తన అభిప్రాయాలను, సూటిగా నిర్మొహమాటంగా,ఒకింత హాస్యం రంగరించి చెబుతూ, జవాబుల శీర్షికతో అనేకమంది పాఠకులను ఆకట్టుకుని, ఎన్నో ఆకతాయి ప్రశ్నలకు మొట్టికాయలు వేసిన సీనియర్ రచయిత్రి రామలక్ష్మి, శతాధికంగా కథలు వ్రాసారు.యాభైయ్యో దశకానికే ఆమె ఇంగ్లిష్ స్వతంత్రలో జర్నలిష్టు గా ఖాసా సుబ్బారావుగారివంటి ప్రఖ్యాత సంపాదకుని వద్ద శిక్షణ పొందారు.అక్కడ పనిచేస్తూ, తెలుగు రచనలకి శ్రీకారం చుట్టడమే కాక అనేక మంది రచయిత మిత్రులతో సాహిత్య చర్చలు చేసే అవకాశాన్ని పొంది తన రచనలకు మెరుగులు దిద్దుకున్నారు. స్వాతంత్ర్యానంతర తొలి తరం యువతిగా ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలిగి ,చదువూ ఉద్యోగం ,జీవన సహచరుణ్ణి స్వయంగా ఎంపిక చేసుకునే స్వేచ్చనూ అందిపుచ్చుకున్నారు ఆరుద్రను జీవన భాగస్వామిని చేసుకున్నారు. . 1954 నాటికే ఆమె తొలి కథా సంపుటి ’విడదీసే రైలుబళ్ళు” ప్రచురించారు.1961 లో ’తొణికినస్వప్నం” ప్రచురిం చారు 2007లో దాదాపు ఎనభై కథల్ని రెండు. సంపుటాలుగా ప్రచురించారు.అలవాటుగానే ఆ యా కథలు ఏ ఏ సంవత్సరాల్లో వచ్చాయో వాటి కింద వెయ్యలేదు.యాభైయ్యో దశకం లో ఆమె వ్రాసిన పార్వతీ కృష్ణమూర్తి కథలు బహుళ పాఠకాదరణ పొందాయి.
స్టువార్టుపురం నేపధ్యంలో “గురు దక్షిణ “అనే నవల కాకుండా ఒకతండ్రికథ మరికొన్ని నవలలు వ్రాశారు.ఇప్పుడు అందుబాటులో వున్నవి ’ఒక జీవికి స్వేచ్చ” “అద్దం”అనే రెండు కథా సంఫుటాలు. త్వరలోనే పార్వతీ కృష్ణమూర్తి కథలు ప్రచురించాలనుకుంటున్నారు.గృహలక్ష్మి స్వర్ణకంకణం,పందిరి మల్లికార్జున రావు వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు.ఆంధ్ర పత్రికలో ప్రశ్నలు జవాబులే కాక ఉదయం వార పత్రిక లో నారీదృక్పధం శీర్షిక ను కూడా సమర్థ వంతంగా నిర్వహించారు.తన భావాలను నిర్మొహమాటంగా నిర్ద్వందంగా చెప్పటం ఆమె ప్రత్యేకత.
1954 లో వచ్చిన విడదీసే రైలు బళ్లు సంపుటిలో చీలిన దారులు అనే కథ వుంది.అందులో ప్రేమించుకున్న యువతీ యువకులు పెళ్లిచేసుకోడానికిష్టపడరు.కారణం పెళ్ళి వలన ఏర్పడే నిరంతర సాన్నిహిత్యం ప్రేమను మాయం చేస్తుందని.అప్పటికే వివాహ వ్యవస్థ పట్ల రామలక్ష్మి గారి అభిప్రాయాన్ని ఈ కథ సూచిస్తుంది.
ఆత్మ గౌరవం స్త్రీలకి గానీ పురుషులకు గానీ ఒకరిచ్చేది ,ఒకరినించీ లాక్కునేదీ కాదు .అది వాళ్లంతట వాళ్ళే అలవర్చుకోవాలనే నమ్మకాన్ని అనేక కథల్లో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు రామలక్ష్మి.అయితే ఆమె ఎక్కువగా కథలు వ్రాసిన నాటికి అది అందరు స్త్రీలకి సాధ్యమైన విషయం కాదనే నిజాన్ని కూడా చాలా కథల్లో ప్రస్థావించారు.రామలక్ష్మిగారి కథలన్నీ స్త్రీల జీవితాలని ,వాళ్ళు యువతులుగా,గృహిణులుగా ,వృద్ధులుగా ఎదుర్కుంటున్న సమస్యల్ని,చిత్రించినవే. అందుకు ఒక కారణం ఆమె కొన్ని సేవాసంస్థలలో పనిచేస్తూ బాధిత స్త్రీలను సన్నిహితంగా చూడడం కూడా కావచ్చును.మానసిక రోగులను,ఫౌండ్లింగ్ సంస్థలను వికలాంగుల పాఠశాలను సందర్శించడం కూడా కావచ్చు..స్త్రీలపట్ల సహానుభూతి పెంచడానికవి దోహదం చేసి వుండొచ్చు.
రామలక్ష్మి గారి కథలలో పార్వతీ కృష్ణమూర్తి కథలు ఇద్దరు సమ చైతన్య స్థాయి వ్యక్తుల ప్రేమమయమైన సంసార జీవనాన్ని చిత్రించేవి.. అప్పటి వరకూ ఎక్కువమంది వ్రాసిన కథల్లో చూసింది ఒక పురుషుడు భార్య పట్ల చూపే ప్రేమ .ఆమెకి పండక్కి చీరె కొనడం సాయంత్రం మల్లెపూలు తేవడం లేదా ,లేదా కాస్త సానుభూతితో మాట్లాడ్డం.ఆమె అందాన్ని పొగడడం ..దానికి స్త్రీలు ఉబ్బి తబ్బిబ్బైపోవడం..ఇక స్త్రీలు భర్తకీ పిల్లలకీ సేవ చెయ్యడం ఏ కాస్త మెప్పు దొరికినా కృతజ్ఞతా భారంతో కళ్ళు తుడుచుకోడం ..కానీ స్త్రీ తరఫునించీ భర్తని ముద్దు చెయ్యడం అతనితో స్నేహంగా వుండడం కనపడవు.భార్యని తనతో సమానమైన మేధో జీవిగా స్నేహితురాలిలా కాక పేట్రనైజింగ్ గా చూసే భర్తలే సాహిత్యంలో తారసపడతారు.ఇట్లాకూడా వుంటుంది సాహచర్యం అనే కొత్త విషయాన్ని రామలక్ష్మి ఈ కథల ద్వారా ప్రవేశ పెట్టారు.పార్వతిని ప్రొటాగనిష్ట్ చేశారు. కొండొకచో అమాయకురాల్లా కనిపించే పార్వతి చాలా తెలివికలది .సమర్థురాలు.ప్రేమించే హృదయం కలది. చిన్నచిన్న సరదాలూ సంతోషాలూ అలకలూ అసూయలూ వున్న నిండైన మనిషి..విషయ పరిజ్ఞానం కలది..ఆ విషయాన్ని ఒక్కొక్క సారి దాచిపెట్టి కృష్ణమూర్తి పెద్దరికం నిలబెడుతూ కూడా వుంటుంది.పిల్లలకి మంచి స్నేహితురాలు.అల్లరి సహిస్తుంది. తన పిల్లలు తన కళ్ళెదుటే పెద్దవాళ్లవడాన్ని చూస్తూ ఆ ప్రకృతి సహజత్వాన్ని అర్థం చేసుకోగలదు..అయితే పార్వతికి ఆమెను ఆరాధించే సహచరుడూ,డబ్బుకు తడుముకునే పరిస్థితి లేకపోవడం నూకాలు వంటి నమ్మిన బంటూ వున్నారు కదా!!అయినా మనం పార్వతి సృష్టికర్తను మెచ్చుకుని తీరాలి..ఎందుకంటే అన్నీ వున్నా కూడా అట్లా భర్త పక్కన కూచుని అతని ఉంగరాల జుట్టులో వేళ్ళు జొనిపి ఒక్కొక్కసారి ముద్దు పెట్టి సంసారాన్ని ప్రేమమయం చేసుకోగల స్త్రీలు అప్పటికెంతమంది? భర్తలు అట్లా భార్యల్ని ఆరాధించాలని చెప్పిన రచయితలెంతమంది? ఇప్పటికీ అదొక “విష్ ఫుల్ థింకింగ్’గానే వుందికదా చాలామందికి!!
