స్వాతంత్ర్యానికి పూర్వమే తెలుగు సాహితీ రంగంలోకి అడుగు పెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ విస్త్రుతంగా స్పృశించి వందలాది కథలూ కొన్ని నవలలూ లెక్కకు మిక్కిలి వ్యాసాలూ రేడియో నాటికలూ వ్రాసిన ఇల్లిందల సరస్వతీదేవి రచయిత్రే కాక క్రియాశీలికూడా.ఆంధ్రయువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు.కొన్నాళ్ళు జైలు విజిటర్ గా పనిచేశారు.1958 లో ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా నామినేట్ అయి ఎనిమిది సంవత్సరాలు కొనసాగారు.1982 లో “స్వర్ణకమలాలు” సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.కేసరి కుటిరం స్వర్ణకంకణం సుశీలా నారాయణ రెడ్డి అవార్డు,రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
“దేశకాల పాత్రల కతీతమైనది మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వ ధోరణులను,వివిధ వాతావరణాలలో అవి చెందే పరిణామ క్రమాన్ని, విశ్లేషించడం నా మొదటి ఆశయం.అలాగే విశ్వజనీనమైన భావాలను దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యడానికే నా కలం మొగ్గు చూపుతుంది.”అనేది తన దృక్పధం అని ఆవిడ చెప్పుకున్నారు.
అలాగే”నేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ,ఓరిమి మంచితనం ముందు చూపు కలిగి ప్రవర్తిస్తాయి.స్త్రీలలో వుండే ఓరిమిని చేతకానితనం కింద ఎప్పుడూ అనుకోకూడదు. నా రచనలో స్త్రీ పురుష సమైక్యతను చాటి చెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నించాను కానీ ఏ ఒకరినో సమర్ధించడానికో విమర్శించడానికో ప్రయత్నించలేదు................నినాదాల వలన ఎవరైనా ఏమైనా సాధంచగలరా? ఈ విమెన్స్ లిబ్ అనేది పాశ్చాత్య దేశాల నించీ దిగుమతి అయిన నినాదం.ఈ దేశంలో ఇది ఎంత వరకూ అవసరమో ఆలోచించాలి. నాకు తోచినంత వరకూ స్త్రీలకు సమాన హక్కులు అంటె స్త్రీ పురుషులు కలిసి కట్టుగా జీవించాలే తప్ప స్త్రీలను బడుగు వర్గాలుగా చిత్రీకరించి రిజర్వేషన్లు ఇవ్వడం నా అభిమతం కాదు” అంటారు సరస్వతీ దేవి 1992 లో. ఆమె రచనలలో ఈ అభిప్రాయాలనే పొందుపరిచారు. ఆమె వ్రాసిన నవలలలో “నీ బాంచను కాల్మొక్కుతా” ఎక్కువ పాఠకాదరణ పొందింది.అట్లాగే “తేజోమూర్తులు”అనే వ్యాససంపుటి కూడా
నలభై అయిదు సంవత్సరాల సాహిత్య సృజనలో రెండు వందల పైగా వున్న ఆమె కథలలోనించీ ఆమె కథనాన్నీ తాత్వికతనూ ప్రాపంచిక దృక్పధాన్నీతెలిపే కొన్నింటిని మాత్రమే ప్రస్తావించుకోడం సాధ్యం. అన్ని ప్రక్రియలలోకీ కథా రచనే తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పుకున్నారు సరస్వతీదేవి..స్త్రీల చదువుకూ వివాహ వయస్సు పెంపుకూ ప్రాముఖ్యత పెరుగుతున్న తొలి దినాలలో ,జీవితంలోకీ రచనలోకీ ప్రవేశించిన సరస్వతీదేవి కథల్లో వాటికి ప్రాముఖ్యత వుండడం సహజమే.సువిశాలమైన ఆమె కథా క్షేత్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మేలు కీడుల గురించి,మానవుల మనస్తత్వాల గురించి, వాళ్ళు అధిగమించలేకపోతున్న తమోగుణం ప్రభావం గురించీ స్త్రీల క్షమాగుణం గురించీ అట్లాగే కొందరు పురుషులలో వలే స్త్రీలలో కూడా వుండే వ్యామోహాల గురించీ ఎన్నో సంఘటనలు సందర్భాలు ఉదాహరణలు కనిపిస్తాయి.
నూరుకథల సమాహారమైన “స్వర్ణకమలాలు” లోని మొదటి కథ,“కొండమల్లెలు” చివరి కథ “స్వర్ణ కమలాలు” అనేక సంకలనాలలోనూ పాఠ్య పుస్తకాలలోనూ చేర్చబడ్డాయి.స్త్రీ పురుషుల మధ్య ప్రేమ నిలిచి వుండడానిక డబ్బు ప్రధానం కాదు హృదయం ముఖ్యం తృప్తి ముఖ్యం అని చెప్పిన కథ.స్వర్ణకమలాలు లో వర్గ భేదాన్ని కళ్ళకు కట్టించారు. వరకట్నం మూలంగా అవివాహితలుగా వుండి పోతున్న స్త్రీలని వరి దయనీయ స్థితిని చూపించారు.స్త్రీలు విద్యావతులూ ఉద్యోగినులూ అయనా కూడా ఇంటిని తీర్చుకోగలిగినప్పుడే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అనెక కథల్లో సూచించారు.కొందరు స్త్రీలు తమ కోరికలను భర్తతో చెప్పుకోలేక మానసికం గా అసాంతికి లోనవుతారు.ఉదాహరణకి కాత్యాయని అనే ఆమెకి ఫిడేల్ వాద్య కచేరి చేశాక మనసు కుదుట పడింది.ఇలాంటి పాత్రలతో రెండు మూడు కథలున్నాయి.
తులసి దళాలు సంపుటిలో “ పంచలింగాల గుడి” అండర్ టోన్ లో చెప్పిన మంచి కథ. ఆమె కథలన్నీ కూడా సూటిగా పాఠకులకెదురుగా కూర్చుని చెబుతున్నట్లుంటాయి.ప్రమాదకర పరిస్థితుల్లో చిన్న పిల్లలతో వున్న వూరొదిలి పరాయి వూరొచ్చిన అంకమ్మ ఊరు బయట ఖాళీ జాగాలో ఒక గోనె పట్టా కప్పి చిన్ని గూడు ఏర్పాటు చేసుకుంది.ఆ గూట్లో ఒక చోట కన్నం వుంటే గుండ్రని రాళ్ళు ఒక యిదు ఏరుకొచ్చి అడ్దంపెట్టింది.క్రమంగా జనం దృష్టిలో అది పాము పుట్టగానూ ఆ రాళ్ళూ పంచలింగాలు గానూ మారి అక్కడొక వీధి గుడి వెలిసి దానితో పాటు ఆమె వుండడానికి కూడా వసతి ఏర్పడింది.ఆ పంచలింగాల గుడి స్థల పురాణం అది. ఇందులో జనం మూర్ఖ భక్తి మాట అసలు ప్రస్తావించకుండా కేవలం అంకమ్మ కష్టాలనే ప్రస్తావిస్తూ ,అమాయకురాలైన అంకమ్మ తన గూడు పడగొట్టనివ్వకుండా రోడ్డు వేసే ఇంజినీర్ని కూడా ఆపగలగడాన్ని నెమ్మదిగా చెబుతారు సరస్వతీదేవి. డాక్టర్ శాంతి ,మీనాక్షీ హౌసింగ్ కాలనీ ,ప్రాణమిత్రుడు వంటి కథల్లో లోకం పోకడను అంత సునాయాసంగానూ చెప్పారు.సరస్వతీదేవి కథల్లో కష్టపడి చదివి ఉన్నత ఆర్థిక స్థాయికి ఎదిగిన పేద యువకులు ఎక్కువ కనిపిస్తారు .అతి బీదరికంలోనించీ ఏదో ఒకవిధంగా నీతి బద్ధంగానే పైకి వస్తారు.ఇంటి దగ్గర కష్టాలు భరించలేకనో ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేకనో ఇల్లువదిలి బయటికొచ్చిన ఆదపిల్లలకి కూడా ఏదో ఒక విధంగా సహాయం అంది విజయం సాధిస్తారు.
స్త్రీలకు క్షమా ఓరిమీ వుండాలని చెప్పినా అవి ఆత్మాభిమానాన్ని చంపుకుని అలవరచుకోవలసిన గుణాలనీ స్త్రీలెప్పడూ అణిగి వుండాలనీ ఆమె ఎక్కడా చెప్పలేదు.స్వాభిమానం కలస్త్రీలు ప్రేమానురాగాలకు ప్రతీకలైన స్త్రీలు చాలా కథల్లో కనిపిస్తారు..”వసంతమ్మ మనమరాలు” అనే కథలో రాజీ ,”ఎదురుచూడని సంఘటన”లో పావని స్వాభిమానంతో తమ జీవితాలపై తామే నిర్ణయాలు తీసుకుంటారు..కూతురుబిడ్దని కని మరణిస్తే,అల్లుడు ఆ బిడ్డని పట్టించుకోకపోతే ఆ బిడ్దల్ని కంటికి రెప్పలా సాకిన అమ్మమ్మలుంటారు. చెమటోడ్చిబిడ్దల్ని పెద్ద చేసిన తల్లులంటారు.తప్పటడుగులు వేయబోయే విద్యార్థినులను చక్కదిద్దే అధ్యాపకురాళ్ళుంటారు.తమ పాకెట్ మనీ తో బీదపిల్లల్న అదుకునే ఆదర్శ విద్యార్దులంటారు.
మానవులు గెలవలేని బలహీనతలు గురించిన కథలు”ఆరవదొంగ” “మానవులు గెలవలేనిది” భార్యని నిష్కారణంగా అనుమానించిన కోటయ్య ,వరదలో చిక్కుకుపోయి కాపాడమని ఎంత వేడుకున్నా ఆమెనూ కొడుకునీ కాపాడకుండా వచ్చేస్తాడు.తల్లి మరణించగా బిడ్దని అతని తల్లి రక్షించి తీసుకొచ్చింది.కానీ ఆ బిడ్ద వున్న ఇంట్లో వుందడం ఇష్టం లేక వేరే పాక వేసుకుంటాడు కోటయ్య..ఈ కథలో వరద భీబత్సాన్ని ,సంపన్నుల నిర్దయనూ కోటయ్య తల్లి మంచితనాన్నీ చక్కగా చూపించారు.అట్లాగే ఆరవ దొంగ కథలో ఆత్మ న్యూనతా భావంతో బాధపడే విశ్వపతి ఎవరి సమర్థతనూ అంగీకరించలేక అసంతృప్తితో అశాంతితో వేగిపోతూవుంటాడు.
సంపన్న స్త్రీలలో వుండ వ్యానిటీ, గుర్తింపుకోసం ఆరాటం,భర్త ఉద్యోగంతో వచ్చే గుర్తింపే శాశ్వతం అనే భ్రమల్లో బ్రతికే స్త్రీలు ,వింత మనస్తత్వాలు.మత కలహాలలో ప్రాణాలు పోగొట్తుకున్న యువకులు,గ్రామీణ రాజకీయాలు, పైకి రావడంకోసం ధన సంపాదన కోసం రంగులు మార్చే ఊసరవెల్లులు,స్వంత అన్నతమ్ముల్నే మోసం చేసి పొలాలు స్థలాలూ లాక్కునే వాళ్ళూ ,నిరాదరణకు లోనయే నిరుద్యోగులు ,ఒకరి సంపాదనమీదే ఆదారపడే ఉమ్మడి కుటుంబంలో రాజకీయాలు ,వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఇట్లా సమాజాన్ని సూక్ష్మంగా దర్శించి కథల్లో ప్రతిబింబించారు .ఆమెకు నగర జీవితంతో ఎంత పరచయముందో గ్రామీణ జీవితంతో కూడా అంతే పరిచయం వుంది.
స్వర్ణకమలాలు,తులసిదళాలు కాక రాజహంసలు అనే అయిదు కథలతో మరొక సంపుటి ప్రచురించారు.అందులో “బుద్ధి పిలిచింది మనసు పలికింది” కొండంత మబ్బు, ఓ గూటి పక్షులు ,మూగవాడు,మంచివాడు అనే కథలున్నాయి .వీటన్నింటికీ తను కంటితో చూసిన దృశ్యాలే ముడిసరుకు అంటార సరస్వతీదేవి.ఈ కథలు మనుషుల మన్స్తత్వాలకు అద్దంపట్టేవి. ఇవి కాక “చందన” అనే పెద్దకథ యువ మాస పత్రికలో వ్రాశారు.
దాదాపు పన్నెండు నవలలు వ్రాసారు..కల్యాణ కల్పవల్లి,వ్యాసతరంగిణి,జీవన సామరస్యము,నారీ జగత్తు ,వెలుగుబాటలు,భారతనారి,నాడు నేడు, తేజోమూర్తులు,అనే వ్యాససంకలనాలు, వెలువరించారు. వివిధ పత్రికలలో కాలమ్స్ వ్రాసారు.రేడియో నాటికలు బాల సాహిత్యం కూడా వ్రాశారు.”జీవించినంత కాలం జీవించి వుండడం” అనే మాటని సార్థకం చేసారు.స్త్రీల అక్షరాశ్యత కోసం స్వావలంబన కోసం వారి ఆలోచనలు విశాలం చెయ్యడం కోసం కృషి చేశారు.
1918 జూన్ పదిహేనో తేదీని జన్మించిన సరస్వతీదేవి 1998 జూలై ముఫై ఒకటిన కనుమూశారు.
(డాక్టర్ ముక్తేవి బారతి గారు రచించిన సాహిత్య అకాడమీ ప్రచురణ నించీ కొంత సమాచారాన్ని వాడుకున్నాను .భారతి గారికి కృతజ్ఞతలతో)
No comments:
Post a Comment