Saturday, December 06, 2014

పిల్లాడొస్తాడా

                                                                                                          పి.సత్యవతి
                                                            పిల్లాడొస్తాడా?
రాజావారి కుటుంబం దైనిక ధారావాహిక  తాలూకు తొమ్మదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో ఉదంతం ఒక గంటసేపు ప్రసారం కాబోతోంది ఈ రోజు... అందులో నటించిన  తారలంతా ఆ ఫలానా ధారవాహికలో తాము పాల్గొన్న అపురూప ఘట్టాలనూ   జన్మసార్థక సన్నివేశాలనూ జుట్టు పైగకెగదోసుకుంటూ  ముద్దుముద్దుగా మణిప్రవాళంలో ముచ్చటిస్తారు. ఈ ఉదంతం తప్పక చూడమని గత పదిరోజులుగా నిర్మాతలు చెవిలో  ఇల్లు కడుతున్నారు.అందుచేత కాలేజీ నుంచీ వచ్చి అబ్బాయి వెంటనే తినడానికి  స్వయంగా పీజ్జా తయారుచేసి పెట్టి, రాత్రిభోజనంలోకి వాడికిష్టనైనవి వండి ,అమ్మమ్మకోసం రాగిజావ కాచి ,తనకోసం పుల్కాలు చేసుకుని ఇటీవలే కొని గోడకి అమర్చిన పెద్ద బుల్లితెరముందు కుదురుకున్నదివిజయ.
  అమ్మమ్మ సావిత్రమ్మకు ఎనభై ఏడేళ్ళు..  ఆమెను తన దగ్గర పదిరోజులుంచుకు పంపిద్దామని  మొన్న తీసుకొచ్చుకుంది విజయ..... విజయ వాళ్ళాయన  ఏదో సమావేశంకోసం సింగపూర్ వెళ్ళి వున్నాడు.కూతురికి వివాహం అయి అమెరికా వెళ్ళింది.కొడుకు  ఇంజినీరింగ్ చదువుతున్నాడు.  నమూనా కుటుంబం.
 అమ్మమ్మకి బుల్లితెర కార్యక్రమాలు నచ్చవు. గదిలో కూచోడమూ గిట్టదు .ఆకాశంలో ఒక చిన్న ముక్కా , నాలుగుచుక్కలూ, రెండు మొక్కలూ కనపడతాయని సాయంత్రం కాగానే బాల్కనీ లోకి చేరుతుంది . అలా బాల్కనీలో కూచున్న అమ్మమ్మ హడావిడిగా లోపలికొచ్చి బాగా మబ్బేసింది.చినుకులు కూడా మొదలయినై. .ఇంకా పిల్లాడు రాలేదే! అంది
రాజాగారి కోడలు కోడలికి కోడలు పాత్రధారిణి సకలాలంకార భూషితంగా అప్పుడే తెరమీదకొచ్చి వీక్షకులకు వినమ్రంగా నమస్కారం చేసింది.ఆ పిల్ల పెట్టుకున్ననెక్లేసు చాలాబాగుంది  అనుకుంటూన్న విజయ, అమ్మమ్మ మాటలకి ఉలిక్కి పడింది.అవునూ రాత్రి ఎనిమిదౌతున్నా పిల్లాడింకా ఇంటికి రాలేదేమిటీ? అయ్యో పిల్లాడు రాలేదు. రోజూకన్న ఒక అరగంట ఆలస్యమైనా అమ్మ కంగారుపడుతుందని ఫోన్ చేసి చెబుతాడు కదా?
వాడు ఫోన్ కూడా ఎత్తడంలేదే! ఏమైంది వీడికి?
దబ దబ చినకులు.
ఒరేయ్ మోటూ,చింటూ ,బబ్లూ బంటీ ,మున్నా ,రహీం రాజా ,మా వాడేడిరా? ఫొన్ మీద ఫోను.
ఏమో ఆంటీ  వాళ్లంతా.
మీరంతా ఇంటికొస్తే వాడెందుకు రాలేదు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి మా బాబులు కదూ?
మాకూ పలకడం లేదు ఆంటీ
వందోసారికూడా వాడి ఫోన్.స్విచ్డ్ ఆఫ్.
రోజూ ఏడుగంటలలోపు వచ్చేవాడు పదైనా రాలేదు.ఏం చెయ్యాలిప్పుడు?
వాళ నాన్నకూడా దేశంలో లేడే!! ఇప్పుడు ఫోన్ చేసి చెబితే కంగారుపడిపోడా?
వస్తాడులే అమ్మా! ఎక్కడో చిక్కడిపోయి వుంటాడు .వాన తగ్గనీ వాడే వస్తాడూఅని ,తనకోసం పెట్టిన జావ తాగేసి   సోఫామీద ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ.
వాడు వెళ్ళే చోట్లు ,వాడికున్న స్నేహితులు పరిచయస్తులు అన్ని నంబర్లూ అయిపోయాయి
పన్నెండు.
చుట్టుపక్కల ఇళ్లల్లో టీవీ లన్నీ బందయ్యాయి.అపార్త్మెంట్ సెల్లార్ లోకి రావాల్సిన వాహనాలన్నీ వచ్చేశాయి.
పిల్లాడురాలేదు
వాడెక్కడో చిక్కుపడి వుంటాడు  అని చెప్తున్నా కదా!!నువ్వలా జావకారిపోకు.వెళ్ళి కాస్త ఎంగిలి పడు అంది అమ్మమ్మ మళ్ళీ
విజయకి ఒళ్ళుమండింది.
వాడు రాలేదని నేనిక్కడ భయపడి చస్తుంటే తినమంటావేమిటీ? నువ్వు జావ తాగేశావుగా పడుకో! అని కసిరింది
 నేను నీరసంతో కళ్ళుతిరిగి పడిపోతే నా సేవ చెయ్యాలి నువ్వు... అందుకని ఎక్కడున్నా ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నా సంగతి  నేను చూసుకుంటాను అట్లా వూరికే కంగారు పడి ఏం చేస్తావ్?  అంది ఆవిడ.
బుల్లితెర రూపం సంతరించుకున్న విజయ మెదడు పైన   ఎర్రని భయంకర దృశ్యాలు.
అంతులేని వేగంతో వస్తున్న మోటర్ సైకిల్ మీద ముగ్గురు పిల్లలు. ముగ్గురి చెవుల్లోనూ సెల్ఫోన్లు .మద్యం మత్తులో జోగుతూ అంతకన్న వేగంగా వస్తున్న లారీ డ్రయివర్!    రోడ్డుమీద అడ్దదిడ్దంగా నెత్తురోడుతూ మూడు శవాలు.తెల్లటి టీషర్టు ఎర్రగా తడిసి ముద్దై!
 వానలో వస్తున్న మోటర్ సైకిల్.....చెయ్యి ఊపి లిఫ్ట్ అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి.మోటర్ సైకిల్ ఆగింది.ఆ వ్యక్తి వీడిని రోడ్డు మీదకి ఈడ్చి బాగాకొట్టి ల్యాప్టాపూ సెల్ఫోనూ పర్సూ ,మోటర్ సైకిల్ తాళాలూ లాక్కుని    వెనక్కి తిరిగిచూడకుండా పోయాడు,వీడు స్పృహలేకుండా రోడ్డుమీద.పడి వున్నాడు...   వెంకటేశ్వరస్వామీ అలా జరగనివ్వకు .మెట్లన్నీ ఎక్కి కొండకొస్తాను.
ఎవడిదో పుట్టిన రోజు.. వాడు వీడిని. పార్టికి రమ్మన్నాడు.వీడు రానంటాడు.వాడు వెక్కిరిస్తాడు. వీడికి రోషమొచ్చి వెడతాడు .. అక్కడ వాదాలు.. వాదాల్లోనించీ ముష్టి యుద్ధాలు. కొట్టుకోడాలు,వీడి గర్ల్ ఫ్రెండ్ ని వాడేదో అన్నాడనీ వాడి  గర్ల్ ఫ్రెండ్ ని వీడేదో అన్నాడనీ ! ఆ వూపులో .. ఎవడిప్రాణం పోతుందో తెలీదు.
కృష్ణలో ఈతకి పోయి  మునిగిపోయిన యువకుడు.  
కొన్ని వేల రూపాయల క్రికెట్ బెట్టింగ్ లు! డబ్బొచ్చిందా జల్సాలే జల్సాలు. ఎక్కడినించీ తేవాలి ఓడిపోయిన డబ్బు? స్కూటర్లు మోటర్ బైకులు ల్యాప్టాపులు దొంగిలించి అమ్మాలి.పోలీసులు పట్టుకుని మొహనికి ముసుగేసి వీక్షకులముందు పెడతారు. ఆ ముసుగుల్లో అమాయకుడైన మనవాడు తెలీకుండా ఇరుక్కోలేదు కదా?
