Thursday, December 09, 2010

అమ్మా... ఎలా ఉన్నావ్? ..సాక్షి ప్రతిరోజూ ఒక కథ డిసెంబర్ 9

Posted by Picasa

అమ్మా... ఎలా ఉన్నావు ?


ఒన్ ఫైన్ మార్నింగ్ అనురాధ చనిపోయింది.


యాభై ఏళ్ల అనురాధ, కొడుకును బాగా చదివించి అమెరికాలో సెటిల్ చేసి నలుగురి వైపు గర్వంగా చూసిన అనురాధ, అమ్మాయికి పట్టుబట్టి అమెరికా అబ్బాయికిచ్చి పెళ్లి చేసి, కూతురు అమెరికాలో ఉందటమ్మా అని నలుగురూ
అనుకుంటూంటే విని దిలాసాగా నవ్వుకున్న అనురాధ, ఇల్లు కట్టి, కుటుంబాన్ని సెటిల్ చేసి, మరుసటి రోజు ఉదయం నాష్టా కోసం పప్పు నానబెట్టి, రాత్రి పదకొండు వరకూ నిక్షేపంలా ఉన్న అనురాధ చెప్పాపెట్టకుండా మరోమాట లేకుండా చనిపోయింది.


సో వాట్? ఈ దేశంలో ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఎవరో ఒక అనురాధ చనిపోతూనే ఉంటుంది. అందులో విశేషం ఏముంది? మీకు తెలియాలా.... అయితే వినండి.


నిద్రపక్క మీద అనురాధ చనిపోగానే, దుప్పటి తీసి, చెక్ చేయబోయి కొయ్యబారిపోయాడు భర్త సూర్యారావు. ఎందుకు? అనురాధ శవం తెల్లగా మారిపోయి ఉంది. సున్నపురాయిలా మారిపోయి ఉంది. ఆమె డెడ్‌బాడీ- చీరా రవిక తొడుక్కున్న సుద్దముక్కలా మారిపోయి ఉంది. విడ్డూరం. బహుశా ఇలా జరగడం ఈ లోకంలో ఇదే మొదటిసారేమో. ఇంతకీ ఈ జబ్బు పేరేమిటీ?

వీధిలో వాళ్లూ వీళ్లూ వచ్చారు. కాలనీలో వీళ్లూ వాళ్లూ వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. ముక్కున వేలేసుకున్నారు. అదే కాలనీలో ఉంటున్న ఒక చురుకైన పిల్ల, రహస్యంగా ఆ శవం నుంచి కొంచెం ముక్క పుటుక్కున గిల్లి, కుతూహలం ఆపుకోలేక ల్యాబ్‌కు పరిగెత్తింది. అక్కడ పరీక్షించి చూసింది. ఇంతకీ ఆ ముక్క ఏమిటో తెలుసా?
ఆస్ప్రిన్ టాబ్లెట్. వెంటనే ఆ పిల్ల భూతద్దం తీసుకొచ్చి అనురాధ డెడ్‌బాడీని పరీక్షగా చూసింది. అనురాధ ఒళ్లంతా
టాబ్లెట్‌లే. తెల్ల ట్యాబ్లెట్లు, నల్ల ట్యాబ్లెట్లు, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్....


ఇలా ఎలా జరిగింది? అనురాధ ఒళ్లు ఒక మందు బిళ్లలా ఎలా మారిపోయింది? మళ్లీ మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి.

పైకి జరిగింది ఇది: అనురాధను అందరూ ఒక మంచి తల్లి అనేవారు. సమర్థురాలైన తల్లి అనేవారు. సూపర్ తల్లి అనేవారు. ఉద్యోగం చేస్తూ కూడా ఇద్దరు పిల్లల్ని, భర్తను అంత బాగా చూసే వాళ్లెవరున్నారు అని అనేవారు. ఇల్లు ఎంత నీటుగా ఇంకెవరు ఉంచుకోగలరు అనేవారు. వెచ్చాలు అంత పొదుపుగా వాడేవారు ఎవరున్నారు అనేవారు. ఆ పొగడ్తలు అనురాధకు ఇష్టం. వాటి కోసం ఎంతైనా కష్టపడేది. కోడి కూయక ముందే నిద్ర లేచేది. మొగుడు లేచే లోపలే అన్ని పనులూ ముగించేది. పని మనుషులు శుభ్రంగా చేస్తారా చస్తారా అని తనే అన్ని పనులూ చేసేది. పిల్లలు ఒక్కొక్కరు ఏది తింటారో ఎంచి వాటన్నింటినీ వండేది. మళ్లీ బ్యాంకు ఉద్యోగం. రాత్రికి వంట. మళ్లీ పిల్లల పనులు. లోను తీసుకొని మధ్యలో ఇల్లు కట్టించింది. అబ్బాయి అమెరికా వెళ్లడానికి రేయింబవళ్లు చదివించింది. అమ్మాయి పెళ్లి కోసం అప్పు చేసింది. కాన్పు సమయానికి మళ్లీ అమ్మాయి దగ్గర ఉండేందుకు సెలవలు పెట్టకుండా విశ్రాంతి తీసుకోకుండా ఉద్యోగం చేయసాగింది... ఇవన్నీ ఆమె సక్సెస్ స్టోరీలు.

కాని, లోపల జరిగింది ఇది: రోజూ ఇంత హడావిడి చేసీ చేసీ అనురాధ అలిసి పోయేది. బ్యాంకు నుంచి వస్తూ వస్తూ తలనొప్పి మాత్ర వేసుకునేది. పదిహేనేళ్లుగా రోజుకో మాత్ర. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలంటే ఆమెను అనారోగ్యాలు చికాకు పెట్టకూడదు. కనుక జ్వరం వస్తే క్రోసిన్ వేసుకునేది.

నడుమునొప్పికి బ్రూఫిన్. ఇక ఫంక్షన్లూ, శుభకార్యాలూ, ఆఫీసులో ఇన్స్‌పెక్షన్‌లూ అని ఒక్కోసారి ఆ మూడురోజులను మాత్రలతో వెనక్కు నెట్టేది. పిల్లల పరీక్షల టైములో నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఆ తర్వాత నిద్ర పట్టక నిద్ర కోసం మళ్లీ మాత్రలు వాడేది. ఓవర్ బ్లీడింగ్ మొదలైతే దానికీ మాత్రలు. గర్భసంచీ తీసేయిస్తే మంచిది అంటే సర్జరీ. ఆ పైన సప్లిమెంట్స్ కోసం మళ్లీ మాత్రలు. హాన్మోన్ల కోసం మాత్రలు. బి.పి, బ్లడ్ ప్రెషర్ ఎలాగూ వస్తాయి కాబట్టి వాటికి మాత్రలు. మాత్రలు... మాత్రలు... మాత్రలు...

వాడి వాడి ఆమె దేహమే ఒక మాత్ర అయిపోయింది. ఈ సంగతి ఎవరికీ తెలియదు. కాని పైకేమో అనురాధ మంచి అమ్మ, చక్కటి అమ్మ, సమర్థురాలైన అమ్మ, మొగుణ్ణి అవస్థపెట్టని అమ్మ, ఇరుగు పొరుగును ఇబ్బంది పెట్టని అమ్మ. పెద్ద ఇమేజ్. నిజానికి ఇది ఇమేజ్ కాదు. జబ్బు. పెద్ద జబ్బు. తరతరాలుగా తల్లుల్ని వేధిస్తున్న జబ్బు.

దీని పేరే సూపర్‌మామ్ సిండ్రోమ్.

అనురాధ డెడ్‌బాడీని పరీక్షించి ఇదంతా అర్థం చేసుకున్న ఆ పొరుగింటి పిల్ల ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడ లేదు. పరిగెత్తింది. వెర్రిగా పరిగెత్తింది. భయంతో ఆందోళనతో కంగారుతో అభద్రతతో పరిగెత్తింది.
ఎక్కడికో తెలుసా? ఇంటికి. తల్లిని పలకరించడానికి. తల్లిని గుండెలకు హత్తుకోవడానికి. హత్తుకుని, అమ్మా... ఎలా ఉన్నావ్... నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికి. మాకు నువ్వు కావాలి... నీ చిరునవ్వు కావాలి... నీ ప్రాణాలు కావాలి.... మా శిరస్సుల మీద నీ చల్లని చేయి అండ కావాలి... దయచేసి నువ్వు విశ్రాంతి తీసుకో... అని అరిచి చెప్పడానికి ఆ పిల్ల పరిగెత్తింది.


కథ ముగిసింది.

రచయిత్రి పి.సత్యవతి అద్భుతమైన శిల్పంతో రాసిన అరుదైన కథ ‘సూపర్ మామ్ సిండ్రోమ్’. నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి తెలుగు కథ ఇది. ప్రపంచంలోని ప్రతి అమ్మ కథా ఇది. బయటకు నవ్వుతూ కనిపించే అమ్మ లోలోపల ఎలా ఉందో... ఏ దిగులుతో ఉందో... ఏ అనారోగ్యంతో ఉందో... అని మనమందరం మన తల్లుల గురించి కన్సర్న్ ప్రదర్శించేలా చేసే, వారి గురించి ఆలోచించేలా చేసే కథ ఇది. ఇంకెందుకు ఆలస్యం. అర్జెంటుగా అమ్మతో మాట్లాడండి. ఆమెకు ఏం కావాలో చూడండి. ఆమెకు విశ్రాంతి ఇవ్వండి. ఈ కథను చింపి పడేసి ఇది మా అమ్మది కాదు అని ధైర్యంగా అనగలిగే పరిస్థితిలో ఉండండి. ఉంటారా?


- సాక్షి ఫ్యామిలీ

పి.సత్యవతి: కథను కరుకైన కత్తిలా ఉపయోగించి మగవాళ్ల బండ హృదయాలను కోసి పడేసిన రచయిత్రి. స్వస్థలం గుంటూరు జిల్లా కొలకలూరు. ఇల్లలకగానే... వీరి ప్రసిద్ధ కథా సంపుటి. మరో రెండు సంపుటా లున్నాయి. ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. నివాసం విజయవాడ. ఫోన్: 9848142742

17 comments:

కృష్ణప్రియ said...

చాలా బాగుంది..

కొత్త పాళీ said...

నిజంగా రోజూ ఓ కథని మీరు పరిచయం చేస్తున్నారేమో ననుకున్నాను :(
సూపర్ మాం సిండ్రోం బలమైన ముద్ర వేసిన కథ, నేతి తరం ముఖ్యంగా చదవాల్సిన కథ.

శిశిర said...

అవును. ప్రతి అమ్మ కధా ఇది. ఇది చదవగానే నాకు వెంటనే అమ్మతో ఈ విషయం మాట్లాడాలనిపించింది.
Thanks for the post ma'm.

lalithag said...

ఇది నేను చదివాను. కొత్తపాళీ గారు మంత్రనగరి పుస్తకం గురించి చెప్తే కొనుక్కున్నాను కొన్నేళ్ళ క్రితం.
సత్యవతి గారూ మీరు కథ ద్వారా చెప్పదల్చుకున్నది మీమాటల్లో వివరిస్తే విందామని ఉంది.

నాకెందుకో మీ కథలో పాత్ర చేసేది ఒక తపస్సులాంటి పని అని అనిపించింది అప్పట్లో చదివినప్పుడు.
అలా తమని తాము exhaustion వైపుకి తోసుకు వెళ్తున్నారని అర్థం ఔతున్నా.
ఇటువంటి వారిని నేను admire చెయ్యలేకుండా ఉండ లేను. నేను ఆ సూపర్ మాం సిండ్రోముకి అవతలి అంచున ఉన్నాను. బహుశా అందుకనా? కాకపోవచ్చు.

ఒకప్పుడు నేనూ చెయ్యాలి ఇలా అనుకుని అటువంటి వారిని తప్పు పట్టాలా అనిపించేది (మనసులో మాత్రమే).
చాలా ఆలోచించుకునే దాన్ని.
ఇప్పుడు నాకు ఆ లక్షణాలు స్వతాహాగానే లేవు కాబట్టి తెచ్చి పెట్టుకుని చెయ్యాల్సిన అవసం లేదు అని అర్థం చేసేసుకున్నాను, వదిలేసుకున్నాను. కానీ వారిని మాత్రం అప్పుడూ ఇప్పుడూ కూడా అభినందిస్తాను.
"అవును. ప్రతి అమ్మ కధా ఇది. ఇది చదవగానే నాకు వెంటనే అమ్మతో ఈ విషయం మాట్లాడాలనిపించింది." అన్న వ్యాఖ్యలో కూడా appreciation కనిపించింది.

మీరు చెప్పేది తనను తాను నిరూపించుకోవాల అనే ఆ తపన, తనే అన్నీ అయ్యి చెయ్యాలనే తపన అనవసరం, ప్రమాదకరం అనేమో కాదూ? ఈ కథ ముగిపంపు విషాదం. అందుకని అలా అనిపిస్తోంది.

మా స్నేహితురాలికి అప్పట్లోనే ఈ కథలో కొంచెం చదివి వినిపించాను, తన గురించి ఆలోచించుకోమని. తను identify చేసుకుంది అకొద్ది సేపూ.

వీరికి ఈ drive సహజం అనిపిస్తుంది నాకు. అది వారి ఊపిరి. అది తీసేస్తే వాళ్ళ identity గురించి అవస్థ పడతారేమో వాళ్ళు అనిపిస్తుంది. తమ విలువ తక్కువౌతుందనో, తము చెయ్యకపోతే అవ్వదనో అనుకుని తపన పడడం కూడా ఆలోచించ్చవలసిన విషయం అనేమో కదా మీరు చెప్తున్నారు?

చిక్కల్లా ఇటువంటి drive ఇతరుల్లో expect చేసినప్పుడు. అది "తప్పనిసరి" అనుకున్నప్పుడు అనిపిస్తుంది.

ఇంకొకటి ఇది workalholics (స్త్రీ పురుషులు) అందరికీ వర్తిస్తుందేమో?

ఇలా నా ఆలోచనలు రచయిత్రి, మీ ముందు పెట్టగలిగే అవకాశం ఇన్నాళ్ళకు దొరికింది. ధన్యవాదాలు, బ్లాగ్లోకంలోకి వచ్చినందుకు.

lalithag said...

శిశిర గారి వ్యాఖ్యకు నేను అనుకున్నదానికంటే వేరే అర్థం ఉందని అంత రాసేశాక అనిపించింది.

lalithag said...

అసలు నేను చేసిన పొరపాటు ఇదీ. నేను ఈ పోస్టు ఏంటో చదవనే లేదు.
ఇప్పుడు ఆ వ్యాఖ్య అర్థమయ్యింది, విశ్లేషణ అర్థం అయ్యింది.
కథనే ప్రచురించారనుకుని ఎన్నాళ్ళనుంచో చెప్పాలనుకుంటున్నను కాబట్టి కాబోలు చక చకా ఆలోచనలు రాసేశాను.

క్షమించాలి.

నా ఆలోచనలు ఇప్పటికీ అవే కానీ కొంచెం సిగ్గు పడుతున్నాను.

అలా చేసే వారిని caution చెయ్యడానికి మాత్రం నాకు చేతనైనంత ప్రయత్నిస్తూనే ఉన్నాను.
కానీ అది వారికి అనిపించకపోతే మనమేమీ చెయ్యలేము.
మనం వారి నుంచి expect చేస్తే మాత్రం కచ్చితంగా తప్పు. వారిని ఆకాశానికి ఎత్తేసినా తప్పే.
కానీ,
మెచ్చుకుంటే ఎక్కువ చేస్తారు. మెచ్చుకోక పోతే తక్కువైందనుకుని ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు.

అక్కర్లేదంటే తమ అవసరం లేదేమో అని ఫీల్ అవుతారు. సాయం చేద్దామన్నా, సాయం తీసుకుంటే లేదా acknowledge చేస్తే తక్కువైపోతామనుకుంటారు. అంతకి రెట్టింపు సాయం చెయ్యడానికి కష్టపడతారు. వద్దంటే నొచ్చుకుంటారు.ఇతరులు చేసినవి నచ్చితే తామూ అది అందుకోవాలనుకుంటారు. వారికంటే తాము బాగా చెయ్యగలమనిపించుకోవాలి అనుకుంటారు. Hmm...

సుజాత said...

థాంక్ గాడ్! నాకీ సిండ్రోమ్ లేదమ్మా!

జ్యోతి said...

సత్యవతిగారు ముందుగా మీకు అభినందనలు. నాకు మంత్రనగరి దొరకలేదు. కాని ఈ పరిచయం చదవగానే మనసు భారమైంది.నిజంగా ఇలాటి అమ్మలు ఎంతోమంది ఉన్నారు. నేను ఈ మధ్యే ఈ సిండ్రోమ్ నుండి బయటపడుతున్నాను. కాని ఒక్కటి చెప్పండి. ఈ సిండ్రోమ్ ఉన్నవాళ్లు తమంతట తామే బయటపడాలా?? లేక కుటుంబ సభ్యులు దీనిని గుర్తించి అమ్మను కాపాడుకోవాలా??

ఆ.సౌమ్య said...

హృదయానికి హత్తుకుంది, చివరి వాక్యాలకి కళ్లనీళ్ళు చిప్పిల్లాయి..... మొత్తం చదివాక హమ్మయ్యా అమ్మకి ఇలా లేదు, అమ్మని మేము బాగా చూసుకుంటున్నం అని మనసులో అనిపించగానే గొప్ప సంతోషం వేసింది. ఇక ఆ సిండ్రోం నాకు రాకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది.

చాలామంచి కథనదించారు, ధన్యవాదములు.

మైత్రేయి said...

ఈ కధా పరిచయాల శీర్షిక రోజూ చదువుతుంటానండి. బాగుంటాయి. స్వంత అభిప్రాయాలు మరీ ఎక్కువగా చెప్పకుండా కధమాత్రమే చెప్తారు. ఈ నెల్లోనే ఒకరోజు జోగిని వ్యవస్తమీద చెప్పిన కధా పరిచయం చాలా బాగుంది.

ఈ కధ విషయానికి వస్తే ఎందరో ఆడవాళ్ళు ముఖ్యంగా పట్టణాలలో ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. కధలో రాయలేదు కానీ మాత్రలు మాత్రమే కాదు ఈ స్త్రీలు విసుగు, తమ మాటే ఇంట్లో అందరూ వినాలి అనే కోరిక, వినకపోతే మీకివన్నీ చేస్తే నామాట వినరా అని సాధించటాలు, బాధ పడటాలు లాంటి లక్షణాలు కూడా కలిగి ఉంటారు.

శ్రమ పడటం అనేది మొదట అవసరం తర్వాత అలవాటుగా మారి పోతుంది.

నేనూ కొద్ది కాలం ఈ ఫేజ్ లో ఉండి బయటకు వచ్చి ఇలా ఇంటర్నెట్ లో పడ్డా..

ఎవరో పైన చెప్పినట్లు మగవాళ్ళూ ఉంటారు ఇలా. డబ్బు, పేరు సంపాదించాలన్న పిచ్చిలో, కుటుంబంకోసమేగా అంటూ కుటుంబాన్నే పోగొట్టుకొంటూ..

ఫుల్ స్టాప్ కాక పోయినా కామా అయినా పెట్టాలి ఈ పరుగులకు .

@జ్యోతి గారు, మొదటి స్టేజ్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు బయట వేయగలుగుతారండీ తర్వాత కష్టం. అదీ కాక మనకు కంఫర్ట్ వస్తుంటే ఎందుకు వదులుకోవటం అని పిల్లలు కాక పోయినా ఇతర సభ్యులు అనుకోవచ్చు కదా.పిల్లలు చెబితే తల్లులు వినరుకదా.

సత్యవతి said...

కృష్నప్రియ,కొత్తపాళీ, శిశిర మైత్రేయి,జ్యోతి అందరికీ కృతజ్ఞతలు.
లలిత గారికి,
మీరు చెప్పింది నిజం .ఆ తరహా మనుషులంతే
వీరికి ఈ drive సహజం అనిపిస్తుంది నాకు. అది వారి ఊపిరి. అది తీసేస్తే వాళ్ళ identity గురించి అవస్థ పడతారేమో వాళ్ళు అనిపిస్తుంది. తమ విలువ తక్కువౌతుందనో, తము చెయ్యకపోతే అవ్వదనో అనుకుని తపన పడడం కూడా ఆలోచించ్చవలసిన విషయం అనేమో కదా మీరు చెప్తున్నారు?" అవునండీ
కానీ ఆ స్వభావంతో వాళ్ళు తమని తామే పోగొట్టుకుంటున్నారు కదా అనేది నా బాధ.వీళ్ళు కేవలం వర్కహాలిక్సే కాదు.తాము చాలా సమర్థులమని నిరూపించుకోడానికి కూడా చాలా కష్టపడతారు అందుకోసం సాహిత్యం కళల వంటి మనో వికాసాన్ని కలిగించే,జీవన తాత్వికను రూపొందించే విషయాలజోలికి పోరు.తీరిక వుండదు.వాళ్ళ ఆశలకూ ,వాటిసాధనకూ ఎక్కడైనా విఘాతం కలిగితే డిప్రెస్ అయిపోతారు.ప్రాపంచక విషయ సంబంధమైన సమర్థత ఎంత అవసరమో తాత్వికత, భావావేశాల్లో సమతూకం అంతే అవసరం కదా?కానీ ఇప్పటి పరిస్థితుల్లో సమర్థత అంటే ఆర్థిక సుస్థిరతే అన్న విధంగా వుంది కనుక చాలామంది ఇలా తయారవడానికి కారణం ఏమో? ..మీ విశ్లేషణ బాగుంది..

lalithag said...

"ప్రాపంచక విషయ సంబంధమైన సమర్థత ఎంత అవసరమో తాత్వికత, భావావేశాల్లో సమతూకం అంతే అవసరం కదా?" ఈ మాటల కోసమే ఎదురు చూస్తున్నానేమో. కొందరు కళాకారులు, రచయితలూ, దేవదాసు వంటి కల్పిత పాత్రలూ గుర్తుకు వచ్చి, నాకు "భావుకత" చివరి అంచుకన్నా ఈ అంచు నయం అనిపించడం వల్లేమో ఇటువంటి వారి పట్ల అభిమానం.
ఆ భావుకత అందంగా అనిపించి, ఈ సామర్థ్యత ఉపయోగం అనిపించి రెంటిలో ఏది నా అస్తిత్వమో తేలక కష్టపడుతూ ఉండి ఉండవచ్చు నేను. ఏ చివరా మంచిది కాదు, సమతుల్యత కావాలి మీరన్నట్లు. నాకు చాలా అవసరమైన మాటలు దొరికాయి. ధన్యవాదాలు.

Anonymous said...

సత్యవతిగారూ, ముందు అభినందనలు. అంత మంచికథకి చక్కని వ్యాఖ్యలు, ముఖ్యంగా లలితజీ, మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. నేను అంతకంటె చెప్పడానికి ఏమీ లేదు. మీరంత మంచి కథ రాయడం ఒకఎత్తూ, పాఠకులు దాన్ని ఆదరించడం, దాన్నిగురించి ఆలోచించడం మరొక ఎత్తు. మరొకసారి అభినందనలతో, - మాలతి

మధురవాణి said...

అద్భుతం! తీవ్రంగా ఆలోచింపచేసేదిగా ఉంది మీ కథ!

సత్యవతి said...

మాలతి గారూ మధురవాణి గారూ చాలా సంతోషం కలిగింది మీ కామెట్స్ కి .

Kalpana Rentala said...

సత్యవతి గారు,
అందరికన్నా ఆలస్యం గా చూస్తున్నాను. ఎలా వున్నారు?
అందరి మాటే నాది కూడా. ఈ కథ గురించి, మీ కథల గురించి మనం చాలా సార్లే చెప్పుకున్నాము కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పటం లేదు.
ఈ కథ తర్వాతైనా కొందరు స్త్రీలు ఈ సిండ్రోమ్ నుంచి బయటపడగలిగితే , దీన్నోక మానసిక వ్యాధిగా గుర్తించగలిగితే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుంది?
మీ మంత్ర నగరి కంపోజ్ చేసి ఇక్కడ పెట్టరాదూ!

nagini said...

సత్యవతి గారూ! చాలా మంచి కథ రాశారండి. ఆ రోజు సాక్షి లో మీ కథ చూడగానే.. నేనైతే.. వెంటనే మా అక్కకి ఫోన్ చేసి చెప్పా.. నిజంగానే.. అమ్మని అందరం నిర్లక్ష్యం చేస్తాం.. కదా అనిపించింది.. ఎనీ వే మీకు ధన్యవాదాలు..