స్వాతంత్య్రానికి పూర్వమూ ,తరువాతి తొలి దినాలలోనూ ఆంధ్ర దేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబా
లలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి.ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే వుంటాయవి. 1925 లో జన్మించి.న సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రయివేటుగా మెట్రిక్ వరకూ చదివారు. ఇంట్లో స్త్రీల సంభాషణల ద్వారా భాష లోని సొబగులు అర్థం చేసుకోవచ్చని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్లు ,సుబ్బలక్ష్మి గారి కథల్లో ఎక్కడా సంస్కృత ఛాయలు కనపడవు,పాఠకులని కూచోబెట్టి అచ్చమైన తెలుగులో కథలు చెబుతారామె
దాదాపు ఆమె అరవై సంవత్సరాల కాలంలో వ్రాసిన ఇరవై ఎనిమిది కథలతో “మనో వ్యాధికి మందుంది”అనే కథా సంకలనం 1998 లో బుచ్చిబాబు స్మారక కథా కదంబం శీర్షికన వేదగిరి కమ్యూని కేషన్స్ ప్రచురించింది..
ఈ కథల్లో చాలావరకూ సుబ్బలక్ష్మి గారు పెరిగే వయసునాటి ఆడపిల్లల జీవితాన్ని.చిత్రించినవే.చాలామంది ఆడపిల్లలకు చదవులు లేవు.వున్నా చాలా తక్కువ .చిన్నవయసులో వివాహాలు.”పెద్దవాళ్లలో చేరగానే”( పెద్దమనిషి కాగానే) అత్తగారింటికి పంపడం. భర్తలు చదువుకుంటూనో ఉద్యోగాలు చేస్తూనో పట్నాలలో వుంటే ఈ పిల్లలు అత్తగారింటో వుండి చాకిరి చేస్తూ మాటలు పడుతూ కళ్ళు తుడుచుకుంటూ భర్త ఎప్పుడు తీసుకు వెడతాడా అని ఏళ్లకొద్దీ ఎదురు చూస్తూ వుండాలి.ఒక పట్టాన కొడుకునీ కోడల్నీ కలవనివ్వరు అత్తలు.ఆడబడుచులు.వాళ్లకి కొత్త పిల్లమీద ఎప్పుడూ నిఘా.ఒక అహేతుకమైన అసూయ.తప్పులు పట్టడం పుట్టింటివారిని దెప్పడం.ఏదో ఒకటి అని ఏడిపించడం ..పెళ్ళి చేసి పంపడం వరకే తమ బాధ్యత.ఆ పైన పిల్ల అదృష్టం అనుకుని ఆమె కర్మకి ఆమెని ఒదిలిపెట్టే తల్లితండ్రులు.ఏ మాత్రం చనువూ ప్రేమా లేని చోట భర్త తనని ఎప్పుడు పట్నం తీసుకు వెడతాడా అని ఏళ్ళూ పూళ్ళూ ఎదురు చూపు...తమ్ముళ్ళ చదువులు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఇన్ని బాధ్యతలను మోయాల్సిన ఆ భర్త గారికి భార్య మనసులోకి చూసే తీరుబడీ ధైర్యమూ వుండవు.తన భార్యను తను ఉండే చోటికి పంపమని తల్లి తండ్రులను అడగడానకి కూడా బెరుకూ భయమూ ...అత్తగారింటి “సౌడభ్యం” అలా వుంటే ఇక పుట్టింట్లోనూ అనేక కుటుంబరాజకీయాలు.. పిల్లకూ పిల్లకూ మధ్య తేడా చూపించే తల్లులు,,ఒక్కొక్క చోట సవతి తల్లుల ధాష్టీకం ,అసమర్థులైన తండ్రులు ,వయసెక్కువైన వాడితో రెండో పెళ్ళికి ముడిపెట్టి చేతులు దులిపేసుకోడాలు, కాటుక కన్నీళ్ళతో నల్లపడిపోయిన గుంటల మధ్య ఉబ్బిపోయిన కళ్ళు, ఆత్మ హత్యలు ,పిచ్చాసుపత్రి కటకటాలు వెరసి చదువులేని, పుట్టింటి అండ లేని, చొరవలేని, ధైర్యం లేని అప్పటి ఆడపిల్ల జీవితం. అయతే ఈ నిరాశా మయ వాతావరణంలో కూడా అక్కడక్కడా తమ భార్యల్ని కాపాడుకున్న భర్తలున్నారు. అతను కాపాడి అక్కున చేర్చుకుంటే తప్ప ఎక్కడినించీ ఏ సహాయమూ లేదు వాళ్ళకి.
