పిచ్చుకంత మనిషి..సూర్యోదయానికి ముందే
నిద్రలేవాలని ఒక నియమం .సూర్యుడు వచ్చాక ఆయన ఎదుట పళ్ళు తోముకూడదని ఒక నమ్మకం ,ఇంకో
నియమం .కాఫీ తాగకముందే “శ్రీ
సూర్యనారాయణా వేదపారాయణా “ పాడుకోవాలి. కాఫీ ఇంగ్లీషు వాళ్లది .అయినా
కోడలు వస్తూనే కాఫీ ఇంట్లోకి తెచ్చింది .ఏంచేస్తాం ,, గ్లాసుడు పాలలో రెండు చుక్కలు డికాక్షన్. నోటిదగ్గర పెట్టుకోకముందే” అబ్బాయి తాగాడా” ,”అమ్మాయి తాగిందా” “వాళ్ళకిచ్చావా వీళ్ళకిచ్చావా.” పరామర్శ.. అప్పుడు అలమరలోనించీ పెరుగుకుండ
తెచ్చి కవ్వం (అదెప్పుడూ గోడకి తగిలించే వుంటుండి తాడుతో సహా) ఆమె
ముందు ఎవరైనా పెడితే ఆ కవ్వంలో మూడో వంతు పొడుగుకూడా లేని ఈవిడ మజ్జిగ చిలుకుతుంది
.చిలికినంత సేపూ ఏదో పాడుతూనే వుంటుంది .అక్షరాలు రావు.అంకెలు రావు.రూపాయినోట్లు
గుర్తు పట్టలేదు.అసలు ఆవిడ జీవితకాలంలో డబ్బు ఇచ్చిపుచ్చుకోడాలతో అవసరమే
రాలేదు.ఆవిడ పేరు అనసూయమ్మ.మా నాయనమ్మ...ఆవిడకి గజేంద్ర మోక్షంలో పద్యాలు
వచ్చు.రుక్మిణీ కల్యాణం వచ్చు .భాగవతంలో ఎన్నో పద్యాలు అలవోకగా చదివేది.ఎట్లా
నేర్చుకుందో తెలీదు . మాకు జ్వరాలొచ్చినప్పుడు దగ్గర కూచుని ఏవేవో శ్లోకాలు
చదివేది. ఖాళీగా కూర్చున్నప్పుడు “సాంబశివా సత్యవచనము సాగనివ్వరు లోకులూ,
లోకులూ పలుకాకులూ “అనే తత్వం ఎప్పుడూ పాడేది ..ఎప్పుడూ ఏదో ఒక
పద్యమో తత్వమో పాడుతూనే వుండేది ఎన్న తత్వాలొచ్చో !!.అంత సాహిత్యం ఆమె బుర్రలోకి
ఎట్లా పోయిందో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది ఇప్పుడు నాకు !! కుదురుగా కూచుని పూజలవీ చెయ్యడం ఎప్పుడూ చూడలేదు
నేను.ఎపుడూ ఎవరు తిన్నారు ఎవరు తినలేదు ,ఎవరికి వంట్లో బాగాలేదు ,ఆవుకు మేత వేశారా
,గేదెలకి కుడితిపెట్టారా, ఇట్లా అడగడమే అవిడ పూజ.
మా మేనత్త అయిదో తరగతి దాకా చదివింది. భారతం
అన్ని పర్వాలూ చదివేసింది.తెలుగు బాగా వచ్చు.భారతంలో ఏపర్వంలో ఏముందో అన్నీ కంఠో
పాఠం. మాకు చాలా కథలు అందులోనించే చెప్పేది. శ్రీనాథుడి చాటువులు “సిరిగలవానికి చెల్లున్” లాంటివన్నీవచ్చు ఆవిడకి. నాకు భర్తృహరి పద్యాలు
అయిదు నేర్పింది.అందులో “ఆరంభింపరు
నీచమానవులు” ఒకటి “గ్రాసము లేక స్రుక్కిన “ “నీరము తప్తలోహమున నిలిచి” కొన్ని.ఇప్పటికింకా అప్పచెప్పగలను ఆవిడ
మా చేత అలా అప్పజెప్పించుకునేది.
నిన్న వెళ్ళి “తల్లీ నిను తలంచి” కొనుక్కొచ్చుకుని అపురూపంగా చూసుకుంటున్నప్పుడు
నాకు మానాయనమ్మ గుర్తొచ్చింది. నాకు ఆవిడ నేర్పిన మొదటి పద్యం “చేతవెన్నముద్ద” రెండో పద్యం “ నీవే తల్లివి తండ్రివి ,,” పద్యం నేర్పడమే కాదు కుండలో వెన్న పడగానే
పిల్లల్ని పిలిచి తలో కాస్త చేతిలో పెట్టి మా అత్తయ్య (మేనత్త)చేతిలో బాగా
చివాట్లు తినేది.”పడ్ద వెన్నపూసంతా పిల్లలకి అట్టా పెడితే నెయ్యెక్కడనించీ తెస్తావూ” అని దీర్ఘం తీసేదావిడ. “మద్దెలో ఇదొక్కతి” అని విసుక్కునేదీవిడ.
మా
తాతయ్య అంటే మా అమ్మ తండ్రి, రోజూ రాత్రి భోజనం అయ్యాక ఆరు బయట మంచంమీద పడుకుని
కాళహస్తీశ్వర శతకం ,తరంగాలు, తత్వాలూ ఒకటేమిటి ఆయననోటికొచ్చినవన్నీ పాడుతూ
వుండేవాడు. మా పెద్దమ్మ కొడుకు బి.వి రంగారావు గారు సత్య హరిశ్చంద్ర నాటకంలో
హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు.ఆయన మా యింటి కొచ్చినప్పుడంతా “మాయా మేయ జగంబె నిత్యమని..”అనే పద్యాన్ని పాడించుకునేవాళ్ళు మా అమ్మా
వాళ్ళు.
ప్రయాగకోదండరామ శాస్త్రిగారు మా స్కూల్లో
కొంతకాలం పని చేశారు. నేను ఎస్ ఎస్ ఎల్సీ చదివేటప్పుడు.మాస్టారు మా క్లాసులోకి
వస్తున్నారంటే ముందు సిగరెట్ వాసనొచ్చేది.అది వారి ఆగమనానికి సంకేతం. ఆయన చక్కగా
ఇస్త్రీ చేసిన తెల్లని ధోవతి షర్టు వేసుకుని వచ్చేవారు. మాకు నరకాసుర వధ
,స్వప్నవాసవ దత్త చెప్పారు. ఆయన చెప్పిన “పరుచూచున్ వరు చూచున్ “ పద్యం ఇప్పటికీ నేను అప్పజెప్పగలను. పద్మావతీ
దేవిని ఉదయనుడు పెళ్ళిచేసుకోబోతూ వుండగా వాసవదత్త ఆవిడకోసం పూలమాల కట్టే దృశ్యం
ఇప్పటికీ నా కళ్ళముందే వుంది. మాకు
మొదటిగా శ్రీ శ్రీ అనే ఒక కవి వున్నాడనీ ఆయన మహాప్రస్థానం వ్రాశారనీ చెప్పి ఆయన్ని
మా స్కూలుకు తీసుకొచ్చి ఆయన ఉపన్యాసం మాచేత వినిపించిందీ ఆయనే ఇంత బాగా పాఠం చెప్పే మాస్టారు సిగరెట్ వాసనతొ
వస్తే మానీలే అనుకునే వాళ్ళం అప్పుడు.. ఇంత సంపద్వంతమైన నా బాల్యాన్ని మళ్ళీ నా
కళ్ళముందుకు తెచ్చింది శివశంకర్ గారి “తల్లీ నిన్ను తలంచి..” వెంటనే మరొక ప్రతి కొని నా పెద్ద చెల్లికి పంపేశాను .చిన్నప్పుడు మేం
ఇద్దరం కలిసి బాగా పుస్తకాలు చదివేవాళ్ళం . మా టీనేజి లో ...ఆరుద్ర త్వమేవాహాన్నీ
శ్రీ శ్రీ మహాప్రస్తానాన్నీ అందులో ఏంవుందీ తెలీకముందు ఆ కవితా ప్రవాహాన్ని
ప్రాసల్ని పదబంధాల్ని పెద్దగా చదివేసి సంతోషపడేవాళ్లం .