Tuesday, September 07, 2010

ఆచంట శారదాదేవి

ఆచంట శారదాదేవి
రవీంద్రనాధ్ టాగోర్,దేవులపల్లి కృష్ణశాస్త్రి ,చెహోవ్,కాథరీన్ మాన్స్ ఫీల్డ్ లను అభిమానించే ఆచంట శారదాదేవి కధలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది..ప్రకృతి ఆస్వాదన,సంగీతం పట్ల అభిరుచి ,ఎవరినీ నొప్పించని సున్నితత్వం ,ఉన్న పరిస్థితిల్లోనే ఏదో ఒక ఉపశాంతిని కనుక్కుని జీవితాన్ని నడుపు కోవడం,కొంత మానసిక విశ్లేషణ, ఈ మె రచనల్లో ముఖ్యాంశాలుగా వుంటాయి.స్త్రీల జీవితాలలో జెండర్ పాత్రని గుర్తింఛడంవున్నా, దాన్ని ఎదిరించలేని పాత్రలు... , ప్రేమా ఆరాధనలకు ప్రాముఖ్యం.లోకం పోకడ,కొన్ని తాత్వికమైన ఆలోచనలను,అనుభవాలను,,హాయిగా చదువుకుపోయే లలితమైన శైలిలో వ్రాస్తారు.
1950 ల మొదలుకుని విరివిగా వ్రాసిన ప్రసిధ్ధ కధా రచయిత్రులలో శారదాదేవి ఒకరు.”పగడాలు” “ఒక నాటి అతిథి” “అమ్మ ’ మరీచిక” ’ఆడవిదాగిన వెన్నెల” “పారిపోయిన చిలక” మారిన మనిషి “వంటి ప్రాచుర్యం పొందిన కధల తో కలిసి దాదాపు వంద కధలు వ్రాసి వుంటారు. ఆరు కధా సంపుటాలు వెలువరించారు.అన్నీ కలిపిన ఒక సమగ్రమైన సంకలం వెయ్యనందున ఇప్పుడు ఆ సంపుటాలలో కొన్నిమాత్రమే అందుబాటులో వున్నాయి. మొదటి కధ 1945 లో చిత్రాంగి అనే పత్రికలో వ్రాశారు I
ఆమె వ్రాసిన కథలన్నింటిలోకీ “పారిపోయిన చిలుక”అనేది అధ్భుతమైన కథ.అందులో శిల్పం తాత్వికత వర్ణన,వస్తువు జంత్రగాత్ర విద్వాంసుల స్వర సమ్మేళనంలా కలిసిపోయివుంటాయి .ఇది కామాక్షమ్మ కథ..,యువతులకుండే జీవనాకాంక్షలన్నిటి తో కళకళ లాడుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.సామాన్య కుటుంబంలో పుట్టిన కామాక్షమ్మ థర్డ్ పారం(ఎనిమిదో క్లాసు) వరకే చదువు కుంది . తన స్నేహితురాలిలా తనకు కూడా ఒంటినిండా నగలుంటే బావుండునను కుంటుంది .కుటుంబ పరిస్థితుల వల్ల ఆమెకు పదిహేనేళ్ళ వయసులో ముఫ్ఫై ఏళ్ళ సుందరావుతో పెళ్ళి కుదురుస్తున్నప్పుడు,”వంటీ నిండా నగలు పెడతారా?’అని తల్లినడిగింది.పల్లెలో.మామిటితోటా ఇల్లూ వాకిలీ నౌకర్లూ చాకర్లూ వున్న సుందరరావుకి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టిన కామాక్షమ్మ త్వరలోనే అతని వస్తు సముదాయంలో తనూ ఒకతెననీ అతనికీ తనకీ మధ్య ప్రేమ అటుంచి కనీసం భావప్రసారంకూడా లేదనీ,అంత ఇంట్లో తనకి మానవ స్పర్శ కరువైందనీ తెలుకుంది అతను రోజూ దగ్గరున్న బస్తీకి పొద్దున వెళ్ళి రాత్రికొస్తాడు.వచ్చాక కూడా ఆమెతో మాటా మంతీ లేదు.ఆమె పలకరించినా వెళ్ళి రేడియో వినమంటాడు...అతని వ్యాపకాలు అతనివి.కనీసం అతను రోజూ బస్తీకి వెళ్ళి చేసే వ్యాపారమేమిటో కూడా ఆమెకి తెలియదు ఆమెకి చెప్పవలసిన అవసరం అతనికి లేదు.అంత వంటరితనంతో వున్న కామాక్షమ్మకి ఒక నాడు గాయపడ్డ చిలుక దొరికింది.దాన్ని దగ్గరకు తీసి పంజరంలో పెట్టి చిన్నారి అని పేరుపెట్టుకుని చిన్నారి దాని పోషణలో దానికి మాటలు నేర్పడంలో ఆనందం వెతుక్కుంటుంది.కానీ ఒకనాడు పొరపాటున పంజరం తలుపు తీసిపెడితే చిలక పారిపోయింది. ఆమె దిగులు పడింది,మళ్ళీ వసంతం వచ్చి మామిడి చెట్లు పూతకి రాగానే చిలకలు తోటలోకి వస్తు న్నాయి..ఒకదాన్ని పట్తితెచ్చి పంజరం లో పెడతానంటే కామాక్షమ్మ వద్దంటుంది.వాటిని స్వేచ్చగా వచ్చి తోటలో తిరిగి పోనిమ్మని వాటిని చూడ్డంలోనే ఆనందం వుందనీ అంటుంది.పంజరంలో చిలుకకూ తనకూ పోలిక అర్థం అయినా అల్లా ఎగిరిపోవాలన్న కోరిక ఆమెకి లేదు..స్నేహరాహిత్యం ఆమెను బాధించిన విషయం కధనం అధ్భుతంగా వుంటుంది.
చాలా కధా సంకలనాలలో చేర్చబడి బహుళప్రాచుర్యం పొందిన కధ “పగడాలు”… కధ ..ఆడుకుంటూ పడేసుకున్న పగడాల దండ తీశాడన్న అభియోగంతో ఇంటి ఎదురుగా వుండే ముసలి లక్ష్మన్నతాత నూ అతని మనవరాలు సీతనూ అనుమానించి పోలీసుల్ని కూడా పిలుస్తారు.,వాసంతి తల్లితండ్రులు. ఆ దండ ఖరీదుకి డబ్బివ్వమంటారు.దండ ఖరీదు ఇవ్వలేని తాత తనదగ్గరున్న పదమూడు రూపాయలూ ఇచ్చి దణ్ణం పెడతాడు.కానీ చివరికి పగడాలు, బీరువా కింద దొరికాక కూడా ఆవిషయం అతనికి చెప్పి డబ్బు వాపస్ ఇవ్వకపోగా ఆ విషయాన్ని గుట్టుగా వుంచడం చిన్నారి వాసంతిని బాధపెట్టింది. పెద్దల పట్ల భయ భక్తులవల్ల ఆ విషయాన్ని అలాగే దిగమింగుకుంది. తరువాత వాసంతిని సీతతో ఆడ్డానికి పోనివ్వలేదు..వాళ్ళని దూరంనించే చూస్తూవుండేది..వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినాక పుట్టింటి కొచ్చిన వాసంతికి ఆవిషయాలన్నీ గుర్తురావడంగా కధ మొదలౌతుంది .అప్పటి ఆటపాటలు ఆనాటి ఇంటి వాతావరణం.లక్ష్మన్న తాత మనవరాలు సీతతో తన ఆటలు.పోలీసు రిపోర్టూ తాత తనదగ్గరున్న డబ్బు అంతా ఇచ్చెయ్యడం అన్నీ గుర్తొస్తాయి.వాళ్ళేమయ్యారని తల్లిని అడుగుతుంది.ఆవిడ స్వభావం ప్రకారం అదంత ముఖ్య విషయంకాదన్నట్లు ముఖంచిట్లించుకుంటూ మాట్లాడుతుంది.ఆ పగడాలు ఇంకా వాసంతి మెడలోనే వున్నాయి.అవి గుండెల్లో కొట్టుకున్నాయి. గుండెల్లో గుచ్చుకునే ఆ పగడాలనీ ఆ చేదు జ్ఞాపకాలనీ ఆమె ఎందుకు మోస్తోందో తెలీదు.. చెప్పింది వినడమే పధ్ధతిగా పెరిగిన వాసంతి ,ఆ పగడాలని అలా గుచ్చుకున్నా వుంచుకోవాలనుకుని వుండ వచ్చు.పిల్లలలో చిగురించే స్పందనలను పెద్దల లౌక్యం కబళించడం సహజమే !! పెద్దదై బిడ్డ తల్లి అయిన వాసంతి ఆ పెంపకపు నీడనించీ బయటికి రాకపోవడం ఒక కారణం కావచ్చు.


ఎక్కువ కధల్లో యువతులు ఒక అపరిచితుడిపైనో చిన్నప్పటి స్నేహితుడి పైనో మక్కువ పెంచుకుని దాన్ని ఆరాధనగా మార్చుకుని ఆ అందని మానిపండుకోసం జీవితకాలం నిరీక్షిస్తూ వుంటారు ..వానజల్లు కధలో పార్వతి ఆమె బావను ప్రేమించింది.కానీ అతను అమెను ఇష్ట పడడు.ఆమె లెక్చెరర్ గా పని చేస్తూ తండ్రిని చూసుకుంటూ వుంటుంది..తన ఇల్లూ ఇంటి ముందరి చిన్ని తోటా తండ్రి ప్రేమా విధ్యార్ధుల అభిమానం,ఆమె జీవితానికి చోదక శక్తులు.చారుశీల అనేకధలో మంజిష్ట అనే అమ్మాయికి తన మేనమామ మరొకర్ని వివాహమాడాడని తెలుసు.అతను పెళ్ళిచేసుకున్న చారుశీలకి అతనంటే వల్లమాలిన అభిమానమేకాక ఒక పొసెసివ్ నెస్ ఉందని కూడా తెలుసు.తల్లి పోగానే ఆమె మేనమామ దగ్గరికే వచ్చింది.అయినా అతన్నే ఆరాధించింది.అతన్ని తప్ప వేరొకర్ని చేసుకోదు. చివరికి నదిలో పడి మరణించింది.అ మేనకోడలి మరణానికి కొంత చారు శీల పొసెసివ్ నెస్ కారణమన్నట్లు అర్ధమౌతుంది.అట్లాగే దిగుడుబావి అనే కధలో చంద్రమల్లి అనే అమ్మాయి ఆవూరిలో ఏదో పని వుండి వచ్చిన హరిరావుపైన మనసు పారేసుకుంది.తనపని కాగానే అతను వెళ్ళిపోతే ఆ వేదన భరించలేక చనిపోవాలని అనుకుని మళ్ళీ తన మరణం తన వాళ్ళనెంత కృంగతీస్తుందో గ్రహించుకుని ఆప్రయత్నం మానుకుంటుంది.కానీ అతన్నే తలుచుకుంటూ ఆ దిగుడుబావి దగ్గరకు వెళ్ళి కూచుంటూ వుంటుంది..నిలువలేని నీరు కధలో ధరణి తన బావను ప్రేమించింది.అతని నడత మంచిదికాదని చెప్పినా అతన్నే పెళ్ళిచేసుకుంటానని పట్టుపట్టింది.అతన్ని అమెరికా పంపించి పై చదువులు చెప్పిస్తానని ధరణి తండ్రి ఆమెతో పెళ్లికి వప్పిస్తాడు. అతను ధరణిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు.తిరిగి వచ్చినా ఆమెను పిలవడు.పైగా వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోటానికి ఈమెను పెళ్ళి రద్దు చేసుకున్నట్లు వ్రాసిమ్మంటాడు.అతనడిగిందేచాలని వ్రాసిచ్చింది.అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నది.కానీ చివరికి అతను ధరణిని రమ్మని కబురు పెట్టాడు.కబురంపిందేచాలని సంబర పడుతున్న ధరణికి ఆమె చెల్లెలు అతనెందుకు రమ్మన్నాడో చెప్పింది.అతని కొత్త భార్య గర్భంతొ వుండి పని చేసుకోలేక పోతున్నది కనుక ఆమెను రమ్మన్నాడు.అయినా అదే మహాభాగ్యమని ఆమె ఒప్పుకుంది..అప్పుడు వెన్నెలలో ఆమె ముఖం పసిపాపలా మెరిసింది,ఎంతైనా మనసులోపలి మమకారం మాసిపోదేమో అనుకుంది చెల్లెలు.మరీచిక అనే కధలో నీల కూడా తాముండే పరిసరాలను అధ్యయనం చెయ్యడానికొచ్చిన ఒకతన్ని ప్రేమించి అతను వెళ్ళిపోగానే దుఃఖసాగరంలో కూరుకు పోయింది.ఇక అందనిలేఖ కధలో సురస అనే అమ్మాయి తమ ఇంట్లో అద్దెకున్న ఒక అబ్బాయిని ఇష్టపడింది.అప్పటికి ఇద్దరికీ బాల్యమే.కలిసి ఆడుకునే వాళ్ళు.ఆ అబ్బాయి పేరు కిరణ మాలి.వాళ్ళనాన్న సంగీత విద్వాంసుడు. కొడుక్కి సంగీతం నేర్పుతూ వుంటే ఈ పాప శ్రధ్ధగా వింటూ అతని గానాన్ని మెచ్చుకుంటూ వుండేది.కిరణమాలి తల్లి చనిపోగా వాళ్ళు వూరు వదిలివెళ్ళిపోయారు. కానీ అతని వివరాలన్నీ ఆమె తెలుసుకుంటూనే వుంది.అతను ప్రసిధ్ధ గాయకుడయ్యాడు .డబ్బూ కీర్తి సంపాదించాడు.ఎంతగొప్ప గాయకుడయ్యాడో అంత స్త్రీలోలుడని పేరు పడ్డాడు.ఒక సంగీత విద్యాలయం స్థాపించాడు.అక్కడ శిక్షణ కొచ్చిన అమ్మాయిలకు అతనంటే గౌరవం వుండేది కాదు.అయినా అతని మీద ప్రేమతో అక్కడికి వెళ్లి సంగీతం నేర్చుకుని అతన్ని కలిసి వొచ్చిందే కానీ అతను తనని గుర్తుపట్టలేదు.ఊళ్ళో వాళ్ళకి తనని అతను పెళ్లి చేసుకుని బాధలు పెట్టాడనీ అందుకోసం వచ్చేశాననీ అబధ్ధం చెప్పి వాళ్ళ సానుభూతి పొందింది.ఇప్పుడామెకి తల్లీ తండ్రీ లేరు రాజీ అనే బంధువులమ్మాయి (మూగది ),ఒక నౌకరు మాత్రమే తోడున్నారు.అంతలోనే ఆమెకు కాలిమీద వ్రణం లేచి ప్రాణపాయం ఏర్పడింది..అప్పుడామె తన ఆస్తినంతా మూగ పిల్లకో పాలేరుకో వ్రాయకుండా అతని పేర వ్రాసేసి మృత్యువుకోసం ఎదురుచూస్తూ వుంటుంది.. ఒకసారి ఒకరిని ప్రేమించాక,జీవితమంతా అతనికోసమే అర్పించాలని అతని బలహీనతలన్నిటితో సహా అతన్ని స్వీకరించాలని,లేదా అతన్నే ఆరాధిస్తూ జీవితం గడిపెయ్యడమే గాఢమైన ప్రేమ అని రచయిత్రి భావన కావచ్చనిపిస్తుంది. ఇప్పటి పాఠకులు ఇటువంటి కధల్ని ఎట్లా తీసుకుంటారు?


