“ గుండ్లకమ్మ తీరాన”
కాట్రగడ్డ దయానంద్ కథలు
“There are years that ask questions ,and years that answer.” అంటుంది ప్రఖ్యాత రచయిత్రి జోరా నీల్ హర్స్ టన్..
దయానంద్ ప్రశ్నలు అడుగుతున్న సంవత్సరాలని గురించి వ్రాస్తున్నాడు.. స్వయంగా.ప్రశ్నలు అడుగుతున్నాడు .తడిమి తడిమి సమాధానాలు పట్టుకో ప్రయత్నిస్తున్నాడు..నీరవ నిశ్శబ్దంలోకి నెట్టబడుతున్న ప్రదేశాలలో సంచరించి ఆ నిశ్సబ్దాన్ని భగ్నం చేసే కలల్ని విత్తుతున్నాడు.అవి మొలకెత్తాలని మనం ఆశపడేలా చేస్తున్నాడు .అచ్చమైన పల్లె జీవనాన్నికళ్ళముందుంచుతూ, అక్కడి సలిబిండి ముద్దవంటి మట్టి ఉప్పురిసి పోవడానికి వ్యధ చెందుతున్నాడు..ఏళ్ళూ పూళ్ళూ వ్యవసాయంతో నానా అగచాట్లూ పడుతూ కూడ భూమిమీద మమకారాన్ని తగ్గించుకోలేని వ్యవసాయ దారులు, నిర్వాసితులు కాబోయే సందర్భానికి వారితో పాటే కలత చెందుతున్నాడు.
“పండుటాకు” “గూడు “ వంటికథలతో పాఠకుల గుండెలలో గూడు కట్టిన దయానంద్ మళ్ళీ వెలువరించిన ఈ పథ్నాలుగు కథల సంఫుటి ఒక ప్రదేశపు చరిత్ర,.ఒక సమాజపు చరిత్ర.,ఒక భౌగోళిక ప్రాంతపు వర్తమాన జనజీవన చరిత్ర...
నాలుగెకరాల మెట్టపొలం పిత్రార్జితంగా పొందిన వరదయ్య, ఆ నాలుగెకరాలే కాక మరికొంత పొలంకూడా కౌలుకి తీసుకుని నానా ఇబ్బందులూ పడ్డాడు. ఎడ్లతో టైరుబండి నడిపి కోమట్లకు సరుకులు చేరవేశాడు చివరికి ఎడ్లపోషణ వల్లకాకనూ ఊళ్ళోకి మినీ లారీలు రావడం వల్లా బండీ ఎడ్లను అమ్మేశాడు..ఆ వచ్చిన డబ్బుతో భార్యకి బంగారం గొలుసు కొనిపెట్టాడు.కాన్సర్ సోకిన ఆమె ,రోగంతో బాధపడి పోవడానికైనా సిద్ధపడింది కానీ గొలుసమ్మి వైద్యం చేయించుకోడానికి ఒప్పుకోలేదు.అప్పట్నించీ ఆ గొలుసుని ప్రాణంలా దాచుకున్నాడతను..పల్లెల్లో వస్తున్న మార్పులన్నీ అతని పెద్దకొడుకు రూపంలో అతని కుటుంబంలో చొరపడ్డాయి.అతనికి ఉద్యోగం తెప్పించడానికి కొంత అప్పుచేశాడు వరదయ్య.ఆ అప్పు చీటీ లేసి తీర్చమని కొడుక్కు చెబితే పెళ్ళిచేసుకుని కట్నం తీసుకుని తీర్చచ్చు అంటాడు అతను.తన పెళ్ళి తనే కుదుర్చుకున్నాడు.తన ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడే కానీ తమ్ముడి చదువుకి గాని, తండ్రి వ్యవసాయానికి గాని సహకరించలేదు.చదివించే శక్తిలేక చిన్న కొడుకుని వ్యవసాయం లోకి దించాడు వరదయ్య...పెళ్ళై ఇద్దరు బిడ్దలు కలిగాక వ్యవసాయం మీద కుటుంబం జరగడం కష్టమని మిలటరీలో చేరిపోయాడు చిన్నకొడుకు...తన జీవన స్థాయిని పెంచుకున్న పెద్దకొడుకు ఫైనాన్స్ కంపెనీ పెట్టి అప్పులు చేశాడు.తండ్రి దాచిపెట్టమని ఇచ్చిన బంగారం గొలుసు బదులు నకిలి గొలుసిచ్చి ఆయన పరువుతీశాడు.చివరికి తోటి రైతు శివయ్య తన ఉంగరం తాకట్టుపెట్టి వరదయ్య కి సాయపడ్డాడు.ఈ కథ లో సమాజంలో త్వరిత గతిన వచ్చిన మార్పులు ,త్వరితగతిని డబ్బుసంపాదనా మార్గాల అన్వేషణలో గతి తప్పిన జనం, ప్రకాశం జిల్లా రైతు జీవితాన్ని ప్రభావితం చేస్తున్న వైనాన్ని చెబుతాడు .రైలుప్రయాణికుల మధ్య సంభాషణ రూపంలో దయానంద్ ..
,ఒక తరం ఎంతో ధైర్యంతో పోరాడి తెచ్చుకున్న సౌకర్యాలు, హక్కులూ రెండో తరం నాటికి లుప్తమై పోవడంలో యజమానుల చాకచక్యం,పనివాళ్ల నిర్లిప్తత కలగలిసి ఎలా పనిచేస్తాయో అలజడి కథ చెబుతుంది.యజమానుల దొంగలెక్కలు నమ్మడం ప్రభుత్వానికి లాభం కనుక ,అవేనమ్మి పనివారికోసం నిర్మించిన స్కూళ్లూ ఆస్పత్రులు మూసేస్తుంది.ఉద్యోగుల్ని బదిలీ చేస్తుంది.బదిలీకిష్టపడని వాళ్ళని వాలంటరీ రిటైర్మెంటుకేసి తరుముతుంది .హక్కులన్నీ పోయి రోజుకూలీలకింద మారినా ఎవరి దగ్గిర్నించీ నిరసనలేదు .పోరాటంలేదు .ఒకప్పుడు గనిలో ఇరుక్కుపోయిన అయిదుగురు కార్మికులకోసం స్త్రీలతో సహా కార్మికులంతా ఏకమై అధికారుల్ని గడగడ లాడించి వారిని బయటికి తెచ్చిన రోజులు ...ఇప్పుడు కార్మికుల్లో వచ్చిన నిర్లిప్తత నిస్సత్తువ ఒక్క పళాన వచ్చింది కాదు.అది మెల్లి మెల్లిగా స్లో పాయిజన్ లా వచ్చింది. సోషలిస్టిక్ పాట్టర్న్ సొసైటీ కల పెట్టుబడిదారీ విధానానికి నెమ్మదిగా తలవంచిన వైనం ఇది..
.”గూడూరునీ పొదలకూరినీ కలుపుతూ రోడ్డు.రోడ్డుపక్కన ఆకాశమంతెత్తున గుట్టలు గుట్టలుగా తవ్విపోసిన మట్టీ,మైకా గనులూ,,శిధిలమౌతున్న ఆస్పత్రీ ,హైస్కూలూ ,ఎత్తుగా పెరుగుతున్న కర్రతుమ్మ వనాలూ,నర సంచారానికి మెల్లి మెల్లిగా దూరమౌతూ ఒక విధ్వంసాన్ని అనుభవిస్తున్న ఊరూ....ఒక సామూహిక దుఃఖాన్ని ఆవాహన చేసుకున్న ఆ వూరు వూరే పసిపిల్లలా ఏడుస్తున్నట్లు ఉంది” అనుకుంటాడు, ఈ కథలో ప్రధాన పాత్ర నారాయణ ..ఇతను చీమకుర్తి గ్రానైట్ మైన్స్ లో ప్రొక్లైన్ డ్రయివరు. తండ్రిని చూడ్డానికొచ్చాడు,అదే మైనులో పనిచేసిన అతని బావ శ్రీనివాసులు అక్కడె యాక్సిడెంట్ లో చిధ్రమయ్యాడు.అతని అక్క భూదేవమ్మ,బార్ సమీపంలో బజ్జీల బండి పెట్టుకుని అర్థరాత్రి వరకూ అమ్ముతూ మంచాన పడ్ద తండ్రి,యూనియన్ నాయకుడు మాలకొండయ్యని చూసుకుంటూ వుంటుంది.
రైతుకు వ్యవసాయం తప్ప మరొక ఉద్యోగం చేయరాదు.అటువంటిది సెజ్ లూ ఓడరేవులూ వాన్ పిక్ లూ వచ్చి ఉన్న కాస్త భూమినీ లాక్కుంటె తల్లి వేరు తెగపోయినట్లు బాధపడడం ఒక వంకైతే ,ఆ వచ్చే పరిహారంతో వ్యాపారాలు చెయ్యాలని ఉవ్విళ్ళురే రెండో తరానికి ఎట్లా నచ్చచెప్పాలో తెలియని తనం మరొక పక్క... ఎన్ని కష్టాలు పడైనా భూమిని కాపాడుకోవాలనే తపన,..ఊరి సర్పంచ్ లూ ,ఊరికీ కులానికీ చెందిన మంత్రులుకూడా ఎదుటిపక్షానికి ఏజెంట్లుగా పనిచేస్తుండడం చూసినప్పుడు ,సంక్రాతినాడు తినే బెల్లం పొంగలి కూడా వాంతి అవుతుంది.వెంకటేశ్వర్లులాంటి మనిషికి...పండక్కొచ్చిన కూతురికీ అల్లుడికీ భూమి పోతే వచ్చే పరిహారం తో చెయ్యబోయే వ్యాపారపు కలలు..వెంకటేశ్వర్లుకి తరువాతేం చెయ్యాలని ఆవేదన...ఏనాడో అటకెక్కించిన బండి సామాను దించి బండి చేయించి ఎడ్లను కొని బాడిగకు తిప్పడానికి సన్నద్ధుడౌతాడు..అతని నేస్తం చిన వెంకట్రత్నం భూమిపోతోందన్న బాధతో తప్ప తాగి నడివీధిలో పడిపోతాడు.అతని భార్యని ఎలా ఓదార్చాలో అర్థం కాదు వెంకటశ్వర్లుకు..
తనకున్న అప్పులూ అగచాట్లూ అలావుంచి,కూతుర్నిచ్చి చెయ్యాలనే ఆశతో మేనల్లుడికి ఇంజినీరింగ్ చదువు చెప్పించాడు.లక్ష్మయ్య. అతనూ అతని భార్య సుజాతా అహరహమూ కష్టపడి వ్యవసాయమూ సంసారమూ లాక్కొస్తున్నారు..ఇంజినీరింగ్ తరువాత అమెరికా పోవడానికి లక్ష రూపాయలు అడిగాడు మేనల్లుడు.అది ఇవ్వనందుకు ,ఇచ్చిన వాడి కూతుర్ని పెళ్ళి చేసుకోడానికి ఒప్పేసుకుని అమెరికా పోయాడు.ఆ పిల్ల గుండెలో బాకు దించి. లక్ష్మయ్య బావమరిది కూతురి పెళ్ళికి పిలుపొచ్చింది.అప్పటికే ఆ బావమరిదికి లక్ష్మయ్య పద్ధెనిమివేలు బాకీ .పెళ్లికి వెళ్ళాలంటె సుజాత నగలన్నీ తాకట్టులో వున్నాయి.కొత్త చీరైనా లేదని ఆమె యాష్ఠ పడింది.కనీసం ఇరవై వేలు లేనిదే తన ఒక్కగా నొక్క తమ్ముడి కూతురి పెళ్ళికి వెళ్ళలేదు ఆమె..వడ్లు అమ్మి డబ్బు సమకూరుద్దామంటే ఎవరూ కొనరైతిరి.ఎండ్రినే గతి అనుకుంటున్నాడు లక్ష్మయ్యని సుజాత కనిపెట్టింది.ఒకపక్క మేనల్లుడి మోసానికి అదిరి పడ్డ కూతురేం చేస్తుందో అని ఆందోళన.ఒకర్నొకరు కాపలా కాచుకుంటూనే రాత్రి గడిచింది.లక్ష్మయ్య చేతిలో ఎండ్రిన్ డబ్బాని లాగేసింది సుజాత..అంతలో భూమి కంపించింది.
“ఒట్టి నేల తిమ్మిరి అంతే!! ఇంత మాత్రానికే అంత జడుపెందుకు?బ్రతకలేమా?కూలైనా చేసి.”అని భర్తకు భరోసా ఇచ్చింది.నేలతిమ్మిరి అనే అధ్భుతమైన తెలుగుమాట నేను వినడం ఇదే మొదలు.కిందటిమాటు భూకంపం వచ్చినప్పుడు మా షకీలా “భూమి ధడికిందమ్మా రేతిర”అంది.. ఎంత గొప్ప ఎక్స్ ప్రెషనో అనుకున్నాను.ఈ ధడకన్ లకు బెదరద్దంటుంది సుజాత.
“భూమిని మనకు చెందిన ఆస్తిగా ఒక అమ్మకపు సరుకుగా(commodity) చూసినందువల్లే ఆ భూమిని మనం దుర్వినియోగం చేస్తాం ..అట్లా కాక భూమిని మనం మనుగడ సాగిస్తున్న ఒక సమాజంలా (community) చూసినప్పుడు ఆమెను మనం ప్రేమతో గౌరవంతో వాడుకుంటాం”అంటాడు ఒక శాస్త్రవేత్త...భూమిని సరుకుగా చూడ్డం మొదలైనాకే మనకి కష్టాలు మొదలయ్యాయని చెప్పాల్సిన పనిలేదు
గుంటూరు తెనాలి మధ్య లో లాగే గుండ్లకమ్మ నించీ కాలువలు చేసి పొలంలో పాదులు తీసి నీళ్ళు పారించి పందిళ్ళు వేసి, రాసులు రాసులుగా కూరగాయలు పండించాలని కలలు కనే వెంకటేశ్వర్లు గుండ్లకమ్మ మీద వంతెన కట్టి నీళ్ళిస్తానన్న అడ్డమైన వాడికీ ఓటేశాడు.అర్జీలు రాయించాడు .చివరికి మూడొందలెకరాలు రొయ్యలచెరువులై పోతున్నాయని తెలిసి రొయ్యల చెరువులకి పెట్టే ఉప్పునీళ్ళ వల్ల తక్కిన పొలాలకు నష్టమని ఎమ్మార్వోకి అర్జీ పెట్టినా ఎమ్మార్వో వాళ్ళు పెట్టేది మంచినీళ్ళేనని అటు తీర్పిచ్చాడు.కొడుకు చెప్పినా తన పొలం అమ్మనని కూచున్నాడు వెంకతేశ్వర్లు..అతని మీద అజ్ఞాత వ్యక్తులు దాడి చేస్తే...మొదటినించీ అతనికి అండగావున్న రోశయ్య అతన్ని కాపాడాడు
సతత హరితాలైన అడవుల్లో కూడా ఆకురాలుకాలం ప్రవేసించడం లాంటి చెంచుతెగ జీవన విధ్వంసాన్ని ఆకురాలుకాలం కథ కళ్ళకికడుతుంది
వాన్ పిక్ భూములు అడగడానికి కష్టపడి ఆ గ్రామానికి వచ్చిన అధికారి ,చివరికి ఆ గ్రామ ప్రజలతో తనని ఐడెన్టిఫై చేసుకుని ,ఆ ఊరి సర్పంచితో” వెంకటేశ్వర్లూ,,అన్ని వూళ్ళల్లో సర్పంచ్ లో మాజీలో నిలబడి భూములు అమ్మిస్తున్నారు,భూములు నిలబడాలంటే చాలా కష్టమే చెయ్యాల్సుంటుంది. ఊరుని నిలబెట్టుకోడం మామూలు కష్టం కాదు..ఇదేదో మా ఒక్క పంచాయితీకే అనుకోవద్దు.తుఫానుల్ని ఎదుర్కున్నట్లు సునామీలను ఎదిరించినట్లు కాదు.అంతకంటే బలంగా నిలబడాలి.అట్టయితేనే మనుషులూ మట్టీ మిగిలేది”అంటాడు
.భూమే ఒక సమాజం ఒక సంస్కృతి.ఒక ఊరుపోతే ఒక ఒక సంస్కృతి పోయినట్టే...
ఈ కథలన్నీ మట్టి పరిమళాన్న్ని నిలిపి వుంచుకోకపోతే కలిగే నష్టాన్ని హెచ్చరించేవే. సెజ్ లుగా మారే పంటపొలాలు, పొలాల మధ్య ఫాక్టరీలు అవితెచ్చే కాలుష్యాలు.,విస్తాపన తెచ్చే విధ్వంసం ఇవ్వన్నీఎవరికి అవసరం? అని ప్రశ్నించే కథలు.
ఏ మూసలకీ చిక్కని స్వతంత్ర రచయిత ,దయానంద్ పాత్రలు అచ్చమైన గ్రామీణ పాత్రలు .అవి నలుపు తెలుపుల్లో కాక వివిధ వర్ణ సమ్మిశ్రితాలు .అతను అదివరకు వ్రాసిన పండుటాకు కథలో ప్రభావతమ్మ,గూడు కథలో కనకమ్మ, నీడ కథలో మార్త,నేలతిమ్మిరి లో సుజాత, జీవం జవం, .మానవత్వం తొణికిసలాడే వ్యక్తులు.. మట్టినీ మనిషినీ ప్రేమించడం అతని ఫిలాసఫీ. భాష పూర్తిగా ప్రకాశం జిల్లా గ్రామీణం..ఎక్కడా ఒక పరభాషాపదం కనిపించదు. ఈ కలం మరిన్ని కథలు మనకి చెప్పాలని కోరుకుంటూ...చినుకు ప్రచురణల ద్వారా మొన్ననే విడుదలైన ఈ పుస్తకాన్ని సిఫార్స్ చేస్తూ..
పి.సత్యవతి