Saturday, November 20, 2010

చీమరాజాగారి కోట సంరక్షణ

అనగనగా ఒక పురాతన రాజ్యంలో ఒక అతి పురాతనమైన కోట లో ఒక హంస తూలికా తల్పం పైన శయనించి వున్న ఒక స్వయంప్రకటిత చీమ మహారాజా వారికి గత కొద్దికాలంగా ఒకరకమైన దిగులు,అదోలాంటి అభద్రతాభావం వెన్నాడుతున్నాయి.( ఇకమీదట ఈయన్ని స్వ.ప్ర.చీ మ.రా.అందాం) దానికి తగ్గట్టు ఒకప్పుడు అభేద్యమని తను గాఢంగా నమ్మిన తన కోట బీటలు వారుతున్నట్టు, ఎందుకూ పనికి రావని తను చిన్న చూపు చూసి కోట వెలుపల వుంచిన పరజాతి చీమలు దండెత్తివచ్చి కోటని ఆక్రమిస్తున్నట్టూ అవి సృష్టిస్తున్న ప్రభంజనానికి తన తల్పంలోని తూలికలన్నీ గాలికెగిరిపోయినట్లు, తన తల్పం బోర్లా పడ్డట్టూ ఒకటే కలలొస్తున్నాయ్..కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయ్..ఉలిక్కి పడి లేచి అర్థరాత్రీ అపరాత్రీ అనకుండా కోటంతా కలయ తిరిగి బీటలు పూడ్పిస్తూ నిద్ర చెడగొట్టుకుంటాడు..అతని పరిస్థితి గమనించిన కొన్ని అస్మదీయ మేధావి చీమలు “ఎన్నాళ్ళని నువ్వూ నీజాతి మాత్రమే ఇందులో వుంటారు, .వాళ్ళని కూడా రానియ్యండి,ఈ బూజు పట్టిన పాత కోట పగలగొట్టి అందరం కలసి ఒక సుందరమైన హర్మ్యం కట్టుకుని వుందాం” అని సలహా చెప్పాయి.అదివిన్న రాజావారికి ఒళ్ళుమండి వాళ్లని తస్మదీయుల జాబితాలో వేసేశారు..ఇదిలా వుండగా ఒకనాడు స్వ.ప్ర.చీ.మ.రా గారిదగ్గరికి ఆయన సమాచార ప్రసార శాఖా మాత్యులు కంగారుపడుతూ వచ్చి,” ఇదివిన్నారా మహారాజా.కోట బయటి పరాయి చీమలన్నీ ఒకటై కోట ముట్టడికి పథకాలు రచిస్తున్నాయట. ఎక్కడ చూసినా ఈ కబురే” అని విన్నవించాడు.
“అనుకుంటూనే వున్నా .ఇలాంటిదేదో జరగబోతోందని..కొన్నాళ్ళుగా ఆ చీమలు ఎవరి స్వంతపనుల్లో అవి తలముల్కలుగా వుంటే ఈ కోటముట్టడి విషయం మర్చిపోయాయనుకుని కాస్త అలసత వహించాను..సరే నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టు.. వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు పెట్టు. ,నీ శాఖ లోని నిపుణుల సాయం తీసుకో..తక్కిన అమాత్యుల సాయం కూడా తీసుకో” అన్నారు చీ.రాగారు.
“మన అమాత్యులెవరికీ క్షణం తీరిక లేదు మహారాజా!! వారంతా వారి వారి పదవుల్ని,ఆస్తుల్ని కాపాడుకునే పనిలో పీకలదాకా కూరుకు పోయి వున్నారు..నేనొక్కడ్నే కాస్త వెసులుబాటుగా వున్నాను”అన్నాడు ప్రసార శాఖామాత్యుడు..
“అసలు వాళ్ళందరికంటే నువ్వే శక్తిమంతుడివి...సమర్థుడివి.ప్రస్తుతం నువ్వే ఈ పనిని నిర్వహించగలవు..వెళ్ళి ఆ చీమల్లో ఏ చీమ గట్టిగా గొంతెత్తి మాట్లాడుతోందో చూడు. ఆ చీమ మీద బురద జల్లు.దాంతో అదీ దానితో పాటు కొన్ని చీమలూ నోరుమూసుకుంటాయి.మళ్ళీ నోరెత్తకుండా అతి దుర్గంధపూరితమైన బురద జల్లు..పో” అన్నారు చీ .రా గారు.
“అసలు ముందుగానే మనం ఈ చీమలన్నిటికీ తెరవవీల్లేకుండా నోళ్ళు కుట్టేస్తే బావుండేది .ఈ చీమల్ని మాట్లాడ నివ్వడం అవి మాట్లాడేది అందర్నీ విన నివ్వడం ముందు మనం చేసిన తప్పు.” అన్నారు ప్రసార శాఖామాత్యుడు..
“గత జల సేతుబంధనం వద్దు .ముందు పని చూడు ..పో...ముందు చీమల్ని చీల్చు తరువాత నోరెత్తిన చీమ మీదల్లా బురదజల్లు..”అని చప్పట్లు చరిచి ఇద్దరు భటుల్ని పిలిచి” వెంటనే పోయి అమాత్యుల వారికి బురద తయారు చేసి పెట్టండి..కడగ సాధ్యం కాని చిక్కనైన దుర్గంధ పూరితమైన బురద ..” అని పురమాయించి,,తన భద్రతా ఏర్పాట్లలో విందు మందు వినోదాలలో మునిగిపోయారు రాజావారు.
అయితే మళ్ళీ అమాత్యులవారు రొప్పుకుంటూ రోజుకుంటూ పరిగెత్తుకొచ్చారు.
“ఏమిటి విషయం?” అన్నారు రాజావారు
“ ఏముంది మహారాజా వాళ్ళని చీల్చనైతే చీల్చాను గానీ వాళ్ళ గమ్యాన్ని మార్చలేకపోయాను..అవి వివిధ సమూహాలుగా ఇటే బయలుదేరుతున్నాయి..”
“మరి బురదజల్లుడు మాటేమిటి?”అన్నారు మహారాజావారు చిరాకు పడిపోతూ..
“ఖంగుమని గొంతెత్తి మాట్లాడే ఒక చీమ కాస్త ఏమరుపాటుగా వున్నప్పుడు వెనకనించీ ఒక కడివెడు కంపుకొట్టే బురద చల్లాను..”
“దాంతో నోరూ ముక్కూ మూసుకుని తిరిగి చూడకుండా పలాయనం చిత్తగించిందా?” రాజవారు మీసాలు తడుముకున్నారు.
“లేదు మహారాజా..ఆ చీమ .బురద తనశరీరానికి అంటకుండా ఒక కవచం వేసుకుంది.అది తీసి నామొహం మీద విసిరి కొట్టి మళ్ళి ఖంగున గొంతెత్తింది..చాలా చీమలు అలాంటి కవచాలే వేసుకుని వున్నాయి..మనం ఎంత బురద చల్లినా అవి లెక్క చెయ్యవు..”అమాత్యుడు నీరసపడిపోయాడు.
“ఆ కవచాలు చేసే కర్మాగారాన్ని మూసేయించు..ముయ్యకపోతే అక్కడ ఆయుధాలు తయారవుతున్నాయని అబద్ధపు నేరారోపణ చెయ్యి..”
“ఆ కవచాలకి ఒక కర్మాగారమంటూ లేదు మహారాజా.అవి వాళ్ళే ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నారు..” అమాత్యుడు నీళ్ళు నమిలాడు..
“అన్నిటికీ అన్నీ చెబుతావు ముందుపో ఇక్కడనించీ నీలాంటి.అసమర్థ అమాత్యులందర్ని ముందు పదవీ చ్యుతుల్ని చెయ్యాలి..”అని కసురుకున్నాడు మహారాజు.అమాత్యుడక్కడ్నించీ తప్పుకున్నాడు.
మహారాజా వారికి ఏం చెయ్యాలో తెలీక తల గోక్కోవాలనిపించింది.తలగోక్కోవాలంటే కిరీటం తియ్యాలి.అదితీసి పక్కన పెడితే ఎవరెత్తుకుపోతారోనని భయం.అందుమూలాన తల గోక్కుని చాలా రోజులైపోయి మిక్కిలి దురద పెడుతోంది .కొంపదీసి పుచ్చిపోలేదు కదా?
(భూమిక మార్చి 2009)