Sunday, January 04, 2026

     

 

                      ఖాళీలు పూరించుట  

 

పరీక్ష తప్పిన కాడి నించీ  మన పని “ ఈ కింది ఖాళీ లను సరి అయిన  క్రియా పదములతొ పూరింపుము” లాగా తయారైంది .

.” బడి లేదుగా, ఆ నాలుగు గిన్నెలూ తోమెయ్ , ఈ నాలుగు బట్టలూ గుంజెయ్ , స్టోర్ బియ్యం క్యూలో నుంచో’ అని  అమ్మ , నాకు ఆఫీసులో బాగా లేటవుతోంది. పిల్లలు స్కూల్ నించీ రాగానే కాస్త తోడు కూచోవా?  నీ ఋణం వుంచుకోనులే!” అని ప్రియమ్మ , “స్వర్ణా!  కొంచెం  అది చెయ్యవా? కొంచెం ఇది చెయ్యవా? అని ఆ మేడమ్, ఈ మేడమ్!

ప్రియమ్మ పిల్లలకి తోడు కూచుని  ఆవిడ ఆఫీస్ నించీ రాంగానే  మూడో ఫ్లోర్ నించీ మెట్లు దిగి వస్తున్నానా ,( పని వాళ్ళు లిఫ్ట్ ఎక్కరాదు) రెండో ఫ్లోర్  బాల్కనీలో  రిక్లయినర్ మీద కూచుని   ఐ ప్యాడ్ లో ఎదో  చాలా సీరియస్ గా చదువుకునే పెద్దాయన“ అలవాటుగా నవ్వి  “దా కూచో “ అని నేల చూపించాడు. నేల సుబ్బరంగానే వుందనుకో ! కూచోకుండానే “ ఏంటండీ” అనడిగా.

ఏం లేదూ , ఊరికే..”

  ఇంటికాడ పనుంది “ అన్నా

ఇప్పటిదాకా పని చేశావుగా ఇంకా ఇంటికెళ్ళి ఏం చేస్తావ్? మీ అమ్మ వుందిగా? అన్నాడు . మొన్నటి దాకా చిన్న కొడుకు దగ్గర వుండేవాట్ట .ఆయన ఏదో దేశం పోతూ ఈనని ఇక్కడ దిగాబెట్టాడంట.

తెల్లగా ఉతికి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజమా ,స్నానం చేసి  పౌడరు పట్టించిన మొహం.బట్టలెవరు ఉతుకుతారో గానీ ఎప్పుడూ మల్లెపూలే. మిశను కావన్సు .  ఇంటిదగ్గర ఉతకాల్సిన బట్టలు  గాపకం వచ్చినయ్. పొద్దున నానబెట్టినవి.

“మీరేదో సడువుకుంటున్నారుగా సదూకోండి “ అన్నాను .

“ చదువు కాదు. ఏం తోచక  సాలిటేర్ ఆడుతున్నా”

“ అదేంది?

 అది మనం ఒక్కళ్ళే ఆడుకోవచ్చులే . స రే వెళ్ళు . పరీక్షలకి చదువుతున్నావా, దగ్గర కొస్తున్నట్టున్నాయ్  “ అన్నాడు

ఏం చెప్పాలీనకి, అనేసి  హి హి హి “ అని పళ్ళికిలించి తప్పించుకొచ్చాను.

ఏదో పెద్ద ఉద్యోగమే చేసాడంట .ఇంటో కూచోబెట్టి గవర్మెంటు నెలనెలా బోల్డు డబ్బిస్తుందంట . అమ్మ అయితే నెల నెలా యిచ్చే వితంతు పెన్షన్ కోసం తెనాలి పోయి రావాలి . వేలి ముద్ర యేసి రావాలి . ఈనగారికి దానంతటదే బ్యాంక్ లో పడుద్దంట. అదేకదా మరి సదువుకున్నోళ్ళకీ సదువురానోళ్ళకీ తేడా ! సదవుకుంటే మంచి ఉజ్జోగాలొస్తయ్ డబ్బులొస్తయ్ . డబ్బులుంటేగాని చదువురాదుగదా మరి !  . పిచ్చి కుదిర్తే పెళ్ళి కుదురుద్ది పెళ్ళి కుదిరితే పిచ్చి కుదురుద్ది  అట్టాగుంది యవారం. సర్లే  ఈనతో నాకేం కబుర్లు “ అనుకుంటూ మెట్లు దిగాను

పాపం అనిపించింది కానీ ఈనతో  కబుర్లు పెట్టుకుంటే అమ్మ తిడుతుంది . కబుర్లంటే ఏవుంటయ్! సుద్దులు చెబుతూ వుంటాడు . మంచాయన పాపం .. ఏమిటో,అన్నిటికీ పాపం పాపం అనుకుంటాను .నన్నే ఎవరూ పాపం అనరు.

ఇంటికెళ్ళగానే అమ్మ తగులుకుంటుంది  పని మీద పని . ఇహ సదువూ లేదు సట్టుబండలూ లేదు . 

ఈ ఇంగ్లీషునీ, లెక్కలనీ  తగలెయ్యా.!! సందు చివర  అపార్టుమెంటులో  ఆవిడ ఇంగ్లీషూ, వాళ్ళాయన  లెక్కలూ  ట్యూషన్ చెబుతారు. కానీ వెయ్యి రూపాయలు  ఫీజు .

 నేను  ట్యూషనెట్టుకుంటా … “ అన్నాను అమ్మతో మళ్ళీ  రోజూమల్లె

 ఉరిమి చూసింది గాని ఏమనలేదు . మామూలుగా అయితే స్కూల్‌లో చదువు సరిగ్గా చెప్పని మేష్టర్లని తిట్టి పోసేదే . పెట్టుకోమంటదేమో మరి .ఇంగ్లీషు గైడ్  అయితే కొన్నాను గానీ బట్టీ రాడం లేదు . అమ్మ గారు  టీవీ లో సీరియల్ లో.ములిగి పోయారు. . నిన్నటి కోడలు విషం మింగిందో లేదో .  రౌడీలు ఇంకో అమ్మాయిని  ఏం చేశారో ఏమిటో ! ఈవిడకి చెవుడొచ్చినట్టుంది ఇల్లు పేలిపోయే సౌండ్. ఏమన్నా అంటే గయ్ మంటది .నాన్న పోయిన కాడి నించీ నోరెక్కు వైంది మహాతల్లికి . మళ్ళీ అడిగాను “ పరీక్షలు దగ్గర పడ్డయ్ ట్యూషన్ పెట్టుకుంటా ..”

“డబ్బులు లేవు “

“తరవాత ఇస్తామని చెబుదాం .ఒప్పుకుంటదేమో.”

“ తరవాత నీ తాత ఇస్తాడా ఎట్టా?

తిక్క రేగింది .

“నేనేట్టయినా పరీక్ష పాసవాలి  

 “గైడ్లు కొన్నావు గదే నిన్న కాక మొన్న ! కూచుని  చదివి చావు .బోల్డు పరీక్ష ఫీజు కట్టావు “

“ గైడ్లు  నా కు అర్థం కావట్లేదంటే వినవు”

“ ఎందుకు అర్థం కావు బుర్ర పెట్టి చదువు  అయినా పరీక్ష పాసయి ఏం వొరగ బెడతావు?

టీవీలో ఎవరో  పెద్దగా ఏడుస్తున్నారు .అమ్మ ఇక మన మాట వినిపించుకోదు.

నెల కాడి నించీ  ప్రియమ్మ పిల్లలకి కాపలా కూచుంటున్నానా ?  అప్పుడేమో నీ ఋణం వుంచు కోను స్వర్ణా అని మరీ మరీ చెప్పింది .అసలు ఆ ఋణం ఎంతో ఏమిటో ఇప్పటిదాకా చెప్పదు. తనదగ్గర మిగిలి పోయిన  సల్వార్ కమీజు లిచ్చినా ఇస్తుంది  మహా తెలివి గలది . ఛీ! ఛీ !నాకే తెలివి లేదు . ఏదైనా ఖచ్చితంగా అడగాలి. ఇంగ్లీషు టీచరమ్మ లాగా. .మీ క్లాసులో కాసేపు కూచుంటానండీ అని దేబిరించానా ! డబ్బులిచ్చి కూచోమంది .ఆవిడకి తొంభై సార్లు అవసరానికి పాల ప్యాకెట్లు ,చుట్టాలోస్తే టిఫిన్లు తెచ్చి పెట్టా .అసలు ఇస్వాసం లేదు . చచ్చినా ఈవిడకి ఒక్క  పని చెయ్యకూడదు . అవునూ ఈ అమ్మ  మహా తల్లి నేను ఇంట్లో వుంటున్న కాడినించీ ఎంత పని చేయిస్తోంది నాతొ ? తను ఆ పనే బయట చేసి డబ్బులు సంపాయిస్తోంది . రేపటాల నించీ చూసుకో ! ప్రియమ్మ ఋణం సంగతి తేలుస్తా .అమ్మ సంగతి కూడా తేలుస్తా .పరీక్ష పాసవాలి. తప్పదు.టెన్త్ పాసు కాలేదని వంక పెట్టి ఎవడ్నో ఒకడ్ని చూసి ముడెట్టేస్తుంది.ఆ తెలివేందో నాకు తెలుసు.

.నాతొ పాటు చదివిన స్నేహితుల్లో సగం మంది  అన్ని సబ్జెక్టులూపాసయి కాలేజిలో చేరారు .ఒకమ్మాయి నారాయణకి కూడా పోయింది.అంతంత మనకొద్దు గానీ ఇంటిదగ్గర  గవర్మెంటు కాలేజీ ఫరవాలేదు .ఒకపూట వెడితే చాలు.ఫీజూ తక్కువే.పెళ్లి తప్పించుకోవచ్చు .అక్కని చూస్తున్నా గదా ! ఏడిచి చస్తా వుంది .

అనుకున్న రేపు రానే వచ్చింది .

“ నువ్వున్నావని నిశ్చింతగా పని చేసుకుంటున్నాను ఆఫీస్ లో “ అంది ప్రియమ్మ .

“నాకు అర్జంటుగా అయిదొందలు కావాలి మేడం .రేపటినింఛీ ట్యూషన్ లో చేరాలి సగం కడితే రానిస్తదేమో  ఆ మేడం “ అన్నాను.ఆవిడ ఒక నిమిషం మాట్లాడక ,పిల్లల కోసం తెచ్చిన సమోసాల్లో ఒకటి  నాచేతిలో పెట్టింది.

.సమోసా బాగుంది . పిల్లలకి ఫ్రిష్ గా  వుండాలి కదా .

 ఆవిడ ఎవరికీ వెంటనే సమాధానం చెప్పదు .ఒక నిమిషం ఆగుతుంది .

“ అర్జెంటుగా అయిదొంద లంటే కష్టం .పోనీ ఒక రెండు వందలిస్తాలే .ట్యూషనన్నావుగా తక్కినది తరవాతిస్తానను “ అంది .ఇంకో సమోసా చేతిలో పెట్టి “తిను “ అంటూ .అంటే ఈవిడ గారి ఋణం రెండు వందలన్న మాట .నెల  రోజుల కాడి నించీ ఈ కోతులకి కాపలా కాస్తున్నా .ఒళ్ళు మండింది .

.”నాలుగో ఫ్లోర్ లో వుండే పద్మకి పనమ్మాయి మానేసిందట నువ్వు ఖాళీగా వున్నావుగా! కొంచెం చేసిపెట్టు పాపం డబ్బులు  బాగానే ఇస్తుంది .” అని సలహా ఇచ్చింది

 పద్మమ్మ కేదో ఉద్యోగం . .అప్పుడప్పుడూ ఆవిడకీ ఏదో ఒక పని చేస్తూనే వుంటాం . ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకర్థం అయింది .నాకు వేరే పని రాదు. అంట్లు తోమటం బట్టలు గుంజటం తప్ప . నేను పరీక్ష పాస్ కావాలంటే నాకు ట్యూషన్ తప్పదు.ట్యూషన్ పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి .అమ్మ ఇవ్వదు .పాపం తన దగ్గర కూడా లేవు.నేనే ఎదో ఒకటి చెయ్యాలి  . అందరికీ డబ్బులు లెక్కే . నాకు మాత్రం కాదా? పద్మమ్మ పనికి పెట్టుకుంటుంది ,కానీ అద్మాన్సు ఇస్తదో లేదో! ఈ అపార్ట్ మెంటులో మాకు  మంచివాళ్ళమని  పేరు .అంటే నేనూ మా అమ్మా ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాం . ఇచ్చిన దేదో తీసుకుంటాం. సుబ్బరంగా వుంటాం . మా అమ్మ నామీద  మా అన్న మీద గయ్ మంటది గానీ బయటోల్లని ఏమనదు .మరి మా మంచితనం ఇంగ్లీషు టీచరమ్మ కి పనికి రాలేదు. ప్రియమ్మకి  చేతులు రాలేదు .పద్మమ్మకి పనికొస్తుందో  లేదో చూద్దాం .

 అడిగాను.పనికి రమ్మంది .అడిగిన జీతం ఇస్తానంది . మరి అడ్మాన్సు మాటో!!

“ ఇవ్వాళ్టికివ్వాళే అడ్వాన్సంటే ఎట్టాగే ! అయినా, సార్ ని అడగాలి . రేప్పొద్దున పనిలోకి రా  ..నువ్వడిగిన జీతం ఇస్తా .పదిరోజులన్నా కానియ్ అడ్వాన్స్ కి “ అందావిడ .” సార్ ని అడగాలనేది వీళ్ళ అమ్మమ్మల కాడి నించీ  వున్న యిషయమే గదా!

“ మా అమ్మ నడిగి రేపు చెప్తా మేడం ..”అన్నాను నేను కూడా తెలివిగా .

“అదేం వద్దనదులే, డబ్బులు చేదా ఏం ?” అని,

‘ ఈ పరీక్ష పాసై ఏం చేస్తావే? ఏదైనా పని నేర్చుకో .ఎంత చదివితే ఉద్యోగాలోస్తాయ్ ! నీకు తెలుగు చదవటమే సరిగ్గా రాదు ఇంగ్లీషు  స్పెల్లింగులు రావు. ట్యూషన్ చదివితే మాత్రం లాభం ఏమిటి డబ్బు దండగ “ అనికూడా అంది పాపం. అందరిదీ ఒకటే మాట. నిజమే నేమో  కానీ నాకే  మనసొప్పడం లేదు.! ఇన్నేళ్ళు స్కూలు కెళ్ళి ఆ చదువు  పూర్తి చెయ్యకుండా, కనీసం టెన్త్ పాసవకుండా ..స్పెల్లింగులు రాకపోతే నేర్చుకోనా ? ఎప్పుడూ ఇట్టాగే వుండాలా?

  .పద్మమ్మ ఇంటికాడి నుంచీ ఆలోచిస్తూ మెట్లు దిగుతూంటే తెల్ల బట్టల పెద్దాయన ఇంకా బాల్కనీలోనే వున్నాడు . నవ్వాడు .

“ నేను రేపు బెంగుళూరు వెడుతున్నా “ అన్నాడు ,ఎందుకు సార్ అని అడక్కముందే “ హోమ్ లో చేరుతున్నా “ అన్నాడు .

“అయ్యో ‘ అన్నాను గభిక్కిన

“ అయ్యో ఎందుకు ? అక్కడ నా ఫ్రెండ్స్ వున్నారు . మంచి పార్క్ వుంది . అన్నీ బాగున్నాయి. వీళ్ళకేదో పరువు తక్కువ అని,ఎవరో ఎదో అనుకుంటారని  నన్ను ఇక్కడ బంధించారు .పాపం మొన్నటిదాకా పిల్లల్ని పెంచారు .చదివించారు.ఉద్యోగాల్లో కష్టపడ్డారు .వాళ్ళకీ రిటైర్మెంట్ దగ్గర పడుతోంది .నాకోసం మాకోడలు పత్యం వంట చేయించాలి . కని పెట్టి చూడాలి. ఆఫీస్లో బాద్యత గల ఉద్యోగం .కష్టపడి ఇంతదాకా వచ్చింది.  పాపం తనకీ సుగరూ మోకాళ్ళ నేప్పులూను .   . ఇప్పుడు వాళ్ళని కాస్త హాయిగా వుండనీ, అని ఒప్పించాను. ఎవరో ఎదో అనుకుంటారని  మనం కష్టపడ కూడదు..ఏమంటావు ? ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నయ్ .రోజూ మాట్లాడుకోవచ్చు” .”ఎట్టా ఆలోచిస్తున్నాడీన! అదివరకు అమ్మ పని చేసిన ఇంట్లో ఇట్టాంటి ముసలాయనే వుండేవాడు . తనతో రోజూ కాసేపు కబుర్లు చెబితే డబ్బులిస్తాననేవాడు. కనపడితే చాలు వచ్చి కూచోమనే వాడు . అక్కడి నించీ మొదలు . తను ఎంత తెలివిగాలవాడో, ఎంత గొప్పవాడో, ఎన్ని గోల్డ్ మెడల్సో,లెక్కల్లో నూటికి నూరు మార్కులు ,ఇంగ్లీష్ లో క్లాసు ఫస్టు ,పిల్లల్ని ఎంత బాగా చదివించాడో ,వాళ్ళావిడ ఎంత మంచిదో ,తనకి ఎంత సుగరో ఎంత బి పి నో  ..అయ్ బాబో ! గొప్పలే గొప్పలు! నెప్పులే నెప్పులు.  రెండు రోజులయినాక అర్థం అయింది .ఆయనకీ కబుర్లు వినిపెట్టటానికి  మనిషి కావాలి .చెప్పటానికి కాదు. “నాకేం డబ్బులొద్దు. కబుర్ల బదులు నాకు లెక్కలు చెప్పండి సార్” అన్నానా మళ్ళీ పిలవలేదు. ఈ తెల్లబట్టల పెద్దాయన  తన గురించి ఏమీ చెప్పడు పాపం .  పనులు చేసుకుంటూ చదువుకుని గొప్ప వాళ్లైన వాళ్ళ గురించి చెబుతూ వుంటాడు .

మేం కష్ట పడుతూనే వున్నాం సార్! పైకి రాడం లేదు మరి!!

“ కష్టపడడం కాదమ్మాయ్ ,దానికి తగ్గ ఫలితం వుండాలి .అవతల మనిషి నిన్ను ఊరికే ఉపయోగించుకో కూడదు .బ్రతుకు తెలివి వుండాలి. పట్టుదల వుండాలి   “ అని మళ్ళీ  కాసిని కబుర్లు చెప్పాడు . అప్పుడప్పుడూ ఆయనకీ ఇంగ్లీషు పేపర్ తెచ్చిపెట్టాను .మారీ బిస్కట్లు తెచ్చి పెట్టాను అంతే. పాపం ఆయన నా ఋణం ఎప్పుడూ వుంచుకో లేదు .నన్నూ ఒక పాకెట్ తెచ్చుకోమనేవాడు .ఆ సుత్తి బిస్కెట్లు నాకొద్దు సార్ అంటే నీకేం కావాలో తెచ్చుకో అనేవాడు.

ఇప్పుడు మనం ఇంగ్లీషు మేడం చేతులో రెండు వందలు పెట్టి రేపటి నించీ  క్లాసుకు రమ్మంటదేమో  అడగాలి. లేదంటదనుకో, పద్మమ్మ తో పా టు ఇంకో ఇల్లు పని చేసి డబ్బు దాచుకుని, మార్చికయినా మళ్ళీ ఫీజు కట్టి చదవాలి .పరీక్ష ఎట్లాగైనా పాసవాలి. ఖాళీలని క్రియా పదాలతో పూరించడం అంటే అది .డబ్బులోచ్చే క్రియా పదాలన్న మాట ..అనుకుంటూనే మెట్లు దిగుతున్నానా పై నుంచీ  ప్రియమ్మ పిలిచి, “రేపోస్తావుగా “ అంది .నేను కూడా ఆవిడ లాగానే ఒక నిమిషం ఆలోచించి “ చూస్తా మేడం” అన్నా,వస్తా మేడం అనకుండా .*****

పి.సత్యవతి

 

 

 

 

 

 

 

  

 

Friday, January 02, 2026

 

  

 

 

అయితే ఏంటంట!

 

 

”మీరే కాలేజీ అండీ?”

ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది  ,కౌంటర్ దగ్గర కార్ట్ పట్టుకుని నిల బడ్డ స్వర్ణ.

ఏకాలేజీ ?

ఏ కాలేజీ లేదు .అయినా మీకెందుకు?

అనాలనుకుంది కానీ అనలేదు 

అనబుద్ధికాలేదు .ఆ జీన్స్, ఆ టీ షర్టు, ఆ నున్నటి మొహం , బహుశా అమెరికా నుంచీ వచ్చాడేమో !

సమాధానం కోసం చూస్తున్నాడు.

నవ్వుదామనుకోలేదు, తెలీకుండానే నవ్వింది.

నాపేరు విజయ్! రోజు చూస్తూ వుంటా మిమ్మల్ని”

మీరు అంటున్నాడు తనెవరో తెలీకో, సంస్కారమో!

రోజూ చూస్తా అంటున్నాడు మరి తనెవరో తెలిసి వుండాలి కదా

సర్లే మనకెందుకు .

.మీరు బాగుంటారు అంతా మీ అమ్మగారి పోలికే “

అమ్మగారు ..  అవునా ? తను అమ్మగారి పోలికా ?అమ్మ పోలికా . తెల్లగా వుంటుంది ,అందుకని కాబోలు

నవ్వకూడదు అనుకుంటూనే మళ్ళీ నవ్వింది.

బిల్లుకట్టి ఇంటికొచ్చినా తన వెనక నిలబడ్డ తెల్లటి నున్నటి మొహం మీదుగా తాకిన  సెంటు వాసన వెంటాడుతోంది. 

 అమ్మగారికి చిల్లరతో  సహా లెక్క చెప్పి కాస్త కుదుటపడ్డాక అద్దంలో చూసుకుంది . ఆవిడకీ తనకీ పోలికేమిటి ? రంగు తప్ప .తన బట్టలు చూసుకుంది . కూరగాయల మార్కెట్ దగ్గర, సూపర్ మార్కెట్ లో మగపిల్లల వేధింపులు తెలిసినవే . అమ్మ, అమ్మగారూ జాగ్రత్తలు చెబుతూనే వుంటారు. ఈయన తననేం వేధించలేదు . కానీ వెంటాడుతున్నాడు.పాల బూత్ దగ్గర .సందు చివర ,అక్కడా ఇక్కడా .

. చూసి నవ్వుతాడు పలకరిస్తాడు .ఒకరోజు చెప్పింది తన ఉద్యోగం సంగతి .

 “ దానిదేం వుందండి మీరంటే నాకిష్టం “ అన్నాడు.

రెండిళ్ళ అవతల ఎదురు  మేడమీద గదిలో వుంటాడు.అతనితో పాటు స్నేహితుడూ వుంటాడు. స్నేహితుడు తనని ఎప్పుడూ పలకరించలేదు.ఇతను పలకరిస్తూ వుంటాడు.

మాటలు నడుస్తున్నాయి . 

నీలాంటి అందమైన మంచి మ్యానర్సున్న అమ్మాయి మాలాంటి ఇళ్ళల్లో వుండాలి. నిన్ను చూస్తె జాలి నాకు. అందుకే ఇష్టం కూడా .చాలా కష్ట పడతావు పాపం అన్నాడు.జాలితో పుట్టిన ఇష్టం అన్నమాట.

మీరనడం మానేశాడు 

తనని కూడా నువ్వు అనమన్నాడు . తను కాదంది .మీరు అనే అంది .

నీ పుట్టినరోజు ఎప్పుడూ” అనడిగాడు.

ఫలానారోజు.వద్దనుకుంటూనే చెప్పింది.

ను వ్వు పుట్టిన రోజున నీకు తగిన బట్టలు వేసుకోవాలి . ఒకరు వేసి తీసినవి కాదు.నా గిఫ్టు నువ్వు కాదన కూడదు. అన్నాడు

మనం హోటల్లో డిన్నర్ చేద్దాం. నువ్వు కాదనకూడదు” అని కూడా అన్నాడు.

మా అమ్మ చంపుతుంది”

నాకోసం రావాలి తప్పదు “

ఈ డ్రెస్ వేసుకుని రావాలి నీ పుట్టిన రోజుకి”

వద్దండి అమ్మ చంపుతుంది “

నిన్ను చంపడమేనా మీ అమ్మపని!  అమ్మగారిచ్చారని చెప్పు “ నవ్వాడు ,నవ్వితే బాగుంటాడు.

మనసు యుద్ధం చేసింది వద్దు ,వెళ్ళు మధ్య ,పద్దెనిమిదేళ్ళ వయసుకి , పొగడ్తలకి ,కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడడానికీ , నున్నటి తెల్లటి చదువుకున్న మనిషికీ  , అప్పుడప్పుడూ ఐస్ క్రీములకీ, . తనమీద బోలెడంతజాలికి  .

ఆ నవ్వుకి  మరీ !

వెళ్శు వెళ్ళు వెళ్ళు వెళ్ళు.

హోటల్ బాగుంది ఏమి తింటోందో తెలియకపోయినా ఇట్లా ఈ డ్రెస్ వేసుకుని ఈయనతో ఇక్కడ తినడం బాగుంది.తనేదో తప్పు చేస్తున్నానని అనిపిస్తోంది అయినా ఫరవాలేదనీ అనిపిస్తోంది.ఉక్కిరిబిక్కిరిగా వుంది.

ఈయన తనని ప్రేమిస్తున్నాడా

ఇంటికొచ్చి అమ్మకి సవాలక్ష అబద్ధాలు చెప్పి,

అంతమంచి డ్రెస్ జాగ్రత్తగా మడత పెట్టి దిండుకింద పెడితే , దిండుకింద డ్రెస్ కలలై తెల్లవార్లూ వేధించిం ది. .నిండా ఫర్నిచర్తొ గాలాడే మంచి అపార్ట్మెంట్ లొ తను .  . ముందు తగువుపడ్డా తన మంచితనానికి కరిగి దగ్గరైన అత్తమామలు , అద్దెకొంప వదిలేసి తనదగ్గర కుదురుకున్న అమ్మ ,

 అచ్చు సినిమాలలో వచ్చే కలలాంటి కల.ఒక్క డాన్సు తప్ప

“నీకు వంటొచ్చా?” అన్నాడు ఒక రోజు

“భలే ! ఎందుకు రాదు? అమ్మగారికి వంట్లో బాగా లేకపోతే నేనేగా వండేది” అంది

అవునా! ఒక పని చేద్దాం .రేపు నా రూమ్మేటు వూరెడుతున్నాడు .మనిద్దరం సరదాగా వంటచేసుకు తిందాం. రేపు ఆదివారమేగా వచ్చెయ్” 

మళ్ళీ మనసులో యుద్ధం

వెళ్ళు వద్దు వెళ్ళు వద్దు వెళ్ళు వద్దు 

ఆదివారం పొద్దున పాలబూత్ కి  వెళ్ళినప్పుడు

అతను కనపడ్డాడు ,విజయ్ స్నేహితుడు

నేను విజయ్ రూమ్మేట్ ని. నేను వూరెళ్ళడం లేదు”

అని సీరియస్ గా చెప్పేసి పోయాడు.అతనికి తెలుసన్న మాట.

కాస్త ఆశాభంగం.

వీడికేదో వాసన వచ్చింది. అందుకే వూరు మానుకున్నాడు .అసూయతో కుళ్ళుకుంటు న్నాడు. ఎంత కష్ట పడి ఎంత డబ్బు ఖర్చుపెట్టి ఒక దారికి తెచ్చుకున్నాడు ఈ పిల్లని. అందినట్టే అంది చెయ్యి జారిపోయింది. అయితే ఏంటంట ! మన కున్నది ఈ ఒక్క ఆదివారమేనా?” అనుకున్నాడు విజయ్.మరో ఆదివారమైతే వచ్చింది కానీ అవకాశమే రాలేదు.

పదిరోజుల తర్వాత ఆతను కనపడకపోతే  రెండిళ్ళ అవతల మేడమీద గదికి తాళం వేసి వుండడం చూసింది.

వాడికి చెన్నై లో ఉద్యోగం వచ్చింది నిన్ననే గది ఖాళీ చేసి పోయాడు. అక్కడ ఇంకో అమ్మాయి దొరుకుతుందిలే కాలక్షేపానికి . “ అన్నాడు స్నేహితుడు వ్యంగ్యంగా. కావాలని తను సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఏదో కొనడానికి వచ్చినట్టు వచ్చి. ఈ మధ్య ఇతను కూడా మాటలు కలుపుతున్నాడు . .ఇతను ఇంకొకమాట కూడా అన్నాడు

అంతస్తులుంటయ్ పిల్లా! అవి దాటి నమ్మకూడదు . సినిమాల్లో తప్ప “ బోలెడు జాలి ఒలకబోస్తూ.

ఉలిక్కిపడింది.

తట్టుకుని సాగడానికి కొన్నాళ్ళు  పట్టింది.

మళ్ళీ పాల బూత్ దగ్గర కనపడ్డాడు స్నేహితుడు.ఏవో మాటలు చెప్పాడు  కొన్ని మంచివే! అమ్మ ఎప్పుడూ చెప్పేవే .

”నమ్మడం  నీ వయసుకు సహజమే .మనుషులంతా నువ్వనుకున్నంత అమాయకులేం కాదు.ఆదివారం వంట కార్యక్రమం తప్పినందుకు  సంతోషించు . నీలాంటి అమ్మాయిలంటే నాకు జాలి.అందుకే వూరికి వెళ్ళడం మానుకున్నాను. నీకోసమే .నిన్ను పెద్ద ప్రమాదం నించి కాపాడడం కోసం.పాపం చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు. “ టెంత్ దాకా లాగింది కనుక ఆ ఇంగ్లీష్ మాటకి అర్థం తెలుసు.

 ఓహో ! ఇతనికి కూడా జాలి మొదలైంది కాబోలు !

పోతే పోయాడులే! ఇంతలో ఏం మునిగి పోలేదు.  మా మేడం అంటూ వుంటుంది ప్రతి పోరాపాటూ ఒక పాఠం అని, నీ జాలికి  చాలా చాలా .థాంక్స్ బ్రో .” అంది స్వర్ణ కొత్తగా నేర్చుకున్న భాషలో.

పి.సత్యవతి