Saturday, December 06, 2014

                జీవితానికి పరిమళం అద్దిన కధలు

ఒక కథ చదివినప్పుడు మనలో మరికొంత ఎరుకా (జ్ఞానమూ) ,ప్రపంచం మీద మరికొంత ప్రేమా కలుగుతాయి   అంటాడు ఒక రచయిత .దానినే ఖాళీలను పూరించడం అనికూడా అనుకోవచ్చు.అటువంటి కొన్ని కథల్ని ఒకేసారి చదివినప్పుడు ఒక ఉత్సాహం ,ఒక తెలివిడీ ఒక సంతృప్తీ కలగడంలో వింతేమీ లేదు .  కిటికీలు మూసిన గది లోని ఉక్కపోతలోనుంచీ చల్లని వెన్నెలలోకి  వెళ్ళినంత సహజంగా ఆ పని జరిగిపోతుంది.వీరలక్ష్మీ దేవి కొత్త కథలు  పదీ చదువుదామని తీసుకున్నప్పుడు.   “ఉత్సవ సౌరభం” “కొండఫలంకథా సంకలనాలు మళ్ళీ ఒక సారి చదవకుండా ఆమె జీవన తాత్వికత, కథనశిల్పం పూర్తిగా అవగాహన చేసుకోడం కుదరదనిపించిందిఉత్సవ సౌరభం సంకలనంలోని ఒక కథలో అమె ఇలా అంటారు” “ఈ లోకంలోని సుఖ దుఃఖాలను దగ్గరకు తీసుకునే హృదయం ఒక్క సాహిత్యమే ఇవ్వగలదు మరొక చోట “లోకంలోని అందరి అనుభవాలనూ నావి చేసుకుని నేనూ అనుభూతి చెందితే ,లోకమంతా నాది అవుతుందని అనిపిస్తే ,నాలోని వ్యక్తిగత దుఃఖం ఎక్కడ మిగిలింది?”
నాకు చిన్నప్పుడు ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది,సంగీతాన్నీ సాహిత్యాన్నీ ప్రకృతినీ పువ్వులనూ ,పిల్లలనూ  ఇష్టపడి దగ్గరకు తీసేవాళ్ళ హృదయాలలో తప్పనిసరిగా మృదుత్వం వుంటుందనీ అది వారి వ్యక్తిత్వాలకు పరిమళం అద్దుతుందనీ .కనీసం వాటి దరిదాపులకు కూడా పోకుండా పరమ గంభీరంగా వుండేవారి మెదడు నిర్మాణంలో ఏదో లోపం వుందనీ.
  సంగీత సాహిత్యాలను అపారంగా ప్రేమించే ఈ రచయిత్రి అటువంటి హృదయంతో వ్రాసిన కథల సమాహారాలే ఈ సంకలనాలు. ఈ కథలనిండా అనేక మంది స్త్రీలు. వారంతా పురుషాధిక్య సమాజపు సంకెళ్ళలో బంధితులయి అణిగిపోయినవారు కారు. తమ జీవనోత్సాహాన్ని కాపాడుకుంటూ తామున్న చోటును నివాసయోగ్యంగానే కాక అందమైన తోటలా చేసుకున్నవాళ్ళు, తమ ఆశయాలను కాపాడుకున్న వాళ్ళు. జీవితపు ఆటుపోట్లను తట్టుకుని తల ఎత్తుకుని నిలబడ్డవాళ్ళు. ఎక్కువ చదువులూ పెద్ద ఉద్యోగాలూ లేకపోయినా తమకి స్వభావసిద్ధంగా వచ్చిన స్థిమితాన్నీ సంతోషాన్నీ పోగుట్టుకోకుండా నిలుపుకున్న వాళ్ళు.
 “ఒక రాత్రి గడవాలిఅన్న కథే తీసుకోండి.   తన స్వేచ్ఛను, గౌరవాన్నీ కాపాడుకుంటూ  ఉత్సాహంతో ఉరకలు వేస్తూ,  తానొక గొప్ప రచయిత్రిగా దంతపు శిఖరం మీద కూర్చోకుండా, సామాన్య జనాలతో కలిసిపోతూ వారితో సంభాషిస్తూ  దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తూ ఒక మధురగీతాలాపన లా జీవితాన్ని గడుపుతున్న  విహాయస ను చూస్తే ఎవరికి మాత్రం అలా వుండాలనిపించదు?,డబ్బుని హెచ్చించుకోడమే గానీ, సహచరి తో స్నేహ సౌహర్థాలు,ప్రేమ ఇచ్చిపుచ్చుకునే మధుర క్షణాలను పంచుకోడం చేతగాని భర్త ధనార్తికి, తను ఇష్టపడి పెంచుకున్న తోట తో సహా తన ఇల్లు అప్పజెప్పేసినా, మిగిలిన తన ఆర్థిక సౌకర్యంతో తన ఉనికికి ఒక సార్థకతనిచ్చేపనికి పూనుకున్న జ్ఞానప్రసూన,ఏ ప్రలోభానికీ లొంగక కష్టపడి ఆశయాన్ని సాధించిన హేమ ,ప్రేమంటే ఏమిటో ఎరిగి ఆ ప్రేమకోసం ఎంతో  సుఖాన్ని నైవేద్యంపెట్టి  ,ఆ  అపురూపమైన ప్రేమసంగమంలో  బిడ్డకు జన్మనిచ్చి పెంచిన ఉజ్జ్వల తల్లి . ఆమె నుండీ స్పూర్తిపొంది “ప్రేమంటే ఏమిటో తెలిసేదాక పిల్లలు వద్దు”అని నిర్ణయించుకున్న “దీపశిఖ”కథలో కథకురాలూ, చిన్నప్పటి సౌహార్దాన్నీ కలివిడి తనాన్నీ నిలిపి వెలిగించుకున్న రాజేశ్వరి ,వీళ్ళంతా తాము అనుకున్న పనిని నింపాదిగా ఆత్మవిశ్వాసంతో నెరవేర్చుకుంటారు. .వాళ్లకి ఆ దైర్యమూ, నిబ్బరమూ. కార్యదీక్షా స్వభావసిద్ధంగా వచ్చాయేమో అనిపించేటంత సరళంగా ఎటువంటి చర్చలూ ఉపన్యాసాలూ లేకుండా సాగుతాయి ఈ కథలన్నీ .ఈ పాత్రలన్నింటినీ నాకు పరిచయం చేసిన వీరలక్ష్మిగారంటే  గౌరవం నాకు. నిజానికి ఈ స్త్రీలంతా కల్పించిన పాత్రలు కారు. మనకళ్ళముందు మెదలే మనుషులు.ముఖ్యంగా దీపశిఖ కథ చదివిన తరువాత ఆ గౌరవాన్ని ప్రేమగా మార్చుకున్నాను. చాలా ధైర్యవంతమైన కథనిఅది అంతేఅన్నంత నిబ్బరంగా చెప్పిన తీరు అద్భుతమనిపించింది.. ఇంక కొండఫలం ,బినామీ కథలు రచయిత్రికి పాఠకులను బాగా దగ్గరకు తెచ్చిన కథలు.బహుశా ఆమె ఒక్కరే  వ్రాయగల కథలు. ఈ కథలన్నీ ఆమె ఏమాత్రం ఆవేశపడకుండా కథలోని గాఢతను కాపాడుతూ వాటన్నిటికీ ఒక చక్కటి నేపథ్యాన్నిసమకూరుస్తూ  సమతూకం చెడకుండా వ్రాసారు .అదే ఆమె శిల్పం. కథలన్నీ క్లుప్తమైనవి.థోరో అనుకుంటా ఒకచోట అంటాడు .”పెద్దకథ వ్రాయడం తేలిక .దాన్ని చిన్నది చెయ్యడమే కష్టం “అని.అక్కర్లేని వర్ణనలు అనవసరమైన వివరాలు, ఆడంబరాలూ లేని సరళమైన శైలిలో చెప్పిన కథలివన్నీ.ఈ కథలన్నీ చదివిన తరువాత వీరలక్ష్మిగారంటే ఏమిటో  కొంత తెలిసిన తనం తో కొత్త కథల్లోకి వెడదాము.
