Monday, June 27, 2011

తురగా జానకీరాణి

స్వాతంత్ర్యానంతర తొలి తెలుగు కథా రచయిత్రులలో ప్రసిద్ధులైన జానకీ రాణి ,గాయని ,నర్తకి,వక్త కూడా.యాభైయ్యవ దశకంలోనే కథారచన ప్రారంభించిన మంటపాక జానకీరాణి ప్రఖ్యాత రచయిత తురగా కృష్ణమోహనరావుని వివాహం చేసుకున్న తరువాత తురగా జానకీరాణి పేరుతో వ్రాయడం మొదలుపెట్టారు. ఇకనమిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత సోషల్ సైన్సెస్ లో డిప్లొమా చేసి కొంతకాలం సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లో వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేశాక ,ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైరయ్యారు . నలభై రేడియో నాటకాలు రూపకాలు వ్రాసారు నాలుగు జాతీయ బహుమతులు పొందారు మూడు నవలలు, వాస్తవగాథలు కొన్ని కాలమ్స్ వ్రాసారు, సర్పంచులకోసం పంచాయతీ రాజ్ శాఖకు పాఠాలు కూడా వ్రాసారు నేషనల్ బుక్ ట్రస్ట్ కి పిల్లల కథల పుస్తకాలు వ్రాసారు సృజనాత్మక సాహిత్యమే కాక సాంఘిక సేవా కార్యక్రమాలపై చాలా కృషి చేశారు.యోజన పత్రిక లో డ్వాక్రా గ్రూపులకొసం ప్రత్యేక అనుబంధానికి రూపకల్పన చేశారు.

స్త్రీల పవిత్రతపై సమాజంలో ప్రయత్నపూర్వకంగా నిలబెడ్దబడ్ద అనేక భ్రాంతి భావనల్ని చెదరగొట్టే “పవిత్ర” అనే నాటకం వ్రాశారు.మాతృత్వం పైనా స్త్రీపురుషుల మధ్య వుండవలసిన సున్నితమైన ప్రేమానుబంధాల మీద ఆమెకు చాలా గౌరవం. ఆప్రేమ పూసల్లో దారంలా వుండాలని ,ఒకరి మనసు ఒకరికి తెరిచిన పుస్తకంలా వుండాలని ఆంకాక్షిస్తారు .మన పరిథి కథలే కనుక ఆమె కథల్నిగురించే ప్రస్తావించుకుందాం.

జానకీరాణిగారి కథల్లో ప్రథాన పాత్రలు ఎక్కువగా స్త్రీలే .అందులోనూ 1950 దశకంలో ఆమె వ్రాసిన అనేక కథల్లో ఆనాటి యువతుల మనస్తత్వ చిత్రణ ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడప్పుడే ఆడపిల్లల చదువుకు కూడా ప్రాధాన్యత వస్తున్నది. కాలేజీకి వెళ్ళి చదువుకోడం వాళ్ళకి కాస్త గర్వకారణంగా కూడా వుంది. 1956 లో ఈమె వ్రాసిన “గళంలో గరళం” కథలో సరళ అనె అమ్మాయి ఎస్సెసెల్సి (S.S.L.C)లో మంచిమార్కులు తెచ్చుకుని ఇంటర్ లో చేరింది.దానికి తగ్గట్టుగా వస్త్ర ధారణ చేసుకుని ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తోంది.అదే పెట్టెలో వున్న ఇద్దరు ఆడవాళ్ళు తనని పలకరించాలనీ అప్పుడు తను ఇంటర్ చదువుతున్నానని చెప్పాలనీ ,ఉవ్విళ్ళూరింది..కానీ వాళ్ళిద్దరూ తమలో తాము ఏవో మాట్లాడుకుని సరళని అడక్కుండానే దిగిపోయారు.అప్పుడు సరళకి గట్టిగా అరిచి చెప్పాలనిపించింది”ఏమండోయ్ నేను పదహారేళ్ళకే ఇంటర్ చదువుతున్నాను.ఎస్సెసెల్సీ లో మంచి మార్కులు తెచ్చుకున్నాను” అని.అట్లాగే భూతద్దంలోనించీ,వాస్తవికతకి వన్నెచిన్నెలు , తీరా ఖాళీ చేస్తే కథానాయకుడు,మరలి వచ్చిన మైత్రి నిచ్చెన అనే కథలు కూడా మనస్తత్వ చిత్రణకు సంబంధించినవే.భూతద్దంలోనించీ కథలో రాత్రివేళ వంటరిగా వానలో రిక్షాలో వస్తూ, రిక్షా అతన్ని గురించి అనేక అపోహలూ అనుమానాలూ పడి, తన వంటిమీది నగలు తీసి కనపడకుండా దాచేసుకుని బ్రతుకు జీవుడా అని ఇంటికొచ్చి పడ్ద యువతికి ,ఇంటివారు తలుపు తీసేదాకా తోడుండి తరువాత వెళ్ళిన రిక్షా ఆయనకి ఒక రూపాయి ( 1950 దశకం) అదనంగా ఇచ్చి, తరువాత ఈ రూపాయి” తనకేం ఉపకారం చేశాడని ఇచ్చినట్టూ” అని ఆలోచిస్తే అది:అతను చెయ్యని అపకారానికి” అనిపించింది.

