Tuesday, July 06, 2010

పర్పుల్ హైబిస్కస్

కొన్నాళ్లక్రితం “హాఫ్ ఆఫ్ ది యెల్లో సన్” (Half of the yellow sun) అనే నవల చదివి బాగా ఇష్టపడి అది వ్రాసినమ్మాయి గురించి,ఆమె అభిరుచులు,ఆశయాలు తెలుసుకుని ,చాలా మందికి ఆ సమాచారాన్ని అందించాను.ఇప్పుడు నాకు ఆమె వ్రాసిన మొట్టమొదటి నవల “పర్పుల్ హైబిస్కస్” దొరికింది.. ఈ నవల వచ్చి ఐదేళ్లయినా నాకు దొరికింది ఇప్పుడే.అప్పుడు దానికి కామన్వెల్త్ రైటర్స్ బెస్ట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ వచ్చింది. ఈ రచయిత నైజీరియా అమ్మాయి.పేరు చిమమండ అడిచి..”హాఫ్ ఆఫ్ ది యెల్లో సన్ “ లో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం వుండగా,ఇందులో రాజకీయాలతో పాటు జీవితానికే ఎక్కువ ప్రాధాన్యముంది.



వలస ప్రభుత్వం వెళ్లిపోయినా దాని మానసిక అవశేషాలు త్వరగా వదలవు.వలస ప్రభుత్వానంతర నైజీరియాలో ఎప్పుడూ రాజకీయ సంక్షోభమే.ఎప్పుడూ ఆర్ధిక సంక్షోభమే. అందుకు అక్కడి పాలకుల అవినీతి,తడవకొక సైనిక పాలన.ఒక “కూ” (coup)అనంతరం మరొకటి...ప్రభుత్వ వ్యతిరేకులపై తీవ్ర చర్యలు.ayitEaaaa DabbU palukubaఅయితే డబ్బూ పలుకుబడీ వున్నవాళ్లకి జీవితం సజావుగానే వుంటుంది. ఈ కధ “కంబిలి” అనే పదిహేనేళ్ల అమ్మాయి మనకి చెబుతుంది..ఈమె తండ్రి యూజీన్ సంపన్నుడు.సంఘంలోనూ చర్చిలోనూ పేరున్నవాడు.వితరణ శీలి.కట్టలు కట్టలు డబ్బు దానంచేస్తాడు.కాథలిక్ మతాన్నిపాటిస్తాడు.పరమ మత మూర్ఖుడు ..ఇంట్లో ఆయన చెప్పినట్లే అందరూ నడవాలి.ఏ మాత్రం తేడా వచ్చినా వారిపై అమలు చేసే మానసిక శారీరక శిక్షలు దారుణంగా వుంటాయి.




కంబిలి, ఆమె అన్న జాజా ఆ కఠిన క్రమశిక్షణ లో పెరిగి స్వంత ఊహలనేవి లేకుండా గొంతులో మాట పైకి రాకుండా నిశ్శబ్దం గా అదే జీవితం అన్నట్లుగా వుంటారు.వాళ్ళెప్పుడూ క్లాసులో ఫస్టే వుండాలి .లేకపోతే కఠిన శిక్ష,ఒక సారి వాళ్లమ్మను ఆయన కొట్టినప్పుడు ఆమెకి గర్భస్రావమైంది.ఆమెని భుజానేసుకుని ఆయన హాస్పిటల్ కి తీసుకుపోతుంటే ఇల్లంతా రక్తపు చార.అది చూసిన కంబిలి పరీక్ష సరిగ్గా రాయలేక క్లాసులో రెండవ స్థానానికి వెడుతుంది.దానికీ శిక్షే.యూజీన్ విధించే శిక్షలు ఎంత సున్నితంగా వుంటాయంటే పాదాలపైన మరిగే నీళ్లు పొయ్యడం కుడిచేత్తో వ్రాసుకోవాలిగనుక ఎడమ చేతి వేళ్లు చితక్కొట్టడం,బెల్టుతో కొట్టడం,నేలమీద పడేసి కాళ్ళతో కసితీరా తొక్కడం తరువాత ఏడ్చి గోలపెట్టి హాస్పిటల్ లో చేర్చడం అలాగ.తన మేనత్త ఇఫెయోమా ఇంటికి వెళ్ళేదాకా తన ఇంటికన్న భిన్నమైన ప్రపంచం ఒకటుందని కంబిలికి తెలియదు.ఆమెకు స్కూల్లో స్నేహితులు లేరు,స్కూలు వదలగానే పరిగెత్తుకుంటూ కారుదగ్గరకు రావాలి.మేనత్త నైజీరియా యూనివర్సిటీలో అధ్యాపకురాలు.తెలివికలది.ధైర్యవంతురాలు.




