Sunday, January 30, 2011

అనుభవాలు,ఆలోచనలు,జ్ఞాపకాల ముసురు


స్త్రీల ఆత్మకథల వలన,వారు మసలిన కాలపు సాంఘిక చరిత్రే కాక స్త్రీలుగా వారు సమాజంలో మనుగడ సాగించిన తీరు, అప్పటి సమాజం ,కుటుంబం వారిని చూసిన పద్ధతి,అప్పటి ఆచార వ్యవహారాలు,అవి తమకు నచ్చడం నచ్చకపోవడం,అనేక వొడిదుడుకులను తట్టుకుని తాము ఎదిగి వచ్చిన తీరు కూడా పాఠకులకు అదనంగా, అవగాహనకొస్తాయి.

సుజాతా రెడ్డిగారి అనుభవాలు,జ్ఞాపకాలు ఆలోచనల ముసురు.ఒక అర్థ శతాబ్దపు ప్రపంచ చరిత్ర ..తెలంగాణా విముక్తిపోరాట సమయంలో ఆమె బాల్యం,మళ్ళీ అరవయ్యో దశాబ్దం చివర్లో తెలంగాణా పోరాటపు రోజులు.ఇప్పుడు ఉధృతంగా సాగుతున్న తెలంగాణా పోరాటం ,వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ,వుంటూ తన జీవితాన్ని మలచుకున్న పద్ధతి,విదేశ పర్యటనానుభవాలు ,తను చూసిన నివసించిన ప్రదేశాల చరిత్ర,,అక్కడి జనజీవనం ,వారి అలవాట్లూ,వాటితో భారతీయుల పోలికలు భేదాలు.వాటిపై ఆమె వ్యాఖ్యలు కలసి ,అది ఆమె ఆత్మ కథే కాక నడుస్తున్న చరిత్ర అనిపించే విధంగా సాగుతుంది .ఆమె రచయిత్రీ,సంపాదకురాలు.బహుగ్రంధ పఠిత కనుక పుస్తకమంతా తన విశ్వరూపమే చూపకుండా అవసరమైనప్పుడు మాత్రమే తన స్వంత విషయాలు చెప్పడం ప్రత్యేకత ,విలక్షణత,

కమ్యూనిష్టు ఉద్యమానికీ తెలంగాణా విముక్తి పోరాటానికి ఎపిసెంటర్అయిన నల్గొండ జిల్లా ఆకారం గ్రామంలో తన బాల్యాన్ని,అప్పటి దొరల కుటుంబాల ఆచార వ్యవహారాలనీ ,తరువాత కమ్యూనిష్టులకూ రజాకార్లకూ భయపడి ఆంధ్రదేశానికి వలసరావడం.అద్దంకి,నరసరావు పేటలలో ప్రవాస జీవితం ,తిరిగి తెలంగాణా విముక్తి తరువాత వెళ్ళిపోవడం,ఆమె బాల్యం....దొరలు కొంత ఆధిక్యతా భావంతో కింది వారిని చిన్న చూపు చూడ్డం నిజం అయినప్పటికీ ,కాల్పనిక సాహిత్యం లో వారిని సెక్స్ స్టార్వుడ్ గా చూపడం ఒక మిత్ అంటారు సుజాతారెడ్డి. 1950 ల తరువాత నల్గొండ ప్రాంతాల్లో కమ్యూనిష్టుల ప్రభావం తో పరిస్థితులు మారినాభూస్వాముల కోరలు ఊడినా, ఉత్తర తెలంగాణాలో మాత్రం ఇంకా అప్పటికీ ఆడబాపల విధానం వుందని చెబుతూ నిద్రలేచిన దగ్గర్నుంచీ వాళ్ళు చేసే గొడ్దుచాకిరీని కళ్ళ ముందుంచారు.70 లనాటికి కూడా తమ గ్రామానికి బస్సులు లేవనీ కొంతదూరం బండి ప్రయాణమేననీ చెప్పారు. తెలంగాణా భారత యూనియన్ లో కలసిన తరువాత స్త్రీ విద్యకు పెరిగిన ప్రాధాన్యత, గురించి చెబుతూ తమ బంధువులొకరు నగలమ్మి వాళ్లమ్మాయిని కాలేజిలో చేర్పించడాన్ని ఉదహరించారు.అందుకు వెంకట్రామరెడ్డి వంటివారి కృషి.,ఉర్దూ మాధ్యమంనించీ తెలుగుకు పాఠశాల విద్య మార్పు మొదలైన అనేక అంశాలను ప్రస్తావించారు.అలాగే తెలంగాణాలో వుండిన ప్రత్యేకమైన నగలు వేష భాషలు.పంటలు ఆహారాలు,పండగల ప్రత్యేకతను కూడా అర్థంచేయించారు.

సుజాతా రెడ్డిగారి వివాహం గోపాలరెడ్దిగారితో జరిగిన సందర్భాన్నీ,అప్పట్లో పెళ్ళి సంబంధాలు చూసే పద్ధతినీ డాక్టర్లకుండే ప్రాధమ్యాన్నీ వివరించారు.సంస్కృత పండితుడైన సహచరునితో ఆమె జర్మనీ నివాసం అక్కడి జీవన పద్ధతులూ,భారత దేశ జీవనంతో పోలికలు భేదాలూ,తిరిగి స్వదేశానికి వచ్చి ఆమె అధ్యాపకురాలిగా స్థిరపడడం..ఆమె సందర్శించిన అనేకప్రదేశాలు,వాటి చరిత్ర.,ప్రజల జీవన విధానం,తన అభిప్రాయాల ,వ్యాఖ్యల కలబోతగా సాగిన కథనం లో ఎక్కడా స్వోత్కర్ష కనిపించదు .ఉద్రేకపూరిత వ్యాఖ్యలుండవు.ఒక ప్రేక్షకురాలివలె వస్తునిష్ఠ తో చెప్పటం ఆమె లో చదువరికి నచ్చే గుణం.

తెలంగాణా సాయుధపోరాటం ,రజాకార్ల పోరాటం,భూస్వాముల ప్రవాసం,తెలంగాణా విముక్తి అనంతర సంస్కరణలు, స్త్రీవిద్య కు ప్రోత్సాహం, తెలంగాణా సంస్కృతి,జనజీవనం, ప్రపంచ యుద్ధాలు .బెంగాల్ లో కృత్రిమ కరువు,మొదలైన ఎన్నో విషయాలను చర్చించిన సుజాతా రెడ్దిగారు ,స్త్రీగా ,రచయిత్రిగా ,సంపాదకురాలిగా ,తన అనుభవాలను మరిన్ని చెప్పి వుంటే యువరచతలకు ఉపయుక్తంగా వుండేదేమో! తెలంగాణా గురించి,స్వాతంత్య్రానికి పూర్వం జన్మించి,స్వాతంత్ర్యానంతరం అక్షరాలు దిద్దుకున్న తరం స్త్రీలు ,ఎక్కి వచ్చిన మెట్లు,నడిచివచ్చిన దారి తెలుసుకోడానికి,తప్పకుండా చదవ వలసిన పుస్తకం ముసురు

ముసురు

రచన:ముదిగంటి సుజాతారెడ్ది

వెల 25o రూపాయలు

అన్ని ప్రముఖ ప్రముఖ పుస్తక దుకాణాల్లో లభ్యం
(ఆంధ్రజ్యోతి ఆదివారం 30 జనవరి)

No comments: