Tuesday, June 29, 2010

రంగుటద్దాల కిటికి





భారతీయుల ప్రవాసం ప్రారంభమై చాలాకాలమైంది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం కిందకి రాగానే వారు ఆక్రమించిన అనేకానేక దేశాల్లోకి భారతదేశం నించీ అనేకమందిని indentured labourకింద తరలించారు.ముఖ్యంగా ఫిజి,మలేసియా,శ్రీలంక,కరీబియన్ దేశాలకు.వీళ్ళు ఒక పరిమితకాల ఒప్పందంపై వెళ్లినా చాలామంది తిరిగి రాలేక అక్కడే స్థిరపడిపోయారు.తరువాత బ్రిటిష్ హయాం లోనే బార్ ఎట్ లా వంటి చదువులకు భారతదేశం నించీ ఇంగ్లండ్ వెళ్ళారు .స్వాతంత్య్రానంతరం కూడా ఉన్నత విద్య కోసం.ఉద్యోగాలకోసం వెళ్ళారు.1950,60లలో ఇంజినీర్లుగా డాక్టర్లుగా అమెరికా ఇంగ్లండ్ వెళ్లారు.దుబాయ్ ,ఇరాన్ కూడా వెళ్ళారు.1990 ల తరువాత వచ్చిన సాఫ్ట్వేర్ బూమ్ తో వలసలు వరదే అయ్యాయి.విద్యార్ధులు అప్పుడూ ఇప్పుడూ వెడుతూనే వున్నారు.ఇక మన దేశం నించీ కార్పెంటర్లు,ప్లంబర్లు,తాపీ పని వారు మధ్యప్రాచ్యానికి వెడుతున్నారు.వీరేకాక నైపుణ్యాలతొ పని లేని చిల్లర ఉద్యోగాలకి కూడా వెడుతున్నారు..పుట్టిన దేశం నించీ మరో దేశానికి వెళ్ళి ఆ మెట్టిన దేశంలో వీళ్ళంతా ఎలా జీవింఛారు?జీవిస్తున్నారు? వాళ్ల ఆవేదనలు,ఆనందాలు సంవేదనలు,మాతృదేశంపై మమకారాలు చిత్రించిన సాహిత్యం చాలా వచ్చింది.కరీబియన్ లో స్థిర పడ్ద వారి జీవితాలను గురించి వి.ఎస్.నైపాల్,,అమెరికా జీవితానుభవాలగురించి భారతీ ముఖర్జీ వంటివారు.ఇప్పుడు చిత్రా బెనర్జీ,ఝంపా లహరి ఇంకా చాలామంది వ్రాస్తున్నారు.అట్లాగే చైనా జపాన్ శ్రీలంక,ఐర్లండ్,నైజీరియా,ఇరాన్,పాకిస్తాన్,వంటి దేశాలనుంచీ అమెరికా వచ్చి స్థిర పడ్ద వారు వ్రాసిన సాహిత్యం కూడా ఇంగ్లిష్ అనువాదాల్లో చాలా వచ్చింది..తెలుగు సాహిత్యం ఇటీవల వస్తూంది.తెలుగు వలసలు కూడా అధికమయ్యాయి.ఉద్యోగాలకి,చదువులకే కాక ఉద్యోగాలు చేసే అమ్మాయిలకి “పురుళ్ళు” పొయ్యడానికి,పిల్లల్ని పెంచిపెట్టడానికి వెళ్ళే తల్లులు,వాళ్ళతోపాటు తండ్రులు,ఇండియా వేసవి తాపం తప్పించుకోడానికి వెళ్ళే తల్లితండ్రులు ఇట్లా అమెరికా వెళ్ళే విమానాలు ఆంధ్రులతో కిక్కిరిసి పోతున్నాయి.



అమెరికాలో వుండటం అంటే”you must be one or the other” అని కాక “ I want to be both”అని హాన్ సూయన్ లా చెప్పగలిగి.,పుట్టింటి అనుబంధాన్ని పదిలంగా కాపాడు కుంటూనే అమెరికా జీవితంలో ఒదిగిపోయిన తెలుగు వారి జీవితాలను ఆవిష్కరించిన ఒక మంచి కధాసంకలనం ఇటీవల వచ్చింది.”తుపాకి”అనేకధ ద్వారా పాఠకుల మనసులో నిలిచిన నారాయణస్వామి వ్రాసిన 21 కధలు ఇందులో వున్నాయి..ఇండియాలో వుండే వాళ్ళకి అమెరికా జీవితం పట్ల అనేక “మిత్స్” వుంటాయి. అక్కడే వుంటూ ఆదేశానికి అలవాటుపడుతూనే తమ సంస్కృతులను కాపాడుకుంటున్న ఇండియన్ అమెరికన్స్ వ్రాసిన సాహిత్యం అటు అమెరికన్ జీవితాన్నీ ఇటు ప్రవాస హృదయాన్నీ ప్రతిబింబింబించి నిజాన్ని కళ్ళముందుంచుతుంది.”రంగుటద్దాల కిటికీ” ఆ పని జయప్రదంగా నెరవేర్చింది.
పిల్లల్ని శారీరకంగా పెంఛడం ఎంతముఖ్యమో వాళ్ల చైతన్యాన్ని, ఆలోచనా శక్తినీ పెరగనివ్వడానికి కృషి చెయ్యడం అంతకన్న ముఖ్యం అని అర్ధం చేయించే రెండు కధలు ఈ సంపుటిలో ముందు వరసనుంటాయి.అవి,”తుపాకి” “చక్కని చుక్క”..ఆలోచనలు చిగురువేస్తున్న అతి పిన్న వయసులో,తల్లి తండ్రులు,స్నేహితులు,పాఠశాలలో ఉపాధ్యయులు,చదివే పుస్తకాలు.టీవీ అన్నీ మనసులో చెరగని ముద్రలు వేస్తాయి.తెల్లకాగితం వంటి చిన్నారి మనసులలో అవి అహేతుక ద్వేషాలను ప్రవేశ పెట్టడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి.బయటి ప్రభావాలను ఆపగల శక్తి ఒక తల్లి తండ్రులకే వుంటుంది.పిల్లలకి విలువల గురించి అర్ధం అయ్యేలా చెప్పడం .



అమెరికా లో వుంటూన్న గన్ కల్చర్ నించీ పిల్లల్ని కాపాడుకుని వాళ్లల్లో సహృదయతనీ స్నేహస్వభావాన్నీ పెంపొందించాలంటే తల్లి తండ్రులే శ్రధ్ధ పెట్టాలి.ఇండియాలో దళిత విద్యార్ధులపై జరిగే వికృతమైన రాగింగ్ కూడా అలాంటిదే.తమ అవకాశాలను వాళ్ళు ఎగదన్నుకు పోతున్నారని ఉక్రోష పడ్డం లాగే ఈ కధలో ఒక పిల్లవాడు తమ అవకాశాలన్నీ నల్లవాళ్ళు ఎగరెత్తుకుపోతున్నారని తండ్రిద్వారా విని స్కూల్లో సహ విద్యార్ధి మీద కాల్పులు జరుపుతాడు.అట్లాకాక మరొక తండ్రి నల్లవాళ్ళు మన సాటి మనుషులేనని చెప్పి స్నేహాన్ని ప్రోదిచేస్తాడు.చక్కని చుక్క అనే కధలో అమ్మాయి తన వయసుని మించిన తెలివికలది.ఆ విషయం ఆ పిల్ల తల్లి తండ్రులకే కాక ఆపిల్లకు కూడా బాగా తెలిసి తనొక సెలెబ్రిటీ ననుకుంటుంది.తన తోటిపిల్లల్తొ తన వయసుకు తగ్గట్లుగా కాక తనని మెచ్చుకునే వాళ్ళతో తన flatter చేసే వాళ్ళతో ఎక్కువ చనువుగా వుంటుంది.తమ పిల్ల ఆటా పాటా అందం చందం తెలివీ మార్కులూ గ్రేడ్లూ ,అందరిమెప్పూ మాత్రమే పట్టించుకుని ఆమెను గారంగా చూసుకునే తల్లితండ్రులు,ఆ పిల్ల సెలెబ్రిటీ కాంప్లెక్స్ తో ఏ దారిన నడుస్తోందో పట్టించుకోరు .చిన్నతనంలోనే పిల్లలు అద్భుతమైన కళాభినివేశాన్నో మరొక నైపుణ్యాన్నో ప్రదర్శించి మన్నన లందు కున్నప్పుడు సంతోషమే కానీ అదే జీవితం కాదనీ ఏ వయసుకు తగ్గ ఆలోచనలు ఎదుగుదలా. ఆవయసుకుం డాలని తెలుసుకోరు ఆ పిల్ల చురుకుతనాన్నీ చొరవనీ అమాయకత్వాన్నీ ఎక్స్ ప్లాయిట్ చేసిన ఒక వివాహిత యువకుడు చివరికి ఆ పదహారేళ్ల పిల్లనూ బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళిచేసుకోవాలని చూసినప్పుడు ఒట్టి మూర్కుల్లా ప్రవర్తించబోతారు.అమెరికా లో స్థిరపడినా మళ్ళీ పాతకాలపు భారతీయ తల్లితండ్రుల్లాగే అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తారు.. మొదటినించీ ఆ పిల్ల ప్రవర్తనను పరిశీలిస్తూ వచ్చిన సుచరిత ఆమె కు అండగా నిలిచి పదహారేళ్లయినా నిండని ఆ చక్కని చుక్క ఇంకా చదువుకోవాలని మంచి భవిష్యత్తుని వెతుక్కోవాలని తెలియ చెప్తుంది..ఇవాళ మనం చూస్తున్న రియాలిటీషోల్లో పిల్లల తల్లి తండ్రులు ఈ కధ చదివితే ఎంత బాగుండునో అనిపించింది.



