం ఎంఎల్  ఎ  ప్రాపకం సంపాదించింది. స్త్రీలను కూడగట్టింది. సంపూర్ణ అంటే  వ్యక్తిగా నీలకి ఇష్టం. కానీ ఆమె రాజకీయాలు ఒక్కొక్కసారి నీలకి నచ్చేవి కావు. భర్త రెడ్డయ్యతో ఆమె ప్రవర్తన, ఆరంజోతిని ఆమె చూసుకునే తీరులో మానవీయత కనిపిస్తుంది. అక్కడ కుల రాజకీయాలు మైక్రో ఫైనాన్స్ గ్రూపులు, స్త్రీలకు అప్పులిచ్చి వాటిని వసూలు చేసుకునేందుకు అనుసరించే దారుణమైన మార్గాలు, అన్నీ కళ్ళకు కట్టిస్తుంది రచయిత్రి. అయితే ఈ పొదుపు అప్పుల వల్ల స్త్రీలు కూడా ఆర్ధికరంగంలో ప్రవేశించడం, తనఖా ఏమీ లేకుండా వాళ్లకి అప్పు దొరకడం  ఆ అప్పు తీర్చుకోడానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోడం అంతా అక్కడొచ్చిన మార్పుగా గ్రహించింది నీల. ఒక పొదుపు సంస్థకు వాయిదా చెల్లించలేక బియ్యం బస్తాలో దూరి దాక్కుని ప్రాణాలు పోగొట్టుకున్న నిండు గర్భిణి చావు, దానిని రాజకీయం చేసిన సంఘటన అప్పట్లో పత్రికల్లో వచ్చే వార్తలే. అప్పుడే పొదుపు సంఘాల మీద పరిశోధనకు వచ్చిన పరదేశి ఆమెకు స్నేహితుడయినాడు. అతనితో కలిసి బెస్త గ్రామాలను బెస్త వారినీ సముద్రాన్నీ దగ్గరగా చూసింది. సముద్రం ఎందుకు వెనక్కి పోతుందో అర్థమవుతోంది. ప్రసాద్ తో ఆమె జీవితం ఒక అనుకోని సంఘటన. కానీ పరదేశీని ఇష్టపడింది. అతనితో సాహచర్యాన్ని కోరుకున్న నీలకి అతనికీ ఒక గతం వుందని తెలిసింది. అతనే చెప్పాడు తను ఒక స్నేహితురాలితో రిలేషన్ షిప్ లో వున్నానని ఆమెతో బ్రేక్ అవుతానని. ప్రసాద్ తో అనుభవాల తరువాత పరదేశికి దగ్గర కావద్దనుకుంది నీల. కానీ చోళదిబ్బలో రాజకీయాలు పెద్దవాళ్ళ ప్రయోజనాలకు సంపూర్ణను బలిపశువు చెయ్యడం, తను ఎదగడానికి దాన్ని కూడా సహించిన సంపూర్ణ ప్రవర్తన నచ్చడం లేదు నీలకి. ఏదోపని మీద అక్కడకు వచ్చిన లాయర్ వసుంధర సాయంతో ఆమె 2000 సంవత్సరంలో హైదరాబాద్ మహా నగరం వచ్చి అక్కడ అజిత ఎన్జీవోలో నెలకి ఎనిమిది వేల జీతానికి ఒక ఉద్యోగంలో చేరి పాపతో కలిసి ఒక్కతే వుంటూ ఊపిరి పీల్చుకుంది. అక్కడ నించీ ఆమెకి ప్రఖ్యాత లాయర్ సదాశివతో పరిచయం, అతని తల్లితండ్రులు నీతాబాయి ప్రకాష్ ల కథ, సింగిల్ వుమన్ గా అజిత జీవితంతో ధైర్యంగా తలపడుతున్న తీరు, నీల తరువాతి తరంలోకి వచ్చిన నీల కూతురు మినో అభిప్రాయాలు, తరాల మధ్య సంఘర్షణ, సదాతో నీల సహజీవనం, నీల అభిప్రాయాలలో ప్రపంచాన్ని చూసే తీరులో  చైతన్యంతో కూడిన తాత్వకమైన మార్పులు, మానసిక సంఘర్షణలు, మళ్ళీ పరదేశితో కలిసి బెస్త గ్రామాల సందర్శన అక్కడ గంగవరం మొదలైన చోట్ల జరుగుతున్న అభివృద్ది తాలూకు విధ్వంసం, విస్తాపన అన్నీ నీల జీవితంపైన ప్రసరిస్తున్న ప్రభావాలు, మొత్తం పదకొండు సంవత్సరాల చరిత్ర. నవల అక్కడే ప్రారంభం అయి ఒకచుట్టూ తిరిగి అక్కడే ముగుస్తుంది. నవలలో కొన్ని వాక్యాలు మనసుకు పట్టుకుంటాయి. పాస్టరమ్మ ప్రేమని గురించి చెప్పినవి. రెక్కలు ఊడిన పక్షి గమ్మున వుండి తిరిగి రెక్కలు పొందడం, ప్రేమ గురించి సహజీవనం గురించి వ్యాఖ్యలు .
“ముందు మనకి మనం వుండాలి ఆ ధైర్యం నుంచీ స్థిమితం నుంచీ మనుషులను కోరుకోవాలి”
సముద్రంతో పైడమ్మ “ఒలె! అప్పా! నచ్చత్రాలు భూమండలము పుట్టినప్పుడు పుట్నావు. ఇన్ని తాపులు కాసినావు. రాచ్చసులంటి పడవల్ని బుజానేసుకుని మోసినావు. సెత్త సేదారాలన్నీ లోపట దాసుకున్నావు. నీ లోపట సంపదలు సత్తువలు తీసి మాకిచ్చినావు. ఇంకా ఈ జీవరాశికి ఎంత కాలం సాకిరీ సేత్తావు? బుడింగిన మునిగి మాయమౌదారని అనిపించట్లేదే నీకు?”
“ఆడా మగా సంబంధాల్లో సార్వకాలికమైనవి సార్వజనీనమైన విలువలేవీ వుండవని తన జీవితం నుండే కనపడుతోంది  నీలకి. స్త్రీగా వుండడం కన్నా మనిషిగా రూపొందడం కోసమే బ్రతకాలన్న భావం లీలగా తోస్తున్నది”
“నీ రక్షణలో నీ ప్రేమలో నన్నునేను కోల్పోతున్నాననిపించింది. మళ్ళీ నన్నునేను కూడగట్టుకోవాలని పించింది. నాకు కావలసింది నా ప్రయాణం ఆగక పోవడం.”
“నాకు నీ మీద కృతజ్ఞత వుంది సదా ! కానీ నేను నీ సహచరి నైనందుకు ఎప్పుడో ఒకప్పుడు నా మీద నీకు కూడా కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి”
“నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రేమలన్నీ ఏదో ఒక రూపంలో బందిఖానాలే. అట్లా కాకుండా మనుషుల కుండే అన్నిరకాల స్వేచ్చల్నీ గౌరవిస్తూ ప్రేమించుకోడం మంచి విలువ. దానర్థం లోకం అపోహ పడినట్లు అనేక లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోడం కాదు...”  వసుంధర చెప్పిన ఈ వాక్యం సుదీర్ఘ మైనది, ఆలోచింపజేసేది.
ప్రేమించడమే విలువైన పాస్టరమ్మ, అధికారం డబ్బూ పరపతీతో పాటు కుటుంబ సభ్యులను కూడా ప్రేమించే సంపూర్ణ, నీల మదిలో చిరకాలం నిలిచి పోయిన స్టాలిన్ సూర్యం, ఒంటరి మహిళగా జీవితపు సవాళ్ళను ఎదుర్కునే అజిత, మంచి లాయర్ అయిన వసుంధర, సరళ జీవన పోరాటం, నూతన తరం ఆవేశాలతో, ఆదర్శాలతో  మినో,  అందరినీ చుట్టుకుంటూ స్వేచ్చని మాత్రమే కాక సాహచర్యాన్ని కూడా కోరుకున్న నీల, అంతులేని ఒద్దికకీ అనంతమైన స్వేచ్చకీ మధ్య జీవించే కళ ఒకటున్నదని తెలుసుకున్న నీల, సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో అర్థం చేసుకున్న నీల, పరమం అంటూ ఏమీ వుండదని తెలుసు. కానీ ఇప్పటికి ఇది మనుషులు చేరుకోవలసిన ఒక స్థితి అనిపిస్తుంది. కథ ముగిసే సరికి.
 ఇవన్నే కాక పశ్చిమ గోదావరిలో కందా బందాగా నూరే పచ్చళ్ళు, ఆలగోలు  బాలగోలుగా అరిచే జనం,  దాపుడుకోకలు, గుంపు సింపులు. చీకటి గుయ్యారాలు - తెలుగు పలుకుబళ్ళు.
సాధారణంగా ముందుమాటలు చదివి పుస్తకం చదివితే ఆ మాటలు పాఠకులను ప్రభావితం చేస్తాయి. అందుకని నేను పుస్తకం చదివాకనే ముందుమాటలు చదువుతాను. అట్లా చదివినప్పుడు ఈ నవలకు విపులమైన విశ్లేషణతో కూడిన వాడ్రేవు చినవీరభద్రుడు గారు వ్రాసిన ముందుమాట ముందే చదవాల్సిందేమో అనిపించింది. ఏకే ప్రభాకర్ గారిది కూడా.
( మే 2018 చైతన్య మానవి లొ ప్రచురితం )
                                                          **********Thursday, December 21, 2017

ఇట్లు మీ స్వర్ణ

                      ఇట్లు మీ స్వర్ణ
 పొద్దున్న లేచి, పాలు తెచ్చి, టీ కాచి మంచినీళ్ళు పట్టి తెచ్చి, ఇల్లూడ్చి  వంటింటి పనులు  అందుకుని తమ్ముడుకి తనకీ  బాక్సులు కట్టి షాపుకి తయారైంది స్వర్ణ. , ఎర్ర చుడీ, దానిమీదకి రంరంగుల పువ్వుల కుర్తీ , పలచని ఎర్ర చున్నీ, వేసుకుంటే జడ లేకపోతె ‘పోనీ’ కట్టుకోవాలి  కానీ జుట్టు వదిలెయ్య కూడదు ‘పోనీ’ కోసం కాస్త జుట్టు కత్తిరించుకుంటానంటే అమ్మ చంపేస్తుంది.చచ్చి నట్టు చిక్కులు తీసుకుని జడ వేసుకోవాలి షాపులొ పని చేసే వాళ్లకి ఒకే రూలు.మతం బట్టి బొట్టు. హిందువు అయితే తప్పనిసరి , అందరూ బాత్ రూముల్లో వాడే రబ్బరు చెప్పులు వేసుకోకూడదు .మంచి చెప్పులు వేసుకోవాలి .పెదాలకు లిపి స్టిక్ వేసుకోకూడదు  నవ్వు పులుముకోవాలి . ఒక సారి అద్దంలో చూసుకుని మూతి విరుచుకుని ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి “అమ్మా నేనొస్తా”అని  కేక పెట్టి చెప్పులు వేసుకుంటూ “చీ చీ “అనుకుంది స్వర్ణ. హీల్స్ బాగా అరిగి పోయి  నడుస్తుంటే ఒక్కొక్కసారి పడేసేటట్టు వుంటాయి .జీతానికింకా వారం వుంది..అప్పటిదాకా  పడకుండా జాగ్రత్త పడుతూ కుంటుతూ పోవాల్సిందే  ...బస్సు దొరకలేదు గానీ షేర్ ఆటో దొరికింది .అమ్మయ్య ఆ సురేష్ గాడి కత్తుల చూపులు తప్పినయ్.అప్పుడే షాపు తాళాలు తీశారు .చిమ్మే ఆవిడ చిమ్మింది తుడిచే ఆవిడ తుడిచింది .మేనేజర్ హారతి వెలిగించాడు
సురేష్  తలాకొన్ని పటిక బెల్లం పలుకులు చేతిలో వేసి “ బోణీ బేరాలు పోనీ మాకండి! స్వర్ణా నీకే చెబుతున్నా ! దిక్కులు చూడ్డం కాదు .ముందు ఆ చున్నీకి  పిన్నీసు  సరిగ్గా పెట్టుకో .కాస్త నవ్వు ,నీ సోమ్మేం పోదు ,నిన్నివ్వాళ వర్క్ చీరెల సెక్షన్ లొ వేస్తున్నా ,పండగ ముందు బేరాలు జాగ్రత్తగా చూసుకో “ అన్నాడు  అతను చీరెల సెక్షను హెడ్ .షాపు యజమానుల తాలూకు మనిషి .
సేల్స్ అమ్మాయిలందరికీ ఒకటే డ్రెస్ ..చున్నీ జారితే సురేష్ ఊరుకోడు .ఆ సెక్షన్ లొ పని చేసే పదిమందితోనూ అదే అధికారపు గొంతుతొ   మాట్లాడతాడు. మొన్ననే మనవరాలిని ఎత్తుకున్న సుజాత గారిని కూడా నువ్వు అనే అంటాడు .ఆవిడ అతన్ని మాత్రం సురేష్ గారూ అని అంటుంది అందర్లాగే ..పది నిముషాల తరువాత ఒకా విడ వచ్చింది  .పక్కన ఇంకొకావిడ .సాధారణంగా వాళ్ళు వేసుకొచ్చిన బట్టల్ని బట్టి వాళ్ల అభిరుచి తెలిసి పోతుంది .వాళ్ళు వస్తూనే సుఖాసీనులై “ వర్క్ చీరెలు తియ్” అన్నారు .చాలా మంది కష్టమర్లు సేల్స్ అమ్మాయిలందర్నీ సుజాత తొ సహా నువ్వు అనే సంబోధిస్తారు .“ఎంతలో తియ్యమంటారు మేడం “ అంది స్వర్ణ .
“బాగుంటే ఎంత పెట్టైనా కొంటాం .అదిగో ఆ పై అరలోవి తియ్ “
తీసింది .ధర చీటీలు చూసారు .ఒక్కొక్క చీర తీసి భుజాన వేసుకుని అద్దం  దగ్గర నిలబడి చూసారు .స్వర్ణ తన శక్తి నంతా ధార పోసి “అది మీకు చాలా బాగుంది మేడం! ఇది ఇంకా బాగుంది మేడం!” అని నవ్వుతూనే చెప్పింది కానీ మేడం లు మొఖాలు చిట్లించారు ఈ రంగుకు ఈ అంచు బాగాలేదు ఈ వర్క్ మరీ గాడీగా వుంది.. అమ్మో ఈ కాస్త వర్క్ కి ఇంత ధరా? ఈ మెటీరియల్ బాగోలేదు అన్నారు .సురేష్ వాళ్లకి శీతల పానీయాలు ఇప్పించాడు .ఈ మధ్య షాపుకి కొత్త హంగులు దిద్దినప్పుడు ఒక మూల నీళ్ళ క్యాను కూడా పెట్టించారు .అక్కడికెళ్ళి ఒక చుక్క తాగి నోరు తడుపుకునే సమయం కూడా ఇవ్వడం లేదీ మేడంలు .స్వర్ణకి అర్థం అయింది .వాళ్లకి నచ్చనివి చీరెలు కావు వాటి ధరలు .. .. ఖరీదైన చీరెల అరలు రెండు ఖాళీ అయ్యాయి .టేబుల్ మీద చీరెల కుప్ప సర్దడానికి భవాని వచ్చింది.ఇట్లాంటి మేడం లంటే భవానికి ఒళ్ళుమంట .సురేష్ చూడకుండా విసుక్కుంటూ అన్నీ మడతేసి సర్దింది .అంత కన్నా కాస్త తక్కువ ధర చీరెల అరలమీద పడ్డారు మేడంలు .సేల్స్ గాళ్స్ కి ఓర్పు ఉండాలి కొనిపించాలి ఊరకే వస్తాయా జీతాలూ ! అవును కదా ! ఇవీ అయిపోయినయ్. మేడంలకి చీరేలేవీ నచ్చలేదు హైదరాబాద్ నల్లీస్ లోనో చెన్నై పోతీస్ లోనో అయితే దొరుకుతాయి వాళ్లకి కావలసిన కాంబినేషన్లు అనుకున్నారు బాహాటంగా ‘”మీ ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు కొనిస్తా పొండి తల్లులూ “అనుకుంది స్వర్ణ లోపల .,విసుగు మింగేసి నవ్వు పులుముకుంటూ “ఏవీ నచ్చలేదా మేడం?” అంది .అంతకన్నా తక్కువ ధరలోని ఒక అరలోనుంచీ ఒక చీరే తీసి “ ఇదిచ్చేయ్ .పాపం ఇంత సేపు బేరం చేసి ఏమీ కొనకుండా పొతే బాగోదు”అంది ఒకావిడ.
వాళ్ళు భుజాన వేసుకుని అద్దంలో చూసుకున్న చీరేలకీ ఆ చీరేకీ ధరలో నాలుగో వంతు తేడా వుంది. .పోనీలే బోణీ బేరం పోలేదు అనుకుంది .ఇట్టాంటి కేసులు రెండు తగిల్తే చాలు తలకాయ పగిలిపోడానికి అనుకుంటూ వుంటే ఒక అంగుళం టీ పట్టే బుల్లి ప్లాస్టిక్ కప్పుతో చల్లారిపోయిన టీ తెప్పించి ఇచ్చాడు సురేష్. ఆపైన ఎవరో వచ్చారు. కొందరు కొన్నారు  కొందరు అవీ ఇవీ చూసి కొనకుండా పోయారు బాక్స్ లొ తిండి చల్లారి పోయింది .ఎదో కూర .భవాని ఒక పెరుగు కప్పు తెచ్చింది .దాని దగ్గర కాసిని డబ్బులుంటాయి మరీ తనలా కాదు .ఇద్దరూ తింటున్నప్పుడు “మీ మొహానేమిటే ఆ మచ్చలూ పేలినట్లు ఆ పొక్కులూ .”అంది భవాని  దాన్ని ఇంగ్లీషులో “ఎక్నే” అంటారంట అపర్ణ మేడం చెప్పింది  ఫేషియల్ చేయించుకో ఒకసారి”అంది భవాని.తను స్వర్ణ కన్నా తెల్లగా వుంటుంది .వాళ్ళమ్మ నల్లగానే వుంటుంది మరి .భవానికి నాన్న చనిపోయాడు .వున్నప్పుడు తెల్లగా వుండే వాడేమో !
 “ఇంకా నయం ఫేషియల్ అంటే వేలతో పనంటగా  మా అమ్మ వింటే చంపేస్తది”అంది స్వర్ణ ..
“అదేమీ కాదు. మన బజాట్లో టైలర్ షాపు వాళ్ళమ్మాయి బొంబాయిలో నొ ఎక్కడో బ్యూటీ చదివొచ్చిందంట. షాపు పైన బోర్డేసింది .రెండొం దలకే ఫేషియలంట..పెద్ద పెద్ద పార్లర్లలో ఆళ్ళ కుర్చీలకీ ఎసీలకీ డికరేశన్లకీ అంత చార్జి చేస్తారంట గానీ ఫేషియల్ ఎక్కడైనా ఒకటేనంట ఈ నెల జీతం తీసుకుని చేయించుకో.ఆమె మొహం చూసావా ఎట్టా నున్నగా వుంటదో! ఆవిడ వాడే వాటితోనే మనకీ చేస్తదంట” అంది భవాని .
స్వర్ణకి వచ్చేది నెలకి పదివేలు .అందులో తొమ్మిదివేలు అమ్మ చేతిలో పొయ్యాలి. మిగిలిన వెయ్యి తను నెలంతా వాడుకోవాలి .ఎంతో జాగర్తగా! నెలసరి ప్యాడ్స్ కి ,ఫెయిర్ అండ్ లవ్లీకి.ఎప్పుడైనా ఆకలేస్తే భవానితో పాటు ఎ బిరియానీయో తినడానికి ,సెల్ఫోన్ చార్జింగ్ కి ...బస్సులూ షేర్ ఆటోలూ దొరక్క పొతే  మామూలు ఆటో ఎక్కడానికి ,ఇంటికెళ్ళే వేళకి కడుపు కాలిపోతూ వుంటుంది.అక్కడేమీ వుండదు పోద్దుటి కూరా ఎదో పచ్చడీ ఒక్కొక్కరోజు మజ్జిగ కూడా వుండదు.తొమ్మిదివేలూ చీటీలకీ పొదుపు అప్పుకీ పోతాయి .అమ్మ జీతం ఇంటి ఖర్చుకి చాలదు .నాన్న ఎప్పుడు ఏమిస్తాడో తెలీదు .ఎప్పుడో చీటీల డబ్బులొస్తాయి స్వర్ణకి పెళ్లి చేస్తుంది అమ్మ .అయ్యో !అమ్మ! అట్టాగే అక్క పెళ్లి చేసింది ఆ అప్పు ఇంకా తీర్తానే వుంది.
