పందొమ్మిది వందల అరవై నుంచీ ఎనభై వరకూ ప్రముఖ వార మాస పత్రికలు స్త్రీ రచయితలను ప్రోత్సహించడం ద్వారా తమ ప్రాచుర్యాన్ని పెంచుకున్నాయి. అది నవలల కాలం…విరివిగా వచ్చిన ఆ నవలలన్నీ ”పల్ప్” సాహిత్యంగా సాహిత్య విమర్శకులు పరిగణించడం వలన స్త్రీలు వ్రాసిన కొన్ని మంచి నవలలు కూడా ఆ వరదలో కొట్టుకుపోయాయి. అయితే అదే కాలంలో మంచి కథలు వ్రాసిన స్త్రీ రచయితలు వున్నారు. ఆనాటి స్త్రీల జీవితాలలోనూ ఆలోచనావిధానాలలోనూ వస్తున్న పరిణామాలనూ వారి ఆకాంక్షలనూ పట్టించుకుని వ్రాసిన వారున్నారు. అట్లా తన ఫార్మెటివ్ యియర్స్‌లోని సాంఘిక వాతావరణాన్ని, ఆ నేపథ్యంలో తనలో కుదురుకుంటున్న అభిప్రాయాలను చదివించే మంచికథలుగా మలచినవారిలో ”అరవింద” ఒకరు. స్వాతంత్య్రానికి పూర్వమే స్త్రీలని చైతన్యీకరించాల్సిన అవసరాన్ని భారతదేశం గుర్తించింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళకే ఆమెకు విద్యా ఉద్యోగావకాశాలకి తలుపులు తెరిచింది. అయితే అప్పటికింకా నిలబడి వున్న భావజాలం విద్యా ఉద్యోగం అనేవాటికి వివాహానికిచ్చిన ప్రాముఖ్యం ఇవ్వలేకపోయింది. కనీసం ఉన్నత పాఠశాల చదువనేది వివాహానికి ఒక అర్హతగానే వుంది కానీ అది స్త్రీల సర్వతోముఖాభివృద్ధికి గానీ, ఆర్థిక పటిష్టతకి గానీ అవసరమనే భావన ఇంకా అప్పటికి అంటే 1950 నాటికి లేదు.
పట్టణ మధ్యతరగతి పెరగడం వల్ల ఉద్యోగాలకి పట్టణాలొచ్చిన తండ్రులూ, గ్రామాలలోనే వుండి ఆర్థిక సుస్థిరత వున్న తండ్రులూ ఆడపిల్లలని కాలేజీలకు పంపడం ప్రారంభించారు. ఆ దశకంలోనే ఆంధ్రదేశంలో అనేక స్త్రీల కళాశాలలు కూడా వెలిశాయి. డిగ్రీ చదువు అయినాక పెళ్ళి, లేదా ఇంటర్ దగ్గర్నించీ సంబంధాల వేట మొదలుపెడితే డిగ్రీ అయేనాటికి పెళ్ళి. ఏదైనా పెళ్ళి అనేది జీవితానికొక సెటిల్మెంట్ అనే భావన అటు తల్లితండ్రులకీ ఇటు అమ్మాయిలకీ కూడా ఏర్పడి వుంది. అయితే అంతకు కిందటి తరంలాగా నాన్న చూసినవాడిని తలఎత్తి చూడనైనా లేకుండా మెడవంచి తాళి కట్టించుకుని, అతడెలాంటివాడైనా సర్దుకుని బ్రతకాలని నిర్ణయించుకునే వాళ్ళుగా కాక, ఈ చదువుకున్న యువతుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. పెళ్ళి ముఖ్యమన్న విషయాన్ని వొప్పుకుంటూనే, తమ దాంపత్య జీవితం ఎలా వుంటే బావుంటుంది, తనతో జీవితకాలం కలిసివుండే వ్యక్తి ఎలా వుంటే తను సుఖంగా వుంటూ అతడిని సుఖపెట్టగలుగుతుంది అని ఆలోచించడం మొదలైంది. కొంతమంది యువతులు తమ వ్యక్తిత్వాలను కాపాడుకునేందుకు పెళ్లి వద్దనుకునే సందర్భాలు కూడా వచ్చాయి.
గ్రామీణ ఉమ్మడి కుటుంబం పట్టణ న్యూక్లియర్ కుటుంబాలుగా విడిపోతున్న సందర్భంలో పరిమితమైన కుటుంబసభ్యుల మధ్య దగ్గరతనం ఏర్పడి కొన్ని పట్టణ మధ్యతరగతి ఇళ్లల్లో పూర్వపు నియంతృత్వ ధోరణి కాక ఒక స్నేహమయ వాతావరణం నెలకొంటున్నది. యుక్తవయస్కులైన అమ్మాయిలు బయటికి వచ్చి చదువుకుంటూ యువకులతో పరిచయాలేర్పడుతుండటంతో భావసారూప్యత ఒకరిపై ఒకరికి ఇష్టాన్ని పెంచుతోంది. ప్రేమవివాహాలు, వాటికి పెద్దల అభ్యంతరాలూ చర్చకొచ్చాయి. చాలాకాలంగా సమాజంలో వేళ్ళుపాతుకుపోయిన కులం మతం పెద్దలకు పట్టింపులు కాగా వరకట్నం కూడా సమస్యైంది. ఇంజినీర్లనో, డాక్టర్లనో పది పదిహేను వేలైనా (అప్పటి కట్నాల రేట్లు) ఇచ్చి అమ్మాయిని సుఖపడేలా చెయ్యాలనుకునే తల్లితండ్రులు, ఆ ఇంజనీర్లు, డాక్టర్లు పెళ్ళి చేసుకోవాలంటే ఆడపిల్ల కనీసం డిగ్రీ చదివివుండాలని కూడా కాలేజీలకు పంపడం వుంది. (ఇప్పుడు ఇంజినీరమ్మాయిలకి మంచి సంబంధాలొస్తాయని చదివిస్తున్నట్లు) కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోబోమని కొంతమంది అమ్మాయిలంటున్నారు.
కులమతాలు తమ ప్రేమకు అడ్డంకులైనప్పుడు తల్లితండ్రులను సమాధానపరిచి ప్రేమవివాహాలు చేసుకున్న అమ్మాయిలు, తల్లితండ్రులకోసం ప్రేమను వదులుకున్న అమ్మాయిలూ,ఇట్లా విద్యావంతులౌతూ ఆలోచించనేర్చిన యువతుల వలన ఆనాటి వివాహవ్యవస్థలో వస్తూన్న పరిణామాలనూ, యువతుల మనోభావాలనూ, అవి వ్యక్తీకరించుకోలేని పరిస్థితులనూ ఆకళింపు చేసుకుంటూ పెరిగిన ”అరవింద” ఆ పరిస్థితుల్ని చిత్రిస్తూ, స్త్రీపురుష సంబంధాలు ఎంత గాఢంగా వుండాలో సూచించే మంచి కథలు వ్రాసారు. 1934 ఏప్రిల్ 14న జన్మించిన సుగుణమణి ‘అరవింద’ బాల్యం అంతా ఏలూరులోనే గడిచింది. ఆమె తండ్రి దేశిరాజు సుబ్రహ్మణ్యంగారు ఏలూరులోని సి.ఆర్. రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్‌గా వుండేవారు. సుగుణమణి అక్కడే చదివి గ్రాడ్యుయేట్ అయ్యారు. అప్పుడే ఆమెకు తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. వివాహానంతరం జెమ్షెడ్పూర్ వెళ్లారు. అక్కడే ఆమె రచనకి శ్రీకారం చుట్టారు.