అట్లాగే ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా మనువు బిడ్దలే అనే కధ “ఇండియన్ వేల్యూస్” అమెరికాలో వున్నా ఎక్కడవున్నా,అమ్మాయి చదువూ తెలివీ కాదు,అందంచందం కూడా కాదు ఆమె కన్యాత్వమే ముఖ్యం అనుకునే యువకులని ఈ కాలపు అమ్మాయిలు “నువ్వు కూడా వర్జిన్ వేనా?” అని తప్పకుండా అడిగి మరీ సారీ చెప్తారు కదా? అయితే ఇట్లాంటి మూస తల్లితండ్రులు కాక విలక్షణమైన ఒక తల్లి “నీవేనా నను పిలచినది” అనే కధలోనూ ఒక తండ్రి “వీరిగాడి వలస”అనే కధలోనూ కనిపిస్తారు...ఇంకా ఇలాంటి మంచికధలు,చక్కని ప్రేమకధలు, ఈ పుస్తకంలో వున్నాయి.’రంగుటద్దాల కిటికీ ’అనే ఈ కధా గుఛ్చం అన్ని పుస్తకాల దుకాణాల్లో దొరుకుతుంది..మంచికధలు వ్రాసే ఈ నారాయణస్వామికబుర్లు కూడా వినాలంటే కొత్తపాళీ అనే బ్లాగ్ చూడొచ్చు.

4 comments:

జ్యోతి said...

సత్యవతిగారు

తెలుగు బ్లాగ్లోకానికి సుస్వాగతం. మీ రచనలకోసం ఎదురుచూస్తున్నాము.

కొత్త పాళీ said...

సత్యవతిగారు, నా కోరిక మన్నించి ఇప్పటికైనా బ్లాగు తలుపు తెరిచినందుకు సంతోషం. స్వాగతం.

maa godavari said...

congrats and welcom

Unknown said...

ఇండియాలో వుండే వాళ్ళకి అమెరికా జీవితం పట్ల అనేక “మిత్స్” వుంటాయి. అక్కడే వుంటూ ఆదేశానికి అలవాటుపడుతూనే తమ సంస్కృతులను కాపాడుకుంటున్న ఇండియన్ అమెరికన్స్ వ్రాసిన సాహిత్యం అటు అమెరికన్ జీవితాన్నీ ఇటు ప్రవాస హృదయాన్నీ ప్రతిబింబింబించి నిజాన్ని కళ్ళముందుంచుతుంది.”రంగుటద్దాల కిటికీ” ,
I read 4 books, అమెరికా తెలుగు కథలు, మాతృభాషను అక్కడివాళ్ళు కాపాడుకునే తీరు ; అమెరికాలో నిలద్రొక్కుకునే తొలిదశలో, కొత్త సంస్కృతికి అలవాటు అవాల్సిన స్థితి; ;మనసును ఆర్ద్రంచేస్తుంది.