Thursday, July 29, 2010

ఆర్.వసుంధరాదేవి

స్వానుభవ సంపదా,అన్వేషణా తృష్ణా,అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు,ఆమె కధలు... పాఠకుల మనసులకు సాంత్వన నిచ్చే మంచిగంధపు లేపనాలు. మనసు పోకడలు,కడలి తరగలలా, ఒకానొక ఆవేశంతో ఎగసిపడి ఎగసిపడి.ఆవేశపడి.ఆయాసపడి.అంతలోనే తమ ఆత్మను కనుక్కుని,శమించి ప్రశాంతపడి ,శాంతపడి”ఓ! అంతా చేసి ఇందుకేనా? అని నిర్మలంగా నవ్వుకోగలిగే స్థితిలోకి తీసుకుపోతాయి. తన అనుభవంలోనుంచీ రూపొందించుకున్న తాత్వికతను పాఠకులకు పంచడం ఎంత తార్కికంగా కళాత్మకంగా ఉంటుందో తెలియాలంటే ఆమె 1960 లలోనే వ్రాసిన “చెరువుదగ్గర” తో మొదలు పెట్టి “జాన్ పాల్ చేసిన బీరువా” “పెంజీకటికావల”, “బ్రిడ్జి కింద” ,”నీడలు” “అమల,”“అమ్మా ఇక సెలవు” వంటి కధలు చదివి ఆమె తాత్విక ధృక్పధాన్ని,సామాజిక విశ్లేషణనూ ,మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానాన్నీ,తెలుసుకుని ఆమె మనకు వాగ్దానం చేసే జీవనోత్సాహాన్ని అందుకోవాలి ...ఆమె రాటకొండ వసుంధరాదేవి. ఈమె వివిధ సంకలనాలలో వ్రాసిన యాభై కధలనూ గుదిగుచ్చి 2004లో ఒకే సంకలనంగా వెలువరించిన తరువాత అన్నికధలూ ఇప్పటిపాఠకులకు అందుబాటులో కొచ్చాయి .ఇందులోనుంచీ పై చెప్పిన కధలు ఆమె శిల్ప నైపుణ్యానికీ సామాజిక తాత్విక ధృక్పధానికీ అద్దంపడతాయి.

ముందు చెరుదగ్గిరికి పోదాం.దాన్ని బుక్కరాయసముద్రం చెరువని అక్కడి వాళ్ళు అన్నప్పటికీ ,దేశమంతా అనంతపురం చెరువనే అంటారని కురువలింగప్ప అంటాడు.అనంతాకాశం కింద ఆ చెరువు దగ్గర కట్టిన గణేశుడి గుడీ,అక్కడీ హద్దులు లేని స్వేఛ్ఛ సుశీలమ్మకి చాలా ఇష్టం...సుశీలమ్మ సంప్రదాయ కుటుంబం చెక్కిన బొమ్మ.ఆ ఇంటి ఆడపిల్లలెలా వుండి మంచి అనిపించుకోవాలో తెలుసుకుంటూ తనని అలా మలచుకుంటూ పెరిగి ,వివాహమై ,భర్తతోడిదే జీవనం అనీ భార్యా భర్తలబంధం ఆత్మపరమాత్మల బంధం అనీ నమ్మిభర్త కి జలుబుచేసినా భయపడుతూ బతుక్కొస్తున్న ముఫై అయిదేళ్ళ స్త్రీ.అయితే ఆమెలో ఈ మధ్య ఒక అలజడి ప్రారంభమైంది .”.తన జీవితం తనది కానట్లూ,ఎవరి బలవంతం మీదో బ్రతుకుతున్నట్లు బాధ. జీవిత కాలంలో చాలా భాగం గడిచిపోయింది.ఇహ చచ్చిపోవడం తరువాయి.బతక్కుండానే చావు...నిజం జీవితాన్ని అనుభవించాలని ,నవ్వాలని ఏడ్వాలని,అందులో లీనమై పోవాలని ఆరాటపడుతూ దాన్ని అందుకోలేక విడిగా నిలిచిపోయి వ్యర్ధంగా నశించిపోతున్నట్లు భావన.కల్గుతుంది...తానేదో బలాత్కారానికి గురౌతున్నట్లు,ఎవరో తనని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. గడచిన జీవితం ఎడారిలాగా ముందున్నది స్మశానం లాగా తోస్తున్నది” అంతే కాదు”వేల సంవత్సరాలనించీ వెలుగులు చిమ్ముతూ వస్తున్న భారతీయ జీవన విధానం నేడు ఉత్త మేడి పండు అయిందా!!అందులో లోపం ఏర్పడిందా?కడుపులో పుచ్చును దాచుకున్న మల్లెమొగ్గ ఈ మనసు అనిపిస్తున్నది.ఇరుకులో చిక్కుకున్నట్టి భావన బలపడుతున్నది. ఈ ముసుగులో నించీ వ్యవహరించడానికే గాని జీవించడానికి హక్కులేదేల?ఏ పనీ సద్య స్ఫూర్తి తో చెయ్యలేను” ఇదంతా కూడా జండర్ చట్రంలో ఇరుక్కుపోయిన సుశీలమ్మ వేదన.ఇటువంటి ఎడారి లోకి కురువలింగప్ప ఒక నౌకరుగా ప్రవేశించాడు.ఎనభై ఏళ్ళ పల్లెటూరి “అనాగరికుడు”.వృధాప్యం అతని శరీరానికే గానీ జీవితానికి కాదు.ఆ చుట్టుపట్ల అన్ని ప్రదేశాలగురించి అనర్గళంగా మాట్లాడతాడు.మనుషుల గురించి ,ప్రకృతి గురించి జంతువుల గురించి ,అక్కడి వేయిన్నొక్క దేవుళ్లగురించి ,జీవితం గురించి ..అట్లా పరవళ్లు తొక్కే ఉత్సాహంతో మాట్లాడతాడు.గలగల మని నవ్వుతాడు.ఆ వయస్సులో తనకు అక్కరకు రాని కొడుకు గురించికూడా కోపంతెచ్చుకోడు.పిల్లలేదో చేస్తారని ఆశించి వాళ్ళని పెంచం కదా?పెంచడమనే ధర్మంప్రకారం పెంచుతాం అని నిర్వికారంగా జీవన సత్యాలను చెప్తాడుఎవరో తయారు చేసి పెట్టిన విధంగాకాక తనకి తోచినవిధంగా ప్రవర్తించే స్వేఛ్చ కలవాడు. .తనూ తన జీవితం వేరైనట్లు లింగప్పా అతని జీవితం వేరుకావని అనుకుంటుంది సుశీలమ్మ.సుఖం దుఃఖం,జబ్బు చావు అన్నీ జీవితంలో భాగాలే లింగప్పకి..దేనికీ కలతపడడు..అతనిది అతిసామాన్య జీవితం.. అధమాధపు జీవితం.. కానీ అది చావు తాకని జీవితం .నిరంతరం ప్రవహించే జీవన వాహిని...ఒక సజీవ చైతన్యమూర్తి,ఈ కురువలింగప్ప.అతని మాటలు. చేష్టలు .అనుభవాలు, జీవితాన్ని జీవించడానికే గానీ,కృత్రిమపు నీతి చట్రాలలో బిగించుకోడానికి కాదనే అతనిధృక్పధం,సుశీలమ్మకు ఒక చల్లని కాలక్షేపం.ఏ చెరువుదగ్గర,గణేశుని ఆలయం దగ్గర ఆమె స్వేఛ్ఛనూ శాంతినీ పొందగలిగేదో అక్కడే జరిగిన ఒక దుర్ఘటన ఆమె జీవితంలో భూకంపం అయి ప్రాణాలు తీసింది..ఆ చెరువుదగ్గరే ,ఆమె భర్త సమక్షంలోనే ఆమె పై అత్యాచారం జరిగింది.శరీరంపై అసహ్యం పుట్టి బావిలో దూకి చనిపోవాలనుకుంది.కానీ తీసి రక్షించారు.ఆస్పత్రిలో చేర్చారు.ఆమెను చూడవచ్చిన అత్తవారి నోటినించిగానీ పుట్టింటి వారి నోటి నుంచిగానీ ఆమెను బ్రతికించేమాటేదీ రాలేదు.ఆమెను ఏకాంతంలో “సీతా”అని ప్రేమగా పిలుచుకునే భర్తముఖంలో ఆమెను బ్రతికించే భావమేదీ కనపడలేదు.తనే తప్పూ చెయ్యలేదని ఆమెకు తెలుసు.తనకు చచ్చిపోడానికి ఎండ్రిన్ తెచ్చిపెట్టమని లింగప్పనడిగింది..భగవంతుడిచ్చిన జీవితం జీవించడానికే గానీ అంతంచేసుకోడానికి కాదనీ ఇక్కడ ఉండలేకపోతే ఇంకొక చోట ఉండే ఏర్పాటు చేస్తాననీ అనునయిస్తాడు లింగప్ప.లింగప్పని తప్పించుకుని చెరువుదగ్గరకి వచ్చింది సుశీలమ్మ.అక్కడ అనంతమైన స్వేఛ్ఛ!!,తను నమ్మి తనను అర్పించుకున్న నాగరిక సమాజం, తను తప్పు చెయ్యలేదనే నిజాన్ని ఒప్పుకుని తనని అక్కున చేర్చుకోలేక,ఒక అనాగరిక లింగప్ప ఎదుట మరిగుజ్జై పోయింది..తనకి మలినం అంటలేదని భగవంతుడికి తెలుసు.ఆయనకి కరుణ తప్ప ఇంకేమీ లేదు.అనుకుంటే ఒక సత్య దర్శనం అయినట్లయింది.అట్లా చెరువు గట్టున నడిచి నడిచి కాలికి రాయితగిలి దొర్లిపడి మట్టిలో కలిసిపోయింది. 1960 లోనే జండర్ నియంత్రణని స్త్రీలు ఎంత ఆత్మహత్యా సదృశ్యంగా భావించేవారో పదునుగా చెప్పిన కధ ఇది. బాహ్య ప్రవర్తనలో నాగరిక సమాజానికి కాంట్రాస్టుగా కనిపించే లింగప్ప భగవంతునిలా ప్రాణదాతే కానీ నాగరిక సమాజంలా ప్రాణహరుడు కాదు. వసుంధరాదేవి సృష్టించిన గొప్ప పాత్ర కురువ లింగప్ప..

ఇంచుమించు ఇటువంటిదే జాన్ పాల్ పాత్రకూడా. ఇతను టక్కరి వాడు.భార్యను హింస పెట్టగా ఆమె అతన్ని విడిచిపెట్టి కూతురుతో వుంటోంది .అతని కొడుకు ఫిలిప్.కొడుకంటే కడు ఆపేక్ష అతనికి.అందువల్ల అతను సరిగ్గా కుదురుకోకపోయినా ఏమీ అనడు.పైగా కొడుక్కి ఆత్మాభిమానం ఎక్కువని గర్వంగా చెబుతాడు. ఈ కధ ఉత్తమ పురుషలో నడుస్తుంది. కధకురాలు ఎంతో అభిమానంగా దాచుకున్న పాట మీద ఆమె కొడుకు కొత్త పాట రికార్డు చేస్తాడు.తనకెంతో ఇష్టమైన పాట లేకుండా పోయినందుకు బాధపడి తనకంటూ ప్రత్యేకంగా ఒక బీరువా వుంటే తనకిష్టమైనవన్నీ దాచుకోవచ్చని ఆమె జాన్ పాల్ ని పిలిచి బీరువా చెయ్యమని పురమాయిస్తుంది.అతను దొంగ బిల్లులు వేయించి కలప కొంటాడని, చెక్కలు ఎత్తుకు పోతాడనీ వేళకి పని పూర్తి చెయ్యడనీ మధ్యలో మరోపని ఒప్పుకుంటాడనీ అతన్ని గురించి చాలా మంది చెబుతారు.అయినప్పటికీ అతను నైపుణ్యం కల పనివాడు కాబట్టి అతను పెట్టే తిప్పలన్నీ పడి మొదట చెప్పిన అంచనా కు చాలా ఎక్కువ ఖర్చైనా బీరువా చేయించుకుంటుంది .ఇంక చివరి పాలిష్ లు కొసముగింపులు వుండగా జాన్ పాల్ కొడుకు ఫిలిప్ వాగులో పడి చనిపోతాడు.అంత ప్రేమించిన కొడుకు మరణం అతన్ని ఎంత కుంగదీస్తుందో ననుకుంటుంది ఆమె...కానీ ఇప్పుడు అతనిలో అది వరకటి టక్కరి తనానికి అతివినయానికి బదులు ఒక హుందాతనం వచ్చింది. “..మాట పొరపాటు రాకూడదు నాయనా!!అయ్యగారు డబ్బులెక్కువని కోప్పడితే నువ్వు కూలి తీసుకోమాక” అని అతని కొడుకు చెప్పిన మాటకి కట్టుపడి తన పాత జీవన ధోరణిని మార్చుకున్నాడు. కొడుకు పోయిన నాలుగోరోజునే పనికి వచ్చాడు.బీరువా పని పూర్తి చేశాడు.మనిషిని ధరించిన మనస్సు అనంతమూ మహాశక్తివంతమూ అని కధకురాలు అర్ధంచేసుకుంటుంది..జాన్ పాల్ ధైర్యశాలి,బలశాలి.ధైర్యమూ బలమూ మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు..బీరువాను చూసిన పిల్లలు తామెవరు ఏ అరల్లో ఏం పెట్టుకోవాలో అని మాట్లాడుకున్నఫ్ఫడు ఆమె అది తనకోసం చేయించుకున్నానని అనదు జాన్ పాల్ కొడుక్కిచ్చిన మాటకోసం తనపాత జీవితాన్ని ఎంత అలవోకగా విడిచిపెట్టాడో తన తన వస్తువులు తనకే వుండాలన్న కోరికని వదులుకుని..తను దాన్ని ఉపయోగించుకున్నా లేకపోయినా ఫరవాలేదనుకుని పిల్లలకివ్వడానికి సిధ్ధపడుతుంది. :”ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణ చిత్రం.అందులో మనం గుర్తించగలిగేది అంతకు ముందే (మన) మనసులో ఎరుకగా వున్న దానిని మాత్రమే..అనికూడా అంటుంది రచయిత్రి...

నీతి,వినయం ఇతరుల బాగుకోసం తాము అన్నీ వదులుకోడం ,తమ బ్రతుకిక ఇంతే అనుకుంటూ అణిగి మణిగి వుండటం మొదలైన గుణాలన్నీ బొద్దింక గుణాలనీ ,జీవించడం అంటే ఒక ఉత్సాహంతో ధైర్యంతో జీవించడం అనీ టక్కరితనం అబధ్ధాలాడటం వంటి కొన్ని సర్వైవల్ టెక్నిక్న్స్ అవలబించినా అది జీవనోత్సాహానికి నిదర్శనమే కానీ మరొకటికాదనీ రచయిత్రి “మనుషులూ బొద్దంకులూ” “అ-బధ్ధం’ బ్రతుకు తెరువు” వంటికధల్లో చెబుతారు.
“పెంజీకటి కవ్వల”.కధలో ప్రధాన పాత్ర జయలక్ష్మి,ఆమె మానసికావస్థలు ,భయాలు,అనిశ్చితమైన ,ఆలోచనలు,ఆమె మానసిక పరిణామం ,పరిణతీ పొరలు పొరలు గా చిత్రించడం వసుంధరాదేవి ప్రత్యేకతే!! ప్రాణులందరికీ మరణం తధ్యమే.అయితే మనుషులకు ఆ ఎరుకను నిబ్బరంగా అంగీకరించడం అంత సులువుకాదు.సంపన్నుల కాలనీలో కావాలని ఇల్లుకట్టుకున్న జయలక్ష్మికి ఆ కాలనీ వెనక వుండి శవంకాలినప్పుడల్లా ఇళ్ళల్లోకి చావుకమురువాసన పంపే స్మశానం అంటే భయం ఏవగింపు.తనకి మరణం ఎప్పుడొస్తుందోనని భయం..ప్రతి సంఘటననూ చావుతో ముడిపెట్టి చూసుకుంటూ,”స్వామీ నన్ను బ్రతకనీ” అని దేవుడి గదిలో తలుపు వేసుకుని ప్రార్ధిస్తుంది. ఆమెకు గుండె జబ్బు వస్తుంది..అట్లా సంక్షుభితమైన మానసిక స్థితిలో వున్న జయలక్ష్మికి ఒక అనుభవం ఎదురైంది.ఈ ఆత్మికమైన అనుభవం తో ఆమెకు సత్య దర్శనం అయినట్లు అయింది.తను లేకపోయినా ఈ ప్రపంచం వుంటుంది.ఇక్కడి సౌందర్యం సంతోషం వుంటాయి. అనే ఆనందం కలిగింది,జయలక్ష్మి మానసికావస్థలను ఈ కధలో రచయిత్రి చిత్రించిన తీరు అధ్భుతం. అట్లాగే “నీడలు” అనే కధలో నిర్మల పాత్ర .,మనం చూసే చూపు బట్టే మనకు ప్రపంచం అర్ధం అవుతుందని,మనసులో వుండే నీడల్ని (అభద్రతాభావాలు,అహేతుక ద్వేషాలు ) తొలిగించుకుంటేగాని ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడలేమనీ ఈ కధ చెప్తుంది.

“బ్రిడ్జికింద” కధ సమాజంలో వేళ్ళుపాతుకుపోయిన అవినీతి ,నిజాయితీ పరులకు బ్రతుకు దుర్భరం చెయ్యడాన్ని ముగ్గురు వ్యక్తుల జీవన నేపధ్యంలో ,చిత్రిస్తూ ,అటువంటి జీవితాన్ని వాళ్లు ఎదురుకున్న పధ్ధతుల్నీ దగాపడ్ద వాళ్ళ పక్షాన నిలబడవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.చలపతి తండ్రి కాలేజి లో స్వీపర్ గా పని చేసి అణగి మణిగి ఉంటూ పావలా అర్ధా మామూళ్ళూ టిప్పులూ వసూలు చేసుకుంటూ పార్టీల్లో మిగిలిపోయిన స్వీట్లూ ఫలహారాలూ ఇంటికి తెస్తూ తినీ తినకా జీవనం గడుపుకొస్తున్నాడు .ఆ పరిస్థితుల్లో స్కూల్ చదువు ముగించిన చలపతిని కూడా తండ్రి స్వీపర్ ఉద్యోగంలో ప్రవేశపెట్టగా ,అక్కడ తండ్రి హైన్యాన్ని చూసి ఆ ఉద్యోగమూ ఇల్లూ వదిలి రిక్షా తొక్కుతున్నాడు చలపతి. తండ్రి అప్పుచేసి తీర్చలేక ఆత్మ హత్య చేసుకుంటే రిక్షా తొక్కి ఆ అప్పు తీర్చి మళ్ళీ వ్యవసాయంలో నిలదొక్కు కుందామని పట్నం వచ్చాడు పోతప్ప.అతను నిజాయితీగానే వున్నాడు .అతనీ భార్య కూడా బ్రిడ్జి దగ్గర తమల పాకులమ్మి ఒకటీ అరా సంపాదిస్తున్నది.నీతి,నిజాయితీలమీద చలపతికీ పోతప్పకీ వాదమవుతుంది..పోతప్ప చెల్లెలు కూడా బ్రతకడానికి పట్నం వచ్చింది.బ్రిడ్జి కింద బజ్జీల దుకాణం పెట్టింది..ఆమె భర్త తాగుబోతు సోమరి.పోతప్ప రెండు పొటేలు పిల్లల్ని కొని మైదానంలో కట్టేస్తే ఒక దాన్ని రహస్యంగా అమ్మేసి తాగేశాడు.కోపంపట్టలేని పోతప్ప అతన్ని కొడుతుంటే పోలిసులు పట్టుకెళ్ళి లంచంఇస్తేగానీ వదలక పోతే అందుకోసం రెండో పొటేలుని అమ్మాల్సి వచ్చింది.ఆ కోపంతో నిస్సహాయతతో బాగా తాగేసిన పోతప్ప ఆర్ టీ వో గారి కారు షేడ్దు పీకి పడేసి భీభత్సం సృష్టిస్తాడు.మళ్ళీ పోలీసులు పట్టుకెళ్లడానికి వస్తే బ్రిడ్జికింద వాళ్ళ అతన్ని దాచేస్తారు. డబ్బుతో పాతు ఆత్మ విశ్వాసం కూడా పోయింది పోతప్పకి.అప్పుడతను చలపతి ఉంటే బావుండుననుకుంటాడు.చలపతి అప్పటికే కొన్ని అప్పులు తీర్చకుండానే వూరు వదిలి వెళ్ళిపోయివున్నాడు. సమాజం నిర్దేశించిన న్యాయాన్యాయాలకంటె మనుగడ ముఖ్యం అనేది చలపతి ఎంచుకున్న మధ్యే మార్గం .పాత ఊరినీ కొత్త ఊరినీ కలిపే ఆ రైలు బ్రిడ్జి కింద కానాలు ఎంతమందికో తాత్కాలిక నివాసాలు.”ఒక గుడ్ద పీలికల మూటా ఒక సంచీ రెండు కుండలూ, ఒక లోటా,నీళ్ళు ముంచుకున డబ్బా తెచ్చుకుంటారు.వాళ్ళు ఎంత ఆకస్మాతుగా వచ్చారో అంత ఆకస్మాత్తుగా నామరూపాలు లేకుండా మాయమై పోతారు. ఎందుకు వచ్చారో ఎలా బ్రతికారో ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు.” అది బ్రిడ్జి కింద దయనీయ చిత్రం.భౌతిక పరిస్థులకు లొంగి ప్రవర్తించే ఏ పాత్ర పట్ల కూడా రచయిత్రికి విముఖతలేదు సానుభూతి తప్ప.వసుంధరాదేవి మరొక అధ్భుతమైన కధ “అమ్మా ఇక సెలవు”.ఈ కధలోని అమ్మ ఒక్క కధకురాలి అమ్మే కాదు ఆమె విశ్వమాత. ఈ కధలో రెండు అంశాలున్నాయి.ఒకటి ఆడపిల్ల జీవితాన్నంతా పెనవేసుకుపోయిన అమ్మ జీవితం రెండు వ్యాపారసంబంధమే కానీ మానవ సంబంధాన్ని హృదయ సంబంధాన్ని కోల్ఫోయిన కార్పొరేట్ వైద్యపు నిర్లక్ష్యపూరితమైన యాంత్రికత.జీవన్మరణ స్థితిలోని వ్యక్తికి రవంత ఊరట సాంత్వన ఇవ్వక మృత్యువుకూ వేదనకు మరింత చేరువ చేసే యాత్రికత....ఈ కధలో రచయిత్రి అమ్మగురించి వ్రాసిన ప్రతి వాక్యమూ ప్రతి ఆడపిల్ల మనసులో నిలిచిన సత్యం.వసుంధరాదేవి కధలలో పాఠకులమనసులో నిలిచివుండే కధల్లో ఒకటైన ఈ కధ గురించి రెండు వాక్యాల్లో రాయలేము.అట్లాగే చిట్టిరాజు,సీతాకోక చిలుక ,ఇంతేలే పేదల ఆశలు అడవిపువ్వు వాటికవి విశిష్టమైన కధలు.జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా నిరాశానిస్పృహలావరించినా మళ్ళి లేచి నిలబడి జీవితం కొనసాగించే రాగమ్మ, గౌరి, నాగరిత తెచ్చిన వేగానికి తట్టుకోలేక మరణించిన అమల ఇలా ఆయా పాత్రల మానసిక పరిణామాలను తనదైన శైలిలో నిబ్బరంగా చెప్తారు రచయిత్రి..

1931 లో జన్మించిన వసుంధరాదేవి బాల్యంలోనే వేటపాలెంలోని ప్రసిధ్ధ గ్రంధాలయంతో అనుబంధం ఏర్పరుచుకుంటూ తెలుగు భాషపై మక్కువ పెంచుకున్నారు.అటుపై గుంటూరులో సెంట్ జోసెఫ్స్ కాన్వెంట్ లోనూ అక్కడి విమెన్స్ కాలేజీలోనూ చదివి ఆంధ్రా యూనివర్సిటీ నించీ కెమిస్ట్రీ లో మాస్టర్స్ చేసారు. తరువాత ప్రఖ్యాత విమర్శకులు ఆర్,ఎస్.సుదర్శనం గారిని వివాహం చేసుకుని గృహిణిగా వుంటూనే తన అధ్యయనాన్నీ అన్వేషణనూ రచననూ కొనసాగించారు, ఇప్పుడు తన తెలుగు కధల్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు.మదనపల్లి నుంచీ న్యూయార్క్ లో స్థిరపడే ప్రయత్నంలొ వున్నారు.ఈ యాభై కధలే కాక “రెడ్దమ్మగుండు”అనే నవల వ్రాసారు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్,నూతలపాటి గంగాధరం అవార్డ్ లు అందుకున్నారు.

“తనకు తారసపడిన విశిష్టమైన అనుభవాన్ని చలం తన లేఖల్లో ,మ్యూజింగ్స్ లో పొందుపరచినట్లుగా, వసుంధరాదేవిగారు తన కధల్లో పొందుపరిచారనిపిస్తుంది.భగవంతునితో ప్రమేయం లేని తాత్విక విచారాన్ని ఈమె చాలా కధల్లో మనం గమనించగలం.ఈమె తాత్విక విచారణ ప్రపంచాన్ని వ్యతిరేకించేదికాదు ..అధిగమింపజూసేది...ప్రపంచానుభవాల్తో సంబంధంలేనిది..వాటిమీద ఆధారపడనిది..వాటన్నిటినీ సంతోషంగా తేలిగ్గా తీసుకోనిచ్చేది...దానికోసం ఈమె అన్వేషణ..” అంటారు బండి నారాయణ స్వామి.అవును కదా!!

Friday, July 16, 2010

ఈ చినుకుల్లో తడవండి

నాకు చాల ప్రియమైన ఈ కవిత లు అందరి కోసం


“యేడికి బోతివి కరిమబ్బు వానోడా.......
..........................................................................
తూర్పు దిక్కునించి తుమ్మవనమోలె
పచ్చిమం దిక్కున పాల నవ్వుల్తోని
ఉత్తరాన్నించి ఉరుముకుంట
దచ్చినంనించి దండిగా వచ్చి
నిండిన సెరువుకుంటలతో అద్దాల రైకద్దవా
సినుకుపూల సీరెసుట్టవా

జూపాక సుభద్ర



“వానకు తడిసిన పువ్వొకటి
రాలిపడుతోంది బావిలో
సుళ్ళు సుళ్ళుగా తిరుగుతూనూ
సున్నాలు చుడుతూనూ
నవ్వుతూనే ఉందది
తుళ్ళుతూనే ఉంది
నీళ్ళమీద తేలుతూ వుంది
పాతకొమ్మని కొత్తనీళ్ళని
చూస్తూ ఉందది
మార్చి మార్చి

పాలపర్తి ఇంద్రాణి




“వర్షాన్ని ప్రేమిస్తే
అది నిన్ను చుట్టుకుని చుట్టుకుని
నీవెంటె వస్తూ నీలోకి చేరిపోతుంది
వర్షం ఒక దుఃఖమూ,ఒక సుఖమూ
వర్షం ఒక ప్రాణమూ ,పరిమళమూ
భూమి కఠంలో మెరిసే ముత్యాల సరమూ”
శివారెడ్డి

Tuesday, July 06, 2010

పర్పుల్ హైబిస్కస్

కొన్నాళ్లక్రితం “హాఫ్ ఆఫ్ ది యెల్లో సన్” (Half of the yellow sun) అనే నవల చదివి బాగా ఇష్టపడి అది వ్రాసినమ్మాయి గురించి,ఆమె అభిరుచులు,ఆశయాలు తెలుసుకుని ,చాలా మందికి ఆ సమాచారాన్ని అందించాను.ఇప్పుడు నాకు ఆమె వ్రాసిన మొట్టమొదటి నవల “పర్పుల్ హైబిస్కస్” దొరికింది.. ఈ నవల వచ్చి ఐదేళ్లయినా నాకు దొరికింది ఇప్పుడే.అప్పుడు దానికి కామన్వెల్త్ రైటర్స్ బెస్ట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ వచ్చింది. ఈ రచయిత నైజీరియా అమ్మాయి.పేరు చిమమండ అడిచి..”హాఫ్ ఆఫ్ ది యెల్లో సన్ “ లో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం వుండగా,ఇందులో రాజకీయాలతో పాటు జీవితానికే ఎక్కువ ప్రాధాన్యముంది.



వలస ప్రభుత్వం వెళ్లిపోయినా దాని మానసిక అవశేషాలు త్వరగా వదలవు.వలస ప్రభుత్వానంతర నైజీరియాలో ఎప్పుడూ రాజకీయ సంక్షోభమే.ఎప్పుడూ ఆర్ధిక సంక్షోభమే. అందుకు అక్కడి పాలకుల అవినీతి,తడవకొక సైనిక పాలన.ఒక “కూ” (coup)అనంతరం మరొకటి...ప్రభుత్వ వ్యతిరేకులపై తీవ్ర చర్యలు.ayitEaaaa DabbU palukubaఅయితే డబ్బూ పలుకుబడీ వున్నవాళ్లకి జీవితం సజావుగానే వుంటుంది. ఈ కధ “కంబిలి” అనే పదిహేనేళ్ల అమ్మాయి మనకి చెబుతుంది..ఈమె తండ్రి యూజీన్ సంపన్నుడు.సంఘంలోనూ చర్చిలోనూ పేరున్నవాడు.వితరణ శీలి.కట్టలు కట్టలు డబ్బు దానంచేస్తాడు.కాథలిక్ మతాన్నిపాటిస్తాడు.పరమ మత మూర్ఖుడు ..ఇంట్లో ఆయన చెప్పినట్లే అందరూ నడవాలి.ఏ మాత్రం తేడా వచ్చినా వారిపై అమలు చేసే మానసిక శారీరక శిక్షలు దారుణంగా వుంటాయి.




కంబిలి, ఆమె అన్న జాజా ఆ కఠిన క్రమశిక్షణ లో పెరిగి స్వంత ఊహలనేవి లేకుండా గొంతులో మాట పైకి రాకుండా నిశ్శబ్దం గా అదే జీవితం అన్నట్లుగా వుంటారు.వాళ్ళెప్పుడూ క్లాసులో ఫస్టే వుండాలి .లేకపోతే కఠిన శిక్ష,ఒక సారి వాళ్లమ్మను ఆయన కొట్టినప్పుడు ఆమెకి గర్భస్రావమైంది.ఆమెని భుజానేసుకుని ఆయన హాస్పిటల్ కి తీసుకుపోతుంటే ఇల్లంతా రక్తపు చార.అది చూసిన కంబిలి పరీక్ష సరిగ్గా రాయలేక క్లాసులో రెండవ స్థానానికి వెడుతుంది.దానికీ శిక్షే.యూజీన్ విధించే శిక్షలు ఎంత సున్నితంగా వుంటాయంటే పాదాలపైన మరిగే నీళ్లు పొయ్యడం కుడిచేత్తో వ్రాసుకోవాలిగనుక ఎడమ చేతి వేళ్లు చితక్కొట్టడం,బెల్టుతో కొట్టడం,నేలమీద పడేసి కాళ్ళతో కసితీరా తొక్కడం తరువాత ఏడ్చి గోలపెట్టి హాస్పిటల్ లో చేర్చడం అలాగ.తన మేనత్త ఇఫెయోమా ఇంటికి వెళ్ళేదాకా తన ఇంటికన్న భిన్నమైన ప్రపంచం ఒకటుందని కంబిలికి తెలియదు.ఆమెకు స్కూల్లో స్నేహితులు లేరు,స్కూలు వదలగానే పరిగెత్తుకుంటూ కారుదగ్గరకు రావాలి.మేనత్త నైజీరియా యూనివర్సిటీలో అధ్యాపకురాలు.తెలివికలది.ధైర్యవంతురాలు.




భర్త యాక్సిడెంట్ లో చనిపోయినా ముగ్గురు పిల్లలకి ఎంతో స్వేచ్చ ఇచ్చి పెంచింది.మేనత్త ఇంట్లో నవ్వులు,చర్చలు పని పంచుకోడం,అక్కడ పరిచయమైన యువ ప్రీష్ట్ కి ఆమెపై కల ఆపేక్ష ,కంబిలీలో చైతన్యాన్ని కలిగించాయి.జాజా లో ఆలోచననీ ధిక్కారాన్నీ రగిలించాయి.ఇంటికి రావడంతోనే మార్పుకు నాంది పలుకుతాడు. తండ్రిని ధిక్కరిస్తాడు..అక్కడనించీ దేశరాజకీయాల్లో పరిణామాలొస్తాయి.మేనత్తకి ఉద్యోగం పోయి ఆమె అమెరికా వలస పోతుంది.,కాథలిక్ గా మారక సంప్రదాయ ఆఫ్రికన్ మతాన్నే అనుసరిస్తున్న తన తండ్రి దగ్గరకు పిల్లల్ని వెళ్ళనివ్వడు యూజీన్. .తాత చిత్రాన్ని ఇంటికి తెచ్చి దాచినందుకు ,కంబిలిని పరమదారుణంగా హింసించాడాయన.చచ్చి బ్రతికింది కంబిలి.ఈ దారుణాలు ఇంక భరించలేననుకున్న కంబిలి తల్లి తన భర్తకు విషం పెట్టి చంపేస్తుంది.ఆ నింద తన మీద వేసుకుని జైలుకు వెడతాడు కంబిలి అన్న జాజా. మూడేళ్ళ అనంతరం మానసికంగా చితికిపోయిన తల్లినీ జైల్లో వున్న అన్ననూ చూసుకుంటూ అతని విడుదలకోసం ప్రయత్నిస్తుంటుంది ఆమె..తరువాత ఇంట్లో నారింజచెట్లు,రక్తనీల మందారాలు నాటాలనీ అమెరికా పోయి అత్తను చూడాలనీ ఆశతో కధని ముగిస్తుంది.అతి క్రమ శిక్షణలో గట్టకట్టిపోయిన చైతన్యం తిరిగి జీవం పోసుకోడాన్ని ,కౌమారంలోనించీ యౌవనంలో అడుగుపెడుతున్న ఆమెలో లైంగికమైన కోరికలు మొలకెత్తడాన్ని,ఇంతైనా తండ్రిని ద్వేషించకపోవడాన్ని,నైజీరియా ప్రకృతిని,అధ్భుతంగా చిత్రింcచింది అడిచి. ఈ కధ నంతా కంబిలి చేత చెప్పింఛడం కధకు వేగాన్నీ పఠనీయతనీ కూడా చేకూర్చింది.అనువాదం కాకుండా నేరుగా ఇంగ్లిష్ లో రావడాన కూడా నైజీరియన్ ఫ్లేవర్ పోనివ్వకుండా సులువుగా చదువుకోడానికి వీలైనట్లు వ్రాసింది..




ఈమె అభిమాన రచయిత చినువా అచూబె..ఆయన ఈ నవలను మెచ్చుకుంటూ అడిచి కి మెయిల్ ఇచ్చాడట,ఎప్పటికైనా నైజీరియా లో తనలా ఎంతోమంది రచయిత్రులు తయారవాలని ,వారిని మెచ్చుకుంటూ తనుకూడా మెయిల్ ఇవ్వాలనీ ఆమె ఆకాంక్ష.అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నా ఎప్పటికైనా నైజీరియాలోనె స్థిరపడాలనికూడా ఈ ముఫై మూడేళ్ల రచయిత్రి కోరిక...హార్పర్ కాలిన్స్ లో వచ్చిన ఈ పుస్తకం దొరకడం కష్టం ఏమీ కాదు.



(పాలపిట్ట మే సంచిక నుంచి)

Thursday, July 01, 2010

అరవింద

పందొమ్మిది వందల అరవై నుంచీ ఎనభై వరకూ ప్రముఖ వార మాస పత్రికలు స్త్రీ రచయితలను ప్రోత్సహించడం ద్వారా తమ ప్రాచుర్యాన్ని పెంచుకున్నాయి. అది నవలల కాలం…విరివిగా వచ్చిన ఆ నవలలన్నీ ”పల్ప్‌” సాహిత్యంగా సాహిత్య విమర్శకులు పరిగణించడం వలన స్త్రీలు వ్రాసిన కొన్ని మంచి నవలలు కూడా ఆ వరదలో కొట్టుకుపోయాయి. అయితే అదే కాలంలో మంచి కథలు వ్రాసిన స్త్రీ రచయితలు వున్నారు. ఆనాటి స్త్రీల జీవితాలలోనూ ఆలోచనావిధానాలలోనూ వస్తున్న పరిణామాలనూ వారి ఆకాంక్షలనూ పట్టించుకుని వ్రాసిన వారున్నారు. అట్లా తన ఫార్మెటివ్‌ యియర్స్‌లోని సాంఘిక వాతావరణాన్ని, ఆ నేపథ్యంలో తనలో కుదురుకుంటున్న అభిప్రాయాలను చదివించే మంచికథలుగా మలచినవారిలో ”అరవింద” ఒకరు. స్వాతంత్య్రానికి పూర్వమే స్త్రీలని చైతన్యీకరించాల్సిన అవసరాన్ని భారతదేశం గుర్తించింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళకే ఆమెకు విద్యా ఉద్యోగావకాశాలకి తలుపులు తెరిచింది. అయితే అప్పటికింకా నిలబడి వున్న భావజాలం విద్యా ఉద్యోగం అనేవాటికి వివాహానికిచ్చిన ప్రాముఖ్యం ఇవ్వలేకపోయింది. కనీసం ఉన్నత పాఠశాల చదువనేది వివాహానికి ఒక అర్హతగానే వుంది కానీ అది స్త్రీల సర్వతోముఖాభివృద్ధికి గానీ, ఆర్థిక పటిష్టతకి గానీ అవసరమనే భావన ఇంకా అప్పటికి అంటే 1950 నాటికి లేదు.


పట్టణ మధ్యతరగతి పెరగడం వల్ల ఉద్యోగాలకి పట్టణాలొచ్చిన తండ్రులూ, గ్రామాలలోనే వుండి ఆర్థిక సుస్థిరత వున్న తండ్రులూ ఆడపిల్లలని కాలేజీలకు పంపడం ప్రారంభించారు. ఆ దశకంలోనే ఆంధ్రదేశంలో అనేక స్త్రీల కళాశాలలు కూడా వెలిశాయి. డిగ్రీ చదువు అయినాక పెళ్ళి, లేదా ఇంటర్‌ దగ్గర్నించీ సంబంధాల వేట మొదలుపెడితే డిగ్రీ అయేనాటికి పెళ్ళి. ఏదైనా పెళ్ళి అనేది జీవితానికొక సెటిల్మెంట్‌ అనే భావన అటు తల్లితండ్రులకీ ఇటు అమ్మాయిలకీ కూడా ఏర్పడి వుంది. అయితే అంతకు కిందటి తరంలాగా నాన్న చూసినవాడిని తలఎత్తి చూడనైనా లేకుండా మెడవంచి తాళి కట్టించుకుని, అతడెలాంటివాడైనా సర్దుకుని బ్రతకాలని నిర్ణయించుకునే వాళ్ళుగా కాక, ఈ చదువుకున్న యువతుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. పెళ్ళి ముఖ్యమన్న విషయాన్ని వొప్పుకుంటూనే, తమ దాంపత్య జీవితం ఎలా వుంటే బావుంటుంది, తనతో జీవితకాలం కలిసివుండే వ్యక్తి ఎలా వుంటే తను సుఖంగా వుంటూ అతడిని సుఖపెట్టగలుగుతుంది అని ఆలోచించడం మొదలైంది. కొంతమంది యువతులు తమ వ్యక్తిత్వాలను కాపాడుకునేందుకు పెళ్లి వద్దనుకునే సందర్భాలు కూడా వచ్చాయి.


గ్రామీణ ఉమ్మడి కుటుంబం పట్టణ న్యూక్లియర్‌ కుటుంబాలుగా విడిపోతున్న సందర్భంలో పరిమితమైన కుటుంబసభ్యుల మధ్య దగ్గరతనం ఏర్పడి కొన్ని పట్టణ మధ్యతరగతి ఇళ్లల్లో పూర్వపు నియంతృత్వ ధోరణి కాక ఒక స్నేహమయ వాతావరణం నెలకొంటున్నది. యుక్తవయస్కులైన అమ్మాయిలు బయటికి వచ్చి చదువుకుంటూ యువకులతో పరిచయాలేర్పడుతుండటంతో భావసారూప్యత ఒకరిపై ఒకరికి ఇష్టాన్ని పెంచుతోంది. ప్రేమవివాహాలు, వాటికి పెద్దల అభ్యంతరాలూ చర్చకొచ్చాయి. చాలాకాలంగా సమాజంలో వేళ్ళుపాతుకుపోయిన కులం మతం పెద్దలకు పట్టింపులు కాగా వరకట్నం కూడా సమస్యైంది. ఇంజినీర్లనో, డాక్టర్లనో పది పదిహేను వేలైనా (అప్పటి కట్నాల రేట్లు) ఇచ్చి అమ్మాయిని సుఖపడేలా చెయ్యాలనుకునే తల్లితండ్రులు, ఆ ఇంజనీర్లు, డాక్టర్లు పెళ్ళి చేసుకోవాలంటే ఆడపిల్ల కనీసం డిగ్రీ చదివివుండాలని కూడా కాలేజీలకు పంపడం వుంది. (ఇప్పుడు ఇంజినీరమ్మాయిలకి మంచి సంబంధాలొస్తాయని చదివిస్తున్నట్లు) కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోబోమని కొంతమంది అమ్మాయిలంటున్నారు.


కులమతాలు తమ ప్రేమకు అడ్డంకులైనప్పుడు తల్లితండ్రులను సమాధానపరిచి ప్రేమవివాహాలు చేసుకున్న అమ్మాయిలు, తల్లితండ్రులకోసం ప్రేమను వదులుకున్న అమ్మాయిలూ,ఇట్లా విద్యావంతులౌతూ ఆలోచించనేర్చిన యువతుల వలన ఆనాటి వివాహవ్యవస్థలో వస్తూన్న పరిణామాలనూ, యువతుల మనోభావాలనూ, అవి వ్యక్తీకరించుకోలేని పరిస్థితులనూ ఆకళింపు చేసుకుంటూ పెరిగిన ”అరవింద” ఆ పరిస్థితుల్ని చిత్రిస్తూ, స్త్రీపురుష సంబంధాలు ఎంత గాఢంగా వుండాలో సూచించే మంచి కథలు వ్రాసారు. 1934 ఏప్రిల్‌ 14న జన్మించిన సుగుణమణి ‘అరవింద’ బాల్యం అంతా ఏలూరులోనే గడిచింది. ఆమె తండ్రి దేశిరాజు సుబ్రహ్మణ్యంగారు ఏలూరులోని సి.ఆర్‌. రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్‌గా వుండేవారు. సుగుణమణి అక్కడే చదివి గ్రాడ్యుయేట్‌ అయ్యారు. అప్పుడే ఆమెకు తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. వివాహానంతరం జెమ్షెడ్పూర్‌ వెళ్లారు. అక్కడే ఆమె రచనకి శ్రీకారం చుట్టారు.


మొదటి కథ ”అరుంధతి అలక-జంట పువ్వు” 1958లో వచ్చింది. 1958 నుంచి 80ల వరకూ వచ్చిన ఆమె కథలు రెండువేల సంవత్సరం తరువాతనే రెండు సంపుటాలుగా వచ్చినా అవి ఇప్పటికీ వాటి ప్రాసంగికతనూ, పరిమళాన్నీ కోల్పోలేదు. ఆమె 1958లోనే వ్రాసిన ప్రసిద్ధ కథ ”అల్లుని మంచితనం”లో ఒక యువతి భర్త భావాలతో, ప్రవర్తనతో విసిగి, పుట్టింటికి వచ్చి, ఇలా అంటుంది. ”సర్వం అర్పించి ఆనందం సృష్టించాలనే సంకల్పం నాదయితే భార్య అనేదానికి మనసుందనీ, తన జీవితానికి విలువ ఇస్తుందనీ, అతని ప్రవర్తన బట్టి ఆమె సుఖదుఃఖాలు కలుగుతాయనే ఆలోచనే ఆయనకు లేదు. ఏం చేయనునేను?” అప్పుడామె చెల్లెలు ఇలా అనుకుంటుంది ”…అందుకే నాకు పెళ్ళి మీద నమ్మకం లేదు. కన్నెపిల్లలకు అదొక తీయని కల…కానీ ఎటువంటివాడైనా కోరి చేసుకున్న పిల్లైనా సరే భార్య అనేసరికి అధికారభావంతో చూస్తాడు…బి.ఏ. పూర్తి చేస్తాను. ఎమ్మే చదువుతాను. ఉద్యోగం చేస్తాను…స్త్రీ సహజమైన వాంఛలు ఉండనీ సబ్లిమేట్‌ చేస్తాను…సంగీత సాధన చేసి కళారాధనలో తపస్వినౌతాను…నా అందం, నా చదువు, నా పాట ప్రస్తుతం ఎవరైనా ఆరాధించవచ్చు. కానీ వివాహం జరిగితే అతనూ అందర్లాగే ప్రవర్తిస్తాడు. ఈ జీవిత రాగాలాపనలో అదొక అపశృతి అయితే..” అని తన ఆశయాలు, అర్హతలతో సహా తనను గౌరవించేవాడు దొరికేవరకూ నిరీక్షిస్తానంటుంది. 1959 నాటికే యువతుల ఆలోచనల్లో వచ్చిన పరిణామాలకు ఈ కథ అద్దం పడుతుంది.


అంతేకాదు స్త్రీలకు స్వతంత్రం అవసరమే కానీ తను ”ఫ్యామిలీ లైఫ్‌”నే ఇష్టపడతానని ఒక ఇంటర్వ్యూలో ఈ రచయిత్రి చెప్పినట్లు ఈమె కథలు కూడా ఒక స్నేహసుందరమైన కుటుంబ జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. ఆకాంక్షిస్తాయి. కుటుంబజీవితాన్ని శాంతియుతం చెయ్యడానికి స్త్రీలే త్యాగం చెయ్యాలని ఎక్కడా చెప్పవు. తన జీవన భాగస్వామిపై ఎన్ని ఆశలతో స్త్రీ వైవాహిక జీవితంలో అడుగుపెడుతుందో, అతని సుఖసౌఖ్యాలను ఎంతగా కోరుతుందో అతను కూడా ఆమెతో సహజీవనం అంత సుందరంగానూ ఉండాలని ఆకాంక్షించాలి. ఒక కథలో అరవింద ఇలా అంటారు ”జీవితం చాలా పరిమితమైనది. కనుకనే ఆశయాలతో సిద్ధాంతాలతో దాన్ని సుందరతరంగా మలుచుకోవాలి. ఆ కృషిలోనే సంతృప్తీ ఆనందం లభిస్తాయి. పొరపాట్లు దిద్దుకునే అవకాశం జీవితంలో లభించడం కష్టం. అవసానదశలో మానవులకు మిగలవలసింది తృప్తితో కూడిన ఆనందం. ఒకరి కష్టసుఖాలలో ఒకరికి పాలు వుంది. ఎవరి ఆనందం వారిదే అనుకుంటే మానవులు బ్రతకలేరు. సహజంగా సానుభూతి అనేది మనుషుల్లో వుంది.” మనుషులలో మంచి మిగిలే వుందని రచయిత నమ్మకం..అందుకనే ”అల్లుని మంచితనం” కథలో లలితను అంతగా విసిగించిన ఆమె భర్త పుస్తక పఠనం ద్వారా పర్యటనల ద్వారా తనని తను ఎడ్యుకేట్‌ చేసుకుని, పెరిగిన చైతన్యస్థాయితో ఆమె విలువ గ్రహించి ఆమెకిష్టమైతే తిరిగి రమ్మని అభ్యర్ధిస్తాడు. అతను పూర్వం లలితతో ప్రవర్తించిన తీరుకు అతని నేపథ్యమే కారణం అంటాడు. లలిత పెరిగిన కుటుంబ సంస్కారం వేరు కనుక ఆమె అతనితో సద్దుకుపోలేకపోయింది, మరొక చెల్లి సత్యలాగా.



1950 దశకం చివర్లోనూ అరవైల్లోనూ ఎక్కువ కథలు వ్రాసిన అరవింద కథల్లో స్త్రీలు ఆలోచన కలవారు. తెలివైనవారు. ”అడవిపువ్వు” అనే కథలో ఆస్తీ అంతస్తూ, నగా నట్రా, అందం చందం వున్న రాజ్యలక్ష్మి భర్త వేశ్యాలోలుడు. అతను మొదటిరాత్రి మాత్రమే ఆమె దగ్గరకొచ్చాడు. రెండవరాత్రి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళో నేనో ఎంచుకోమంటే నువ్విప్పుడొచ్చావు వాళ్ళెప్పటినించో వున్నారంటాడు. అయితే నన్ను మర్చిపొమ్మంటుంది. అతని స్త్రీలకి అతన్ని వదిలి ఇంటి విషయాలు చూసుకుంటూ వుంటూ బాల వితంతువైన ఆడపడుచుకి ఒక అబ్బాయితో కలిగిన ప్రేమను ప్రోత్సహించి, ఆమె గర్భవతి అయితే ఆ విషయం నవ్వుతూ భర్తకి చెప్తుంది. అతను ఇట్లా నామీద ప్రతీకారం తీర్చుకున్నావా అని కేకలు పెడతాడు. ఏమాత్రం బెదరని రాజ్యలక్ష్మి ఆడబడుచుని తీర్థయాత్రల పేరుతో వేరే ఊరు తీసుకుపోయి పురుడు పోసుకొచ్చి ఆ బిడ్డ తన బిడ్డేనని చెప్తుంది. ఈలోగా ఆమె భర్త గోదావరిలో మునిగి చనిపోయాడని వార్త అందినా శవం దొరలేదు కనుక పసుపుకుంకుమలు నగా నట్రా తీసివెయ్యనంటుంది. కొన్నేళ్ళకి స్వామివారిలా ఆ వూరే వచ్చి జనం పూజలందుకుంటున్న భర్తని గుర్తుపడుతుంది. ”ఎతమంది జనం! ఎంత జరుగుబాటు! ఎంత పేరు..” అనుకుంటుంది. ”ఇంటికి రమ్మనదు, అన్నీ త్యజించుకుని ఇంతవాడయ్యాడు. ఇంకేంకావాలి? ఈ బ్రతుకులకి ఇదే ముగింపు” అనుకుంటుంది. ”మీ ఈ స్థితికి నేనే కారణం. మీరూ ధన్యులే, నేనూ ధన్యురాలినే” అని దండం పెట్టి చక్కా వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న భార్యలు కూడా అలసిపోయివస్తారనే ఇంగితం లేని భర్తలు వేళకి తమకు అన్నీ అమరకపోతే భార్యల్ని ఉద్యోగం మానెయ్యమంటారు. కానీ ఇంటి పనిలో ఒక చెయ్యి కూడా వెయ్యరు. ఇట్లా అనే భర్తలే చివరికి భార్యని అర్థం చేసుకుని ”నాకు బొమ్మ వద్దు, నాలో చైతన్యం కలిగించి ఆనందం కురిపించే మనిషి కావాలి. నేనెప్పుడైనా అమానుషంగా కనిపిస్తే తిరగబడు. విడిపోదాం అనకు…నువ్వు హోమ్‌ వర్క్‌ చేయిస్తే నేను వంట చేస్తాను…పని పంచుకుందాం” (ఓ కప్పు కాఫీ) అంటారు. తన ఉద్యోగ జీవితం తనకి రెండో భాగం అనీ దాన్ని వదలలేననీ ఒక ఉద్యోగిని భర్తకు అర్థం చేయిస్తుంది.



మరొకకథలో ఒక చదువుకున్న యువతి ఇంటికి వేరే పెళ్లి సంబంధం చూసుకోడానికి ఒక ఇంజినీర్‌ యువకుడు వస్తాడు. అది ఎక్కువ కట్నం వచ్చే సంబంధం. కానీ ఈమె అందం తెలివీ వున్న అమ్మాయి. పనిమంతురాలు. పాటలు బాగా పాడుతుంది. ఆ అబ్బాయి ”నీకు ప్రియ (తను చూసి వచ్చిన అమ్మాయి)ను చూస్తే అసూయగా లేదా అని అడుగుతాడు. దానికామె ఇలా అంటుంది” ఏమీ లేదు చాలా సింపుల్‌. నువ్వు నన్ను చూడ్డానికి రాలేదుగా! నువ్వు ప్రియని చేసుకోడానికి వొప్పుకున్నావనుకో, నీ ఆలోచనా విధానమేమిటో నాకు తెలుసు. అటువంటి మనిషి దొరకలేదని బాధపడను. ఒకవేళ ప్రియని చూసుకోడానికి వచ్చి లలితను ఇష్టపడి కట్నం లేకుండాచేసుకుంటావనుకో అప్పుడా వ్యక్తి ఎటువంటివాడో నాకు తెలుసు. అప్పుడు బాధపడ్డానికేం వుంది, సంతోషం తప్ప” అంటుంది. కట్నం కోసం హోదా కోసం అతను ప్రియనే ఎంచుకున్నప్పుడు రచయిత్రి ఇలా వ్యాఖ్యానిస్తుంది ”డబ్బు తెచ్చే దర్పాన్ని కోరుకుంటూ మనిషి జీవితపు విలువల్ని దూరం చేసుకుంటున్నాడు. మానసిక ఔన్నత్యానికి, ఆనందానికి దూరం వెళ్ళిపోతున్నాడు. ఈ మార్గంలో దాహం తీరదు”. మరొక కథలో తానంతవరకూ వస్తాడని ఎదురుచూసిన బావ ప్రేమలో ఏకాగ్రత లేదనీ అతనిది చలించే స్వభావమనీ తెలుసుకున్న అమ్మాయిని అతన్ని వివాహం చేసుకో నిరాకరిస్తుంది.



ఒక కథలో ఒక యువకుడిలా ఆలోచిస్తాడు ”గృహిణి అయిన స్త్రీ విద్యావంతురాలైతే పురుషుడితో సమానంగా అన్వేషణలో మునిగి తన బాధ్యతలు నిర్వహించలేకపోతే కుటుంబవ్యవస్థ యొక్క శాంతి సంక్షేమాలకు భంగం వాటిల్లుతుందనేమో!! గ్రీకుల కళా శిఖరావాసానికి బానిసలు సోపానాలైనట్లు, మన స్త్రీలు హిందూ నాగరికతకు తోడ్పడ్డారు కాబోలు. ఈ రకంగా కొంతమంది కళాజీవులు జ్ఞానతృష్ణకలవారు ఆత్మహింసకి గురై వుంటారు”. మరొక కథలో కట్నం తీసుకున్నాడన్న ఒక అపప్రధ మూట గట్టుకున్నప్పటికీ అవసరానికి అత్తమామల్ని తన స్వంత తల్లితండ్రుల్లా చూసుకున్న అల్లుడూ, కట్నం తీసుకోకుండా మంచిపేరు కొట్టేసి అటు భార్యకీ ఇటు ఆమె తల్లితండ్రులకూ కనీసమాత్రపు సహకారం కూడా ఇవ్వని అల్లుడూ వుండి ఆదర్శాలు పేరుకేనా అనేలా చేస్తారు. స్త్రీలు పురుషులు తమ తమ వ్యక్తిత్వాలను, తమ కళాభినివేశాలను కాపాడుకుంటూ, విలువలతో కూడిన ఒక స్నేహమయమైన కుటుంబ జీవితాన్ని గడపాలని, అరవింద ఆకాంక్షిస్తారు. అటువంటి సంసారం ఇద్దరికీ అవసరమేనంటారు


శరత్‌, టాగోర్‌, రంగనాయకమ్మ నవలలు ఎక్కువగా చదివిన అరవింద ”చలంగారి గురించి గొప్ప అభిప్రాయం ఏర్పరుచుకోలేదు. ఆయన ఆడవాళ్ళని లేచిరమ్మన్నారు కానీ పరిష్కారం చెప్పలేదు. ఆయన రచనల్లో స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రంలాంటివాటికి చోటులేదు అటువంటి పరిస్థితిలో ఆడవాళ్ళను లేచిరమ్మంటే హౌ షి కెన్‌ ఫేస్‌? కానీ ఇప్పటి ఆడవాళ్ళు అన్నీ ఎదుర్కొంటున్నారు. ఆయన అంతవరకే చెప్పి వదిలేశారు” అంటారు. ఆడవాళ్లు తమ భావాలను వ్యక్తం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా వున్న రోజుల్లో కథారచన చేసిన అరవింద ఆడవాళ్ళు ముఖ్యంగా చదువుకుంటున్న యువతులు ఎట్లా వుండాలో ఆలోచించి వ్రాశారు. పురుషులుఎట్లా వుంటే బాగుంటుందో కూడా చెప్పారు. పేపర్‌ చదివి వ్రాయడం కాక తనకు తెలిసిన విషయాలనే వ్రాస్తాననే అరవింద కథలు వాస్తవచిత్రాలే కానీ అభూతకల్పనలు కానేకావు. ఏ.ఎస్‌.మణి పేరుతో కూడా రచనలు చేసిన ‘అరవింద’ అసలుపేరు అన్నంరాజు సుగుణమణి. రెండు కథాసంకలనాలలోని 36 కథలే కాక ఇంకా కొన్ని చేర్చలేకపోయిన కథలున్నాయి. 1971లో మొదటి నవల వ్రాశారు. దానికి ప్రత్యేక బహుమతి వచ్చింది. తరువాత వ్రాసిన ”అవతలి గట్టు” నవలకు బాగా పేరొచ్చింది. జలసూర్య, జీవనది, ఒక జడ అమ్మాయి అనే నవలలు కూడా వ్రాశారు. ”ప్రేమ మాతృక” అనే పిల్లల నవలకి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ రచయిత్రి బహుమతి, గృహలక్ష్మి స్వర్ణకంకణం, జ్యేష్ట లిటరరి అవార్డ్‌లేకాక ఆమె కథాసంకలనానికి రచయిత్రి ఉత్తమ గ్రంథం అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం జమ్షెడ్ పూర్ లో వుంటున్నారు.
(భూమిక నుంచి)