“ఒక జీవికి స్వేచ్ఛ” కథా సంపుటిలో పార్వతీ కృష్ణమూర్తి కథలు ఏడేనిమిది వున్నాయి .అద్దం సంపుటిలో మూడున్నాయి.పార్వతి కూతురు బేబీ కౌమార దశలో తను అందంగాలేనని బాధపడిపోతే తల్లి ఆపిల్లకు ఆత్మ విశ్వాసం కలిగించిన కథ,అట్లాగే బేబీ తన స్నేహితుణ్ని ఇంటికి పిలిచి కాస్త హడావిడి చేస్తే ఆపిల్ల అతన్ని ప్రేమిస్తోందనుకుని తను కృష్ణమూర్తిని మొదటిసారి ఇంటికి పిలిచినప్పుడు పడిన ఆదుర్దా కాలు నిలవక ఇంట్లో తిరిగిన తీరు తలుచుకుంటుంది. అతను రాడు.దాన్ని ఆపిల్ల చాలా కూల్ గా తీసుకోడం పార్వతికి ఆశ్చర్యం కలిగిస్తుంది.. తరానికీ తరానికీ ఆడపిల్లల్లో వచ్చిన వివేకంతో కూడిన మార్పుని ...,ఇప్పటి పిల్లలకి స్నేహం వేరు ప్రేమ వేరూ అనే విషయాన్ని కష్ణమూర్తి చెప్పగా అర్థం చేసుకుంటుంది.పిల్లల సందేహాలను సుతారంగా తీర్చడంలో నేర్పరి( రాలిన తార) ..మొత్తానికి ఇంట్లో అందరికీ ఆమె ఒక చలువ పందిరి..ఇంటి పని చేస్తూ తమని తాము మర్చిపోయిన స్త్రీలను గురించి 80 వ దశకంలో కూడా మనం మాట్లాడుకున్నాం కానీ అప్పటికే పార్వతి తన అభిరుచుల్ని వ్యాపకాలనీ నిలుపుకుంటూనే సంసారాన్ని భారంగా కాక ఒక పాటలా సాగించింది.అందుకు పునాది ఆమె స్వయంగా వేసుకుంది.తన జీవన సహచరుణ్ణి తనే ఎంచుకుంది.పరస్పరం కోరుకున్నాకే అతన్ని జీవితంలోకి ఆహ్వానించింది.(ఏకోన్ముఖులు).యాభైల నాటి తల్లితండ్రుల మనస్తత్వాల రీత్యా ఆడపిల్లలిలా తమ జీవితాలను చక్కదిద్దుకోగలగడం కష్టమే అయినా దిద్దుకోవచ్చు అని చెప్పడం చేస్తాయి ఈ కథలు. ఓల్డ్ రేరిటి కథలో కృష్ణమూర్తి ”ప్రేమకి మించిన ఓల్డ్ రేరిటీ లేదోయ్ పార్వతీ !అది మనం కొనలేం!!కనుక భద్రపరుచుకోవాలి” అంటాడు.