పెళ్ళంటే ఏమిటో తెలియని ప్రాయంలో పెళ్ళళ్ళు కుదిరిపోతాయి “.కాపురం” అనే కథలో జానకి అనే అమ్మాయికి పెళ్ళి కుదిరిన పద్ధతి ఇలా వుంటుంది
ఇంకా చీకటి వుండగానే వాళ్లమ్మ నిద్రలేపింది. వాళ్ళ పిన్ని ఆ పిల్లకి ముస్తాబు చేసింది.ఎందుకో ఏమిటో ఎవరూ చెప్పలేదు. గజ్జల పట్టెడ పెట్టింది.వాళ్లక్కకి అత్తగారు పెట్టిన చంద్రహారం వేసింది అప్పుడు అక్కడున్న వాళ్లక్క అత్తగారు “దాన్ని కాస్తా ఊరేగించేవు జాగ్రత్త” అని వెటకరించింది. “వాళ్ళు” చూసుకోడం లాంఛనాలు మాట్లాడుకోవడం నాలుగు రోజుల వ్యవధిలో ముహూర్తం పెట్టడం, వైభవంగా పెళ్ళి జరిగిందని నలుగురూ చెప్పుకోడం మాత్రం తెలుసు ఆ పిల్లకి.ఈ జానకి ఆ ఇంటి పెద్దకోడలుగా వెళ్ళి చాకిరీ చేసి అవమానాలు పడి ఆఖరికి పుస్తెల గొలుసుకూడా ఉమ్మడి కుటుంబానికి ధారపోసి,ఏడ్చుకుంటూ స్నేహితురాలింటికి వెడితే అప్పటికి భర్తగారికి ఆమె మీద ప్రేమ పుట్టుకొచ్చి వెతుక్కుంటూ వెళ్ళాడు.
“ మట్టిగోడల మధ్య గడ్డిపోచ” కథలో అక్క పెళ్ళినాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు పార్వతికి. ఆ వయసు పిల్ల దృష్టి తోనే అక్క పెళ్ళి వేడుకలనీ బావగార్నీ చూసింది. అక్క పెళ్ళి కాగానే ఆమె మామగారు, ఆ తరువాత కొన్నాళ్ళకి మరిదీ పోయారని అక్కని అత్తగారు ఈసడించింది. ఒక సారి పుట్టింటికి వచ్చిన అక్క చాలా చిక్కి పోయి వుంది.తిరిగి వెళ్ళేటప్పుడు” పార్వతికి ఇప్పుడే పెళ్ళి చెయ్యొద్దు నాన్నా దాన్ని చదివించండి” అని మరీ చెప్పి పోయింది..పార్వతి పెద్ద మనిషి అవగానే ఇంట్లో నిబంధనలు మొదలయ్యాయి ఇలా నడవకు ఇలా మాట్లాడకు ఇక్కడికి వెళ్ళకు అక్కడకు వెళ్లకు అని .అక్క చదివించమందే కానీ ఆమెనెవరూ స్కూల్ కి పంపలేదు కావ్యాలు చదివంచమన్నారు గానీ అదీ కొనసాగలేదు. పార్వతిని అత్త కొడుకు రామం బావకి ఇవ్వాలని బామ్మ అనకుందే కాని అతడు “కిరస్తానీ” అమ్మాయిని చేసేసుకున్నాడు.పార్వతి బాధపడింది “నాకేం చదువా? సంగీతమా? ఎలా చేసుకుంటాడు బావ?”అని సమాధానపడింది. అంతలోనే అక్క నూతిలో దూకేసింది. అక్క నూతిలో ఎందుకు దూకిందో పార్వతికి అర్థం కాలేదు. కొన్ని నెలలు గడిచాక ఒక రోజు చీకట్లో కొంతమంది పెద్దలు దిగబడ్డారు తండ్రీ బామ్మా ఏమిటో మాట్లాడుకున్నారు.తల్లి వచ్చి తనకి రహస్యంగా “నువ్వు ఒప్పుకోకు వాళ్ళు అడిగితే” అని చెప్పింది.వాళ్ళెవరూ పార్వతినేమీ అడగలేదు.అక్కభర్తతో పార్వతి పెళ్ళీ జరిగిపోయింది...పార్వతి ఆవూరికి కాపరానికి వచ్చింది.భర్తకి ఎవరో స్త్రీతో సంబంధం వుందని తెలిసింది.తనని పట్టించుకోనేలేకపోయినా అక్క చావుకు కారణమెదో అర్థమైనట్లు తోచింది.భర్త నిర్లక్ష్యం గమనించిన అత్తగారు ఆమెని ఆదరించడం మొదలు పెట్టింది.”ఇక ఈవిడ వెంటే నాబ్రతుకు ఇలా గడిచిపోవాల్సిందే” అనుకుంటుండగా అతనొక రోజు పార్వతి గదిలోకొచ్చాడు. మరునాడు ఆమెను చూసి నవ్వులు చిలకరించడం అత్తగారు చూసింది.ఆవిడకి ఒళ్ళుమండింది.కోడలి పైన ఆదరం తగ్గింది ..పార్వతికి అర్థమైంది.” మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం అక్కయ్య జీవితం.శూన్యంలో వెలిగించిన ప్రమిదలా ఎంతకాలం నిలవగలనో!!” అనుకుంది ఆ వూరిలాంటిదే ఆ ఇల్లు “దుప్పలూ ,పుంతలూ శిధిలాలూ,వాటిని చుట్టి మొండి గోడలు .అందులోనే తను జీవించాలి.గడ్డిపోచలా”. .అనుకుంది.”కాలం వేసిన ఎగుడు దిగుడు బండల పైన జీవితం సాగుతోంది” పార్వతికి.
శిల్పపరంగా కధన పరంగా వర్ణనల పరంగా సుబ్బలక్ష్మి గారి కథలన్నింటిలోకీ అగ్ర స్థానం లో వుండే కథ ఇది
“తెల్లవారింది” కథలో మల్లికాంబ,”మగతజీవి చివరి చూపు”లో కాంతమ్మ రెండో పెళ్లి కి కట్టబడ్డ వాళ్ళే అందులో మల్లికాంబ భర్త డబ్బుని లెక్క బెట్టి దాచి అప్పగించాలే కానీ, రూపాయి తనకి వాడుకోకూడదు.ఒక సారి చెయ్యని నేరానికి దెబ్బలు కూడా తింటుంది.కానీ ఒక సారి తన స్వంత తమ్ముడి చదువుకోసం భర్త డబ్బు దొంగలించి నేరభావంతో కుమిలిపోతుంది.రెండవ భార్యమీద మొదటి భార్య సంతానం ఈసడింఫూ అనుమానాలూ ,అవమానాలూ వాళ్ళ బంధువుల వెటకారాలు భరిస్తూ రోజులు గడుపుక పోయే వాళ్ళు కొందరైతే ,సవతి పిల్లలను నరక యాతనకు గురి చేసేవాళ్లు మరికొందరు.
“పోస్ట్ చెయ్యని ఉత్తరం” కథలో “ ఇందిర ఆ ఇంట్లో అడుగు పెట్టి పదేళ్ళు ఇట్టే తిరిగి పోయాయి. పెద్ద మార్పులు లేవు .అప్పుడప్పుడూ అత్తగారిమీద అలగడం,ఆడబిడ్దని కసరడం, అత్తగారు కూకలెయ్యడం,మరుదుల పుస్తకాలు తీసుకుని చదవడం,అట్టలు నలిగాయని ఫిర్యాదులు, పనిమనిషి నాగాలు ,పెరట్లో కళ్ళాపులు, పక్కింటి ముచ్చట్లు చెప్పుకోడం , దడి అవతల గుడిసెల్లో తగాదాలు విని నవ్వుకోడం” ఇది ఆమె దిన చర్య.పదేళ్ళుగా ఆమె భర్త పట్నంలో వుండి చదువూ ఉద్యోగం వెలగబెట్టి తమ్ముళ్ల చదువుకి డబ్బు పంపుతున్నాడు .ఇందిరని తన దగ్గిరకి తీసుకు వెళ్ళడు.ఈ లోగా ఆమె ఆడబిడ్డ భర్త ఆడబిడ్దని కాపురానికి తీసుకు వెళ్ళాడు. వాళ్ల అన్యోన్యం చూసి ఇందిర బాధ ఎక్కువైంది.అప్పుడు ఇందిర భర్త ఒక ఉత్తరం వ్రాసాడు చాలా పెద్దది దాన్ని మరిది లాక్కు పోయి ముందుగా చదివి ఇచ్చాడు..తనని రమ్మనే రాసి ఉంటాడని ఉత్సాహ పడింది ఇందర.తననొకమ్మాయి ప్రేమించిందట.తను కాదంటే ఆత్మహత్య చేసుకుంటుందట .ఆమె ఆత్మ హత్య చేసుకుంటే తను బ్రతకలేడట.ఆమె అతనితో వుండడానికి ఇందిర సమ్మతి తెలుపుతూ వుత్తరం వ్రాయాలట.అప్పుడు ఆమెను ఒప్పించి ఇందిరను తీసుకు వెడతాడట.పదేళ్ళ నిరీక్షణ కు అందిన ఫలితం.భర్తను తన వైపు తిప్పకునే చాక చక్యం ఇందిరకు లేదని అత్తగారు ఆమెనే తిట్టింది. అతను కోరినట్లే ఉత్తరం వ్రాసి పరుపు కింద పెట్టి,తను మాత్రం అఖండంగా మండుతున్న నీళ్ళపొయ్యికి కొంగు అంటించుకుని సమస్య పరిష్కరించుకుంది ఇందిర.” కథలు చెప్పే గౌరి” కథలో గౌరిని ఒక బండరాయిలాంటి వాడికి కట్టబెట్టారు.అతని తల్లి తగనిది.ఆమె జీవితంలో వెలుగునింపిన వాడు గిరి.అనే బంధువు.
తమ అజ్ఞానంతో మూర్ఖత్వంతో కొడుకుల్ని కోడళ్ళని కలవనీకుండా చేసి,ఆకొడుకులు ప్రత్యామ్నాయాలు వెతుక్కోడాన్ని కోడళ్ళ అసమర్థత కింద చిత్రించడం ,కాలంతో పాటు కోడళ్ల హృదయాలు మొద్దబారడం, అణచి పెట్టుకున్న కోపాలు ఆవేదనలు కోరికలు అన్నీ తమకూ కోడళ్ళొచ్చే వేళకు పడగ విప్పడం అట్లా తరాల తరబడి అత్తా కోడళ్ళ వైరి సంబంధం కొనసాగుతుంది. అభమూ శుభమూ ఎరుగని వయసులో పెళ్ళి చేసుకుని అత్తతో కాపురం చెయ్యడానికి వెళ్ళిన ఈ చిన్న పిల్లలకి పుట్టింటి ఆసరా కూడా తక్కువే.” ముంజేతి కంకణం” అనే కథలో శాంత కు తండ్రి కొ౦త పొలం ఇస్తే ఆమె భర్తతో బొంబాయి నగరం లో వుంటూ డబ్బుకు ఇబ్బంది పడుతున్నా అన్న ఆమెకు పొలం తాలుకు అయవేజు ఒక్క రూపాయి కూడా ఇవ్వక అందరితో డబ్బిచ్చి పొలం రాయించేసుకున్నానని చెప్పుకుంటాడు.ఇంట్లో వున్న మేనత్తల బంగారాలు కూడా తనే తీసుకుంటాడు.ఒక మేనత్త మాత్రం శాంత కివ్వమని ఒక గొలుసు వీరయ్య కిచ్చి పోయింది..అన్న మంచి ఇల్లు కట్టుకుని వదిన వంటినిండా బంగారం దిగేసి కూతురికి బాగా కట్నం ఇచ్చి పెళ్ళీ చేయడం తను పుట్టింటికి రావడానికి కూడా రైలు ఖర్చులకి తడుముకోడం చూసిన శాంత తన పొలం అమ్ముకుని వెళ్ళిపోయింది.అదికూడా అన్నకు తెలియకుండా రహస్యంగా.మరొక కథలో పెద్దకూతురు జబ్బుతో వున్నా పట్టించుకోని తల్లి,ఇంకొక కథలో ఒక కూతురి నగ మరొక కూతురికోసం వాడి ,ఆ నగ లేనిదే అత్తగారు రానివ్వక పోతే నగ ఇచ్చి కాపురానికి పంపకుండా, ఆపిల్ల చేత ఇంటి చాకిరి చేయించుకున్న తల్లి, పిల్లల మధ్య వలపక్షం చూపే తల్లులు ,వెనకా ముందూ ఆలోచించకుండా గుమ్మంలో కొచ్చిన సంబంధాలకి ఆడపిల్లల్ని కట్టబెట్టే తండ్రులు ..అదృష్ట దేవతనో మొగుడి కరుణా కటాక్షవీక్షణాలకోసమో వేడుకుంటూ కాలం గడుపుకు పోవడమే జీవితం.
ఇంక వితంతువులై పుట్టింటి కొచ్చి అన్నగారి కుటుంబానికి సర్వ శక్తులూ ధార పోసిన ఆశమ్మను ఆమె చివరి క్షణాలలో అన్నకొడుకులు ఎలా వేధించారో చెప్పే కథ,”ఒడ్దుకు చేరిన వొంటరి కెరటం”.చిన్నతనంలోనే భర్తలను పోగొట్టుకుని పుట్టింటికి చేరిన వితంతువుల రెక్కలు ముక్కలు చేసిన సంసారాలెన్నో ఆ రోజుల్లో!!
“మనసు తెచ్చిన మార్పు “అనే కథలో కథకురాలిని చదువు మాన్పించి చిన్నప్పుడే బాగా పొలం వున్న సంసారంలో పడేశారు.అక్కడ అత్తగారు,పెద్దత్తగార్ల పెత్తనం. మామగారికి కూడా నోరు లేదు.భర్త కి ఎప్పుడూ పొలమూ ఆవులూ ఎడ్లూ ,
మొదటి పిల్లవాడు పుట్టేవరకూ భర్త బాగానే చూసుకునే వాడు.ఇంట్లో వాళ్లకి తెలియకుండా పౌడరూ అదీ కొనిచ్చేవాడు.ఆ అమ్మాయికి వరసగా అయిదుగురు పిల్లలు పుట్టారు .అప్పుడింక ఎవరూ పట్టించుకోరు. తనూ ఇంట్లో ఒక మనిషి అంతే.. ఆఖరికి పిల్లలకి పేర్లు కూడా అత్తగారూ పెద్దత్తగారే నిర్ణయిస్తారు.ఆమె స్నేహితురాలు చదువుకుని డాక్టరైంది.మరో డాక్టర్ని పెళ్ళి చేసుకుంది. అప్పుడా స్నేహితురాలు చచ్చి పోతే బావుండును అనకుంటుంది కథకురాలు. సుబ్బలక్ష్మి గారి కథలన్నీ అండర్ టోన్స్ లోనూ ,వ్యాఖ్యానరహితంగా రచయిత ఏమాత్రం కల్పించుకోకుండా జరిగింది నిబ్బరంగా చెప్పినట్లు వుంటాయి. పల్లెటూరి జీవితం కళ్ళముందుంటుంది.
సుబ్బలక్ష్మి గారికి తన పన్నెండవ ఏట(1937) అప్పటికి ఎం.ఏ చదువుతున్న బుచ్చిబాబు గారితో వివాహం అయింది..
.”బుచ్చిబాబు గారి కథల్లో వర్ణనలు ఎక్కువ నాకు వర్ణనలు లేకుండా వ్రాయడం ఇష్టం” అని చెప్పుకున్నారే కాని.సహజంగా చిత్రకారిణి కూడా అయిన ఈమె కథల్లో ప్రకృతి వర్ణనలు తప్పకుండా వుంటాయి. గ్రామాలలో ఇళ్ల నూ స్త్రీల స్వభావాలనూ వాళ్ల ముచ్చట్లనూ వర్ణించకుండా ఏ కథా పొడి పొడిగా వుండదు
“సంస్కృత సాహిత్యం గురించి ఏమైనా వివరాలు కావాలంటే బుచ్చిబాబు గారు నన్ను అడిగేవారు.అలాగే ఆంగ్ల సాహిత్యం గురించి నాకెన్నో వివరించేవారు..ఆయన ప్రోత్సాహం తోనే నేను కథలు వ్రాయడం ప్రారంభించాను .బుచ్చిబాబుగారు ఏమివ్రాసినా నేను చదివిన తరువాతే ఎక్కడికైనా ప్రచురణకు పంపేవారు.అంత అదృష్టాన్ని కలిగించిన ఆయనే నాకు పెద్ద స్పూర్తి “అంటారు..బుచ్చిబాబు గారితో పంచుకున్న జీవితాన్ని ఆమె ప్రస్తుతం “పాలపిట్ట” మాసపత్రికలో అక్షర బద్ధం చేస్తున్నారు.అందులో బుచ్చిబాబు గారి ఉద్యోగ రీత్యా అనేకమంది రచయితలతో, కవులతో పరిచయాలు, తను చేసిన ప్రయాణాలు, హాజరైన సభలు సమావేశాలు వర్ణిస్తూ ఆనాటి సాహిత్య సాంస్కృతిక వాతావరణాన్ని అందిస్తున్నారు. ఇటువంటి రచనలు స్త్రీల జీవితాలను కాలానుగతంగా పరిశీలించడానికి చాలా విలువైనవి.
కథలే కాక “ నీలంగేటు అయ్యగారు” “అదృష్ట రేఖ” అనే నవలలు కూడా వ్రాసిన సుబ్బలక్ష్మి ఇప్పుడు బెంగుళూరు లో వుంటున్నారు.