Friday, April 26, 2013

సప్త వర్ణ సమ్మిశ్రితమ్



            సప్తవర్ణ సమ్మిశ్రితమ్
  తోటలో కూరగాయలు కోసి ఇంటికొచ్చిన స్వర్ణకి,ఇంటి ముంగల పెద్ద గుంపు ఎదురైంది. అమ్మలు పిన్నులు అత్తలు అమ్మమ్మలు ,ఒకరా ఇద్దరా పేటలొ ఆడాళ్లంతా ప్రేమలతమ్మ స్కూటరుచుట్టూ పోగయ్యారు .ఆవిడొచ్చిందంటే ఏదో ఒక మీటింగ్ పెడుతుంది .అప్పటికి మీటింగ్ అయిపోయినట్టే వుంది ఆలోచించుకోండి తల్లులూ అనేసి బర్రున ఒక కిక్ కొట్టి దుమ్ము రేపుకుంటూ పోయింది.మీటింగ్ కాడ కూసున్న  అమ్మ ముసలమ్మ మాట మర్సిపోయింది కామాల, ఆంగారి(ఆమెగారి) దగ్గర ఒకటే కంపు .తన్ని చూసి
ఒసే స్వర్నా ఇట్టారావే అనిపిలిచింది
బెండకాయలు కోసి రావడంతో ఒళ్ళంతా నూగు.ఒకటే దురద ,తొందరగా తానం చేద్దామనుకుని పోన్లే పాపంఅని ముసలమ్మ పక్కబట్టలు మార్చింది .నులకమంచంమీద ప్లాస్టిక్ ఎరువుల సంచీలు ఉతికి కుట్టిన పట్టా ,దానిమీద ఒక బొంత, బొంత మీన పాతచీరె. .పట్టా తప్ప అన్నీ తడసి కంపు కంపు...ఆమెకట్టుకున్న చీరె ముద్దైపోయింది .విసుక్కుంటూ జాలిపడుతూ అంతవరకూ ఆమెను పట్టించుకోని తల్లిని తిట్టుకుంటూ ఎట్టాగో ముసలమ్మకో పొడిచీరె కట్టి పట్టా మీద రెండు చీరెలు పక్కేసి పడుకోబెట్టింది.
ఆ మీటింగేందో ఆరా తియ్యకుండానే స్నానానికి పోయింది స్వర్ణ. అన్నాలప్పుడు అమ్మ మొదలెట్టింది
 సుబ్బారావు సార్ అనే ఒక సారు ముసలాళ్లకి సేవచేసే సమస్థ ఒకటెట్టాడంట. అందులోకి పద్దెనిమిది ఇరవై అయిదేళ్ళ మద్దె పిల్లల్ని తీసుకుని నర్సు ట్రెయినింగ్ ఇస్తాడంట . జబ్బు పడి మంచానున్న ముసలాళ్ల దగ్గర పెడతాడంట. పిల్లల తిండీ తిప్పలూ అన్నీ ఇంటిగలాళ్ళయ్యేనంట .నెలకి నాలుగువేలిస్తాడంట ఇంటి పన్లేం చెయ్యక్కర్లేదంట .అంటే అంట్లూ బట్టలూ ఇల్లూడ్చడం అట్టాంటియన్నమాట .ముసలాళ్లని సూసుకుంటే సాలంట. మన జిల్లాలో ఇప్పటికే ఇరవైమందిపిల్లలు సేరారంట.అంది
ఏందీ అంతమంది పిల్లలకి ఖాళీలుంటయ్యా? అన ఆశ్చర్యపోయాడు నాన్న
మరి ఇప్పుడు డబ్బులున్న ముసలాళ్లకి ఇంటో మనుషులు చెయ్యడానికి టైం వుండట్లేదంట. అందుకే ఇట్టా మనుషుల్ని పెట్టుకుంటున్నారని ప్రేమలతమ్మ చెప్పింది
అంటే మంచాన పడ్డాళ్లకి ఒకటికీ రెండుకీ కూడా బాగు సెయ్యాల్నా ఎట్టా? అన్నాడు నాన్న
మరి ఆస్పత్రుల్లో నర్సులు ఆయాలూ చెయ్యట్లేదా? అట్టాగే .నర్సులకైనా ఇంతేనంటగా ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇచ్చేది .పైగా తిండి కర్చుండదు.కావాలంటె  సబ్బులకీ నూనెలకీ పోడర్లకీ పేస్టులకీ అని ఓ రెండు మూడొందలు పోయినా నెలకి నిఖార్సుగా మూడేల పైన్నే వస్తయ్ .ఓ ఏడాది బ్యాంక్ లో ఎట్టినా ఏదైనా ఖర్చుకు వస్తయ్ .ఏమంటావే స్వర్నా?అంది
అప్పటికే ప్రేమలతమ్మ అమ్మకి మంత్రం వేసేసింది.
నేనెక్కడికీ పోను .వచ్చే సమ్మత్సరం కాలేజీలో చేర్తాను. అయినా గానీ ఇంటో ముసలమ్మని ఒదిలిపెట్టి బయటోళ్ళకి సెయ్యాలేంటీ? అంది స్వర్ణ గట్టిగానే .
  సాల్లే ఊర్కో! ఇంటో ముసలమ్మ కి నేంగాక ఎవరు సేస్తున్నారేంటి ? మీ అత్త మొగుడికి డాబాఇల్లుంది. సంపాయిస్తున్నాడు.ఒక్కనాడైనా తల్లిని తీసుకెళ్ళిందా? ఆంగార్ని మేం చూస్కోపోతే ఎవరు చూస్తున్నారెట్టా? మహా ఈ పూట పక్క ఏసావు అంతేగా? అంది తల్లి
ఆ వరసన వారానికొకపాలి ప్రేమలతమ్మ రాడం, పేటలో అమ్మలందరికీ మంత్రవెయ్యడం చివరికి ఒక పదిమంది దాకా సుబ్బారావు సార్ సేవా సమస్థ లో చేరడం అయింది.
ఇదెంత మంచి పని! పెద్దాళ్లకి సేవ చేస్తే పుణ్యం కూడా అని అమ్మ తల్లులు తలాడించారు. ముఖ్యంగా మగ పిల్లల వేధింపుల బెడద లేకుండా ఆడపిల్లలు నాలుగు గోడల మధ్య వుండి వాళ్ల తిండి గడుపుకుని పెళ్ళి ఖర్చుకు సంపాయించకోడం నచ్చింది.
మేనమామలు మేనత్త కొడుకులు కూడా కట్నాలడిగే పిదప కాలం వొచ్చింది. పెళ్ళి కర్సులు లక్షల్లోకి రాడం ఇంతకుముందెరుగుదుమా? కట్నాలకి తోడు ఈళ్ళకి అందచందాలు కూడా కావాలిప్పుడు పోనీ సదువు చెప్పిద్దామంటే ఆ పదో క్లాసు గండం గట్టెక్కదాయె! అదెట్టాగో గట్టెక్కి ఇంటర్లో జేరిస్తే, ఇహ అక్కడ్నించీ బండి కదలదు .ఏం సదువులో ఏమో ! ఉత్తరం సదివి సెప్పడానకి ఒకేమైన ఆయాసపడిపోతారు ఇంటో కూసోబెట్టే సక్తి లేక పనికి పంపితే పొలాలెంబడ కూరగాయల తోటలెంబడ పొద్దుట్నించీ సందేళ దాకా కంపన బడ్ద కాకులాలె  ఎండకి మాడి నల్ల కప్పేసి పోతున్నారు ఇప్పటి టీవీలొచ్చి పడ్డకాడ్నించీ పిల్లలకి కర్చులు ఊ పెరిగిపోయినయ్.పెదాలు పగలకుండా ఒక టూబు .మొహంతెల్లబడ్డానికో టూబు .రేతిరి పడుకునే ముందొక టూబు !ఓయ్ నాయనోయ్ !ఎన్నడెరగం ఈ ఇడ్డూరం అంది ఒక తల్లి  
  ఇదంతా ఆ మాయదారి టీవీ వలే దాపరించింది ..దొడ్డో ఉన్న కుంకుడు చెట్టు కాయలు పనికి రావు.  జుట్టు మెరిసిపోయే సాంపూలు గావాలి. ఏదో పెళ్లికో పండక్కో కాదు ఊరూరికే గోరింటాకు కొనిపెట్టుకోటం ఒక సోకు కాదు నాతల్లో!. తింటానికి అదివరకటి పప్పలు పనికిరాడంలేదు నూడిల్సంట అయ్యి గావాలి,. ప్రేమలతమ్మ సెప్పినట్టు కొన్నాళ్ల పాటు నీడపట్టునుండనియ్ . అనేసి ఒక బ్యాగూ ఒక సెల్ ఫోనూ కొనిచ్చి ఒక అయిదొందలు చేతిలో పెట్టి సాగనంపారు.  పొద్దునా సాయంత్రం ఫోను చేస్తూ వుండమని  ఏ కష్టం వచ్చినా చెప్పమనీ రెక్కలుకట్టుకుని వచ్చి వాల్తామనీ మరీ మరీ చెప్పారు.సెల్ ఫోన్ లో ఎఫ్ ఎం రేడియో యియర్ ఫోన్లూ కూడా వుండేట్టు తెచ్చిచ్చాడు నాన్న.స్వర్ణెమో బజారుకెళ్ళి ఆరువారాల్లో తెల్లబడే క్రీమొకటి ,ఒత్తుగా జుట్టు మొలిచే వాసన నూనె సీసా ఒకటి, పుట్టిన పిల్లలకు పదేళ్లొచ్చినా పెళ్ళికానిపిల్లల్లా వుండడానికే తయారుచేసిన సబ్బులొక నాలుగూ, పట్టులాంటి జుట్టుకోసం ఒక డజను షాంపూ ప్యాకెట్లూ ,తలనెప్పి బామ్ డబ్బా ,సానిటరీ నాప్కిన్లూ  పౌడరు డబ్బా ఒకటి, నాలుగైదు తలకు పెట్టుకునే పిన్నులు కొనుక్కొచ్చుకుంది .వాటితో పాటే కాసిని చూయింగ్ గమ్ లు నాలుగు చాక్లెట్లూ తెచ్చుకుంది ఆ దెబ్బతో నాన్నిచ్చిన ఐదొందల్లో చాలావరకు అయిపోయాయి.
అదిగో అట్టా వచ్చిపడింది స్వర్ణ ఈ గచ్చకాయ ముసలమ్మ దగ్గిరకి .ఆవిడకేదో పేరుందిలే తను మాత్రం ఇట్టా చెప్పుద్ది తన ఫ్రెండ్స్కి  ఇంతకీ ఈ గచ్చకాయ మామ్మ కథేందంటే ఈ మామ్మకి ఎనభైఅయిదేళ్ళంట.  మునుపు కొడుక్కాడ ఉండేదంట .కోడలు అమ్రికా పోతూ ఈవిడ్ని ఇక్కడ కూతురికాడ కుమ్మరించిందంట. ఆర్నెల్లకి కోడలు రాంగానే మళ్ళీ ఈవిడ అక్కడ కెళ్ళిపోతుంది.మామ్మ కూతురికి ఏదో ఉద్దోగం. టిప్పుటాప్పుగా ఉంటది.  జుట్టుకి రంగేస్తది ఆఫీస్ నుంచీ రాంగానే టీ తాగేసి ఒక పది ఫోన్లు మాట్టాడి టీవీ కాడ సెటిలై పోద్ది. ఆవిడ ఇంటికొస్తేనే టీవీ....ఆఫీసుకి పోతూ టీవీ గది తాళం వేసుకు పోద్ది . మూణ్ణెల్లకి రిటైరై పోద్దంట . అల్లుడేం చేస్తాడో తెలీదుగానీ మంచోడు.ముసలమ్మని సక్కగా పలకరిస్తాడు. అత్తమొగుడూ వున్నాడు నాయనమ్మని గుమ్మంలోకిరానీడు.
                                   ****
 నిండు కెంపు రంగుకి పచ్చిపసుపు రుద్రాక్షల అంచు! అంచుకు చిన్న చిన్న కొండలు ..నేనేమో  చామన ఛాయ! నాకు ఆ చీరె నప్పుతుందా లేదా అని ఎంత తటపటాయించానో కానీ కట్టుకుంటే ఎంత బాగుందో ..ఆరోజుల్లో ఆ కంచి పట్టుచీరె ఎంతనీ! నూటయాభై అంతే ..
ముసలమ్మ కళ్ళుమూసుకుని తనలో తనే మాట్లాడుకుంటోంది..  పదోక్లాసు దాకా తెలుగు మాధ్యమంలో చదివిన స్వర్ణకి తెలుగు రంగులు అర్థంకావు.ముసలమ్మ ఎప్పుడూ ఇట్టాగే అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. పద్యాలు కూడా అప్పజెబుతుంది.కూనిరాగాలు తీస్తుంది.అందుకని వింటున్నట్టే నటిస్తూ తల ఊపుతూ చెవిలో యియర్ ఫోన్లు పెట్టుకుని సెల్ ఫోన్లో పాటలు వింటూ వుంటుంది.స్వర్ణ...ఆవిడొక సారి ఆ సంగతి కనిపెట్టి చేత్తో దగ్గరకు రమ్మని సైగ చేసింది.
కాసిని మంచినీళ్ళిస్తావేమో అని పిలుస్తున్నా, ఇందాకటినించీ .నువ్వు చెవిలో పాటలు పోసుకుంటున్నావు కదా అందుకని చేత్తో పిలిచా! ఇకనించీ ఇట్టాగే పిలుస్తాలే ! నా ఎదురుగా కూచుని వింటూండూఅంది చాలా శాంతంగా
మీరు ఎర్ర టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంది స్వర్ణ ,టాబ్లెట్ తెచ్చి మంచం దగ్గర నిలబడి.అవిడ మళ్ళీ ఏదో గచ్చకాయ రంగు గురించి ఎత్తుకుంది
మందేసుకో మామ్మా!అంది స్వర్ణ ,కాస్త విసుగ్గానే..ముసలమ్మకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇట్లా కళ్లల్లోనో ముక్కులోనో నీళ్ళొస్తే గబుక్కున పమిటతో తుడుచుకునే అలవాటు.  వాయిల్ చీరెలు  ఎంత మెత్తగా వుండేవో! ముక్కు పమిటతో తుడుచుకుంటే మా అత్తగారు తిట్టేది... అత్తగారు చీరెలోనే తనువు చాలించింది.ఇష్టమైన మానుగాయిరంగు జరీ చీరె కట్టించుకుని మరీ.నార పీచు జుట్టుని నాచేతే దువ్వించుకుని ముడేయించుకునేది అంటూ, పమిటకొంగు కోసం తడుముకుని అది లేకపోగా  రుమాలు కోసం పక్క మీద చూసింది
మందేసుకో మామ్మా! ఎంత సేపిట్టా  పట్టుకు నుంచోవాలి? అంది స్వర్ణ ఈ మానుగాయీ గచ్చకాయీ మొదలుపెడితే ఆపదు ముసలమ్మ
నాకు ఒక రుమాల కావాలి,కళ్ళు తుడుచుకోడానికి. అంది ఆవిడ జీరగా ..
ఇక్కడ రుమాళ్ళేమీ లేవు మరి ..
సరేలే అవ్వే లోపలికి పోతయ్ నీళ్ళు! టాబ్లెట్ ఇవ్వు అంది ఆవిడ గబిక్కిన టాబ్లెట్ మింగేసి ఒకపనైపోయిందన్నట్టు మళ్ళీ పడుకోబోతూ
మళ్ళీ పడుకోకు మామ్మా! నువ్వు అన్నంతినాలిప్పుడు .నీకు ఖచ్చితంగా పన్నెండింటికి టాబ్లెట్ వేసేసి అన్నంపెట్టమన్నారు మేడమ్ .. అని  ఆవిడ మొహం చూడకుండా పళ్ళెంలో అన్నం పెట్టుకొచ్చింది..
చూడూ పిల్లా ! నేనిదంతా ఇవ్వాళ తినలేను.నాకు బాగాలేదు .మీ మేడమ్ అడిగితే తిన్నానని చెప్పు..నాకు మజ్జిగన్నం చాలు. మిగిలింది పడెయ్
స్వర్ణ ఏమీ అనలేదు .తిన్నది చాల్లే .అనుకుంది. మజ్జిగ అన్నం తినేసి పిల్లా  నా అలమార తీసి అందులో లేత అరిటాకు పచ్చ మంగళగిరి చీరుంటుంది తెచ్చి నాకు కప్పు అంది
అదేంటి మామ్మా!చెమట పోస్తా వుంది కదా?
నాకు వంటిమీద చీరె లేకపోతే తోచదు .అదంతా నీకెందుకు? చెప్పినట్టు చెయ్ నీక్కావాలంటే ఫ్యానేసుకో అని కొంచెం విసుక్కుని కళ్ళు మూసుకుంది
అదివరకు పనిచేసిన చోట ముసలమ్మకి గౌన్లంటే చాలా ఇష్టం.వయసులో వున్నప్పుడు రాత్రి పూట వేసుకోవాలని చాలా అనుకునేదంట .కాని వాళ్ళాయన అసలొప్పుకోలేదంట. ఒంటిమీద ఎంత హాయిగా వుందో  అని మురిసిపోయేది. ఏంటో ఖర్మ! ఈ ముసలమ్మల్తో వుండీ వుండి నేనూ ముసిల్దాన్నయి పోతున్నాఅనుకుంది. స్వర్ణ.ఇక సాయంత్రం ఏ నాలుగింటికో రెండు బిస్కెట్లూ కాస్త కాఫీ ఇచ్చేదాకా ఈవిడ తన జోలికి రాదు బాత్రూమ్ ఒస్తే తప్ప. బాత్ రూమే మరీ కష్టం . లోపలకెళ్ళేదాకా ఆగదు .మధ్యలోనే దిగబడి పోతుంది.  తనకి మూడురోజులదాకా కడుపులో  తెములుతుంది. అన్నం తినబుద్ధికాదు. నాయనమ్మ పక్క మార్చడానికి ఎంతవిసుగొచ్చేదో ! పాపం! ఎట్టావుందో ఏమో!
ఏమిటో పిల్లా ఇట్టా అయింది నా పరిస్థితి ..పాపం నిన్ను కష్టపెట్టాను అని  ముసలమ్మకూడా సరిగ్గా తిండి తినదు.కడుపు మాడ్చుకుంటుంది. నీరసమొచ్చి నోట్లో మాట రాదు అప్పడు మేడమ్ బాగా కేకలేస్తుంది.  అదివరకు ముసలమ్మ స్వర్ణని బాగా ఏడిపించింది. ఆ యింటి వాళ్ళు కూడా అంతే .ఒకటే గసిరేసేవాళ్ళు.తిండికూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. పోనీ ముసలమ్మనైనా బాగా చూసేవాళ్లు కాదు. ఆవిణ్ణీ గసిరేవాళ్లు ..  అస్తమానమూ పదివేలు వొదులుతున్నయ్ మాకు అనేవాళ్ళు...వాళ్లకి వొదిలేది నిజమే కానీ తనకొచ్చేదెంత? అందులో సగమే కదా. సుబ్బారావు సార్ తనకిచ్చేది ! అప్పుడు సార్ తో ఏడ్చి మొత్తుకుంటే ఇక్కడికి మార్చాడు .ఇక్కడ ఫరవాలేదు. కానీ ముసలమ్మ బాత్రూమ్ తోనే కంపు. ఒప్పుకున్నప్పడు చెయ్యాల్సిందే.. కావాలంటే గ్లవ్సూ మాస్కులూ  అడుగు అని సార్ కోప్పడ్డాడు. అవును కదా మరి ఆవిడని చూసుకోడానికే కదా ఇన్నేసి వేలు గుమ్మరిస్తున్నారు వాళ్ళు..
స్వర్ణకి బాగా విసుగొస్తోంది. ఈవిడ కొడుకింటికి వెళ్ళిపోంగానే తనూ ఇంటికెళ్లిపోవాలి. ఇంకొద్దు బాబోయ్ ఈ ఉజ్జోగం పొలంపనే హాయి . ముసలమ్మ మళ్ళీ తనలో తనే మాట్లాడుకుంటోంది. ముసలమ్మ ఎప్పడూ రంగులగురించి కలవరిస్తూ వుంటుంది గచ్చకాయా మానుగాయ ఇటికరాయ,మిరప్పండెరుపు ,పెసర పచ్చ ,నెమలిపింఛం, తోపురంగు నిమ్మపండు వంగపువ్వు, నారింజ ,పచ్చిపసుపు ముదురునీలం  రత్నావళి బచ్చలిపండు అరటిపువ్వు  ,అయ్య బాబోయ్! ఏం భాషో ఏం లోకమో !  తను చేత్తో పిలిస్తేనే రమ్మని చెప్పింది కదా! అంతలోనే స్వర్ణకి  సునీత నుంచీ ఫోన్ వచ్చింది .ఆ పిల్ల వున్న చోట  ముసలాయన మొదటిరోజు ,తాతయ్యాఅని పిలిస్తే తిట్టాడంట . ఎవడే నీకు తాతయ్య! నన్ను సార్ అని పిలు అని గుడ్లురిమాడంట. నవ్వుకుంటు చెప్పింది. .ఆయనకి తాతయ్య సార్ అని పేరు పెట్టింది
,.పేషంట్లు మీ స్వంత తాతయ్యా మామ్మలనుకోండి,వాళ్ళని ప్రేమగా చూడండి ఎపుడూ విసుక్కోకండి .నవ్వుతూ వుండండి. అంటాడుకదా మన సారు, గాడిద గుడ్డేం కాదూ! సగం డబ్బులు ఆయన పోసుకుంటాడు పిల్లలకేమో సుద్దులు చెబుతాడు అసల్కి మనం ఈనకి సంపాయించిస్తున్నట్టు కనపడతాంది నాకు.. .నేనింకుండను జీతమియ్యంగానే ఎల్లిపోతా .సునీత చాలా కబుర్లు చెప్పింది.ఈ ఫోన్ గాని లేకపోతే ఈ పాటికి పిచ్చెక్కిపోను అనుకుంది స్వర్ణ..ఇట్టాగే సాయంకాలం మేడమ్ వచ్చేదాకా కాలక్షేపం ,ఫోన్లు రాకపోతే ఎఫ్.ఎం రేడియో
.. ఉక్కగా వుంటే చీరె కప్పావెందుకూ అంది మేడమ్ వస్తూనే తల్లి గదిలో కొచ్చి
ఆవిడే కప్పమన్నారండి .నీకెందుకు చెప్పినట్టు చెయ్యమన్నారండి అంది స్వర్ణ
ఆయన పోయినప్పుడు మాతమ్ముడు నాకు తెల్లచీరె తెచ్చి పెట్టి ఒకే మైన ఏడ్చాడు. నేను తీసుకోలేదులే వాణ్ణి బాగా తిట్టి పంపించాను. అప్పుడే ఒక తెల్ల గౌను వేసుకుని.  గుండు కొట్టించుకుంటే పుణ్యం వచ్చేదంటావా? ఏమిటో అప్పుడు నాకు పుణ్యాల మీద నమ్మకం లేదు మరిఅంది ముసలమ్మ కళ్ళు మూసుకునే
పొద్దుటాల్నుంచీ నుంచీ ఇట్టాగే మాట్లాడతా వున్నారండి.అందిస్వర్ణ. మేడమ్ మొహం చిన్నబుచ్చుకుంది.వచ్చి తల్లి పక్కమీద కూచుని అమ్మాఅని పిలిచింది ఆవిడ పలకలేదు
అమ్మా! కాఫీ తాగావా?అంది మళ్ళీ .ముసలమ్మ మాట్లాడలేదు. అమ్మ నా మీద అలిగింది. ఆవిడ సౌకర్యం కోసమే కదా నేను ఇట్లా చేశాను..పోనీలే ..నువ్వు తాగలేదంటే నాకూ వద్దు .నేనూ తాగను, అని మంచం మీదనుంచీ లేవబోయింది .ముసలమ్మ కూతురు చెయ్యి పట్టుకుని పిల్లా అమ్మాయికి కాఫీ తెమ్మని వంటామెకి చెప్పు ..నాక్కూడా రెండు చుక్కలు ఇవ్వమను .పాలు తక్కువ డికాషన్ ఎక్కువ చక్కెర వద్దు అంది .చీరె వంటినిండా కప్పుకుని లేచి కూచుంటూ.
మామ్మ గారు రుమాలు అడిగారండి నాకు కనపడలేదు.ఉంటే రెండు ఈ గదిలో పెట్టండిఅంది స్వర్ణ. అయ్యో ! ఇప్పుడే పెడతాలే! భోజనం చేసిందా మరి అలిగి కూచుందా? అంది కూతురు తల్లి కి దగ్గరగా జరిగి
స్వర్ణ చెప్పేలోగానే అందుకుని ఎందుకు చెయ్యనూ ! చేశాను..అంది ముసలమ్మ
వెళ్ళి  నీ పని చూసుకో పో! నేను బాగానే వున్నాన్లే ! ఇప్పుడేకదా వచ్చావూ ...పిల్ల వుందిగా నాదగ్గర ..వెళ్ళు అని కూతురి నడుంమీద చెయ్యి వేసింది ముసలమ్మ. మేడమ్ వెళ్ళిపోయింది. మళ్ళీ తనూ ముసలమ్మా ఎఫ్,ఎం రేడియో, ఫొనుల్లో కబుర్లూ .
ముసలమ్మ ఉన్నట్టుండి కళ్ళు తెరిచి చేత్తో సైగ చేసి పిలిచింది. బాబోయ్ బాత్ రూమేమో  అనుకుని స్వర్ణ గుండె గుభేలుమంది దేవుడి మందిరంలో ఒక గంట వుంటుంది మేడమ్ నడిగి పట్రా పో అంది! అమ్మయ్య! కానీ ఇప్పుడు గంటెందుకో! పద్యాలకి తోడు గంట మోగిస్తూ కూచుంటుంది  కామాల. 
పోయి టీవీ చూసుకో పో .నాకు అవసరమైతే గంట మోగిస్తా ,వద్దువు గాని .గంట వినిపించుకో అంది . పోనీలే !ఇంక తిండి వేళ దాకా పిలవదు.ఈ లోగా దేవుడుదయవుండి బాత్ రూమ్ రాకుండా వుంటే !!
   ఉన్నదేదో తిని టీవీలో సీరియల్ మీద సీరియల్, ఆతరవాత  పాత తెలుగు సినిమా దాకా చూసీ చూసీ నిద్రకిపడ్డం! పొద్దున అమ్మ నడ్డిమీద రెండిచ్చి లేపేదాకా నిద్రే నిద్ర.!రేతిరి ఈ ముసలమ్మ ఎన్ని సార్లు లేపుతుందో! మంచినీళ్ళంటది , బాత్ రూమంటది. ఒకసారి చలి  పుడుతోంది ఫ్యాన్ తియ్యమంటది.ఒకసారి ఉక్కపోస్తోందీ ఫ్యాన్ వెయ్యమంటది. పగలు ముసలమ్మ నిద్ర పోయేటప్పుడు కాస్త పడుకుందామంటే ఫోన్లొకటి.
టీవీలో మేడమ్ రాత్రి ఎనిమిదిన్నరకి చూసే సీరియలొచ్చింది. ఆ సీరియల్ తను టెంత్ లో వుండగా మొదలైంది. తను రెండేళ్ళు తప్పినా అది మాత్రం వస్తోందన్నమాట .అప్పుడు గంట కొట్టింది మామ్మ .స్వర్ణకి చాలా కోపమొచ్చింది.  తప్పదుగదా! వెళ్ళి చూసేసరికి మామ్మ కళ్లనిండా నీళ్ళు. రెండు వేళ్ళు చూపించి బాత్ రూమ్ కి తీసుకెళ్లమని లేచి మంచం మీద కూచునేలోగానే బట్టలు పాడైపోయాయి .గదంతా ఒకటే వాసన.  మేడమ్ ఇంట్లో లేనప్పుడైతే ముసలమ్మని కాస్త కోప్పడి వుండేది.ఏ మాటకామాటే చెప్పాలి ఈ ముసలమ్మ తన మీద మేడమ్ కి సాడీలేం చెప్పదు .స్వర్ణకి ఏడుపొచ్చింది.ఏడూస్తూనే అలమార్లొనించీ గ్లవ్సూ మాస్కూ తీసుకుని ఆవిడ బట్టలు విప్పించి అదంతా శుభ్రం చేసి ఆవిడకి  కొత్త గౌను తొడిగి ఇంకో చీరె కప్పి పాడైపోయిన బట్టలు పంపుకింద కడిగి, సబ్బూడేట్టాల్ లో నానబెట్టి..తను వెళ్ళి స్నానం చేసొచ్చేసరికి సీరియలేకాదు వార్తలు కూడా అయిపోయాయి. అప్పటికే అమ్మకి భోజనం ఆలస్యం అయిందని కోపం వచ్చింది మేడమ్ కి.తను పెట్టొచ్చుకదా! 
 స్వర్ణకి అన్నం సహించలేదు.భళ్ళున వాంతి వచ్చింది  ప్రేమలతమ్మ  గొంతు పిసికేద్దామనిపించింది..
ముసలమ్మ పడుకుంది .బెడ్ లైట్ వేసి కాస్త దూరంగా మడత మంచం వేసుకుని  పడుకుంది స్వర్ణ.. ఎవరో ఏడుస్తున్న ట్లనిపించి ముసలమ్మ వైపు చూసింది .ముసలమ్మే ఏడుస్తోంది
ఏమైంది మామ్మా? ఎక్కడైనా నొప్పా? మేడమ్ ని పిలవనా? అంది దగ్గరగా వెళ్ళి
ఇంతకాలం బ్రతకడమే పెద్దనెప్పి ఇంకా ఎంతకాలం బ్రతకాలో అని ఏడుపొచ్చింది.నువ్వు పడుకో పో ! నాకే నెప్పీలేదు స్వర్ణకి పడుకోబుద్ధి కాలేదు  ముసలమ్మ చాలా సేపు ఏడ్చింది. ఆవిడమీద చిరాకు కలగక పోగా గమ్మత్తుగా తనకీ కళ్ళెంట నీళ్ళొచ్చాయి
ఏడవకు మామ్మా!మనచేతుల్లో ఏముంది! అంది. ఆరిందలాగా
అందర్నీ ఇబ్బంది పెడుతున్నాను. నిన్ను కూడా ! పాపం చిన్న పిల్లవి
. నాకేం ఇబ్బంది లేదులే మామ్మా! నా ఉజ్జోగం అదేగా!నువ్వు పడుకుని నిద్రపో ... అంది. తన గొంతులో మెత్తదనానికి ఆశ్చర్యపడుతూ. ముసలమ్మ మాట్లాడలేదు.స్వర్ణకి కూడా నిద్ర రాలేదు. నాయనమ్మ గుర్తొచ్చింది. రేపు ఇంటికి ఫోన్ చెయ్యాలి  ఈ సారి జీతంలో నాయనమ్మకి ఒక మంచి దుప్పటీ ఒక మెత్తని దిండూ కొనాలి అనుకుంది. నిద్ర మాత్ర పని చేసినట్టుంది ముసలమ్మ కాసేపటికి కళ్ళుమూసుకుంది. అసలు దీనంతటికీ కారణం తనా అని ఉలిక్కిపడింది స్వర్ణ. ఆ మధ్య ముసలమ్మకి నాలుగు రోజులపాటు విరేచనాలై జ్వరంకూడా వచ్చింది.అప్పుడు చీరెలు విప్పడం కట్టడం వాటిని ఉతకడం పెద్ద చావై పోయింది. అప్పుడే మేడమ్ ఈవిడ వేషం మార్చింది.క్రాఫు కొట్టించి నైటీలు వెయ్యడం మొదలుపెట్టింది అప్పట్నంచీ ఈవిడ తిండి తగ్గించేసింది. చనిపోతే బాగుండనుకుంటోంది కామాల పాపం!  చీరెలకోసం ఇంత దుఃఖమా? అని ఆశ్చర్యం వేసింది.అయ్యో పాపం అనిపించింది
 ఏం మామ్మా  ఇయ్యాళ  తానం చేసి గచ్చకాయా,మానుగాయా ఇటికరాయా వంగపువ్వా నిమ్మపండా ,బచ్చలిపండా? తెల్లవారి నవ్వుకుంటు అడిగింది
నీకు విసుగ్గాలేకపోతే కాసేపు నీతో మాట్లాడనా? అంది  ఆవిడ
అయ్యో మాట్లాడు మామ్మా! రేత్రి నువ్వేడిస్తే నాకు శానా దిగులేసింది ..
 అయితే విను .ఇప్పుడు నాకు ఎనభై అయిదేళ్ళు .పదిహేనో ఏట పెళ్ళైంది .పెళ్ళికాంగానే పరికిణీ ఓణీలు మాన్పించి చీరెలు కట్టించారు.చదువుమాన్పించారు. నాకు వంటపని లేదు. అందరికీ అన్నీ అందించేపని. నా అంతట నేను ఏపనీ చెయ్యకూడదు .చెప్పింది చెయ్యాలి.ఏదైనా చెయ్యాలనుకుంటే అడిగి చెయ్యాలి. అడిగినదానికి ఎప్పుడూ అనుకూలసమాధానం రాదు. చదువుకోడానికి పుస్తకాలు లేవు .హాయిగా నవ్వుకోడానికి మనుష్యులు లేరు. అట్టా వుండేది. ఏం చెయ్యాలో తెలిసేదికాదు. మా పుట్టింట్లో చాలా మొక్కలుండేవి .మా నాన్నకి మొక్కలంటే ఎంతిష్టమో . ఆయన  ఎక్కడెక్కడ్నించో పూల మొక్కల విత్తనాలు తెచ్చేవాడు. కనకాంబరం వుందంటే అందులో లేతరంగు .మళ్ళీ సౌందర్య కనకాంబరం అని ముదురురంగు. పసుపుపచ్చ, చంద్రకాంతాలైతే పదిరంగులుండేవి. రాధామనోహరాలూ మందారాలెన్నిరంగులో ఎక్కడెక్కడినించో తెచ్చేవాడు.మా వాకిలీ పెరడూ రంగుల ఇంద్రధనసులా వుండేది! నాకా రంగులు చూడ్దం చాలా ఇష్టంగా వుండేది.నేనూ మా పెద్ద చెల్లీ ఏదైనా ఒక మొక్క మొగ్గ తొడిగిందంటే అది విచ్చేవరకూ రోజూ  కనిపెట్టుకుని చూస్తూ వుండేవాళ్లం. ఆఖరికి జిల్లేడుపూల రంగుకూడా బాగుండేది మాకు ఎప్పుడు మొక్కల మధ్యే వుండేవాళ్ళం..ఈ రంగులమీద ప్రేమ ని నేను చీరెలమీదకి మళ్ళించుకున్నానేమో తెలీదు.మా అత్తవారింట్లో పేపర్లూ పుస్తకాలూ కొనరు. సంగీతం వినరు.కలిసి కూచుని మాట్లాడుకోరు వాకిలీ పెరడూ అంతా గచ్చు. ఒక పూలకుండీ కూడా కొననివ్వరు ..కానీ బాగా బట్టలు కొంటారు.ఎన్ని చీరెలైనా కొనుక్కోమంటారు. నాకు అంచులుండే చీరెలంటే మొదటినించీ చాలా ఇష్టం అంచుల్లేని చీరెలు నచ్చేవి కాదు.ఏరంగు చీరెకి ఏరంగు అంచుంటే బాగుంటుంది అని ఎవరు ఏచీరె కట్టుకున్నా గమనిస్తూ వచ్చేదాన్ని.  పిల్లలు పుట్టినా వాళ్ళు పెరుగుతున్నా నా చీరెల కి ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు. సినిమాకి పోతే ముందుగా న్యూస్ రీల్ అని చూపించేవాళ్ళు.అందులో ఇందిరాగాంధీ కట్టిన చీరెలు చూసేదాన్ని.అట్లాగే టీవీ వచ్చాక అందులో మీను అని ఒకామె ఇంగ్లీష్ వార్తలు చదివేది.ఆమె చీరెలు ఎంత బాగుండేవో? వార్తల్లో తప్పులు చదివేదిట కానీ చీరెల ఎంపిక అద్భుతం అనుకో ! ఇంక ఎక్కడ ఏప్రదేశానికి వెళ్ళినా ముందు అక్కడి ప్రత్యేకమైన చీరెలుకొనుక్కోడం నా మొదటి పని!  చుట్టాలిళ్ళల్లో పెళ్ళిళ్ళయితే నేనే వెళ్ళి చీరెలు ఎంపిక చెయ్యాలి . ఆవిధంగా నేను చిన్నప్పుడు పూలల్లో ప్రకృతిలో  ఇష్టపడిన రంగులన్నింటినీ నా చీరెల్లో చూసుకన్నాను.అవే నా జీవితాన్ని వెలిగించిన రంగులు. మాఆయన పోయిన కొత్తలో నా చీరెలుపంచుకుందాం అని చూశారు నా కూతురూ కోడలూ .నేనివ్వలేదు ఒకటీ అరా నగలుంటే ఇచ్చాను నాకు మొదట్నించీ నగలిష్టం వుండేవి కాదు . ఇదంతా నీకర్థం కాదు.కానీ ఈ రంగులన్నీ కలిసిపోయి ఒక తెలుపే మిగిలిన ఈ క్షణంలో ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది.  మా అత్తగారు మంచంపడితే నేనే చేశాను.ఆమె నేను పెడితేనే అన్నం తినేది. మా ఆయన కి నేనే చేశాను ఆయన నా చెయ్యిపట్టుకుని కళ్ళుమూశారు. .ఇప్పుడు  నాకు తోడుగా నువ్వు ఎక్కడినించో వచ్చావు   కాలం మారింది .మా కుటుంబంలో ఇంతకాలం ఎవరు బతకలేదు. మనిద్దరికీ ఎప్పటి ఋణానుబంధమో
అంత పెద్దమాటలు నాకర్థం కావు మామ్మా! నువ్వు డబ్బులిస్తున్నావు నేను పని చేస్తున్నానంతే కానీ నువ్వు ఏడిస్తే నాకు దిగులేసింది. నువ్వేడవద్దు నీ బాత్రూమ్ నీ చేతిలో లేకపోతే నువ్వుమాత్తరం ఏం జేస్తావ్? రేపటాల్నించీ నీకు ఒక రోజు గచ్చకాయ ఒక రోజు మానుగాయ ఒక రోజు ఇటికరాయ చీర నే కడతాగందా! అంది స్వర్ణ.
ఈ వయస్సులో ఇంకా రంగుల మీద మోహం ఎందుకమ్మా ? అట్లా ఒక్క ఉప్పెనలాగా వచ్చింది.దుఃఖం అంతే! అది చీరెల్ని గురించిన దుఖం కాదు.సరే చెప్పు  .నువ్వుకూడా ఏడ్చావుకదా రాత్రి .నేను బట్టలు పాడుచేసుకున్నప్పుడు ,నిన్నిక్కడకి పంపించిన ప్రేమలతమ్మని తిట్టుకున్నావుకదా ? అట్లాగే నేనూ నా చిన్నప్పుడు నన్ను నూరేళ్ళాయుష్షు   అని దీవించిన వాళ్ళని తిట్టుకుంటూ ఏడ్చాను అంతే !కానీ తప్పేదేం వుంది .పిలుపొచ్చేదాకా అనుభవించాలి కదా ?
ఆవిడ మొహంలోకి అట్లా చూస్తూ వుండిపోయింది స్వర్ణ.
                          ************  ( తెలుగు వెలుగు మార్చి 2013)