మొదటే నన్ను ఆకట్టుకున్న కథ “కిటికీ బయటి వెన్నెల.ఇపుడు జీవితం పరుగు.ఇల్లొక కలుగు(అపార్టుమెంట్).ఊరు కాంక్రీట్ అరణ్యం, అని ఎంతో దిగులుగా పరమ విషాదంగా  అనుకోవచ్చు.కానీ ఈ కథ చెప్పిన కథకురాలు (నేను) తానున్న అపార్టు మెంటుకు నాలుగు దిక్కులా వుండే అందాలను కనిపెట్టింది.ఒక వైపు నిమ్మ చెట్టు మరొక వైపు బూరుగచెట్టు మరొక వైపు వేప కొమ్మల మధ్య ఆకాశం,ఇవే కాక తన పడక గది మూడు ముక్కల కిటికీ కి తీసివుండే ఒక ముక్క లోనుంచీ కనిపించే  ఒక అపార్టుమెంటు వాసుల జీవనచిత్రాన్ని చూడడంకూడా ఆమెకు చాలా ఇష్టం.ఆ యింట్లో వుండే అతనూ, ఆమే వాళ్ళ వేష భాషలూ( సారీ భాష వినపడదు) వాళ్ళింటీకొచ్చే అతిథులూ వాళ్ళ పుట్టినరోజు వేడుకలూ అన్నీ చూడాలనిపించేటట్లుగా వుంటాయి. తూర్పు వైపు నిమ్మచెట్టు లాగే,ఉత్తర దిక్కున వేపచెట్టు కొమ్మలమధ్యనుంచీ కనిపించే ఆకాశంలాగే ఈ మనుషులూ వాళ్ల ఆనందాలూ పోట్లాటలూ అతిసహజంగా కనిపిస్తాయి. అయితే ఒక రోజు పనిమనిషి వాళ్లను గురించి చెబుతుంది,తను కిటికీలోనుంచీ వాళ్ళింటికేసి చూస్తున్నదని వాళ్ళు ఫిర్యాదు చేశారంటుంది.అప్పుడు కథకురాలు అనుకుంటుంది.వాళ్లను గురించి తెలుసుకోడం ఎందుకు? ఈ మూడు దిక్కులా నాకు కనులకింపుగా వుండే దృశ్యాలను ఎట్లా చూస్తున్నానో అట్లాగే వాళ్లనూ చూస్తాను .కిటికీ ముయ్యను.అని  చైతన్యంతో కదలాడే మనుషులతో సంబంధం లేకుండా కిటికీలు మూసుకోడం ఎందుకు? పైగా వాళ్లని గురించి తెలుసుకోడం ఎందుకు? చూడ్దమే ఇష్టం. మనుషులను  వాళ్లలాగే ఇష్టపడడం ఎంత గొప్ప విషయం! ఒకరి మంచిచెడ్డల బేరీజులు వేసే స్వయంప్రకటిత న్యాయమూర్తుల పాత్రలు మనకెందుకు? మనమున్న చోటును కంటికింపుగా వుండేలా చేసేది బాహ్య చక్షువులేకాదు మన అంతఃచక్షువుకూడా .
 వినిమయ సంస్కృతి వలన అవసరాలుగా మారిన కొన్ని సౌఖ్యాలూ సౌకర్యాలూ మనుషులని ఆర్జన యంత్రాలుగా తృప్తిలేని వారిగా  ఆడంబరులుగా డబ్బు తప్ప దేనికీ విలువ ఇవ్వని వారిగా తయారుచేస్యున్న కాలం ఇది.ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న కాలం ఇది. పురుషులూ వారితోపాటుగా మరికొంత అదనంగానూ ఈ వొత్తిడిని భరిస్తున్నది స్త్రీలే. ఈ వొత్తిడి అందర్నీ ఒక అభద్రతాభావంలోకి నెట్టివేస్తున్నది.ఈ అభద్రతాభావంనుంచీ పుట్టినదే ఇప్పటి ఆడంబర  భక్తి ప్రవాహం. .