Wednesday, October 20, 2010

రక్తపు మరక

దసరా పండగ రోజు ఆదివారం కూడా కాబట్టి దాదాపు తెలుగు పత్రికలన్నీ కొనే అలవాటు నాకు...పత్రికలతో వచ్చే అనుబంధాల కోసం. పండగ అంటే పత్రికల్లో చాలా ప్రకటనలు, పండగ ప్రాశస్త్యాన్ని గురించి చదివీ చదివీ అరిగిపోయిన వ్యాసపరంపర మామూలే..కానీ ఈ సారి పండగ పత్రికలన్నీ నెత్తురు మరకతో వచ్చాయి. మరక మామూలే ..కానీ ఇంతలా ఎందుకు మామూలైపోయిందో తలుచుకుంటే సిగ్గేస్తుంది..రెండేళ్ళ క్రితం విజయవాడ లోని ఒక లాడ్జిలో హతమైన ఒక టీవీ యాంకర్, అంతకు ముందు ఆత్మహత్య అంటూ చెప్పిన ప్రత్యూష , హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో హతమైన .అష్టా చెమ్మా సినిమాలో రెండో హీరోయిన్.చార్మినార్ పైనుండి తోసివెయ్యబడిన అమ్మాయి..ఇప్పుడు పార్టీలలో వేడుకల్లో పాటలు పాడుతూ గాయనిగా ఎదగాలని ఆశపడుతున్న కరుణశ్రీ. ( వీళ్ళ హత్యలు .పరీక్షలు వ్రాస్తూ హత్య అయిన వరలక్ష్మి, శ్రీ లక్ష్మి ,తనగదిలోనే పడుకుని నిద్ర పోవాల్సిన ఆయెషా మీరా,యాసిడ్ దాడిలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్ధిని .హత్యల లాంటివి కావు.) నమ్మించి ప్రాణాలు తీసిన సందర్భాలు.ఇవి....ఇందులో ముగ్గురు కళాకారులు.పబ్లిక్ లోకి రావడం తప్పనిసరి.పరిచయాలు స్నేహాలు తప్పనిసరి.అయితే ఈ రంగంలో వృధ్ధిలోకి రావలసిన అమ్మాయిలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎటువంటి వత్తిళ్లకి బ్లాక్ మెయిల్స్ కి తలవొగ్గక న్యాయ వ్యవస్థ నించీ తల్లితండ్రులనించీ మిత్రుల నించీ సహాయసహకారాలు ఇచ్చి పుచ్చుకుంటూ అనుకున్న స్థాయికి ఎదగడం కాక ఇట్లా తమకి సన్నిహితులైన వారిచేతిలోనే హత్యలకి గురికావడం చూస్తుంటే వీళ్ళింత తేలిగ్గా ఎలా మోసపోతున్నారోనని బాధతో కూడిన కొంత కోపం కూడా వస్తుంది. తాజా హత్య కరుణశ్రీ అనే అమ్మాయిది. దసరా అంటించుకున్న నెత్తుటిమరక ఈమే..తనకి 28 ఏళ్ళని పత్రికలు వ్రాసాయి.ఎనిమిదేళ్ళుగా ఒకతే విజయవాడలో ఉంటూ ఉద్యోగం చేస్తూ పాటలు పాడుతోంది.ఇప్పుడు చెల్లి కూడా ఆమె దగ్గరే వుంది. టీనేజీ గడిచి దాదాపు పదేళ్ళయింది .ఎనిమిదేళ్ళు అమ్మా నాన్నల దగ్గర కాకుండా ఒకతే ఉండిన అనుభవం.గాయనిగా పైకి రావాలనే ఆకాంక్ష.మరి ఈ అమ్మాయికి తనను తను కాపాడుకునే తెలివి ఎట్లా లేకుండా పోయింది? ప్రోగ్రామ్ వుంది రమ్మని ఆర్కెష్ట్రా లీడర్ ఫోన్ చేశాడు.ఆసంగతి ఎవరికీ చెప్పొద్దన్నాడని ఫోన్ రాగానే అక్క వెళ్ళిందని చెల్లి చెబుతోంది. ప్రోగ్రామ్కి రహస్యం ఎందుకు? లాడ్జిలో మారుపేరుతో గది తీసుకోడం ఎందుకు?తనతో తన తమ్ముడున్నాడని చెప్పడం ఎందుకు? ఇదంతా ఒక పథకం ప్రకారం అతను ఆడించిన నాటకం అని అర్థమౌతూనే వుంది..అంత తేలిగ్గా నమ్మి ప్రాణాలుకోల్పోయింది..అందం స్నేహాలు సెల్ ఫోన్ లు పేరు ప్రతిష్టలు డబ్బూ ,ఇవికాక బ్రతుకు తెలివి,,తనేంచేస్తోందో ఏం అనుకుంటూందో తల్లి తండ్రులకో ,వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ కో చెప్పుకోగల నిజాయితీ ధైర్యం నిబ్బరం,ఆత్మ గౌరవం ఇవి అవసరమని ఎవరు చెప్పాలి ఇలాంటి అమాయకురాళ్ళకి? ఒక ఐడేంటీటీ కార్డ్ లేకుండా మారుపేర్లతో లాడ్జిలు బుక్ చేసుకోడం ఎన్ని హత్యలు జరిగినా ఇంకా సాధ్యమౌతూనే వుంది. హత్య చేసిన వాడు సామాన్యుడైతే దొరికి పోతాడు ఏ అసామాన్యడి సంతతో అయితే తప్పుకుంటాడు..ప్రాణంకాపాడుకునే తెలివి తెచ్చుకోనంతవరకూ ఈ దేశంలో ఆడ ప్రాణం చాలా చులకన..ఈ తెలివి తెచ్చుకోడానికి ఇప్పటి చదువు, ఇప్పటి మీడియా, ఇప్పటి తల్లితండ్రులు ఎంతవరకూ దోహదిస్తున్నారు? .ఒక వందేళ్ల కిందటి లాగా మళ్ళీ తోడులేకుండా ఆడవాళ్లు ఏపనిమీదా ఎక్కడికీ వంటరిగా వెళ్లలేని రోజులొస్తున్నాయేమో!సాధించుకున్న స్వేచ్చ చావుకు దారితియ్యకుండా చూసుకోండి అమ్మాయిలూ బ్రతకడం నేర్చుకోండి..మీ జీవితం చాలా విలువైంది. దేశానికి మీరుకావాలి..

4 comments:

Kalpana Rentala said...

సత్యవతి గారు,

కాలం ముందుకెళ్ళిపోతోంది అని తెగ సంతోశించెవాళ్ళందరికీ దీని గురించి చెప్పాలనిపిస్తుంది. ఇన్నినాళ్ల పోరాటామ్ తర్వాత కూడా ఎక్కడున్న వాళ్ళం అక్కడే కొత్త కొత్త పద్ధతుల్లో హింసకు గురవుతున్నాము.కాదా?
మరో సారి ఈ వాస్తవాన్ని గురించి చక్కగా రాశారు.

Kalpana Rentala said...

మీ ఫోటో నాకు చాలా నచ్చేసింది .మీరు అంత రిలాక్సెడ్ గా కూర్చోవడం...మిమ్మల్ని చూసి చాలా ఏళ్లు అయిపోయింది. ఎలా వున్నారు సత్యవతి గారు? మీవి, మాలతి గారివి పాత పోస్ట్ లు చాలా వున్నాయి చదవాల్సినది. ఎప్పుడూ చదువుతానో ఏమో?

సత్యవతి said...

చెప్పాల్సిందంతా చెప్పకుండానే రిలాక్స్ అయిపోతున్నాను చూశావా!!

Kalpana Rentala said...

cheppalsimdi amtaa cheppesaaremo...asalu meeku aa bhamgima lo photo digavachchanna ideaa vachchinanduku mechchukovaali. emamtaaru?