భావుకతతో కూడిన గ్రామీణ జీవన చిత్రణ ,ప్రకృతి వర్ణనలు ,సంస్కృత భాషాభినివేశం, సంగీతంలో అభిరుచి ,ప్రవేశం,పరిజ్ఞానం, కలిస్తే ఐ.వి.ఎస్ అచ్యుతవల్లి,..1954 లోనే తొలికథ “జగతి”పత్రికలో వ్రాశారు.తరువాత భారతిలో వ్రాసిన దీపకరాగం ఆమెను పాఠకుల కు చేరువ చేసింది.అక్కడనించీ ఎనిమిది కథా సంకలనాలు అనేక నవలలు,,పత్రికలలో కాలమ్స్ విస్తృతంగా వ్రాశారు..ఎనిమిదింటిలో ప్రస్తుతం నాలుగు మాత్రమే కథానిలయం లో దొరికాయి.కొన్ని కథలు అక్కడక్కడా లభించాయి. నాలుగు సంపుటాల లోని కథలు ఏఏ పత్రికల్లో వచ్చిందీ ఎప్పుడెప్పుడు వ్రాసిందీ చెప్పలేదు.ప్రకృతి అందాలను వర్ణించడం అప్పటి ,గ్రామ జీవితం లోని సూక్షాంశాలను కూడా పరిశీలించడం,మనస్తత్వ పరిశీలన,అప్పటి స్త్రీల పరిస్థితులు, ఆమె కథల్లో కనిపిస్తాయి. దాదాపు ఎనభై ల చివర్లో కలం పక్కన పెట్టిన అచ్యుతవల్లి, గృహలక్ష్మి స్వర్ణకంకణం ,సుశీలా నారాయణరెడ్డి అవార్డ్, తెలుగువిశ్వవిద్యాలయం విశిష్ఠ పురస్కారం మొదలైన అవార్డులను స్వంతం చేసుకున్నారు ప్రస్తుతానికి మనకి దొరికిన ఆమె కథలని ,గ్రామీణజీనన నేపథ్యంగా కలవి ,స్త్రీల జీవితాలను చిత్రించినవి,మనస్తత్వాలను,లోక రీతిని చిత్రించినవిగా మూడు విధాలుగా విభజించవచ్చు.
అప్పటి గ్రామీణ జీవితాన్ని చిత్రించే మూగబోయిన ప్రకృతి పుట్టిల్లు,ముత్యాల చెరువు,మబ్బు వేట కథల్లో పుట్టిల్లు నిడివిలో నవలకన్న చిన్నదీ కథ కన్న పెద్దది ,దాన్ని పెద్ద కథ లేదా నవలిక అనొచ్చు.మూగబోయిన ప్రకృతి కథలో మూగపిల్ల శంకరిని ఇష్టపడ్డ పట్నం యువకుని భావుకత,పల్లె ప్రకృతి,శంకరి తల్లి జీవితం,కథ ముగించిన పద్ధతి కల్యాణ సుందరిని గుర్తు చేయిస్తుంది.పుట్టిల్లులో సిద్ధేశ్వరి ముఖ్య పాత్ర..ఆమెది కాస్త కలిగిన సంసారం.మరిది కుటుంబరావు చిన్నవాడు కనుక అతని ఆస్తికూడా సిద్ధేశ్వరి భర్త అజమాయిషీ కిందే వుంది .సిద్ధేశ్వరికొక చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు...చెల్లెల్ని వృద్ధుడికి కట్టబెట్టి అతని ద్వారా కొంత లబ్ది పొందుదామని తండ్రి ఆశిస్తే అది బెడీసి కొట్టింది.అతనకి జబ్బు చేస్తే పడుచు భార్య తనకి విషం పెట్టిందేమోనని అనుమానం వచ్చి తన ఆస్తంతా పసిపిల్లల హాస్పిటల్కి వ్రాసేసి చనిపోయాడు..ఆమె పుట్టింటికొచ్చింది.. పుట్టింటి లేమి సిద్ధేశ్వరిని భర్తకు తెలియకుండా వారికి సాయపడేలా చేస్తుంది.పురిలోంచి వడ్లు తస్కరించి పంపుతుంటుంది.