Thursday, May 24, 2018

ఫోన్లు



                                 ఫోన్లు ఆగిపోయాయి .
ఉదయం పదకొండు గంటలకో సాయంత్రం నాలుగు అయిదు గంటల ప్పుడో ల్యాండ్ లైన్ మోగుతుంది .ల్యాండ్ లైన్ కి ఇద్దరు ముగ్గురు తప్ప ఫోన్ చెయ్యరు .చాలా తప్పుడు పిలుపులు వస్తాయి అందుకని నేను తియ్యను. శాంతి తీస్తుంది .పరుగెత్తుకుంటూ వచ్చి “సుబ్బరామయ్య గారు లైన్లో వున్నారు “అంటుంది .వారం రోజుల నాడు మాటల సందర్భంలో “సుబ్బరామయ్య గారు ఫోన్ చేయ్యట్లేదేం “అనడిగింది.అయ్యో నేను చేసి వుండాల్సింది అని కాస్త పశ్చాత్తాప పడ్డానే కానీ చెయ్యనే లేదు.సంజాయిషీలు లేని ఇటువంటి తప్పిదాలకి సుబ్బరామయ్య గారు నా మీద అలిగారు .నేను ఫోన్ చెయ్యాలనే పాటికి ఆయన వెంటిలేటర్ లోకి వెళ్ళిపోయారు..ఫోన్ చేసినప్పుడల్లా “ఒక్క సారి రా అమ్మాయ్ “అంటారు .నన్ను ,మానాన్న, మావూరి వాళ్ళు తప్ప ఎవరూ అమ్మాయ్ అనరు .నేను అమ్మాయ్ ని కాను అమ్మమ్మని. అయినా సుబ్బరామయ్య గారు ఎప్పుడూ నన్ను సత్యవతి గారూ అనో సత్యవతి అనో అనరు  .అమ్మాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు .ఉద్యోగాలూ పిల్లల్ని పెంచే బాధ్యతలూ సంఘ సేవలూ ఏవీ లేని నాకు కూడా తీరిక వుండదు .అట్లా లేకుండా చేసుకుని బ్రతికి వున్నానేమో .కొన్ని అనారోగ్య కారణాల వలన ఎట్లా అంటే అట్లా ఒక ఆటో ఎక్కేసి ఎక్కడికీ గభిక్కిన పోలేను .సౌకర్యాలు కావాలి .అందుకే  ఆయన ఇల్లు చాలా దగ్గరే అయినా అమ్మాయి ఆయన్ని చూడ్డానికి వాయిదాలు వేసి తనేం తప్పు చేసిందో తెలుసుకుంది. ఇంక నాతొ పలకరు. ఫోన్ చెయ్యరు .విజయవాడలో ఇద్దరం ఎప్పటినుంచో వున్నాం .కానే ఒక పదేళ్ళ నుంచే మా స్నేహం .పలకరింపులు. కలుసుకోడాలు .ఒక్కొక్క సారి చాలా అమాయకంగా కనిపిస్తారు.ఒక్కొక్క సారి ఆవేశంగా మాట్లాడతారు ‘ఒక సారి ఒక యువరచయిత గురించి మాట్లాడుతూ “అబ్బ! ఏం వ్రాస్తాడమ్మాయ్! ఆ మాండలికం ! అద్భుతం అనుకో ! చదివావా నువ్వు “ అని సంతోషంగా ఊగిపోతారు .సాహితీ లోకంలో అక్కడక్కడా కనపడే అసూయలు, ఎవరినైనా చిన్న బుచ్చే మాటలు ఆయనెప్పుడూ మాట్లాడరు. సహరచయిత్రులందర్నీ అమ్మాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు  .పేరు తెచ్చుకుని అందరి మెప్పు అవార్డులూ తెచ్చుకున్న రచయిత వృద్ధాప్యం అనారోగ్యంతో  ఎక్కడికీ స్వయంగా పోలేని పరిస్థితిలో కొంత విచారంతో ,ఎప్పుడు ఎవరు వచ్చి పలకరిస్తారా అని ఎదురు చూస్తూ గడిచింది  విజయవాడలో ఆయన్ని గురించి పట్టించుకోని వారూ వెళ్లి చూడని వారూ లేరు .అందరి మిత్రుడు .ఇంత  అనారోగ్యం వున్నా ఏటా తనపేర అవార్డులు ఇవ్వడానికి చాలా శ్రమ పడతారు .ఆయన కథల గురించి నేను ప్రత్యేకం ఇప్పుడు ఏం చెప్పాలి ? దేశమెరిగిన రచయితకదా? ఏపని మీద విజయవాడ వచ్చినా ఆయన్ని చూడకుండా ఏ రచయితా తిరిగి  వెళ్ళిపోరు  .అంత గౌరవాన్ని  ప్రోది చేసుకున్నారు ఆయన . పదేళ్ళ క్రిందట తోడుగా వచ్చిన సహచరి ని చేసుకున్న  గీతారాణిగారికి  సానుభూతి అనడం కూడా పేలవమే . ఒక్కసారిగా కమ్ముకొచ్చిన దుఃఖం నుంచీ బయట పడాలి ఆమె.సుబ్బరామయ్య గారి గురించి  “ వుండేవారు “ అని ఎప్పుడూ అనుకోలేను. ఆయన వున్నారు .వుంటారు. .వృద్ధాప్యం మృత్యువూ తప్పవు .వాటిని కాస్త సౌకర్యవంతంగా వుండే ఏర్పాటు చేసుకోడం లొ తప్పులేదు అవసరం కూడా అని నేను గ్రహించాను . మెడికల్ కాలేజికి దేహాన్నిచ్చి ఏవగింపు కలిగించే  కర్మల నుంచీ  ఆయన తప్పించుకోగలిగారు. బందువులనూ తప్పించ గలిగారు .విద్యార్థులకి సాయ పడ్డారు.ఆయన  కల్పించుకున్న సౌకర్యం అదే .మంచిపని చేశారు సర్ .
పి.సత్యవతి