“జీవిత” సత్యాలు అనే కథలో సుమిత్ర ఇరవైరెండేళ్ల ఆనర్స్ చదివే అమ్మాయి.సెలవులకి తన పల్లెకొచ్చింది.ఆ ఇంట్లో ఆమెకు గారాబం.వారింట్లో ఆశ్రితుడు నాగభూషణం.పద్దెనిమిదేళ్ళవాడు మెట్రిక్ తప్పి పూర్తిచేసుకుంటున్నవాడు..ఆమె మల్లెపూలడిగితే బస్తీనించీ తెచ్చిపెట్టాడు.ఆమెకతన్ని చూస్తే జాలి. ఒక రోజు ఆమె పాదాలను ముద్దుపెట్టుకుంటాడతను. సుమిత్ర కి తన అంతస్థు తెలుసు.తన వయసూ చదువూ తెలుసు.అతను తమ ఆశ్రితుడనీ తెలుసు.తన భవిష్యత్తేమిటో తెలుసు.ఆ ప్రకారమే ఆమెకు రెండేళ్ల తరువాత ఆమె అంతస్థుకు తగిన వాడితో వివాహం అయింది.ఒక రోజు చలికి ముడుచుకుని కూచున్న ఆమె పాదాల్ని ఆమె భర్త ముద్దుపెట్టుకుంటే పాత సంగతిచెప్పి “నా వయసూ నాచదువూ నా అంతస్తూ ఎరిగి కూడా అతనలా ప్రవర్తించడం ఏమిటో?” అంది.దానికి ఆమె భర్త చాలా మామూలుగా “నువ్వు స్త్రీవి,అతను పురుషుడు” అని ఒక జీవిత సత్యాన్ని తేలిగ్గా చెప్పేసాడు.ఈ కథలో సుమిత్ర చాలా ప్రాక్టికల్ ఆలోచనల యువతి. యువతుల మనస్తత్వాలను చిత్రించిన కథలు ’స్నేహం” “పరిణయం” “మౌనం వహించని మనస్సాక్షి” స్నేహం కథ కలంస్నేహాల లో స్నేహితులు కులుసుకోక ముందు భావాలకే ప్రాముఖ్యం,, కలుసుకున్నాక రూపానికుండే ప్రభావం భావాలపై పడి స్నేహం చెదరడం, అందుకు తరువాత పశ్చాత్తాప పడడం చిత్రించారు. ఇప్పటిలా టీవీ వీడియో కంప్యూటర్ లేని ఆ కాలంలో స్నేహాలు,కలంస్నేహాలు ఉత్తరాలు వ్రాసుకోడాలూ చాలా సహజంగా జరిగిపోతుండేవి. యువతీ యువకుల్లో భావుకత్వం పాలు కాస్త ఎక్కువే వుండేది.మౌనం వహించని మనస్సాక్షి కథలో చిన్నప్పుడు తన బదులు శిక్షింపబడిన స్నేహితురాలికి క్షమాపణ చెప్పలేక ఆ అపరాధభావం మనసులోనించీ చెరిపేసుకోలేక పెద్దయనతరువాత ఆ స్నేహితురాలే మళ్ళీ కలిస్తే ఆమెకు పడవలసిన శిక్ష తనకు తనే వేసుకుంటుంది రేణుక అనే యువతి.

స్త్రీ పురుష సంబంధాలను గురించి వ్రాసిన కథలలో పూసలలో దారం ఆవలి కోణం,స్వయంకృతం,అనేకథలు...తనూ తన భర్తా చదువుకోలేదని అతని స్నేహితుడూ స్నేహితుని భార్యలాగా పనులు పంచుకుంటూ ఒకర్నొకరు గౌరవించుకుంటూ లేమనీ చాలా అసంతృప్తి పడుతుంది సుభద్ర...కానీ ఆస్నేహితులు వెళ్ళాక తనకూ తనభర్తకూ ఉండే అన్యోన్యం పూసలలో దారం వంటిదనీ తామిద్దరూ తెరిచిన పుస్తకాలలాంటీ వాళ్లమనీ అర్థం చేసుకుంటుంది.”ఆవలికోణం” లో వివాహం చేసుకోకుండా మంచి ఉద్యోగం చేసుకుంటూ నృత్యంలో రాణిస్తూ హుందాగా జీవిస్తున్న స్నేహితురాల్ని చూసి,చదువు మధ్యలో ఆపేసి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని మార్పులేని జీవితంతో కుస్తీ పట్టే తనజీవితాన్ని పోల్చుకుని అసంతృప్తి తో వేగిపోయింది సీత..కానీ స్నేహితురాలు మాత్రం సీతదే సంతోషకరమైన జీవితం అని చెబుతుంది.

మానవత్వం ఇంకా మిగిలే వుందని చాలా కథల్లో జానకీరాణి చెబుతారు.ఒక్క క్షణం మనసు చలించినా తిరిగి దాన్ని దారిలో పెట్టుకుని విలువలని కాపాడుకునే వ్యక్తులు ఆమె కథల్లో ఎక్కువ కనిపిస్తారు.నవ్వని పువ్వు అనే కథలో శ్రీనాథ్ మల్లిక నృత్యం చూసి ముచ్చటపడి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.అయితే పెళ్ళి తరువాత నృత్య ప్రదర్శన లివ్వకూడదని ఆంక్షపెట్టాడు.అందుకు అంగీకరించే పెళ్ళి చేసుకుంది మల్లిక.అయితే ఆమే మన్సు నృత్యం నించీ మళ్ళనే లేదు .అనుకోకుండా తన కాలేజీలోనే ఓల్డ్ స్టూడెంట్స్ డే న నాట్యం చెయ్యమని స్నేహుతురాలి బలవంతం మీద ఒప్పుకుని రహస్యంగా ప్రదర్శన ఇచ్చి వచ్చింది. మర్నాడుదయం అది పేపర్లో రావడం అశాంతి భగ్గుమనడం, ఆమె పుట్టింటికి రావడం జరిగిపోయాయి. తనమాట వినకుండా ప్రదర్శన ఇచ్చినందుకు కోపంవచ్చిన శ్రీనాథ్ ,తరువాత వివేకం మేల్కొన్న వాడై ఆమెకోసం అత్తగారింటికి వెళ్ళాడు..అదే సమయానికి ఆమెకూడా అతని దగ్గరకు బయలు దేరింది.”కలలు పండిన రోజు”కథలో కుటుంబం కోసం కట్నం తీసుకుని అందంలేని సుబ్బలక్ష్మిని చేసుకుని మామగారి ద్వారా ఉద్యోగం కూడా పొందిన సుధాకరం సుబ్బలక్ష్మిమీద విసుక్కుని ,తరువాత నెమ్మదిగా ఆలోచించి తను త్యాగంచేసినదానికన్న ఆమె చేసిందేమీ తక్కువ లేదని గహించుకుని పశ్చాత్తాపపడతాడు.’”మరలి వచ్చిన మనస్సు’కథలో మాధవరావు కావాలని అనాథాశ్రమంనీంచీ వితంతును ఎంపిక చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు .అందుకోసం తన తల్లి తండ్రులకి దూరమై పోయానన్న వేదన తో ఆమెమనసు నొప్పించే మాటలని తల్లితండ్రులని చూడ్డానికి వెళ్ళాడు.వాళ్ళు కోడలిమీద ఏమాత్రం కోపం చూపకపోగా జాలిపడ్డారు.అతను పశ్చాత్తాపపడి త్వరగా భార్య దగ్గరకు వెళ్లిపోయాడు..”మాను వంగింది” కథలో టీచర్ సూర్యకాంతమ్మ తప్పు చేసిన పిల్లల్ని చాలా కఠినంగా శిక్షిస్తుంది.అదే తప్పు తనూ చేయబోయి తమాయించుకుని సరిదిద్దుకుంటుంది.

కౌమార దశలో పిల్లల్ని పర్యవేక్షించి సరైన దారిలో పెట్టడం అనేది ఎంత కష్టమైన పనో “సొరంగం””వయసు గతి ఇంతే” కథల్లొ చెప్పారు.సొరంగం కథలో పల్లెటూరి పిల్లల్ని అతి క్రమశిక్షణతో పెంచి చదువుకుని బాగుపడతారని బస్తీకి పంపి అన్ని హంగులూ అమరిస్తే ,కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయి పోయి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు వాళ్ళు. వయసు గతి ఇంతే లో తల్లి తండ్రులు చదువుకున్న వాళ్లు.పిల్లల్ని అర్థం చేసుకుని మలుచుకోగల వాళ్ళు... తన స్నేహితురాలిని కాపాడుకోవాలని ఎంతగా మనసులో వున్నా సమయానికి కాపాడుకోలేక పోయి తరువాత అమితంగా బాధపడ్డ హైస్కూల్ విద్యార్ధి,నూతన ప్రేమికుడు అయిన అనిల్ నిజాయితీతో కూడిన ఆవేదన” ఆమె బేల అతను ధీరుడు అయితేనేం”అనే కథ..

“అగాథాలు”అనే కథలో శాంత భర్త ఆమె ను విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే ఆమెను చేసుకున్నాడు.శాంత స్కూల్లో టీచర్ గా వుంటూ తన కొడుకు శేషును పెంచుకుంటోంది. అతను మళ్ళీ కొడుకునీ శాంతనీ రమ్మని కబుర్లు పెడుతున్నాడు శాంతకిష్టం లేదు.కానీ కొడుక్కోసం వెళ్లమంటారు అందరూ.. తండ్రి కావద్దా?అతనికి? మంచి పొజిషన్ లోవున్నాడు..ఢిల్లీలో ఎక్సర్షన్ కి వెళ్ళినప్పుడు తండ్రిని చూసిరమ్మని తనే పంపింది..శేషు వెళ్ళొచ్చేశాడు.తన తల్లి వయస్సుకు మించిన వృద్ధాప్యాన్ని మొస్తూ కష్టపడుతుంటే ఆవిడ హాయిగా వుండడం నచ్చలేదు వాడికి .అక్కడికి వెళ్ళనంటాడు.సరిగ్గా దీనికి విరుద్ధమైన కథ “సాలెగూడు” రోహిణిని భర్త వదిలేసి వెళ్ళి పదిహేనేళ్ళయింది. ఈమెను వదిలి అమెరికా వెళ్ళొచ్చాక ఎవర్నో చేసుకున్నాడతను.వాళ్ళకొక కూతురుకూడా పుట్టింది. ఇప్పుడావిడ అతన్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఈమెకు కబురుపెట్టాడు.పదిహేనేళ్ళు ఏడ్చి కళ్ళుతుడుకుని, బి.యే చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఎవర్నీ నిందించకుండా ఏమీ అడక్కుండా విడాకులైనా అడక్కుండా మళ్ళీ పెళ్ళిమాట తలపెట్టకుండా గడిపి ,స్నేహితురాలు ఎంతవారించినా వినకుండా అతని దగ్గరకే వెళ్ళిపోయింది రోహిణి.,తిరిగి వచ్చెయ్యమని స్నేహితురాలు ఉత్తరం వాసింది.రానో రాకపోవునో ఏమోకానీ గర్భవతి అయిన ఆమె పురిటికి పుట్టింటికొచ్చింది.” నోథాంక్స్” కథలో కేవలం పిల్లల పెపంకం కోసమే పెళ్ళికి అంగీకరించిన బాస్ కి “నో థాంక్స్” చెప్పేసింది పెళ్లికోసం తపించిన అమ్మాయి.

వాస్తవ గాథలు శీర్షికన పడుపువృత్తిలోకి దింపబడ్ద యువతుల కథలు కొన్ని వ్రాసారు జానకీరాణి. .ఇందులో థర్మసాధనం” నమ్మి వచ్చిన వాడు విడిచిపెట్టి వెడితే తనదగ్గరున్నది శరీరమే కనుక దానినే నమ్ముకుంది ఆమె.

“కాలం తీరిన కొలువు”లో ఎంత చిన్న ఉద్యోగానికైనా లంచం తప్పదు.ఎన్ని రిజర్వేషన్లున్నా లంచం తప్పదు కాస్త చదువుకుని కూడా అట్టడుగునించీ ఒక్క అడుగు పైకి వెయ్యడం లక్ష్మీబాయిలాంటి వాళ్ళకి ఎంతకష్టమో ,చదువురాక బయటి ప్రలోభాలకి లొంగిపోయే ఆమె తమ్ముడు యాదయ్య లాంటి పిల్లలకి చావే గతి ఈ దేశంలో ,...

బ్రతుకంతా కష్టపడి సుఖాలేవీ కోరుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పంపించి విశ్రాంత జీవనంలోకి అడుగుపెట్టాక అరియర్స్ రూపంలో మూడులక్షల రూపాయల అదృష్టం అందివచ్చింది ఆయనకి....దానితో తనూ భార్యా కాస్త సౌకర్యంగా జీవించాలని యాత్రలు చేసి రావాలని ఇంట్లోకి సామాన్లు కొనుక్కోవాలని ముచ్చట పడ్దాడాయన.భార్యేమో పిల్లల అవసరాలు చూడమంది ..కానీ వినలేదు.అనుకున్నంతా చేశాడు.ఇంట్లోకి అన్నీ కొన్నాడు ఆవిడకో నగ కూడా,యాత్రకి టికెట్టొచ్చింది.కానీ అది తీర్థ యాత్ర కాలేక పోయింది.అంతిమ యాత్రే అయింది.ఈ కథలో పిల్లల కోరికలూ సబబే .ఆవిడ పిల్లలకు సాయపడమనడమూ సబబే,ఆయన అప్పటికైనా కాస్త సౌకర్యంగా బ్రతకాలనుకోడమూ సబబే కానీ అప్పుడు మృత్యువురావడం మాత్రం సబబుగా లేదు”యాత్ర” కథలో

గౌతముడిచేత శాపంపెట్టించుకుని శిలలా పడివుండక తెలివితో కోపంతో జ్వలించిన ఒక అహల్య కథ “జ్వలించిన శిల” భర్త భావుకుడు కాదు.సంగీత సాహిత్యాల పట్ల అంత అభిరుచీ లేదు.బ్యాంక్ లో ఉద్యోగం చేసే అహల్య గౌతం ని ఆకర్షించింది.స్నేహం కుదిరింది.పరిధుల్లో వున్న స్నేహమే.అయితే ఆమె మనసు విప్పి తన అభిప్రాయాలన్నీ గౌతమ్ కి ఉత్తరాలు వ్రాసింది. ఆమె తరువాత ట్రాన్స్ఫర్ మీద వెళ్లిపోయింది.కొన్నాళ్ళకి మళ్ళీ అదే వూరు బదిలీమీద వచ్చింది.తన దగ్గరున్న వుత్తరాల ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పర్సనల్ లోన్ సాంక్షన్ చేయించుకోవాలని ఎత్తువేశాడు.నిజానికి అతను పెట్టిన స్యూరిటీకీ ఆ లోను వచ్చే అవకాశం లేదు.ఉత్తరాలు భర్తకి పోస్ట్ చేస్తానని బెదిరించి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాడతను.ఉత్తరాలు చటుక్కున అందుకుని సొరుగులో వేసుకుని అప్లికేషన్ తీసుకుంది అహల్య ..చచ్చినట్టు లోన్ వచ్చితీరుతుందనుకున్నాడతను.కానీ అహల్య ఆ ఉత్తరాలు తీసేసుకుని ఎంచక్కా నెల్లాళ్ళు సెలవు పెట్టి తరువాత మళ్ళీ బదిలీకి పెట్టుకుంది. ఇంటి బయటికొచ్చి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసుకునే స్త్రీలకి తెలివి వుంటుందనే జ్ఞానం వుండదు గౌతమ్ లాంటివాళ్ళకి.

పుష్పమ్మకి హటాత్తుగా మాట పడిపోయింది,ఎన్ని వైద్యాలు చేసినా మాటే రాలేదు.ఆమెనెవరో తీవ్రంగా బాధ పెట్టివుంటారనీ పెళ్ళై పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదని మొగుడే బాగా సతాయించివుంటాడనీ సైకియాట్రిస్ట్ అన్నాడు.ఏది ఏమైనా ఆమె మాట మాత్రం పోయింది.ఇంతలో వాళ్ళ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలొచ్చాయి.ఆ పోస్ట్ ఎస్సీ మహిళకి రిజర్వ్ అయివుండడాన ,సంతకం చేయొచ్చిన మహిళ అక్కడ ఆమె ఒకతే కావడాన .ఏకగ్రీవంగా ఎన్నికై పోయింది.తన భార్య సర్పంచయితే తనే అయినట్టు భావించిన ఆమె మొగుడు, ఆమెను గుమ్మంలో నిలబెట్టి తను ఆఫీసర్ ఎదుట ఆమెకుద్దేసించిన కుర్చీలో కూర్చున్నాడు.ఆమె అతని చెయ్యిపట్టుకు గుంజి తన కుర్చీ తనకిచ్చెయ్యమంటే చెంప చెళ్ళుమనిపించాడు,దాంతో పుష్పమ్మ నోరు తెరిచి “అది నాకుర్చీ నేనే కూచోవాలి”అని గట్టిగా అనేసింది.పదవితో పాటు నోరూ వచ్చిందన్నమాట.అసలు ఆమె నోరు పోవడానికి కారణం కూడా అతనే,పిల్లలు పుట్టలేదు కనుక మళ్ళీ పెళ్ళి చేసుకుంటానన్నాడట,దాంతో దుఃఖం వచ్చి గొంతు పూడుకు పోయింది,”చిలుక పలికింది “ కథలో

పెళ్ళి కాకుండానే తల్లి అయిన రుక్మిణిని చూసి ,ఆమెను బంధువులంతా వదిలేశారు గనుక రెండు ఓదార్పు మాటలు మాట్లాడి వద్దామని ఆమె స్నేహితురాళ్ళిద్దరు వెళ్ళారు.అందులో ఒకరికి రుక్మిణిమీద చాలా అసహ్యంగా వుంది..పుట్టిన పిల్ల వాడిని శరణాలయంలో ఇచ్చేసిరమ్మని సలహా ఇవ్వాలని వెళ్ళింది..కానీ రుక్మిణి పరమానందంగా వుంది.ఎవరూ లేని తనకి భగవంతుడే పాపాయిని పంపాడని అనుకుంటూ మాతృత్వపు వెలుగులో ధగధగ లాడుతోంది. ఆమె ఏడవందే వాళ్ళేం ఓదారుస్తారు? “హిమాలయ శిఖరం మీద కూచుని మనబోటి వాళ్ళందర్నీ చిన్నచూపు చూస్తున్న జగన్మాత అది ఎందుకేడుస్తుందీ” అనుకుంటుంది మొదట్లో ఆమెని ఏవగించుకున్న స్నేహితురాలే..మాతృత్వం ఒక అపురూపమైన వరం దానికి న్యాయ సమ్మతమా?కాదా అనే ప్రశ్నే లేదు.చాలా అండర్ టోన్ లో వ్రాసిన ఈ కథ కి ఆ అండర్ టోనే గొప్ప శిల్పం అనిపిస్తుంది.

జానకీ రాణి కథలు సూటిగా వుంటాయి.కథకు తగ్గ వాతావరణం వివరణాత్మకంగా వుంటుంది.కుట్రలు ద్వేషాలు,మోసాలు హిపోక్రసీ లేని మనుషులే ఎక్కువ వుంటారు .కొన్ని విలువలని గౌరవిస్తారు.చాదస్తాల మధ్యతరగతి మనుషులు,విచిత్ర మనస్తత్వం కలవాళ్లు కూడా వుంటారు.వన్నెచిన్నెలతో ఊదరగొట్టని వాస్తవ సంఘటనలే ఆమె కథలకి వస్తువులు.త్వరలో ఆమె కథలన్నింటినీ ఏర్చి కూర్చిన సంపుటి రానున్నది. జానకీ రాణి గారికి గృహలక్ష్మి స్వర్ణకంకణం సుశీలా నారాయణరెడ్డి అవార్డు, పొట్తిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు, మాదిరెడ్డి సులోచన అవార్డు,బాలబంధు బిరుదు వచ్చాయి.

Thursday, May 26, 2011

పి.యశోదారెడ్డి

1960 లలోనే పి.యశోదారెడ్ది. పాఠకులను కుచ్చుల సవారికచ్చెరంలో మెత్తలు పరిచి కూచోపెట్టి బిజినపల్లి తీసుకు వెళ్ళి అక్కడి చిత్రాలన్నీ తీరొక్కటిగా అచ్చమైన తెలంగాణా నుడికారంలో చెప్పారు .కథ చెప్పడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య, అంటే అందులో అతిశయోక్తి అసలు లేదు. ఆమె తాను పుట్టి పెరిగిన మహబూబ్ నగర్ జిల్లా మాడలికంలో కథ మొదలు పెడితే ఉపమానాలు, సామెతలు. చమత్కారాలు, అన్నీకలుపుకుని పరిగెత్తే ఓ ప్రవాహమే అది. అచ్చమైన తెలంగాణా నుడికారంలో “మా ఊరిముచ్చట్లు”ఎచ్చమ్మ కథలు” వ్రాసిన ఎచ్చమ్మ( యశోదని అంటా యశా అని పిలిచేవారట.చిన్నప్పుడు తనపేరేమిటంటే ఎచ్చమ్మ అని చెప్పేదట యశోద ,ఆఎచ్చమ్మే ఈ కథల్లో ఎచ్చమ్మ) తరువాత “పత్రికల” భాషలో “ధర్మశాల” కథా సంపుటి ప్రచురించారు. యశోదారెడ్డి మంచి వక్త .బహుశా ఆ ధారే రచనలో కూడా కనిపిస్తుంది.

ఉస్మానియా యూనివర్సిటీ నించి తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్న యశోదారెడ్ది , హిందీ ఉర్దూ కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు. కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా ,కేంద్ర సాహిత్య అకాడమీ మహావక్తగా ,అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా ,పదవులు సత్కారాలూ పొందారు.మహబూబ్ నగర్ జిల్లా బిజినాపల్లి ఆమె స్వగ్రామం.రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్యలో అడుగు పెట్టిన యశోద లోని వాక్పటిమ , అప్పుడప్పుడే బొంబాయి జె.జె ఆర్ట్స్ స్కూల్ నించీ వచ్చిన ప్రసిద్ద చిత్రకారుడు పి.టి .రెడ్డి మనసు చూరగొన్నది. వివాహానంతరం కూడా ఆమె చదువు సాగించారు.ఎవరి ప్రవృత్తులలో వాళ్లు విజయాలు అందుకున్న మంచి స్నేహితులు .ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు,సుశీలా నారాయణ రెడ్డి అవార్డు,నాళం కృష్ణారావు అవార్డు,సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్నారు,.మూడు కథా సంపుటులే కాక,”ఉగాదికి ఉయ్యాల” :భావిక” కవితా సంపుటులు,”కథలూ నవలలూ-ఒక పరిశీలన” “కథా చరిత్ర” “భారతంలో స్త్రీ” “ ఆంధ్ర సాహిత్య వికాసం” “హరివంశము ఉత్తర భాగము” పారిజాతాపహరణం” “ తెలుగులో హరివంశములు” అనే వ్యాస సంపుటులు వెలువరించారు.1951 నించే కథలు వ్రాసారని ఆమె పై పరిశోధన చేసిన సుజాత చెప్పారు. ఏ సంపుటి లోనూ ఏ కథ కిందా అది వ్రాసి ప్రచురించిన తేదీ లేదు,

మావూరి ముచ్చట్లు లో పది కథలు,ఎచ్చమ్మ కథలు లో ఇరవై,ధర్మశాలలో ఇరవై నాలుగు కథలు వున్నాయి .ఎచ్చమ్మ కథలూ మాఊరి ముచ్చట్లు, తెలంగాణా గ్రామీణ నేపధ్యంలో మాండలిక గుబాళింపుతో వుండగా ధర్మశాలలోని కొన్ని కథలు తను వార్తాపత్రికలో చదివిన సంఘటనలపై స్పందించి వ్రాసానని ఆమె వ్రాసుకున్నారు. మొత్తం యాభై కథల్లోనించీ కొన్నింటిని విశ్లేషించుకుని ఆమె శైలినీ శిల్పాన్ని,తాత్విక దృక్పథాన్ని తెలుసుకుందాం