నలభయ్యో పడి, తగ్గు,రాలిన తార మంచి కథలు 80 ల తరువాత ఉధృతంగా వచ్చిన స్త్రీవాద సాహిత్యానికి స్వాతంత్ర్యానంతర తొలి రోజుల్లోనే బీజాలుపడ్దం అప్పటి రచయిత్రుల కథల్లో చూస్తాం ఉదాహరణకి రామలక్ష్మి గారి పేపర్ టైగర్స్ కథలో సుందరి ,మూర్తి ని ప్రేమించింది .అతను పెళ్ళి చేసుకుంటానంటే నమ్మింది..అతను వేరే పెళ్లికి సిద్ధపడి ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అప్పటికే ఆమె గర్భవతి.. సుందరి అన్న ఆమెను నిలదీసి ,నానా మాటలని ,ఇంక ఉద్యోగం మానేసి ఇంట్లో వుండమంటాడు .సుందరి తిరగబడింది.ఉద్యోగం మాననంది పిల్లని కని పెంచుకుంటానంది. తల్లి తండ్రులని కూడా తనే చూసుకుంటానంది.ఈ కథ ముగింపులో రచయిత్రి “ఆ రోజు ఆ ఇంట్లో విస్తళ్ళు లేవలేదు. నిజమే..కానీ అలా శాశ్వతంగా వుండిపోదుకదా!!” అంటారు.శివారెడ్డి అన్నట్లు తెరిపిలేని దేదీ లేదు.అంతం కానిదేదీ లేదు.ఎవర్ని వారు పునః ప్రతిష్ఠించుకోడం వుంటుంది.సంప్రదాయాలు, ఆధిపత్యాలు మారితీరతాయి తప్పదు..
రామలక్ష్మి చాలా కథల్లో పిల్లల నిరాదరణకి బలైన తల్లి తండ్రులు ,ముఖ్యంగా తల్లులు కనిపిస్తారు.” అదెక్కడ” అనే కథలో పద్మావతి కుటుంబ సభ్యులందరి దృష్టి లో కేవలం “అది”కింద దిగిపోయింది.ఆమె లేనిదే ఆ ఇల్లు నడవదు.ఉద్యోగం చేసే కోడలూ కొడుక్కు స్కూల్ కి వెళ్ళె మనవలకు.రిటైరై ఇంట్లో వుండే భర్తకు.అందరికీ ఆమె జీతం లేని సేవకురాలు.కోడలి మెప్పుకోసం భార్యని సతాయించే భర్త,కోడలికి ఎప్పుడూ వత్తాసు పలికే కొడుకు..ఆమెకి విసుగొచ్చేసి ఇల్లువదిలి పోయి పనిచేసుకు బ్రతికే స్వతంత్రులైన స్త్రీలతో చేరిపోయింది.అక్కడ తనకొక పేరుంది.కొంత జీతముంది..తనకొక బ్రతుకుంది..అదెక్కడ అని వాళ్లు తరువాత ఏడవనీ..”టిపికల్ సన్” కథలో వృద్ధాశ్రమంలో చేరిన మిసెస్ జకరియా చివరి క్షణాల్లో కొడుకుని చూడాలని తపించినా అదంతా నాటకమని కొట్తిపారేస్తాడు కొడుకు. ఆమె పోయాక కట్టిన డిపాజిట్ లెక్కలు త్వరగా తేల్చమంటాడు.
“ఒక జీవికి స్వేఛ్చ” కథలో కొడుకులు తండ్రికి తద్దినం పెట్టడానికి బాధపడిపోవడమే కాక తల్లి ని దగ్గర పెట్టుకోడానికి కూడా వచ్చందాలు పడి చివరికి వితంతువైన అక్క దగ్గర వుంచుతారు.డబ్బు పంపితే ఉంచుకుంటా అంటుంది...భర్తకు తద్దినాలు పెట్తక పోవడానికి చాలా కలత పడి తమ పురోహితుదైన శాస్త్రి చేత ఆయనకు గయలో పిండం పెట్టించి తృప్తిగా కళ్ళుమూసిందావిడ.శాస్త్రిగారు ఆవిడకైనా పిండం పెట్తమని కొడుకుల్ని మందలిస్తారు.”అద్దం’కథలొ లక్ష్మికి అద్దంలో తనని చూసుకోవాలని కోరిక .కానీ ఆ అద్దం ఎన్ని సార్లు చూసుకున్నా తన ముఖం కనపడదు. గతమంతా జ్ఞాపకముందికానీ అద్దంలో ముఖమే కనిపించడంలేదు. అంటె తన ఉనికి ,తన వ్యక్తిత్వం కనపడకుండా పోయిన వైనం..ఒకరోజు అద్దం పగిలింది.అప్పుడా పగిలిన ముక్కల్లో ఆమె ముఖం కనపడింది.ఆమె వుండడం వల్ల ఆమెకొచ్చే కుటుంబ పెన్షన్ కొడుక్కి లాభం...రాగానే తీసేసుకుంటాడు.అద్దంలో తన ముఖం కనపడంగానే ఆమె చనిపోయింది ఆమె పోవడం ఆమెకి లాభం కొడుక్కి పెన్షన్ నష్టం..కుటుంబ పెన్షనున్న తల్లుల్ని ఏదో ఒకరకంగా భరించవచ్చు. అదికూడా లేనివాళ్లకి కష్టమే! అలాగే తన అన్నతమ్ములు తల్లిని సరిగ్గా చూడకపోతే తనే ఆమెను చూడ్డానికి ముందుకొచ్చిన కూతురు కథ “రా అమ్మా రా” తనకన్న ఎక్కువ హోదా లో వున్న భార్యని భరించడం భర్తలకి ఇప్పుడీ ఇరవైయొకటో శతాబ్దంలో కూడా కష్టమే..ఆత్మ న్యూనతతో అతను చేసే అవమానాన్ని కన్నీళ్ళలా మింగి సహించడమే..అంటుంది వర్కింగ్ వైఫ్ కథ. ఇట్లా స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం సామాజిక హోదా భర్తల ఆత్మన్యూనతను పెంచడమే కానీ తగ్గించడంలేదని చెప్పే కథ.
“నో నో ప్లీజ్” కథ కనిపడెసే అనాథ శిశువుల గురించిన కథ.”హావ్ సెక్స్ బట్ నాట్ అ బేబీ” అంటాడు అట్లా పారేయబడి ఒక మంచి వ్యక్తిచేత పెంచబడి డాక్టర్ అయిన కుర్రవాడు ఒక పోస్ట్ మార్టెమ్ చేసొచ్చి.,తన పెంపుడు తల్లి స్నేహితులైన స్త్రీ వాదులతో కలిసి పిక్నిక్ కి వెడుతూ. ఆసందర్భంగా కొంత స్త్రీవాద చర్చ నడుస్తుంది ;ఈ కథ గురించి చాగంటి తులసి ఇలా అంటారు” “ఆడవాళ్ళ్కో నీతి మగవాళ్ళకో నీతి అని మడి కట్టుకు కూచో నక్కరలెదు “హావ్ ఇట్ “అని చెప్పించారు.అయితే ఎంతగానో చైతన్య వంతురాలైన నిజమైన స్త్రీ వాది తనకి పిల్లలు కావాలనుకుంటే ఆ బాధ్యతను ఎరిగే పిల్లని కంతుంది.అంత చైతన్యవంతుదైన మగవాడినే సహచరుడిగానూ పెళ్ళి చేసుకోకపోయినా సంతానానికి తండ్రిగానూ అంగీకరిస్తుంది. కానీ అక్రమ సంతానంగా పారెయ్యడానికి కంటుందా? ఆవిడకి కడుపు దించుకోవలసిన అవసరం ఏముంది? ఇది ఆలోచించాల్సిన విషయం. పోతే ఆడదానికైనా మగవాడికైనా విశ్రుంఖల సెక్స్ స్వేఛ్చకు అనుమతి ఆమోదయోగ్యమూ భావ్యమూనా?అక్రమ సంతానాన్నిఅందిస్తోదంటే సమాజపు కట్టుబాట్లకు భయపడుతోందనే కదా తాత్పర్యం?కనిపారెయ్యడం,కడుపు దించుకోడం ఐదు నెలల పిండంతో సహా ఆత్మహత్య చేసుకోడం ,సమాజపు కట్టుబాట్లకు భయపడే కదా?సమాజపు అవక తవకలను ప్రశ్నించే చైతన్యవంతులైన మహిళలు ఈ పనులు చెయ్యమని చెప్పరు.......హావ్ సెక్స్ బట్ నాట్ అ బేబీ అనేది పరిష్కారం కాజాలదు”
ప్రేమించిన వాడు వేరే పెళ్లి చేసుకోడానికి వెళ్ళిపోతే తన కడుపులో పిల్లని పెంచుకుంటానని ధైర్యంగా చెప్పిన పిల్ల (పేపర్ టైగర్స్)కథ యాభైల్లోనే వ్రాసారు రామలక్ష్మి.
స్నేహితురాలు లాయర్ శాంత చెప్పినట్లుగా కొన్ని న్యాయ సంబంధమైన కథలు కూడా వ్రాసారు.పిల్లల్ని తండ్రి కష్టడీ లో వుంచాలనే తీర్పు వలన దుర్మార్గులైన భర్తలతోనే దినదిన గండమైన కాపరాలలో చిక్కుపడి వుండే స్త్రీల గురించి చెబుతూ చట్టాలు ఒక్కొక్కసారి స్త్రీలకు వ్యతిరేకంగా ఎలా వుంటాయో “”ఓడిపోయాను” కథలో చెప్పారు “80 వ దశకానికి రెండు మూదు తరాల చదువుకున్న తల్లు లొచ్చారు.వీరు ఆడదాని ఎదుగుదలని మొగ్గలో తుంచేయ్యడాన్ని సహించలేకుండా వున్నారు.ఇలా తుంచివెయ్యడాన్ని క్రిమినల్ తత్వంగా భావిస్తున్నారు . అన్నిరంగాల్లో సమానత్వం అవకాశాలు సాధింఛడానికి , అన్యాయాలను సమస్యలను కోర్టుకీడ్చి న్యాయం పొందవచ్చుననుకుంటే,కోర్టు కెడితే అసలు సమస్య జటిలమై అడుక్కి పోయి మరుగున పడిపోతుంది .న్యాయ స్థానాలు సెక్సువల్ పాలిటిక్స్ కి,మనుధర్మ శాస్త్రానికీ ,మతపరమైన ఆటంకాలకీ అతతంగా వున్నప్పుడె సాంఘిక న్యాయం చేకూరుతుంది ఆస్థితి మనకు లేదు”అంటారు రామలక్ష్మి ఒకచోట.అధికారంలోకి వచ్చిన స్త్రీలు ఆ పార్టి సూచించిన చిలక పలుకులు పలుకుతూ వ్యక్తిగతంగా దిగజారుతున్నారనీ దీనికి విరుద్ధంగా పోరాడాలనీ అంటారు ఇంకొక చోట.స్త్రీలు మేము మానవులం, వ్యక్తులం అని గట్టిగా నోరు తెరవనంతకాలం సంఘ సంస్కరణలు కాగితాలకే పరిమిత మౌతాయంటారు.మార్పు స్త్రీల నించే రావాలి..
రామలక్ష్మి గారి కథల్లో ఎక్కువ స్త్రీలు అప్పటికీ ఇప్పటికీ అనుభవిస్తున్న పరాధీనత అసహాయత ఎక్కవగా కనిపిస్తుంది. అట్లా అని ఆమె కథల్లో స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న స్త్రీలు లేరని కాదు.ఈ కథల్లో ఒక నలుగురు స్నేహితులు కనిపిస్తూ వుంటారు.వాళ్ళు పెళ్ళై సంసారం చేస్తున్నవాళ్లు.అయితే వాళ్ళు తమ స్నేహాన్నీ ఏళ్ళకొద్దీ కాపాడుకుంటారు.తరుచూ కలుస్తారు.కలిసి ప్రదేశాలు చూడ్డానికి వెడతారు.వాళ్ల స్వంత స్పేస్ ని హాయిగా వినియోగించుకుంటారు. ఇప్పటికీ చాలామందికి అటువంటి స్పేస్ లేదని వాపోయే పరిస్థితి వుంది. యాభై అరవైల నాటికే ఆ పరిస్థితి వుందని చెబుతాయి ఈ కథలు.
“జీవితాన్ని వెనక్కి తిగి చూసి తప్పులు దిద్ది తిరగరాయలేం కదా?అందుకే ముందుకే చూడ్దం అలవాటు చేసుకున్నా ఇప్పటిదాకా సాగి వచ్చినంత దూరం-సాగవలసి వుండదుకదా? ఆవిషయం నాకెప్పుడూ సంతోషమే కలిగిస్తుంది”అది ఆమె ప్రాపంచిక దృష్టి,..తరగని జీవనోత్సాహం, సెన్స్ ఆఫ్ హ్యూమర్.స్నేహించే గుణం ఆమెలో ఆకర్షణలు..