Monday, October 29, 2012

ఇష్టంగా ఇస్మత్


  ఒక్కొక్క భాష నుడికారంలో ఒక్కొక్క రకం సౌందర్య పరిమళం వుంటుంది. అనువాదకులు మరొక భాషలో ఎంత నిష్ణాతులైనా ఆ సౌందర్యాన్నీ పరిమళాన్నీ నూటికి నూరు పాళ్ళు పట్టుకోలేరని నేననుకుంటాను. కనీసం డేభ్భై అయిదు శాతం అన్నా తీసుకురావాలని ప్రయత్నించాను.ఈ అనువాదం మూల భాషనుంచీ నేరుగా రాకుండా మధ్య ఒక వాహకం ఉండడం.కూడా కొంత ఇబ్బందికి కారణం అవుతుంది.అయినప్పటికీ ఇస్మత్ చుగ్తాయ్ పాత్రలూ వాటి మనస్తత్వాలూ ప్రవర్తనలూ మనకి కొత్తవి కావు.అవి మన సామాజిక సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక చాలా ఆత్మీయ మైనవిగా ,మన బంధువుల వలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది ముస్లిమ్ స్త్రీలయినా హిందూ స్త్రీలైనా మరొక మతానికి చెందిన వారైనా ఆమె వ్రాసిన కాలానికి ,కొంచెం అటూ ఇటూగా అలాంటి   సమస్యల్నే ఎదుర్కున్నారు.స్త్రీలుగా అవే అనుభూతులని ఆవేదనలని పంచుకున్నారు.ఈ కథాసంకలనం అనువాదానికి పూనుకోకముందు అనేక సంకలనాల్లో వచ్చిన  చుగ్తాయ్ కథలు రెండు,ఒక నవలిక మాత్రమే చదివి ఆమె వ్రాసిన కథల్లో ఈ.రెండే గొప్పవి అనుకున్నాను.ఇలా చాలా మంది అనుకుంటారని ఈ ఆంగ్ల సంకలనానికి ముందుమాట వ్రాసిన తాహిరా నఖ్వి కూడా అన్నారు.ఇందులో వున్న పదహేను కథల్లో అన్నీ కూడా ఆమె శిల్ప చాతుర్యం,తనెక్కడా తొణక కుండా ప్రేక్షక మాత్రంగా కథ చెబుతూ ,ఆ కథని ఎట్లా అర్థం చేసుకోవాలన్నవిషయాన్ని పాఠకుల వివేకానికి వదిలెయ్యడం ఇస్మత్ చుగ్తాయ్ ప్రత్యేకత. అతి విషాదకరమైన గోరీబీ గురించి చెప్పినా రుఖ్సానా గురించి చెప్పినా ఉత్తమ గృహిణిగా మలచబడి ఆకారణంగా నే విడాకులు పొందిన వదినె గురించి చెప్పినా అదే అండర్ టోన్ లో చెప్పడం,కథ నడుస్తూండగా మధ్యలో కల్పించుకుని రచయిత్రి వ్యాఖ్యలు చెయ్యకపోవడం కూడా ఆమె నిబ్బరానికొక మంచి ఉదాహరణ.అర్థ శతాబ్దం క్రిందట ఇంత అవగాహన తో శిల్ప నైపుణ్యం తో వ్రాయడం అబ్బురం.. ముఖ్యంగా లిహాఫ్ కథ ముగింపులోనే ఆమె కథన కౌశలం స్పష్టమౌతుంది. ఒక చిన్నపిల్ల అవగాహన మేరకు ఈ కథ ఎలా ముగియాలో అలాగే ముగిసింది.చెప్ప దలిచిన విషయాన్ని నిస్సంకోచంగా చెప్పడమూ జరిగింది. అంతే కాని తాహిరా నఖ్వి వ్రాసినట్లు ఆమె కు స్వలింగ సంపర్కంపై అవగాహన లేకపోవడం కాదు. స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థా, సంప్రదాయాలూ ,పిత్రుస్వామ్యమూ కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం ఈ కథలనిండా పరుచుకుని వుంది.అంతా చదివేసి.పుస్తకం పక్కనపెట్టేసి ,హాయిగా వుండడం కుదరదు. బేగమ్ జాన్.కుబ్రా తల్లి ,కుబ్రా,ఆమె చెల్లీ, రుఖ్సానా, హలీమా, గోరీబీ  సరళాబెన్ బిచ్చూ అత్తయ్య ,వదినె.షబ్నమ్  ఇల్లూడ్చే ముసలమ్మ,ఫర్హత్ అంతా చాలాకాలం మన చుట్టూ తిరుగుతూనే వుంటారు. రచయిత్రినీ రచననూ చాలా ఇష్ట పడి చేసిన అనువాదం కనుక చాలా సంతోషాన్నిచ్చింది నాకు.      (పి.  సత్యవతి)

1 comment:

oremuna said...

Print book and eBook both are available from Kinige at http://kinige.com/kbook.php?id=1008&name=Ismat+Chugthai+Kathalu