Thursday, October 28, 2010

వాసిరెడ్డి సీతాదేవి

స్వాతంత్య్రానంతర తొలి కథా రచయిత్రులలో ఒకరైన సీతాదేవి నవలారచయిత్రి గా ప్రఖ్యాతి పొందినప్పటికీ 1952 లో రచన ప్రారంభింciచింది కథల తోనే. గుంటూరు జిల్లా చేబ్రోలు లో ఘోషా పాటించే కుటుంబంలో పుట్టి రోడ్డుదాటి పాఠశాలకు వెళ్లడానికి ఆడపిల్లలకు అనుమతి లేక , ప్రయాణించే ఒంటెద్దు బండీకో గుర్రం బండికో పరదా కట్టుకోడం తప్పనిసరి అయిన కాలంలో వీధి బడిలో అయిదవ తరగతి వరకే చదువుకుని ఆపైన సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మగారు ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఒక సంవత్సరం మాత్రమే నడిపగలిగిన పాఠశాలలో హిందీ నేర్చుకుని స్వయంగా చదివి విశారద పాసై ఒంటరిగా మద్రాసు లో సనాతన ధర్మ కన్యా పాఠశాలలో ఉద్యోగం తో మొదలుపెట్టి ,హిందీలో అత్యున్నత పట్టమైన సాహిత్య రత్నే గాక ఎస్సెస్సెల్సీ దగ్గరనుంచీ ఎం.ఎ వరకూ ప్రయివేటుగా చదువుకున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశారు.హిందీ విద్యాలయంలో పనిచేసే రోజుల్లో నాటకాల్లో వేసి బహుమతులు కూడా తెచ్చుకున్నారు.కొన్ని నాటకాలు డైరెక్ట్ కూడా చేశారు ,యూడీసీగా ప్రభుత్వోద్యోగంలో చేరి జవహర్ బాలభవన్ డైరక్టర్ గా పదవీ విరమణ చేసిన సీతాదేవిది అలుపెరగని జీవన ప్రయాణం ,దానితో పాటు సాహితీ ప్రయాణం..ఉద్యోగంలో ఊపిరి సలపని పని ఉన్నా కొన్ని సమస్యలెదురైనా ఆరోగ్యం ఇబ్బందిపెట్టినా మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచి సాహిత్య సృష్టి కొనసాగించారు..39 నవలలతో పాటు దాదాపు వంద కథల వరకూ తొమ్మిది కథాసంపుటాలుగా ప్రచురించారు ..ఆ కథలన్నీ ఇప్పుడు దొరకక పోయినా సీతాదేవి సాహిత్యాన్ని అయిదు సంపుటాలుగా ప్రచురించిన విశాలాంధ్ర ఒక యాభై కధలను ఒక సంపుటంగా వేశారు.ఆమె వ్రాసిన మంచికథలు దాదాపు అన్నీ ఇందులో ఉన్నాయి.రచన ప్రారంభించిన 50 లలోనే ఆమె దాదాపు 15 కథల దాకా వ్రాసి 54 లోనే వాసిరెడ్ది సీతాదేవి కథలు అనే కథా సంపుటి ప్రచురించారు. రచయితల సమగ్ర కథా సంపుటులు ప్రచురించేటప్పుడు ,ప్రచురణకర్తలు కొన్ని కనీసపు అలవాట్లు చేసుకుంటే బాగుంటుంది..కనీసపు అలవాట్లలో ముఖ్యమైనది కథలని కాలానుక్రమంలో(క్రానలాజికల్).. వెయ్యడం.. విశాలంధ్ర వారి సంపుటి లో సీతాదేవి గారి మొదటి కథ చివర్లోనూ రెండవ కథ మధ్యలోనూ ,మధ్యెప్పుడో వ్రాసిన కథ మొదట్లోనూ ఉండి ఆమె కథా రచనలో, తీసుకున్న వస్తువులో వచ్చిన పరిణామాలను తెలుసుకోడానికి ఒక పట్టిక తయార చేసుకోవలసి వచ్చింది.


సీతాదేవి కథలెక్కువగా సమాజపు అంచులలో జీవించేవారి గురించిన చింతనతో వుంటాయి.ఆమె తొలికథ “సాంబయ్యపెళ్లి” లో “కురూపీ,అష్ట దరిద్రుడూ” అయిన సాంబయ్య ఒకింట్లో జీతానికి వుంటాడు.చిన్నప్పుడే మశూచి సోకి మొహమంతా చెదలు తిన్నట్లయి పోవడమే కాక ఒక కన్ను కూడా కాయ కాసిపోయింది..అతన్ని చూసి అసహ్యించుకునే వారే కానీ రవ్వంత ప్రేమగా మాట్లాడే వారే లేరు.అటువంటి సాంబయ్యకి పెళ్ళి కుదిరింది. పిల్ల మేనమామ వచ్చి తన మేనకోడల్ని ఇస్తానని చెబుతాడు.ఇన్నాళ్ళకు తనకో తోడు దొరుకుతున్నందుకు సంబరపడ్డాడు.ఆ విషయమే యజమానురాలికి చెబితే పది రూపాయలు చేతిలోపెట్టి “పిల్ల కుంటిదో గుడ్డిదో కాదుకదా?అని అతని గుండెలో ఒక ముల్లు గుచ్చింది..తన భార్య గుడ్డిదైనా ఫరవాలేదు తనను చూడదు కనుక అసహ్యించుకోదు అనుకుంటాడు సాంబయ్య... చివరికి అది మూగపిల్లని తెలిసి కోపంతో బయటికి గెంటి తలుపేస్తాడు తన దురద్రుష్టాన్ని, తనకు జరిగిన మోసాన్ని తలుచుకుని ఏడుస్తాడు. తరువాత తనలాగే పరమ పేదదైన ఆ దురద్రుష్ట వంతురాలిని అక్కున చేర్చుకుంటాడు...ఆమె రెండవ కథ ధర్మదేవత గుడ్డికళ్లు లో ఒక పేద దంపతులు తగాదా పడి కొట్టుకుని తిట్టుకుంటుంతే చూపరులు పోలిస్ రిపోర్ట్ ఇచ్చి కొట్టే భర్తని అప్పగిస్తారు.ఇలాంటి హింస మధ్యతరగతిలో కూడా వుంటుంది కానీ అది మూసిన తలుపుల వెనక జరుగుతుంది.ఈ దంపతుల జీవితం తలుపులు లేని రోడ్డుమీద కనక అంతా బాహాటమే..జైలుకు వెళ్ళిన భర్తా ,ఇంటి దగ్గర భార్యా పశ్చాత్తాపంతో ఒకళ్లకోసం ఒకళ్ళు ఎదురుచూస్తారు .జైలులో అతనికి ఒక విప్లవకారుడు భార్యని కొట్టడం తప్పు అని చెబుతాడు.అప్పటివరకూ భార్యల్ని కొట్టడం సహజమే ననుకుంటున్న అతను ఇంక కొట్టకూడదని నిర్ణయించుకుంటాడు మరొక కథ “ఎల్లమ్మ తెల్ల రూపాయి” లో నెల్లూరు జిల్లానించీ మద్రాసుకు వచ్చి భోజనం కారేజీలు అందించి జీవనం సాగించే ఎల్లమ్మ ఆ క్యారేజీల్లో మిగిలిన అన్నాన్ని కూడా ముద్దలు చేసి బేడకీ పావలాకీ అమ్మి ఒక రూపా యి కళ్ళజూస్తుంది.అన్నం మిగలని రోజు రూపాయి వుండదు .క్యారేజీలు తెప్పించుకున్న వాళ్ళిచ్చే జీతమే.ఎల్లమ్మ దగ్గరకు ఒక నాడు పిచ్చివాలకంలో వున్న ఒకస్త్రీ అమిత ఆకలితో వచ్చి ఆమె దగ్గరున్న అన్నాన్ని ఆబగా తింటుందే కానీ డబ్బులివ్వదు.ఆమె జుట్టు పట్టుకున్న ఎల్లమ్మ ఆమె పరిస్థితీ ,ఆమె ద్వారా తన ఊళ్ళో తన భర్త చనిపోయిన విషయమూ తెలుసుకుని తన మెళ్ళొ వున్న చింతాకంత బంగారపు మంగళసూత్రం ఆమెకిచ్చి ఆమె భర్త బ్రతికే వున్నాడుకనుక వేసుకోమంటుంది .కానీ తన మొగుడే తాళి తెంపి పొమ్మన్నప్పుడు ఇంక ఎందుకది అని ఎల్లమ్మకో సలహా ఇస్తుంది.అది అమ్ముకుని వ్యాపారం చేసుకో మని .అందులో “లాజిక్”అర్థమైన ఎల్లమ్మ ఆ స్త్రీని కూడా తనతో వుండమనీ ఇద్దరం కలిసి అన్నం ముద్దల వ్యాపారం చేసుకుందామనీ తన గుడిసెలో చోటిస్తుంది. ఇప్పటికీ తాళి పవిత్రీకరణ సిండ్రోమ్ నించీ బయటపడని ప్రసార మాధ్యమాలకి,.1953 లోనే తాళి గురించి ఇలాంటి ’లాజిక్” వాడారు సీతాదేవి.. ,పురుషుడు తన్ని తగిలేసినా స్త్రీలు ఒకరికొకరు అండగా నిలిచి బ్రతకగలరనే భరోసాని ఈ కథ అర్థం చేయిస్తుంది. .


ఏడుకొండలవాడు అనే కథలో వెంకాయి,మెలికెలకడియాలు అనేకథలో రామిగాడు .నా కథ వ్రాయవూ లో లక్ష్మి.,చిచ్చుబుడ్డి కథలో పోచయ్య,.వీరంతా భూస్వాముల చేత దగాపడ్డ వారే..మెలికల కడియాలు లో రామిగాడు,నా కథ వ్రాయవూ లో లక్ష్మి తన తోటి వారి చేతకూడా మోసగింపబడతారు. చిచ్చుబుడ్డి అనేకథలో తన కొడుకు వెలిగించిన అటంబాంబు పేలకపోతే పెదజీతకాడైన పోచయ్యకొడుకు( చిన్నజీతగాడు) యాదగిరిని వెళ్ళి చూడమన్నాడు యజమాని భూషయ్య..దగ్గరకు వెళ్ళిన యాదగిరి మీద పేలిన ఆటంబాంబు అతని చావుకి కారణమైంది అయినా ఆ ఇల్లు వదలక కొడుకు స్మృతులతో బ్రతుకుతున్నాడు పోచయ్య.సంవత్సరం తిరిగి మళ్ళీ దీపావళొచ్చింది.ఈ సారి వెలగని చిచ్చుబుడ్ది దగ్గరకు మరో చిన్న జీతగాడు నరిసింహ ను పంపుతున్నాడు భూషయ్య ,అతన్ని వెనక్కి నెట్టి తను బలయ్యాడు పోఛయ్య..ఎవరి ప్రాణాలు ఖరీదో ఎవరివి చౌకో ఖామందులకి తెలిసినట్లు ఎవరికి తెలుస్తుంది కనుక!!


స్వాతంత్ర్యానంతర తొలి దశాబ్దాలలో ఆంధ్రదేశంలో వస్తున్న మార్పుల్ని.స్వామివార్ల ఆశ్రమాలలో జరిగే దుష్కృత్యాలను ,ఉద్యోగినులెదుర్కొనే సమస్యల్ని,మూఢనమ్మకాలను గురించి, భర్తల హోదాలను బట్టి అతిశయం పెంచుకునే అజ్ఞానులైన స్త్రీలగురించి.కొన్ని మానసిక సమస్యల గురించి వ్రాసిన సీతాదేవి, స్త్రీలపేరుతో కథలు వ్రాసే వారి మీద ,దెయ్యాల కథలు వ్రాసేవారిమీద ,రాజకీయాల మీద ,వ్యంగ్య రచనలు కూడా చేశారు.అమ్మమ్మ చెప్పని కథ అనే వ్యంగ్య హాస్య కథ కూడా రచయితల మీదే..”తరాలు అంతరాలు”,’ మారిపోయిన మనిషి” అనే కథల్లో భూస్వామ్య విలువల నించీ అప్పుడప్పుడే బయటపడుతున్న సమాజాన్ని చిత్రించారు. “తరాలు అంతరాలు” కథలో ఇరవై సంవత్సరాలలో తన వూరిలోనూ అక్కడి స్త్రీల జీవితాల్లోనూ వచ్చిన మార్పుని అర్థం చేసుకుంటూ మరొక ఇరవై సంవత్సరాలలో స్త్రీలు చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకుని ఒకరి వ్యక్తిగత జీవితాలలో ఒకరు కల్పించుకోకుండా సఖ్యంగా జీవించగరని ఆశిస్తుంది...తన నాయనమ్మను ఆమె అత్త పెట్టిన కష్టాలతో పోల్చుకుంటే ఆమె తన తల్లిని పెట్టిన కష్టాలు చాలా స్వల్పమైనవి..ఇప్పుడు తన తల్లి ఆమె కోడలు తనను లక్ష్య పెట్టలేదని బాధపడుతున్నది.మగవాళ్ళతో సమానమైన తిండికి కూడా నోచుకోని తరం ఒకటి ,.ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ,చదువుని, కలలో కూడా ఊహించని తరం ఒకటి,చదువుకోసం పోరాడిన తన తరం ఒకటి కాగా అప్పుడు ఆమె అన్న పిల్లలు పొరుగూరికి పోయి చదువుకుంటున్నారు మగపిల్లల్తో సమానంగా..ఇ.రవై ఏళ్ళల్లో వూరు అనూహ్యంగా మారింది.పూర్వం స్త్రీలు ఊసుపోక కబుర్లతో పరస్పరం జుట్లు పట్టుకుంటూ వుండేవారు అప్పుడు పత్రికలు చదువు తున్నారు.నహిళా మండళ్ళు పెట్టుకుంటున్నారు.”ఈ నాడు చదువుకుంటున్న పిల్లలు రేపు కోడళ్ళు ,ఎళ్ళుండి అత్తలూ అవుతారు. వాళ్ళూ అత్తలయ్యేటప్పటికి అత్తా కోడళ్ళు వొకరి వ్యక్తిగత విషయాలలో ఒకరు పట్టీంచుకోకుండా ఒకర్నొకరు అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రయత్నించవచ్చును” అనుకుంటుంది. “మారిపోయిన మనిషి” కథలో శేషయ్యది జమీందారీ కుటుంబం.అతని తాత ఊళ్ళో ఒక దేవాలయం కట్టీంచాడు.ఒక సత్రం తవ్వించాడు.ఒక నుయ్యి తవ్వించాడు.ఒక మర్రి చెట్టు కూడ నాటించాడు.శేషయ్య తండ్రి దాన ధర్మాలకు పదిహేనెకరాల సుక్షేత్రమైన మాగాణి కర్పూర హారతిచ్చాడు. శేషయ్యకూడా ఉడతా భక్తిగా మిగిలిన పదెకరాలూ ఖర్చుచేసి వంశప్ర్రతిష్ట నిలబెట్టి ఒక అర్థ శతాబ్దం హాయిగా కాలక్షేపం చేసాడు. ఇప్పుడతనికి మిగిలింది ఇల్లు మాత్రమే...పైగా అప్పులతో పాటు కూతురు పెళ్ళి సమస్య ఒకటి.ఇంట్లో వెండి బంగారం, చెంబు తప్పేలా కూడా మాయమై పోతున్నై. ఆ పరిస్థితిలో అతని భార్య రామ సుబ్బమ్మ ఇడ్డెన్ల వ్యాపారం చేసి ఇల్లు గడిపి కూతురకి పెళ్ళి చెయ్యాలనే నిర్ణయానికొచ్చింది.అది తన వంశ ప్రతిష్టకి భంగమని శేషయ్య ఆమె మీద చెయ్యెత్తాడు.అయినా గానీ ఆమే తన మెడలోని నల్లపూసల గొలుసమ్మి ఆ డబ్బుతో మినప్పప్పూ బియ్యమూ ఇడ్లీ పాత్రా కొనాలని దాచింది.భార్య ఇడ్డెన్ల లమ్మడం అవమానమని భావించిన శేషయ్య ఆ డబ్బు తీసుకుని కాశికి పోయి అక్కడ గంగలో దూకి చనిపోవాలని వెళ్ళి పోయాడు.కానీ కాశీ లో పోలీసులతన్ని దొంగగా అనుమానించి జైల్లో పెట్తారు.జైలు జీవితం అతని ఆలోచనల్లో మార్పు తెచ్చింది.శిక్ష పూర్తై ఇంటికొచ్చేసరికి రామ సుబ్బమ్మ ఒక హోటల్ నడపటమే కాక కూతురికి పెళ్ళి చేసి అల్లుడిని కూడా తన హోటల్ లోనే సహాయంగా వుంచుకుంటుంది. అంతవరకూ భౌతికంగా గాని మేధోపరంగా గాని శ్రమపడకుండా కూర్చుని తినడానికి అలవాటుపడ్ద మగవాడు పరువు పేరుతో పలాయనం చిత్తగిస్తే సంసార భారాన్ని నెత్తినేసుకున్న స్త్రీలు ఆరోజుల్లోఎక్కువ కనిపించేవారు . బ్రతికి చెడ్డ కుటుంబాల నించీ అప్పటివరకూ నాలుగు గోడలమధ్య వున్న స్త్రీలు బయటకొచ్చి సంపాదించడం మొదలౌతున్న వైనం ఈ కథ..


.భక్తి ఇబ్బడి ముబ్బడిగా పొంగిపోయిన డ్రయిన్ లా ప్రవహిస్తూన్న తరుణంలొ ఆ ధోరణిని ఉపయోగించుకుని డబ్బూ గ్లామరూ పది చేతులతో జుర్రుకుంటున్న స్వామివార్ల ఆశ్రమాల్లో జరిగే అరాచకాలను, ఆశ్రమాల మీద పట్టుకోసం అంతర్గత పోరాటాలనూ స్వాముల శృంగారం భక్త స్త్రీల పట్ల ప్రాణాంతకంగా మారడం మామూలుకథే.. అయితే ఎప్పుడైనా ఆత్మసాక్షాత్కారం కలిగి తమ తప్పు ఒప్పుకునే స్వేచ్చ స్వాములకి వుండదు .వాళ్ళు తమ పరువు ప్రతిష్టలకి బందీలు.స్వామి తప్పు చేస్తే ఆశ్రమానకే చెడ్డపేరొస్తుంది ఆదాయానికి గండి పడుతుంది .కనుక స్వామి వారికి మతి చలించిందని పిచ్చాసుపత్రికి పంపడం ఒక్కటే మార్గం.”సత్ చిత్ ఆనంద్””,ధర్మాసనం” అనే రెందు కథల్లో ఆశ్రమ వాతావరణాలను కళ్లకి కట్టించారు సీతాదేవి.మూఢ నమ్మకాలపై గ్రహబలం కథ వ్రాసినట్లె ఆ మూఢనమ్మకాన్ని కూడా బ్రతుకు చక్క బెట్టుకోడానికి వాడుకున్న తెలివైన అమ్మాయికథ “గణాచారి”..పల్లెల్లో గణాచార్లకి చాలా విలువ వుంటుంది.ఆ పూనకాన్నీ అది వచ్చినప్పుడు జనాలు పోసే బిందెలకొద్దీ నీళ్ళనీ తట్టుకోగలిగితే గణాచారి పేరుమీద ఏ కార్యమైనా సాధించవచ్చు..ఇరవై ఏళ్లకే భర్త పోయిన మంగమ్మ తన నోటి బలంతో బంధువుల బారినించీ ఆస్తిని కాపాడ్డమే కాకుండా తన కొడుకుని మాటజవదాటకుండా కొంగుచాటున పెంచింది..అట్లా పెరిగిన చలపతి స్వయంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని వాజమ్మ లా తయారయ్యాడు. అతనికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది.కానీ వియ్యంకుడు భద్రయ్య అల్లుడికిస్తానన్న పొలం కూతురిపేర పెట్టడంతో కోడల్ని పుట్టింట్లోనే వుంచేసింది...ఆ పిల్ల జాతకంలో భర్తృ వియోగం వున్నదని జ్యోతిష్యులు చెప్పడంవల్ల కూతురి పేరే ఆస్తి పెట్టాడాయన.అది మార్చడానికి ఒప్పుకోలేదు.చలపతి భార్య గంగాభవాని గణాచారి పూనకాన్ని చూసింది.తనకి కూడా అమ్మవారు ఆవేశించినట్లు ఊగిపోయి గంగాభవానిని తీసుకుపొమ్మని హుంకరించింది...ఇంకేం పనయిపోయింది.జాతకాల బూటకాన్ని అవి నమ్మినందవల్ల వచ్చే ఆపదలు జ్యోతిష్యునికే కనువిప్పు కలిగించిన కథ “తమసోమా జ్యోతిర్గమయ”


కార్యాలయాల్లో ఉద్యోగినులపై జరిగే పైకి కనిపించని లైంగిక వేధింపులు ,కుటుంబభారాన్ని మోసే చిరు ఉద్యోగినులు వాటికి లోంగిపోయే పరిస్థితులు ఆమె నవ్వింది కథ.. మానసిక విశ్లేషణతో కూడిన కథలలో ఇంటిపని అనే అనుదిన చర్య, బయట వినిపించే ఘోరమైన వార్తలు,ఒంటరితనం స్త్రీలకు ఎట్లా పిచ్చెక్కిస్తాయో చెప్పే కథ “విభ్రమ” ,అసలు సమస్య కన్న సానుభూతిపరుల మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో చూపే కథ’సానుభూతి” అట్లాగే ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ తో వపరీత ప్రవర్తనతో చివరికి మానసక వైద్యశాలలో తేలిన వ్యక్తి గురించిన కథ “భయం” స్త్రీల అజ్ఞానపు అహంకారాన్ని వర్ణించే కథలు మిసెస్ కైలాసం,రత్తమ్మ కష్టాలు..రత్తమ్మ కష్టాలు కథ హిందీ ప్రచార సభలో ఉద్యోగం ఊడగొట్టిందనీ సాహిత్యానికా ప్రభావం వుందనీ అంటారు సీతాదేవి ,తన అనుభవాలు గురించి చెబుతూ...మీ ఒటు నాకే అనేది అధ్భుతమైన పొలిటికల్ సెటైర్. కొందరు రచయితలలో రచనకీ ఆచరణకీ మధ్య నుండే అఘాతాన్ని చెప్పే కథ “తనదాకా వస్తే” బొత్తిగా సాహిత్య పరిజ్ఞానమూ లోకజ్ఞానమూ లేకుండా కథలు వ్రాసే వాళ్ళమీద వ్యంగ్యాస్త్రం “ఇంటర్ వ్యూ” ..


సీతాదేవిది సూటి అయిన కథనం .అదే ఆమె శిల్పం.ఇన్ని కథలలో ఎక్కడా తెలుగు తప్ప ఇంగ్లీష్ మాటలు కనపడకపోవడం కథలలో ఆయా వ్యక్తులకు తిట్ల దగ్గర్నుంచీ అచ్చమైన గుంటూరు భాష వాడడం స్థానికత ను గుబాళిస్తుంది.అప్పట్లో అంటె స్వాతత్ర్యానికి ముందూ ఆతరవాత కొద్దికాలమూ “వెంకాయ్’ కోటాయ్ ,మాణిక్యాం సుబ్బాం అట్లాంటి పిలుపులు వుండేవి.అట్లాగే “నీ శిరసు పగల.” నీ అమ్మ కడుపు మాడ” “ఓరి నీ దుంపతెగ” లాంటి తిట్లు కూడా..”మంచీ సెబ్బర” “గుండెకాయ” ఇడ్డెన్లు ..లాంటి అచ్చమైన గ్రామీణ భాష వాడతారు”.మీఓటు నాకే” ,”ధర్మాసనం” కథలు కొంచెం భిన్నంగావున్నా అచ్చతెలుగే....దీర్ఘకాలం నగరంలో వున్నా ఆమె ఎప్పుడూ చేబ్రోలు అమ్మాయి భాషనే వాడారు ఆమె కథల్లో ఎక్కడా ఉపన్యాసాలుండవు.కథ నడిచే పథ్థతిలోనే చెప్పదలుచుకున్న విషయం బయటపడుతుంది ..చుక్కలు కలుపుకుంటూ పోతే వచ్చే చిత్తరువులాగా..తొలి నాళ్ళలోనే కుటుంబరావు గోపీచంద్ వంటి అప్పటికే ప్రఖ్యాతులైన రచయితల ప్రశంశలు పొందారు .నవలా రచన లో ముణిగి కథలు వ్రాయడం తగ్గించి వుండక పోతే ఆమెకున్న ఉద్యోగానుభవం, జీవితానుభవాలతో మరిన్ని మంచికథలు వ్రాసి వుండొచ్చేమో..


“ముందూ వెనకా ఎటువంటి రక్షణలు ఏర్పాటు చేసుకోకుండానే ఒంటరిగా ఇంతదూరం పయనించాను..మరి ఈ నాడు తల్లి తండ్రులు చదివిస్తుంటే కాలేజి చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ భర్త బాధ పెడుతున్నాడంటూ ఆత్మ హత్యలకు పాల్పడుతున్న స్త్రీలనేమనుకోవాలి?..పురుషుడి రక్షణలేని స్త్రీని ఈ సమాజం గౌరవించదనీ బతకనివ్వదనీ భ్రమ పడడం వల్లనా? అంత చిన్న వయసులో ఒంటరిగా స్వతంత్రంగా జీవితం ప్రారంభించిన నన్నుసమాజం ఏమీచెయ్యలేకపోయింది . ఈ సమాజం నుంచీ నేను బోలెడంత గౌరవం ప్రేమ ఆదరణలను పొందాను..” అంటారు సీతాదేవి...స్త్రీలు సమరశీలురు కావాలంటారు..స్త్రీవాదుల గురించి “...


వీరి రచనల్లో ఆవేశముంది,ఆవేదన వుంది ఆర్థత వుంది,భావవ్యక్తీకరణలో స్పష్టత, శబ్ద ప్రయోగంలో బలం, రచనా శిల్పంలో నైపుణ్యం కనిపిస్తాయి..చాలా పవర్ ఫుల్ గా వ్రాస్తున్నారు. స్త్రీవాద రచయిత్రులు తమ దృష్టిని సమాజంలోని ఇతర సమస్యల వైపు కూడా సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ’అంటారు (ఒక ఇంటర్ వ్యూ)) మట్టిమనిషి మరీచిక వైతరిణి వంటి ప్రసిధ్ధ నవలలు వ్రాసిన సీతాదేవి అందుకోని అవార్డు లేదేమో ,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తప్ప...


డిసెంబర్ పన్నెండు 1932 లో జన్మించిన వాసిరెడ్ది సీతాదేవి పదమూడు ఏప్రిల్ 20007 లో వెళ్ళిపోయారు..
’......

Wednesday, October 20, 2010

రక్తపు మరక

దసరా పండగ రోజు ఆదివారం కూడా కాబట్టి దాదాపు తెలుగు పత్రికలన్నీ కొనే అలవాటు నాకు...పత్రికలతో వచ్చే అనుబంధాల కోసం. పండగ అంటే పత్రికల్లో చాలా ప్రకటనలు, పండగ ప్రాశస్త్యాన్ని గురించి చదివీ చదివీ అరిగిపోయిన వ్యాసపరంపర మామూలే..కానీ ఈ సారి పండగ పత్రికలన్నీ నెత్తురు మరకతో వచ్చాయి. మరక మామూలే ..కానీ ఇంతలా ఎందుకు మామూలైపోయిందో తలుచుకుంటే సిగ్గేస్తుంది..రెండేళ్ళ క్రితం విజయవాడ లోని ఒక లాడ్జిలో హతమైన ఒక టీవీ యాంకర్, అంతకు ముందు ఆత్మహత్య అంటూ చెప్పిన ప్రత్యూష , హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో హతమైన .అష్టా చెమ్మా సినిమాలో రెండో హీరోయిన్.చార్మినార్ పైనుండి తోసివెయ్యబడిన అమ్మాయి..ఇప్పుడు పార్టీలలో వేడుకల్లో పాటలు పాడుతూ గాయనిగా ఎదగాలని ఆశపడుతున్న కరుణశ్రీ. ( వీళ్ళ హత్యలు .పరీక్షలు వ్రాస్తూ హత్య అయిన వరలక్ష్మి, శ్రీ లక్ష్మి ,తనగదిలోనే పడుకుని నిద్ర పోవాల్సిన ఆయెషా మీరా,యాసిడ్ దాడిలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్ధిని .హత్యల లాంటివి కావు.) నమ్మించి ప్రాణాలు తీసిన సందర్భాలు.ఇవి....ఇందులో ముగ్గురు కళాకారులు.పబ్లిక్ లోకి రావడం తప్పనిసరి.పరిచయాలు స్నేహాలు తప్పనిసరి.అయితే ఈ రంగంలో వృధ్ధిలోకి రావలసిన అమ్మాయిలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎటువంటి వత్తిళ్లకి బ్లాక్ మెయిల్స్ కి తలవొగ్గక న్యాయ వ్యవస్థ నించీ తల్లితండ్రులనించీ మిత్రుల నించీ సహాయసహకారాలు ఇచ్చి పుచ్చుకుంటూ అనుకున్న స్థాయికి ఎదగడం కాక ఇట్లా తమకి సన్నిహితులైన వారిచేతిలోనే హత్యలకి గురికావడం చూస్తుంటే వీళ్ళింత తేలిగ్గా ఎలా మోసపోతున్నారోనని బాధతో కూడిన కొంత కోపం కూడా వస్తుంది. తాజా హత్య కరుణశ్రీ అనే అమ్మాయిది. దసరా అంటించుకున్న నెత్తుటిమరక ఈమే..తనకి 28 ఏళ్ళని పత్రికలు వ్రాసాయి.ఎనిమిదేళ్ళుగా ఒకతే విజయవాడలో ఉంటూ ఉద్యోగం చేస్తూ పాటలు పాడుతోంది.ఇప్పుడు చెల్లి కూడా ఆమె దగ్గరే వుంది. టీనేజీ గడిచి దాదాపు పదేళ్ళయింది .ఎనిమిదేళ్ళు అమ్మా నాన్నల దగ్గర కాకుండా ఒకతే ఉండిన అనుభవం.గాయనిగా పైకి రావాలనే ఆకాంక్ష.మరి ఈ అమ్మాయికి తనను తను కాపాడుకునే తెలివి ఎట్లా లేకుండా పోయింది? ప్రోగ్రామ్ వుంది రమ్మని ఆర్కెష్ట్రా లీడర్ ఫోన్ చేశాడు.ఆసంగతి ఎవరికీ చెప్పొద్దన్నాడని ఫోన్ రాగానే అక్క వెళ్ళిందని చెల్లి చెబుతోంది. ప్రోగ్రామ్కి రహస్యం ఎందుకు? లాడ్జిలో మారుపేరుతో గది తీసుకోడం ఎందుకు?తనతో తన తమ్ముడున్నాడని చెప్పడం ఎందుకు? ఇదంతా ఒక పథకం ప్రకారం అతను ఆడించిన నాటకం అని అర్థమౌతూనే వుంది..అంత తేలిగ్గా నమ్మి ప్రాణాలుకోల్పోయింది..అందం స్నేహాలు సెల్ ఫోన్ లు పేరు ప్రతిష్టలు డబ్బూ ,ఇవికాక బ్రతుకు తెలివి,,తనేంచేస్తోందో ఏం అనుకుంటూందో తల్లి తండ్రులకో ,వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ కో చెప్పుకోగల నిజాయితీ ధైర్యం నిబ్బరం,ఆత్మ గౌరవం ఇవి అవసరమని ఎవరు చెప్పాలి ఇలాంటి అమాయకురాళ్ళకి? ఒక ఐడేంటీటీ కార్డ్ లేకుండా మారుపేర్లతో లాడ్జిలు బుక్ చేసుకోడం ఎన్ని హత్యలు జరిగినా ఇంకా సాధ్యమౌతూనే వుంది. హత్య చేసిన వాడు సామాన్యుడైతే దొరికి పోతాడు ఏ అసామాన్యడి సంతతో అయితే తప్పుకుంటాడు..ప్రాణంకాపాడుకునే తెలివి తెచ్చుకోనంతవరకూ ఈ దేశంలో ఆడ ప్రాణం చాలా చులకన..ఈ తెలివి తెచ్చుకోడానికి ఇప్పటి చదువు, ఇప్పటి మీడియా, ఇప్పటి తల్లితండ్రులు ఎంతవరకూ దోహదిస్తున్నారు? .ఒక వందేళ్ల కిందటి లాగా మళ్ళీ తోడులేకుండా ఆడవాళ్లు ఏపనిమీదా ఎక్కడికీ వంటరిగా వెళ్లలేని రోజులొస్తున్నాయేమో!సాధించుకున్న స్వేచ్చ చావుకు దారితియ్యకుండా చూసుకోండి అమ్మాయిలూ బ్రతకడం నేర్చుకోండి..మీ జీవితం చాలా విలువైంది. దేశానికి మీరుకావాలి..