మొదటి కథ ”అరుంధతి అలక-జంట పువ్వు” 1958లో వచ్చింది. 1958 నుంచి 80ల వరకూ వచ్చిన ఆమె కథలు రెండువేల సంవత్సరం తరువాతనే రెండు సంపుటాలుగా వచ్చినా అవి ఇప్పటికీ వాటి ప్రాసంగికతనూ, పరిమళాన్నీ కోల్పోలేదు. ఆమె 1958లోనే వ్రాసిన ప్రసిద్ధ కథ ”అల్లుని మంచితనం”లో ఒక యువతి భర్త భావాలతో, ప్రవర్తనతో విసిగి, పుట్టింటికి వచ్చి, ఇలా అంటుంది. ”సర్వం అర్పించి ఆనందం సృష్టించాలనే సంకల్పం నాదయితే భార్య అనేదానికి మనసుందనీ, తన జీవితానికి విలువ ఇస్తుందనీ, అతని ప్రవర్తన బట్టి ఆమె సుఖదుఃఖాలు కలుగుతాయనే ఆలోచనే ఆయనకు లేదు. ఏం చేయనునేను?” అప్పుడామె చెల్లెలు ఇలా అనుకుంటుంది ”…అందుకే నాకు పెళ్ళి మీద నమ్మకం లేదు. కన్నెపిల్లలకు అదొక తీయని కల…కానీ ఎటువంటివాడైనా కోరి చేసుకున్న పిల్లైనా సరే భార్య అనేసరికి అధికారభావంతో చూస్తాడు…బి.ఏ. పూర్తి చేస్తాను. ఎమ్మే చదువుతాను. ఉద్యోగం చేస్తాను…స్త్రీ సహజమైన వాంఛలు ఉండనీ సబ్లిమేట్ చేస్తాను…సంగీత సాధన చేసి కళారాధనలో తపస్వినౌతాను…నా అందం, నా చదువు, నా పాట ప్రస్తుతం ఎవరైనా ఆరాధించవచ్చు. కానీ వివాహం జరిగితే అతనూ అందర్లాగే ప్రవర్తిస్తాడు. ఈ జీవిత రాగాలాపనలో అదొక అపశృతి అయితే..” అని తన ఆశయాలు, అర్హతలతో సహా తనను గౌరవించేవాడు దొరికేవరకూ నిరీక్షిస్తానంటుంది. 1959 నాటికే యువతుల ఆలోచనల్లో వచ్చిన పరిణామాలకు ఈ కథ అద్దం పడుతుంది.
అంతేకాదు స్త్రీలకు స్వతంత్రం అవసరమే కానీ తను ”ఫ్యామిలీ లైఫ్”నే ఇష్టపడతానని ఒక ఇంటర్వ్యూలో ఈ రచయిత్రి చెప్పినట్లు ఈమె కథలు కూడా ఒక స్నేహసుందరమైన కుటుంబ జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. ఆకాంక్షిస్తాయి. కుటుంబజీవితాన్ని శాంతియుతం చెయ్యడానికి స్త్రీలే త్యాగం చెయ్యాలని ఎక్కడా చెప్పవు. తన జీవన భాగస్వామిపై ఎన్ని ఆశలతో స్త్రీ వైవాహిక జీవితంలో అడుగుపెడుతుందో, అతని సుఖసౌఖ్యాలను ఎంతగా కోరుతుందో అతను కూడా ఆమెతో సహజీవనం అంత సుందరంగానూ ఉండాలని ఆకాంక్షించాలి. ఒక కథలో అరవింద ఇలా అంటారు ”జీవితం చాలా పరిమితమైనది. కనుకనే ఆశయాలతో సిద్ధాంతాలతో దాన్ని సుందరతరంగా మలుచుకోవాలి. ఆ కృషిలోనే సంతృప్తీ ఆనందం లభిస్తాయి. పొరపాట్లు దిద్దుకునే అవకాశం జీవితంలో లభించడం కష్టం. అవసానదశలో మానవులకు మిగలవలసింది తృప్తితో కూడిన ఆనందం. ఒకరి కష్టసుఖాలలో ఒకరికి పాలు వుంది. ఎవరి ఆనందం వారిదే అనుకుంటే మానవులు బ్రతకలేరు. సహజంగా సానుభూతి అనేది మనుషుల్లో వుంది.” మనుషులలో మంచి మిగిలే వుందని రచయిత నమ్మకం..