ఈ యాభై కథల్లోనూ మొదట నిలిచే కథ “గంగరేగిచెట్టు”.ఇది కొంత ఆత్మ కథాత్మక కథ అనొచ్చు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఎచ్చమ్మ మంచి నక్షత్రంలో పుట్టలేదన్న పేరు పడి ,తండ్రికూడా ఆమెను దగ్గరుంచుకోక రుక్మిణమ్మ అనే ఆమెకు పెంచుకోమని ఇచ్చాడు.తరువాత ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు.రుక్మిణమ్మ దగ్గర పెరిగుతున్న ఎచ్చెమ్మ మహబూబ్ నగర్లో చదువుకుంటూ చూడచక్కగా అంతా తనతండ్రి పోలికలో వుంటుంది.తండ్రి ఆమెను పెంపకానికైతే ఇచ్చాడుగానీ అప్పుడప్పుడూ వెళ్ళి చూసుకొస్తూనే వుంటాడు ఆమెకు తొమ్మిదేళ్ళప్పుడు.ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఆపిల్ల తన దగ్గరగా వస్తే ఆపిల్ల అంతా తన పోలికేనని, కదిలి పోయాడు.ముద్దు చేశాడు. అంతకు ముందు ఆయన చెల్లెలు ముత్యాలమ్మ ,తన కొడుక్కు ఆయన కూతుర్నివ్వమనీ,అట్లా సంబంధం కలుపుకుంటే పరువూ ప్రతిష్టలు కల అన్న అండ తనకి వుంటుందనీ ,భర్త బిర్రు కాస్త సడలుతుందనీ అడుగుతూ వుంటుంది. అప్పుడు తన రెండో భార్య కూతురు నీలిని ఇస్తానంటాడు.ఎచ్చమ్మని చూసి మనసు కరిగిపోయిన తరువాత నీలిని కాదు ఎచ్చమ్మని ఇస్తానంటాడు.మొదట్లో ముత్యాలమ్మకి ఎచ్చమ్మ ని అంతా నష్ట జాతకురాలనడం తండ్రికూడా దగ్గరుంచుకోక పాలమూరు పంపడం గుర్తొచ్చి కాస్త సందేహించినా అన్నతో సంబంధం ముఖ్యం అనీ, నీలి కన్న ఎచ్చమ్మే బాగుంటుందనీ అసలు తనే ఆపిల్లను తెచ్చి పెంచుకుంటే బాగుండేదనీ సర్ది చెప్పుకుని సరే నంటుంది.సంక్రాంతి పండక్కి నెల రోజులముందుగానే అన్న ఇంట్లో మకాంపెట్టి ,వదిన మర్యాదలోపంచేసినా సహించుకుని వుంటుంది.అప్పుడు ఎచ్చమ్మని కూడా తీసుకుని రుక్మిణమ్మ కూడా వస్తుంది.ఎచ్చమ్మరాకతో “బంతిపూలు పూసినట్టు , పచ్చతోరణాలు గట్టినట్టు ,ఎన్నెల గాసినట్టు” ఆ యిల్లు కళకళ లాడింది. తొమ్మిదేళ్ళ ఎచ్చమ్మ ఇంగ్లీషు లో పద్యాలు అవీ చెప్పడం పిల్లలందర్నీ ఆకట్టుకోడం మేనత్త కొడుకు రఘునాథ రెడ్డి చూస్తాడు.అతనేమో ఉర్దూ మీడియంలో చదువుకుని వచ్చాడు. ఎట్లాగైనా ఆమె దగ్గర ’అంగిరేజ్” నేర్చుకోవాలనుకున్నాడు. అయితే ఆ పిల్ల ఒక షరతు పెట్టింది. కాశిరెడ్డి పెరట్లో పెద్దగంగరేగు చెట్టుంది.సంక్రాంతి రోజుల్లో నిండా కాయలతో వుంది.. ఆ గంగరేగు కాయలు కోసిస్తే అంగిరేజు నేర్పుతానంటుంది. కానీ అక్కడేదో దయ్యం వుందని పిల్లల్ని పోనివ్వరు. అయనా గానీ సరే అన్నాడు ఆ పిల్లవాడు...మధ్యాహ్న భోజనాల వేళ వాళ్ళిద్దరూ గంగరేగు చెట్టు దగ్గరకు పోయి అక్కడ గోడ మీద కూచుని ఎచ్చమ్మ చదువుతుంటే అతను మళ్ళీ అని ఆమె చెప్పినవి వల్లె వేస్తున్నాడు.ఇది చూసిన పిల్లలు కొంతమంది పోయి, అతనితల్లి ముత్యాలమ్మకి ఎచ్చక్క దగ్గర బావ అంగ్రీజు నేర్చుకుంటున్నాడని చెప్పారు..కొడుకు అంగ్రీజు నేర్చుకుంటున్నాడంటే ముందు సంతోషమైనా వెంటనే ,రేపు తన కొడుకు “అదుపాజ్ఞలలో వుండవలసిన పోరి గురువాలె వాడికి అంగ్రీజు నేర్పడమేమిటని” కోపం వచ్చింది.అంగ్రీజు నేర్చుకోడం తరువాత ఇద్దరూ ఒడుపుగా చెట్టెక్కి కాయలు కోసుకుని తిన్నారు.మరి రఘునాథ రెడ్దయితే దిగాడు గానీ ఎచ్చెమ్మకు దిగరాలేదు.అతనే ఉపాయం చెప్పాడు,తను కింద వొంగి నిలబడితే, తన వీపు మీద కాలు పెట్టిదిగ మన్నాడు.అట్లాగే దిగుతోంది ఆపిల్ల .కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన ముత్యాలమ్మ కంట తన కొడుకు ’సల్వ” అంగి మీద కాలు పెట్టి దిగుతున్న పిల్ల!! “తిప్పికొడ్తే పదేండ్లు లేని ఈ పిల్ల ఇప్పట్నించే తన కొడుకుని కర్రె కుక్కను చేసి తిప్పు తుండది .దీనికీ దీని సంబంధానికీ ఒక దండం” అనేసి కొడుకుని తీసుకుని వెళ్లిపోయింది..బాల్య వివాహమూ చదువుకు స్వస్తి మొదలైనవి తప్పిపోయిన ఆ పిల్ల ఏ ప్రొఫెసరో అయుండచ్చు..మేనత్త దయ వల్ల...ఇందులో మేనత్త పాత్ర ని ఆ నాటికి అత్యంత సహజంగా చూపించారు యశోదారెడ్డి....,’మ్యానరికం” అనే మరో కథ, మేనరికం పేరిట బాల్యం లోనే పిల్లల పెళ్ళిళ్ళు నిశ్చయం అవడాన్ని వ్యతిరేకించిన కథ. పల్లెలో పీర్ల పండగ,హిందూ ముస్లిం ల మైత్రి, భంగుతాగి సన్యాసులెంటబడి ఆరునెలలు తిరిగి ఇంటికొచ్చి మళ్ళీ భార్యను చూసి ఆమెకు అంటుకుపోయిన జోగుళయ్య అప్పటి గ్రామణ జీవితాన్ని కళ్ళకు కట్టిస్తారు.

ఎచ్చమ్మ కథలలోనూ ధర్మశాలలోనూ ఒక చెల్లెలు (ఎచ్చమ్మ) అక్కకు వ్రాసే ఉత్తరాల రూపంలో కొన్నికథలున్నాయి. ఈ కథలన్నీ మాండలికం లోనే ఉన్నాయి.అట్లాగే తెలంగాణా గ్రామాలలోని పెళ్లి వేడుకలు ,నగలు ,రైకపై కుట్టుపని ,పండగలు ఆచారాలు ఎన్నో తెలుసుకోదగ్గ విశేషాలున్నాయి. ఎచ్చెమ్మ అక్కకు వ్రాసే ఉత్తరాలన్నింటిలో ఆమె అక్కా బావల అనురాగ దాంపత్యాన్ని, అన్యోన్యతనూ ప్రస్తావించకుండా వుండదు.అట్లాగే అమె కథల్లో ఆడపిల్లలంతా చంద్ర దీపాలు.తండ్రులు ఆపిల్లల్ని ఎంతగానో అక్కున చేర్చుకుంటారే గానీ ఎక్కడా వివక్ష చూపరు”.సీతక్క పెండ్లి” అనేకథలో కూతురు”పాపెట తీర్పుకు, నాబిడ్డ కాటిక సక్కనకు, నాతల్లి బొట్టు పొందికకు, బాసికపు కూర్పుకు,నాపండు ఒడిబియ్యానికి, నామొల్క ఎదుగుకు ,నాకంటిసలవకు ఆసీతారాముల జంటకు,ఆజత ముద్దు మురిపానికి” తనకున్న పొలం తనఖా పెట్టడానికి కాళ్ళరిగేలా తరిగిన సీత తండ్రి ,అదంతా తనబిడ్డకోసమని తన అంతస్తుకు మించిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్ళి సామానుకు పందిర్లకు మండపాలకు తెచ్చిందంతా ఖర్చుచేసినా .కట్నం దగ్గర పేచీలొచ్చి పెళ్ళి ఆగపోయింది. పెళ్ళికొడుకు ’విలాయతు”కి వెళ్ళిపోయాడు.నిజానికి సీతక్కమీద మనసు పడింది అతనే..కానీ సంవత్సరం తిరిగే సరికి అతనే వచ్చి సీతని అక్కున చేర్చుకుని మామ కాళ్ళకి మొక్కాడు. ఆమె కథల్లో ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయిలని తప్పకుండా పెళ్ళి చేసుకుంటారు అంతస్తుల తేడాలున్నా...పెద్దలు అంగీకరించినా లేకపోయినా చేసుకుంటారు. మావూరిముచ్చట్లు అనే పెద్దకథలో ఆ వూరికి జానపద కళలపై పరిశోధన కొచ్చిన యువతీయువకుల ఎదుట తమ కళల్ని ప్రదర్శించడానికి సిద్ధమౌతున్న వివిథ కళాకారుల్ని మనకి పరిచయం చేస్తూ పనిలో పనిగా అందులోనే ఒక ప్రేమ కథను కూడా చెప్తారు .కురువల పెళ్లి సంబరాలు చూడ్దానికి పోయి వాళ్ల పెళ్ళి తంతుల్లో ఇరుక్కుపోయిన ఒక కాపింటి బిడ్ద ,అనుకోకుండా ఒక బ్రాహ్మణ యువకుడికి భార్య అయిపోవడం, ఆఇద్దర్నీ పెద్దలుఅంగీకరించకపోతే ,వాళ్ళు వెళ్ళిపోవడం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వాళ్ల మధ్య. చివరికి వాళ్ళు ఈ జానపద సంఘంతో ఆవూరొచ్చినప్పుడు ఆమె వరుస చెల్లెలు ఆమెని తమ ఇంటికి పిలవడం కథ...ఇందులో పల్లెల్లో వుండే ఎంతో మంది జానపద కళాకారులు వాళ్ల విద్యలూ, అన్నీ పూసగుచ్చారు యశోదారెడ్ది..జమ్మి కథలో పల్లెటూర్లో దశరా పండగ సంబరాల్లో భాగంగా జమ్మి కొట్టే టప్పుడు ఊరి ఆసాముల సంభాషణ ల ద్వరా వారి మనస్తత్వాలు అద్దంలో లాగా కనపడతాయి,,పర్పుబండ ,బొక్కిందే దక్కుడు,రాజుగారి ఒకనాటి ప్రచారం కథలు అద్భుతమైన రాజకీయ వ్యంగ్యాస్త్రాలు. ఎలెక్షన్లు రాబోయేముందు” రాంగ రాంగ నెలలునిండి పురిటిదినాలు దగ్గర పడ్దట్లు ..ఎన్నికలు రేపో మాపో..ఇవే నాల్గు రాళ్ళు రాలంగ రెండురాళ్ళు.వెనకేసుకునే దినాలు..పల్లె ఒళ్ళువిరుచుకుని లేచి ఉత్సాహం పుంజుకునే వైనం.

అప్పటి పల్లెల్లో కొందరు దొరసాండ్ల కెంత అసూయ పొగరు వుండేవో ఎన్ని కుటిల బుద్ధులుండెవో “కాలం చెప్పిన తీర్పు ’కథలో .పాపవ్వ దొరసాని ఉదాహరణ.మంచి దొరసాంద్లకు”సంజ “కథలో దొరసాని ఉదాహరణ. ఎచ్చమ్మ “కోరి చేసుకుంటినమ్మ కోతిశివుణ్ణి”అని ఏరికోరి ఒక వన్నెల మొగోడు,చిత్రకారుణ్ణి పెళ్ళి చేసుకుంది.వాళ్ళు చెమడోడ్చి ఒక ఇల్లు కట్టుకున్నారు .దాని పేరు సుధర్మ.అదొక బొమ్మల కొలువు..అంతా బాగానే వుంది కానీ ఆఇంటిచుట్టూ బస్తీ రొద పెరిగింది..అక్కడొక చెత్తకుండీ వెలిసింది.ఆ చెత్తకుండీలో చిత్తుకాగితాలేరుకునే వాళ్లు మొదలయ్యారు.అప్పుడు కుండీ ఖాళీ చేసే మున్సిపాలిటీ మనిషి చిత్తుకాయితాల వాళ్లని రూపాయకట్టి కాయితాలు ఏరుకోమని ఆర్డరేశాడు.ఆ రూపాయి కట్టలేని వాడొకడు కుండీ లో దిగి కూచుని కాగితాలు మూటగట్టుకుని బయట కుక్కల్ని బెదరగొట్టడానికి తనూ కుక్కలాగా అరుస్తాడు.ఒకావిడ సీసాపెంకులు తెచ్చి, కుండీలోపోయగా అతని తలకు ,వంటికి గాయాలై నెత్తురోడుతూ బయటి కొచ్చాడు.ఈ కథని యశోదారెడ్ది వ్రాసిన తీరు ఒక క్యామెరా పట్టుకుని ఆ వీధిని ,అందులో పొద్దుటి నించీ సాయంత్రం దాకా నడిచి వెళ్ళే రకరకాల మనుషుల్నీ, వాహనాల్నీ క్లోజప్ షాట్లు తీసి అంతాకలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. ఒకప్పుడు మారియో మిరండా అనె చిత్రకారుడు ఒక బొమ్మ వేస్తే అతి చిన్న వివరాన్ని కూడా వదిలే వాడు కాడు.అలా వుంటుంది యశోదారెడ్ది కథనం .పెళ్ళి తంతుల్ని గురించి చెప్పినా,ఉయ్యాల వేడుక గురించి చెప్పినా ప్రయాణానికి కచ్చరం బండి తయారుచెయ్యడం గురించి చెప్పినా బండికి ఏ ఎద్దుల్ని కట్టాలో అందులో ఎలాంటి మెత్తలు పరవాలో. ఏమేమి అలంకారాలు చెయ్యాలో ఏ ఒక్క వివరమూ వదలదు ఆమె. ఆమె కథలన్నీ కథా చిత్రాలే..ఆమె భాషలోనే చెప్పాలంటే ’ పూరాగా చిత్తారి దించినట్లు”వుంటాయి..మనుషుల పట్ల ప్రేమ కథల్నిండా పరుచకుని వుంటుంది,శాంత గంభీరమైన కథలు ఆమెవి.

ఇక ఉపమానాలైతే ఏరుకోవాలి గానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి.అవి శ్రమ పడి వెతికి తెచ్చి అతికించినవి కావు.అలా అశువుగా పాళీలోంచి సిరా ప్రవహించినంత సహజంగా ప్రవహిస్తాయి సామెతలూ అంతే” ఆ రెండూ నావి”..అనే కథలో ముసలి ఎలమందని గురించి” ఆకు రాలిన సెట్టోలె,దురమాగిన పండోలె పండువారిన ఆకోలె,పీసువారిన బీరకాయోలే,వొట్టివోయిన సెర్వోలె, రెక్కలూడిన పక్షోలె వున్న ఎలమంద, పసినిమ్మ పండోలె,పచ్చని సిగురోలె,దోరకాయోలె,దానిమ్మపూవోలె,రెక్కలొచ్చిన చిల్కోలె,పులిబెదురు తాకని జింకపిల్లోలె, కొబ్బరిగిన్నోలే వున్న మన్మరాలిని వెంటబెట్టుకుని...”, ఇటువంటి ఉపమానాలు కథల్నిండా వుంటాయి.ఇంక బీర పువ్వులన్నా చిలకపచ్చ చీరెలన్నా చాలా ఇష్టం.ఆమెకు.

.మోనా అనే కథలో ఇతివృత్తం పాతదే అయినా ఆ కథ మొదట్లో ఆమె వరదను వర్ణించిన తీరు అద్భుతం...’మొగులు చిల్లివోయినట్టు.ముంతన గుమ్మరించినట్ల,,మిన్నూ మన్నూ కలిసి ఏకంకవొడికినట్ల, ఏకసిస్తుగవాన., వొర్రెలు, వొంపులు ,కాల్వలు .మడుగులు ,కుంటలు,చెర్లు ఏర్లు నదులు అన్నీనీళ్లు నిండంగ,పిక్కటిల్లి ,గండ్లువడి,కట్టలు దెంపుకోని ,ఏకమై,ఒడ్లెక్కి,అలుగులు దుంకి,చిన్నా పెద్దా తారతమ్యాలుడిగి,మిర్రు పల్లాలు ఒకటై, వొంపులుదీరి,ఈసురోసాలు ఇడ్సి,ఒక్కబాటగా ,ఒక్క సూటిగా ,జతజతగా కలెగల్పుగా సముద్రయ్య దిక్కు నడిసినై,” ఇట్లా సాగుతుంది.

1929 లో జన్మించిన ఈ విదుషి ,2009 మరణించారు.త్వరలోనే ఈమె కథా సంకలనం నేషనల్ బుక్ ట్రస్టు ద్వారా వెలువడనున్నది.