Wednesday, October 06, 2010

నిడదవోలు మాలతి

పంథొమ్మిదివందల యాభైల్లో కధలు వ్రాయడం మొదలు పెట్టి ఇప్పడు తన స్వంత వెబ్ పత్రికలు తెలుగు, ఇంగ్లిష్ తూలికలు నిర్వహిస్తూ,దాదాపు వంద తెలుగు కధల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి ,ఇంగ్లిష్ లో మూడు అనువాద కధా సంకలనాలు. The Spectrum of My People( జైకో బుక్స్) “From My Front Porch” (సాహిత్య అకాడెమీ ప్రచురణ) All I wanted to Read and other stories వెలువరించారు. మొదటి రెండూ ప్రసిద్ధ రచయితల తెలుగు కథలకు ఆమె చేసిన ఇంగ్లిష్ అనువాదాలు కాగా మూడవది తన తెలుగు కథలకు ఆమె ఇంగ్లిష్ అనువాదం. . ఇవి కాక Quiet and Quaint: Telugu Women's Writing: 1950-1975 – అనే పుస్తకాన్ని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఇది రెండున్నర దశాబ్దాలపాటు మన రచయిత్రులు సాధించిన ఘనవిజయానికి వెనక గల సాంఘిక, కౌటుంబిక పరిస్థితులూ, వారిరచనల్లో కథా వస్తువులూ, శిల్పం పరిశీలిస్తూ రాసిన పుస్తకం..తెలుగులో “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” అనే కధా సంకలనం 44 కథలతో 2005 లో వచ్చింది.మరో సంకలనం 22 కథలతో “కథల అత్తయ్యగారు “ త్వరలో రాబోతోంది,’చాతక పక్షులు”అనే నవల కూడా రాబోతోంది. ఆంధ్రాయూనివర్సిటి నించీ ఇంగ్లిష్ ఆనర్స్ ,లైబ్రరీ సైన్స్ చదివి ఢిల్లీలో లైబ్రరీ సైన్స్ లో పి.జి చేశారు.తొమ్మిది సంవత్సరాలు తిరుపతి యూనివర్సిటి లో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పని చేశారు 1973నించి అమెరికాలో వుంటున్నారు.ఆమె కధల్లో ఎక్కువ కనిపించే విశాఖపట్నం ఆమెది .చిన్నప్పుడు అమ్మ వెనుక తిరుగుతూ కమ్మని తెలుగుని సామెతలతో సహా నేర్చుకున్నారు.అందుకే ఆమె కధలన్నిటికీ చక్కని తెలుగు శీర్షికలుంటాయి. నిడదవోలు మాలతి గార్ని గురించిన స్థూల పరిచయం ఇది


కధలు వ్రాయడం చిన్న వయసులోనే, 1950 దశకానికి ముందే మొదలు పెట్టినా ఎదుగుతున్న కొద్దీ కొంత పునాది వేసుకుని రచనలకు మెరుగులు దిద్దుకున్న తరం అది. కొంత తెలుగు సాహిత్యాధ్యయనం భాషాజ్ఞానం సామాజిక పరిశీలన ఆ పునాది,... సాహిత్యాభిరుచి కల కుటుంబంలో జన్మించి,ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకుని సంస్కృతం కూడా నేర్చుకుని,ఇంగ్లిష్ లో మాస్టర్స్ చేసి ,మానవ స్వభావాన్ని నిష్పాక్షికంగా పరిశీలించి సహానుభూతితో వారిని గురించి వ్రాసారు నిడదవోలు మాలతి . అప్పటినించి ఆమె రచన ప్రవాహశీలంగా సాగుతూనే వుంది.కొందమంది రచయితల వలె ఏదో ఒక మలుపుదగ్గర నిలిచి అదే స్థిరభావంతో కాక సమకాలీనంగా ప్రవహిస్తోందనడానికి ఆమె నిర్వహిస్తున్న బ్లాగ్ లే దర్పణాలు.ఒక వ్యక్తి స్వభావం గురించి చెప్పినా ఒక సంఘటన ప్రభావం గురించి చెప్పినా రచయిత గా ఒక పాత్ర తరఫున వకాల్తా పుచ్చుకుని ఓవర్ టోన్స్ లోకి వెళ్ళకుండా తనపాత్ర లన్నిటిపైనా సానుభూతితో వ్రాస్తారు. ఆమె రచనల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగానే వుంటాయి .అయితే వాళ్ళ బాధల్ని,వాళ్ళపై హింసని మాత్రమే పట్టించుకుని వారి జీవితాల్లోని ఇతర పార్య్వాలను వదిలిపెట్టరు.జీవితాన్ని అన్ని రంగుల్లోనూ అన్నికోణాల్లోనూ ఒకింత సమతూకంతో పరిశీలిస్తారు.” హింస మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించడంతో ఆగిపోలేదు.నా అభిప్రాయంలో హింసకి మూలం బలం.అర్ధబలం కావచ్చు,అంగబలం కావచ్చు.మనిషికి ఆ బలం నిరూపించుకోవాలన్న కోరిక కలిగించేదే అహంకారం..ప్రతి ఒక్కరూ ఎదుటివారిమీద తమ ఆధిక్యం చూపించుకోడానికి బలం ప్రదర్శిస్తారు. అందుకని ముందు రావల్సింది వైయక్తిక విలువలలో సామాజిక విలువలలో మార్పు..ఎదుటివారిని గౌరవించడం నేర్చుకున్న వారు ఏ జండరు వారినైనా గౌరవిస్తారు.అందుకే నా కధల్లో బాధల్ని అనుభవించిన స్త్రీలున్నారు కానీ,కేవలం అదే అన్ని కధలకీ ప్రాతిపదిక కాదు.అనేక వస్తువులలో అదొక వస్తువు” అంటారు.(పొద్దు.నెట్ లో ఇంటర్వ్యూ నించీ)


మాలతిగారు 1973 లోనే అమెరికా వెళ్ళిపోవడం వల్ల ఆమెకు ఆ దేశంలో భారతీయుల జీవితాన్ని గురించి విశేషమైన అనుభవంతోకూడిన అవగాహన వుంది. ఇప్పుడు మనకి లభ్యమౌతున్న ఆమె వ్రాసిన 66 కథలనీ రెండు వర్గాలుగా విడగొడితే కొన్ని భారతదేశపు కథలు కొన్ని డయాస్పోరా కథలు..డయస్పోరా కథలలో ఈ ముఫై సంవత్సరాలుగా ప్రవాస భారతీయుల జీవితంలో వచ్చిన మార్పులు స్పష్టమైనట్లు భారతదేశపు కధల్లో భారతదేశంలో వచ్చిన మార్పులు అంతగా ద్యోతకమవవు.కారణం మార్పు వేగం అధిక మైన ఈ రెండు మూడు దశాబ్దాలలో ఆమె ఇక్కడ లేకపోవడం కావచ్చు. ఒక్కొక్కప్పుడు,మనిషి స్వభావం,ఆయా సంఘటనలపట్ల వాళ్ళు స్పందించేతీరు, దేశకాలాతీతంగా వుంటాయి.మానవ సంవేదనలు,ఆవేదనలు,ఆరాటాలు వాళ్ళు చేసే పోరాటాలు ఒక కాలానికి ఒక దేశానికే పరిమితమైనవి కావు.ఆయా సంస్కృతులలో మనకి కనిపించే వైరుధ్యాలు ఉపరితలానివే కాని హృదంతరాలలో మానవులంతా ప్రేమించేది మానవత్వాన్ని, సౌహార్ద్రతనే.దీనికి కొంతమంది మినహింపుగా ఎప్పుడూ వుంటారనుకోండి.ఈ ఎరుక మాలతిగారి కధల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

మాలతిగారు కధలు వ్రాయడం ప్రారంభించిన రోజుల్లో(1950దశకం లో) జనజీవితంలో ఇంత వేగం లేదు.ఇంత స్వకేంద్రీయత (self centeredness) కూడాలేదు సమయనిర్వహణ పాఠాల ప్రభావమూ లేదు.పొరుగువారికి మన సమయాన్ని ఆనందంగా పంచడం వాళ్ళ ఆనందాన్ని పంచుకోడం వుండేది.ఇందుకు “కధల అత్తయ్యగారు” అనే కధే ఒక ఉదాహరణ.ఇప్పటి ఆంటీల కన్న అప్పటి అత్తయ్యగార్ల అమాయక ప్రేమలు ఎంతో ఉదాత్తమైనవి.ఆమె ఒక కధల ఖజానా.ఆ కధలు అభూతకల్పనలే అయినా అవి చమత్కారంతో కలిసిన అచ్చ తెలుగు నుడికారంతో వుండేవి.ఒక తల్లి చేసిన మోసాన్ని కూతురు తెలుసుకుంది.ఆ విషయం తల్లికి అర్ధం చేయించడానికి తన బొమ్మకి బువ్వపెడుతుంది .బొమ్మ తినదు కదా? అప్పుడాతల్లి,”చిలకల కొలికి చినదనా బొమ్మలు బువ్వలు తిందురటే “అంటుంది.ఆ పిల్ల తల్లితో ఇలా అంటుంది”మాయల దానా!మహిమల దానా మనుషులు కప్పలు కందురటే!” తల్లి తను చేసిన మోసానికి సిగ్గుపడి దాన్ని సరిదిద్దుకుంటుంది.ఇలా కధల అత్తయ్య గారి కధల ప్రభావం మాలతిగారి మీద వుంది.మాలతిగారి 66 కథల్నీ మనం ఇక్కడ స్థల పరిమితి వలన చెప్పుకోలేము కనుక ఈ దేశపు కథలు కొన్నిటిని ఆదేశపు కఠలు కొన్నిటినీ స్పృశిద్దాము.రచయిత్రి చెప్పినట్లు అమె సృష్టించిన స్త్రీల పాత్రలు కొన్నిటిలో “మంచుదెబ్బ” కధలో వకుళ ”నవ్వరాదు” కథలో కమలిని,”జీవాతువు” కథలో అరుంథతి,”అవేద్యాలు” కథలో శారద....నవ్వరాదు కథలో కమలిని తన కష్టాలను నవ్వుల మాటున హాస్యం మాటున దాస్తుంది,వకుళ మహామౌనం దాలుస్తుంది.అరుంధతి జీవితంతో పోరాడి ఓడిపోతూ వుంటుంది.శారద తను అవమానానికి గురైనా చివరికి ఆత్మాభిమానానికి ఔన్నత్యానికి సజ్జనత్వానికి ప్రతిరూపంలా నిలుస్తుంది. నడుస్తున్న చరిత్ర లో కల్యాణి కి సంగీతం నృత్యం అంటే ప్రాణం కానీ పెళ్ళికోసం అవి ఆమెకు దూరమయ్యాయి. భర్తకి సంగీత కచేరీలకు వెళ్ళడం ఇష్టం అని కొంత ఊరట అయినా ఆమె ఆకాశవాణి లో స్వర పరీక్షకి వెడతానంటే వీల్లేదనడంతో సంగీత కచేరీలకు వెళ్ళడం మానుకుంటుంది.ఆమె మనసుని అర్ధం చేసుకోలేని భర్త ఆ విషయం పట్టించుకోడు.చివరికి తన మనుమరాలు తను సాధించలేనివన్నీ సాధిస్తుందన్న ఆశ తో తన నిరాశకు తెరదించుతుంది.మంచుదెబ్బ కధ లో వకుళ భర్త నపుంసకుడు.ఆ విషయం మనకి చివరిదాకా తెలియదు.దాన్ని గరళంలా కంఠంలో దాచుకుని.మౌనమే తన తిరస్కారంగా ,నిరసనగా చేసుకుంటుంది.ఆమె మౌనానికి కారణం భర్తకు తెలిసినా అతను హిపోక్రైట్ కదా! ఆమెకు మానసిక వైద్యం చేయిస్తాడు.చివరికి ఆమె తల్లి అమెను తీసుకుపోతానంటే తనే కలకత్తా తీసుకు వెళ్ళి నయం చేయిస్తానంటాడు.ఆమె చనిపోతుంది.భర్త నపుంసకుడన్న నిజాన్ని ఒక్క స్నేహితురాలికి మాత్రమే చెప్పి..తన ధిక్కారాన్ని మౌనం ద్వారా, మరణం ద్వారా ప్రదర్శిస్తుంది ఈ కధ స్నేహితురాలి కధనంగా సాగి చివరి వరకూ వకుళ మౌనానికి కారణం ఒక ప్రశ్నగానే వుంటుంది.అట్లా స్నేహితురాలిని నెరేటర్ గా ఎంచుకోడం కధకి బిగువు నిచ్చింది.మాలతి గారి కధల్లో చాలా వాటికి ఇటువంటి శిల్పాన్నే ఎన్నుకున్నారు. “”ఫలరసాదులు కురియవే పాదపముల” అనే కధలో ఒక మహాశ్వేత గురించి చెప్పినా ,”మామూలు మనిషి “ అనే కధలో రాజేశ్వరి గురించైనా,”జీవాతువు”కధలో అరుంధతి గురించైనా ప్రధమ పురుష అనుభవాలనించే ముఖ్యపాత్ర జీవితం మనకి తెలుస్తుంది.నవ్వరాదు కధలో కమలిని కూడా అంతే.”తృష్ణ” కధలో బాలయ్య గురించి కూడా.సాధారణంగా ఉత్తమ పురుషలో కధ చెబుతుంటే “నేను” కి చాలమంది రచయితలు కొన్ని ఉత్కృ ష్టమైన గుణాలని అంటగడతారు.కానీ మాలతి గారు ఈ “నేను” ని కూడా ఒక సామాన్య వ్యక్తిగా నే వుంచుతారు.అదే ఆమె ప్రత్యేకత.తృష్ణ కధ ఒక లైబ్రేరియన్ చెప్పడంగా వుంటుంది.లైబ్రరీలో అటెండర్ బాలయ్య.అతన్ని గురించి లైబ్రేయన్ గారికి చాలామంది ప్రతికూల వ్యాఖ్యలు హెచ్చరికలు చేస్తారు.ఆమె తన విధి తను చేసుకుపోతూ వుంటుంది.కానీ అతిగా స్పందించదు .బాలయ్యమీద పుస్తకాల దొంగతనం అభియోగింపబడి అతని ఇంటిని సోదా చేసేవరకూ వెడుతుంది.ఆ సోదా లో అతనికి పుస్తకాలు చదవాలనే అభిలాష అభిరిచి,ఊర్కే చదవడమే కాక వాటిలోని కొన్ని పంక్తుల్ని వ్రాసిపెట్టుకోడం కూడా లైబ్రేరియన్ ని చకితురాలిని చేస్తుంది.బాలయ్య నిజానికి పుస్తకాలు ఏవీ ఎత్తుకు పోలేదు.పోయిన పుస్తకాల్లో ఒకటే అతని ఇంట్లో వుంది. అదికూడా చదివి ఇచ్చేసే ఉద్దేశం తోనే తెచ్చాడు. ఉద్యోగం పోయాక బాలయ్య కనిపించలేదు.చివరికి మూర్ మార్కెట్ లో సెకండ్ హాండ్ పుస్తకాల షాపు నిర్వహిస్తూ కనపడ్దాడు.అనేక పుస్తకాల మధ్య ఉన్న బాలయ్యకిప్పుడు పుస్తకం ఒక అమ్మకపు సరుకులా మారిపోవడం ఒక ఐరనీ.ఈ కధని మాలతిగారు వ్రాసిన తీరు చాలా సహజంగా వుంటుంది.అట్లాగే విషప్పురుగు అనే కధలో స్కూల్ అటెండర్ రోశయ్య.అతనికి పాములు పట్టడంలో నేర్పుంది. అతను ఎక్కడ పాము కనిపించిందన్నా వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకి సాయపడతాడు.ఆ విధంగా అతను స్కూల్ కి ఆలస్యంగా రావడం, విధి నిర్వహణ లో అలక్ష్యం కారణంగా మెమోలు అందుకోడమే కాక అతనిపై స్కూల్లో అంతా నేరాలు చెబుతూ వుంటారు.స్కూల్ కివచ్చిన ఒక రిజిస్టర్డ్ పార్సెల్ పారేశాడనే అభియోగంతో అతనికి బదిలీ వేటు పడినా ఆనందంగానే వెళ్ళిపోతాదు.కానీ అతనిపై నేరం మోపడానికి మరొకరెవరో ఆపార్సెల్ ని సైన్స్ లాబ్ లో పారేస్తారు.రోశయ్య వ్యక్తిత్వాన్ని ప్రధానోపాధ్యాయురాలైన “నేను” ద్వారా చెప్పిస్తారు... మాలతి గారికి బహుమతి వచ్చిన కధ “చిరుచక్రం “సర్వసాక్షి దృక్కోణం లో వచ్చింది.ఇందులో కూడా స్కూల్ ప్యూన్ వెంకన్న వ్యక్తిత్వ చిత్రణే ప్రధానం .అతనికి తను చేసే పని మీద ప్రేమ .ఒకరకమైన భక్తి కూడా.అల్పసంతోషి..తనదికాని తోటమాలి పనికూడా నెత్తిన వేసుకుని తను పండించిన పూయించిన ఫలపుష్పాలను ఎవరైనా మెచ్చుకుంటే పరవశించిపోతాడు.స్కూల్ ఇన్ స్పెక్షన్ రోజున ఉరుకులు పరుగులుగా వొళ్ళువిరుచుకుని పనిచేసి అందుకు ప్రతిగా అతనికి అయిదు రూపాయిల ఫైన్ పడినా ఆ రోజు తన పువ్వుల్నీ కూరగాయల్నీ ఎవరెంత మెచ్చుకున్నదీ భార్యతో చెప్పి పొంగిపోతాడు.ఫైన్ మాట చెప్పడు.ఈ కధని “ఎక్స్ ప్లాయిటేషన్” కోణంలోనించీ ఓవర్ టోన్స్ లో రాయచ్చు.కానీ రచయిత ఆవిషయం ఎక్కడా ఎత్తకుండా చివరికి ఆ మాట పాఠకులకు తట్టేలా చేస్తారు.ఒక అమాయకుని స్వభావాన్ని మాత్రమే చెబుతారు.అది ఆమె శిల్ప నైపుణ్యం.మాలతిగారి కధల్లో ఎక్కువ స్వభావ చిత్రణ వుంటుంది.”మామే స్త్రీత్వం” అనేది ప్రతీకాత్మక కధ.స్త్రీ ,చైతన్యానికీ రాగద్వేషాలకూ ప్రతీక.చైతన్యమూ రాగమూ ఎక్కడుంటాయో ద్వేషమూ అసూయాకూడా అక్కడికి వఛ్చి చేరాతాయని అంచేత నాకీ స్త్రీత్వం (రాగద్వేషాలు) వద్దు అని .ఈ కధలో రాగద్వేషాతీతమైన ఒక వూరికి ఒక స్త్రీ వస్తుంది.ఒక పిల్ల వాణ్ని చేరదీస్తుంది.ఆమె మనుమడు వస్తాడు. అతన్ని ఆమె ప్రేమగా చూడ్డం చేరదీసిన పిల్లవాడికి ఈర్ష్య కలిగించి అతన్ని కొట్టించి చివరికి క్షమాపణ అడుగుతాడు.

మాలతి గారి రాబోయే సంకలనంలో (కధల అత్తయ్యగారు) ఉన్న ఇరవై రెండు కధల్లో చాలా వరకూ డయస్పోరా కధలు కాగా మొదటి సంకలనం లో కూడా దాదాపు 14 కధలున్నాయి.ఆమె కధాసంకలనానికి శీర్షికైన “నిజానికీ ఫెమినిజానికీ మధ్య’అనే కధతో కూడ... ఈ కధలన్నింటిలో అమెరికా వెళ్ళిన ఆంధ్రుల అనుభవాలు అప్పటివీ ఇటీవలివీ కూడా వున్నాయి. అమెరికా లో ఎలా మెసులుకోవాలో పదిమందీ పది సలహాలూ హితవులూ చెబుతారే కానీ ఏ వొక్కరూ మంచులో జారిపడతావు జాగ్రత్త అని పనికొచ్చే ఆ ఒక్క ముక్కా చెప్పరెందుకో అనే కధ లో చమత్కారం బావుంటుంది..అక్కడికి వెళ్ళాక కొంతమంది ప్రతిదాన్నీ డబ్బుతో కొలవడం తమకెలా లాభం అని చూడ్డం “కొనే మనుషులు” “డాలరుకో గుప్పెడు రూకలు” “గుడ్డిగవ్వ”కధల్లోనూ:.తమకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే ఆ ఋణం తీర్చే అమెరికనుల పధ్ధతి “జమాఖర్చుల పట్టిక” లోనూ చెబుతూ మనసంస్కృతిలో ఏదైనా ఎవరికైనా ఒక బహుమతి ఇవ్వడమూ పుచ్చుకోడమూ కూడా ఇటువంటి బేరీజులకతీతంగా ఒక ఆత్మీయ స్పర్శతో వుంటాయంటారు.అమెరికా వెళ్ళినా మన “sense of rumour” (sense of humour కాదు) అట్లాగే వుంటుందనీ ఆత్మీయంగా ఎవరితోనైనా అంతరంగంలో మాటచెబితే అది ఇండియాలో నీలాటిరేవులో పాకిపోయినంత త్వరగా పెసిఫిక్ అట్లాంటిక్ రేవుల్లోకూడా పాకుతుందనీ ఆ కందిరీగల్ని ఎలా తప్పించుకోవాలో చెప్పే కధ”అడవి దారంట”.అట్లా పెళ్ళికో పేరంటానికో పార్టీకో ఒంటరిగా వచ్చిన స్త్రీని అక్కడకూడా “ఎవరి తాలూకా?” అని ఆరాలు తీయడం, అమెరికాలో డ్రైవింగ్ రాకపోతే వుండే కష్టాలు అక్కడుండే వాళ్ళకే కాదు చుట్టం చూపుగా వెళ్ళొచ్చే వాళ్లకి కూడా తెలుస్తాయి.అలాంటప్పుడు కారుండి డ్రైవ్ చేసే వాళ్ళు అది లేని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం సాయంచెయ్యడం మామూలే.. కానీ అదికూడా ఓర్వలేని వాళ్లు చేసే వ్యాఖ్యానాలు ఇద్దరు స్నేహితురాళ్ళనూ బాధపెడతాయి.కానీ ఆపత్సమయంలో మళ్ళీ ఒకరికొకరు దగ్గరైపోతారు”అత్యంత సన్నిహితులు” కధలో.. అమెరికా లో పైచదువులకి రావడానికి ఇండియాలోనే రిహార్సల్ వేసుకునొచ్చి,అత్యుత్సాహంతో యాక్సిడెంట్ పాలైన ఒక ధనిక తండ్రి గారాల కొడుకు,ఒక కొడుకుని సరిగా తీర్చిదిద్దలేక దేశాల పాల్చేసి,రెండో కొడుక్కి అతిగారాం పెట్టి ఆకాశమార్గన నడిపించిన తండ్రి.”పై చదువులు” కధలో నూ అంత గొప్ప ప్రజాస్వామిక దేశంలోనూ ఇంకా కొనసాగుతున్న వర్ణ వివక్ష “రంగుతోలు’ కధలోనూ అక్కడి “లే ఆఫ్’ లప్రభావం పైన”హాలికులైన నేమి” “నీకోసం “కధల్లోను మన సంస్కృతి లోని భక్తి భావన ఒక చిన్ని పాప మనసుని స్పర్శించడం “చివురు కొమ్మైన చేవ” కధలోనూ కొత్తగా వచ్చిన ప్రవాసులపై స్థానికులు కొంత జులుం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే ఎలా తిప్పికొట్టాలో నేర్చుకున్న అమ్మాయి కధ”పలుకు వజ్రపు తునక” కధలోనూ చూస్తాము.”నీకోసం” కధలో ఉద్యోగం పోయి మరొకటి వెతుక్కోకపోవడం కూడా భార్యకోసమే ననే భర్తకి ఒక హెచ్చరిక చేసిన భార్య..ఇంక నిజానికీ ఫెమినిజానికీ అనే కధకు కొంత నేపధ్యం “దేవీ పూజ” అనే కధలో వుంది.వివాహపు పదహారో వార్షికోత్సవం ఒక మొక్కుబడి తంతుగా సాగుతుంది సీతకీ ఆమె భర్త సీతాపతికీ .అతనికెంతసేపూ ఆర్తస్త్రీ రక్షణ పరాయణత.అది ఎక్కడికి దారి తీస్తుందోన్న కలత సీతది. నిజానికీ ఫెమినిజానికీ మధ్య కధ దీనికి కొనసాగింపులా అనిపిస్తుంది.పదిహేడేళ్ళుగా ఇంటికోసం చాకిరీ చేసి ,ఉద్యోగం చేసి అతన్ని తప్ప వేరొకర్ని మదిని తలవక ఉన్న భార్యతో అబధ్ధాలాడి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని సీతాపతి ఆమెకు షాక్ ఇచ్చాడు.కళ్ళెదుట కనిపిస్తున్న నిజాలను అబద్ధాలుగా నమ్మింపజూశాడు.అతని విలువలపతనాన్ని ఆమె ఆమోదించలేకపోయింది.అతని స్త్రీలలో ఒక స్త్రీగా వుండలేక వేరే అపార్ట్మెంట్ కి మారడానికి ఆయత్తమైంది. ఈ కధని మాలతిగారు ఒక్కొక్క మెట్టుగా చాలా సహజంగా మలుచుకుంటూ వచ్చారు,అతని ఉత్తరాలు చూసేదాకా అతనిమీద అనుమానాన్ని స్థిరపరుచుకోలేకపోవడం ,కొంత ఆలోచన,చివరికి నిర్ణయం.పదిహేడు సంవత్సరాల సహజీవనం ఇంటికి తనెంతగా అంకితమైందీ, ఇవ్వన్నీ ఆమె ఆత్మాభిమానాన్ని కాపాడుకునేలా ఒక నిర్ణయానికి వచ్చేలా చేసిన తీరు చాలా సమతూకంతో వ్రాశారు అట్లాగే “ఆనందో బ్రహ్మ”.. అనే కధలో బ్రహ్మకూడా ఆర్తస్త్రీ పరాయణుడే .మాలతి గారి కధలు కొంత సీరియస్ గా వున్నా ఆమెలో హాస్యమూ వ్యంగ్యమూ కూడా మిక్కిలిగా వున్నాయి.”కోపం” అనే డయాస్పోరా ఇండియా కలగలిసినకధ,మద్రాస్ టూ తిరుపతి అనే కధ, కప్పు కాఫీ అనే కధ మరికొన్ని డయస్పొరా కధల్లోనే కాక ఆమె బ్లాగ్ తెలుగు తూలిక(www.tethulika.wordpress.com) లో “ఊసుపోక” లో ముఖ్యంగా ఈ హాస్య వ్యంగ్య ధోరణి చూడవచ్చు. మాలతిగారు ఆనాటి రచయిత్రి కారు.ఆవిడ ఎప్పటి రచయిత్రి.ప్రస్తుతం విస్కాన్సిన్ లో వుంటున్న మాలతి గారు సాహిత్యమే స్వదేశాన్ని మరిపించే స్నేహసాధనం అంటారు “నాకు జీవితంలోనూ.సాహిత్యంలోనూ ఒకటే విలువలు.చిత్తశుద్ధీ ఆత్మ వివేచనా,ఉన్నదానితోనే తృప్తి పడటం నాకు చిన్నప్పటినుంచీ ముఖ్యమైన విలువలుగా వుంటూ వచ్చాయి” అనే మాలతి గారు ఎంత గొప్ప రచయితపై నయినా తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్తారు.. “ఈనాటికీ అప్పారావుగారి దిద్దుబాటు గొప్ప సాంఘికకథ అంటే నాకు ఆశ్చర్యంగా వుంటుంది. నేను చూసినంతవరకూ, వేశ్యాలోలత్వం, జూదంవంటి దురలవాట్లు చాలా బలమైనవి. క్షణాలమీద మార్చుకోగల అలవాటు కాదు అది. అప్పారావుగారికథలో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలియగానే ఆ భర్త నిల్చున్న పళాన మారిపోయాడంటారు రచయిత. నాకు తెలిసినంతవరకూ నిజజీవితంలో భార్య పుట్టింటికి పోతే, వేశ్యాలోలురకి మరింత ఆటవిడుపు, అదేకథ స్త్రీ రాసివుంటే ఇంత అమాయకంగా వుండదు.”అంటారు


అట్లాగే ఫెమినిజం పైన ,అన్ని ఇజాల చట్రాల లో వచ్చే కథలపైన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా సూటిగా చెప్తారు. “అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపు సంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.” అంటారు.” కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం...(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.,”అంటారు అఫ్సర్