తననగలన్నీ అమ్మి ఇస్తుంది.మరిది ఆస్తికూడా తామే అనుభవిస్తూండడంతో అతనికి పెళ్ళికాకుండా చూసింది కొన్నాళ్ళు..పెళ్ళయినాక భార్యని కాపురానికి తెచ్చుకోకుండా చూసింది. అట్లా ఆమె మరిది జీవితాన్ని అల్లకల్లోలంచేసింది.పిల్ల పెళ్ళీడుకొచ్చేవరకూ కూడా తోటి కోడల్ని కాపురానికి రానీకుండా జాగ్రత్తపడింది..ఆమె చెల్లెలు అరుంధతి అమ్మవారి అవతారమెత్తి సంపాదించిన డబ్బంతా తమ్ముళ్ళకి పెట్టి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి ఇళ్ళు ఏర్పాటు చేసింది.ఒక భక్త శిఖామణి వల్ల గర్భవతైన అమ్మవార్ని తమ్ముళ్ళిద్దరూ ఛీ కొట్టారు.ఆమె ఆత్మహత్య చేసుకుంది..వదిన గారివల్ల తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంటాడు మరిది.అతని కూతురు తల్లిని వెంటబెట్టుకుని తండ్రి దగ్గరకు వస్తుంది.స్వాతంత్య్రానంతర తొలి రోజుల్లో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ సంసారాలలో ముఖ్య ఆదాయం భూమి నించీ వచ్చేదే..అది వసూలు చేసుకునేదీ ఖర్చు చేసేదీ పురుషులే.ఒక్క రూపాయిరావాలన్న ఆచేతిమీదుగా రావాల్సిందే..తను కడుపునిండా తింటూ ఒంటినిండా బట్టకడుతూ తనకు జన్మనిచ్చిన కుటుంబం పస్తులుంటే ఏ ఆడపిల్లా సహించలేదు.సహించక చేసేదీ లేదు.భర్తని అడిగి లేదనిపించుకుంటే లోకువ, అవమానం .ఈ పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు అట్లా రహస్యంగా పుట్టింటిని ఆదుకునేవారు. స్వంతంగా సంపాదించే వనరు లేదు కనుక..అయితే పుట్టింటివారు ఈ అదును చూసుకుని వీళ్ళని దోపిడీ చెయ్యడం కూడా వుండేది.ఒక్కొక్కచోట...సిద్ధేశ్వరికి వుండే అభద్రతా అజ్ఞానమే ఆమెని అనేక తెలిమాలిన పనులకి ప్రేరేపించివుంటాయి.. తన తమ్ముడి బ్రతుకుతో ఇట్లా చెలగాటమాడిన భార్య మనస్తత్వం ఆమె భర్త కి తెలుసు.ఒక పురుషుడుగా ఆమెని అదుపుచేసే శక్తి అతనికుంది,కానీ ఆపని చెయ్యడు.అందువల్ల కొంత తనకీ లాభంవుండడాన. చూసీ చూడనట్లు వూరుకుంటాడు.భార్య గయ్యాళితనం మాత్రం లోకవిదతమవుతూ వుంటుంది..అయితే రచయిత్రికి సిద్ధేశ్వరి మీద సానుభూతిలేకపోవడం, మధ్య మధ్య వ్యాఖ్యానాలు చెయ్యడం వల్ల సిద్ధేశ్వరి ని పాఠకులు ఆకోణంలోనించీ చూసే అవకాశం లేదు.పల్లె వాతావరణం చక్కగా చిత్రితమైన కథ ఇది. ముత్యాలచెరువు కూడా పెద్దకథే.అందులో ఒక దళిత యువతికి చదువుకున్నఅగ్రవర్గ యువతికీ స్నేహం ,దళిత యువతి అమాయకత్వం,పల్లెలలో సాగుతున్న పెత్తందారీ తనం,కులవివక్ష చిత్రిత మైనాయి.