1960 లలోనే పి.యశోదారెడ్ది. పాఠకులను కుచ్చుల సవారికచ్చెరంలో మెత్తలు పరిచి కూచోపెట్టి బిజినపల్లి తీసుకు వెళ్ళి అక్కడి చిత్రాలన్నీ తీరొక్కటిగా అచ్చమైన తెలంగాణా నుడికారంలో చెప్పారు .కథ చెప్పడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య, అంటే అందులో అతిశయోక్తి అసలు లేదు. ఆమె తాను పుట్టి పెరిగిన మహబూబ్ నగర్ జిల్లా మాడలికంలో కథ మొదలు పెడితే ఉపమానాలు, సామెతలు. చమత్కారాలు, అన్నీకలుపుకుని పరిగెత్తే ఓ ప్రవాహమే అది. అచ్చమైన తెలంగాణా నుడికారంలో “మా ఊరిముచ్చట్లు”ఎచ్చమ్మ కథలు” వ్రాసిన ఎచ్చమ్మ( యశోదని అంటా యశా అని పిలిచేవారట.చిన్నప్పుడు తనపేరేమిటంటే ఎచ్చమ్మ అని చెప్పేదట యశోద ,ఆఎచ్చమ్మే ఈ కథల్లో ఎచ్చమ్మ) తరువాత “పత్రికల” భాషలో “ధర్మశాల” కథా సంపుటి ప్రచురించారు. యశోదారెడ్డి మంచి వక్త .బహుశా ఆ ధారే రచనలో కూడా కనిపిస్తుంది.
ఉస్మానియా యూనివర్సిటీ నించి తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్న యశోదారెడ్ది , హిందీ ఉర్దూ కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు. కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా ,కేంద్ర సాహిత్య అకాడమీ మహావక్తగా ,అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా ,పదవులు సత్కారాలూ పొందారు.మహబూబ్ నగర్ జిల్లా బిజినాపల్లి ఆమె స్వగ్రామం.రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్యలో అడుగు పెట్టిన యశోద లోని వాక్పటిమ , అప్పుడప్పుడే బొంబాయి జె.జె ఆర్ట్స్ స్కూల్ నించీ వచ్చిన ప్రసిద్ద చిత్రకారుడు పి.టి .రెడ్డి మనసు చూరగొన్నది. వివాహానంతరం కూడా ఆమె చదువు సాగించారు.ఎవరి ప్రవృత్తులలో వాళ్లు విజయాలు అందుకున్న మంచి స్నేహితులు .ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు,సుశీలా నారాయణ రెడ్డి అవార్డు,నాళం కృష్ణారావు అవార్డు,సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్నారు,.మూడు కథా సంపుటులే కాక,”ఉగాదికి ఉయ్యాల” :భావిక” కవితా సంపుటులు,”కథలూ నవలలూ-ఒక పరిశీలన” “కథా చరిత్ర” “భారతంలో స్త్రీ” “ ఆంధ్ర సాహిత్య వికాసం” “హరివంశము ఉత్తర భాగము” పారిజాతాపహరణం” “ తెలుగులో హరివంశములు” అనే వ్యాస సంపుటులు వెలువరించారు.1951 నించే కథలు వ్రాసారని ఆమె పై పరిశోధన చేసిన సుజాత చెప్పారు. ఏ సంపుటి లోనూ ఏ కథ కిందా అది వ్రాసి ప్రచురించిన తేదీ లేదు,
మావూరి ముచ్చట్లు లో పది కథలు,ఎచ్చమ్మ కథలు లో ఇరవై,ధర్మశాలలో ఇరవై నాలుగు కథలు వున్నాయి .ఎచ్చమ్మ కథలూ మాఊరి ముచ్చట్లు, తెలంగాణా గ్రామీణ నేపధ్యంలో మాండలిక గుబాళింపుతో వుండగా ధర్మశాలలోని కొన్ని కథలు తను వార్తాపత్రికలో చదివిన సంఘటనలపై స్పందించి వ్రాసానని ఆమె వ్రాసుకున్నారు. మొత్తం యాభై కథల్లోనించీ కొన్నింటిని విశ్లేషించుకుని ఆమె శైలినీ శిల్పాన్ని,తాత్విక దృక్పథాన్ని తెలుసుకుందాం