అందుకనే ”అల్లుని మంచితనం” కథలో లలితను అంతగా విసిగించిన ఆమె భర్త పుస్తక పఠనం ద్వారా పర్యటనల ద్వారా తనని తను ఎడ్యుకేట్ చేసుకుని, పెరిగిన చైతన్యస్థాయితో ఆమె విలువ గ్రహించి ఆమెకిష్టమైతే తిరిగి రమ్మని అభ్యర్ధిస్తాడు. అతను పూర్వం లలితతో ప్రవర్తించిన తీరుకు అతని నేపథ్యమే కారణం అంటాడు. లలిత పెరిగిన కుటుంబ సంస్కారం వేరు కనుక ఆమె అతనితో సద్దుకుపోలేకపోయింది, మరొక చెల్లి సత్యలాగా.
1950 దశకం చివర్లోనూ అరవైల్లోనూ ఎక్కువ కథలు వ్రాసిన అరవింద కథల్లో స్త్రీలు ఆలోచన కలవారు. తెలివైనవారు. ”అడవిపువ్వు” అనే కథలో ఆస్తీ అంతస్తూ, నగా నట్రా, అందం చందం వున్న రాజ్యలక్ష్మి భర్త వేశ్యాలోలుడు. అతను మొదటిరాత్రి మాత్రమే ఆమె దగ్గరకొచ్చాడు. రెండవరాత్రి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళో నేనో ఎంచుకోమంటే నువ్విప్పుడొచ్చావు వాళ్ళెప్పటినించో వున్నారంటాడు. అయితే నన్ను మర్చిపొమ్మంటుంది. అతని స్త్రీలకి అతన్ని వదిలి ఇంటి విషయాలు చూసుకుంటూ వుంటూ బాల వితంతువైన ఆడపడుచుకి ఒక అబ్బాయితో కలిగిన ప్రేమను ప్రోత్సహించి, ఆమె గర్భవతి అయితే ఆ విషయం నవ్వుతూ భర్తకి చెప్తుంది. అతను ఇట్లా నామీద ప్రతీకారం తీర్చుకున్నావా అని కేకలు పెడతాడు. ఏమాత్రం బెదరని రాజ్యలక్ష్మి ఆడబడుచుని తీర్థయాత్రల పేరుతో వేరే ఊరు తీసుకుపోయి పురుడు పోసుకొచ్చి ఆ బిడ్డ తన బిడ్డేనని చెప్తుంది. ఈలోగా ఆమె భర్త గోదావరిలో మునిగి చనిపోయాడని వార్త అందినా శవం దొరలేదు కనుక పసుపుకుంకుమలు నగా నట్రా తీసివెయ్యనంటుంది. కొన్నేళ్ళకి స్వామివారిలా ఆ వూరే వచ్చి జనం పూజలందుకుంటున్న భర్తని గుర్తుపడుతుంది. ”ఎతమంది జనం! ఎంత జరుగుబాటు! ఎంత పేరు..” అనుకుంటుంది. ”ఇంటికి రమ్మనదు, అన్నీ త్యజించుకుని ఇంతవాడయ్యాడు. ఇంకేంకావాలి? ఈ బ్రతుకులకి ఇదే ముగింపు” అనుకుంటుంది. ”మీ ఈ స్థితికి నేనే కారణం. మీరూ ధన్యులే, నేనూ ధన్యురాలినే” అని దండం పెట్టి చక్కా వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న భార్యలు కూడా అలసిపోయివస్తారనే ఇంగితం లేని భర్తలు వేళకి తమకు అన్నీ అమరకపోతే భార్యల్ని ఉద్యోగం మానెయ్యమంటారు. కానీ ఇంటి పనిలో ఒక చెయ్యి కూడా వెయ్యరు. ఇట్లా అనే భర్తలే చివరికి భార్యని అర్థం చేసుకుని ”నాకు బొమ్మ వద్దు, నాలో చైతన్యం కలిగించి ఆనందం కురిపించే మనిషి కావాలి. నేనెప్పుడైనా అమానుషంగా కనిపిస్తే తిరగబడు. విడిపోదాం అనకు…నువ్వు హోమ్ వర్క్ చేయిస్తే నేను వంట చేస్తాను…పని పంచుకుందాం” (ఓ కప్పు కాఫీ) అంటారు. తన ఉద్యోగ జీవితం తనకి రెండో భాగం అనీ దాన్ని వదలలేననీ ఒక ఉద్యోగిని భర్తకు అర్థం చేయిస్తుంది.