6 comments:

hari.S.babu said...

tear jerking!

malli said...

అవునూ... మా నాయనమ్మ తను చీరలు దాచుకున్న ఇనప్పెట్టె మాకెవరికీ చూపలేదు మీకెట్లా చూపింది చెప్పండి ముందు?అసలకి అన్ని తెలుగు రంగుల చీరలు మా నాయనమ్మకి తప్పఎవరికీ లేవు. కధంతా రంగులుగా కనిపించిందా... వెనక మెలిపెట్టే తెల్లని విషాదమే కదా!!

ఎంత జయప్రభ పైటని తగలేయ్యమని చెప్పినా సరే ... నాకైతే ఆ మామ్మని మా ఇంటికి తెచ్చుకుని రంగుల చీరలు కట్టేద్దామనిపించింది. ఇక నుంచీ మా అమ్మకీ మా అత్తమ్మకీ ఇట్లాంటి కోరికలున్నాయేమో కనుగలిగి ఉంటాను. నిజంగా కరిగిన రంగుల మీద ఒట్టు.

కధ కరిగించాక విమర్శ చేయాలంటే మనసు రావడం లేదు. ఒకటి రెండు ఉన్నాయి చెప్పాల్సినవి.చెప్పక తప్పనివి మల్లీశ్వరి ధైర్యశాలి అయిన నిర్మొహమాటమైన విమర్సకురాలిగా ఉండడాన్నే మీరూ ఇష్టపడతారని నాకు తెలుసు.

చాలా కధలు మన మీద నుంచి అలవోక గా నడుస్తూ పోతాయి. మరి కొన్ని ఆగి మన ఒళ్లో కూచుని ఇక దిగము పోమ్మంటాయి. అసలకి ఈ కధ లో మామ్మ ఉంది చూసారూ..

సర్లెండి సర్లెండి...

సయామీ కవలల మాదిరి ఇతివృత్త నిర్మాణం ఉన్న కధ ఇది... రెండు స్వతంత్రమైన ఇతివృత్తాలను ఒకే కధ లో చెప్పే ప్రయత్నంలో ఒక పార్స్వానికి లోటు జరిగింది.
మామ్మ,స్వర్ణలలో ఒకరి జీవితం మానవోద్వేగాలను తట్టి లేపి కన్నీరు పెట్టించగా మరొకరి జీవితం సామాజిక పరిణామాలలో వస్తున్న మనం ఊహించలేని మార్పులను
మన కళ్ళ ముందు నిలిపి ఆలోచనను రేకెత్తించేది.

రెండో పార్శ్వంతో కధలు రావాల్సిన అవసరమున్న కాలం ఇది.కానీ నాతొ సహా చాలా మంది హృదయాలను మామ్మే కొల్లగొట్టేసిందని మీకు వచ్చిన ప్రతిస్పందనలను బట్టి చెప్పారు మీరు.

మానవోద్వేగాలదేముంది గిల్లితే పాలు గారే చెట్ల వంటివి. కానీ అత్యంత సంక్లిష్ట సామాజిక పరిణామాలను ఒడిసిపట్టుకుని చెప్పడం అంటే
ఎంటర్ తప్ప ఎక్జిట్ లేని 'దారి కనుక్కోండి చూద్దాం' పజిల్ లాంటిది.

స్వర్ణ ఎపిసోడ్ విడిగా రాయాల్సిన బలమైన ఇతివృత్తం ఉన్న కధ. ఒక పక్క మామ్మ అంత ధగధగ లాడిపోతూ మెరిసిపోతూ ఉంటె స్వర్ణ వంక ఎవరు చూస్తారూ !!

బోటం లెస్ సాహిత్యంలో తలమునకలేస్తూ ఉక్కిరిబిక్కిరవుతున్నవాళ్ళం కదా! ఆ అనుభవం తో బుద్ధిని మరింత కష్టపెట్టుకుందాం మానవ సంబంధాల విచ్చిత్తికి మౌన సాక్షులుగా మారిన మన స్వర్ణల కోసం..

సత్యవతి said...

నువ్వు చెప్పింది నిజం ఇప్పుడు మనం స్వర్ణ మీదే మనసు పెట్టాలి

సామాన్య said...

కథ చాలా బాగుంది మేమ్ .నాకిలాటివి తెలుసు.అవన్నీ జ్ఞాపకం వచ్చాయి.

Anonymous said...

సత్యవతి గారూ,

ఈ కథ కథ-2013 లో చదివాను. చాలా బావుంది. చిన్న చిన్న ఆనందాలు చివరివరకూ వెంటాడుతూనే ఉంటాయి. మా అమ్మకి గాజులంటే మహా ఇష్టం. చేతి నిండా వేసుకోవాలనేది. చేతినిండా బంగారం, గాజు గాజులూ అన్నీ వేసుకొనేది. ఎవరైనా అవెన్నీ వర్ణక్రమంలో బావోలేవని అంటే, నా మనసుకి బావున్నాయి అనేది. అమెరికా వచ్చినప్పుడు నేను మా అమ్మకి గాజుల జతే కొన్నాను. మద్రాసులో దిగి మరలా షాపింగ్ కెళ్ళినప్పుడు అక్కడ చూసిన గాజుల జత చూసి చిన్నపిల్లలా ముచ్చటపడితే వద్దని ఆవిడ వారించినా అదీ కొన్నాను. చివరివరకూ అవి ఆవిడ తీయలేదు. ప్రస్తుతం ఆవిడ గుర్తుగా నేను తెచ్చేసుకున్నాను.

మీకు బ్లాగుందన్న సంగతే తెలీదు. మీ 'పిల్లాడొస్తాడా?" కథకంటే ఇదే నాకు నచ్చింది.ఆ కథ మీద ఒక చోట విమర్శ రాసాను కూడా. చదువుతానంటే చెప్పండి, పంపుతాను.

Now, I am happy that I have conveyed my feelings on a story I liked it.

Sai Brahmamandam

సత్యవతి said...

చాలా థాంక్స్ సాయి బ్రహ్మనందంగారూ.పిల్లాడొస్తాడా కథ మీద మీ విమర్శ తప్పకుండా పంపండి. ఐ హేట్ మై లైఫ్ కథ చదివినప్పుడు నా స్వీట్ సిక్స్ టీన్ మనవరాలు గుర్తొచ్చింది.మీ మెయిల్ ఐడి తెలియక ఇకడ వ్రాస్తునాను