హ్యాండ్ మెయిడ్స్ టేల్
ఆ మధ్యన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో
చాలా వారాల పాటు “హ్యాండ్ మెయిడ్స్ టేల్ “
కనపడితే కొంత ఆశ్చర్యం కలిగింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కినాక మళ్ళీ “1984”
వంటి పుస్తకాల అమ్మకాలు పెరిగాయని చదివాను
. ఆంగ్ల సాహిత్యంలోని ప్రసిద్ధ డిస్టొపియన్ నవలలలో మార్గరెట్
అబ్ వుడ్ వ్రాసిన
ఈ నవల ఒకటి ,మార్గరెట్ అట్ వుడ్ ప్రఖ్యాత కెనెడియన్ రచయిత్రి .బుకర్ విజేత.
యుటోపియా భవిష్యత్తు ను గురించిన ఒక సుందర స్వప్నమైతే డిస్టొపియా ఒక భయంకర దుస్వప్నం .ఒక రాజకీయ
సామాజిక భయంకర నియంతృత్వ .పీడన గురించిన భయాందోళన . 1980 లలో అమెరికాలో వచ్చిన స్త్రీవాద వ్యతిరేకత,
బ్యాక్ లాష్ ,ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ల సందర్శన మత రాజ్యాలను గూర్చిన అధ్యయనం ఈ నవలకు
ప్రేరణ అట.అమెరికాలో కనుక మతచాందసవాద రాజ్య వ్యవస్థ వస్తే స్త్రీల,ఇతర మైనారిటీల
పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయో అనే ఊహ తొ 1985 లొ వ్రాసిన నవల .భయం కొల్పే దైనా
ఆలోచింప జేసే నవల .
అమెరికాలొ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి మతవాద విప్లవంతో అక్కడ “గిలియడ్” పేరుతొ ఒక క్రిష్టియన్ మత చాందస వాద
రాజ్య వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రభుత్వాన్ని
స్వాధీనం చేసుకున్న వీళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేసి .ఒక నిరంకుశ మిలిటరీ ప్రభుత్వాన్ని స్థాపించారు .పౌర
హక్కులని హరించారు.. ముఖ్యంగా స్త్రీల హక్కులని కాల రాసారు.పురుషస్వామ్య కుటుంబ
వ్యవస్థను స్థిరీకరించారు..స్త్రీలకు పుస్తక పఠనం ,బ్యాంక్ అకౌంట్లూ ఉద్యోగాలూ
కార్లూ నిషెధం విడాకులచట్టం రద్దు.వేరే మతస్థులు మత మార్పిడి కి అంగీకరించకపోతే
దేశం నుంచి తరిమి వెయ్యడమో ఉరితియ్యడమో చేసారు. నల్లవారిని వారి మూల దేశాలకు
తరిమేశారు. స్త్రీవాదులను మురికి కూలీ చేసే కాలనీలకు తరలించారు.స్త్రీలందరికీ వారి
వారి హోదాలని బట్టి దుస్తులను నిర్ణయించారు .సౌందర్య సాధనాలు నిషేధించారు, ప్రజలలో
సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతున్నది కనుక ఉన్నతాధికారులైన తెల్ల వారి వంశాలను వృద్ది చెయ్యడం కోసం సంతానం లేనివారికి
పిల్లలను కని ఇవ్వడానికి హ్యాండ్ మెయిడ్స్
ను ఏర్పాటు చేసారు.రాజ్యం దృష్టిలో
పిల్లలు లేకపోవడానికి లోపం భార్యలదే! అట్లా ఒక కమాండర్ ఇంట్లో హ్యాండ్ మెయిడ్ గా కుదిరిన
స్త్రీ
కథనమే ఈ నవల .ఫ్రెడ్ అనే కమాండర్ కు హ్యాండ్ మెయిడ్ గా వచ్చిన ఈమెను ఆఫ్ ఫ్రెడ్ (Offred)
అని పిలుస్తారు ఇంక వీళ్ళకు పూర్వపు పేర్లు
వుండవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త,చిన్నారి కూతురూ ,ఒక ఉద్యోగం బ్యాంక్ అకౌంటూ
వున్న జీవితం ఆమెది .ఈ విప్లవం వచ్చాక కెనడా పారిపోవాలనే ప్రయత్నంలో ఆ కుటుంబం
ప్రభుత్వం చేతికి చిక్కింది.ప్రభుత్వం దృష్టిలో .ఒక భార్యకు విడాకులిచ్చి ఈమెని చేసుకున్నందుకు
అతను నేరస్తుడు .అతని భార్య అయినందుకు ఆమె శీలంలేని మనిషి .వారిబిడ్డ అక్రమ సంతానం
.ఆమెకు పునరుత్పత్తి శక్తి వుంది కనుక
హ్యాండ్ మెయిడ్ క్రింద శిక్షణ ఇచ్చి ఒక కమాండర్ ఇంట్లో ప్లేస్మెంట్ ఇచ్చారు ఆ
తరువాత ఆమె తన కుటుంబాన్ని మరి చూడలేదు భర్త ఏమయ్యాడో తెలియదు కూతురు సంగతి
తెలియదు.గిలియడ్ మతరాజ్యంలోని నిరంకుశ నిత్య కృత్యాలు, చిత్ర వధలు ఉరితీతలు, ఊరి నడిబొడ్డున
ఆ శవాలను గోడమీద వేలాడ దియ్యటాలు, యజమానితో బలవంతపు యాంత్రిక సెక్సు ,యజమాని భార్య
అధికారం ఇవ్వన్నీ కంటికి కట్టిస్తుంది ఆఫ్ఫ్రెడ్
(offred-of-fred) .తన భర్తకు సంతానోత్పత్తి శక్తి లేదని తెలుసుకున్న భార్యలు ,హ్యాండ్ మెయిడ్స్ ని ఇంకొక పురుషుని దగ్గరకు రహస్యంగా పంపించి పిల్లలను కనిపిస్తారు .అట్లా
ఆఫ్ఫ్రెడ్ ను తన డ్రయివర్ నిక్ దగ్గరకు
పంపుతుంది యజమాని భార్య. వేరొక వైపు .గిలియడ్ ను కూలదొయ్యడానికి “మేడే” అనే
రహస్యోద్యమం జరుగుతూ వుంటుంది .ఆ ఉద్యమంతో సంబంధాలున్న వాళ్ళని బహిరంగంగా చిత్రవధ
చేసి చంపేస్తారు స్త్రీలయితే ఆత్మ హత్య చేసుకున్నారని ప్రకటిస్తారు . నిక్ తొ ఆఫ్ఫ్రెడ్
కి కొంత చనువూ సాన్నిహిత్యం ఏర్పడతాయి యజమానురాలు చెప్పినదానికన్నా ఎక్కువసార్లు
అతన్ని కలుస్తూ వుంటుంది. అట్లాగే భార్య సమక్షంలోనే హ్యాండ్ మెయిడ్ తొ సంభోగం చేసె
యజమాని ఆమె ముఖం చూదకూడదు. .కానీ కమాండర్ రహస్యంగా ఆమె ను కలుస్తూ వుంటాడు
పుస్తకాలు ఇస్తూ వుంటాడు ఆమెను తీసుకుని ఒక బ్రోతల్ కి వెడతాడు. కమాండర్స్ కోసం
వారి వినోదం కోసం బ్రోతల్స్ వుంటాయి .పిల్లలను
కనలేకపోయిన హ్యాండ్ మేయిడ్స్ ఇతర సాంఘిక కట్టుబాట్లను పాటించని స్త్రీలను
పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్స చేసి ఇక్కడ నియమిస్తారు ,వీరికి తప్ప అందరికీ ఇటువంటి చికిత్సలు నిషేధం ఇదంతా
భార్యకు తెలుస్తుంది .ఇక తనకు శిక్ష తప్పదనుకున్న ఆఫ్ఫ్రెడ్ ఆత్మహత్య కు ప్రయత్నిస్తుంది.శిక్ష అంటే బహిరంగ
విచారణ ,తరువాత కాలనీలకు పంపడం అక్కడ
దుర్భరమైన వాతావరణం.ఆ సమయంలో ఆమెకోసం ఒక నల్ల వ్యాను వస్తుంది .అది దోషుల కోసం ప్రభుత్వం
పంపే వ్యాను. అది నిక్ పంపిస్తాడు ‘ఫరవాలేదు వెళ్ళు’ అంటాడు నిజానికి అతను రహస్యోద్యమంలో పనిఛేస్తున్న
వ్యక్తో, ప్రభుత్వ ఉద్యోగో ఎవరికీ తెలియదు. ఆ ఇంటినుంచీ వెళ్ళిపోవడం తనకు విముక్తో శిక్షో తెలియని
పరిస్థితిలో వ్యాన్ ఎక్కుతుంది ఆఫ్ఫ్రెడ్ .కొంత కాలానికి గిలియడ్ కూలి పోయి ప్రజాస్వామ్యం మళ్ళీ సర్వ మానవ హక్కులతో
వస్తుంది చాలా కాలం తరువాత గిలియడ్ సమాజం
పై పరిశోధన చేస్తున్న ఒక ప్రొఫెసర్ కి ఆఫ్ఫ్రెడ్
రికార్డ్ చేసి పెట్టిన టేపులు దొరుకుతాయి వాటిలో నుంచీ ఈ కథని నిర్మిస్తాడాయన. ప్రపంచం కుడి వైపుకు
జరుగుతోన్న సందర్భంలో ఈ నవల ను పంచుకోవాలని పించింది.
పి
సత్యవతి
ఆంధ్రజ్యోతి
వివిధ చదివిన పుస్తకం 12 6 2017
No comments:
Post a Comment