Monday, June 27, 2011

తురగా జానకీరాణి

స్వాతంత్ర్యానంతర తొలి తెలుగు కథా రచయిత్రులలో ప్రసిద్ధులైన జానకీ రాణి ,గాయని ,నర్తకి,వక్త కూడా.యాభైయ్యవ దశకంలోనే కథారచన ప్రారంభించిన మంటపాక జానకీరాణి ప్రఖ్యాత రచయిత తురగా కృష్ణమోహనరావుని వివాహం చేసుకున్న తరువాత తురగా జానకీరాణి పేరుతో వ్రాయడం మొదలుపెట్టారు. ఇకనమిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత సోషల్ సైన్సెస్ లో డిప్లొమా చేసి కొంతకాలం సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లో వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేశాక ,ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైరయ్యారు . నలభై రేడియో నాటకాలు రూపకాలు వ్రాసారు నాలుగు జాతీయ బహుమతులు పొందారు మూడు నవలలు, వాస్తవగాథలు కొన్ని కాలమ్స్ వ్రాసారు, సర్పంచులకోసం పంచాయతీ రాజ్ శాఖకు పాఠాలు కూడా వ్రాసారు నేషనల్ బుక్ ట్రస్ట్ కి పిల్లల కథల పుస్తకాలు వ్రాసారు సృజనాత్మక సాహిత్యమే కాక సాంఘిక సేవా కార్యక్రమాలపై చాలా కృషి చేశారు.యోజన పత్రిక లో డ్వాక్రా గ్రూపులకొసం ప్రత్యేక అనుబంధానికి రూపకల్పన చేశారు.

స్త్రీల పవిత్రతపై సమాజంలో ప్రయత్నపూర్వకంగా నిలబెడ్దబడ్ద అనేక భ్రాంతి భావనల్ని చెదరగొట్టే పవిత్ర అనే నాటకం వ్రాశారు.మాతృత్వం పైనా స్త్రీపురుషుల మధ్య వుండవలసిన సున్నితమైన ప్రేమానుబంధాల మీద ఆమెకు చాలా గౌరవం. ఆప్రేమ పూసల్లో దారంలా వుండాలని ,ఒకరి మనసు ఒకరికి తెరిచిన పుస్తకంలా వుండాలని ఆంకాక్షిస్తారు .మన పరిథి కథలే కనుక ఆమె కథల్నిగురించే ప్రస్తావించుకుందాం.

జానకీరాణిగారి కథల్లో ప్రథాన పాత్రలు ఎక్కువగా స్త్రీలే .అందులోనూ 1950 దశకంలో ఆమె వ్రాసిన అనేక కథల్లో ఆనాటి యువతుల మనస్తత్వ చిత్రణ ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడప్పుడే ఆడపిల్లల చదువుకు కూడా ప్రాధాన్యత వస్తున్నది. కాలేజీకి వెళ్ళి చదువుకోడం వాళ్ళకి కాస్త గర్వకారణంగా కూడా వుంది. 1956 లో ఈమె వ్రాసిన గళంలో గరళం కథలో సరళ అనె అమ్మాయి ఎస్సెసెల్సి (S.S.L.C)లో మంచిమార్కులు తెచ్చుకుని ఇంటర్ లో చేరింది.దానికి తగ్గట్టుగా వస్త్ర ధారణ చేసుకుని ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తోంది.అదే పెట్టెలో వున్న ఇద్దరు ఆడవాళ్ళు తనని పలకరించాలనీ అప్పుడు తను ఇంటర్ చదువుతున్నానని చెప్పాలనీ ,ఉవ్విళ్ళూరింది..కానీ వాళ్ళిద్దరూ తమలో తాము ఏవో మాట్లాడుకుని సరళని అడక్కుండానే దిగిపోయారు.అప్పుడు సరళకి గట్టిగా అరిచి చెప్పాలనిపించిందిఏమండోయ్ నేను పదహారేళ్ళకే ఇంటర్ చదువుతున్నాను.ఎస్సెసెల్సీ లో మంచి మార్కులు తెచ్చుకున్నాను అని.అట్లాగే భూతద్దంలోనించీ,వాస్తవికతకి వన్నెచిన్నెలు , తీరా ఖాళీ చేస్తే కథానాయకుడు,మరలి వచ్చిన మైత్రి నిచ్చెన అనే కథలు కూడా మనస్తత్వ చిత్రణకు సంబంధించినవే.భూతద్దంలోనించీ కథలో రాత్రివేళ వంటరిగా వానలో రిక్షాలో వస్తూ, రిక్షా అతన్ని గురించి అనేక అపోహలూ అనుమానాలూ పడి, తన వంటిమీది నగలు తీసి కనపడకుండా దాచేసుకుని బ్రతుకు జీవుడా అని ఇంటికొచ్చి పడ్ద యువతికి ,ఇంటివారు తలుపు తీసేదాకా తోడుండి తరువాత వెళ్ళిన రిక్షా ఆయనకి ఒక రూపాయి ( 1950 దశకం) అదనంగా ఇచ్చి, తరువాత ఈ రూపాయి తనకేం ఉపకారం చేశాడని ఇచ్చినట్టూ అని ఆలోచిస్తే అది:అతను చెయ్యని అపకారానికి అనిపించింది.

జీవిత సత్యాలు అనే కథలో సుమిత్ర ఇరవైరెండేళ్ల ఆనర్స్ చదివే అమ్మాయి.సెలవులకి తన పల్లెకొచ్చింది.ఆ ఇంట్లో ఆమెకు గారాబం.వారింట్లో ఆశ్రితుడు నాగభూషణం.పద్దెనిమిదేళ్ళవాడు మెట్రిక్ తప్పి పూర్తిచేసుకుంటున్నవాడు..ఆమె మల్లెపూలడిగితే బస్తీనించీ తెచ్చిపెట్టాడు.ఆమెకతన్ని చూస్తే జాలి. ఒక రోజు ఆమె పాదాలను ముద్దుపెట్టుకుంటాడతను. సుమిత్ర కి తన అంతస్థు తెలుసు.తన వయసూ చదువూ తెలుసు.అతను తమ ఆశ్రితుడనీ తెలుసు.తన భవిష్యత్తేమిటో తెలుసు.ఆ ప్రకారమే ఆమెకు రెండేళ్ల తరువాత ఆమె అంతస్థుకు తగిన వాడితో వివాహం అయింది.ఒక రోజు చలికి ముడుచుకుని కూచున్న ఆమె పాదాల్ని ఆమె భర్త ముద్దుపెట్టుకుంటే పాత సంగతిచెప్పి నా వయసూ నాచదువూ నా అంతస్తూ ఎరిగి కూడా అతనలా ప్రవర్తించడం ఏమిటో? అంది.దానికి ఆమె భర్త చాలా మామూలుగా నువ్వు స్త్రీవి,అతను పురుషుడు అని ఒక జీవిత సత్యాన్ని తేలిగ్గా చెప్పేసాడు.ఈ కథలో సుమిత్ర చాలా ప్రాక్టికల్ ఆలోచనల యువతి. యువతుల మనస్తత్వాలను చిత్రించిన కథలు స్నేహం పరిణయం మౌనం వహించని మనస్సాక్షి స్నేహం కథ కలంస్నేహాల లో స్నేహితులు కులుసుకోక ముందు భావాలకే ప్రాముఖ్యం,, కలుసుకున్నాక రూపానికుండే ప్రభావం భావాలపై పడి స్నేహం చెదరడం, అందుకు తరువాత పశ్చాత్తాప పడడం చిత్రించారు. ఇప్పటిలా టీవీ వీడియో కంప్యూటర్ లేని ఆ కాలంలో స్నేహాలు,కలంస్నేహాలు ఉత్తరాలు వ్రాసుకోడాలూ చాలా సహజంగా జరిగిపోతుండేవి. యువతీ యువకుల్లో భావుకత్వం పాలు కాస్త ఎక్కువే వుండేది.మౌనం వహించని మనస్సాక్షి కథలో చిన్నప్పుడు తన బదులు శిక్షింపబడిన స్నేహితురాలికి క్షమాపణ చెప్పలేక ఆ అపరాధభావం మనసులోనించీ చెరిపేసుకోలేక పెద్దయనతరువాత ఆ స్నేహితురాలే మళ్ళీ కలిస్తే ఆమెకు పడవలసిన శిక్ష తనకు తనే వేసుకుంటుంది రేణుక అనే యువతి.

స్త్రీ పురుష సంబంధాలను గురించి వ్రాసిన కథలలో పూసలలో దారం ఆవలి కోణం,స్వయంకృతం,అనేకథలు...తనూ తన భర్తా చదువుకోలేదని అతని స్నేహితుడూ స్నేహితుని భార్యలాగా పనులు పంచుకుంటూ ఒకర్నొకరు గౌరవించుకుంటూ లేమనీ చాలా అసంతృప్తి పడుతుంది సుభద్ర...కానీ ఆస్నేహితులు వెళ్ళాక తనకూ తనభర్తకూ ఉండే అన్యోన్యం పూసలలో దారం వంటిదనీ తామిద్దరూ తెరిచిన పుస్తకాలలాంటీ వాళ్లమనీ అర్థం చేసుకుంటుంది.ఆవలికోణం లో వివాహం చేసుకోకుండా మంచి ఉద్యోగం చేసుకుంటూ నృత్యంలో రాణిస్తూ హుందాగా జీవిస్తున్న స్నేహితురాల్ని చూసి,చదువు మధ్యలో ఆపేసి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని మార్పులేని జీవితంతో కుస్తీ పట్టే తనజీవితాన్ని పోల్చుకుని అసంతృప్తి తో వేగిపోయింది సీత..కానీ స్నేహితురాలు మాత్రం సీతదే సంతోషకరమైన జీవితం అని చెబుతుంది.

మానవత్వం ఇంకా మిగిలే వుందని చాలా కథల్లో జానకీరాణి చెబుతారు.ఒక్క క్షణం మనసు చలించినా తిరిగి దాన్ని దారిలో పెట్టుకుని విలువలని కాపాడుకునే వ్యక్తులు ఆమె కథల్లో ఎక్కువ కనిపిస్తారు.నవ్వని పువ్వు అనే కథలో శ్రీనాథ్ మల్లిక నృత్యం చూసి ముచ్చటపడి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.అయితే పెళ్ళి తరువాత నృత్య ప్రదర్శన లివ్వకూడదని ఆంక్షపెట్టాడు.అందుకు అంగీకరించే పెళ్ళి చేసుకుంది మల్లిక.అయితే ఆమే మన్సు నృత్యం నించీ మళ్ళనే లేదు .అనుకోకుండా తన కాలేజీలోనే ఓల్డ్ స్టూడెంట్స్ డే న నాట్యం చెయ్యమని స్నేహుతురాలి బలవంతం మీద ఒప్పుకుని రహస్యంగా ప్రదర్శన ఇచ్చి వచ్చింది. మర్నాడుదయం అది పేపర్లో రావడం అశాంతి భగ్గుమనడం, ఆమె పుట్టింటికి రావడం జరిగిపోయాయి. తనమాట వినకుండా ప్రదర్శన ఇచ్చినందుకు కోపంవచ్చిన శ్రీనాథ్ ,తరువాత వివేకం మేల్కొన్న వాడై ఆమెకోసం అత్తగారింటికి వెళ్ళాడు..అదే సమయానికి ఆమెకూడా అతని దగ్గరకు బయలు దేరింది.కలలు పండిన రోజుకథలో కుటుంబం కోసం కట్నం తీసుకుని అందంలేని సుబ్బలక్ష్మిని చేసుకుని మామగారి ద్వారా ఉద్యోగం కూడా పొందిన సుధాకరం సుబ్బలక్ష్మిమీద విసుక్కుని ,తరువాత నెమ్మదిగా ఆలోచించి తను త్యాగంచేసినదానికన్న ఆమె చేసిందేమీ తక్కువ లేదని గహించుకుని పశ్చాత్తాపపడతాడు.మరలి వచ్చిన మనస్సుకథలో మాధవరావు కావాలని అనాథాశ్రమంనీంచీ వితంతును ఎంపిక చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు .అందుకోసం తన తల్లి తండ్రులకి దూరమై పోయానన్న వేదన తో ఆమెమనసు నొప్పించే మాటలని తల్లితండ్రులని చూడ్డానికి వెళ్ళాడు.వాళ్ళు కోడలిమీద ఏమాత్రం కోపం చూపకపోగా జాలిపడ్డారు.అతను పశ్చాత్తాపపడి త్వరగా భార్య దగ్గరకు వెళ్లిపోయాడు..మాను వంగింది కథలో టీచర్ సూర్యకాంతమ్మ తప్పు చేసిన పిల్లల్ని చాలా కఠినంగా శిక్షిస్తుంది.అదే తప్పు తనూ చేయబోయి తమాయించుకుని సరిదిద్దుకుంటుంది.

కౌమార దశలో పిల్లల్ని పర్యవేక్షించి సరైన దారిలో పెట్టడం అనేది ఎంత కష్టమైన పనో సొరంగం””వయసు గతి ఇంతే కథల్లొ చెప్పారు.సొరంగం కథలో పల్లెటూరి పిల్లల్ని అతి క్రమశిక్షణతో పెంచి చదువుకుని బాగుపడతారని బస్తీకి పంపి అన్ని హంగులూ అమరిస్తే ,కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయి పోయి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు వాళ్ళు. వయసు గతి ఇంతే లో తల్లి తండ్రులు చదువుకున్న వాళ్లు.పిల్లల్ని అర్థం చేసుకుని మలుచుకోగల వాళ్ళు... తన స్నేహితురాలిని కాపాడుకోవాలని ఎంతగా మనసులో వున్నా సమయానికి కాపాడుకోలేక పోయి తరువాత అమితంగా బాధపడ్డ హైస్కూల్ విద్యార్ధి,నూతన ప్రేమికుడు అయిన అనిల్ నిజాయితీతో కూడిన ఆవేదన ఆమె బేల అతను ధీరుడు అయితేనేంఅనే కథ..

అగాథాలుఅనే కథలో శాంత భర్త ఆమె ను విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే ఆమెను చేసుకున్నాడు.శాంత స్కూల్లో టీచర్ గా వుంటూ తన కొడుకు శేషును పెంచుకుంటోంది. అతను మళ్ళీ కొడుకునీ శాంతనీ రమ్మని కబుర్లు పెడుతున్నాడు శాంతకిష్టం లేదు.కానీ కొడుక్కోసం వెళ్లమంటారు అందరూ.. తండ్రి కావద్దా?అతనికి? మంచి పొజిషన్ లోవున్నాడు..ఢిల్లీలో ఎక్సర్షన్ కి వెళ్ళినప్పుడు తండ్రిని చూసిరమ్మని తనే పంపింది..శేషు వెళ్ళొచ్చేశాడు.తన తల్లి వయస్సుకు మించిన వృద్ధాప్యాన్ని మొస్తూ కష్టపడుతుంటే ఆవిడ హాయిగా వుండడం నచ్చలేదు వాడికి .అక్కడికి వెళ్ళనంటాడు.సరిగ్గా దీనికి విరుద్ధమైన కథ సాలెగూడు రోహిణిని భర్త వదిలేసి వెళ్ళి పదిహేనేళ్ళయింది. ఈమెను వదిలి అమెరికా వెళ్ళొచ్చాక ఎవర్నో చేసుకున్నాడతను.వాళ్ళకొక కూతురుకూడా పుట్టింది. ఇప్పుడావిడ అతన్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఈమెకు కబురుపెట్టాడు.పదిహేనేళ్ళు ఏడ్చి కళ్ళుతుడుకుని, బి.యే చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఎవర్నీ నిందించకుండా ఏమీ అడక్కుండా విడాకులైనా అడక్కుండా మళ్ళీ పెళ్ళిమాట తలపెట్టకుండా గడిపి ,స్నేహితురాలు ఎంతవారించినా వినకుండా అతని దగ్గరకే వెళ్ళిపోయింది రోహిణి.,తిరిగి వచ్చెయ్యమని స్నేహితురాలు ఉత్తరం వాసింది.రానో రాకపోవునో ఏమోకానీ గర్భవతి అయిన ఆమె పురిటికి పుట్టింటికొచ్చింది. నోథాంక్స్ కథలో కేవలం పిల్లల పెపంకం కోసమే పెళ్ళికి అంగీకరించిన బాస్ కి నో థాంక్స్ చెప్పేసింది పెళ్లికోసం తపించిన అమ్మాయి.

వాస్తవ గాథలు శీర్షికన పడుపువృత్తిలోకి దింపబడ్ద యువతుల కథలు కొన్ని వ్రాసారు జానకీరాణి. .ఇందులో థర్మసాధనం నమ్మి వచ్చిన వాడు విడిచిపెట్టి వెడితే తనదగ్గరున్నది శరీరమే కనుక దానినే నమ్ముకుంది ఆమె.

కాలం తీరిన కొలువులో ఎంత చిన్న ఉద్యోగానికైనా లంచం తప్పదు.ఎన్ని రిజర్వేషన్లున్నా లంచం తప్పదు కాస్త చదువుకుని కూడా అట్టడుగునించీ ఒక్క అడుగు పైకి వెయ్యడం లక్ష్మీబాయిలాంటి వాళ్ళకి ఎంతకష్టమో ,చదువురాక బయటి ప్రలోభాలకి లొంగిపోయే ఆమె తమ్ముడు యాదయ్య లాంటి పిల్లలకి చావే గతి ఈ దేశంలో ,...

బ్రతుకంతా కష్టపడి సుఖాలేవీ కోరుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పంపించి విశ్రాంత జీవనంలోకి అడుగుపెట్టాక అరియర్స్ రూపంలో మూడులక్షల రూపాయల అదృష్టం అందివచ్చింది ఆయనకి....దానితో తనూ భార్యా కాస్త సౌకర్యంగా జీవించాలని యాత్రలు చేసి రావాలని ఇంట్లోకి సామాన్లు కొనుక్కోవాలని ముచ్చట పడ్దాడాయన.భార్యేమో పిల్లల అవసరాలు చూడమంది ..కానీ వినలేదు.అనుకున్నంతా చేశాడు.ఇంట్లోకి అన్నీ కొన్నాడు ఆవిడకో నగ కూడా,యాత్రకి టికెట్టొచ్చింది.కానీ అది తీర్థ యాత్ర కాలేక పోయింది.అంతిమ యాత్రే అయింది.ఈ కథలో పిల్లల కోరికలూ సబబే .ఆవిడ పిల్లలకు సాయపడమనడమూ సబబే,ఆయన అప్పటికైనా కాస్త సౌకర్యంగా బ్రతకాలనుకోడమూ సబబే కానీ అప్పుడు మృత్యువురావడం మాత్రం సబబుగా లేదుయాత్ర కథలో

గౌతముడిచేత శాపంపెట్టించుకుని శిలలా పడివుండక తెలివితో కోపంతో జ్వలించిన ఒక అహల్య కథ జ్వలించిన శిల భర్త భావుకుడు కాదు.సంగీత సాహిత్యాల పట్ల అంత అభిరుచీ లేదు.బ్యాంక్ లో ఉద్యోగం చేసే అహల్య గౌతం ని ఆకర్షించింది.స్నేహం కుదిరింది.పరిధుల్లో వున్న స్నేహమే.అయితే ఆమె మనసు విప్పి తన అభిప్రాయాలన్నీ గౌతమ్ కి ఉత్తరాలు వ్రాసింది. ఆమె తరువాత ట్రాన్స్ఫర్ మీద వెళ్లిపోయింది.కొన్నాళ్ళకి మళ్ళీ అదే వూరు బదిలీమీద వచ్చింది.తన దగ్గరున్న వుత్తరాల ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పర్సనల్ లోన్ సాంక్షన్ చేయించుకోవాలని ఎత్తువేశాడు.నిజానికి అతను పెట్టిన స్యూరిటీకీ ఆ లోను వచ్చే అవకాశం లేదు.ఉత్తరాలు భర్తకి పోస్ట్ చేస్తానని బెదిరించి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాడతను.ఉత్తరాలు చటుక్కున అందుకుని సొరుగులో వేసుకుని అప్లికేషన్ తీసుకుంది అహల్య ..చచ్చినట్టు లోన్ వచ్చితీరుతుందనుకున్నాడతను.కానీ అహల్య ఆ ఉత్తరాలు తీసేసుకుని ఎంచక్కా నెల్లాళ్ళు సెలవు పెట్టి తరువాత మళ్ళీ బదిలీకి పెట్టుకుంది. ఇంటి బయటికొచ్చి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసుకునే స్త్రీలకి తెలివి వుంటుందనే జ్ఞానం వుండదు గౌతమ్ లాంటివాళ్ళకి.

పుష్పమ్మకి హటాత్తుగా మాట పడిపోయింది,ఎన్ని వైద్యాలు చేసినా మాటే రాలేదు.ఆమెనెవరో తీవ్రంగా బాధ పెట్టివుంటారనీ పెళ్ళై పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదని మొగుడే బాగా సతాయించివుంటాడనీ సైకియాట్రిస్ట్ అన్నాడు.ఏది ఏమైనా ఆమె మాట మాత్రం పోయింది.ఇంతలో వాళ్ళ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలొచ్చాయి.ఆ పోస్ట్ ఎస్సీ మహిళకి రిజర్వ్ అయివుండడాన ,సంతకం చేయొచ్చిన మహిళ అక్కడ ఆమె ఒకతే కావడాన .ఏకగ్రీవంగా ఎన్నికై పోయింది.తన భార్య సర్పంచయితే తనే అయినట్టు భావించిన ఆమె మొగుడు, ఆమెను గుమ్మంలో నిలబెట్టి తను ఆఫీసర్ ఎదుట ఆమెకుద్దేసించిన కుర్చీలో కూర్చున్నాడు.ఆమె అతని చెయ్యిపట్టుకు గుంజి తన కుర్చీ తనకిచ్చెయ్యమంటే చెంప చెళ్ళుమనిపించాడు,దాంతో పుష్పమ్మ నోరు తెరిచి అది నాకుర్చీ నేనే కూచోవాలిఅని గట్టిగా అనేసింది.పదవితో పాటు నోరూ వచ్చిందన్నమాట.అసలు ఆమె నోరు పోవడానికి కారణం కూడా అతనే,పిల్లలు పుట్టలేదు కనుక మళ్ళీ పెళ్ళి చేసుకుంటానన్నాడట,దాంతో దుఃఖం వచ్చి గొంతు పూడుకు పోయింది,చిలుక పలికింది కథలో

పెళ్ళి కాకుండానే తల్లి అయిన రుక్మిణిని చూసి ,ఆమెను బంధువులంతా వదిలేశారు గనుక రెండు ఓదార్పు మాటలు మాట్లాడి వద్దామని ఆమె స్నేహితురాళ్ళిద్దరు వెళ్ళారు.అందులో ఒకరికి రుక్మిణిమీద చాలా అసహ్యంగా వుంది..పుట్టిన పిల్ల వాడిని శరణాలయంలో ఇచ్చేసిరమ్మని సలహా ఇవ్వాలని వెళ్ళింది..కానీ రుక్మిణి పరమానందంగా వుంది.ఎవరూ లేని తనకి భగవంతుడే పాపాయిని పంపాడని అనుకుంటూ మాతృత్వపు వెలుగులో ధగధగ లాడుతోంది. ఆమె ఏడవందే వాళ్ళేం ఓదారుస్తారు? హిమాలయ శిఖరం మీద కూచుని మనబోటి వాళ్ళందర్నీ చిన్నచూపు చూస్తున్న జగన్మాత అది ఎందుకేడుస్తుందీ అనుకుంటుంది మొదట్లో ఆమెని ఏవగించుకున్న స్నేహితురాలే..మాతృత్వం ఒక అపురూపమైన వరం దానికి న్యాయ సమ్మతమా?కాదా అనే ప్రశ్నే లేదు.చాలా అండర్ టోన్ లో వ్రాసిన ఈ కథ కి ఆ అండర్ టోనే గొప్ప శిల్పం అనిపిస్తుంది.

జానకీ రాణి కథలు సూటిగా వుంటాయి.కథకు తగ్గ వాతావరణం వివరణాత్మకంగా వుంటుంది.కుట్రలు ద్వేషాలు,మోసాలు హిపోక్రసీ లేని మనుషులే ఎక్కువ వుంటారు .కొన్ని విలువలని గౌరవిస్తారు.చాదస్తాల మధ్యతరగతి మనుషులు,విచిత్ర మనస్తత్వం కలవాళ్లు కూడా వుంటారు.వన్నెచిన్నెలతో ఊదరగొట్టని వాస్తవ సంఘటనలే ఆమె కథలకి వస్తువులు.త్వరలో ఆమె కథలన్నింటినీ ఏర్చి కూర్చిన సంపుటి రానున్నది. జానకీ రాణి గారికి గృహలక్ష్మి స్వర్ణకంకణం సుశీలా నారాయణరెడ్డి అవార్డు, పొట్తిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు, మాదిరెడ్డి సులోచన అవార్డు,బాలబంధు బిరుదు వచ్చాయి.

No comments: