Saturday, June 02, 2018

సెలవు మాస్టారూ


   సెలవు  మాస్టారూ !
ఒకే చోట  ఏనుగుల మంద గుమికూడినట్లు వుండే నల్లటి  ఆకాశం, ఆ పైన వర్షం . టప టప చినుకులతో మొదలై, జల్లులై రాళ్ళు పడుతున్నంత భయంకరంగా మారడం ..ఎంతకీ ఆగని వర్షం .అందులో ముసురు .మళ్ళీ ప్రళయ భీకర మైన ఎండ బాణాల్లాగా గుచ్చుకునే సూర్య కిరణాలు ,నోరెండి పోయే దప్పిక ,బీళ్ళు పడిన భూమి .రెక్కలు అల్లారుస్తూ  అప్పుడప్పుడూ పక్షులు ,కాకులు గుంపులు గుంపులు.పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథల్లో తరుచుగా కనిపించే ప్రకృతి నేపథ్యం .అన్ని కథల వెనుక   సన్నగా వయొలిన్ మీద వినిపించే   .విషాదపు జీర .ఆ విషాదపు జీర కు మూలం తెలుసుకుంటే కోపమూ కరుణా ముప్పిరి గొని ప్రపంచమంతా దిగులు మేఘాలు కమ్మినా, ముఖం చూపించని సూర్యుడి మీద అసహాయతతో కూడిన కోపం వస్తుంది పాఠకులకి .తను ఏ వ్యాఖ్యానమూ చెయ్యడాయన.పాత్రలూ ఉద్వేగంతో ఊగిపోవు .ఆ దుఃఖంలో, దురదృష్టమే తమ భవితవ్యం అనుకుని గమ్మున వుండిపోతాయి. ఇదిగో ఇలా వుంది విషయం అని  చెప్పేసి చదువరులకి  కోపం తెప్పించి ఏంచేసుకుంటారో చేసుకోండి అని నిబ్బరంగా వుంటాడాయన .
సుబ్బరామయ్య గారికి సాహిత్య అకాడమి అవార్డు వచ్చినప్పుడు ఒక సమీక్ష కోసం ఆయన కథా సంపుటాలు కొత్తగా వేసినవి రెండూ చదివాను.  ప్రచురణ కర్తలు ఏ కథ క్రిందా ఆ కథ  ఏ పత్రిక లొ వచ్చిందో ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు.ఇటీవల అజోవిభో కందాళం ప్రచురణల తరఫున ఆయన విశిష్ట కథలు అని నలభై ఆరు కథలతో ఒక సంపుటం ప్రచురించారు .సుబ్బరామయ్య గారు నాకు రెండు నెలల క్రితం  ఫోన్ చేసి “ఒక సారి రా అమ్మాయ్! నీకో పుస్తకం ఇవ్వాలి” అంటే వెళ్లి తెచ్చుకున్నాను. .అందులోనూ తేదీలు లేవు.ఇది ఆయనకి   శ్రద్దాంజలి కనుక ఆ చర్చ అక్కర్లేదనుకుంటాను.అయన మీద పరిశోధన చేయాలనుకున్న సాహిత్య విద్యార్థులకి మాత్రం అవసరమే,. ఆయా కాలాల్లో రచయిత దృక్పథంలో, శైలిలో సామాజంలో , కాలానుగుణంగా వచ్చిన మార్పులను పట్టుకోవచ్చు.
 ,సుబ్బరామయ్య గారిది  నిరాడంబరమైన శైలి .నిరాడంబరమైన భాష. చదివించే భాష .పంటి కింద  అక్కర్లేని ఆంగ్లపదాల రాళ్ళు లేని భాష .ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో వ్రాసే భాష కాదు  .పాండిత్య ప్రకర్ష అంతకన్నా లేదు. తెలుగు కథా సాహిత్యంలో ఒక విశిష్ట  స్థానాన్ని, ప్రశంసలనూ, పురస్కారాలనూ అందుకున్న రచయితగా ఆయన తను చదివిన గొప్ప గ్రంధాలను ఉదహరిస్తూనో, అందులోని ఆణిముత్యాలను ఉల్లేఖిస్తూనో తన మేధావిత్వాన్ని ప్రదర్శించుకోవచ్చు కానీ ఆయన ఆ వైపుకు చూడడు .కథ చెప్పడానికి ఎంచుకున్న వస్తువు పైనే దృష్టి   కేంద్రీకరిస్తాడు. ఆరు దశాబ్దాలకు పైగా బెజవాడ నివాసి ఆయన.  బెజవాడ పట్టణం  విజయవాడగా దిన దిన ప్రవర్థమానం అయి రాజధాని నగరంగా పరిణామం చెందడాన్ని దగ్గర్నుంచి చూసినవాడు .దాని అభివృద్ధినీ అభివృద్ది తాలూకు క్రీనీడలనీ పరిశీలించిన వాడు..వ్రాయడం బహుశా 1960 లలో మొదలు పెట్టి వుండవచ్చేమో.అప్పటి బెజవాడ పట్టణమే అయన కథల్లో ఎక్కువ కనిపిస్తుంది .ఎంత గొప్ప రచయితలయినా వాళ్ళు వ్రాసిన కథలన్నీఒకే ప్రమాణంలో వుండవు .కానీ రచయితకి . ఒక చూపు వుంటుంది .ఆయనది అధో జగత్తుపై కరుణ ప్రసరించే చూపు మనస్తత్వ విశ్లేషణ .కొంత తాత్వికత అన్ని కథలల్లోనూ అంతర్లీనంగా వుంటాయి.. సిద్ధాంతాలూ ఉపన్యాసాలూ లేని చిత్రణ.
.ఆయన వ్రాసిన అన్ని కథల్నీ ఇక్కడ ప్రస్తావించలేము కనుక ఆయన కథలు వ్రాయడం ప్రారంభించినప్పటి వాతావవరణాన్ని దాన్ని ఆయన చిత్రించిన కథలతో మొదలు పెడితే  పంతొమ్మిది వందల  అరవై దశకం ఎన్నో నిరాశలకూ నిస్ప్రుహలకూ  అలజడులకూ అందోళనలకూ నాంది పలికిన కాలం .నిరుద్యోగం పేదరికం అవినీతి ప్రస్పుటంగా బయట పడిన కాలం .అప్పుడు.నిరుద్యోగుల వ్యధల్ని  చిత్రిస్తూ ఆయన కొన్ని కథలు వ్రాసారు .చదువుకున్న యువకులకు ఉద్యోగం వస్తే సనస్య తీరుతుంది .కానీ యువతులకి అప్పటికే ఇప్పటికీ వివాహమే జీవన ప్రాధమ్యం.విద్యావంతురాలూ ఉద్యోగాస్తురాలూ అయిన మిస్ భారతి బి.ఎ తనకి పెళ్లి అయిందని అబద్ధాలు చెబుతుంది .ఆ కథకి ఆ పేరు పెట్టడం కూడా ఒక శిల్పమే అనుకుంటాను .అప్పుడప్పుడే అమ్మాయిలు కాలేజీల్లో చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తున్న రోజులు .చదువు కూడా పెళ్లి కి ఒక అనర్హతగా ఇంకా పరిగణిస్తున్న రోజులు.ఆడపిల్లకి చదువు ఉద్యోగం కన్నా పనిపాతలూ వినయం వందనం ముఖ్యం అనుకునే రోజులు ఇంకా పోలేదు .చాలా కథల్లో కుంపటి మీద కాఫీలు పెట్టుకోడాలు .విసనకర్రతో విసురుకోడాలు,చాపల మీద కూర్చోడాలు .ఆడపిల్లను మైనస్ అనడం మొగవాళ్ళని ప్లస్ అనడం పదహారేళ్ళకి పెళ్లి సంబంధాలు చూడ్డం వుంటాయి .అంటే సుబ్బరామయ్య గారు ఎక్కువ కథలు వ్రాసింది  అరవై డెభై దశాకాల్లోనే అనిపిస్తుంది.ఆయన బెజవాడ లొ అప్పట్లో రామాటాకీస్ దగ్గర కాలువ గట్ల పై నివసిస్తూ పడుపు వృత్తి చేసుకుని అత్యంత దౌర్భాగ్య జీవితం గడిపే స్త్రీలను గురించి  రెండుమూడు కథలు వ్రాసారు.ప్రత్యెక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడు పట్టణంలో పెట్టిన సుదీర్ఘ కర్ఫ్యూ  వలన వాళ్ళు కడుపు నింపుకోడానికి పడ్డ అవస్థలని  కళ్ళముందు పెట్టారు. కొందరు యువకులలో  వచ్చిన బ్రతుకు తెలివీ వ్యాపార దృక్పథాలను గురించి కూడా వ్రాసారు. పర్యావరణం గురించి వ్యాపార విద్యాలయాల గురించీ కూడా వ్రాసారు ఆయన ధ్రువతార ,ముక్తి ,పంజరం అర్జునుడు త్రిశంకు స్వర్గం ,లావా,చేదుమాత్ర,అంగార తల్పం అనే  ఎనిమిది నవలలు కూడా వ్రాసారు అవి 20113 లొ చినుకు పబ్లికేషన్స్ ప్రచురించింది నవలల కన్నా కథా రచయిత గానే సుప్ప్రసిద్ధుడు ఆయన .1980 తరువాత నవలలు వ్రాయకూడదని ఆయనే అనుకున్నానని చెప్పారు ఒక చోట .
  .సుబ్బరామయ్య గారు ఎక్కువగా నిరుపేద బ్రాహ్మణులను గురించి కలత చెందారు .అందుకే ఆయన్ని “దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడు “అంటాడు.వేగుంట  మోహన ప్రసాద్. పూర్ణాహుతి వారిని గురించి వ్రాసిన ప్రసిద్ధ కథ,మధ్య తరగతి జీవులను గురించి వ్రాసిన కథలలో కూడా బ్రాహ్మణ కుటుంబ వాతావరణమే వుంటుంది .తెలిసిన జీవితాన్నే వ్రాయాలను కోవడం వలన కావచ్చు .
 తెలుగు కథా  సాహిత్యంలో సుబ్బరామయ్య గారి పేరును చిరస్థాయి గా నిలబెట్టిన కథ “నీళ్ళు’ నీళ్ళకోసం తపించి తపించి పుష్కలంగా నీరున్న ప్రాంతానికి వచ్చిన జోగినాధం నీళ్ల బిందె పొరపాటున  దొర్లించి దెబ్బలు తిన్న చెల్లెల్ని .మంచినీళ్ళు, బిందె ఇంతని కొనుక్కుని జాగ్రత్తగా వాడుకోవలసిన పరిస్థితిని ,స్నానానికి నీళ్ళు దొరకని స్థితిని బావుల్లో పాతాళానికి దిగిపోయిన నీటి జలనీ తలుచుకుని తల్లినీ చేల్లెళ్లనీ తలుచుకుని వాళ్ల బదులు కూడా తనే నీళ్ళుతాగుతాడు .తాగే గ్లాసు వంక అపురూపంగా చూసుకుంటాడు .బాల్చీలకొద్దీ నీళ్ళు తోడుకుని స్నానం చేస్తాడు .నీళ్ళ పట్ల అతని “అపిని” అందరికీ ఎగతాళిగా మారుతుంది.ఒక రోజు  జోగినాధం తెల్లవారకుండానే కృష్ణ లొ స్నానానికి వెళ్లి లోలోపలికి పోయి సుడిలో చిక్కి పోతాడు.ప్రాకాశం జిల్లాలో నీళ్ళ ఎద్దడి ,కృష్ణా లొ పుష్కంలంగా నీరు .నీటిని బట్టి నాగరికత ,జోగినాధం మానసిక స్థితిని అలవోకగా చిత్రించినప్పుడే ఆయన ఒక పరిణతి చెందిన రచయితగా గుర్తింపు పొందాడు..తరువాత ఆయన దగ్ధ గీతం, ముసురు, గాలి, కళ్ళజోడు  తాతిగాడి కల ,ఏస్ రన్నర్,ఇంగువ వంటి కథలు వ్రాసాడు ఆయన వ్రాసిన కథల్లో నీళ్ళు తరువాత ప్రఖ్యాతి పొందిన కథ ఇంగువ..ఇంగువను ఒక ఉత్ప్రేక్షగా వాడుకుని మనిషికి తానెవరో ఏమిటో జీవితకాలంలో తెలియదు అని అర్థం చేసుకోవాలనుకుంటాను. ఈ కథలోనే ఒక చోట “ఉదాహరణకు నువ్వు రోడ్డు మీద పోతున్నావనుకో, అవతల దూరంగా వెడుతున్న ఎవరినో చూడాలనుకుంటావు...కానీ ఏ లారీయో ట్రక్కో అడ్డం వస్తుంది. అవతలి మనిషిని ఎప్పటికీ చూడలేవు. అలాగే ఎప్పుడో ఏదో అనుమానం వస్తుంది. అది తీరకుండానే ఉండిపోతుంది తీర్చుకుందామనే అనుకుంటాము. కానీ వీలుపడదు. ఎప్పటికీ వీలుపడదు ఏదో చూడాలని అనుకుంటాము .కానీ ఎప్పటికీ చూడడం  కుదరదు .అలాగే కాలం గడిచిపోతుంది చివరకు అట్లాగే చచ్చి పోతాము” అంటాడు. ఇంగువ గురించి తెలుసుకోకుండానే పోయిన మనిషి  ఈ కథ ను చాలా ఇష్ట పడి త్రిపుర గారు “ఒక కాఫ్కా సుబ్బరామయ్య ఇంగువ వృత్తాంతం “ అనే కవిత కూడా వ్రాసారు .ఈ  ఆలోచన సుబ్బరామయ్య గారి చాలా కథల్లో ఒక” లైట్ మోటీఫ్ “ Leit motif లాగా ఉంటుంది .కళ్ళజోడు కోసం తపించిపోయి తీరా దొరికినప్పుడు పగిలి పోవడం, గ్రామోఫోనే రికార్డ్ వినేటప్పుడు ఇయర్ ఫోన్ లొ బాటరీ అయిపోవడం, సినిమాలో చూడాలనుకున్న దృశ్యం తెగిపోవడం ,తండ్రికి గాలికోసం ఫ్యాన్ సంపాదించేసరికి ఆయన పోవడం .ఇట్లా చాలా కథల్లో .
.ముసురు కథలో సింహాచలం ,దగ్ధ గీతం కథలో సేతురామన్  పూర్ణాహుతిలో కథకుడు, సతీ సావిత్రిలో సావిత్రి,  లాంటి మనసున్న మంచి వ్యక్తులుంటారు .యౌవ్వనం లొ ఒక వెలుగు వెలిగి వృద్ధాప్యంలో దీనావస్థకు గురైన  చాంపియన్లున్నారు.ఎక్కువగా చింపిరి అనాథ బాలలున్నారు.బాధిత స్త్రీలున్నారు .సుబ్బరామయ్య గారికి స్త్రీల పట్ల సానుభూతి వుంది..సామాజంపట్ల ఒక నిరాశతో కూడిన ఆవేదన వుంది  .ఆయన  కాలంలో ఆంధ్ర దేశంలోనూ విజయవాడలోనూ ఎన్నో అలజడులూ ఆందోళనలూ సంభవించాయి అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి .తాతిగాడి కల అనే కథలోమాత్రమే ఆయన ఒక రాజకీయ పరిణామాన్ని  చూపించారు .ఒక మహానాయకుడికి చెప్పుల దండ వెయ్యడం చూసి చిన్నవాడైన తాతిగాడు జరగబోయే పరిణామాలను ఉహించుకుని దాన్ని తియ్యడానికి ప్రయత్నించి గుంపుకీ పోలీసులకీ దొరికి పోయి దెబ్బలు తిని పోలీసు స్టేషన్ లొ తేలి ,పోలీసులకి నిజం చెప్పినా నమ్మారో లేదో గాని నవ్వేసి వదిలేస్తాం అంటారు.
సుబ్బరామయ్య గారు నిరాడంబరుడు .స్నేహశీలి .అనారోగ్యం వలన ఎక్కడికీ స్వంతంగా రాలేకపోయి ,ఒంటరి అయిపోయానని బాధ పడేవాడు .ఆయన్ని అందరూ అభిమానించి వెళ్లి చూసి వచ్చేవాళ్ళు. అసంతృప్తి వుండేది. వృద్ధాప్యానికి కొన్ని సౌకర్యాలు అవసరం.ఆ ఎరుక కూడా ఇంగువ లాగే చివరిదాకానూ, చివరికి కూడానూ తెలిసిరాదనుకుంటాను.  తెలుగు పాఠకులకి కొన్ని గుర్తుండే కథలిచ్చి, మెడికల్ కాలేజి కి దేహాన్నిచ్చి  వెళ్ళిపోయారు మాస్టారు .”ఒక్క సారి రా అమ్మాయ్” అనే ఆయన ఫోన్ పిలుపు కలుక్కుమంటుంది .నన్ను అమ్మాయ్ అని మానాన్న తరువాత ,మావూరి వాళ్ల తరువాత ,సుబ్బరామయ్య గారే .వుంటాను మాస్టారూ!
పి .సత్యవతి  ( ఈ మాట జూన్ సంచికలో ..)
  


.