డ్్పుస్తక విక్రేతలలో కొందరు సాహిత్య ప్రేమికులు ప్రత్యేకంగా వుంటారు. వాళ్ళు పుస్తకాన్ని అమ్మకం సరుకులాగా ,పుస్తకం కొనుక్కునే వాళ్ళని కొనుగోలు దారుల్లాగా కాకుండా మంచి పాఠకుల్లాగౌరవించి మంచి పుస్తకాలని సిఫార్సు చేస్తూ వుంటారు.విజయవాడ పాఠకులకి అటువంటి అదృష్టం నవోదయ రామమోహనరావుగారి రూపంలో దీవించిందనుకోవాలి.ఆయన తన నవోదయని ఎలా సర్దుతారంటే మనం కొనుక్కోవలసిన పుస్తకం వెంటనే మన ఎదురుగా వుంటుంది మనం అంటే ఇక్కడ కాస్త ఎలాంటి మనమో చెప్పుకోవాలి.సాహిత్యం లో అభిరుచి వున్న మనం అన్నమాట.మనకి సాహిత్యం మీద ప్రేమ వుందని తెలిస్తే చాలు ఆయన మనం అడిగిన పుస్తకం తన దగ్గర లేకపోయినా వెతికి తెప్పించి ఇస్తారు.(అందరికీ అని చెప్పలేను నాకయితే ఇస్తారు) .అప్పుడప్పుడూ నవోదయకి వెళ్ళి ఆయనతో పదినిమిషాలు కూర్చుని కొంత సాహితీ సౌరభాన్ని ఒంటబట్టించుకుని రావడం కూడా ఆరోగ్యసూత్రాల్లో ఒకటి.అట్లా మొన్న నవోదయకి వెళ్ళినప్పుడు నాకెదురుగా షెల్ఫ్ లో శతపత్రసుందరి కనిపించింది.
విజయవాడ ని సంపన్నం చేసిన వ్యక్తుల్లో రజనీ గారు ముందుంటారు.ఆ పుస్తకం రాగానే కొనుక్కుని పోగొట్టుకున్న నాకు తీర్ధంలో తప్పిపోయిన తల్లి కనపడ్డట్లయింది..ఫార్మెటివ్ యియర్స్ ని తెలుగులో వ్యక్తిత్వం వికసిస్తున్న రోజులు అని పిలుచుకున్నామనుకోండి శతపత్రసుందరి ముఖచిత్రంగా వున్న రజనీ గార్ని చూస్తే నాకు నా ఫార్మెటివ్ యియర్స్ గుర్తొస్తాయి.సాహిత్యం మీద సంగీతం మీద ప్రేమ జనిస్తున్న రోజులు..లలిత సంగీతానికి ఆకాశవాణి పట్టం కట్టిన రోజులు.ఎన్నెన్ని లలిత గీతాలో!! అప్పుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని “వీనులవిందు”అని పిలవచ్చు.బాల మురళి,లత,గోపాలరత్నం,ఓలేటి గారు,వింజమూరి శివరామారావుగారు .శ్యామసుందరి ఇట్లా ఒక తారాతోరణమే అక్కడ.శ్యామసుందరి గారి గొంతు (ఆవిడ గాయని కాదు అనౌన్సర్ మాత్రమే.) కోసం ఆవిడ పాల్గొన్న రేడియో నాటకాలన్నీ వినడం ఒక కమ్మని జ్ఞాపకం అసలు విమర్శించడం తెలియని ఆ వయసులో ఇష్టపడ్డ వాళ్ళని చూడ్డానికి పడీపడీ వెళ్ళడం ఆటోగ్రాఫ్ లు తీసుకోడం .మొదటిసారి రేడియో స్టేషన్లో బాలమురళి ని చూసినప్పుడు మాశరీరాలు రోమాంచితం కావడం,కళ్ళల్లో నీళ్ళు తిరగడం నేనూ మా చెల్లీ ఎప్పుడూ మర్చిపోం.అట్లాగే నేను హైస్కూల్లో చదివేటప్పుడు మాకు చాల కొద్దికాలం ప్రయాగ కోడండరామ శాస్త్రిగారు తెలుగు చెప్పారు.తెలుగు పద్యాలమీద నాకప్పుడే ఇష్టం కలిగింది.ఆయన మాకు చెప్పిన నరకాసుర వధలో “పరు చూచున్ వరు చూచు నొంప నలరింప..’ అనేపద్యం ఇంకా జ్ఞాపకం వుంది.ఆ మేష్టారే మాస్కూలుకి శ్రీ శ్రీ ని పిలిచి మాట్లాడించారు. శ్రీ శ్రీ కి నేనప్పుడు కారంబంతిపూలూ రద్రజడాకులూ కలిపి చేసిన బుకే ఇవ్వడం కూడా ఇలాంటి అనుభవమే అప్పుడూ అలాగే కళ్ళనీళ్ళొచ్చాయి.ఆ చిన్ననాటి యుఫోరియా అనుభవం ఇప్పుడింక రాదు.లలిత సంగీతం గురించి రజనీ గార్ని గురించి చెబుతూ పక్క దారి మళ్ళాను.ఎప్పుడూ అంతే ఆరోజుల్లో కాలేజీలో ఎప్పుడు లలిత సంగీతం పోటీలయినా “చిన్నదోయీ నా హృదయ నావ” అనే పాట “స్వప్న జగతిలో ఛాయా వీణ” అనేపాట ఎక్కువ వినపడేవి “నింగికి నేలకు వంగిన వంతెనగా “అనే ఇంధ్రధనస్సు పాట.అట్లా గే నా క్లాస్మేట్ రంగనాయకి అని వుండేది .ఆ అమ్మాయి “పసిడి మెరుంగుల తళతళలు “ అనేపాట ఎక్కడ పాడినా ప్రైజ్ వచ్చేది. ఇవ్వన్నీ రజనీ గారివే అని నాకు తరువాత తెలిసి ఆయన్ని చూడ్డానికి విజయవాడ రేడియో స్టే షన్ కి పోయాను.సీతా అనసూయా పాడిన “జాబిల్లి వస్తున్నాడు..’అనే పాటకూడా ఆయనదే.
ఇవ్వన్నీ మళ్ళీ శతపత్ర సుందరిలో చూసుకుని కొంత వెనక్కి నడిచి జీవనోత్సాహాన్ని పోగేసుకొచ్చినట్లైంది. రజని గారివి కాని పాటలు కూడా చాలా వచ్చేవి..తెల్లవారగానే విజయవాడ భక్తి రంజని ..అందులో బాల మురళి ఏమి చేతురా లింగా , శ్రీకంఠుడు నాతండ్రి ,గోపాలరత్నం ఉదయిస్తు భానుడూ ఉల్లిపూవూ చాయా ..నాకు చిన్నప్పటినించీ భక్తి లేదు..అయినా భక్తి రంజని వినడం ఇష్టం గా వుండేది..కొన్ని మంచి లలిత గీతాలు .”మన ప్రేమ”,”నువ్వూ నేనూ కలసి పూవులో తావిలా” ’అమ్మదొంగా నిన్ను చూడకుంటె.నాకు బెంగా ’ విశ్వనాథ సత్యనారయణ గారుకూడా ఒక మంచి లలితగీతం వ్రాసారు తెలుసా? “కన్నె కాటుక కళ్ళు చిన్ని నాధుని చూసి “ అని!! బావుండేది ఆపాట.మల్లాది అన్నపూర్ణ,వైదేహి,వింజమూరిలక్ష్మి,వసంత, గోవిందాచార్యులు(గోపాలరత్నం సోదరుడు) చిత్తరంజన్ వీరంతా ఎన్నో మంచి లలిత గీతాలు అధ్భుతంగా పాడేవారు.బాలసరస్వతి” నడిరేయి దాటింది తెలవారిపోయింది ఇకనైన ఇలు చేరవా ఓ ప్రియా” అనేపాట(ఇది ఆరుద్ర దనుకుంటా) ....ఇంక ఎంకిపాటల సంగతి చెప్పేదేముంది? పాటొచ్చిందంటే చాలు రేడీయో ముందుకు పరుగే...ఒక్కొక్క సారి వెనక్కి చేసే ప్రయాణాలు అప్పుడప్పుడూ ఏర్పడే ఖాళీలను సంగీత మాధురులతో పూడ్చే శక్తి పూరకాలు. పంద్రాగష్టు పాటలెన్నో ..మోయింపు జయభేరీ .నమో మంగళశ్రీ మహామాతృభూమే,జయజయ జయ ప్రియభారతజననీ..సరోజినీనాయుడు మీద ఘంటసాల పాడిన పద్యాలు...ఇవ్వాళ పొద్దున మా విజయవాడ ఆకాశవాణి మళ్ళీ ఈ పాటలన్నీ ప్రసారం చేసింది...ఎట్లా అయినా మా రేడియో స్టేషనే వేరు..