భర్త యాక్సిడెంట్ లో చనిపోయినా ముగ్గురు పిల్లలకి ఎంతో స్వేచ్చ ఇచ్చి పెంచింది.మేనత్త ఇంట్లో నవ్వులు,చర్చలు పని పంచుకోడం,అక్కడ పరిచయమైన యువ ప్రీష్ట్ కి ఆమెపై కల ఆపేక్ష ,కంబిలీలో చైతన్యాన్ని కలిగించాయి.జాజా లో ఆలోచననీ ధిక్కారాన్నీ రగిలించాయి.ఇంటికి రావడంతోనే మార్పుకు నాంది పలుకుతాడు. తండ్రిని ధిక్కరిస్తాడు..అక్కడనించీ దేశరాజకీయాల్లో పరిణామాలొస్తాయి.మేనత్తకి ఉద్యోగం పోయి ఆమె అమెరికా వలస పోతుంది.,కాథలిక్ గా మారక సంప్రదాయ ఆఫ్రికన్ మతాన్నే అనుసరిస్తున్న తన తండ్రి దగ్గరకు పిల్లల్ని వెళ్ళనివ్వడు యూజీన్. .తాత చిత్రాన్ని ఇంటికి తెచ్చి దాచినందుకు ,కంబిలిని పరమదారుణంగా హింసించాడాయన.చచ్చి బ్రతికింది కంబిలి.ఈ దారుణాలు ఇంక భరించలేననుకున్న కంబిలి తల్లి తన భర్తకు విషం పెట్టి చంపేస్తుంది.ఆ నింద తన మీద వేసుకుని జైలుకు వెడతాడు కంబిలి అన్న జాజా. మూడేళ్ళ అనంతరం మానసికంగా చితికిపోయిన తల్లినీ జైల్లో వున్న అన్ననూ చూసుకుంటూ అతని విడుదలకోసం ప్రయత్నిస్తుంటుంది ఆమె..తరువాత ఇంట్లో నారింజచెట్లు,రక్తనీల మందారాలు నాటాలనీ అమెరికా పోయి అత్తను చూడాలనీ ఆశతో కధని ముగిస్తుంది.అతి క్రమ శిక్షణలో గట్టకట్టిపోయిన చైతన్యం తిరిగి జీవం పోసుకోడాన్ని ,కౌమారంలోనించీ యౌవనంలో అడుగుపెడుతున్న ఆమెలో లైంగికమైన కోరికలు మొలకెత్తడాన్ని,ఇంతైనా తండ్రిని ద్వేషించకపోవడాన్ని,నైజీరియా ప్రకృతిని,అధ్భుతంగా చిత్రింcచింది అడిచి. ఈ కధ నంతా కంబిలి చేత చెప్పింఛడం కధకు వేగాన్నీ పఠనీయతనీ కూడా చేకూర్చింది.అనువాదం కాకుండా నేరుగా ఇంగ్లిష్ లో రావడాన కూడా నైజీరియన్ ఫ్లేవర్ పోనివ్వకుండా సులువుగా చదువుకోడానికి వీలైనట్లు వ్రాసింది..




ఈమె అభిమాన రచయిత చినువా అచూబె..ఆయన ఈ నవలను మెచ్చుకుంటూ అడిచి కి మెయిల్ ఇచ్చాడట,ఎప్పటికైనా నైజీరియా లో తనలా ఎంతోమంది రచయిత్రులు తయారవాలని ,వారిని మెచ్చుకుంటూ తనుకూడా మెయిల్ ఇవ్వాలనీ ఆమె ఆకాంక్ష.అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నా ఎప్పటికైనా నైజీరియాలోనె స్థిరపడాలనికూడా ఈ ముఫై మూడేళ్ల రచయిత్రి కోరిక...హార్పర్ కాలిన్స్ లో వచ్చిన ఈ పుస్తకం దొరకడం కష్టం ఏమీ కాదు.



(పాలపిట్ట మే సంచిక నుంచి)

No comments: