And when old words die out on the tongue, New melodies break forth from the heart, And when the old tracks are lost, New country is revealed with its wonders ...... (Githanjali)
Friday, January 06, 2012
Monday, November 07, 2011
అబ్బూరి ఛాయాదేవి
పంథొమ్మిది వందల అరవై ఢెభ్భై దశకాల లో వచ్చిన “ప్రయాణం” సుఖాంతం” అనే రెండు కథలు , పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి...” ప్రయాణం” కథ ఒక గంభీరమైన సమస్యను తీసుకుని ఎలాంటి మెలోడ్రామా లేకుండా అండర్ టోన్ లో వ్రాసిన కథ.అలాగే సుఖాంతం కూడా .ఈ కథ నెమ్మదిగా నడుస్తూనే చివరికి పాఠకులకి ఒక షాక్ ఇస్తుంది. వస్తువు ఎంత గంభీరమైనదైనా పాఠకులను చుట్టూ కూర్చోబెట్టుకుని, కథ చెప్పినట్లే వుంటుంది కానీ చదువుకోడానికి వ్రాసినట్టు వుండకపోవడం కూడా ఆ కథలు జ్ఞాపకం వుండిపోవడానికొక కారణం కావచ్చు.అదే అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేకత.ఇటీవల ఆమె వ్రాసిన “ఆఖరికి అయిదు నక్షత్రాలు”కూడా జరిగిన కథంతా ఒక ప్రేక్షకురాలిలా వ్యాఖ్యాన రహితంగా చెబుతారు.చివరికి ఆమె చేసిన ఒక తాత్వికమైన వ్యాఖ్య మినహాయించి....ఈ కథ ఒక మంచికథగా నిలిచిపోవడానికి వస్తు గాంభీర్యంతో పాటు ఆమె శైలిలోని నిరాడంబరత, చాలా సున్నితమైన వ్యంగ్యమూ కూడా కారణాలే. ఛాయాదేవి గారి కథలు ఎక్కువ ఉత్తమ పురుషలో వుండడం వలన అవి పాఠకులకి మరింత సన్నిహితంగా రాగలిగాయేమో కూడా!
1933 లో జన్మించిన ఛాయాదేవి 1954 లో తొలి కథ”విమర్శకులు” వ్రాసినప్పటినుంచీ ఆమె కథలన్నీ స్త్రీల జీవితాల చుట్టూ నడిచినవే.అంతకు ముందు ఆమె నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో వ్రాసిన నాటిక “పెంపకం” 1952 లో నిజాం కాలేజి పత్రికలో వ్రాసిన “ అనుబంధం” అనే కథ కూడా ఆడపిల్లల్ని స్వేఛ్ఛ ఇవ్వకుండా పెంచడాన్ని గురించే వ్రాసారు .బాల్యమంతా కూడా ఒక సాంప్రదాయపు కట్టడి లో గడపడం కూడా స్వేఛ్ఛ విలువ తెలయడానికి దానికోసం పరితపించడానికి కారణమౌతుంది. అందుకే ఆమె మొదటినించీ ఒక ఆడపిల్లగా గృహిణిగా ఉద్యోగినిగా ,తల్లిగా స్త్రీల జీవితాలచుట్టూ వుండే పరిధులనూ పరిమితులనూ తన కథల్లో చిత్రించారు.స్త్రీవాదం అనే పదం సాహిత్యంలో వినపడకముందే స్త్రీల పరాధీనత గురించే ఎక్కువ వ్రాశారు.రొమాంటిక్ నవల విజృంభణ కాలంలోకూడా నవల వైపు చాపల్యం చూపక తను గమనించిన విషయాలను ,వాటిపట్ల తన అవగాహననూ తనదైన తాత్విక దృక్పథంతో కథలు గా వ్రాసి కథా రచయిత్రిగా వుండిపోయారు.తాను మానవతా వాదిగా కన్న స్త్రీ వాదినని చెప్పుకోడానికే ఇష్టపడతానన్న ఛాయాదేవి కథలన్నీ దాదాపు స్త్రీల జీవితాలను తడిమినవే. ఆమె చెప్పినట్లు అవి “తీవ్రంగానో ,నిష్టుర పూర్వకంగానో కాక,ఆర్థ్రత కలిగించే టట్లూ హాస్యస్ఫూరకంగానూ వ్యంగ్య పూర్వకంగానూ” వుంటాయి.అనేక కట్టడుల మధ్య పెరిగిన ఆడపిల్ల ,భర్త కనుసన్నలలో నడవవలసిన భార్య,భర్తే కాక పిల్లల అధీనతలో కూడా వుండవలసిన తల్లీ వరకూ వివిధ దశలలో స్త్రీల జీవితాలను గురించి వ్రాసారు
ఛాయాదేవి కథా రచన ప్రారంభం నాటికి ,లేదా ఆమె చదవుకుంటున్న కాలంనాటికి, ఆడపిల్లల్లో చదువుపట్ల, వైవాహిక జీవితం పట్ల ,జీవన సహచరుని ఎంపిక పట్ల కొన్ని స్వతంత్రమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.తమ తల్లుల అధీనత,అస్వతంత్రత ,ఇంట్లో అన్నిటికీ తండ్రుల పెత్తనం, తల్లులకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం గమనిస్తూ పెరిగిన ఆనాటి అమ్మాయిలు, ఇందుకు భిన్నంగా జీవించాలని ఆశపడడం సహజం.అయితే అప్పటి సంప్రదాయ కుటుంబాలలో ఆ ఆశల సాకారానికి అవకాశాలు తక్కువ కనుక, వాళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహాలకే తలవంచి అందులోనే రాజీపడి బ్రతకవలసి వచ్చేది.ఇలాంటి అమ్మాయిలకథే “విమర్శకులు”. ఆడపిల్లలను కుండీల్లో మర్రిచెట్టుల వలె మరిగుజ్జుచేసి పెంచడాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిన “బోన్సాయి బ్రతుకు”అనే కథ 74 లో వ్రాశారు.స్వేఛ్చగా పెరిగిన పెద్ద చెట్టు జడివానలోనూ పెనుగాలిలోనూ పదిమందికి నీడనిస్తుంది అదే.కుండీలో కుదించి పెంచిన మొక్కని జడివాననుంచీ మనమే కాపాడి లోపల పెట్టాలి. ఈ కథ అనేక భాషా సంకలనాలలో చోటు చేసుకుంది..తండ్రులంటే విపరీతమైన భయంతో పెరిగిన ఆడపిల్లలు ఆ తండ్రి స్పర్శ ఎరుగరు. పొరపాటున ముట్టుకోవలసి వచ్చినా జంకుతారు.తండ్రికి వృద్ధాప్యం వచ్చినప్పడు మాత్రమే ఆ స్పర్శను అనుభవించగలగడాన్నీ ,ఆ స్పర్శకోసం తపించడాన్నీ హృద్యంగా చెప్పిన కథ “స్పర్శ”..పిల్లలకి శారీరక స్పర్శే కాదు ఆత్మిక స్పర్శకూడా ఎంతో అవసరం.తండ్రీ కూతుళ్ళ మధ్య ఈ ఆత్మిక స్పర్శని తాత్వికత రంగరించి, అంతే హృద్యంగా చెప్పిన పెద్దకథ (నవలా?)” మృత్యుంజయ.”..ఛాయాదేవికీ ఆమె తండ్రికీ మధ్య నడిచిన ఉత్తరాలకు కథారూపం. ఈ పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది.
జీవనసహచరుని ఎన్నిక గురించి హాస్య ప్రధానంగా వ్రాసిన కథ “ఎవర్ని చేసుకోను” .. “నిర్ణయం.” “స్థాన మహిమ” అనే కథల్లోకూడా ఈ విషయాన్నే ప్రస్తావించారు.సహచరుణ్ణి ఎంచుకోడం అనే విషయంలో కొంత ప్రాక్టికల్ గానూ, కొంత సాహసం తోనూ ,కొంత భావ సారూప్యత తోనూ వుండాలి అయినప్పటికీ ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నా “ఎవర్ని చేసుకున్నా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల మనస్థైర్యాన్ని అలవర్చు కోవాలి .అంతేగాని మన ఊహల ప్రకారమే జీవితం సాగాలంటే ఎల్లప్పుడూ సాగదు.దేనికైనా సిద్ధపడి వుండాలి. మానసికంగా..” అంటారు ఛాయాదేవి “స్థాన మహిమ” కథలో మాధవి ప్యారిస్ లో వున్నన్నాళ్ళూ మురళితో సన్నిహితంగా మెసిలి, ఇండియా రాగానే అతన్ని పెళ్ళి చేసుకోడానికి తిరస్కరిస్తుంది.దానికి కారణం అతని కుటుంబసభ్యుల అలవాట్లూ అతని కుటుంబమూ తనకి నచ్చలేదంటుంది.తను రిసెర్చి చేసుకోవాలంటుంది.ఆమె తీసుకున్న ప్రాక్టికల్ నిర్ణయాన్నిరచయిత్రి సమర్థిస్తుంది.ఈ నాటి చదువుకున్న స్త్రీల ఆలోచనలకి ప్రాజ్ఞతకూ మాధవి ఒక ఉదాహరణ, .ప్రేమ అనేది సాహచర్యంలోనూ సహజీవనంలోనూ వికసించి పెంపొందాలంటారు ఛాయాదేవి.
ఎంత చదువుకున్నా,ఎన్ని అభిరుచులున్నా కోరికలున్నా అవి భర్త అభిరుచులతోనూ ఆయన కోరికలతోనూ కలిసినప్పుడే నెరవేరతాయి .లేకపోతే ఆమె జీవితం అతని చుట్టూ తిరిగే ఉపగ్రహం లాంటిదే నని చెప్పే కథ “ఉపగ్రహం 1”
ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల పైన కూడా “సటిల్ డిక్టేటర్ షిప్” వుంటుందని దాన్ని సమ్మతించకపోయినా సర్దుకుపోవడం తప్పదనీ అర్థంచేయింస్తుంది” శ్రీమతి ఉద్యోగిని” అనే కథ.తను చేసే ఉద్యోగానికి తనెంత అంకిత భావంతో పనిచెయ్యాలన్నా పురుషుల వలె స్త్రీలు అదనపు సమయాన్నీ ఆఫీసుల్లో గడపలేరు.ఆఫీస్ పని ఇంటికి తెచ్చుకుని చేసుకోలేరు.అలాగే బంధుమిత్రుల రాకపోకలు మర్యాదలు కూడా వాళ్ల ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి..ప్రశ్నోత్తరాల రూపంలో నడచిన ఈ కథలో హాస్య స్ఫూర్తి వున్నా అంతర్లీనంగా ఈ విషయాలన్నీ స్పృశించారు ఛాయాదేవి. ఉద్యోగినులైన శ్రీమతులగురించి పరిశోధనకు వచ్చిన అమ్మాయి వేసిన ప్రశ్నలకు ఇంట్లో తన భర్త పెత్తనాన్నీ ప్రాబల్యాన్నీ కొంత హాస్యమూ కొంత లౌక్యమూ కలబోసి సమాధానాలిస్తుంది.“వచ్చే జన్మలో కూడా ఈయనే మీభర్తగా ఎంచుకుంటారా?” అనే ప్రశ్నకు అవునంటూ లౌక్యంగా చెప్పినా తనలోపల “అట్లా అనడం భారత నారీ ధర్మం కదా” అనుకుంటుంది ఆ శ్రీమతి ఉద్యోగిని. ...
భార్యా భర్తలిద్దరూ సమానమైన మేధోవంతులైనా ఒక్కొక్కసారి భార్య అతని నీడనే అనామకంగా వుండిపోతుంది . ఆమె అతనికిచ్చిన ప్రోత్సాహమూ సహకారమూ కూడా గుర్తింపులేకుండా పోతాయనేదానికి ఉదాహరణ “సతి” “ ఆయన కీర్తి వెనక” కథలు.సాహితీ సతి అయిపోయిన ఒక రచయిత్రి కథ.,భర్తతో పాటు తనూ స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొనక సంసారాన్నీ పిల్లలనీ చూసుకుంటూ అతని కీర్తికి పరోక్షంగా కొంగుపట్టిన ఆమె కనీసం అతనితో పాటు ఫోటో దిగడానికి కూడా పనికిరాక పోయింది.తనూ ఉద్యమంలో పాల్గొని వుంటే ఎలా వుండేది అనుకుంటుంది .”.మొగ్గు“కథలో “నేను” భర్తకీ కొడుక్కీ మధ్య నలిగిపోతూ ఆమె మనసు కొడుకు పక్షమే వున్నా “వాడో నేనో తేల్చుకో” అని భర్త మూర్ఖంగా అన్నప్పుడు ఆమే ఒక్క క్షణం ఆలోచించింది.భర్తయినా కొడుకైనా ఇద్దరూ పురుషులే.ఏ ఒకరి దగ్గరున్నా తనకి అధీనతే.తనూ ఉద్యోగస్తురాలే.ఎవరిదగ్గరా ఉండక్కర్లేదు.కొడుక్కి తన అవసరం లేదు చూసుకోడానికి అతనెంచుకున్న సహచరి వస్తోంది.ఇక తను లేకుండా గడవనిది భర్తకే..అని అతనిమీద సానుభూతితో “పోరా పిచ్చి వెధవా!”అని కొడుకుని ముద్దుగా విసుక్కున్నట్టే ఒక తల్లిలా అతని వైపే మొగ్గింది.వయసులో భార్యలమీద పెత్తనం చేసిన భర్తలకి ముదిమలో భార్యలనే చేతికర్రలు చాలా అవసరం .అయినా బింకం.
పనిప్రదేశాలలో స్త్రీలపై చాపకింద నీరులా ప్రదర్శించే లైంగిక హింస,వివక్షా,అణచివేత లను “కర్త కర్మ క్రియ” కథలోనూ ,పై అధికారుల మనస్తత్వాన్ని “మార్పు” కథలోనూ సున్నితంగా చెప్పారు.
ఛాయాదేవి ప్రసిద్ధ కథ “ప్రయాణం”.లో రమ యూనవర్శిటీ విద్యార్థిని. అక్కడ లెక్చరర్ గా వున్న మూర్తిని ప్రేమించింది.కానీ సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఆమె కుటుంబం అతనితో కులాంతరానికి సమ్మతించిందని ఆమెకు తెలుసు. ఈ లోగా ఆమెకు తల్లితండ్రులొక సంబంధం కుదిర్చారు.అతను అన్ని విధాలా అర్హుడని తేల్చారు.కానీ రమ తన అసమ్మతి తెలిపి హైదరాబాద్ నించీ విశాఖపట్నం లో తనింకా చదువుకుంటున్న యూనివర్శిటీకి బయలు దేరింది. తన జీవితానికి సంబంధించిన ముఖ్యాంశం పట్ల రాజీ పడే ప్రసక్తి లేదనీ తనని తను గౌరవించుకోవడం అంటే పెద్దల్ని ధిక్కరించినట్లు కాదనీ నమ్మిన వ్యక్తి ఆమె.హైదరాబాద్ నించీ విశాఖపట్నం దారిలో అనుకోకుండా రాజమండ్రిలో కలిసిన ఆమె స్నేహితురాలు సుధ ఆమెను తనతో ఒక రోజు ఉండిపొమ్మని బలవంతపెడితే అక్కడ దిగిపోయింది.కానీ అదేరోజు రాత్రి సుధ భర్త కక్కూర్తికి బలైంది. అతనలాటివాడని తెలిసీ సుధ ఆమెను కాపాడలేక పోవడానికి కారణం.తన ప్రియ స్నేహితురాలిమీద అటువంటి అఘాయిత్యం చేయబోడనే వెర్రి నమ్మకం. అప్పుడు కూడా తన భర్తకి ఇటువంటి అలవాట్లు వున్నప్పటిక తనంటే ప్రేమ అని చెబుతుంది.సుధ. ఇటువంటి చాలా కథల్లోకి మల్లె జరిగిన విషయానికి రోతపడుతూ కూర్చుని ఏడ్చి మొత్తుకని స్నేహితురాలిని నిందించి ఆత్మహత్యా ప్రయత్నం చేసి తనను తను కించ పరుచుకోదు రమ. ఆ రోతనంతా తన మనసులోనే భరిస్తూ విశాఖపట్నం వచ్చింది. అయితే జరిగిన దాంట్లో తన తప్పులేదని తెలిసినా తను అపరిశుద్ధం అయిపోయానని భావిస్తుంది.కనుక ఈ విషయం దాచి మూర్తిని పెళ్ళి చేసుకోలేనని నిజాయితీగా అతనికి ఈ విషయం చెప్పేసింది .అది విన్న అతను “నీళ్ల కుండీలో పడ్డ ఎలుక పిల్ల గట్టుమీదకు రాలేక లోపల నీళ్లలోకి పోలేక గిలగిల్లాడినట్లు బాధ పడ్డాడు. అతని మానసిక బలహీనత చూశాక ఆమెకి మరింత విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకుని కలకత్తాలో రామకృష్ణ మిషన్లో చేరిపోవాలనుకున్నప్పుడు,ఆమెకు సంభవించినది కేవలమొక ప్రమాదం మాత్రమే ననీ దానికీ పరిశుద్ధతకీ సంబంధమే లేదనీ ,దాన్ని అక్కడికి మర్చిపోయి తన విలువైన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ తనకి సహచరిగా వుండమనీ ,తనెవర్నైతే తిరస్కరించి వచ్చిందో ఆ శేఖరమే అర్థం చేయిస్తాడు..కొన్ని శతాబ్దాలుగా మనసులో ఇంకిపోయిన పరిశుద్ధత,కన్యాత్వం వంటి భావజాలం నించీ బయటపడలేనిది ఒక యువకుడు. వీటికి అతీతంగా ఆలోచించగలిగిన మరొక యువకుడినీ ,అతనిలో తనను గౌరవించగల సహచరుణ్ణి గుర్తించిన రమనూ రాబోయే కాలానికి కావలిసిన వ్యక్తులుగా పాఠకులు గుర్తించారు .అందుకే ఈ కథ కు మంచి పాఠకాదరణ లభించింది.
ఛాయాదేవి మరొక ప్రసిద్ధ కథ సుఖాంతం. పిల్లలకు చదువులూ పరీక్షలూ కంటినిండా నిద్ర పోనివ్వవు.పెరిగి పెద్దైనాక స్త్రీలకు సంసారమూ పిల్లల పెంపకం వాళ్ల చదువులూ వగైరాలతో నిద్ర వుండదు.పోనీ అన్నీ బాధ్యతలూ నెరవేరాకైనా అనుకున్నపుఉడు నిద్ర పోడానికుంటుందా? ఎన్నో సమస్యలు..ఇంటివి.దేశానివి.పైగా పోస్ట్ మ్యాన్ కీ,ప్రతి పిలిచేగంటకీ టెలిఫోన్ కీ వచ్చే పోయే వారికీ సమాధానాలు చెప్పాలి.ఒక వయస్సొచ్చే సరికి నిద్ర అసలు రాదు మాత్రలకి తప్ప.అప్పుడవి ఒకటీ రెండూ చాలవు. మంచి నిద్రకావాలంటే గుప్పెడే సరి అనుకుందావిడ,ఎందుకైనా మంచిదని ఒక చీటీ కూడా వ్రాసి పెట్టింది.ఇది ఆత్మహత్యా ప్రయత్నం కాదు.కేవలం నిద్ర కోసమే.అని..ఈ కథ చదివి “ఆమె ఎవరైతెనేం కాసేపు సుఖంగా నిద్ర పోనివ్వండి.కదిలించకండి” అనలేకపోతే మనం గుండేలేన మనుషులం అన్నమాట.కేవలం నిద్రేకాదు స్త్రీలకు దేనికీ వారి స్వంత సమయం అంటూ వుండదు.
ఇటీవలకాలంలో ఆమె వ్రాసిన “ఆఖరికి అయిదు నక్షత్రాలు” కార్పొరేట్ వైద్య వ్యాపారాన్ని కళ్ళారా చూసి ఆవేదనతో ఆర్తితో వ్రాసిన కథ.ఇందులో ఆమె వాడిన మాటలు ,షేర్ హోల్డర్స్,రక్తసంబంధం( తడవకీ రక్తం తెమ్మనడం) బిల్లు సంబంధం( ఎప్పటికప్పుడు వేలకొద్దీ బిల్లులు కట్టమనడం) చివరికి ఆమె చేసిన వ్యాఖ్య “ మరణాన్ని కొనుక్కోడానికి అంత దూరం అంత ప్రయాసపడి ఎవరూ వెళ్లక్కర్లెదు మనం పిలిచినా పిలవక పోయినా రావలసిన సమయంలో అదే వస్తుందని అర్థమైంది.” అన్ని సదుపాయాలూ వున్న అయిదు నక్షత్రాల హాస్పిటల్లో కనీసం శవాన్ని పెట్టడానికి కూడా సరైన సదుపాయం లేక ఐస్ గడ్డచుట్టు ఉప్పుచల్లి ఆ శరీరాన్ని అప్పగించడానికి బిల్లు అడిగిన తెంపరితనం ...”.ఏమీలేదు యాంజయో గ్రాఫే” అని నవ్వుకుంటూ వెళ్ళిన వ్యక్తి మరణించాడన్న వార్త చెప్పడానిక్కూడా ఆలస్యం చేసిన విష వ్యాపార సంస్కృతి.ఇప్పుడు పాకుతోంది డేశమంతా..ప్రయివెటైజేషన్ విషసంస్కృతికి పుట్టిన వికృత శిశువుల్లా తయారయ్యాయి కొన్ని వైద్య వ్యాపార కేంద్రాలు
వృద్ధాప్యంలో స్త్రీలను గురించి వ్రాసిన కథలు “ఉడ్ రోజ్” “తన మార్గం” “పరిధి దాటిన వేళ” . బోన్సాయి బ్రతుకు వలె “ఉడ్ రోజ్” కూడా ప్రతీకాత్మకమైన కథ. ఇకబెనా పుష్పాలంకరణలో ఉడ్ రోజ్ ను వృద్ధాప్యానికి చిహ్నంగా ఉపయోగిస్తారట.తన ఇంట్లో గుబురుగా అల్లుకుపోయి పచ్చని పువ్వులతో నిండుగా వుండి,వాటిలోనించీ ఉడ్ రోజ్ లు రాబోయే కాలానికి తీగెని మొదలంటా పీకి పెడతాడు ఆమె కొడుకు.ఇంట్లో వెలుగుకు అవరోధంగా వుందని. వృద్ధాప్యంలో విశ్రాంతితో విసిగిపోయిన తల్లి “ మనిషికీ మనిషికి మధ్య మమత ఆ తీగంత దట్టంగా పెరగకూడదేమో అలా పెరిగితే పిల్లలైతే పీకి పారెయ్యగలరు.తల్లికి అల్లుకు పోవడమే తెలుసు”అనుకుంటుంది కొంత తాత్వికంగా .అయితే “తనమార్గం” కథలో వర్ధనమ్మ వృద్దాప్యంలో ఎవరి పంచనా ఉండకుండా తన జీవన మార్గాన్న తానే ఎంచుకని ధైర్యంగా నిలబడింది,అలా నిలబడే అవకాశం ఆమెకు భర్త వ్రాసి ఇచ్చిన ఇల్లు అనే ఆర్థిక వనరు వల్ల సాధ్యమైంది..కొడుకుల విమర్శలకు తట్టుకుని నిలబడగలిగింది.”పరిధి దాటిన వేళ” కథలో కథకురాలు ఎన్నడూ లేనిది స్వయంగా మందులు కొనుక్కోడానికి బజారుకు వెళ్ళి దారి తప్పిపోయింది.చివరికెలాగో చాలాసేపటికి ఇల్లు చేరింది.ఈలోగా ఇంట్లో వాళ్ల కంగారు,నిష్టురాలు.ఎందుకెళ్ళావని గుచ్చి గచ్చి అడగడాలు, కూతురూ కొడుకూ కోడలు ఎవరికి తోచింది వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. “ఇంట్లో అలా ఒక్కణ్ణీ నన్నొదిలేసి అలా వెళ్ళిపోయావేమిటీ?” అంటాడు భర్త.
“ఒంటరితనం అంటే తనకున్న భయాన్నీ,ఇంట్లో పనులన్నింటికీ నామీద ఆ ధార పడుతున్నారన్న నిజాన్నీ తన “అధికారం” ముసుగు కింద దాచి “ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పనులు చెయ్యకు”అంటూ నిశ్చింతగా పడుకున్నాడాయన..అనుకోకుండా వీళ్లందరినీ కాసేపు ఓ ఆట ఆడించగలిగానని చాలాసేపు నిద్రపట్టలేదు నాకు’అని కథకు ఓ చక్కని మెరుపు ముగింపిచ్చారు.
“మూడునాళ్ల ముచ్చట”,ఎవరి ఏడుపు వాళ్లది” నలుగురికొసం “ బ్రహ్మాస్త్రం” అనే కథల్లో చాయా దేవి నిశిత పరిశలన వాస్తవికతా దృష్టి, హాస్యమూ కలగలిసి వుంటాయి.
ఛాయాదేవి జీవన తాత్వికత జిడ్డుకృష్ణమూర్తిగారి తాత్వికతే.
అబ్బూరి ఛాయాదేవి కథలు ,తనమార్గం అనే కథా సంపుటాలే కాక, ఆమె “చైనాలో ఛాయాచిత్రాలు “అనే , యాత్రా కథనం ,అపరిచత లేఖ ,ఇతర కథలు ,,మృత్యుంజయ (ఒక తండ్రి కథ), వరద స్మృతి,(సంకలనం), వ్యాసచిత్రాలు బొమ్మలు చెయ్యడం,”స్త్రీల జీవితాలు,జిడ్డు కృష్ణమూర్తి,” మనసమస్యలు కృష్ణాజీ సమాధానాలు,,మన జీవి తాలు-జిడ్డూ కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, మొదలైన పుస్తకాలు ప్రచురించారు. 1954 లోనే “కవిత” పత్రిక కు సంపాదకత్వం వహించారు .తరువాత ఆంధ్ర యుతీమండలి కి “వనిత”అనే పత్రికకు సంపాదకురాలిగా వున్నారు .1989 -90 లలో ఉదయం పత్రికలోమహిళా శిర్షిక నిర్వహించారు. ఇటివలి వరకూ స్త్రీవాద పత్రిక భూమికలో కాలమ్ వ్రాశారు.ఇటీవలనే ఆమె జీవన సహచరుడు వరదరాజేశ్వర్రరావుగారి హాస్యోక్తులను”వరదోక్తులు”పేరున కార్టూన్లతో సహా సంకలనం చేసి ప్రచురించారు.ప్రస్తుతం తన జీవిత,సాహితీ జీవిత ఛాయాచిత్రమాలిక రూపొందిస్తున్నారు. ఆమె కథల ఇంగ్లిష్ అనువాదాల సంకలనం కూడా రాబోతున్నది.
పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన ఛాయా దేవి 1953 లో రచయిత, కవి అబ్బూరి వరద రాజేస్వర రావు గారిని వివాహం చేసుకున్నారు.తరువాత లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా చేసారు..న్యూఢిల్లీ లో కొంతకాలం ( (59-61)యునైటెడ్ సర్విస్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లో లైబ్రేరయన్ గానూ తరువాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్ నేషనల్ స్టడీస్ లో డిప్యూటీ లైబేయన్ గా (72 -82) పనిచేసారు.అప్పడే ఉద్యోగ రీత్యా డాక్యుమెంటేషన్ కోసం ఒక సంవత్సరం పాటు ఫ్రాన్స్ లో( 1976-77)వున్నారు తరువాత స్వచ్చంద పదవీ విరమణ చేసి(1982) హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమే కాక సుశీలా నారాయణ రెడ్డి అవార్డు,కళాసాగర్ సాహితీ పురస్కారం,రంగవల్లి పురస్కారం తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి పురస్కారం, కలైంజర్ ఎమ్ కరుణానిధి పోర్కళి పురస్కారం తో పాటు ఇటీవలే అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళై పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
Friday, September 30, 2011
శివరాజు సుబ్బలక్ష్మి
స్వాతంత్య్రానికి పూర్వమూ ,తరువాతి తొలి దినాలలోనూ ఆంధ్ర దేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబా
లలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి.ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే వుంటాయవి. 1925 లో జన్మించి.న సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రయివేటుగా మెట్రిక్ వరకూ చదివారు. ఇంట్లో స్త్రీల సంభాషణల ద్వారా భాష లోని సొబగులు అర్థం చేసుకోవచ్చని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్లు ,సుబ్బలక్ష్మి గారి కథల్లో ఎక్కడా సంస్కృత ఛాయలు కనపడవు,పాఠకులని కూచోబెట్టి అచ్చమైన తెలుగులో కథలు చెబుతారామె
దాదాపు ఆమె అరవై సంవత్సరాల కాలంలో వ్రాసిన ఇరవై ఎనిమిది కథలతో “మనో వ్యాధికి మందుంది”అనే కథా సంకలనం 1998 లో బుచ్చిబాబు స్మారక కథా కదంబం శీర్షికన వేదగిరి కమ్యూని కేషన్స్ ప్రచురించింది..
ఈ కథల్లో చాలావరకూ సుబ్బలక్ష్మి గారు పెరిగే వయసునాటి ఆడపిల్లల జీవితాన్ని.చిత్రించినవే.చాలామంది ఆడపిల్లలకు చదవులు లేవు.వున్నా చాలా తక్కువ .చిన్నవయసులో వివాహాలు.”పెద్దవాళ్లలో చేరగానే”( పెద్దమనిషి కాగానే) అత్తగారింటికి పంపడం. భర్తలు చదువుకుంటూనో ఉద్యోగాలు చేస్తూనో పట్నాలలో వుంటే ఈ పిల్లలు అత్తగారింటో వుండి చాకిరి చేస్తూ మాటలు పడుతూ కళ్ళు తుడుచుకుంటూ భర్త ఎప్పుడు తీసుకు వెడతాడా అని ఏళ్లకొద్దీ ఎదురు చూస్తూ వుండాలి.ఒక పట్టాన కొడుకునీ కోడల్నీ కలవనివ్వరు అత్తలు.ఆడబడుచులు.వాళ్లకి కొత్త పిల్లమీద ఎప్పుడూ నిఘా.ఒక అహేతుకమైన అసూయ.తప్పులు పట్టడం పుట్టింటివారిని దెప్పడం.ఏదో ఒకటి అని ఏడిపించడం ..పెళ్ళి చేసి పంపడం వరకే తమ బాధ్యత.ఆ పైన పిల్ల అదృష్టం అనుకుని ఆమె కర్మకి ఆమెని ఒదిలిపెట్టే తల్లితండ్రులు.ఏ మాత్రం చనువూ ప్రేమా లేని చోట భర్త తనని ఎప్పుడు పట్నం తీసుకు వెడతాడా అని ఏళ్ళూ పూళ్ళూ ఎదురు చూపు...తమ్ముళ్ళ చదువులు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఇన్ని బాధ్యతలను మోయాల్సిన ఆ భర్త గారికి భార్య మనసులోకి చూసే తీరుబడీ ధైర్యమూ వుండవు.తన భార్యను తను ఉండే చోటికి పంపమని తల్లి తండ్రులను అడగడానకి కూడా బెరుకూ భయమూ ...అత్తగారింటి “సౌడభ్యం” అలా వుంటే ఇక పుట్టింట్లోనూ అనేక కుటుంబరాజకీయాలు.. పిల్లకూ పిల్లకూ మధ్య తేడా చూపించే తల్లులు,,ఒక్కొక్క చోట సవతి తల్లుల ధాష్టీకం ,అసమర్థులైన తండ్రులు ,వయసెక్కువైన వాడితో రెండో పెళ్ళికి ముడిపెట్టి చేతులు దులిపేసుకోడాలు, కాటుక కన్నీళ్ళతో నల్లపడిపోయిన గుంటల మధ్య ఉబ్బిపోయిన కళ్ళు, ఆత్మ హత్యలు ,పిచ్చాసుపత్రి కటకటాలు వెరసి చదువులేని, పుట్టింటి అండ లేని, చొరవలేని, ధైర్యం లేని అప్పటి ఆడపిల్ల జీవితం. అయతే ఈ నిరాశా మయ వాతావరణంలో కూడా అక్కడక్కడా తమ భార్యల్ని కాపాడుకున్న భర్తలున్నారు. అతను కాపాడి అక్కున చేర్చుకుంటే తప్ప ఎక్కడినించీ ఏ సహాయమూ లేదు వాళ్ళకి.
పెళ్ళంటే ఏమిటో తెలియని ప్రాయంలో పెళ్ళళ్ళు కుదిరిపోతాయి “.కాపురం” అనే కథలో జానకి అనే అమ్మాయికి పెళ్ళి కుదిరిన పద్ధతి ఇలా వుంటుంది
ఇంకా చీకటి వుండగానే వాళ్లమ్మ నిద్రలేపింది. వాళ్ళ పిన్ని ఆ పిల్లకి ముస్తాబు చేసింది.ఎందుకో ఏమిటో ఎవరూ చెప్పలేదు. గజ్జల పట్టెడ పెట్టింది.వాళ్లక్కకి అత్తగారు పెట్టిన చంద్రహారం వేసింది అప్పుడు అక్కడున్న వాళ్లక్క అత్తగారు “దాన్ని కాస్తా ఊరేగించేవు జాగ్రత్త” అని వెటకరించింది. “వాళ్ళు” చూసుకోడం లాంఛనాలు మాట్లాడుకోవడం నాలుగు రోజుల వ్యవధిలో ముహూర్తం పెట్టడం, వైభవంగా పెళ్ళి జరిగిందని నలుగురూ చెప్పుకోడం మాత్రం తెలుసు ఆ పిల్లకి.ఈ జానకి ఆ ఇంటి పెద్దకోడలుగా వెళ్ళి చాకిరీ చేసి అవమానాలు పడి ఆఖరికి పుస్తెల గొలుసుకూడా ఉమ్మడి కుటుంబానికి ధారపోసి,ఏడ్చుకుంటూ స్నేహితురాలింటికి వెడితే అప్పటికి భర్తగారికి ఆమె మీద ప్రేమ పుట్టుకొచ్చి వెతుక్కుంటూ వెళ్ళాడు.
“ మట్టిగోడల మధ్య గడ్డిపోచ” కథలో అక్క పెళ్ళినాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు పార్వతికి. ఆ వయసు పిల్ల దృష్టి తోనే అక్క పెళ్ళి వేడుకలనీ బావగార్నీ చూసింది. అక్క పెళ్ళి కాగానే ఆమె మామగారు, ఆ తరువాత కొన్నాళ్ళకి మరిదీ పోయారని అక్కని అత్తగారు ఈసడించింది. ఒక సారి పుట్టింటికి వచ్చిన అక్క చాలా చిక్కి పోయి వుంది.తిరిగి వెళ్ళేటప్పుడు” పార్వతికి ఇప్పుడే పెళ్ళి చెయ్యొద్దు నాన్నా దాన్ని చదివించండి” అని మరీ చెప్పి పోయింది..పార్వతి పెద్ద మనిషి అవగానే ఇంట్లో నిబంధనలు మొదలయ్యాయి ఇలా నడవకు ఇలా మాట్లాడకు ఇక్కడికి వెళ్ళకు అక్కడకు వెళ్లకు అని .అక్క చదివించమందే కానీ ఆమెనెవరూ స్కూల్ కి పంపలేదు కావ్యాలు చదివంచమన్నారు గానీ అదీ కొనసాగలేదు. పార్వతిని అత్త కొడుకు రామం బావకి ఇవ్వాలని బామ్మ అనకుందే కాని అతడు “కిరస్తానీ” అమ్మాయిని చేసేసుకున్నాడు.పార్వతి బాధపడింది “నాకేం చదువా? సంగీతమా? ఎలా చేసుకుంటాడు బావ?”అని సమాధానపడింది. అంతలోనే అక్క నూతిలో దూకేసింది. అక్క నూతిలో ఎందుకు దూకిందో పార్వతికి అర్థం కాలేదు. కొన్ని నెలలు గడిచాక ఒక రోజు చీకట్లో కొంతమంది పెద్దలు దిగబడ్డారు తండ్రీ బామ్మా ఏమిటో మాట్లాడుకున్నారు.తల్లి వచ్చి తనకి రహస్యంగా “నువ్వు ఒప్పుకోకు వాళ్ళు అడిగితే” అని చెప్పింది.వాళ్ళెవరూ పార్వతినేమీ అడగలేదు.అక్కభర్తతో పార్వతి పెళ్ళీ జరిగిపోయింది...పార్వతి ఆవూరికి కాపరానికి వచ్చింది.భర్తకి ఎవరో స్త్రీతో సంబంధం వుందని తెలిసింది.తనని పట్టించుకోనేలేకపోయినా అక్క చావుకు కారణమెదో అర్థమైనట్లు తోచింది.భర్త నిర్లక్ష్యం గమనించిన అత్తగారు ఆమెని ఆదరించడం మొదలు పెట్టింది.”ఇక ఈవిడ వెంటే నాబ్రతుకు ఇలా గడిచిపోవాల్సిందే” అనుకుంటుండగా అతనొక రోజు పార్వతి గదిలోకొచ్చాడు. మరునాడు ఆమెను చూసి నవ్వులు చిలకరించడం అత్తగారు చూసింది.ఆవిడకి ఒళ్ళుమండింది.కోడలి పైన ఆదరం తగ్గింది ..పార్వతికి అర్థమైంది.” మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం అక్కయ్య జీవితం.శూన్యంలో వెలిగించిన ప్రమిదలా ఎంతకాలం నిలవగలనో!!” అనుకుంది ఆ వూరిలాంటిదే ఆ ఇల్లు “దుప్పలూ ,పుంతలూ శిధిలాలూ,వాటిని చుట్టి మొండి గోడలు .అందులోనే తను జీవించాలి.గడ్డిపోచలా”. .అనుకుంది.”కాలం వేసిన ఎగుడు దిగుడు బండల పైన జీవితం సాగుతోంది” పార్వతికి.
శిల్పపరంగా కధన పరంగా వర్ణనల పరంగా సుబ్బలక్ష్మి గారి కథలన్నింటిలోకీ అగ్ర స్థానం లో వుండే కథ ఇది
“తెల్లవారింది” కథలో మల్లికాంబ,”మగతజీవి చివరి చూపు”లో కాంతమ్మ రెండో పెళ్లి కి కట్టబడ్డ వాళ్ళే అందులో మల్లికాంబ భర్త డబ్బుని లెక్క బెట్టి దాచి అప్పగించాలే కానీ, రూపాయి తనకి వాడుకోకూడదు.ఒక సారి చెయ్యని నేరానికి దెబ్బలు కూడా తింటుంది.కానీ ఒక సారి తన స్వంత తమ్ముడి చదువుకోసం భర్త డబ్బు దొంగలించి నేరభావంతో కుమిలిపోతుంది.రెండవ భార్యమీద మొదటి భార్య సంతానం ఈసడింఫూ అనుమానాలూ ,అవమానాలూ వాళ్ళ బంధువుల వెటకారాలు భరిస్తూ రోజులు గడుపుక పోయే వాళ్ళు కొందరైతే ,సవతి పిల్లలను నరక యాతనకు గురి చేసేవాళ్లు మరికొందరు.
“పోస్ట్ చెయ్యని ఉత్తరం” కథలో “ ఇందిర ఆ ఇంట్లో అడుగు పెట్టి పదేళ్ళు ఇట్టే తిరిగి పోయాయి. పెద్ద మార్పులు లేవు .అప్పుడప్పుడూ అత్తగారిమీద అలగడం,ఆడబిడ్దని కసరడం, అత్తగారు కూకలెయ్యడం,మరుదుల పుస్తకాలు తీసుకుని చదవడం,అట్టలు నలిగాయని ఫిర్యాదులు, పనిమనిషి నాగాలు ,పెరట్లో కళ్ళాపులు, పక్కింటి ముచ్చట్లు చెప్పుకోడం , దడి అవతల గుడిసెల్లో తగాదాలు విని నవ్వుకోడం” ఇది ఆమె దిన చర్య.పదేళ్ళుగా ఆమె భర్త పట్నంలో వుండి చదువూ ఉద్యోగం వెలగబెట్టి తమ్ముళ్ల చదువుకి డబ్బు పంపుతున్నాడు .ఇందిరని తన దగ్గిరకి తీసుకు వెళ్ళడు.ఈ లోగా ఆమె ఆడబిడ్డ భర్త ఆడబిడ్దని కాపురానికి తీసుకు వెళ్ళాడు. వాళ్ల అన్యోన్యం చూసి ఇందిర బాధ ఎక్కువైంది.అప్పుడు ఇందిర భర్త ఒక ఉత్తరం వ్రాసాడు చాలా పెద్దది దాన్ని మరిది లాక్కు పోయి ముందుగా చదివి ఇచ్చాడు..తనని రమ్మనే రాసి ఉంటాడని ఉత్సాహ పడింది ఇందర.తననొకమ్మాయి ప్రేమించిందట.తను కాదంటే ఆత్మహత్య చేసుకుంటుందట .ఆమె ఆత్మ హత్య చేసుకుంటే తను బ్రతకలేడట.ఆమె అతనితో వుండడానికి ఇందిర సమ్మతి తెలుపుతూ వుత్తరం వ్రాయాలట.అప్పుడు ఆమెను ఒప్పించి ఇందిరను తీసుకు వెడతాడట.పదేళ్ళ నిరీక్షణ కు అందిన ఫలితం.భర్తను తన వైపు తిప్పకునే చాక చక్యం ఇందిరకు లేదని అత్తగారు ఆమెనే తిట్టింది. అతను కోరినట్లే ఉత్తరం వ్రాసి పరుపు కింద పెట్టి,తను మాత్రం అఖండంగా మండుతున్న నీళ్ళపొయ్యికి కొంగు అంటించుకుని సమస్య పరిష్కరించుకుంది ఇందిర.” కథలు చెప్పే గౌరి” కథలో గౌరిని ఒక బండరాయిలాంటి వాడికి కట్టబెట్టారు.అతని తల్లి తగనిది.ఆమె జీవితంలో వెలుగునింపిన వాడు గిరి.అనే బంధువు.
తమ అజ్ఞానంతో మూర్ఖత్వంతో కొడుకుల్ని కోడళ్ళని కలవనీకుండా చేసి,ఆకొడుకులు ప్రత్యామ్నాయాలు వెతుక్కోడాన్ని కోడళ్ళ అసమర్థత కింద చిత్రించడం ,కాలంతో పాటు కోడళ్ల హృదయాలు మొద్దబారడం, అణచి పెట్టుకున్న కోపాలు ఆవేదనలు కోరికలు అన్నీ తమకూ కోడళ్ళొచ్చే వేళకు పడగ విప్పడం అట్లా తరాల తరబడి అత్తా కోడళ్ళ వైరి సంబంధం కొనసాగుతుంది. అభమూ శుభమూ ఎరుగని వయసులో పెళ్ళి చేసుకుని అత్తతో కాపురం చెయ్యడానికి వెళ్ళిన ఈ చిన్న పిల్లలకి పుట్టింటి ఆసరా కూడా తక్కువే.” ముంజేతి కంకణం” అనే కథలో శాంత కు తండ్రి కొ౦త పొలం ఇస్తే ఆమె భర్తతో బొంబాయి నగరం లో వుంటూ డబ్బుకు ఇబ్బంది పడుతున్నా అన్న ఆమెకు పొలం తాలుకు అయవేజు ఒక్క రూపాయి కూడా ఇవ్వక అందరితో డబ్బిచ్చి పొలం రాయించేసుకున్నానని చెప్పుకుంటాడు.ఇంట్లో వున్న మేనత్తల బంగారాలు కూడా తనే తీసుకుంటాడు.ఒక మేనత్త మాత్రం శాంత కివ్వమని ఒక గొలుసు వీరయ్య కిచ్చి పోయింది..అన్న మంచి ఇల్లు కట్టుకుని వదిన వంటినిండా బంగారం దిగేసి కూతురికి బాగా కట్నం ఇచ్చి పెళ్ళీ చేయడం తను పుట్టింటికి రావడానికి కూడా రైలు ఖర్చులకి తడుముకోడం చూసిన శాంత తన పొలం అమ్ముకుని వెళ్ళిపోయింది.అదికూడా అన్నకు తెలియకుండా రహస్యంగా.మరొక కథలో పెద్దకూతురు జబ్బుతో వున్నా పట్టించుకోని తల్లి,ఇంకొక కథలో ఒక కూతురి నగ మరొక కూతురికోసం వాడి ,ఆ నగ లేనిదే అత్తగారు రానివ్వక పోతే నగ ఇచ్చి కాపురానికి పంపకుండా, ఆపిల్ల చేత ఇంటి చాకిరి చేయించుకున్న తల్లి, పిల్లల మధ్య వలపక్షం చూపే తల్లులు ,వెనకా ముందూ ఆలోచించకుండా గుమ్మంలో కొచ్చిన సంబంధాలకి ఆడపిల్లల్ని కట్టబెట్టే తండ్రులు ..అదృష్ట దేవతనో మొగుడి కరుణా కటాక్షవీక్షణాలకోసమో వేడుకుంటూ కాలం గడుపుకు పోవడమే జీవితం.
ఇంక వితంతువులై పుట్టింటి కొచ్చి అన్నగారి కుటుంబానికి సర్వ శక్తులూ ధార పోసిన ఆశమ్మను ఆమె చివరి క్షణాలలో అన్నకొడుకులు ఎలా వేధించారో చెప్పే కథ,”ఒడ్దుకు చేరిన వొంటరి కెరటం”.చిన్నతనంలోనే భర్తలను పోగొట్టుకుని పుట్టింటికి చేరిన వితంతువుల రెక్కలు ముక్కలు చేసిన సంసారాలెన్నో ఆ రోజుల్లో!!
“మనసు తెచ్చిన మార్పు “అనే కథలో కథకురాలిని చదువు మాన్పించి చిన్నప్పుడే బాగా పొలం వున్న సంసారంలో పడేశారు.అక్కడ అత్తగారు,పెద్దత్తగార్ల పెత్తనం. మామగారికి కూడా నోరు లేదు.భర్త కి ఎప్పుడూ పొలమూ ఆవులూ ఎడ్లూ ,
మొదటి పిల్లవాడు పుట్టేవరకూ భర్త బాగానే చూసుకునే వాడు.ఇంట్లో వాళ్లకి తెలియకుండా పౌడరూ అదీ కొనిచ్చేవాడు.ఆ అమ్మాయికి వరసగా అయిదుగురు పిల్లలు పుట్టారు .అప్పుడింక ఎవరూ పట్టించుకోరు. తనూ ఇంట్లో ఒక మనిషి అంతే.. ఆఖరికి పిల్లలకి పేర్లు కూడా అత్తగారూ పెద్దత్తగారే నిర్ణయిస్తారు.ఆమె స్నేహితురాలు చదువుకుని డాక్టరైంది.మరో డాక్టర్ని పెళ్ళి చేసుకుంది. అప్పుడా స్నేహితురాలు చచ్చి పోతే బావుండును అనకుంటుంది కథకురాలు. సుబ్బలక్ష్మి గారి కథలన్నీ అండర్ టోన్స్ లోనూ ,వ్యాఖ్యానరహితంగా రచయిత ఏమాత్రం కల్పించుకోకుండా జరిగింది నిబ్బరంగా చెప్పినట్లు వుంటాయి. పల్లెటూరి జీవితం కళ్ళముందుంటుంది.
సుబ్బలక్ష్మి గారికి తన పన్నెండవ ఏట(1937) అప్పటికి ఎం.ఏ చదువుతున్న బుచ్చిబాబు గారితో వివాహం అయింది..
.”బుచ్చిబాబు గారి కథల్లో వర్ణనలు ఎక్కువ నాకు వర్ణనలు లేకుండా వ్రాయడం ఇష్టం” అని చెప్పుకున్నారే కాని.సహజంగా చిత్రకారిణి కూడా అయిన ఈమె కథల్లో ప్రకృతి వర్ణనలు తప్పకుండా వుంటాయి. గ్రామాలలో ఇళ్ల నూ స్త్రీల స్వభావాలనూ వాళ్ల ముచ్చట్లనూ వర్ణించకుండా ఏ కథా పొడి పొడిగా వుండదు
“సంస్కృత సాహిత్యం గురించి ఏమైనా వివరాలు కావాలంటే బుచ్చిబాబు గారు నన్ను అడిగేవారు.అలాగే ఆంగ్ల సాహిత్యం గురించి నాకెన్నో వివరించేవారు..ఆయన ప్రోత్సాహం తోనే నేను కథలు వ్రాయడం ప్రారంభించాను .బుచ్చిబాబుగారు ఏమివ్రాసినా నేను చదివిన తరువాతే ఎక్కడికైనా ప్రచురణకు పంపేవారు.అంత అదృష్టాన్ని కలిగించిన ఆయనే నాకు పెద్ద స్పూర్తి “అంటారు..బుచ్చిబాబు గారితో పంచుకున్న జీవితాన్ని ఆమె ప్రస్తుతం “పాలపిట్ట” మాసపత్రికలో అక్షర బద్ధం చేస్తున్నారు.అందులో బుచ్చిబాబు గారి ఉద్యోగ రీత్యా అనేకమంది రచయితలతో, కవులతో పరిచయాలు, తను చేసిన ప్రయాణాలు, హాజరైన సభలు సమావేశాలు వర్ణిస్తూ ఆనాటి సాహిత్య సాంస్కృతిక వాతావరణాన్ని అందిస్తున్నారు. ఇటువంటి రచనలు స్త్రీల జీవితాలను కాలానుగతంగా పరిశీలించడానికి చాలా విలువైనవి.
కథలే కాక “ నీలంగేటు అయ్యగారు” “అదృష్ట రేఖ” అనే నవలలు కూడా వ్రాసిన సుబ్బలక్ష్మి ఇప్పుడు బెంగుళూరు లో వుంటున్నారు.
