సీపురు పి.సత్యవతి
మా అన్న పేపర్లేసేకాడ ఇచ్చిన జీతం కూడ బెట్టి సెల్లు కొన్న కాడ్నించీ
రోజూ అయిదింటికే అలారం మోగుద్ది .సచ్చినట్టు .అప్పుడే అందరం లెగిసిపోతున్నాం! పొగమంచుపట్టేసి ఏడైనా
ఎనిమిదైనా ఎలుగే రాడంలేదిప్పుడు. అంతపొద్దున్నే లెగిస్తే గాని పన్లుగావట్లేదని అందర్నీ లేపేస్తుంది మా
యమ్మ. మా నాన అటో తోలుకుని టేషన్కాడికెళ్ళాల .తెల్లారెతలికల్లా బోలెడు రైళ్ళొస్తయ్ గందా!!.అమ్మ పంపుకాడ
నీళ్ళు పట్టాలి . నేను పాలుత్యావాలి .టీ పెట్టాలి. ఒకటేమిటి ,శానా పన్లుంటయ్. ఇయ్యాళైతే నేనసలు
లెగదల్చుకోలేదు. పాలు త్యాదల్చుకోలేదు .పనికి పోదలుచుకోలేదు .అబ్బో దానికి శానా
కథుంది. అందుకే బాగా ముసుగేసుకుని ముడుచుకుని పడుకున్నా.. అన్న పేపర్లెయ్యడానికి
పోయినాడు.. వాడొచ్చేతలికి అన్నం కూరా వండాలి.డబ్బా పెట్టుకుని కాలేజీకి పోతాడు.
మహాతల్లి ఏం జేసుకుంటుందో చేసుకోనియ్!
ముసుగులో దూరి చెవికాడ గుయ్యిమంటున్నయ్ సన్నాసి దోమలు. పడుకోబుద్ధి కాకుండా....కానీ
పడుకోవాలి తప్పదు. అంతలోకే దుప్పటిమీదినించీ నడ్డిమీద ఒకటేసి, మొహంమీద ముసుగులాగి
.”పో! పో !పాల్తాపో” అని గసిరింది.మా యమ్మ..
“నా సీపిరి డబ్బులు నాకిచ్చెయ్ ! లాపోతే ఇయ్యాళ నేను పనికి పోను ఎండొచ్చినాకే
లెగుస్తా”అని మొండికేశాను
“ నీ ఎదవ సీపిరీ నువ్వూ ! ఇవ్వనా ఏంటి? రేపిస్తాలే! ఇయ్యాళ కూడా కొట్లో కొత్త
సీపుర్లు రాలేదని చెప్పు. “అని పాలకోసం ఇరవై రూపాయల కాగితం నామీదకి విసిరేసింది.
“నేను ఇంక అబద్ధాలు సెప్పను.” అని మళ్ళీ మొహం
మీదకి ముసుగు లాక్కున్నాను.
“ఏందే గొడవ ! సొర్ణమ్మా! లెగమ్మా .”అంటూ వచ్చాడు నాన
ఇక తప్పదని .లేచి బయటిగుమ్మంకాడున్ననాన
సెప్పలు తగిలంచుకుని సందు సివరికిపోయి ,పాలపాకెట్టు
తెచ్చి టీ పెట్టాను ఇయ్యాళ పనికి పోకపోతే
శానా గొడవవుతుందని తెలుసు. ఆడపిల్లల ఆస్టల్లో వుండి మూడేళ్ళకాణ్ణించీ ఇంజినీర్
చదువుతున్న ఆళ్ళమ్మాయీ, ముసలాళ్ళ ఆస్టల్లో వుంటున్న ఆళ్లత్తా వస్తారంట. అంతా కలిసి
కట్టకట్టుకుని పొద్దున్నే ఏడకో పోతారంట .సార్ అఫీస్ కెళ్ళేదాకా నేనుండాలంట...ఏందేందో
సెప్పింది మేడంగారు. ఇయ్యాళకూడా సీపురు తీసుకుపోకపోతే ఆంగారు అసలు ఊర్కోదు. నాలుగు
రోజులాయె వందరూపాయలిచ్చి.సర్లే కానియ్ మరి! ఏదో ఒకటి సెప్పి తప్పించుకుందాం! పాపం
అవసరానికి ఇబ్బంది పెట్టకూడదు గందా! అనుకుని
ఒణుక్కుంటూ స్తానం కానిచ్చి జడేసుకుందామని అద్దం ముందు నుంచుంటే గడ్డం మీద అప్పుడప్పుడే మొలుస్తోంది ఎదవ మొటిమ!
నిన్న సాయంతరంలేదు. తెల్లారేటప్పటికి మొలుచుకొస్తోంది. చిదుపుతేనో అని ఆలోచించాను.
అసలుకి నెయ్యీ నూనా కేకులూ మిఠాయిలూ తింటే మొటాలొస్తయ్యని కూతుర్ని అట్టాంటియి
తినొద్దని మేడం గారు చెబుతుంటుంది .మరి మనం నెయ్యే కొనం గందా? మిఠాయిలా నా తలకాయా?
ఏవైనా కానీ ఈ నెల మొటాలకి రాసే క్రీము కొనాల్సిందే! అయ్యో! దేముడా! మా అమ్మ వుందే!
ఆంగారికి ఎక్కడెక్కడి డబ్బులూ సాలవు .ఒకనాడు స్టోర్ బియ్యానికి డబ్బుల్తక్కువైనైయ్యంటది.
ఒకనాడు గ్యాసు కి ఏడొందలు పెరిగిందంటది.
ఇదిగో ఇట్టాగే నాలుగురోజుల నాడు
మేడంగారు,
“ఏంటా చిమ్ముడూ?ఎక్కడి కసువు అక్కడే!
కాస్త వొంగి సుబ్బరంగా చిమ్ము” అని కేకలేసింది
“ఈ ఎదవ పొట్టి సీపురుతో ఎట్టా సిమ్మాలి? నా వల్లగాదు కొత్త సీపురు
కొనమని నెలకాణ్ణించీ సెప్తున్నా” అని ఆవిడ భాషలో”ఎదురు సమాధానం” సెప్పేను
అప్పుడావిడ విసురుగా పోయి ఓ యాభై కాగితం పట్టుకొచ్చి” రేపొద్దున
పనికొచ్చేటప్పుడు చీపురు కొనుక్కురా”అంది
“అయ్యో! మేడం ఇప్పుడు కుంచె సీపురు డేభ్భై
,ఎనబై తక్కువకి రాదు ,,” అంటే విసుక్కుంటూ ఇంకో యాభై కాయితం ఇచ్చింది. ఇచ్చి” ఇన్ని
డబ్బులుపోసి పిచ్చి చీపిరి తేకు. బాగా పొడుగుండి మంచి కుంచె వుండి ఆరు నెలలైనా
వచ్చే గట్టి చీపురు ఏరి తీసుకురా” అని పది సార్లు చెప్పింది
. అప్పటికి చీకటి పడిందిగందా,రేపొద్దున కొనుక్కుపోదాంలే అనుకుని ఇంటికి
వచ్చానా,.అప్పుడే అమ్మ సంచితీసుకుని బజారుకి బయల్దేరింది .
“స్టోర్ లో సరుకులిచ్చేందుకు ఇయ్యాళ
ఆకర్రోజంట. నాదగ్గర వంద తక్కువైనై .సరోజక్క నడిగి తేపో ! మీ నానొచ్చిన్నాక ఇద్దాం “అన్నది
అప్పుడు సరోజక్క ఇంటికి పోయే ఓపిక లేక “ నా దగ్గరుండై తీస్కో ! నానొచ్చినాక
ఇయ్యి” అని గభిక్కిన ఇచ్చాను .అదీ నేంజేసిన తప్పు నాన ఆ వందా అప్పుడే
ఇచ్చాడు.ఈంగారే దాన్ని దేనికో వాడేసింది. అప్పటాల్నుంచీ “చీపురేదీ?” అని మేడంగారూ “”కొట్లో మంచి సీపుళ్ళు
లేవమ్మా రేపో ఎల్లుండో వస్తంయ్యంట”అని నేనూ !
“ఎంత సేపు నించుంటావే అద్దం కాడ! ఈ మద్దెన
నీకు సోకులెక్కువైనై” అంటోంది అప్పుడే! ఎప్పుడూ కళ్ళు నామీదే మా యమ్మకి
“ నా సీపిరి డబ్బులిచ్చై .పనికి పోతా” అన్నాను ఠక్కుమని
ఇంక మొదలేసింది సొద. ముక్కు సీదింది .అరిసి గోలెట్టింది ఒయ్ నాయనోయ్.!ఆపు
తల్లీ! ఇంటికన్న పనికాడే నయం.
ఈ ఎదవ మొటిమఒకటి! ఎప్పుడూ సెయ్యి దానిమీదకే
పోతది ! గిల్లిపారేద్దామా అనిపిస్తది ! బయటికి బాగానె పొడుచుకొచ్చింది.
ఆదిలచ్చమ్మత్తయ్య కొడుకు పనికి పోయేటప్పుడు ఒచ్చేటప్పుడూ మిర్రి మిర్రి సూస్తావుంటాడు.ఆడ్ని
పెళ్ళి చేసుకుంటే ఎట్టా వుంటుందబ్బా? పని సెయ్యనియ్యకుండా ఇంటో కూచోబెడతాడేమో! ఆ అదిలచ్చమ్మ
మా యమ్మకి తగిందే!! ! ఎప్పుడూ కీచుగొంతుతో అరుస్తానే వుంటది. ఒద్దులే నాయనోయ్! మాయమ్మే
నయం. మానాన కూడా శాన మంచోడు. ఆళ్ళనాన
మంచోడు కాదు. తాగేసి ఊ అరుస్తా వుంటాడు,
“ఎందే! అద్దం ముందునించీ కదలవూ?” మళ్ళీ పెద్ద కేక
“ మాలావు అరిచ్చంద్రుడు బయల్దేరింది
అబద్ధాలు సెప్పదంట.” అని గొణుగుతోంది.
పొగమంచు వదిలి ఎండ బయటికొస్తావుంది. అన్ని ఈధుల్లో ముగ్గులే ముగ్గులు.ముగ్గుల్లో
రంగులు. నేనూ నిన్న సాయంతరమే ఆళ్ల వాకిట్లో ఇరవై సుక్కల పెద్ద ముగ్గేసొచ్చా.
ముగ్గేస్తున్నప్పుటకే బాగా సీకటిపడింది. వంగి ముగ్గేస్తుంటే సార్ ఆఫీస్ నించీ
ఎప్పుడొచ్చాడో ఎనకాతలే నించుని వున్నాడు. నేను ఉలిక్కి పడ్డాను.
“అబ్బో స్వర్ణా! నువ్వు పెద్ద
ఆర్టిస్టువి.ఈ నెలరోజులూ ఇంతబాగా వాకిలి అలంకరించినందుకు నీకు పండక్కి పెద్ద
బహుమతి ఇవ్వాలి” అని భుజం మీద కొట్టి పోయాడు. ఏందో ఈ పని? అని కాస్త
ఆశ్చర్యమేసింది.
అనుకున్నట్టె ఆళ్ళిల్లంతా మా సందడిగా వుంది. ముసలమ్మా మనవరాలూ వచ్చారు. అంతా
అమరావతో అన్నారమో ఏడికో పోతారంట. వాకిట్లో
పెద్ద కారొకటుంది. మేడమ్గారు సీపురు మాటెత్తకుండావుంటే బాగుండున్రాదేవుడా
అనుకుంటు లోపలికొచ్చాను. లోపలికొచ్చానంటే ఇక” అది చెయ్ ఇది
చెయ్ .ఇట్రా ,అటుపో. ఇది తియ్ .అది కడుగు “అంటూ పన్ల మీద పన్లు .అట్టా కాసేపయినాక
కారు కదిలింది.ఇంక సారు ఆఫీసుకెళ్ళిపోతే నేనింటికి పోవచ్చు. అమ్మయ్య! సీపురు గండం
గడిచింది ఇయ్యాళ్టికి!
“ ఇదుగో స్వర్ణా కాస్త కాఫీ కలిపిస్తావా?”అన్నాడు సారు
“ఇపుడేం కాఫీ సార్ ! “ అంటే “,కాదులే కలుపు”అన్నాడు
కాఫీ కలపటానికి స్టౌ దగ్గరికి పోయాను. సార్ నావెనకాలే!
“నాకు కాఫీ దగ్గరుండి కలిపించుకోటం
అలవాటు..ముందు కప్పులో నీళ్ళు కొలిచి పెట్టు స్టొవ్ మీద”
నా వెనకాలనించీ కదలడు.!అప్పుడే గడ్డం చేసుకుని చెంపలకి ఏదో పూసుకుని వచ్చాడు. ఏదో వాసన !మంచి వాసనే అనుకో! అయినా
బాగా అనిపించలేదు.
“మీరెళ్ళండి సార్ ! నేను కలిపి తెస్తాగా!
నాకు తెలుసు” చిరాకుపడుతూ అన్నాను.
కొంచెం వెనక్కి జరిగాడు. అప్పుడాయన సెల్ మోగింది. అమ్మయ్య! సెల్లాయన ఎంత
మంచోడో! అనుకుంటూ కాఫీ కలిపాను,
సెల్ తీసుకుని లోపలికొచ్చాడు. సెల్ నా వైపు తిప్పాడు. నామొహం మీద ఒక మెరుపు
మెరిసింది
“ఇవ్వాళ చాలా బావున్నావు
నువ్వు .ఈ పోటో నీకు ఇస్తాను పెళ్లి చూపులకి వాడుకో “అన్నాడు
చెమటపోస్తోంది. సార్ ఇవ్వాళ కొత్తగా
వున్నాడు. మళ్ళీ ఆయన సెల్ మోగింది.
“ ఇంక నేను ఇంటికి పోతా సార్! మీరు ఆఫిస్
కి పోండి “ అన్నాను చున్నీతో మొహానికి పడుతున్న చెమట తుడుచుకుంటూ
“ మీ మేడం ఇవ్వాళ ఇల్లేమీ సద్దకుండా పోయింది.కాస్త
ముందు గదిలో పేపర్లవ్వీ సరిగ్గా పెట్టు” అంటూనే
ఫ్రిజ్ తీశాడు అందులోనుంచీ ఆ మధ్య అమెరికా చుట్టాలెవరో తెచ్చిచ్చిన చాక్లెట్ ఒకటి తీసి”తిను బాగుంటుంది” అన్నాడు
“ఒద్దు సార్! చాక్లెట్లు
తినను...అలవాట్లేదు” అన్నాను
“ఏం ?లావవుతానని భయమా? ఫర్లేదు ఒకటి తింటే
ఏంకాదు” అన్నాడు
తీసుకోలేదు.స్టౌ దగ్గర పెట్టాడు. కాఫీ ఇచ్చాను.
“సరే ! నేను స్నానం చేసొస్తాను .నువ్వు
పనిచేసుకుంటూ వుండు” అని బాత్ రూమ్లోకి
పోయాడు.
పేపర్లు బొత్తి పెట్టాను .అక్కడక్కడా దుమ్ముంటే దులిపేసాను.
స్నానం చేసొచ్చాడు రోజూ ఈపాటికి ఆఫీసుకు పోతాడు..ఇయ్యాళ ఆలీసం చేస్తున్నాడు,
“ గూడ్ ! చక్కగా సద్దేశావు.. మంచిపిల్లవి!
ఈ డబ్బుల్తీసుకో ! ఏవైనా కొనుక్కో! అని వంద రూపాయల కాయితం పర్సులోనుంచి తీసి చేతిలో పట్టుకున్నాడు,
“వద్దుసార్!”
“ఫర్లేదుతీసుకో..చాలాపని చేస్తావు పాపం”అన్నాడు
“ఫర్లేదుతీసుకో..చాలాపని చేస్తావు పాపం”అన్నాడు
ఈ ఎదవ మొటిమ అప్పుడే దురద పుట్టింది చూపుడేలితో గోక్కున్నాను
“ఏవైనా కొనుక్కో!
ఫెయిర్నెస్ క్రీమో. మొటిమల మందో.”అన్నాడు కాయితాన్ని నా కళ్ళముందు ఆడిస్తూ
“సరే సార్! “అని కాగితం
లాగేసుకుని తలుపు తీసుకుని బయటికి పరుగో
పరుగు. .చాలా పొడుగ్గా వుండి మంచి కుంచె
వున్న గట్టి సీపురుతో ఎప్పటకైనా పనిబడుద్దిగందా! మన సేతికి డబ్బొచ్చినపుడే కొనుక్కొచ్చిపెడితే పోలా!!!!...
(చినుకు మాస పత్రిక 2014 ) *****************************************************************************************