విఫలప్రేమ కారణంగా ముత్యాలు అనే దళిత యువతి చెరువు లో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది.ఈ నాలుగు కథల్లోకి అగ్ర భాగాన నిలిచే కథ మబ్బువేట. కమతాన్ని కున్న జీతగాళ్లని ఖామందులు ఏడిపిస్తుంటే,మధ్యలో ఆ కమతం విడిచిపెట్టి ఎక్కువ డబ్బులకి మరో చోట పనిచేసుకునే వీల్లేక, జరుగుబాటుకోసం చీకటివేళల్లో పురులలోనించీ ధాన్యం దొంగిలింఛడాన్నే మబ్బువేట అంటారు.పురులకి కాపలా వుండే వాళ్ళుకూడా ఒక్కొక్కసారి వీళ్ళకి సహకరించి తమ వాటా తీసుకుంటారు.అట్లా మబ్బు వేటలో ఆరితేరిన రాజయ్య ,కమతాలు మానేసి స్వంత వ్యవసాయం చూసుకుంటూ మాణిక్యాన్ని పెళ్లిచేసుకుని ఆమె అందాలనూ అభిరుచుల్ని చూసి మురుసుకుంటూ వుంటాడు.మాణిక్యం కూడా ఒకప్పుడు మబ్బువేటలో నిపుణురాలే.కానీ ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ భర్తకు సహకరిస్తోంది. ఆమెకి బయస్కోపులంటే పిచ్చి.అప్పుడప్పుడూ అవి చూడ్డానికి వెళ్ళి వస్తూంటుంది .ఆమె వంక సన్నాలు తప్ప తినదు,వాయిల్ చీరెలు తప్పకట్టదు.అదంతా ఆమె కష్టపడి సంపాదించి తెచ్చుకుంటోందని మహా ఆనందపడిపోతాడు రాజయ్య..కానీ ఆమె ఇప్పుడు చేస్తున్న మబ్బువేట వేరు. బైస్కోపుకని చెప్పి ఆమె చీకటిరాత్రులలో వెళ్ళేది బాపయ్య అనే ఖామందు దగ్గరకు.వంకసన్నాలు అతనిచ్చేవే..ఈ కథకు చివర రచయిత్రి వ్యాఖ్యానం లేకపోతే బాగుండేది.
అచ్యుతవల్లి అప్పటి స్త్రీల జీవితాన్ని గురించి వ్రాసిన కథల్లో ఆండాళ్ళూ వుల్లిపాయలు అనేది అధ్భుతమైన కథ.స్త్రీలు తమకి ఇష్టమైన తిండి వండుకు తినడాన్ని కూడా ఆచార ,సంప్రదాయాలెలా .అడ్దుకుంటాయో ,నవ్విస్తూన్నట్లు కనిపిస్తూ జాలిగొలిపే కథ.ఈ కథని అచ్యుతవల్లి చాలా సౌలభ్యం తో వ్రాసారు. వైష్ణవుల ఇంటికోడలైన ఆండాళ్ళు మొదటిసారి గర్భవతైంది.ఆ సమయంలో స్త్రీలకు కొన్ని కొన్ని ఆహార పదార్థాలమీద మనసుపోతుందంటారుకదా? అట్లా మనసుపడినది తినకపోతే పుట్టబోయే బిడ్ద చెవిలో చీము వస్తుందనే మూఢనమ్మకం కూడా వుంది.వైష్ణవులు ఉల్లిపాయలు తినకూడదు .నీరుల్లైనా,వెల్లుల్లైనా..ఆండాళ్ళుకి ఉల్లిపాయలమీద మనసుపోయింది.ఉల్లిపాయ పకోడీలూ,ఉల్లిపాయ పచ్చిపులుసు..ఉల్లిపాయ పెసరట్లు..భర్త ఆఫీసుకు పోగానే కాసిని ఉల్లిపాయలు కొనుక్కుని భద్రంగా పొట్లంకట్టి బట్టల బీరువాలో చీరెలకింద దాచింది.తరువాత ఎన్నిసార్లు ఆమె ఉల్లిపాయలు తరిగి ఏదోఒకటి చేసుకోబోయినా ఎవరో ఒకరు రావడం ఆ ముక్కలు పారబోయడం జరిగి ఆ కోరిక తీరనే లేదు.ఒకరోజు భర్తకి ఏదో అవసరపడి ఆమె బీరువా తీసి వాసన గమనించి ఉల్లిపాయల పొట్లం బయటికి తీసి ఆండాళ్ళు తీరని కోరిక తెలుసుకుని కరిగి నీరై, రామయ్య హోటల్ కు వెళ్ళి ఉల్లిపాయ పెసరట్టు కట్టించుకొచ్చాడు. ఆవురుమంటూ దాన్ని విప్పుతూండగానే ఆమె అన్న ఆమెను పుట్టింటికి పురిటికి తీసుకుపోడానికొచ్చి తలుపుతట్టాడు.పెసరట్టు పెరటిపాలు.పుట్టింట్లో ఉల్లిపాయల మాటే ఎత్తకూడదు.ఇప్పుడు ఆండాళ్ళు బాధ ఒకటే.పుట్ట బోయె బిడ్దకు చెవిలో చీము వస్తుందేమోనని ..బిడ్డపుట్టాక అది లేదని తెలిసి ఊపిరి పీల్చుకుంది.ఇంట్లో ఉల్లిపాయలు వాడకూడదే కానీ మగవాళ్ళు హోటళ్ళలో తినొచ్చు .
అమె వ్రాసిన మరొక పెద్దకథ “ఎగిరే పిట్టలు”.ఇందులో కథానాయకి వసుంధర అందకత్తె కాదు.ఆమె తండ్రి ధనవంతుడూ కాదు..ఆమె కి చిన్నప్పుడు సంగీతం చెప్పించాడు.ఆమె కంఠం బాగుంటుందనీ సంగీతంలో ప్రజ్ఞ సాధిస్తుందనీ మాస్టారు ఎంత చెప్పినా ఆతండ్రి ఆమె వివాహం మీదే ఎక్కువ దృష్టి పెట్టి తెలుగు ట్యూటర్ అప్పాదురైకిచ్చి పెళ్ళి చేసి.ఆమె పెళ్ళికైన అప్పుతీర్చడానికి ఇల్లమ్ముకుని కాశీ వెళ్ళిపోయాడు.మిగిలిన డభ్భు కూతురికివ్వలేదని ఆమె అత్తా భర్తా ఆమెను వేధించి వెళ్ళగొడితే అన్నలదగ్గరకు కాక సంగీతం మాస్టారిదగ్గరకు వెళ్ళింది.” నీ గానం అమరమౌతుంది అందుకే నీకీ సంసార విఛ్చేదం జరిగింది”అని ఆశీర్వదించాడాయన..సంగీతం ప్రయివేట్లు చెప్పుకుని బ్రతికే స్థాయినించీ పట్టమ్మాళ్ వంటి మహా గాయనులు పాడిన వేదికలదాకా ఎదిగి సంగీత కచేరీలలో తనకొక స్వంత ముద్ర ఏర్పరుచుకుంది వసుంధర. విద్వన్మణి వసుంధర అప్పుడావూర్లో కచేరీ చెయ్యడాని కొచ్చింది ..ఆమె భర్త అప్పాదురై సంసారం డబ్బు చాలక కుంటినడక నడుస్తోంది.ఆడపిల్లలు పెళ్ళికెదిగి వచ్చారు.అతని రెండవ భార్య ,వసుంధరని ఇంటికి తీసుకురమ్మని భర్తని పోరింది.ఆమె తమదగ్గర వుంటే లక్ష్మీ దేవి వున్నట్లే.అప్పాదురై కచేరీ అయేవరకూ ఓపిగ్గా కూచుని ఆమెని తనతో ఇంటికి రమ్మన్నాడు.అతన్నే ఆమె తనుండే హోటల్ కి రమ్మంది.అప్పటికీ అప్పాదురై అహంకారంతోనే గా వున్నాడు.భర్త వదిలేసిన స్త్రీ అనే కళంకం పోగొడతాను ఇంటికి రమ్మంటాడు.ఆమె లోపలికి వెళ్లి కొంత డబ్బు తెచ్చిచ్చి అవసరమైతే అడుగుతూ వుండు సాయంచెస్తానని హుందాగా చెప్పి అతన్ని పంపేసింది.ఇది కావడానికి మామూలు కథే అయినా ఇందులో అచ్యుతవల్లి సంగీత పరిజ్ఞానం అడుగడుగునా అద్దింది.
ఇంకా వెన్నెలనీడ,అందనిలోతులు ఇజ్జత్,అభిశంస,.కదలని బాట ,చర్విత చర్వణం స్వయంబద్ధ నిర్మల,వంటికథలలో కూడా స్త్రీల జీవితాలలో తారసపడె అనేక సమస్యలు మనోవ్యధలు వాటిని వాళ్ళు స్వీకరించే పద్ధతీ చిత్రించారు. తిరుగుబాటు తక్కువ .స్త్రీలను అర్థం చేసుకుని పశ్చాత్తాప పడే పురుషులు అక్కడడక్కడా కనిపిస్తారు. స్వయంబద్ధనిర్మల లో నిర్మల వివాహానికి ముందు కథలు వ్రాసేది.పెళ్ళయినాక కూడా వ్రాసుకోలెమ్మని ఆమె భర్త వరమిచ్చాడు.ఆమె వ్రాసింది.అయితే ఆమె వ్రాసిన కథలో తనకుటుంబం లోని వ్యక్తుల ఛాయలు కనపడ్దాయి భర్తగారికి.చాలాకోపం వచ్చేసింది ఆయనకి.కథలు వ్రాసుకోమంటే ఇలాగా అని గంతులుపెట్టాడు. ఆమె “పూజ్యులైన భర్తగారికి”అని సంబోధిస్తూ ఒకలేఖ వ్రాసిపెట్టి అతని అక్కగారింటికి వెడుతూ ఆ కథ బాయిలర్ లో వేసి పోయింది.భారతీయ స్త్రీకి కథలు వ్రాసుకోడం కన్న సంసారం ముఖ్యంకదా అని కాస్త వ్యంగ్యంగా..ఆడవాళ్ళు రాయాలంటే ఎన్ని ఎడిటింగ్ లు ఎంత సెన్సారింగ్?
మానవ మనస్తత్వాలనూ లోకరీతులనూ చెప్పే కథలలో “వర్షం వచ్చినరోజు” సన్నాటా” ఎక్కువ పాఠకాదరణ పొందిన కథలు.”వర్షంవచ్చినరోజు” కథలో ఒక ధనిక యువకుడు అతని రోగిష్టి భార్య ,మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకునే పేదరాలు,టీ అంగడినడిపే అతనూ ..ఎవరెవరుఆ వర్షపు రోజున ఎట్లా ఆలోచించిందీ ఈ కథ .వర్షంలో తడిసి ఒంటి వొంపులు దాచుకోలేని ఎల్లమ్మ కప్పు టీ అయినా అమ్ముడుపోని అప్పిగాడూ తమకన్న అదృష్టవంతులని ఆ ధనిక దంపతులు అనుకుంటారు.సన్నాటా కథలో చాలాకుటుంబాలు అద్దెకున్న పాత మేడ ముందొక కారు ఆగితే అది తమకోసమేనని ఎవరిమటుకు వాళ్లు అనుకోడం చివరికి ఆ మేడ యజమాని దాన్ని అమ్మబోతున్నట్లు చెప్పడం కథ. ఆమె వ్రాసిన వందలాది కథల్లో ఇవికొన్ని
అచ్యుతవల్లిది చదివించే శైలి.చక్కని తెలుగు భాష.పరిశీలనాసక్తి ఎక్కువ.అప్పట్లో విస్తృతంగా వ్రాసిన రచయిత్రి...వివాహానికి ముందు కె.వి.ఎస్ అచ్యుతవల్లి అనేపేరుతోనూ కొంత కాలం “రాఘవేంద్ర” అనే కలం పేరుతోనూ వ్రాసారు ...చాలా నవలలు వ్రాశారు.”బాతోంమే ఖూనీ” అనే కాలమ్ నడిపారు.
1943 లో జన్మించిన అచ్యుతవల్లి 2010 లో మృతి చెందారు
..