.ఇవి కాక ఇతర అంశాలను స్పృశించిన కధల్లో చెప్పుకోదగ్గది,”కారుమబ్బులు”. ఒకే ఆఫీస్ లో పని చేసే యువతీయువకులిద్దరు పరిచయం పెరిగి ఇష్టపడి పెళ్ళిచేసుకుని కలిసి మెలిసి కాపురం చేసుకుంటూ వుండగా భార్యకి ప్రమోషన్ వచ్చింది.ఆమె తన కలీగ్స్ కు పార్టీ ఇస్తే అతను వెళ్ళడు.ఆ క్షణం నించీ అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. అతను ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడని గ్రహిస్తుంది..అతను అక్కడ రాజీనామా చేసి వేరే ఉద్యోగం చేసుకుంటానంటే ఆమె రాజీనామా చేసి అతన్ని సంతోష పెడుతుంది.అతని మనసుకి పట్టిన మబ్బు విడిపోయింది కానీ ఆమె ఇప్పుడు అతనికి అంత సన్నిహితంగా మెలగలేకపోతుంది. తన ప్రమోషన్ ని సహించలేక పోయిన అతని సంకుచితత్వం గుర్తొస్తూ వుంటుంది.. ఆ మబ్బేదో తనని ఆవరిస్తున్న దని పిస్తుంది. కానీ తన ప్రవర్తనకు తనే నవ్వుకుని ఆందులోనించీ బయటికి రావాలనుకుంటుంది .ఉదాత్తంగా ప్రవర్తించడం స్త్రీలు అలవాటు చేసుకోవాలికదా! “అందం”అనే కధ లో మాలతి అందమైన స్త్రీ,పసితనం నించీ ఆమె అందం అందర్నీ ఆకర్షించేది.అది ఆమెనొక్కక్కసారి చాలా చికాకు పెట్టేది కూడా.చిన్నప్పుడు బుగ్గలు పుణకడం,కౌగిళ్లల్లో బంధించడం వంటివి.. రాను రాను ముసలి వాళ్ళు కూడా తినేసేలాగా చూడ్డం అబ్బాయిలు వెంటపడ్దం ఇవ్వన్నీ స్త్రీల సహజానుభవాలే .అట్లాగే తోటలో అందం గా పూసిన పూలను తెంచేదాకా కొంతమందికి తోచదు.చెట్టునుంటె కళ్ళకీ మనసుకీ ఆనందం కలిగించే పూలను తెంపి ఒక్కక్షణం ఆనందించి పడెయ్యడమూ అంతే సహజం. మాలతి అందం చూసి ముగ్ధుడైన జడ్జిగారబ్బాయి ఆమెను కోరి పెళ్లిచేసుకున్నాడు. అయితే ఆ అందాన్ని పక్కన పెట్టుకుని బయటకి వెళ్లినప్పుడల్లా అతనికి ఆమెను అందరూ అట్లా చూడ్డం నచ్చదు.పమిట కప్పుకోమని అలాంటివన్నీ అంటూ వుంటాడు.ఆమె అతనితో బయటకు పోవడం తగ్గించింది.ఇప్పుడిక మాలతి కూతురు చిన్నపాప మాలతిలాగే అందంగా వుంటుంది.ఎవరో హైస్కూల్ పిల్లాడు అ పిల్ల బుగ్గ గిల్లితే అక్కడ గిల్లిన గుర్తుపడింది.ముందు కోపం వచ్చింది మాలతికి.ఎవరైనా గిల్లితే మళ్ళీ గిల్లు,మాష్టర్ కి రిపోర్ట్ ఇవ్వు అని చెప్పాలనుకుంది “ అయినా ఎవర్నని ఏంలాభం ,మానవ ప్రకృతి మారదు.మౌనంగ భరించక తప్పదు’ అనుకుంటుంది..అట్లా చెబితే పాప లో సున్నితత్వం నశిస్తుందంటుంది .మొరటుదైపోతుంది అనుకుంటుంది.పాప తండ్రి పాప బుగ్గ చూసి కోపంత్తో మండిపడతాడు.హేడ్ మాష్టర్ కి చెప్తానంటాడు.మాలతి నవ్వుకుంటుంది.పువ్వులు కొయ్యకుండా వంటావిడ ఎవర్నీ ఆపలేదు తండ్రి కూడా పాప బుగ్గ గిల్లకుండా ఎవర్నీ అపలేడు, అరిచి నవ్వులపాలవడం తప్ప అనుకుంటుంది .ఇంకా అందంగా వుండడం పాప చేసిన తప్పు ,అందంగా వుండడం పువ్వులు చేసిన పాపం అనికూడా అనుకుంటుంది.మన ముంగిట్లో తోటపూలు మనం కాపాడుకోలేమనీ, మన పిల్ల బుగ్గ కమిలి పోయేలా గిల్లితే మనం ’అదంతే” అని ఊర్కోవాలని చెప్పిన ఈ కధని అర్ధం చేసుకోడం కష్టమే.. స్త్రీలపై వయసుతో నిమిత్తం లేకుండా చాలా సటిల్ గా జరిగే లైంగిక వేధింపుల్ని అండర్ టోన్స్ లో చక్కగా చెప్పిన ఈ కధ ముగింపు కొచ్చేసరికి అట్లా మిధ్యా వాదం లోకి మళ్ళింది.

.
వృధ్ధాప్యంలోని ఒంటరితనంలో ఒక స్నేహం కోసం ఆశపడి, జీవనోత్సాహం నశించిపోకుండా కాపాడు కోడం కోసం “బిందువు” కధలో రంగాజమ్మ దేవయ్యతో స్నేహం చేస్తుంది. .”అమ్మ” అనే కధలో ఒకమ్మాయి తనతల్లి అమిత తెలివైందీ చురుకైందీ అని అందరికీ చెప్పి నమ్మిస్తుంటుంది.నిజానికి ఆమెకు అసలు తల్లి లేదు.ఈ “డెల్యూ జన్” ఆ అమ్మాయికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.దాన్ని ప్రశ్నించకుండా ఆమె నలా బ్రతకనివ్వడమే ఆమెకు చేయగల ఉపకారం అంటుంది రచయిత్రి.ఇట్లా మానసిక వైచిత్రులమీద శారదాదేవి మరికొన్ని కధలు కూడా వ్రాశారు. అడవి దాగిన వెన్నెల “ కధలో తపతి,సవతి తల్లి వలన అనేక బాధలు పడుతుంది.ఆమెని నిలువరించలేని తండ్రి తపతిని వేరే ఊరు రహస్యంగా తీసుకొచ్చి రామలక్ష్మి కొడుక్కిచ్చి పెళ్ళి చేసి వెళ్ళిపోతాడు. వితంతువైన .రామలక్ష్మి కూడా స్వతంత్రురాలు కాదు.ఆమె మనుగడ కోసం గోవిందయ్య చెప్పుచేతల్లో ఉంది.గోవిందయ్య కన్ను తపతిపై పడ్డం రామలక్ష్మిని కలత పెట్టింది.గోవిందయ్య కంటపడకుండా ఒక రాత్రి ఇంటివెనుక అడవిలో దాక్కున్న తపతి అక్కడే మరణించింది..మరొక కధలో మధ్య తరగతి జడత్వం ఉదాసీనతలు ఎన్ని నష్టాలకు వేదనలకు కారణమౌతాయో చక్కగా చెప్పారు.
మొత్తం మీద శారదాదేవి కధల్లో ఆవేశం వుండదు, ఆత్మ శోధన తోనో ఇతరుల బోధ తోనో అధ్యయనం అనుభవాల ద్వారానో చైతన్యం పొంది కార్యాచరణకు సిధ్ధపడే పాత్రలూ తక్కువే..ఉన్నస్థితిలోనే ఒక ఉపశాంతిని వెతుక్కుని దాన్ని రేషనలైజ్ చేసుకునే పాత్రలే ఎక్కువ కనపడతాయి .ఒక్క“చందమామ” అనే కధలో మాత్రం ప్రధాన పాత్ర భర్త వేధింపు మాటలు పడలేక బిడ్దను తీసుకుని పుట్టింటికొచ్చింది .వేధింపు మాటలు ఆపినాకే తిరిగొస్తానంటూ అందుకోసం ఎదురు చూస్తుంది. .. శారదాదేవి గారి కధల్లో తండ్రులందరూ చాల మంచివాళ్ళు..ఆడపిల్లల్ని ప్రేమగా అక్కున చేర్చుకునే వాళ్లు.
1922 లో జన్మించిన శారదా దేవి గారిది అసలు విజయవాడ. మద్రాస్ లోని విమెన్స్ క్రిష్టియన్ కాలెజీ లోనూ ప్రెసిడెన్సీ కాలేజీ లోనూ చదివారు.1954 నించీ 77 వరకూ తిరుపతి పద్మావతీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్ గా వున్నారు. ఆచంట జానకిరామ్ గారిని వివాహం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.1999 లో మరణించారు
(భూమిక నుంచి)

3 comments:

భాస్కర రామి రెడ్డి said...

సత్యవతి గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

Nagaraju said...

కాలమే విశ్వాన్ని భారంగా ఓర్చుకొని నడిపిస్తున్నది
క్షణమైనా ఆలస్యం లేక పగలు రాత్రిని ప్రతి రోజు దాటిస్తున్నది
సూర్య చంద్రులను గుర్తుగా కదిలిస్తూ తన సత్తాను చాటుకుంటుంది
ఎంతటి మేధావైనా కాలాన్ని ప్రశ్నించలేకున్నట్లు పని చేస్తున్నది
తన కష్టం తనకే తన జీవితం తనకే ఐనా ఎన్నో సృష్టించింది
కాలంతో ప్రయాణిస్తే ఎన్ని ఎలా తెలుపగలనో విశ్వ మేధస్సుకే తెలుసు

Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read for Universal knowledge and spiritual information
Thanks
Nagaraju

సత్యవతి said...

మీకు కృతజ్ఞతలండీ భాస్కర రామిరెడ్డిగారూ నాగరాజు గారూ