ఈ యాభై కథల్లోనూ మొదట నిలిచే కథ “గంగరేగిచెట్టు”.ఇది కొంత ఆత్మ కథాత్మక కథ అనొచ్చు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఎచ్చమ్మ మంచి నక్షత్రంలో పుట్టలేదన్న పేరు పడి ,తండ్రికూడా ఆమెను దగ్గరుంచుకోక రుక్మిణమ్మ అనే ఆమెకు పెంచుకోమని ఇచ్చాడు.తరువాత ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు.రుక్మిణమ్మ దగ్గర పెరిగుతున్న ఎచ్చెమ్మ మహబూబ్ నగర్లో చదువుకుంటూ చూడచక్కగా అంతా తనతండ్రి పోలికలో వుంటుంది.తండ్రి ఆమెను పెంపకానికైతే ఇచ్చాడుగానీ అప్పుడప్పుడూ వెళ్ళి చూసుకొస్తూనే వుంటాడు ఆమెకు తొమ్మిదేళ్ళప్పుడు.ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఆపిల్ల తన దగ్గరగా వస్తే ఆపిల్ల అంతా తన పోలికేనని, కదిలి పోయాడు.ముద్దు చేశాడు. అంతకు ముందు ఆయన చెల్లెలు ముత్యాలమ్మ ,తన కొడుక్కు ఆయన కూతుర్నివ్వమనీ,అట్లా సంబంధం కలుపుకుంటే పరువూ ప్రతిష్టలు కల అన్న అండ తనకి వుంటుందనీ ,భర్త బిర్రు కాస్త సడలుతుందనీ అడుగుతూ వుంటుంది. అప్పుడు తన రెండో భార్య కూతురు నీలిని ఇస్తానంటాడు.ఎచ్చమ్మని చూసి మనసు కరిగిపోయిన తరువాత నీలిని కాదు ఎచ్చమ్మని ఇస్తానంటాడు.మొదట్లో ముత్యాలమ్మకి ఎచ్చమ్మ ని అంతా నష్ట జాతకురాలనడం తండ్రికూడా దగ్గరుంచుకోక పాలమూరు పంపడం గుర్తొచ్చి కాస్త సందేహించినా అన్నతో సంబంధం ముఖ్యం అనీ, నీలి కన్న ఎచ్చమ్మే బాగుంటుందనీ అసలు తనే ఆపిల్లను తెచ్చి పెంచుకుంటే బాగుండేదనీ సర్ది చెప్పుకుని సరే నంటుంది.సంక్రాంతి పండక్కి నెల రోజులముందుగానే అన్న ఇంట్లో మకాంపెట్టి ,వదిన మర్యాదలోపంచేసినా సహించుకుని వుంటుంది.అప్పుడు ఎచ్చమ్మని కూడా తీసుకుని రుక్మిణమ్మ కూడా వస్తుంది.ఎచ్చమ్మరాకతో “బంతిపూలు పూసినట్టు , పచ్చతోరణాలు గట్టినట్టు ,ఎన్నెల గాసినట్టు” ఆ యిల్లు కళకళ లాడింది. తొమ్మిదేళ్ళ ఎచ్చమ్మ ఇంగ్లీషు లో పద్యాలు అవీ చెప్పడం పిల్లలందర్నీ ఆకట్టుకోడం మేనత్త కొడుకు రఘునాథ రెడ్డి చూస్తాడు.అతనేమో ఉర్దూ మీడియంలో చదువుకుని వచ్చాడు. ఎట్లాగైనా ఆమె దగ్గర ’అంగిరేజ్” నేర్చుకోవాలనుకున్నాడు. అయితే ఆ పిల్ల ఒక షరతు పెట్టింది. కాశిరెడ్డి పెరట్లో పెద్దగంగరేగు చెట్టుంది.సంక్రాంతి రోజుల్లో నిండా కాయలతో వుంది.. ఆ గంగరేగు కాయలు కోసిస్తే అంగిరేజు నేర్పుతానంటుంది. కానీ అక్కడేదో దయ్యం వుందని పిల్లల్ని పోనివ్వరు. అయనా గానీ సరే అన్నాడు ఆ పిల్లవాడు...మధ్యాహ్న భోజనాల వేళ వాళ్ళిద్దరూ గంగరేగు చెట్టు దగ్గరకు పోయి అక్కడ గోడ మీద కూచుని ఎచ్చమ్మ చదువుతుంటే అతను మళ్ళీ అని ఆమె చెప్పినవి వల్లె వేస్తున్నాడు.ఇది చూసిన పిల్లలు కొంతమంది పోయి, అతనితల్లి ముత్యాలమ్మకి ఎచ్చక్క దగ్గర బావ అంగ్రీజు నేర్చుకుంటున్నాడని చెప్పారు..కొడుకు అంగ్రీజు నేర్చుకుంటున్నాడంటే ముందు సంతోషమైనా వెంటనే ,రేపు తన కొడుకు “అదుపాజ్ఞలలో వుండవలసిన పోరి గురువాలె వాడికి అంగ్రీజు నేర్పడమేమిటని” కోపం వచ్చింది.అంగ్రీజు నేర్చుకోడం తరువాత ఇద్దరూ ఒడుపుగా చెట్టెక్కి కాయలు కోసుకుని తిన్నారు.మరి రఘునాథ రెడ్దయితే దిగాడు గానీ ఎచ్చెమ్మకు దిగరాలేదు.అతనే ఉపాయం చెప్పాడు,తను కింద వొంగి నిలబడితే, తన వీపు మీద కాలు పెట్టిదిగ మన్నాడు.అట్లాగే దిగుతోంది ఆపిల్ల .కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన ముత్యాలమ్మ కంట తన కొడుకు ’సల్వ” అంగి మీద కాలు పెట్టి దిగుతున్న పిల్ల!! “తిప్పికొడ్తే పదేండ్లు లేని ఈ పిల్ల ఇప్పట్నించే తన కొడుకుని కర్రె కుక్కను చేసి తిప్పు తుండది .దీనికీ దీని సంబంధానికీ ఒక దండం” అనేసి కొడుకుని తీసుకుని వెళ్లిపోయింది..బాల్య వివాహమూ చదువుకు స్వస్తి మొదలైనవి తప్పిపోయిన ఆ పిల్ల ఏ ప్రొఫెసరో అయుండచ్చు..మేనత్త దయ వల్ల...ఇందులో మేనత్త పాత్ర ని ఆ నాటికి అత్యంత సహజంగా చూపించారు యశోదారెడ్డి....,’మ్యానరికం” అనే మరో కథ, మేనరికం పేరిట బాల్యం లోనే పిల్లల పెళ్ళిళ్ళు నిశ్చయం అవడాన్ని వ్యతిరేకించిన కథ. పల్లెలో పీర్ల పండగ,హిందూ ముస్లిం ల మైత్రి, భంగుతాగి సన్యాసులెంటబడి ఆరునెలలు తిరిగి ఇంటికొచ్చి మళ్ళీ భార్యను చూసి ఆమెకు అంటుకుపోయిన జోగుళయ్య అప్పటి గ్రామణ జీవితాన్ని కళ్ళకు కట్టిస్తారు.
ఎచ్చమ్మ కథలలోనూ ధర్మశాలలోనూ ఒక చెల్లెలు (ఎచ్చమ్మ) అక్కకు వ్రాసే ఉత్తరాల రూపంలో కొన్నికథలున్నాయి. ఈ కథలన్నీ మాండలికం లోనే ఉన్నాయి.అట్లాగే తెలంగాణా గ్రామాలలోని పెళ్లి వేడుకలు ,నగలు ,రైకపై కుట్టుపని ,పండగలు ఆచారాలు ఎన్నో తెలుసుకోదగ్గ విశేషాలున్నాయి. ఎచ్చెమ్మ అక్కకు వ్రాసే ఉత్తరాలన్నింటిలో ఆమె అక్కా బావల అనురాగ దాంపత్యాన్ని, అన్యోన్యతనూ ప్రస్తావించకుండా వుండదు.అట్లాగే అమె కథల్లో ఆడపిల్లలంతా చంద్ర దీపాలు.తండ్రులు ఆపిల్లల్ని ఎంతగానో అక్కున చేర్చుకుంటారే గానీ ఎక్కడా వివక్ష చూపరు”.సీతక్క పెండ్లి” అనేకథలో కూతురు”పాపెట తీర్పుకు, నాబిడ్డ కాటిక సక్కనకు, నాతల్లి బొట్టు పొందికకు, బాసికపు కూర్పుకు,నాపండు ఒడిబియ్యానికి, నామొల్క ఎదుగుకు ,నాకంటిసలవకు ఆసీతారాముల జంటకు,ఆజత ముద్దు మురిపానికి” తనకున్న పొలం తనఖా పెట్టడానికి కాళ్ళరిగేలా తరిగిన సీత తండ్రి ,అదంతా తనబిడ్డకోసమని తన అంతస్తుకు మించిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్ళి సామానుకు పందిర్లకు మండపాలకు తెచ్చిందంతా ఖర్చుచేసినా .కట్నం దగ్గర పేచీలొచ్చి పెళ్ళి ఆగపోయింది. పెళ్ళికొడుకు ’విలాయతు”కి వెళ్ళిపోయాడు.నిజానికి సీతక్కమీద మనసు పడింది అతనే..కానీ సంవత్సరం తిరిగే సరికి అతనే వచ్చి సీతని అక్కున చేర్చుకుని మామ కాళ్ళకి మొక్కాడు. ఆమె కథల్లో ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయిలని తప్పకుండా పెళ్ళి చేసుకుంటారు అంతస్తుల తేడాలున్నా...పెద్దలు అంగీకరించినా లేకపోయినా చేసుకుంటారు. మావూరిముచ్చట్లు అనే పెద్దకథలో ఆ వూరికి జానపద కళలపై పరిశోధన కొచ్చిన యువతీయువకుల ఎదుట తమ కళల్ని ప్రదర్శించడానికి సిద్ధమౌతున్న వివిథ కళాకారుల్ని మనకి పరిచయం చేస్తూ పనిలో పనిగా అందులోనే ఒక ప్రేమ కథను కూడా చెప్తారు .కురువల పెళ్లి సంబరాలు చూడ్దానికి పోయి వాళ్ల పెళ్ళి తంతుల్లో ఇరుక్కుపోయిన ఒక కాపింటి బిడ్ద ,అనుకోకుండా ఒక బ్రాహ్మణ యువకుడికి భార్య అయిపోవడం, ఆఇద్దర్నీ పెద్దలుఅంగీకరించకపోతే ,వాళ్ళు వెళ్ళిపోవడం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వాళ్ల మధ్య. చివరికి వాళ్ళు ఈ జానపద సంఘంతో ఆవూరొచ్చినప్పుడు ఆమె వరుస చెల్లెలు ఆమెని తమ ఇంటికి పిలవడం కథ...ఇందులో పల్లెల్లో వుండే ఎంతో మంది జానపద కళాకారులు వాళ్ల విద్యలూ, అన్నీ పూసగుచ్చారు యశోదారెడ్ది..జమ్మి కథలో పల్లెటూర్లో దశరా పండగ సంబరాల్లో భాగంగా జమ్మి కొట్టే టప్పుడు ఊరి ఆసాముల సంభాషణ ల ద్వరా వారి మనస్తత్వాలు అద్దంలో లాగా కనపడతాయి,,పర్పుబండ ,బొక్కిందే దక్కుడు,రాజుగారి ఒకనాటి ప్రచారం కథలు అద్భుతమైన రాజకీయ వ్యంగ్యాస్త్రాలు. ఎలెక్షన్లు రాబోయేముందు” రాంగ రాంగ నెలలునిండి పురిటిదినాలు దగ్గర పడ్దట్లు ..ఎన్నికలు రేపో మాపో..ఇవే నాల్గు రాళ్ళు రాలంగ రెండురాళ్ళు.వెనకేసుకునే దినాలు..పల్లె ఒళ్ళువిరుచుకుని లేచి ఉత్సాహం పుంజుకునే వైనం.
అప్పటి పల్లెల్లో కొందరు దొరసాండ్ల కెంత అసూయ పొగరు వుండేవో ఎన్ని కుటిల బుద్ధులుండెవో “కాలం చెప్పిన తీర్పు ’కథలో .పాపవ్వ దొరసాని ఉదాహరణ.మంచి దొరసాంద్లకు”సంజ “కథలో దొరసాని ఉదాహరణ. ఎచ్చమ్మ “కోరి చేసుకుంటినమ్మ కోతిశివుణ్ణి”అని ఏరికోరి ఒక వన్నెల మొగోడు,చిత్రకారుణ్ణి పెళ్ళి చేసుకుంది.వాళ్ళు చెమడోడ్చి ఒక ఇల్లు కట్టుకున్నారు .దాని పేరు సుధర్మ.అదొక బొమ్మల కొలువు..అంతా బాగానే వుంది కానీ ఆఇంటిచుట్టూ బస్తీ రొద పెరిగింది..అక్కడొక చెత్తకుండీ వెలిసింది.ఆ చెత్తకుండీలో చిత్తుకాగితాలేరుకునే వాళ్లు మొదలయ్యారు.అప్పుడు కుండీ ఖాళీ చేసే మున్సిపాలిటీ మనిషి చిత్తుకాయితాల వాళ్లని రూపాయకట్టి కాయితాలు ఏరుకోమని ఆర్డరేశాడు.ఆ రూపాయి కట్టలేని వాడొకడు కుండీ లో దిగి కూచుని కాగితాలు మూటగట్టుకుని బయట కుక్కల్ని బెదరగొట్టడానికి తనూ కుక్కలాగా అరుస్తాడు.ఒకావిడ సీసాపెంకులు తెచ్చి, కుండీలోపోయగా అతని తలకు ,వంటికి గాయాలై నెత్తురోడుతూ బయటి కొచ్చాడు.ఈ కథని యశోదారెడ్ది వ్రాసిన తీరు ఒక క్యామెరా పట్టుకుని ఆ వీధిని ,అందులో పొద్దుటి నించీ సాయంత్రం దాకా నడిచి వెళ్ళే రకరకాల మనుషుల్నీ, వాహనాల్నీ క్లోజప్ షాట్లు తీసి అంతాకలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. ఒకప్పుడు మారియో మిరండా అనె చిత్రకారుడు ఒక బొమ్మ వేస్తే అతి చిన్న వివరాన్ని కూడా వదిలే వాడు కాడు.అలా వుంటుంది యశోదారెడ్ది కథనం .పెళ్ళి తంతుల్ని గురించి చెప్పినా,ఉయ్యాల వేడుక గురించి చెప్పినా ప్రయాణానికి కచ్చరం బండి తయారుచెయ్యడం గురించి చెప్పినా బండికి ఏ ఎద్దుల్ని కట్టాలో అందులో ఎలాంటి మెత్తలు పరవాలో. ఏమేమి అలంకారాలు చెయ్యాలో ఏ ఒక్క వివరమూ వదలదు ఆమె. ఆమె కథలన్నీ కథా చిత్రాలే..ఆమె భాషలోనే చెప్పాలంటే ’ పూరాగా చిత్తారి దించినట్లు”వుంటాయి..మనుషుల పట్ల ప్రేమ కథల్నిండా పరుచకుని వుంటుంది,శాంత గంభీరమైన కథలు ఆమెవి.
ఇక ఉపమానాలైతే ఏరుకోవాలి గానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి.అవి శ్రమ పడి వెతికి తెచ్చి అతికించినవి కావు.అలా అశువుగా పాళీలోంచి సిరా ప్రవహించినంత సహజంగా ప్రవహిస్తాయి సామెతలూ అంతే” ఆ రెండూ నావి”..అనే కథలో ముసలి ఎలమందని గురించి” ఆకు రాలిన సెట్టోలె,దురమాగిన పండోలె పండువారిన ఆకోలె,పీసువారిన బీరకాయోలే,వొట్టివోయిన సెర్వోలె, రెక్కలూడిన పక్షోలె వున్న ఎలమంద, పసినిమ్మ పండోలె,పచ్చని సిగురోలె,దోరకాయోలె,దానిమ్మపూవోలె,రెక్కలొచ్చిన చిల్కోలె,పులిబెదురు తాకని జింకపిల్లోలె, కొబ్బరిగిన్నోలే వున్న మన్మరాలిని వెంటబెట్టుకుని...”, ఇటువంటి ఉపమానాలు కథల్నిండా వుంటాయి.ఇంక బీర పువ్వులన్నా చిలకపచ్చ చీరెలన్నా చాలా ఇష్టం.ఆమెకు.
.మోనా అనే కథలో ఇతివృత్తం పాతదే అయినా ఆ కథ మొదట్లో ఆమె వరదను వర్ణించిన తీరు అద్భుతం...’మొగులు చిల్లివోయినట్టు.ముంతన గుమ్మరించినట్ల,,మిన్నూ మన్నూ కలిసి ఏకంకవొడికినట్ల, ఏకసిస్తుగవాన., వొర్రెలు, వొంపులు ,కాల్వలు .మడుగులు ,కుంటలు,చెర్లు ఏర్లు నదులు అన్నీనీళ్లు నిండంగ,పిక్కటిల్లి ,గండ్లువడి,కట్టలు దెంపుకోని ,ఏకమై,ఒడ్లెక్కి,అలుగులు దుంకి,చిన్నా పెద్దా తారతమ్యాలుడిగి,మిర్రు పల్లాలు ఒకటై, వొంపులుదీరి,ఈసురోసాలు ఇడ్సి,ఒక్కబాటగా ,ఒక్క సూటిగా ,జతజతగా కలెగల్పుగా సముద్రయ్య దిక్కు నడిసినై,” ఇట్లా సాగుతుంది.
1929 లో జన్మించిన ఈ విదుషి ,2009 మరణించారు.త్వరలోనే ఈమె కథా సంకలనం నేషనల్ బుక్ ట్రస్టు ద్వారా వెలువడనున్నది.