Sunday, December 07, 2014

                   వస్తువుకు ప్రాముఖ్యం,ప్రాతినిధ్యం
కథలు ఎట్లా వుండాలి? ఎట్లా వుండకూడదు? అని విస్తృతంగా చర్చ జరుగుతున్న సందర్భం ఇది.శిల్పం గురించి ,వస్తువు గురించీ ,భాష గురించి.ఎత్తుగడ గురించీ, ముగింపుల గురించీ ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నదిప్పుడు.ఈ చర్చలలో నిగ్గు తేలిన విషయాలను దృష్టిలో వుంచుకుంటూ:
ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథంతో ,జీవితం పట్లా జీవుల పట్లా ప్రేమతో వ్రాసిన కథలూ,అవి చదివాక పాఠకులలో ఏ చిన్న చలనమైనా  కలిగించే కథలు, చాలాకాలం గుర్తుండే కథలని మనం అనుకుంటే ,ప్రస్తుతం నెల నెలా వారం వారం మన ముందుకొస్తున్న అసంఖ్యాకమైన కథల్లో ఎన్నిటిని మనం చాలాకాలం గుర్తు పెట్టుకోగలం? భిన్న దృక్పథాలూ కథా సాహిత్యం పై భిన్నాభిప్రాయాలూ కల పాఠకులందరికీ నచ్చే కథలు ఎన్నింటిని గుర్తుపట్టగలం? ఇది బహుశా ఇటువంటి సంకలననాల సంపాదకులను కష్టపెట్టే సమస్య. ఈ వడపోత కష్టమే అయినా ఇష్టంతో వాళ్ళు ఆపనిని పాఠకులకొసం చేసిపెడుతున్నారు
“I want my stories to be something about life that causes people to say, not, oh, isn’t that the truth, but to feel some kind of reward from the writing, and that doesn’t mean that it has to be a happy ending or anything, but just that everything the story tells moves the reader in such a way that you feel you are a different person when you finish.”అంటుంది ఆలీస్ మన్రో.
 ఈ సంకలనం లో కథలన్నీ అట్లా పాఠకులని అమాంతం మార్చివేసే అద్భుతమైన కథలు  అని చెప్పడం అతిశయోక్తి కావచ్చు గానీ,  ఇవన్నీ ఆలోచింపచేసే కథలు. సమాజంలో వచ్చిన మార్పులనీ, ఎంతకీ రాని మార్పులనీ పట్టించుకున్న కథలు.  సాంకితిక ప్రగతి ఎంత సాధించినా మారని  బ్రతుకుల వేదనని చిత్రించిన కథలు. ముఖ్యంగా వస్తు ప్రధానమైన కథలు. శిల్ప చాతుర్యం ,పఠనీయత ,భాషా సౌందర్యం వున్నా వస్తువులో సమకాలీనత ,ప్రగతిశీలత లేకపోతే అవి ఎవరినీ విధంగానూ కదిలించవు.కనీసం జీవితాన్ని ఉన్నది ఉన్నట్లయినా కళ్ళముందుంచిఇదీ పరిస్థితి.దీన్ని గురించి ఏం చెబుతావు?”అన్న ప్రశ్న అయినా రేకెత్తించాలి.
అట్లా వలి అనే అతను తన మార్పులేని దయనీయమైన జీవితాన్నిపాఠకుల ముందు పెడతాడు. “బిడ్డ పురిటీకొచ్చిందిఅని హనీఫ్ వ్రాసిన కథలో .ఇంత విషాదాన్ని మోస్తూ బ్రతికే వేలాది వలీల సంగతి ఎంతమందికి తెలుసు?  అతను చేస్తున్న పనేమిటో తెలుసు?  కడుపులో మెలిపెట్టే చిన్న కథ ఇది.
అస్తిత్వ ఉద్యమాలు ఎంత ఉధృతమైనా  ,కులపరంగా వేళ్ళుపాతుకు పోయిన వివక్షను నిర్మూలించడం అరవై ఏళ్ళు దాటిన స్వతంత్ర భారత దేశానికి చేతకాలేదు.మార్పు కోసం ప్రయత్నం కన్న యధాస్థితి కోసం ప్రయత్నం బలంగా వుండడమే కారణం కావచ్చు.యధాస్థితికి పెరుగుతున్న మద్దతు కావచ్చు. ఒక ఆర్థిక స్థాయికి ఎదిగి ,విద్యా ఉద్యోగాలు సాధించిన వారికి కూడా వివక్ష ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే వుంది.అది స్పష్టంగా బయటికి కనపడక పోయినా,  ముసుగులు వేసుకుని వుంటూనే వుంది, “మీరెట్ల వెజ్జులు” కథలో జూపాక సుభద్ర ఈ వివక్షను ఎదురు ప్రశ్నిస్తుంది. దొరతనంపోయినా పల్లెల్లో ఇంకా పెత్తందారీ తనమూ ,కుల వివక్షా పాదుకునే వున్నాయి. పెత్తందారీ తనం భుజానేసుకుని ఇంకొకరి ఇంట పెళ్ళిలో తన హుకుం చలాయించిన మీసాలోడి(పసునూరి రవీందర్) కథ ఇటువంటిదే .అతని పెత్తనానికి అందరూ లోబడడానికి అవసరమైన పరిస్థితులను కూడా మీసాలోడు సృష్టించుకున్నాడు. దీఫిక వ్రాసిన దమయంతి కథ కూడా ఈ కోవలోనిదే .పెద్ద వాళ్ళ ఆధిక్య భావాలూ కుల వివక్షా పసి మనసులమీద ఎట్లా పనిచేస్తాయో .తమకది సమ్మతం కాక పోయినా పెద్ద వాళ్ల మీద భయబక్తులతో ఎట్లా ప్రవర్తిస్తారో ఒక చిన్న పిల్ల గొంతుతో ఈ కథ చెబుతుంది రచయిత్రి దీపిక. వేంపల్లి షరీఫ్అమ్మ బొమ్మకథ బొట్టు లేని అమ్మ బొమ్మ మీ అమ్మఎట్లవుతుందిఅని ముస్లిమ్ పిల్ల వానిని హిందువుల పిల్ల ప్రశ్నిస్తుంది.
  ఈ సంకలనంలో ఇద్దరు కవులు వ్రాసిన కథలున్నాయి  అఫ్సర్ వ్రాసిన “సాహిల్ వస్తాడా?” కథ  ఈ దేశంలో ముస్లిమ్ గా పుట్టడం అంటే  ఏమిటో ఆలోచించమనే కథ.సామాన్య ప్రజలు హిందువులూ కారు ముస్లిమ్ లూ కారు.వాళ్ళు కేవలం స్నేహితులు .కానీ పోలీస్ దృష్టిలో ,రాజ్యం దృష్టిలో ముస్లిములే.వాళ్లతో స్నేహం చేసిన వాళ్ళు కూడా అనుమానితులే, కనిపించకుండా పోయిన సాహిల్ వస్తాడా? లేక ఏదో క కేసులో ఇరికించబడతాడా?ప్రేమాస్పదుడూ భావుకుడూ శ్నేహశీలీ అయిన సాహిల్ వస్తాడా? .సాహిల్ వంటి ముస్లిమ్ యువకులందరి సమస్య ఇది. కవి విమల వ్రాసిన ప్రేమ కావ్యంలాంటి కథ మార్తా ప్రేమ కథ.  నిర్వచించలేని ప్రేమ మార్తా,చంద్రలది.ఉద్యమం కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్ర .అతనికోసమే జీవించి వున్న మార్తా. ప్రేమలూ పెళ్ళీళ్ళూ “వర్క్ అవుట్ “అవుతాయా కావా ,అవి మన వృత్తి ఉద్యోగాలకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అని ఆలోచించి ప్రేమలో పడడ మొదలుపెడుతున్న యువతీ యువకులున్న కాలంలో జైలులో వున్న సహచరుడుకోసం కనీసం అతని ఫోటో కూడా దాచుకోలేని అశక్తత లో  అట్లా నిరంతరంగా నిరీక్షిస్తున్న మార్తా, .చావుదెబ్బలు తిని కూడా ఆమెనికి బయట పెట్టకుండా కాపాడిన చంద్ర! ఉద్యమ పట్ల వాళ్ళకున్న నిబద్ధత ,యావజ్జివ శిక్ష పడి జైలు లోవున్న అతని కొసం నిరీక్షిస్తూ ఆమె, ఎప్పటికైనా ఉద్యమాన్ని గురించిన తన కల సాకారమౌతుందనే ఆశ తో  ఊచల మధ్య నుంచీ కనిపించే ఒక ముక్క ఆకాశాన్ని చూస్తూ అతను! ప్రేమంటే ఏమిటి? ప్రేమంటే ఇది.
ఖదీర్ బాబు “బియాండ్ కాఫీ “  ఒక పర్వర్టెడ్ మొగుడి చేతిలో వేధింఫులకి గురౌతూ అతని పట్ల  అసహ్యాన్నీ ద్వేషాన్నీ భరిస్తూన్న అశక్తురాలైన ధనిక స్త్రీ కథ..  చదువూ తెలివీ డబ్బూ వుండీ వేధింపబడుతున్న స్తీ కథ. అతని మీద ఎలాగైన కక్షతీర్చుకోవాలనుకుని ఒక రచయిత సలహా అడుగుతుంది మానసికస్థితి బాగా లేదనే  ముద్ర వేసి ఆమెను అటు విడిచి పెట్టకుండా, ఇటు బ్రతకనియ్యకుండా చావు వైపుకు నడిపిస్తున్నభర్త.ఆమె తన బాధలు ఒక పత్రికా రచయితతో చెప్పుకోవడంగా కథ నడుస్తుంది .కథని దృశ్యమానం చేసిన పద్ధతి ఇది.ఖదీర్ బాబు కొత్త శైలి.
యువరచయిత  అల్లం వంశీ వ్రాసిన “మొలకలు” కష్ట జీవులైన యిద్దరు దంపతుల జీవన వృత్తం .కొబ్బరి మొక్కలు కొనడంతో మొదలై మళ్ళీ అవి కొనడంతోనే ముగిసిన యదార్థ జీవిత కథ. ఎంత భయంకరమైన జంతువునైనా ఏదో ఒక యుక్తితో మట్టుపెట్టవచ్చు కానీ సమాజానికీ ,సామాన్య జనానికీ యెలుగు బంట్లలా తయారైన వ్యక్తుల్ని ఏం చెయ్యగలం ? చింతక్రింది శ్రిణివాసరావు గారి”పాదాలక్రింది ప్రశ్నలు” కథ లో  ఎదురయే ప్రశ్న.ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి .మనిషికి ముఖ్యం ప్రేమ. కర్తవ్య నిర్వహణే కానీ మత విశ్వాసాలు ప్రధానం కాదు. వారి వారి విశ్వాసాలను  గౌరవించాలనేది తాతినేని వనజ కథ “సంస్కారం”..ఈ సంపుటిలో మరొక పేర్కొన తగ్గ కథ ఊణుదుర్తి సుధాకర్ “వార్తాహరులు” కుంఫిణీ దొరలకాలంలో కొత్త గా టెలిగ్రాఫ్ తీగెలు వేసి, వార్తా ప్రసారాన్ని వేగవంతం చేస్తున్నప్పుడు   జరిగిన కథ . నేపథ్యాన్ని కళ్లకి కట్టించిన కథ. అమెరికాలో పసిబిడ్దకు మెదడు కాన్సర్ రావడం దాని చికిత్స ,తల్లి తండృల మనస్థితి, అక్కడి వైద్య విధానం కళ్లముందుకు తెచ్చిన కథ శవ పేటిక .కంటనీరు తెప్పించే కథ .
మనుషులు నీడలుగా మారి నీల్తోనే  కాపురాలు చేస్తున్న రోజుల్లో దెయ్యంతో కాపురం మాత్రం ఏం తక్కువ ? అంటారు సునీల్ కుమార్ హాస్యమూ వ్యంగ్యమూ కలగలిపి నవ్విస్తూనే చెవి మెలిపెట్టి.”దెయ్యం”కథలో .అనవరమైన అల్ప విషయాలపై బుర్ర బద్దలు కొట్టుకునే విద్యార్థి జిజ్ఞాసువూ ,తన అపారమైన అతితెలివి పాండిత్యంతో అర్థం లేని పదానికి విపరీతార్థం కల్పించి చెప్పిన పండితమ్మన్యుడూ ,చివరికి పదం లో కొన్ని అక్షరాలు కోల్పోయి అట్లా తయారైందని తెలుసుకుంటారు. అండక్టో అనే హాస్య కథలో .
సాఫ్ట్ వేర్ ఉద్యోగాల ఉధృతిలో ,పెరిగిన అమెరికా వలసలతో అమెరికా వెళ్ళే విమానాల్లో భారతీయ తల్లితండ్రుల సంఖ్య బాగా పెరిగిపోయిన నేపథ్యంలో  కొందరు తల్లుల యాష్ట ని చెప్పిన  సుజాత కథ.అమ్మా నాన్నా అమెరికా.. విషయాన్ని గురించి  కొంత కాలం క్రిందట ఆరి సీతారామయ్య గారు కూడా ఒక కథ వ్రాసారు. పూర్వం ఆడపిల్లలు పురిటికి పుట్టింటికి వచ్చేవాళ్ళు.ప్పుడు పుట్టిల్లే అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది.పుట్టిన పిల్ల అమెరికన్ సిటిజన్ కావాలి కదా మరి? కథలో రచయిత్రి ఒక పరిష్కారాన్ని కూడా సూచించారు. తల్లి తండ్రుల మీద భారాన్ని పెంచుతున్న వాళ్ళంతా చదవవలసిన కథ.వర్తమాన మధ్యతరగతి కథ. మొత్తానికి  ఈ సారి ప్రాతినిధ్య కథా సంకలనం వస్తు ప్రధానంగా కొన్ని ఎంపిక చేసిన కథలను పాఠకులకు సమర్పించింది.అంటే వీటిలో మంచి శిల్పమూ భాషా లేవని కాదు. వస్తువుకు తగ్గ శిల్పమూ భాషా పఠనీయతా సంతరించుకునే వున్నాయి.  సమాజంలోని అన్ని వర్గాలను తడిమిన కథలివి. ఈ కథలు చదివి కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు.కొన్ని సమాధానాలూ వెతుక్కోవచ్చు.
                                                   పి.సత్యవతి

 ( ప్రాతినిథ్య 2013)