వర్క్ చీరెలు చూసీ చూసీ కళ్ళు జిగేల్ మంటున్నాయి వేలకి వేలు .చూసిన కొద్దీ వాటిమీద విరక్తి పెరుగుతోది అనుకుంది స్వర్ణ..కొంత మంది మేడంలు ఖరీదైన సాదా చీరెలు కడతారు అమ్మ పని చేసే స్కూల్లో  ప్రిన్సిపాల్ శ్రావణి మేడం లాగా.  అవి భలే వుంటాయి  చూడ్డానికి సీదాసాదాగా వుంటాయి.  కానీ చీరెలు చూస్తె బాగా ఖరీదే ..వాచీలూ చెప్పులూ ఖరీదే .అది ఖరీదైన సీదాసాదా తనం అంటుంది భవాని .కొట్టు మూసి యింటి కెళ్లేసరికి అటూ ఇటూ పది అవుతుంది ఆకలి మండుతుంది “ఇంటికేడితే ఏం వుంటుంది ?నా బొంద!” అంటుంది భవాని .ఇద్దరూ నడుచుకుంటూ బయటికి వచ్చారు నూడిల్స్ బండి దగ్గర బాగా జనం వున్నారు.”ఒక ప్లేటు తీసుకుని చెరి సగం తిందామా” అంది భవాని .”నా దగ్గర డబ్బులు లేవు”అంది స్వర్ణ,
“నీ దగ్గర ఎప్పుడూ వుండవులే .పద నేనిస్తా ..ఇహ నించీ నెలకి నువ్వు రెండు వేలు వుంచుకో కడుపు నిండా తినోద్డా?” అంటూనే రెండు ప్లేట్లలో నూడిల్స్ తెచ్చింది  నూడిల్స్ తిన్నంత సేపూ భవాని  చెప్తానే వుంది .కడుపునిండా తిను. బాగా వుండు. ఇంత కష్ట పడుతున్నావ్ .నువ్వు బాగుండద్దా? ఆ మొహం రుద్దించుకో .గోళ్ళు కత్తిరించుకుని చక్కగా రంగేసుకో .గోరింటాకు పెట్టుకో జుట్టు కత్తిరించుకుని  మంచి క్లిప్పులు పెట్టుకో  .చెప్పులు కొనుక్కో .ఎం దరిద్రం నీకు ? మీ అమ్మ కి జీతం వస్తుంది. మీ నాయన పెయింట్లు వేస్తాడు .అసలు మీ అక్క పెళ్ళికి చేసిన అప్పు నువ్వేల తీర్చాలి?  భవాని కొనిచ్చిన నూడిల్స్ తిన బుద్ది కాలేదు స్వర్ణకి.బలవంతాన నోట్లో కుక్కుకుంది భవాని బాగుంటుంది బాగా తయారౌతుంది .బాగా మాట్లాడుతుంది .తను  పది పాసయింది .భవాని తప్పింది .స్వర్ణ మొహం తడిమి చూసుకుంది గర గర లాడుతోంది అవును నెలకి పదివేలు తెచ్చుకుంటూ రెండు వందలు ఖర్చు చెయ్యలేనా ?అనుకుంది .సురేష్ తనతోనూ భవానితోనూ మాట్లాడే తీరులో తేడా వుంది. భవాని  వంక చూసే చూపులో తన వంక చూసే చూపులో తేడా వుంది కంప్యూటర్ మీద బిల్లులేసే కుర్రాడూ అంతే! భవానిని చూసి నవ్వుతాడు తనని చూసి మొహం చిట్లిస్తాడు..
రాత్రి తనకోసం ఉంచిన అన్నం అంతా తినక పొతే అమ్మ తిడుతుంది .ఆవిడ బాధ ఆవిడది .కొడుక్కీ మొగుడికీ పొద్దున్నే  చద్దన్నం పెట్టలేదు. వాళ్లకి బయట టిఫినీలు తినడానికి డబ్బులిస్తుంది  .కూతుర్నీ చద్దన్నం తినమని  చెప్పలేదు.ప్రతి రోజూ  ఆవిడకి చద్దన్నమే. అందుకే భవాని రోజూ ఎదో ఒకటి తిందామన్నా తను ఒప్పుకోదు...
తెల్లవారి మళ్ళీ మొదలు. ఊడ్చుడు కడుగుడు వండుడు .పరిగెత్తుడు . ఆ నడకేమిటే నీ బొంద .ఆ జడేమిటే ! ఇవ్వాళ నిన్ను వదలను! పద .ముందు చెప్పులు కొనుక్కో .జుట్టు కత్తిరించుకో మంచి క్లిప్పులు కొనుక్కో . మొహం రుద్దించుకో ఇట్టా వుంటే మీ అమ్మ ఎన్ని చీటీలు కట్టినా ఎంత కట్న మిచ్చినా నిన్నెవడూ చేసుకోడు .ఎప్పుడూ ఈ కొట్లోనే పని చేసుకుంటూ బతుకుతావా ఏం?  భవానీ నన్నోదులు. వదలను గాక వదలను .ముందు పద .
“ఇదేంది ఇయ్యి నాలుగు కాయితాలే .లెక్క సరింగా సూసుకు సచ్చావా లేదా ?”
“ నేను  ఒక  కాయితం వుంచుకున్నాను నా ఖర్చులకి “
తిట్ల వర్షం .ఏడుపు.తిట్లు మొగుడినీ కూతుర్నీ చచ్చి పోయిన అత్తా మామల్ని దరిద్రపు సమ్మంధం ఇచ్చిన అమ్మా నాన్నల్ని. దేవుడిని ...తుఫాను.. .రోషం వచ్చి వుంచుకున్న ఒక్క కాగితం ఆవిడ మొహాన కొట్టాలన్నంత .కోపం ...చెప్పులు క్లిప్పులు మొహాన పొక్కులు .సాయంత్రానికి ఆకలి .తలనొప్పి.
“రాయిని గాలివానలో నిలబెడితే పైనున్న మురికి కొట్టుకు పోతుంది గానీ దానికేం గాదు” అని అమ్మే ఒక సారి చెప్పింది, నాన్న ఆవిడని చెడ తిట్టినప్పుడు ,అది గుర్తొచ్చింది స్వర్ణకి .తిట్లు గాలికి పోతయ్ .మన పని మనకి గావాలి .మనం తినాలి అక్క పెళ్లి గావాలి తమ్ముడి చదువు గావాలి .తిట్టాడని వున్న నాలుగు రూపాయలూ ఆయన మొహాన కొడ్తే రేపు పిల్లలకేం పెట్టను. తిట్టుకోనియ్ ! అలసిపోయి పడుకుంటాడు లేక పొతే తంతాడు అంతేగా ! దెబ్బలకి దడిస్తే ఎట్టా ? ఇవ్వన్నీ అమ్మ మాటలే .అవును చెప్పులు కావాలి .క్లిప్పులు కావాలి .పొక్కులు పోవాలి. ఆకలి పోవాలి .
మొహం తడిమితే నున్నగా తగిలింది .చెప్పులు తక్కువఖరీదులో మంచివే దొరికాయి జుట్టుకి రోజూ చిక్కులు తీసే పీడా పోయింది క్లిప్పులు బాగున్నాయి .ఒకటి బట్టర్ ఫ్లై .ఒకటి మామూలు దే భవానీతో కలిసి ఎప్పుడైనా  ఒకసారి  బిరియానీ ఒక సారి  నూడిల్స్ .నాలుగు రోజులు మాట్లాడని అమ్మ ఐదో రోజు మాట్లాడింది .పదిరోజులకి మళ్ళీ మొహం గర గర లాడింది పొక్కులోచ్చాయి .”అవి ఒక్కరోజుతో పోతాయా? రెగ్యులర్ గా రుద్దించుకోవాలి మొహం” అంది బొంబాయిలో నేర్చుకొచ్చి తనలాంటి లేని వాళ్ల కోసం ఉదారంగా రెండు వందలకే ఫేషియల్ చేస్తున్న బ్యూటిషియన్ .షాపు దగ్గర బస్సు స్టాపు సెంటర్లో కొత్త బడ్డీ వెలిసింది. బిరియానీ నూడిల్స్, పానీ పూరీ సమోసా అవీ ఇవీ దాని చుట్టూ జనం . .బాక్సుల్లో అన్నం మామూలే! అరంగుళం సురేష్ టీ మామూలే .సాయంత్రానికి తలనోప్పీ ఆకలీ మామూలే .విసిగించి చంపే కష్టమర్  మేడంలూ మామూలే .అమ్మ చీటీలూ పొదుపు అప్పులూ మామూలే .తమ్ముడి చదువూ నాన్న అరుపులూ అమ్మ విసుగూ మామూలే .విసుగోస్తోంది.అక్క ప్రాణం హాయిగా వుంది .బావకి అక్క బయట పనిచేస్తే అనుమానం ,అవమానం కూడా ! దాన్ని ఇల్లు కదల నివ్వడు. అప్పు అయితే అయింది.. అదన్నా సుఖంగా వుంది.  ఆ అప్పుతీరితే కదా తన సుఖం మాట!భవాని అంటుంది ప్రతి పైసకీ మొగుణ్ని అడుక్కోడం  సుఖమా? నేను పెళ్లి చేసుకున్నా ఏదో ఒక పని చేస్తాను” పని సంగతి తరవాత ముందు పెళ్లి ఒకటి కావాలిగా ! 
ఒకబ్బాయికి స్వంత ఆటో వుంది .బాగుంటాడు లక్ష ఇస్తే చేసుకుంటాడంట! పెద్ద దాని అప్పు తీరనే లెదు మళ్ళీ లక్ష ఎక్కడ తెస్తా ? నా వల్ల కాదు .దానికప్పుడే నాలుగోనెల.. పురిటికి తేవాలి . నేను ఏ బావిలోనో పడి సచ్చిపోతే నీ పీడా వదులుద్ది .ఇవే రోజూ రాత్రిపూట అమ్మా నాన్నల  కబుర్లు .తమ్ముడు టీవీ లొ క్రికెట్ చూస్తూ విసుక్కుంటాడు .బంగారునాయన ! ఆ ఐటీఐ కాస్తా అయిపోతే మెకానిక్కు అవుతాడు ఎవరూ సావక్కర్లేదు .అంతా వాడే సూసుకుంటాడు .అమ్మ ఆశలు ఆకాశంలో .అవును వాడే అక్కకు పెళ్లి చేస్తాడు అమ్మని స్కూల్లో ఆయా పనికి  పోనీకుండా ఇంట్లో వుంచుతాడు..వాడికి ఐదువేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిపెట్టింది.పదివేలు తెచ్చే తనకి వెయ్యిరూపాయల పిచ్చి ఫోను.. తను బోలెడు డబ్బుతో బయటికి పోవాలి ..వాడు ఇంట్లో వుండి చాలా డబ్బులు తెచ్చి పోషిస్తాడు ..
ఈనెల మొహం రుద్దించుకుని ఇంటికి వచ్చిన రాత్రి స్వర్ణకి మొహం ఒకటే దురద .నిద్రలో తనకి తెలీకుండానే తెగ బరికేసింది .పొద్దున్న అద్దంలో చూసుకుంటే మొహం నిండా దద్దుర్లు .ఆ దద్దుర్ల మొహంతో షాపుకు పొతే సురేష్ ఊరుకోడు కష్టమర్లు దడుచు కుంటారంటాదు.సెలవు పెట్టాల్సిందే .తను చేరి ఇంకా సంవత్సరం కాలేదు కనుక సెలవు పెడితే జీతం కట్ .మళ్ళీ తిట్ల తుఫాను ఈ సారి సునామీ.రాత్రి ఇంటికి పోతూ భవాని చూడ్డానికి వచ్చింది .తనకోసం అమ్మకోసం సమోసాలూ మైసూరు బజ్జీలూ తెచ్చి పెట్టింది.తెల్లవారే సరికి కడుపులో గుడ గుడ! “పిచ్చి తిళ్ళు తింటే ఏమౌతుంది మరి” అని అప్పుడెప్పుడో తనకి విరోచనాలూ కడుపునేప్పీ వచ్చినప్పుడు ఆరేమ్పీ సాంబశివరావు గారిచ్చిన బిళ్ళలు నాలుగు మిగిలి పొతే ఒకటి ఇచ్చింది అమ్మ .దద్దుర్లకి తోడు ఇదొకటి .సందట్లో సడేమియా అని మామయ్య కూతురు హైదరాబాదు నుంచీ వచ్చి “ఒకసారి మాయింటికి రాకూడదూ  నేను రేపు వెళ్ళిపోతున్నా “అని ఫోన్ చేసింది .అవడానికి సొంత మేనమామ కూతురే గానీ వాళ్ళాయనకి పోలీస్ సబిన్స్ పెక్టర్ ఉద్యోగం .అది మనిళ్ళకి రాదు మనమే పోయి చూడాలి దాని వైభోగం . మేనమామా రాడు ఆయన భార్యా రాదు .షాపుకి కొనడానికి వచ్చినా వాళ్ళని తను మామయ్యా అత్తయ్యా అని పిలవదు.వాళ్ల బేరం సుజాతమ్మ కి అప్పగించేసి తప్పుకుంటుంది .వొళ్ళు మంట తనకి .
” పోయి రావే పాపం .సెలవు పెట్టావుగా “ అని వత్తాసు పలికింది అమ్మ . వాళ్ళు ఎంత దూరం పెట్టినా స్వంత అన్న ఆవిడకి .అమ్మపోరు పడలేక అయిష్టంగానే వెళ్ళింది స్వర్ణ. మేనమామ కూతురు మహాలక్ష్మి మహాలక్ష్మి లాగే వుంది “ఏమే అంత చిక్కి పోయావూ  డైటింగా?”అని నవ్వింది .ఆ మొహాన ఆ దద్దుర్లేమీటే అని ఆరా తీసింది .డబ్బులు తక్కువ అని వీధి చివరి పేర్లర్ లొ ఫేసియల్ చేయించుకుంటే అంతే అని తీర్పు చెప్పి, తను సాయంత్రం ప్రెటీ వుమన్ పార్లర్ లొ అపాయింట్ మెంట్ తీసుకున్నా ననీ అక్కడ మొత్తం పాదాలూ అరిచేతులూ జుత్తూ అన్నీ మెరుగులు పెట్టించుకుంటే అయిదు వేలని చెప్పింది. అక్కడ నుంచీ వస్తూ వుంటే అపర్ణ మేడం కనిపించి పిలిచింది .ఆవిడ తనకి స్కూల్లో టీచర్ .తను పని చేసే షాపులో బట్టలు కొనడానికి వస్తూ వుంటుంది .ఇప్పుడు ఏవో పరీక్షలు వ్రాసి పెద్ద ఉద్యోగం సంపాదించింది .ఆవిడా మహాలక్ష్మిలా మంచి పార్లర్ లొ ఫేసియల్ చేయించుకోమనీ ఏం తినాలన్నా మంచి నూనెలతో ఇంట్లో వండుకు తినమనీ ,ఈ మధ్య తను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాననీ చెప్పింది  స్వర్ణ కి మర్నాడు కూడా వంట్లో బాగాలేదు .కడుపులో నెప్పి తగ్గలేదు.. “ ఆ సాంబశివరావు గారి దగ్గరకు పోయి మందు తెచ్చుకో పోయి సావు. అక్కర్లేని వాటికి ఊరికే డబ్బు తగలేస్తావు .మందులకి లేవంటావు”అని తిట్టింది .అమ్మకి తిట్లే మాటలు, అవే సలహాలు. అవే ఆశీర్వాదాలు .