మరొకకథలో ఒక చదువుకున్న యువతి ఇంటికి వేరే పెళ్లి సంబంధం చూసుకోడానికి ఒక ఇంజినీర్ యువకుడు వస్తాడు. అది ఎక్కువ కట్నం వచ్చే సంబంధం. కానీ ఈమె అందం తెలివీ వున్న అమ్మాయి. పనిమంతురాలు. పాటలు బాగా పాడుతుంది. ఆ అబ్బాయి ”నీకు ప్రియ (తను చూసి వచ్చిన అమ్మాయి)ను చూస్తే అసూయగా లేదా అని అడుగుతాడు. దానికామె ఇలా అంటుంది” ఏమీ లేదు చాలా సింపుల్. నువ్వు నన్ను చూడ్డానికి రాలేదుగా! నువ్వు ప్రియని చేసుకోడానికి వొప్పుకున్నావనుకో, నీ ఆలోచనా విధానమేమిటో నాకు తెలుసు. అటువంటి మనిషి దొరకలేదని బాధపడను. ఒకవేళ ప్రియని చూసుకోడానికి వచ్చి లలితను ఇష్టపడి కట్నం లేకుండాచేసుకుంటావనుకో అప్పుడా వ్యక్తి ఎటువంటివాడో నాకు తెలుసు. అప్పుడు బాధపడ్డానికేం వుంది, సంతోషం తప్ప” అంటుంది. కట్నం కోసం హోదా కోసం అతను ప్రియనే ఎంచుకున్నప్పుడు రచయిత్రి ఇలా వ్యాఖ్యానిస్తుంది ”డబ్బు తెచ్చే దర్పాన్ని కోరుకుంటూ మనిషి జీవితపు విలువల్ని దూరం చేసుకుంటున్నాడు. మానసిక ఔన్నత్యానికి, ఆనందానికి దూరం వెళ్ళిపోతున్నాడు. ఈ మార్గంలో దాహం తీరదు”. మరొక కథలో తానంతవరకూ వస్తాడని ఎదురుచూసిన బావ ప్రేమలో ఏకాగ్రత లేదనీ అతనిది చలించే స్వభావమనీ తెలుసుకున్న అమ్మాయిని అతన్ని వివాహం చేసుకో నిరాకరిస్తుంది.
ఒక కథలో ఒక యువకుడిలా ఆలోచిస్తాడు ”గృహిణి అయిన స్త్రీ విద్యావంతురాలైతే పురుషుడితో సమానంగా అన్వేషణలో మునిగి తన బాధ్యతలు నిర్వహించలేకపోతే కుటుంబవ్యవస్థ యొక్క శాంతి సంక్షేమాలకు భంగం వాటిల్లుతుందనేమో!! గ్రీకుల కళా శిఖరావాసానికి బానిసలు సోపానాలైనట్లు, మన స్త్రీలు హిందూ నాగరికతకు తోడ్పడ్డారు కాబోలు. ఈ రకంగా కొంతమంది కళాజీవులు జ్ఞానతృష్ణకలవారు ఆత్మహింసకి గురై వుంటారు”. మరొక కథలో కట్నం తీసుకున్నాడన్న ఒక అపప్రధ మూట గట్టుకున్నప్పటికీ అవసరానికి అత్తమామల్ని తన స్వంత తల్లితండ్రుల్లా చూసుకున్న అల్లుడూ, కట్నం తీసుకోకుండా మంచిపేరు కొట్టేసి అటు భార్యకీ ఇటు ఆమె తల్లితండ్రులకూ కనీసమాత్రపు సహకారం కూడా ఇవ్వని అల్లుడూ వుండి ఆదర్శాలు పేరుకేనా అనేలా చేస్తారు. స్త్రీలు పురుషులు తమ తమ వ్యక్తిత్వాలను, తమ కళాభినివేశాలను కాపాడుకుంటూ, విలువలతో కూడిన ఒక స్నేహమయమైన కుటుంబ జీవితాన్ని గడపాలని, అరవింద ఆకాంక్షిస్తారు. అటువంటి సంసారం ఇద్దరికీ అవసరమేనంటారు
శరత్, టాగోర్, రంగనాయకమ్మ నవలలు ఎక్కువగా చదివిన అరవింద ”చలంగారి గురించి గొప్ప అభిప్రాయం ఏర్పరుచుకోలేదు. ఆయన ఆడవాళ్ళని లేచిరమ్మన్నారు కానీ పరిష్కారం చెప్పలేదు. ఆయన రచనల్లో స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రంలాంటివాటికి చోటులేదు అటువంటి పరిస్థితిలో ఆడవాళ్ళను లేచిరమ్మంటే హౌ షి కెన్ ఫేస్? కానీ ఇప్పటి ఆడవాళ్ళు అన్నీ ఎదుర్కొంటున్నారు. ఆయన అంతవరకే చెప్పి వదిలేశారు” అంటారు. ఆడవాళ్లు తమ భావాలను వ్యక్తం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా వున్న రోజుల్లో కథారచన చేసిన అరవింద ఆడవాళ్ళు ముఖ్యంగా చదువుకుంటున్న యువతులు ఎట్లా వుండాలో ఆలోచించి వ్రాశారు. పురుషులుఎట్లా వుంటే బాగుంటుందో కూడా చెప్పారు. పేపర్ చదివి వ్రాయడం కాక తనకు తెలిసిన విషయాలనే వ్రాస్తాననే అరవింద కథలు వాస్తవచిత్రాలే కానీ అభూతకల్పనలు కానేకావు. ఏ.ఎస్.మణి పేరుతో కూడా రచనలు చేసిన ‘అరవింద’ అసలుపేరు అన్నంరాజు సుగుణమణి. రెండు కథాసంకలనాలలోని 36 కథలే కాక ఇంకా కొన్ని చేర్చలేకపోయిన కథలున్నాయి. 1971లో మొదటి నవల వ్రాశారు. దానికి ప్రత్యేక బహుమతి వచ్చింది. తరువాత వ్రాసిన ”అవతలి గట్టు” నవలకు బాగా పేరొచ్చింది. జలసూర్య, జీవనది, ఒక జడ అమ్మాయి అనే నవలలు కూడా వ్రాశారు. ”ప్రేమ మాతృక” అనే పిల్లల నవలకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ రచయిత్రి బహుమతి, గృహలక్ష్మి స్వర్ణకంకణం, జ్యేష్ట లిటరరి అవార్డ్‌లేకాక ఆమె కథాసంకలనానికి రచయిత్రి ఉత్తమ గ్రంథం అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం జమ్షెడ్ పూర్ లో వుంటున్నారు.
(భూమిక నుంచి)
1 comment:
chala baga rasaru !!!
Post a Comment