 “ మన  పిల్లాడు అట్లాంటి వాటి జోలికి పోడు. ఊరికే పిచ్చి ఆలోచనల చెయ్యకు..  ఇరవై ఏళ్లకి పైగా పెంచుకొస్తున్నావు నీకొడుకు ఎలాంటివాడో నీకు తెలీదా? చూడు ఎట్లా చెమటతో తడిసిపోతున్నవో నిస్త్రాణ వస్తుంది.. కాసిన పాలు తాగు మళ్ళీ అమ్మమ్మ
నా పిల్లాడొచ్చేదాకా పచ్చిమంచినీళ్ళుకూదా ముట్టను. నా ఒక్కగా నొక్క కొడుకు నా ప్రాణం
అమ్మమ్మ మాట్లాడలేదు
 “ఈ మధ్య వీడు మన సందుచివరి ఇంట్లో వుండే సంధ్య ని నాలుగైదు సార్లు మోటర్ సైకిల్ ఎక్కించుకొచ్చాడు. అదేమైనా ప్రేమ వ్యవహారం అనుకుని వాళ్ల వాళ్ళు వీణ్ణి చావకొట్టారేమో! మనకులంకాదు కదా వాళ్ళు. .మన వెంకట్రత్నంగారి మనవణ్ణి అట్లాగే కొట్టి పడేశారు తెలసుగా?విజయ చెప్పింది మౌనంగా విని ఊరుకుంది అమ్మమ్మ
రెండు ,మూడు నాలుగు గంటలు
గదిలో పచార్లు చేస్తూ ప్రతిచిన్న అలికిడికీ ఉలిక్కిపడుతున్న విజయకి ఉన్నట్లుండి వాంతి అయింది.అమ్మమ్మే మెల్లిగా ఆమెని మంచందాకా నడిపించి మార్చకోడానికొక నైటీ ఇచ్చింది
మంచం మీద పడుకున్న విజయను శోకపు వరద ముంచెత్తింది. నిస్సహాయంగా ఆ వెక్కిళ్ళు వింటూ వుండిపోయింది అమ్మమ్మ. విజయ ఇంకా చెప్పింది.. మొన్నటికి మొన్న స్నేహితులే ఒక పిల్లాడిని చంపేసి కాలవలో పడేశారు.ఇప్పుడెవరు స్నేహితులో ఎవరు శత్రువులో కనుక్కోలేం అమ్మమ్మా!
నీకన్నీ ఇట్లాంటి ఆలోచనలే ఎందుకొస్తయ్ తల్లీ ! రాత్రి నుంచీ నువ్వు అన్నీ అపశకునాలే మాట్లాడుతున్నావ్? మీ తాతయ్య ఉద్యమంలో పనిచేసేటపుడు పదేసిరోజులు ఇంటికొచ్చేవారే కాదు .అప్పుడిట్లా సెల్ఫోన్లా ఏమన్నానా? అట్లాగ ఎదురుచూస్తూ మాపన్లు మేం చేసుకునే వాళ్ళం.. అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంది అమ్మమ్మ
తన పెళైన మూడేళ్ళకే  అత్తగారు పోతే  మావగారు తన ఈడావిడని మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ పిల్లల్నీ తన పిల్లల్నీ కలిసి ఇద్దరూ పెంచేవాళ్ళు.అదీకాక . మావగారి పెద్ద భార్య తాలూకు ఆడపిల్లలు పురుళ్ళు పోసుకోడానికొచ్చేవాళ్ళు. ఎడపిల్లలు పసిపిల్లలు ఇంటనిండా!! ఆ గుంపెడు పిల్లల్లో ఎవడెప్పుడు ఇంటికొచ్చేవాడొ ఎందుకు రాలేదో ఇట్లా ఊహించుకుంటూ ఏడుస్తూ కూచోడానికి ఎవరికి తీరింది? ? పిల్లలతో కూచుని కాసేపు మంచీ చెడూ మాట్లాడుకోడానికి సమయం ఎక్కడిది? మావగారే పిల్లందర్నీ కూచోబెట్టి ఎపుడైనా కథలు చెప్పేవాడు.ఆడవాళ్ళకి ఇంట్లో పనులే సరిపోయేవి.  తన భర్తకి  ఉద్యమాలు. మీటింగులు.  పెద్దకొడుక్కి ఇరవై ఏళ్ళోచ్చాయోలేదో  సంఘాలు ఊరేగింపులు! పోలీస్ భయాలు ,అజ్ఞాత వాసాలు.. .వాళ్ళేవో మంచిపన్లు చేస్తున్నారనే నమ్మకంతో తమ పన్లు తము చేసుకుంటూ వుండేవాళ్లు.  ఎప్పుడూ ఇట్లా హైరాన పడలా...ఒక వేళ వీడూ ఏదో మంచిపని కోసం ఎక్కడైనా ఆగిపోయాడేమో !ఎవరికైనా సాయం చేయడానికి వుండిపోయాడేమో! అని ఎందుకనుకోదీ పిల్ల?  తన పిల్లాడిమీద తనకే నమ్మకం లేకపోయే! లోకం మీదా నమ్మకం లేకపోయే ! అనుకుని అమ్మమ్మ కాస్త చిరాకుపడింది
 “ఆ రోజులు వేరమ్మమ్మా! ..ఇప్పటి పిల్లల సంగతి నీకు తెలీదు రోజూ పేపర్ చదువు తెలుస్తుంది.”
అవున్లే అమ్మా! అప్పుడు వాళ్లకి ఏవో ఆశయాలనీ అవీ వుండేవి..కోరికలూ డబ్బులూ కూడా తక్కువే  ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ మామయ్య అక్కడ ఉండిపోయేవాడు,వాడికి తిండీ నీళ్ళూ కూడా గుర్తొచ్చేవి కాదు వీడికి వాడి పోలిక వచ్చిందేమో .అనుకుంటూన్నాను..అంది అమ్మమ్మ .
వాడికి ప్రతిరోజూ చెబుతాను. తనకు మాలిన ధర్మానికి పోయి నువ్వు అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకు,  లేని పోని బురద అంటించుకోకు అని,.మనం ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదు మనని మనం ఉద్ధరించుకుంటే చాలనీ  ! మన చదువేదో మనం చూసుకుని జీవితంలో స్థిరపడాలని!!. అడిగిన వన్నీ ఇస్తాను .ఏదిష్టమో అదే వండిపెడతాను. బయటికెళ్లాక ఎట్లా వుంటాడో ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది ”  కళ్ళు తుడుచుకుంటూ అంది విజయ.
అంటే ,వాడు ఎవరికోసమూ ఏమీ చెయ్యడనీ ఇట్లా తను ఊహించే ప్రమాదాల్లో ఇరుక్కుంటాడనీ విజయ ఉద్దేశమా ఒక వేళ వాడికే ఏ ప్రమాదమన్నా జరిగుంటే వాడికి సాయం చేసి ఇంటికి తెచ్చేవాళ్ళే వుండరా? ఆ ఊహ కూడా రావడం లేదు.,ఆ ఇంట్లో పుట్టి పెరిగిన తన మనవరాలికి! పైగా గట్టి నమ్మకంతో వుంది ఏదో చెడే జరిగిందని! పరిస్థితుల్లో అంత మారొచ్చిందా అని ఆశ్చర్యపోయింది అమ్మమ్మ.
కొన్ని యుగాలకి సూర్యుడొచ్చాడు.పిల్లాడురాలేదు.వాకిట్లో పడివున్న పాల పొట్లాలూ వార్తాపత్రికా తీసుకుని పని చేసిపెట్టే దుర్గ వచ్చింది.
లేమ్మా ! లేచి కాసిని కాఫీ తాగి ఇప్పుడేం చెయ్యాలో చూడు .నీ స్నేహితులెవరికైనానో మీ ఆయన స్నేహితులకెవరికైనానో ఫోన్ చేసి పిలు . అట్లా ఏడిస్తే ఏమవుతుంది అని మళ్ళీ బ్రతిమిలాడింది అమ్మమ్మ
విజయ పత్రికలోని  సిటీ టాబ్లాయిడ్ తీసుకుని అందులో హత్యలు, ప్రమాదాలూ దొంగతనాలూ వేసే పేజీ చూసింది. ఎక్కడా తన పిల్లవాడికి సంబంధించిన వార్తలాంటిది కనిపించలేదు. రోజూ వుండే వివాహితల ఆత్మహత్యలూ రోడ్డుప్రమాదాలూ వైగైరాలున్నాయి.కాస్త కుదుటపడి కాఫీ తాగుదాం అనుకుంది కానీ అది నోటికి పోలేదు. కడుపులో తిప్పింది. అయినా రాత్రి జరిగిన సంఘటన అప్పుడే పేపర్లోకి ఎట్లా ఎక్కుతుంది? ప్రమాదం పాలై రోడ్డు మీద పడి వున్న వాడిని పట్టించుకునేదెవరు? పోలీసులకో, నూట ఎనిమిదికో ఫోన్ చేసే తీరిక ఎవరికి? లేనిపోని బురద అంటించుకోడం ఎందుకు, మన పని మనం చూసుకుపోదాం అనుకుంటారు కదా అందరూ!
అప్పుడు
పిలిచే గంట మోగింది;
ఎవరే వార్త మోసుకొచ్చారో అని సోఫాలో కూలబడి పోయింది విజయ
ఒకవేళ పిల్లాడే వచ్చాడేమో! దుర్గమ్మా త్వరగా తలుపు తియ్ తల్లీ అంది అమ్మమ్మ
**************************************************************************************











No comments: