అనువాద కథ
మూలం : మరియా లూయిసా బొంబోల్
చెట్టు
కాన్సర్ట్ హాలులో బ్రిగిడా!
పియానో విద్వాంసుడు అలవాటుగా ఒక సారి చిన్నగా దగ్గి ,వాద్యకచేరీ ప్రారంభించడానికి సంసిద్ధం కాగానే
హాలులో గుత్తులు గుత్తులుగా వెలుగుతూ కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగు
తగ్గి ఒక మందమైన కాంతి ప్రసరించింది. ఆ వెంటనే సంగీతం మెల్లగా మొదలై ఊపందుకున్నది.
బహుశా అతను ఎత్తుకున్నది
మొజార్ట్ స్వరకల్పన కావచ్చు అనుకుంది బ్రిగిడా.
అలవాటుగానే ఆమె కార్యక్రమం వివరాలు అడగడం మర్చిపోయింది ఆమెకి సంగీతం గురించి ఎక్కువగా
తెలియదు.అందుకు కారణం సంగీతం పట్ల అభిరుచీ ఆసక్తీ లేకపోవడం కాదు.చిన్నప్పుడు తన
అక్కలకు బలవంతంగా పియానో నేర్పించవలసి వచ్చింది.కానీ తను అడిగి మరీ క్లాసులో
చేరింది. అయినా ఏం నేర్చుకోగలిగింది? అక్కలకి బాగానే వచ్చింది.. తనుమాత్రం “సీ” మెట్టు దాటి పైకి పోలేకపోయింది
.. అంతకన్నా తనకి రావడం లేదన్నది... చదువూ సంగీతం అన్నీ వదిలేసింది.నాన్నకి చాలా
కోపం వచ్చింది.
“ ఆరుగురు ఆడపిల్లల భారాన్ని భార్య లేకుండా ఒంటరిగా ఎట్లా
మొయ్యాలి నేను?”అని అసలే వాపోతున్నాడాయన. భార్య బ్రతికి వుంటే మాత్రం
ఇలాంటి మందబుద్ధి కూతురితో ఎట్లా నిభాయించుకొచ్చేది? “నిజంగానే ఈ పిల్ల కి శరీరం
పెరిగినట్లు బుద్ధి వికసించడంలేదు. ఇది మందబుద్ధి పిల్ల! దీని బుద్ధిపెరుగుదల
ఆగిపోయింది” అనే నిర్ణయానికొచ్చాడాయన. ఆరుగుర్లోకీ చిన్నది బ్రిగిడా.
పిల్లలందరివీ భిన్న స్వభావాలు. పెద్దవాళ్ళైదుగురితో సతమతమై అలసిపోతున్న తండ్రి బ్రిగిడాని
పెద్దగా పట్టించుకోలేదు. “ఇంక నావల్ల కాదు .దీనికి చెప్పడం దండగ .అలా వదిలెయ్యడమే
మంచిది.చదువుకోవద్దనుకంటే మానెయ్యమను. దెయ్యాలకథలు వింటూ వంటింట్లో కూచోవాలనుకుంటే
అలాగే కానియ్! పదాహారేళ్లొచ్చినా బొమ్మల్తో ఆడుకుంటూ వుండాలనుకుంటే అలాగే వుండమను” అని వదిలేశాడాయన. బ్రిగిడా పాఠశాల చదువుకూడా లేకుండా బొమ్మలతో ఆడుకుంటూ
వుండిపోయింది
అజ్ఞానం ఎంత
ఆనందదాయకం! అసలీ మొజార్ట్ ఎవరో ఆయన గొప్పతనమేమిటో
,సంగీత కళకి ఆయన సేవ ఎంతో ఏమిటో తనకేం తెలుసు?
ఆ మొజార్ట్ ఇప్పుడు కాన్సర్ట్ హాలులోనుంచీ ఆమెను చెయ్యిపట్టుకుని ,గులాబీ రంగు ఇసుకపై
స్పటిక స్వచ్చంగా పారే నీటి పై కట్టిన వంతెన మీదకు తీసుకుపోతున్నాడు. ఆమె
తెల్లని పల్చని దుస్తులు వేసుకుని ఒక
భుజంపై సాలీడుగూడు లాంటి లేసులు
కుట్టిన చిన్న గొడుగు తెరచిపట్టుకున్నది.
.కొందరు అంటారు” నవ్వు రోజు రోజుకూ అందంగా
తయారవతున్నావు బ్రిగిడా! మొన్న నీ (మాజీ) భర్తని చూశాం.అతని జుట్టు ఇప్పుడు ముగ్గుబుట్టలా
తయారైందనకో” అని !తనేమీ జవాబు చెప్పదు వంతెన మీదనుంచీ మొజార్ట్ ఆమెను
యౌవ్వన సీమలలోకి నడిపించాడు.
పద్దెనిమిదేళ్ళ
ప్రాయం! ఛాతీమీదుగా కెరటాలలా జారిన ఎరుపు కలసిన బంగారు వన్నె శిరోజాలు,
స్వర్ణకాంతులీనే దేహం . ఎదుటివారిని ప్రశ్నిస్తున్నట్టుండే విశాల నేత్రాలు.తియ్యగా
నవ్వే చిన్నపెదవులు ! హుందాతనం మూర్తీభవించిన పలుచని శరీరం! “అందమైనదే కానీ ఒట్టి తెలివితక్కువపిల్ల!బ్రిగిడా!”అందిలోకం. తనను ’తెలివితక్కువది” అంటే ఆమేం పట్టించుకోలేదు.విందు
వినోదాలకు వెళ్లినప్పుడు ఒట్టి మందమతిలా ప్రవర్తించినా సిగ్గుపడలేదు. అమె
అక్కలందరికీ వరసగా పెళ్ళిళ్ళు కుదిరాయి తననే ఎవరూ కోరుకోలేదు.
మోజార్ట్ ఇప్పుడు
బ్రిగిడాను పాలరాతిమెట్లమీదుగా తీసుకువెళ్ళి
ఒక ఇనపగేటు తెరిపించి, ఆమె తండ్రి స్నేహితుడు లూయీ వొళ్ళో పడేశాడు. అందరూ
ఆమెను పట్టించుకోకుండా వదిలేసినప్పుడల్లా చిన్నతనంలో ఆమె లూయీ దగ్గరకు
పరిగెత్తేది. అతను ఆమెని ఎత్తుకునే వాడు .ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి కిలకిల
లాడేది.ఆ నవ్వులు పక్షుల కిచకిచల్లా వుండేవి. అట్లా మెడ చుట్టు చేతులువేసి అతని
కళ్ళమీదా నుదుటిమీదా అప్పటికే నెరిసిన అతని జుత్తుమీదా ముద్దుల వర్షం
కురిపించేది.!
“పిచ్చుకలతో చేసిన కంఠహారానివి నువ్వు”అనేవాడు లూయీ.
అందుకే అతన్ని
పెళ్ళిచేసుకుంది బ్రిగిడా..గంబీరంగావుండే ఆ మిత భాషి సమక్షంలో తన తెలివితక్కువ
తనాన్నీ సోమరితనాన్ని తలుచుకుంటూ అపరాధభావంతో వుండక్కర్లేదనుకున్నది. కానీ ఇప్పుడు
ఇన్నేళ్ళ తరువాత తనకి అర్థమైంది.తను లూయీని ప్రేమించి పెళ్ళిచేసుకోలేదని.
వున్నట్లుండి ఒకనాడు అతన్ని ఎందుకు విడిచిపెట్టేసిందో ఇప్పటికీ చెప్పలేకపోతొంది
తను.
అప్పుడు మొజార్ట్
ఆమెను బలవంతంగా వంతెన మీదనుంచీ పరిగెత్తించి ఆమె అందమైన లేసుగొడుగునూ తెల్లని
పలచని దుస్తులకు బదులుగా నల్లని దుస్తులు
వేయించి గతం తలుపులు మూసేసి సంగీత కచేరీకి తీసుకొచ్చాడు అందరితో పాటు యంత్రంలా
ఆమెకూడా తప్పట్లు కొట్టి అభినందన ప్రకటించింది. దీపాలన్నీ మళ్ళీ కాంతివంతం
అయ్యాయి.
మళ్ళీ నిశ్సబ్దం.
ఇప్పుడు బిథోవెన్ వేసవిసాయంత్రపు
వెన్నెలలో తన స్వరకల్పనలు వినిపిస్తున్నాడు. సముద్రం ఎంతో వెనక్కుపోయింది. బ్రిగిడా బీచ్ వైపుగా నడుస్తున్నది.ఉన్నట్లుండి
సముద్రపుటలలు ఎగిసిపడి ఆమెను ముంచడానికి ప్రయత్నించాయి. మళ్ళీ అవే కెరటాలు ఆమెను
సున్నితంగా వెనక్కు నెట్టి లూయీ ఛాతీమీద వదిలి
వెళ్ళిపోయాయి.ఆమె అక్కడే స్థిరపడిపోయింది
అతని గుండె చాలా
నెమ్మదిగా కొట్టుకునేది. ఎప్పుడో తప్ప ఆ శబ్దం ఆమె చెవులకు వినపడేది కాదు.” నీకసలు గుండే లేదు లూయీ!” అనేది బ్రిగిడా “నువ్వు నా పక్కనుప్పడు ఎప్పుడూ నాతో లేనేలేవు నన్నెందుకు
పెళ్ళిచేసుకున్నావు” అనేది.అతను పడుకునేటప్పుడు ప్రతిరోజూ సాయంత్రపు
వార్తాపత్రిక చదువుకునేవాడు.
“ నవ్వు భీత హరణేక్షణలా
వుంటావని”అని ఆమెను ముద్దుపెట్టుకునేవాడు లూయీ...ఒక్క మాటుగా సంతోషం
ఉబికి వచ్చినట్టు అతని వెండి వెంట్రులకల
తలని తన భుజాలమీద పెట్టుకునేది. “ నీ చిన్నప్పుడు నీ వెంట్రుకలు నిజంగా ఏరంగులో వుండేవో
ఎప్పుడూ చెప్పలేదు నాకు!! .నీ తల పదిహేనేళ్ళకే నెరిసిపోతే మీ అమ్మ ఏమనేది?నవ్వేదా?
ఏడ్చేదా? నీ తలని చూసి నువ్వు గర్వపడేవాడేవాడివా?
మరి స్కూల్లో నీ తోటిపిల్లలు ఏమనేవారు నిన్ను? చెప్పు లూయీ ,చెప్పు.! చెప్పవా?”
అనేది
“బాగా అలిసిపోయాను బ్రిగిడా! రేపు చెప్తాను. లైట్లు తీసెయ్
నాకు నిద్రొస్తోంది “ అతను అప్రయత్నంగా అటు తిరిగి పడుకునేవాడు.ఆమెకూడా
అప్రయత్నంగానే అతని భుజంకోసం, అదిచ్చే రక్షణ కోసం వెతుక్కునేది. దాహార్తి అయిన
పూలతీగె తేమ కోసం వెతుక్కున్నట్లు..
ఉదయానే పని మనిషి
వచ్చి కిటికీ తెరలు తొలిగించేటప్పటికే అతను పక్క మీద వుండేవాడు కాదు. ఆమెకు మెలకువ
వస్తే తనమెడకెక్కడ పిచ్చుకల హారం వేస్తుందోననే భయంతో ఆమెను లేపకుండానే వెళ్ళిపోయే
వాడు ఒక్క అయిదు నిమిషాలు ఆఫీసుకి ఆలస్యమైతే
ఏం మునిగిపోతుందో!
ఎంత విచారంతో
నిద్రలేచేది తను? కానీ చిత్రంగా తన స్వంతగదిలోకి వెళ్లగానే ఆ విచారం అంతా మంత్రం వేసినట్లు మాయమై పోయేది.
అలలు విరిగి
పడుతున్నాయి దూరంగా ఆ అలల సవ్వడి . అది బిథోవెన్
సంగీతం కాదు
తన గది కిటికీ బయట
వుండే రబ్బరు చెట్టు చేసే సవ్వడి అది. తన
గదిలోకి రాగానే ఒక్క సారిగా ఒక కులాసా భావన కమ్ముకునేది..పడకగది ఎప్పుడూ వేడిగా
వుండేది.కళ్ళు భరించలేనంత వెలుగు కూడా అక్కడ!! .కానీ తన గది లో మాత్రం కళ్లకి
చల్లగా విశ్రాంతిగా అనిపించేది. రంగువెలిసిన బరువైన నూలు తెరలు!!, గాలికి
కదులుతున్న చెట్టుకొమ్మల నీడలు గాజు కిటికీ గోడలమీద ప్రతిఫలిస్తూ నీటి అలల్లా
భ్రమింపచేసేవి కిటికీ తీసినప్పుడు,.గదిలో
అద్దాలన్నింటిలోకి తొంగిచూసే ఆ మహా వృక్షం అక్కడొక హరిత వనాన్ని సృష్టించేది. ఆ
గది ఎంత ఉల్లాసాన్నిచ్చేది! ప్రపంచమంతా ఒక
అక్వేరియంలో మునిగి వున్నట్టు అనిపించేది. ఆ రబ్బరు చెట్టుమీద ఎన్ని కల కూజితాలు!
ఎన్నెన్ని పక్షులకు ఆశ్రయం ఆ చెట్టు ! నగరంలోనుంచీ నది వరకూ సాగిన ఆ వీధి అది ఒకటే
అయినప్పటికీ అది చాలా సన్నని వీధి
“నేను చాలా పని ఒత్తిడిలో వున్నాను. నీతో భోజనం చెయ్యడానికి
రాలేను. అవును! క్లబ్బు లోనే వున్నాను.వేరే పనివుంది.నాకోసం చూడకు నువ్వు తినేసెయ్
బ్రిగిడా” ఎప్పుడూ ఇదే మాట లూయీకి.
“నాక్కూడా స్నేహితులుంటే ఎంత బాగుండేది! “ అనుకునేది
బ్రిగిడా .కానీ ఆమె సంభాషణా చతురురాలు కాదు.అవతల వాళ్లకి తన మాటలతో విసుగు కూడా తెప్పించేది. తన
తెలివితక్కువతనం కాస్త తగ్గించుకోగలిగితే ఎంతబాగుండేది! కానీ ఇప్పుడు ఒక్కసారిగా
ఎట్లా సాధ్యం అది! తెలివిగా వుండడం అనేది
చిన్నప్పుడే మొదలవాలికదా?
తన అక్కల భర్తలు
వాళ్లని ఎప్పడూ వినోదయాత్రలకు తీసుకుపోతారు. కానీ లూయీ తననెప్పుడూ
తీసుకుపోడు.బహుశా పద్దెనిమిదేళ్ళ తన భార్య తెలివితక్కువ తనానికి, అజ్ఞానానికి అతను
సిగ్గుపడతాడేమో! చాలా సార్లు అడిగాడుకూడా “కనీసం ఇరవై ఒక్కేళ్లున్నట్లయినా
ప్రవర్తించరాదా?” అని. తన యౌవనం అతనికి ఇబ్బంది కలిగిస్తుందేమో! ఆరహస్యం తామిద్దరిమధ్యే వుండాలేమో! ప్రతిరాత్రీ
అతను అలసిపోయే వస్తాడు.తను చెప్పేదేదీ వినడు. అన్నింటికీ యాంత్రికమైన చిరునవ్వులు
చిందిస్తాడు. ముద్దు మురిపాలయినా అంతే ఎంతో నిర్లక్ష్యంగా,అదొక విధిలాగా ! అసలు
తననెందుకు పెళ్ళిచేసుకున్నట్టో! తన
తండ్రితో స్నేహాన్ని కొనసాగించడానికా?
బహుశా పురుషులకి
జీవితం అంటే కొన్ని స్థిరపడి,కొనసగించవలసిన
అలవాట్లు కావచ్చు. ఆ గొలుసు ని తెంపడం వాళ్లకిష్టం వుండదు.లూయీకి జీవితంలో
ఒక్క నిమిషం కూడా ఖాళీగా వుండడం ఇష్టం వుండదు.. ఈ సంగతి తనకి ముందెందుకు
అర్థంకాలేదు? తండ్రి చెప్పినట్టు నిజంగా తనకి బుద్ధి మాంద్యమే!
“ నాకు మంచు కురుస్తుంటే చూడాలని వుంది లూయీ”
అంది ఒకరోజు
“ఈ వేసవిలో నిన్ను యూరప్ తీసుకుపోతాను. అప్పుడక్కడ చలికాలం..
నువ్వు మంచు చూడొచ్చు” అన్నాడు
“ నాకు తెలుసా సంగతి! అంత తెలివితక్కువదాన్నేంకాదు” అంది బ్రిగిడా.
ఒక్కొక్కసారి
అతనిలో నిజమైన ప్రేమను ఉద్దీపింపచెయ్యాలని
అతన్ని ముద్దులతో ముంచెత్తుతుంది.ఏడుస్తూ “లూయీ !లూయీ “అని పదే పదే పిలుస్తుంది
“ఏమైంది నీకు ?ఏంకావాలి నీకు?” అంటాడు.
“ఏం లేదు నీపేరు స్మరించడం ఇష్టం నాకు”
అంటుంది ఆతను ప్రసన్నుడైనట్టు నవ్వుతాడు
వేసవి రానే
వచ్చింది.పెళ్ళైనాక మొదటి వేసవి. అయితే అతని వ్యాపారాల ఒత్తిడి ఆమెకు ఇచ్చిన మాట నిలుపుకోనివ్వలేదు.
“బీనస్ అయిర్స్ లో వేసవి తీవ్రంగా వుంటుంది నువ్వు
మీనాన్న వేసవి విడిదికి పోరాదా?” అన్నాడు
“నేనొక్క దాన్నేనా?”
“నేను ప్రతి వారాంతంలో వచ్చి చూస్తాగా నిన్ను!”
బ్రిగిడాకి అతన్ని
అవమానించాలనిపించింది. కానీ అతన్ని నొప్పించే మాటలేవీ దొరకలేదు.తనకేమీ తెలీదు
కోపంతెప్పించడం కూడా తెలీదు. అట్లాగే మంచం మీద కూర్చుంది
“ ఏమైంది నీకు?” అన్నాడు కాస్త విచారంగా ,పెళ్లయిన తరువాత మొదటిసారి ఆమెను
కాస్త పట్టించుకున్నట్లు.
“ నాకు నిద్రొస్తోంది”అని దిండులో మొహం దాచుకుంది బ్రిగిడా.
మధ్యాహ్నం అతను
క్లబ్బునుంచీ ఫోన్ చేశాడు అలవాటుగా.ఆమె జవాబివ్వలేదు కోపం ప్రదర్సించడానికి ఆమె
కనిపట్టిన ఆయుధం మౌనం.
ఆరాత్రికూడా అతని తో
మాట్లాడకుండానే అతని ఎదురుగా కూర్చుని భోజనం చేసింది.
“నామీద ఇంకా కోపమేనా?” అన్నాడు లూయీ.
“నాకు నువ్వంటే చాలా ప్రేమ అని నీకు బాగాతెలుసు..కానీ నాకు
చాలా పనులుంటయ్ .ఎప్పడూ నీతో వుండలేను నావయస్సొచ్చాక నువ్వుకూడా ఇట్లాగే పనులకి
బానిసవై పోతావు” అన్నాడు.
ఆతరువాత అతనెన్ని
ప్రశ్న లడిగినా ఆమె మాట్లాదలేదు.మౌనం వీడలేదు.
అప్పుడే ఎన్నడూ జరగని ,ఎప్పుడూ ఊహించని సంఘటన జరిగింది
లూయీ టేబిల్ దగ్గర్నుంచీ లేచి ,చేతిలో వున్న నాప్కిన్ విసిరికొట్టి విసురుగా తలుపు వేసి ఇంట్లోనించీ బయటికి వెళ్ళిపోయాడు.
ఆమెకు కూడా బాగా
కోపంవచ్చింది “ మొట్టమొదటిసారిగా కాస్త చొరవతీసుకుని నా అసమ్మతి
ప్రకటిస్తే ఇలా చేస్తాడా? నేనిప్పుడే వెళ్ళిపోతాను .ఇంకెప్పుడూ ఈ ఇంట్లో అడుగుపెట్టను” అని గొణుక్కుంటూ తన గదిలోకిపోయి బీరువాలోని
బట్టలన్నీ తీసి గదిలో మూలలకి
గిరాటుపెట్టింది అదుగో !అప్పుడే ఎవరో
కిటికీ తలుపులు బాదుతున్నట్లు అనిపించింది. వెళ్ళి కిటికీ తలుపు తీసింది. బాగా
వీస్తున్న గాలికి పక్కనున్న రబ్బరు చెట్టు కొమ్మలు కిటికీ తలుపులకు కొట్టుకుంటున్నాయి.
ఆ వేసవి రాత్రి వేడికి తనెలా మాడిపోతుందో చూడమని పిలవడానికి ఆ చెట్టు కిటికీ తలుపు తడుతున్నట్లు
అనిపించింది. అంతలోనే పెద్ద వర్షం
ఆచెట్టును నలువెల్లా తడిపింది. ఎంత అద్భత మైన దృశ్యం! పక్క మీద బంతిలా ఉండచుట్టుకు పడుకుని తెల్లవార్లూ
ఆమె ఆ చెట్టు ఆకులపై వర్షం పడి చిన్న చిన్న జలపాతాలలా క్రిందకు జారే దృశ్యాన్ని
ఊహిస్తూనే వున్నది గాలివానకు ఆ చెట్టు
చేసే శబ్దాలను ఆలకిస్తూనే వున్నది ఇంటికప్పుమీద మంచి ముత్యాల వాన!
బిథోవెన్ తరువాత
షోపెన్
. .కిటికీలు
తెరచిపెట్టిన తన గదిలోకి నది వాసన! గడ్డిపరిమళం. అద్దాలపైన పొగమమంచులాంటి తెర.
తన
జ్ఞాపకాలలోకలిసిపోతున్నాడు షోపెన్. ఆ వర్షానికి కిటికీ తెరలమీద అద్దిన
గులాబిపువ్వులుకూడా తడిసినట్లు కనిపిస్తున్నాయి.వేసవిలో ఇట్లా తరచు వర్షాలొస్తే ఏం
చెయ్యాలి? విచారం నటిస్తూ గదిలో
వుండిపోవాలా? ఒకరోజు లూయీ వచ్చి కూచున్నాడు...చాలాసేపు మౌనం,
“అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదనేది నిజం బ్రిగిడా”అన్నాడు..హఠాత్తుగా ఆమెకి సంతోషం పొంగి
వచ్చింది. “కాదు కాదు .నిన్ను ప్రేమిస్తాను, లూయీ “అని గట్టిగా చెప్పివుండేది. చెప్పడానికి
అతను కాస్త అవకాశం ఇచ్చివుంటే..కానీ వెంటనే “ ఏమైనా మనం ఇప్పుడు విడిపోవడం సౌకర్యంగా
వుండదు బ్రిగిడా! అట్లా చెయ్యాలంటే చాలా ఆలోచించాలి” అన్నాడు సహజ గంభీరంగా.ఆమె సంతోషం ఎంత
త్వరగా ఉప్పొంగి వచ్చిందో అంత త్వరగా అణిగిపోయింది.ఆవేశపడి లాభం ఏమిటి? లూయీ తనని
ఎప్పుడూ ప్రేమిస్తూనే వున్నాడు. అతని కోపానికి కూడా అర్థం వుంది. జీవితం అంతే! ఆమె
కిటికీ దగ్గరకుపోయి చల్లగా వున్న అద్దం మీద నుదురు ఆనించింది.అక్కడ ఆ రబ్బర్
చెట్టు గాలివాననూ, వర్షపు ఉధృతినీ తట్టుకుని ప్రశాంతంగా నిలబడివుంది.తన గదికి
నీడనిచ్చింది.మరుగునిచ్చింది ప్రకృతి అంతా
ఒక సమతూకంలోనే వున్నట్టుంది.జీవితం అంటే అదే! దాన్ని అంగీకరించడంలోనే హుందాతనం
వుంది. మనం తిరిగి తెచ్చుకోలేని దానికోసం
ఆశించకుండా ఉన్నదానిని అంగీకరించడమే మంచిపని!
ఇప్పుడు రెండే విషయాలు ఆమెలో
చొచ్చుకు పోయాయి ’ఎప్పుడూ జరిగేవ”
“,ఎన్నడూ జరగనివి”
ఆ విధంగా గంటలూ
రోజులూ ఏళ్ళూ గడుస్తాయి.
కిటికీ నుంచీ తల
లోపలికి పెట్టి అతను ఎప్పుడో వెళ్ళిపోయినట్టు తెలుసుకుంది బ్రిగిడా
కాన్సర్ట్ లో షోపెన్
స్వరాల్లో స్థిరంగా కురుస్తున్న వర్షపు
ధారలు! స్వరాలలో విషాదం..
వేసవి
వెళ్ళిపోయింది. స్వల్పకాలపు గాలివానలు. వడ గాడ్పులు గడిచిపోయాయి రబ్బరు చెట్టు వేళ్ళు అనంతంగా విస్తరించి పెద్దవై పేవ్ మెంట్ మీద పరిచిన
రాళ్లల్లోనుంచీ ఒకదానినొకటి పెనవేసుకుని
బయటికి చొచ్చుకొస్తున్నాయి కొందరుపిల్లలు అ వేళ్ళ మధ్య నుంచీ దాగుడుమూతలు
ఆడుతున్నారు. .చెట్టు చుట్టూ నవ్వులూ కిలకిలారావాలు !!అపుడు బ్రిగిడా కిటికీ లోనుంచీ పిల్లలకేసి చూసి చప్పట్లు
కొట్టి పిలుస్తుంది. వాళ్లతో ఆడాలని కోరుకునే
ఆమె పెదవులపై మెరిసే పసితనపు హాసాన్ని అర్థం చేసుకోలేని ఆ పిల్లలు భయంతో
పారిపోతారు.
ఒక్కతే చాలా సేపు
కిటికీ తలుపుకు ఆనుకుని నిలబడి ఊగే కొమ్మల్ని చూస్తూవుంటుంది. ఆ వీధి మీదనుంచీ నదివైపుగా
చల్లని గాలి వీస్తూవుంటుంది. కదిలే నీళ్లల్లోకి చూడ్డంలాగా ,చలిమంటని తదేకంకా చూడ్డంలాగా
వుంటుంది ఆ అనుభవం. ఈ విధంగా కాలక్షేపం చెయ్యవచ్చు ఎవరైనా ! సాయంవేళ ఆమె దీపం
వెలిగిస్తుంది.ఆ దీపం గదిలోని అద్దాలన్నింటిలో ప్రతిఫలించి రాత్రి వచ్చే మిణుగురులను గుర్తు చేస్తుంది.
ప్రతి రాత్రీ ఆమె
తన భర్త పక్కన పడుకుంటుంది.మధ్య మధ్యలో జ్వరం వచ్చినట్టు బాధపడుతూ వుంటుంది. ఆ బాధ
తీవ్రమై ఒక కత్తిపోటులా గుచ్చుకున్నప్పుడు, ఆమె లూయీని మేల్కొలపాలనుకుంటుంది.
కొట్టి లేపాలనో ముద్దుచేసి లేపాలనో అనుకుంటుంది.కానీ ఆమె మునివేళ్ళతో నడిచి
తనగదిలోకి వెళ్ళి కిటికీ తెరుస్తుంది.వెంటనే ఆ గది అర్థంకాని అడుగుల సవ్వడులతో పక్షులు రెక్కలు
అల్లార్చే శబ్దాలతో ప్రాణం పోసుకుంటుంది. నక్షత్రాల కింద రబ్బరు చెట్టు బెరడుమీద
ఆసీనమై ఒక కీచురాయి అరుస్తూ వుంటుంది. క్రమక్రమంగా ఆమె వేదన తగ్గుతుంది. తుంగచాప మీద ఆనించిన కాళ్ళు చల్లబడతాయి.ఆ గదిలో
బాధను భరించడం ఎందుకు తేలిగ్గా వుంటుందో ఆమెకి తెలియదు.
షోపెన్ తన సంగీత
నైపుణ్యాన్ని ప్రదర్శస్తున్నాడు.ఆ స్వరాలలో మరింత విషాదం .
అకురాలే కాలం
వచ్చింది. రాలిపోతున్న ఎండుటాకులు, పేవ్
మెంట్ మీదా వీధిలోనూ ఎగిరి తోటలో నిలుస్తున్నాయి.. రబ్బరు చెట్టు పైకొమ్మలు పచ్చగానే వున్నాయి కిందమాత్రం ఎర్రగా
అయిపోయింది.ఇప్పుడు ఆమె గది ఒక బంగారపు
గన్నెలో దిగబడ్డట్టు వుంది.
బ్రిగిడా దివాన్
మీద పడుకుని రాత్రి భోజనపు వేళకోసం నిరీక్షిస్తూ వుంటుంది.ఇప్పడు మళ్ళీ ఆమె లూయీతో
మాట్లాడతోంది. కోపమూ ఉత్సాహమూ ఏదీ లేకుండా మళ్ళీ అతనిదైపోయింది.ఇప్పుడామెకి
అతనిమీద ప్రేమ లేదు. వేదనాలేదు.ఇప్పుడు ఆమెలో ఒక నిర్లిప్తత నెలకొంది....ఇప్పుడామెనీ
ఏవ్యక్తీ ఏవిషయమూ నొప్పించజాలదు .బహుశా “ఇంకెప్పటికీ మనకి సంతోషం లభించదు” అని నమ్మడంలోనే నిజమైన సంతోషం
వుంటుందేమో! అప్పుడే మనం ఎటువంటి ఆశలూ భయాలూ లేకుండా బ్రతకవచ్చేమో! అప్పుడు
ఎప్పుడూ నిలిచివుండే చిన్న చిన్న సౌఖ్యాలతో సంత్రుప్తిపడవచ్చెమో!
అప్పుడు ఉరుము
ఉరిమినట్లు ఒక భయంకరమైన చప్పుడు.ఆవెంటనే మెరుపు మెరిసినట్లు కళ్ళు చెదిరే చేసే
కాంతి.! అది వాద్య కచేరీలో విరామ సూచనా కాదు శ్రోతల అభినందన చప్పట్లూ కావు.అది
చెట్టు కూలిన ధ్వని! తన కిటికీ పక్క రబ్బరు చెట్టు ఒక్కవేటుతో నేలకొరిగిన భయంకర
సన్నివేశం ! ఆ చెట్టుకూల్చే కార్యక్రమం ఆమెకు తెలియకుండా తెల్లవారకముందే
మొదలైంది.ఇప్పుడొక గొడ్డలి వేటుతో అది నేలకూలింది.
“చెట్టు వేళ్ళు పేవ్ మెంట్ ను నాశనం చేస్తున్నాయి అందుకోసం
కాలనీ కమిటీ ఆ నిర్ణయం తీసుకోకతప్పలేదు” విభ్రాంతితో కళ్ళు
మూసుకుంది.బ్రిగిడా. తేరుకుని కళ్ళు తెరిచాక చూసిందేమిటి? కచేరీ ముగిశాక హాలులో
ఉన్నట్లుండి దీపాలు ధగ ధగ వెలిగి శ్రోతలు ఒక్కొక్కరే వళ్ళిపోవడాన్ని కాదు. ఆమె తన
గతం అనే సాలగూట్లో బందీ అయింది. తను బందీ అయిన ఆగదిలో ఒక భయంకరమైన వెలుగు చొరబడింది. ఇంటి పైకప్పు
తొలిగించినప్పుడొచ్చే ఒక ఒక శీతల కాంతి
అది.అది ఆమె శరీరంలోని కణాలన్నింటిలో చొరబడి చల్లగా కాల్చేస్తోంది. ఆ శీతల కాంతి
ఆమె చూసే ప్రతివస్తువుమీదా ప్రసరించింది .ముడతలు పడిన లూయీ మొహం,! అతని
చేతులమీద దారాల్లా అల్లుకుపోయి కనపడే
రక్తం తగ్గిన సిరలు! వెలిసిపోయిన కిటికీ తెరలు!
భయంతో ఆమె కిటికీ
దగ్గరకు పరిగెత్తింది. ఇప్పుడు కిటికీకి సూటిగా తమ సన్నని వీధి!!,ఎంత సన్ననిదంటే
ఎదురుగా వుండే ఆకాశహర్మ్యం ,ఆమె గది కిటికీని తాకుతున్నట్లుంది.దాని క్రింది
అంతస్థులో అన్నీ దుకాణాల కిటికీల వరుస! వీధ మూల ఎరుపురంగు వేసిన సర్వీస్ స్టేషన్
ముందు కార్లు బారులు తీరివున్నాయి.వీధి మధ్యలో పిల్లలు ఫూట్బాల్ ఆడుతున్నారు,
ఆ సౌందర్య రాహిత్యమంతా గదిలో అద్దాలలో
ప్రబింబిస్తోంది. బాల్కనీల్లో తీగెలమీద ఆరేసిన బట్టలు పక్షిగూళ్ళు అన్నీ తన
గదిలోకొచ్చేశాయి. వాళ్ళు తన రహస్యాన్ని దోచుకున్నారు.తన ఆత్మీయతను దోచుకున్నారు.
తనిప్పుడు నడివీధిలో నగ్నంగా నిలబడింది. పక్క పంచుకున్న తన మొహంచూడని, ,తనకి సంతానం
ప్రసాదించని తన ముసలి భర్త ముందు నగ్నంగా నిలబడింది.తనకి అప్పటివరకూ పిల్లలు
కావాలని ఎందుకు అనపించలేదో ఆమకి అర్థం కాలేదు పిల్లలులేకుండా బ్రతకడమనే రాజీకి
ఎందుకొచ్చిందో తెలయలేదు.ఒక సంవత్సరమంతా లూయీ
ఎప్పుడూ ప్రదర్శించే బూటకపు నవ్వుని ఎట్లా సహించిందో అర్థం కాలేదు.
ఒక్కొక్క సందర్బంలో నవ్వడం అవసరమని తెలుసుకుని దాన్ని అభ్యాసం చేసి ప్రదర్శించే
మనిషి బూటకపు నవ్వుఅది!.అంతా బూటకమే!
తన నిర్లిప్తతా,తన
ప్రశాంతతా కూడా బూటకమే!తనకు ప్రేమ
కావాలి.విహారాలు కావాలి. అవును ప్రేమ కావాలి.
“ఎందుకు బ్రిగిడా? ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? మరి
ఇంతకాలం ఎందుకు వున్నావు?” లూయీ అడిగాడు.
ఇప్పుడు తెలిసింది
అతనికి చెప్పవాల్సిన సమాధానం !
“ చెట్టు లూయీ! ఆ రబ్బరు చెట్టు కూలిపోయింది”
(చినుకు
ఏప్రిల్ 2013)
********************************************************************