తెర వెనక్కు పోతున్న పునిస్త్రీ వ్రతాలనూ నమ్మకాలనూ మళ్ళీ తెరపైకి తెస్తున్నది కూడా ఈ అభద్రతాభావాన్ని ఉపయోగించుకోడానికే. ఇవాళ ఒక మంచి పాట కచేరీకి, ఒక సాహిత్య కార్యక్రమానికి హాజరు కావడానికి తీరకలేదనే మహిళలు ఇటువంటి కార్యక్రమాలకి వందల సంఖ్యలో హాజరవడంకూడా ఇందుకే. ఇందుకే  అనేకమంది ప్రవచన కారులూ, బాబాలూ, స్వాములూ అమ్మలూ పుట్టుకొచ్చారు. ప్రవచనాలు వినడానికి బాగుంటాయి. కొన్ని మతగ్రంధాల్లోనుంచీ, కొన్ని పెద్దల ఉపన్యాసాల్లోనుంచీ ఏరి వినసొంపుగా చెప్పినప్పుడు వాటి ఆకర్షణ చెప్పక్కర్లేదు. కానీ వీటివెంట ఏనాడో వదిలేసిన మూఢనమ్మకాలను పునరుద్ధరించే పని పెట్టుకోడం వెనుక కుట్ర ఏమిటి?  ఈ మాయలో పడి జీవనోత్సాహాన్ని పొగుట్టుని,మళ్ళీ “ఎంత కష్టపడి బయటికొచ్చాం మనం? మళ్ళీ మనల్ని ఎక్కడికి తీసుకుపోతారో ఏమోఅనే  ఆలోచనతో తెప్పరిల్లుకున్న ఒక ఆధునిక స్త్రీకథఈ విషానికి ఈ తేనె చాలు
ప్రవచన కారుల వలె ఇప్పుడు బాగా ప్రచారంలో వున్న మరొక వృత్తి కౌన్సిలింగ్.వీళ్ళు యువకులకు దిశానిర్దేశకులు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్ కాలేజీలూ, వాటిలో అధ్యాపకులు వారి బాధ్యతలు ,అక్కడ చేరే విద్యార్థులు వారి మధ్య ఆకర్షణలు ,సెల్ఫొన్ వారధులు  ప్రేమవైఫల్యాలు మోసాలు,ఆర్థిక సామాజిక వెనకబాటుతనం కల వారికీ అన్ని సౌకర్యాలూ ఉన్న వాళ్లకీ మధ్య ఆకర్షణకు మిగిలే పరిణామాలు ఈ మొత్తం క్రమంలో కౌన్సిలర్ల పాత్ర ,సమకాలీన విద్యా సంస్కృతికి దర్పణం లాంటి కథ “దిశా నిర్దేశకులు” ఇది కూడా ఆవేశాలూ అతిశయోక్తులూ లేకుండా కొంచెం వ్యంగ్యంతో రంగరించి చెప్పిన మంచి కథ.
వీరలక్ష్మి గారి కథలు ఎక్కువగా స్త్రీ కేంద్రకంగా నే వుంటాయి.వారి పట్ల ఆమెకు సహానుభూతే కాదు గౌరవంకూడా. అట్లా ఆమెతో పాటు పాఠకుల గౌరవాదరాలు పొందే పాత్రలు “పునరుత్థానం కథలో ఆదిలక్ష్మి “తన్మయి”కథలో తాయారు, “నీడ” కథలో కథచెప్పే నేను,పూర్ణ, “,బరువు భారాలు” లో రాజ్యం
  .పునరుత్థానం కథలో ఆదిలక్ష్మికి ముందునుంచీ అన్నీ కష్టాలే.కాలు విరిగి మంచంలో పడిన భర్త .ఆర్థిక లోపం ,ముగ్గురు పిల్లలు.అయినా ఆదిలక్ష్మి  ఆ ఇంటిని నందనవనంలా వుంచుతుంది. తనూ పూసిన తంగేడే. అట్లాంటి ఆదిలక్ష్మి భర్త చనిపోయాడు కొడుకు ఇంట్లోనుంచీ పారిపోయాడు.పెద్దకూతురికి పెళ్ళిచేస్తే భర్త వేధింపులు పడలేక తిరిగొచ్చేసింది.ఉన్న ఊరూ ఇల్లూ వదిలి ఆమె మరో ఊరికి కూలిపనికి పోయింది.ఇల్లు పడిపోడానికి సిద్ధంగా వుంది. ఎవరెన్ని గుసగుసలు పోయినా పట్టించుకోని ఆదిలక్ష్మి, కష్టం వచ్చినా తట్టుకు నిలబడిన ఆమె, ఊరువిడిచి వెళ్ళిపోయింది. ఆ వూరికే చెందిన ఇద్దరు యువ సాఫ్టువేర్ ఇంజినీర్లకు ఆమె జీవన శైలి పట్ల ఆరాధన.హైదరాబాద్ బెంగుళూరులలో వుండే వాళ్ళిద్దరికీ చేస్తున్న  ఉద్యోగాలు పోయాయి. ఆ వత్తిడి తట్టుకోలేక  వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకోడానికి ఆ వూరొచ్చారు వాళ్ళూ మల్ళి నిలదొక్కుకోడానికి తంటాలు పడుతున్నారు.ఆదిలక్ష్మి వెళ్ళీపోడాన్ని చూసారు. మళ్ళీ సంవత్సరానికి వచ్చారు. వాళ్ల పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు.కానీ ఆదిలక్ష్మి తిరిగొచ్చింది.మళ్ళీ ఇంటిని నందనవనం చేసింది.మళ్ళీ బ్రతుకుపోరులో మునిగింది.ఒక కూతుర్ని పెంపకం ఇచ్చింది.ఆ పిల్లకు ఇంజనీరింగ్ లో సీటొచ్చింది.పునరుత్థానం అంటే ఇదేనా అనుకున్నాడు మనకి కథ చెప్పే యువకుడు.అతని మనస్సులో ఒక నందివర్ధనం వేల వేల పూలుపూసి దారిపొడుగునా రాలుస్తోంది. బ్రతుకు బరువైనప్పుడు ఎవరో ఒక అదిలక్ష్మి ఇట్లా మనకి దారి చూపుతుందేమో అనుకుంటాడు. ఆమె తను వెళ్ళిన ఊర్నించీ ఒక దాలియా మొక్క తెచ్చి ఇక్కడ నాటి పూలుపూయించింది.గొప్ప ఆశతో ముగిసిన కథ ఇది.అట్లాగే తన్మయి బామ్మ తాయారు.పాట ఆమెకి ప్రాణం.పాడే కంఠం ఆమెకొక వరం .అయినా ఆ తరంలో పుట్టిన తాయారు పాటను ఆమె మేనత్తే అయిన అత్తగారూ బావ అయిన భర్తాకూడా ప్రోత్సహించకపోగా నిరుత్సాహపరచడంతో పాట గొంతులో గొంతులోనే వుండిపోయింది ,కానీ చచ్చిపోలేదు.ఆమె దానిని అన్నేళ్ళు కాపాడుకుంటూ వచ్చింది .ఆ వూరూ ఆ ఇల్లూ ఆ సంసారం గడిచాక  ఆమెనూ ఆమె పాటనూ ప్రేమించిన చిన్నకొడుకు ఇంట్లో కుదురుకున్నాక, మళ్ళీ జలధారలా ఉబికి వచ్చింది.అమే మేనకోడలు కూడా ఆమె లాగే సంగీతప్రియ. కానీ భర్త దగ్గరనుంచీ ప్రోత్సాహంలేదు. ఆమెకూ రావలసినంత పేరూ అవకాశాలూ రాలేదు.కానీ మూడో తరంలో తాయారు మనవరాలికి అమిత ప్రోత్సాహం అన్ని చోట్లనుంచీ.ఒక నాడు పాట పాడుకునే అవకాశం లేక మరుగున పడిపోయిన ప్రతిభ ఇపుడు వందల మంది గాయనులుగా వర్ధిల్లుతున్నది. ఈ కథలో తాయారు పాట కోసం పడిన తపన వేదనలను ఆ నాటి సంప్రదాయాల, మనస్తత్వాల నేపథ్యంలో  అత్యంత సహజంగా చెప్పారు రచయిత్రి.
తండ్రుల సహాయ సహకారాలు లేకుండా తల్లులొక్కరే కష్టపడి  పెంచే పిల్లలు మన సమాజంలో చాలామంది వున్నారు. అటువంటి ఒక ఆడపిల్ల విశాల .ఆమెని తల్లి కష్టపడి చదివించింది .ఒక కుర్రవాడు ఇష్తపడి పెళ్ళి చేసుకుంటానని కూడా అంటాడు.కానీ హఠాత్తుగా విశాల మీద దాడి జరిగింది. దాన్ని పది మందిముందూ పెట్టకుండా పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా ఆ పిల్లని కడుపులో పెట్టుకుని కాపాడింది తల్లి. పెళ్ళి చేసుకుంటానన్న కుర్రవాడు తప్పుకుంటాడు.ఆతల్లి కి అంత నిబ్బరమూ లౌక్యమూ వున్నందుకు ఆశ్చర్యం కలిగేలాగా .అట్లా కాపాడి మళ్ళీ మామూలు గా లోకంలోకి పంపుతుంది.విశాల ఆ దాడినుంచీ చాలా నేర్చుకుంది. కష్టపడి చదువు పూర్తిచేసి వ్యాపారంలో ప్రవేశించి తన లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతకాలంటే డబ్బుండాలనే జ్ఞానం తో పాటు ఆ డబ్బుకూడా సంపాదించింది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఆమె మీద జరిగిన దాడి వివరాలు ఎవరికీ తెలియవు.ఆ వివరాలు ఊహించడానికి ఈ కథ మరికొంత వుంది.కానీ విశాల తల్లి  ఆమెను నిలబెట్టిన తీరుకు ( “ఆరాత్రి” కథ లో)ఆవిడ ఆత్మ బలానికి మనం మొక్కాల్సిందే. తనలాంటి పేద వాళ్లకు న్యాయవ్యవస్థ చేసే సాయమూ న్యాయమూ ఎంతో తెలుసు ఆవిడకు.
“లౌకిక వ్యాపారాలు మనని మింగేస్తున్నాయి .సంపాదించడం ఖర్చుపెట్టడం కోసం మన శక్తి యుక్తులన్నీ ధారపోస్తున్నాము .మన కోసం వున్న వాటినేవీ పట్టించుకోడంలేదు మనం “ అనే అర్థం వచ్చే పద్యం ఒకటి ఇంగ్లీష్ లో చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లాగే ఇప్పుడు మనదగ్గర ఉద్యోగం చేసుకోడానికి తప్ప మరి దేనికీ సమయం లేదు. వ్యవసాయ ప్రధానమైన ఉమ్మడికుటుంబాలు పోయి ఉద్యోగాధారితాలైన  న్యూక్లియర్ కుటుంబాలొచ్చాక తలితండ్రుల దృక్పథాల్లో కూడా మార్పు వచ్చింది. ఎవరెవరి ఇళ్ళల్లో వాళ్ళే వుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అట్లా ఒక కుటుంబం రెండు కుటుంబాలై పోయి కుటుంబాల మధ్య భౌగోళిక దూరాలు కూడా పెరిగాయి. ఆఖరికి పెద్దవాళ్ళు పోయినప్పుడు కూడా వచ్చి పదిరోజులుండే సమయం కరువైపోయింది.ఈ పరిస్థితులనూ తల్లీ తండ్రీ పోయిన ఇంటిని ఖాళీ చెయ్యడానికి కూడా సమయం చాలని ఈ నాటి దైన్యాన్ని “బరువు భారాలు” కథలో కళ్ళముందు పెట్టారు రచయిత్రి .అయితే ఈ కారుమబ్బు కు వెండి అంచులాగా ఒక రాజ్యం వుంది.ఆమెకు సమయాన్ని అదుపులో పెట్టుకునే నేర్పు వుంది.సహాయంచేసే గుణం వుంది.మనుషులంటే ప్రేమ వుంది. నేనిలా కథంతా చెప్పకూడదు .ఈ కథని మీరే చదవండి. రాజ్యాన్ని ప్రేమించండి.ఆమె గుణాన్ని కొంచెం స్వంతంచేసుకోవాలనుకుంటే మీ ఇష్టం.
విడిపోయాక సరిహద్దుల గీతలుంటాయి .మనం కాస్తా నువ్వూ నేనూ అయిపోతాం .లోపాలెంచుతాం తప్పులు వెతుకుతాం.కానీ అత్యవసర వేళలో కావాలంటే మనం గీతలు చెరుపుకోలేమా? తప్పకుండా చెరుపుకోవచ్చు కష్టాలూ విషాదాలూ అందరికీ ఒకటే అక్కడ ఒకరికొకరం సహాయ పడలేమా.”గీతలు చెరుపుకోవచ్చు” ఇప్పటికి అన్వయించే కొత్త కథ .బహుశ ఎప్పటికీ అన్వయించే కథ. 
అనాథలకూ ఆపన్నులకూ సహాయం చెయ్యడానికి ఆశ్రయం కల్పించడానికి మనకి ఎన్నో సేవా సంస్థలున్నాయి.వాటికి విదేశ స్వదేశాల్నుండి  వచ్చే నిధులున్నాయి. కానీ వారికి సరైన సమయానికి ఆ సహాయం అందడానికి ఎన్ని నియమ నిబంధనలు ,ఎన్ని ఫార్మాలిటీలున్నాయి?ఎన్ని సందేహలున్నాయి?ఇవ్వన్నీ గడిచి గట్టెక్కేదాకా అవసరాలు ఆగుతాయా? నిజంగా సహాయంచేసే ఉద్దేశం ఉన్నవాళ్ళేం చేస్తారు? “సహాయం చేసేటప్పుడు ఇమోషనల్ గా చెయ్యాలి.లాజిక్ పనికి రాదు.హృదయంతో చెయ్యాలి .బుద్ధి పనిచేస్తే సహాయం చెయ్యలేం.ఒక్కొక్కసారి మోసపోతే పోవచ్చు.అలాగని హృదయాన్ని బంధించుకుని తప్పించుకుపోతే ఎలా? అంటుంది” పూర్ణ అనే యువతి.అనడమే కాదు చేసి చూపించింది.నీడ కథలో .ఇది రచయిత్రి తాత్వికత. ఇటువంటి పారిజాత సుమాలు ఈ సంపుటిలో ఏరుకుంటె చాలా దొరుకుతాయి. జీవితాన్ని ప్రేమించు మనుషుల్ని వాళ్లని వాళ్ళుగా ప్రేమించు .సకల ప్రకృతినీ దగ్గరికి తీసుకో.నీ చుట్టుపక్కలంతా జాజిపూల పరిమళాన్ని వెదజల్లు దైనందిన జీవితం తప్పనిసరిగా కాక దాన్నికూడా కూనిరాగంలా ఆలాపించు. ..ఈ క్రమంలో నీ గౌరవాన్ని నిలుపుకో.అది ముఖ్యం  ఇదీ ఆమె జీవన దృక్పథం. ఇక కథా విమర్శకులు అందరూ చెప్పే క్లుప్తతా గాఢతా సంఘర్షణా సరైన నేపథ్యం అన్నీ చక్కగా అమరిన కథలు ఇవి.ఎక్కడా ఇంగ్లిష్ పదాలు వాడకపోవడం  తెలుగు అధ్యాపకురాలైన ఆమెనుంచీ ఆశించిన మనకు ఆశాభంగం లేదు.
   ప్రకృతి పట్లా సంగీతంపట్లా సాటి మనుషుల పట్లా కల ఈ ప్రేమకు మూలం అమె సంపద్వంతమైన బాల్యం అని అర్థమయింది. పంచుకోవడం,పట్టించుకోవడం అప్పటి గ్రామీణ జీవన విధానాలు .విద్యా పుస్తకపఠనం మనోవికాసానికి ఎంత దోహదం చేస్తాయో గ్రామీణ బాల్యం మనసును మెత్త బరచడానికి అంత దోహదం చేస్తుందని నాకు తెలుసు.ఆ బాల్యం ఎంత సౌందర్యవంతమైందో ఉత్సవసౌరభం  ముందుమాటతో మరింతగా స్పష్టమైంది.అటువంటి అద్భుతమైన పరిచయ వాక్యాలు నేను వ్రాయలేనని తెలిసి కూడా వీరలక్ష్మీదేవి నాకిచ్చిన ఈ గౌరవాన్ని అందుకుంటూ ఈ నాలుగు మాటలూ చెప్పే సాహసానికి పూనుకున్నాను.ఈ సంపుటిలోని ప్రతి కథనూ చెప్పి ఉత్కంఠకు తెర దించకుండా కొన్నింటిని గురించే ప్రస్తావించాను,రండి ఈ పూలతోటలోకి మీరే స్వయంగా .
 తన మొదటిరెండు సంపుటాలనూ ఈ మూడవ దానినీ కలిపి మొత్తం కథలన్నీ ఒక సంకలనంగా తెస్తే  అన్నికథలూ ఒక్క సారి చదివే అవకాశాన్ని సాహితీ విద్యార్థులకి ఇచ్చినట్లవుతుందేమో ఆమె ఆలోచించాలి.
ప్రేమతొ
సత్యవతి
సెప్తెంబర్ ఒకటి రెండువేల పథ్నాలుగు

( కిటికీ బయట వెన్నెల కి ముందుమాట)

 


No comments: