Monday, May 22, 2017

పాత కథే



                 పాత కథే 
చక్రం గిర గిరా  తిరుగుతోంది  పెడల్ మీద పాదాలు చక చకా కదులుతున్నాయి సూది క్రింద బట్ట ముందుకీ వెనక్కీ మంత్రించినట్టు జరుగుతోంది...కుట్టు యంత్రం పైన   మనిషి యంత్రం  !!.నవ్వుదామా అనుకుంది  వరలక్ష్మి. కానీ నవ్వు రాలేదు. హుసేనన్న భోజనానికి పోయేదాకా నోరు మెదపకూడదు ఒకరి వంక ఒకరు చూసుకోకూడదు. దగ్గోస్తే మంచినీళ్ళు తాగొచ్చు నవ్వొస్తే నవ్వకూడదు ఏదైనా చెప్పాలనిపించినా, ఇంటికి పోయేదాకా ఒంటేలు బిగబట్టుకున్నట్టే , హుసేనన్న భోజనానికి పోయేదాకా మాట కూడా  బిగబట్టుకోవాలి భవాని పాపం ఎదో చెప్పాలనుకున్నట్టు కనపడుతోంది.పన్నెండున్నర కి హుసేనన్న భోజనానికి పోతాడు ..అప్పటిదాకా ఆ విషయం బిగపట్టుకుంటే  కడుపునెప్పి రాదా పాపం ఆ పిల్లకి.?  ఎంచేస్తాం ఎన్ని కడుపునెప్పులు  భరించాలి ? హుసేనన్న ఈ కొట్టు అద్దెకి తీసుకుని పదిహేనేళ్ళు అయింది బ్లవుజులు కుట్టడానికి మంచిపేరొచ్చింది.. ఆదాయం పెరిగింది పనివాళ్ళు ఇద్దరికీ అయిదుగురయ్యారు బాత్రూం వున్న కాస్త పెద్ద గది తీసుకో మంటే ఒప్పుకోడు ఇది అచ్చి వచ్చిందంటాడు అతనికైతే వీధి వుంది  మరి కుట్టే పిల్లల గతేమిటంటే ఉలకడు పలకడు పైగా ఆడవాళ్ళయితే ఒళ్ళు వంచి పనిచేస్తారని ఆయన నమ్మకం అందుకని మగ పిల్లల్ని పనికి పెట్టుకోడు .అయితే  హుసేనన్న మనసులో మెదులుతున్న ఆలోచనలను అదుపు చెయ్యలేడు కదా ? అందుకే ఎంత యాంత్రికంగా పనిచేస్తున్నా వరలక్ష్మికి ఇవ్వాళ పొద్దున్నే తను అయిపోయిన పేస్ట్  డొక్కు లోనుంచీ  పిండీ పిండీ పిసరంత పేస్ట్   సంపాదించుకుని గోడవారగా నిలబడి పళ్ళు తోముకుంటూ వుంటే అప్పుడే ఆటో దిగి ఇంట్లో కొస్తున్న పురుషోత్తం అన్న మాటలు, నవ్విన నవ్వూ పదే పదే కళ్ళముందుకొస్తోంది ..
“ మా యావిడ్ని శాతవాహన ఎక్కించొస్తున్నా! మూడు రోజుల దాకా రాదు  ఆళ్ళ పిన్నమ్మ  కూతురు పెళ్లి.. నేనెళ్ళటల్లా “ అనేసి అటూ ఇటూ చూసి ఒక నవ్వు నవ్వేసి పోయాడు .
ముందు కాస్త ఖాళీ జాగా, అందులో మంచినీళ్ళ పంపూ, రెండేసి గదులూ ఒక చిన్న స్నానాల కొట్టూ , అందరికీ  కలిపి గేటు పక్క రెండు పాకీ దొడ్లూ వున్న ఆ నాలుగు భాగాల రేకుల ఇంట్లో ఈ  చివర వరలక్ష్మీ,  ఆ చివర పురుషోత్తం వుంటారు.,వరలక్ష్మికి పురుషోత్తమే కాదు ఆమె కూతురు జ్యోతి కూడా క్షణానికొక సారి కళ్ళముందుకు వస్తోంది.. పొద్దున్న లెక్కల ప్రయివేటుకు పోతూ తెగిన చెప్పుకు పిన్నీసు పెట్టుకుంటూ వుంటే “నా చెప్పు లేసుకు పొ” అంది వరలక్ష్మి  “ వద్దులే .నువ్వు మజ్జాన్నం  అన్నానికి వచ్చేటప్పుడు కాళ్ళు కాలతాయి “అంది . జ్యోతికి  చెప్పులు కొనిపెట్టాలి.  ఇంటికెళ్ళే పాటికి తోమ్మిదవుతొంది. ఇంకెప్పుడు బజారుకి పొయ్యేది?
కొట్లో  మిషన్ చప్పుళ్ళు ఆగి గలగలా మాటలు వినపడితే తల ఎత్తింది .హుసేనన్న ఎప్పుడువెళ్ళాడో కూడా చూడలేదు. వరలక్ష్మి...భవాని నోరు తెరిచింది
.ఏమైందే ఏమైంది అంటున్నారు అందరూ
“పొద్దున్న పేపరు చూళ్ళేదా మీరెవరూ?
“అవునురా భవానీ! పేపర్లు కోనే డబ్బులూ చదివే తీరికా మాకేక్కడిది? నీకంటే పిల్లలూ సంసారం లెదు” అనేసింది ఠక్కున గంగ ..
“ఏముంది పేపర్లో భవానీ” అంది వరలక్ష్మి వాళ్లిద్దరిమధ్యా మాటలు పెరక్కుండా ఉండాలని
“నిన్న పొద్దున్న కూరగాయల మార్కెట్ దగ్గర ఒకామెని ఒకాయన కత్తితో పొడిచి చంపాడంటక్కా  ఆమె కొడుకుని కూడా పొడిచాడంట  మా అమ్మ చెప్పింది మా సందు వెనాకాలేనంట ఆవిడ వుండేది “
“ఎందుకట్టా? ఎవరాయన?”
ఏందో చాలా కథుంది అక్కా ..ఈమెకీ ఆయనకీ సమ్మంధ మంట ..ఈమె రానందంట ఆయన పొడిచాడంట..మా అమ్మ నన్ను పొద్దున్నే నీ కీ ఆరాలన్నీ ఎందుకని తిట్టింది. ఎందో వివాహేతర సంమంధమని రాశారు పేపర్లో ..”
“బుద్ది లేకపోతె సరి! ఒక పక్క మొగుడుండగా ఇంకొకడితో రంకా ?దీని మొహం మండా ! చంపేస్తే మానీ లే! పీడా వదిలింది” అంది గంగ.
సూది కింద బట్ట జరపబోతే బట్ట పక్కకి జరిగి సూది వేలికి గుచ్చుకుంది వరలక్ష్మికి.
“ ఆడి దగ్గర ఈమె డబ్బుచ్చుకుం దంట.డబ్బూ యివ్వటం లేదంట .ఆడు రమ్మంటే పోడం లేదంట “అంది సీత ..
“ఇదెవరు చెప్పారు నీకు ?పేపర్ చదివావా?”
“ఇట్టా అని ఇంకో పేపర్లో రాశార్లె ..కొడుకు ఈడిని ఇంటికి రావొద్దన్నాడంట”
“ఈ పేపరాళ్ళు ఎంత తోస్తే అంతే రాస్తారు. పెద్ద చూసినట్టే. చచ్చిపోయిన మనిషి మీద కూడా బురద పోస్తారు !థూ “ అంది భవాని
“అబ్బో అయితే ఆ మనిషి మంచిదని నీకు తెలుసా ఎట్టా? ఏమీ లేనిదే ఎందుకు రాస్తారు పేపరాళ్ళు ?అట్టా రాస్తే ఊరుకుంటారా ఎట్టా? .ఈ రోజుల్లో ఆడాళ్ళకి కూడా బుద్ది వుండట్లేదు.”అంది గంగ
నెత్తురొ స్తున్న వేలుని నోట్లో కాసేపు పెట్టుకుని ,దానికొక గుడ్డ పీలిక చుట్టి మళ్ళీ పని మొదలు పెట్టింది వరలక్ష్మి .వివాహేతర సంబంధం !అక్రమ సంబంధం !బుద్ధిలేని తనం ! గంగ ఏమిటో మాట్లాడుతోంది ఆ మాటల్లో పాతికేళ్ళు వచ్చినా పెళ్ళికాని భవాని  మీద విసుర్లున్నాయి. వరలక్ష్మి  ఎప్పుడడిగినా అడ్వాన్సు జీతమిచ్చే హుసేనన్న మీద విసుర్లున్నాయి. ఎన్ని సెలవులు పెట్టినా పని తీసేయ్యకుండా వుంచుకున్న సీతమీద కూడా విసుర్లున్నాయి. గట్టుతెగిన మురుగుకాలవే అయింది గంగ. వాకిట్లో హుసేనన్న స్కూటర్ ఆగడం చూసి చేసే పని ఆపి, తెచ్చుకున్న సీసాలోవున్న నీళ్లన్నీ గటగట తాగేసి మిషన్ మీద వన్నీ సర్దేసి, లేచి నిలబడింది వరలక్ష్మి. గంగ ఇల్లు చాలా దూరం అందుకోసం  క్యారేజీ తెచ్చుకుంటుంది సీత కూడా ఇంటికి వెళ్ళదు. భవానీ వరలక్ష్మీ బయల్దేరారు. ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్న అనసూయ కూడా డబ్బా తెచ్చుకుని  వుండిపోతుంది
“నాకు ఇంటి కెళ్ళినా  అన్నం తిన బుద్ది కావడం లేదక్కా  అట్లా అందరి ముందూ ఆమెని చంపాడంటే కడుపులో దేవుతొంది. “అంది భవాని.
“ఎవరికీ తోచిన మాట వాళ్ళు అన్నట్టే పేపర్లు కూడా ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నయ్! పాపం ఆవిణ్ణి అట్టా  చంపోచ్చా? “ అంది భవానే మళ్ళీ.
వరలక్ష్మి ఏమీ అనలేదు .కాసేపాగి “అసలు నిజాలు ఆ దేవుడికీ, ఆ ఇద్దరికీ   మాత్రమే తెలుస్తయ్!  మనకెట్లా తెలుస్తయ్ !భవానీ “అంది వరలక్ష్మి
“అయినా గంగక్క అట్లా మాట్టాట్టం బాగాలేదు;” అంది భవాని. ఆ పిల్ల చాలా బాధ పడుతోందని అర్థం అయింది వరలక్ష్మికి. ఎందుకో  మాత్రం అర్థం కాలేదు
ఆడవాళ్ళు నిజంగా ఒళ్ళు పొగరెక్కి ఇట్టాంటి సమ్మందాలు  పెట్టుకుంటారా? డబ్బుల కోసమా? అయితే అది వ్యభిచారమా? అంత అవసరమా? లేకపోతె ప్రేమా? ఆకర్షణా ? ప్రేమో ఆకర్షణో అయితే చంపడం ఎందుకక్కా? మొగుడు, పిల్లల ప్రేమ చాలదా? ఎంత ప్రేమైతే సరిపోతుంది? ప్రేమంటే ఇంట్లో వాళ్ళని మోసం చెయ్యడమా ?  ఆ పిల్లాడు బతికాడే అనుకో వాడికి తల్లి లేకుండా పోదా?
వరలక్ష్మి ఆశ్చర్యంగా చూసింది భవానిని. ,భయంగా కూడా  చూసింది . . వయసు తెలియకుండా  చిన్న దానిలా కనపడ్డం కోసం ప్రయత్నించే ఈ పిల్ల లొ ఇన్ని ఆలోచనలు వున్నయ్యా? ఎట్లా వచ్చాయి ఇన్ని ఆలోచనలు ఈ పిల్లకి? అయినా పైకి కనపడకుండా ,

“ఎవరి గోల వాళ్ళది  ..”అని ఒక నిట్టూర్పు విడిచి తనుండే సందులోకి నడిచింది వరలక్ష్మి.పిల్ల బడికి పోతుంది . .తాళం తీసుకుని ఒక్క నిమిషం మంచం మీద వాలింది. పక్క  భాగం ఆవిడ కళ్ళు ఎప్పుడూ వరలక్ష్మి మీదే వుంటాయి .ఎన్నింటి కొచ్చింది ఎంత సేపు వుంది ఎవరైనా వచ్చారా ఒక్కతే  వచ్చిందా వస్తే ఎవరొచ్చారు?
పిల్ల పిన్నీసు పెట్టుకున్న చెప్పులు ....అత్తగారి జబ్బు కోసం చేసిన అప్పులు  మొగుడికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆస్పత్రి ఖర్చులు  చనిపోయినప్పటి కర్మల ఖర్చులు, అప్పులు అప్పులు .. .అన్నం సహించలేదు. గ్లాసుడు మజ్జిగ తాగినా దాహం ఆరలేదు రేకుల కప్పు ఫ్యాన్  గాలిని మరింత వేడెక్కించింది . అవునూ, భవానికేమిటి అంత బాధ? భవాని  మాటలు చెవిలో గింగురుమంటున్నాయి .పదో క్లాసు  చదివి మిషన్ నేర్చుకుని హుస్సేన్ దగ్గర పనిచేసే ఈ పిల్ల ఎన్ని మాటలు మాట్లాడింది?  తనెందుకు వేలు లొ సూది దిగనిచ్చింది ? ఇది ఒకరి బాధ కాదు ఉమ్మడి బాధ... పురుషోత్తం భార్య ఊరికెళ్ళింది...ఆ సంగతి పక్కింటి ఆవిడకి కూడా తెలుసు జ్యోతికి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి దగ్గర కూచుని చదివించాలి? ఈ డబ్బుల కష్టాలకీ పురుషోత్తం వాళ్ళావిడ ఊరెళ్ళిందని  చెప్పడానికీ లంకె ఉందా? గుండె మీద చెయ్యి వేసుకు చెప్పవే వరలక్ష్మీ !! కొట్టుకి బయలు దేరబోతూ మొహం కడుక్కుని  పౌడర్ డబ్బా అరచేతిలో వేసి రెండు సార్లు గట్టిగా కొట్టుకుని దాన్ని అపురూపంగా మొహానికి రాసుకుంటూ అద్దంలో చూసుకున్న  వరలక్ష్మికి  తన మొహం ఎర్రబడిన భవాని మొహంలా కనిపించింది.  నిలదీస్తున్నదానిలా  అనిపించింది. .,  పురుషోత్తం నన్ను చంపెస్తాడా? చీ ! అతనలాంటి వాడు కాదు.పురుషోత్తాన్ని  తను అప్పు అడిగిందా? ఎప్పుడూ లేదే! తన అప్పుల బాధలేవో తనే పడుతోంది కదా? మరెప్పుడూ పురుషోత్తం తనకి సాయం చెయ్యనే లేదా ? సాయం చేసిన హక్కుగా చెప్పాడా ఆవిడ మూడురోజుల దాకారాదని ! తప్పంతా తనదేనా?పోనీ పురుషోత్తం దేనా?
“రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా  ..” గడియారం చూస్తూ  కూనిరాగం తీశాడు.. హుసేనన్న
“ఆవిడెప్పుడూ మహాలక్ష్మే ..” అని దీర్ఘం తీసింది గంగ
భవాని  తలవంచుకుని కుట్టుకుంటోంద.ఆ పిల్ల మొహం వాడిపోయి వుంది. రోజూ పేపర్లో ఇలాంటి వార్తలు  వస్తూనే వుంటాయి అనుమానంతో భార్యల్ని చంపే వాళ్ళు, ఆత్మహత్యలు భార్య తొ అక్రమ సంబంధం వున్నదనుకుని  అనుమానం తో  అవతల వాణ్ని చంపే భర్తలు! “ప్రియుడితో కుమ్మక్కై భర్తని చంపించిన ఆడది” ఏమి వార్తలు ఏమి శీర్షికలు !  చంపుడు! చంపుడు అలవాటైపోయింది కదా మనకి ఎవరో ఒకావిడ వచ్చింది కూతురు నాలుగు రోజుల్లో అమెరికా పోతుందట రెండు రోజుల్లో బ్లవుజులు కుట్టియ్యాలట..అనసూయ లేచి ఆర్డరు తీసుకుంటోంది. భవాని ఎందుకో కళ్ళు తుడుచుకుంటోంది. భవాని  బాగా కదిలిపోయింది ఎందుకు? అడిగితె బాగుంటుందా ?అంత చనువు లేదే! ఈ అమెరికా బ్లవుజుల మెరుపుదాడి వచ్చిందంటే ఇక ఇంటికి పోడం తొమ్మిదింటికీ కూడా అవదు. భవాని   ఎం అడిగింది?  ప్రేమా, డబ్బా వ్యభిచారమా ?  
“అ బ్లౌజులు కత్తిరించి ఇంటి కివ్వు అన్నా! రాత్రికి కుట్టుకొస్తాను జాగ్రత్తగానె కుడతా ఈ మధ్య ఇంట్లో మా ఓనర్ ఎల్ ఈ డీ బల్బులు పెట్టించింది. జోతమ్మకి పరీక్షలోస్తున్నాయ్  కాస్త తొందరగా పోయి  దానికి అన్నం పెట్టి చదివించు కోవాలి..అట్టానే నా  కొ అయిదొందలు అడ్వాన్సు కూడా ఇయ్యి ఇంట్లో అన్నీ అయిపోయినాయి.”  అంది వరలక్ష్మి.సమయం అనుకూలంగా వున్నట్లు తోచి
గంగ చేసే పని ఆపి హుసేన్ మొహంలోకి చూస్తూ కూర్చుంది.
రాంబాబు  బ్రతికున్నప్పుడు వేన్నీళ్ళకి చన్నీళ్ళు అంటూ తనూ ఒక మిషన్ కొనుక్కుంది చీరెలకు ఫాల్సూ  పాత బట్టలకి రిపెర్లూ చేస్తూ వుండేది  తనకెవరూ బ్లావుజులు ఇచ్చేవారు కాదు బిగుతైనవి వొదులు చెయ్యడం వదులైనవి సరిచెయ్యడం మాత్రమె చేయించుకునే వారు .అతను పోయాక తను ఇంటి ముందు  జ్యోతీ లేడీస్ టైలర్స్ అని బోర్డ్ తగిలిస్తే కూడా  అవే ఫాల్సూ అవే రిపెర్లూ!! ఎవరూ బ్లవుజులివ్వలేదు చుడీలూ ఇవ్వలేదు .అందుకే ఖాళీ వున్నప్పుడు ఇంటిదగ్గర కుట్టుకుంటూ జీతానికి హుస్సేన్ దగ్గర చేరింది. తను ఇక్కడ మానేసినా హుసేన్ కొచ్చే కష్టమర్లు అతని పేరు బట్టి వస్తారు కానీ తన దగ్గరకు రారు.
“బ్లవుజు కటింగ్ మగవాళ్ళు చేసినంత బాగా ఆడవాళ్ళు చెయ్యరు  ఎక్కడైనా చూడు కట్ చేసేది మగవాళ్ళు “అని ఆడవాళ్లే ప్రచారం చేస్తారు. అందుకే తను హుసేన్ దగ్గర చేరింది.. తను తీరుగా కుడుతుం దని, పనిమీద శ్రద్ధ పెడుతుందనీ అతనికి తెలుసు  మంచి కష్టమర్ల బట్టలన్నీ తనకే ఇస్తాడు. అందులో తన మీద అభిమానం ఏమీ లెదు అతని స్వార్థమే తప్ప. పన్నెంళ్ళుగా అక్కడ పనిచేస్తోంది వరలక్ష్మి “నేను కూడా ఇవ్వాళ అక్క ఇంట్లో వుంటాను ఇద్దరం కలిసి కుడతాం” అంది భవాని వెంటనే వరలక్ష్మికి అర్థం అయింది ఆ పిల్ల మనసులో కష్టం తనకి చెప్పాలనుకుంటోంది. పురుషోత్తం భార్య  పెళ్లి కెళ్ళింది.జ్యోతికి పరీక్షలు .అది కనీసం పదొ క్లాసు గట్టెక్కితే  బాగుండు.. రాంబాబు అనేవాడు”జ్యోతమ్మ మనలాగా కాదె పెద్ద ఉద్యోగం చేస్తది” అని ,కానీ ఎం చేసాడు?వెళ్ళిపోయాడు .అతను బాధ్యతలు లేని  మనిషి కాదు. అందరి బాధ్యతలూ నెత్తిన వేసుకునే మనిషి.. అమ్మ బాధ్యత .చెల్లి బాధ్యత,
“నేను మీ ఇంటికి రావొచ్చా అక్కా?”అడుగుతోంది భవాని
“అయ్యో ! అదెంత  భాగ్యం ? రా భవానీ “ అంది వరలక్ష్మి ..
“పిల్లలూ మొగుడూ జంజాటం లేకపోతె సరదాగా నేనూ వద్దును” అంది గంగ.
ఇంటి ముందు ఖాళీ జాగా వుంది కానీ నాలుగు కుటుంబాలు .ఒకరు తమ గుమ్మంలో పడక కుర్చీ వేసుకుంటారు ఇంకొకరు ప్లాస్టిక్ నవ్వారు మంచం వేస్తారు.ఇంకొకరు మడతమంచం వేస్తారు.ఒకరు సిగరెట్ తాగుతారు ఇంకొకరు పెళ్ళాంతో ఘర్షణ పడుతూ వుంటారు మరొకరు స్నేహితుడితో గ్లాసు నేస్తం కడుతూ వుంటారు. వరలక్ష్మి ఎప్పుడూ గుమ్మం లొ కూచోదు రేకుల గదిలోనే మగ్గుతూ వుంటుంది.వంట గది మరీ చిన్నది ..రెండో గది కాస్త పెద్దది.. అక్కడే జోతమ్మ చదువుకోవాలి అక్కడే తను అమెరికా జాకెట్లు కుట్టాలి.అక్కడే భవాని  చెప్పబోయే దేమిటో వినాలి. అదంతా జోతమ్మ కూడా వినాలి .పురుషోత్తం భార్య ఇంట్లో వుండనప్పటి సంగతి  జ్యోతికి తెలీదనే అనుకుంటుంది వరలక్ష్మి.
మిషన్ రొదలోనే చదువుకుని నిద్రపోయింది జ్యోతి
:అలసి పోయింది పాపం “అనుకుంది తల్లి..
వరలక్ష్మి కుట్టి పడేసిన అస్తిపంజరాలకి హేమ్మింగు లూ హుక్సూ లేసులూ పైపింగ్ వగైరా అలంకారాలు దిద్డుతున్న భవాని సూది పక్కన పెట్టి “అదికాదక్కా “అని మొదలుపెట్టింది చెప్పింది.కన్నీటి చెరువే అయింది నిష్టూరాలాడిం ది ..తిట్టింది. తర్కిం చిం ది...
ముసల్దానికి ఇప్పుడు యాభై ఏళ్ళు “అంది  తల్లి గురించి
వరలక్ష్మికి నోట మాట రాలేదు .ఆ పిల్ల దగ్గరున్నంత తర్కం తన దగ్గర లెదు అంత కోపమూ లెదు అంత దుఃఖమూ లెదు.
“ మీ నాన్న పోయినప్పుడు మీ బంధువులెవరూ మీకు సాయం చెయ్యలేదా?”  ఇంకేమి ఆడగాలి ఆ పిల్లని ?
“అంతా అంతంత మాత్రం వాళ్ళే ఎవరు మాత్రం ఎన్నాళ్ళు చేస్తారు?”
“మరేం చెయ్య మన్నావు మీ అమ్మని? మీకు ఇంత విషం ఇచ్చి తను కూడా చచ్చి పోమ్మన్నావా?”
“అయితే  ..”
“అయితే ఎం చెయ్యాల్సిందో చెప్పు.. చదువు లెదు వచ్చిన ఇంటి పనీ పొలం పనీ చేసింది కదా? ఒళ్ళు దాచుకోకుండా ..ఇంకే మవుతుంది  ఆవిడ వల్ల? “
“ఒళ్ళు దాచుకోలేదు అమ్ముకుంది” మళ్ళీ గండి తెగింది
రాంబాబు పోయినప్పుడు తను పుట్టెడు అప్పుల్లో మునిగి వుంది అన్న స్థితీ అంతంత మాత్రమె తమ్ముడు అప్పుడే పెళ్లి చేసుకున్నాడు అక్క రమ్మంది కానీ బావ గారి పద్ధతి తనకి నచ్చలేదు మిషన్ కుట్టుకుని బ్రతక లేనా అనుకుంది ..బతకోచ్చేమో కానీ అప్పులు తీర్చలేదుకదా? వున్న ఒక్క గొలుసూ అమ్మేసింది.. పక్కింటామె  ఆదుకోలేదు మూడో  ఇంటామే ఆదుకోలేదు .పురుషోత్తం భార్యా ఆదుకోలేదు .ఆమె అనుకోకుండా ఇట్లాగే ఎదో పెళ్ళికో పేరంటానికో వెళ్ళినప్పుడు అతనే తనని ఆదుకున్నాడు.హుస్సేన్ కొట్టులో ఉద్యోగం ఇప్పించాడు. అప్పులు వాయిదాల మీద కట్టేలాగా మాట్లాడి పెట్టాడు ..చాలా సాయాలు చేసాడు కానీ ఇట్లా పొద్దున్నే మాయావిడ ఊరికి పోయిందని    తన మొహంలోకి చూసి నవ్వడం బాగా అనిపించలేదు సాయాలకి తను కృతజ్ఞత చూపించలేదా అంటే చూపించింది. పురుషోత్తం తనని ఎప్పుడూ బలవంతం చెయ్యలేదు.. దగ్గరగా వచ్చాడు.తను రానిచ్చింది. హక్కు గా రాలేదు మరి ఇవ్వాళ అట్లా ఎందుకు ప్రవర్తించాడు? తను అతనికి లోకువైపోయిందా?
భవాని  ఏడుస్తూనే వుంది  ఆమె తల్లి మీద సానుభూతి చూపిస్తే ఇంకా ఏడుస్తుంది.. అరుస్తుంది.
“నన్ను పెళ్లి చేసుకుంటాం అని ఇద్దరు ముగ్గురు అడిగారక్కా ఒక సంబంధం అమ్మ గురించే తప్పిపోయింది. పోనీ నా అంతట నేనే ఎవర్నైనా చేసుకు పోదామంటే మా చెల్లి మాటేమిటి? దానికి చదువూ ఎక్కదు  పనీ రాదు .ఎట్లా బాగుచెయ్యాలి దాన్ని? అమ్మతో ఎప్పుడూ తగాదే దానికి.”
“ఎప్పుడో మా అమ్మని వాడు చంపెస్తాడేమో అని భయం అక్కా.అందుకే నేను ఈ వూర్నుంచీ  వెళ్ళిపోదామని అమ్మతో మొత్తుకుంటున్నాను”
వరలక్ష్మికి అ పిల్లకి ఎం చెప్పాలో తెలీలేదు “ చాలా టైం అయింది పడుకుందాం పద .. ముందు నువ్వు పదో క్లాసు పూర్తీ చెయ్యి .తరువాత ఏదైనా చేద్దుగాని”అంది
“దాంతో ఉద్యోగాలోస్తయ్యా  అక్కా  ఇప్పటికి మూడు సార్లు రాసి వదిలేసా.. నా వల్ల కాదు ఇట్లాగే ఎదో పని చేసుకు బతకాలి అంతే..
“ఆ మనిషి మా అమ్మనేం బెదిరించడు.కానీ ఎందుకో నాకు అతన్ని చూస్తె చిరాకు భయం ..నేను పెళ్లి చేసుకు పొతే తమ్ముడినీ చెల్లినీ ఎట్లా బతికించు కుంటుంది  ? తమ్ముడి ఐటిఐ అయిపొతే ఎక్కడైనా మెకానిక్ పని దొరుకుతుంది చెల్లి సంగతో? దాని షోకులు చూసే భయమేస్తుం ద క్కా  ..”
పెద్ద కుండ నెత్తిన పెట్టుకొచ్చి  భళ్ళున పగలేసిం ది .
ఎం చెప్పాలి తను ఈ  పిల్లకి? చెప్పడం సరే తనేం చెయ్యాలి? వరలక్ష్మికి ఊపిరాడలేదు వెళ్లి భవానిని పట్టుకుని భుజం మీద చెయ్యేసి”   ,మీ అందరికీ గుప్పెడు విషమిచ్చి తనూకాస్త పుచ్చుకోకుండా ఇన్ని తిప్పలు పడి ఇన్ని మాటలు పడి ఆ మనిషి ఎట్లా బ్రతుకు తోందో ఒకసారి ఆలోచించు. ..నడిచీ నడిచీ కాళ్ళుబొబ్బలెక్కు తుంటే ఒక్క నిమిషం కనపడ్డ చెట్టు నీడన నిలబడి ఆ పైన ప్రయాణం సాగించ కూడదా? “అని చెప్పాలనిపించింది .కానీ అదంతా చెప్పడం చేతకాలేదు. పురుషోత్తం పొద్దుటి నవ్వు కడుపులో కేలుకుతోంది భరోసాతో కూడిన నవ్వా? హక్కుతో కూడిన నవ్వా? పదేళ్ళ సంబంధంతో ఒచ్చిన అలుసుతో కూడిన నవ్వా?  కానీ అతనే లేకపోతె ఏమై  వుండేది తను? ఎక్కడ తేలేది?  వరలక్ష్మి తల తిరిగిపోయింది.. ఎదో ఒకటి చెయ్యాల్సిన సమయం వచ్చింది అని మాత్రం అర్థమైంది జ్యోతిని  కాపాడుకోవాలి ..అది మరొక భవాని కాకూడదు. మరి భవానిని ఎట్లా ఓదార్చాలి అయిన వాళ్ళెవరూ ఓదార్చని మనుషులను ఓదార్చడానికి ఎవరో ఒకరు సిద్ధం గానే వుంటారు కానీ ఆ ఓదార్పుకు ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించాల్సిందే కదా? అలా ఒద్దులే భవానీ ఎదో ఒకటి చెప్పి పంపిస్తాను నిన్ను ... అనుకుంది వరలక్ష్మి
                                                                         పి సత్యవతి
 విశాలాంధ్ర కథల ప్రత్యెక సంచిక లొ ప్రచురితం  మార్చి 2017