Saturday, May 05, 2012

Down the memory lane









ఎండవేడిమీ విద్యుత్తు కష్టాలూ ,ల్యాప్ టాప్ లో బాటరీ బలహీనమయి త్వరత్వరగా లో బాటరీఅంటూ వుండడం అందరికీ వుండే మామూలు కష్టాలే..కానీ అవి మర్చిపోడానికి నాకు కొన్ని అదనపు అదృష్టాలున్నాయి.అందులో ఒకటి.రోజూ లేవగానే భక్తిగా నమస్కరించాలనిపించే పెద్ద పెద్ద శాఖలతోవుండే చాలా పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టుడాబా ఆవిడ ,ఎంత ఎండైనా వీధి అరుగు మీద కూచుంటుంది,వాళ్ళాయన  ఆ ఇల్లు కట్టినప్పుడు నాటిన చిన్ని చిన్ని రెండు మామిడి మొక్కలుట ఆ వృక్షం.!!కొడుకులు దాన్ని కొట్టేస్తామంటే తనుపోయాక తప్ప అలాంటి పని చెయ్యొద్దని చెప్పేసింది.పండగలకి వీధందరికీ తోరణాలు ఉగాది పండగ ఉదయానే వీధందరికీ మామిడిపిందెలు సరపరా ఆవిడ కిష్టం.అదలావుంచి ,ఈ మహావృక్షంలో వుండే  పక్షి మిత్రులు  తెల్లవారు ఝామునే ఆర్గుమెంట్లు మొదలుపెట్టి ఇంక నిద్రపోనివ్వవు.అవి అచ్చమైన ఆర్గుమెంటేటివ్ ఇండియన్స్.అప్పుడు లేచి ఒక కాఫీ తాగేసి మేలుకుంటున్న వీధిని తిలకిస్తూ వుండగా వార్తాపత్రక లొస్తాయి. గ్రిల్ లో గుచ్చిన పత్రికలను తీసుకుంటుండగా ఉదయిస్తూన్న  ఉల్లిపూవుఛాయ భానుడు నాకు శుభోదయం చెబుతాడు .పేపర్లు తెచ్చుకుని మళ్ళీ మహావృక్షానికి ఎదురుగా కూచుంటాను.అప్పుడు ఆ మామిడి చెట్టింటి పక్కింటావిడ డాబా మీద కొచ్చి ఇన్ని గింజలేవో పోస్తుంది. పావురాలు (మాఇంటి చుట్టూ పావురాలే కిటికీ అద్దాల మీద నైరూప్య చిత్రాలన్నీ అవి వేసినవే) చిలకలు గోరింకలు ఎన్నెన్ని వస్తాయో చెప్పలేను(.ఈ రెండూ నా మారుతీ నగర్ నివాసానికి కలిగిన అదృష్టాలు). చిలకలు గింజలు తినవని దేవేంద్రాచారి కథలో చదివా కానీ మా మామిడి చెట్టుమీద చిలకలు మాత్రం వస్తాయి.కావాలంటే నా దగ్గర ఫొటో కూడా వుంది.. సరే మరి ఇవ్వాళ నేను అలవాటుగా వార్తాపత్రికలు తీసుకుంటున్నప్పుడు మా సూర్యంగారు మరికాస్త నవ్వుతూ శుభోదయం చెప్పారు. ఏమా అనుకుంటూ పత్రిక విప్పాను. అర్థం అయింది.
ఆ పేపరు నన్ను నా తొలి ఉద్యోగ జీవితంలోకి తీసుకుపోయి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు నాముందు పరిచింది.
దాసు కృష్ణమూర్తిగారు నన్ను గురించి హిందూ పత్రిక లో వ్రాసారు.ఇవ్వాళ. అందులో ఆయన నేనెలా తెలుసో చెప్పారు.  ఇక్కడ   ఆయన నన్ను నా తొలి ఉద్యోగపు  గొప్ప అనుభవాల్లోకి అలా మల్లెపూల బుట్టలోకి విసిరేసారు.
విజయవాడ అప్పుడు చిన్నది..ఒక సైకిల్ రిక్షా ఎక్కేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చి వెళ్ళచ్చు. కుంపటి మీద కాఫీ పెట్టుకోవచ్చు. వట్టివేళ్ళ తడికలకి నీళ్ళు కొట్టుకుంటూ నామీద నువ్వూ నీమీద నేనూ చల్లుకోవచ్చు.బీసెంటూ రోడ్డుదాకా నడిచి రావచ్చు.రవీంద్రాకూల్ డ్రింక్స్ లో ఫ్రూట్ సలాడ్ తినొచ్చు.నవ్ రంగ్ లో హటారీ ,లాంటి సినిమాల్చూడొచ్చు. లీలామహల్లోనూ చూడొచ్చు. ఐనాక్స్ లే అక్కర్లెదు. తేనె మనసులు సినిమా వచ్చీ రాగానె చూసెయ్యచ్చు. ఇన్ని డబ్బుల్లేవు. ఇంత హడావిడి లేదు. కృష్ణా బరాజ్ దగ్గరికి షికారు పోవచ్చు.ఇన్ని వాహనాల రద్దీ లేదు.అలాంటి రోజుల్లో రెండేళ్ళ నేను ఆంధ్ర ప్రభలో పని చేశాను. అప్పుడక్కడ నేను ఒకే ఒక్క స్త్రీ రత్నాన్ని. అందరికన్న చిన్నదాన్ని. నాకు చదువుకునే రోజుల్నించీ జర్నలిష్టులంటే చాలా ఆరాదన వుంది. నాకప్పుడు ఒక ఉద్యోగం కావాలి. అనుకుంటూ వుండగా ఆంధ్ర ప్రభ వాళ్లకి ట్రెయినీ సబ్ ఎడిటర్లు కావాలన్నారు.ఆడవాళ్ళకి ఇవ్వరన్నారు.ప్రయత్నించు పోయేదేవుందీ అని దీర్ఘాలు తీశారు,అప్పుడు నేను రోజూ ఒక ఆంధ్ర ప్రభ ఒక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కొనుక్కుని ఎక్స్ ప్రెస్ లో వాడిన ఏ ఇంగ్లీష్ పదానికి ప్రభలో ఏ తెలుగు పదం వాడారో చాలా సీరియస్ గా అధ్యయనం" చేసి వాళ్ళు పెట్టిన పరీక్షలో సెకండొచ్చేశాను. నాతోపాటు యండమూరి సత్యనారాయణ గారబ్బాయి రామ చంద్రరావు, కొండూరి వీరరాఘవాచారి గారి అబ్బాయి ఆనంద వర్ధన కూడా ఎంపికయ్యారు.అక్కడ మేమే అందరికన్న చిన్నవాళ్ళం అన్నమాట. అక్కడప్పుడెవరున్నరో తెలుసా? రెంటాల గోపాలకృష్ణ గారు,బెల్లంకొండ రామదాసు గారు,అజంతా గారు. అవసరాల సూర్యారావు గారు( ఆయన నేను చేరిన కొత్తలో చనిపోయారు) అల్లాంటి దిగ్గజాలు,సీతారామ బ్రహ్మంగారు,రావూరు సత్యనారాయణగారు. .నేను స్త్రీ రత్నాన్ని కావున నాకు నైట్ డ్యూటీలు వెయ్యవద్దని నన్ను మొఫిసిల్ సెక్షన్ లో  టెన్ టూ ఫైవ్ లో వేసారు.అదంటే అప్పుడక్కడ చిన్నచూపు.ఎందుకంటే టేలిప్రింటర్లో ఇంగ్లిష్లో వచ్చే వార్తలు మేము తెలుగు చెయ్యక్కర్లేదు.అలా చెయ్యడం గొప్ప అని కొందరు భావించేవారు.నన్ను శిక్షణ కోసం సీతారామ బ్రహ్మం గారిదగ్గర వేశారు. మొదటిరోజు ఆయన నన్ను రెండు పదాలు వ్రాసి చూపించమన్నారు.ఒకటి బాధ,రెండు బీభత్సము.రెండూ సరిగ్గా వ్రాసేశాను. ఆయన పరవాలేదే అన్నారు. ఒక నెల తరువాత ఆయన నిన్ను చూస్తే మా అమ్మాయి గుర్తస్తోంది అని చెప్పి రోజూ మధ్యాహ్నం మూడింటికి నాకు కాఫీ తెప్పించి ఇచ్చేవారు.తరువాత ఆయన మద్రాసు వెళ్ళిపోయారు. రెంటాల గారు రామదాసుగారు మాట్లాడే వారు కానీ అజంతా గారు మాత్రం అసలు మాట్లాడేవారు కాదు. ఇంక ఎంతమంది కవులూ రచయితలూ, ఇతర ప్రముఖులు ఆఫీస్ కి వచ్చేవాళ్ళో! అబ్బో! వీళ్లని చూశాను వాళ్లని చూశాను అని ఇంటి దగ్గర గప్పాలు.అప్పుడు లత చాలా వ్రాస్తూ వుండేది.అప్పుడప్పుడు వచ్చేది. వావిలాల గారు పింగళి పరశురామయ్య గారు ఇట్లా ఎంతమందో వచ్చే వాళ్ళు.  అప్పుడు మా సెక్షన్ పక్కనే ఇండియన్ ఎక్స్ ప్రెస్ వుండేది పి ఎస్ రంగస్వామి గారు ఎడిటర్ గా వుండేవారు మాకేమో నీలంరాజు వెంకటశేషయ్య గారు ఈ.అమ్మాయి సిగరెట్లు తాగటానికి బయటికిపోయి కాలక్షేపం చెయ్యకుండా బుద్ధిగా సీట్లోవుండి ఇచ్చిన కాగితమల్లా తీసుకుంటుందని,మెచ్చుకున్నాడాయన పాపం నన్ను!  .అప్పుడు దాసు కృష్ణమూర్తి గారు ,మాధవరావుగారు అంతా ఎక్స్ ప్రెస్ లో  వుండేవాళ్ళు . రెండు ఆఫీసుల్లో ఒకే ఒక్క స్తీ రత్నాన్ని కావున మహా మర్యాద వుండేది. చాలా ఉషారుండేది అక్షరాలు లెక్కబెట్టుకుంటూ డబల్ కాలమ్ ,సింగిల్ కాలమ్  ఎంత ఫాంట్ ,ట్వెంటీ ఫోరా ,ఎయిటీనా !..రాఘవరావుగారిని ఒకాయన వుండేవారు,ఆయన తెల్లగా మల్లెపువ్వులా వుండేవారు.వేటూరి సుందర రామ మూర్తిగారు అసెంభ్లీ రోజుల్లో అక్కడినించీ తెలుగు రిపోర్ట్ ని ఇంగ్లీష్లో వ్రాసి(transcribe) టేలిప్రింటర్ లో పంపేవారు దాన్ని తెలుగులో రాఘవ గారే వ్రాయాలనే వారు.సుందరరామ్మూర్తిగారి భాష ఆయనకే తెలుసుట!ఆయన భారతిలో కథలు వ్రాసారు.నవలలు కూడా వ్రాసారు .రేండేళ్ళ తరువాత నా ఉద్యోగం శాశ్వతం చేయబోయే వేళకి నేను  ఉయ్యాల ఊపడానికి ఇంటికి వెళ్ళిపోయాను. ఇతి ఫస్ట్ ఇన్నింగ్స్.. ఇంత సోది చెప్పేసి అసలు కృష్ణమూర్తి గార్ని గురించి చెప్పకుండా వుంటానా?
కృష్ణమూర్తిగారు చాలా సీనియర్ జర్నలిష్టు.ఇండియన్ ఎక్స్ ప్రెస్ తరువాత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లిష్ పత్రికల్లో పని చేశారు.ప్రస్తుతం వాళ్లమ్మాయి తామ్రపర్ణితో న్యూజెర్సీలో వుంటున్నారు .లిటరరీ వాయిసెస్ అనే వెబ్ సైట్ నడిపి చాలా తెలుగు కథలు ఇంగ్లిష్ లోకి అనువాదం చేశారు.వాటన్నిటినీ రూపా అండ్ కో  1947  Santhoshabad passenger అనే సంకలనంగా వేసింది.ఇంకా కొన్ని కథలు చేస్తున్నారు.ఎనిమిది దశాబ్దాల జ్ఞాపకశక్తి,సాహిత్యానురక్తి,ఉత్సాహం ఆయన ఆస్తి.