సాంబ శివరావు గారి దగ్గర  బోలెడు జనం .జ్వరాల వాళ్ళు. వాంతులు విరోచనాల వాళ్ళు  సలైన్ పెట్టించుకు పోయే వాళ్ళు. ఇంజెక్షన్లు చేయించుకు పోయేవాళ్ళు .చిన్న చిన్న దెబ్బలకు కట్లు కట్టించుకునే వాళ్ళు .ఆ చిన్న క్లినిక్ లొ కాలు పెట్టె సందు లేదు .అక్కడ చీటీలు రాసిచ్చే వనజమ్మ అమ్మకి చిన్నప్పుడు ఫ్రెండు కనుక ఆవిడని బ్రతిమిలాడి లోపలికి  జొరబడింది  స్వర్ణ..ఆయన మొహం మీద దద్దుర్లు చూశాడు .కడుపు నెప్పి గురించి అడిగి “నీకు తెలుసా అమ్మాయ్! మన ఊళ్ళో ఒక చర్మం డాక్టర్ కన్సల్టేషన్ అయిదు వందలు .పది నిమిషాలు కూడా చూడడు .ఇహ మామూలు డాక్టర్లంతా మూడు వందలు చేసారు .నేనొక్కడినే అన్ని జబ్బులూ చూస్తాను .అన్నింటికీ కలిపి వందే తీసుకుంటాను” “అని ఏవో మందులు రాసిచ్చాడు మూడు వందలకి ...పైగా మూడు రోజుల జీతం కట్ . ఆ రాత్రి స్వర్ణకి ఎంతకీ నిద్ర రాలేదు .ప్రేమించానని చెప్పిన అబ్బాయితో వెళ్ళిపోయిన భాగ్యం గుర్తొచ్చింది .అప్పుడు మంచి పని చెసిందని తనూ భవానీ అనుకున్నారు .నాలుగు నెలలకే అది తిరిగొచ్చేసింది ఆ పైన నెలకి పురుగు మందు తాగి చనిపోయింది .అవునూ ఇవ్వాళ భాగ్యం ఎందుకు గుర్తొచ్చింది ? అపర్ణ మేడంలాగా మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచి మంచి నూనెలతో వంటలు వండించుకుంటూ మంచి పార్లర్ లొ ఫేసియల్ చేయించుకోవాలంటే  ఏం చెయ్యాలి? ఆమెలా మంచి స్కూల్లో చదవాలా? మంచి ఉద్యోగాలు చేసే అమ్మా నాన్నలుండాలా? ఓసి వెర్రి మొహమా !డబ్బు, డబ్బు వుండాలే ముందు! .అవునే భవానీ నువ్వు చెప్పింది నిజం .మరి డబ్బులేట్లా వస్తాయి మనకి?  మంచి బళ్ళో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని మంచి వంటలు ఇంట్లో వండుకుని మంచి పార్లర్ లొ ఫేసియల్ చేయించుకుని ,ఇదంతా ఈ జన్మ లొ సాధ్యం కాదు  మనకి .మరెట్లా ?
అమ్మ చెప్పినట్టు ఈ జన్మలో బాగా ఉపవాసాలుండి  పూజలు చేస్తే అపర్ణ  టీచర్ లా అట్టాంటి ఇంట్లో పుడతానేమో చూడాలి. అందుకే కావన్సు గుళ్ళల్లోనూ ప్రవచనాల దగ్గరా ఒకటే జనం .ఒచ్చే జన్మ మీద ఆశతోనే కావన్సు. మహాలక్ష్మి మొగుడు కూడా క్రిందటి జన్మలో బాగా పూజలు చేసి వుంటాడు .మళ్ళీ ఇట్టాంటి ఉద్యోగమే రావాలని కావన్సు పూజలూ అభిషేకాలూ అంతులేకుండా చేస్తూ వుంటాడు .ఈ ఉద్యోగం ఇట్టా లక్ష్మీప్రదంగా నిలవాలని కూడా కావచ్చు .ఏది ఏవైనా   అట్టాంటి స్కూల్లో చదువుకుని ,అట్టాంటి కాలేజీల్లో చదువుకుని, అట్టాంటి ఉద్యోగాలు చేసి, అట్టాంటి మొగుణ్ణి పెళ్లి చేసుకుని అట్టా కారుల్లో తిరిగి ,అట్టా ప్రెట్టీ వుమన్ లొ ఫేసియల్ చేయించుకుని, అట్టా ఇంట్లో మంచి నూనెలతో నూడుల్సూ  గులాబ్ జాములూ వండుకుని! అవును అంతే   అవన్నీ వచ్చే జన్మలోనే ! ఇప్పటికింతే ! మన రెండు వందల  ఫేసియళ్ళూ మొహం మీద దద్దుర్లూ  బజారు బండి బిరియానీలూ ఆరేమ్పీ డాక్టర్లూ  అమ్మ చేత తిట్లూ మళ్ళీ ఆవిడ మీద జాలి ..************
పి                                                                  చినుకు డిసెంబర్ 2017

 .
.