Saturday, December 06, 2014

పిల్లాడొస్తాడా

                                                                                                          పి.సత్యవతి
                                                            పిల్లాడొస్తాడా?
రాజావారి కుటుంబం దైనిక ధారావాహిక  తాలూకు తొమ్మదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో ఉదంతం ఒక గంటసేపు ప్రసారం కాబోతోంది ఈ రోజు... అందులో నటించిన  తారలంతా ఆ ఫలానా ధారవాహికలో తాము పాల్గొన్న అపురూప ఘట్టాలనూ   జన్మసార్థక సన్నివేశాలనూ జుట్టు పైగకెగదోసుకుంటూ  ముద్దుముద్దుగా మణిప్రవాళంలో ముచ్చటిస్తారు. ఈ ఉదంతం తప్పక చూడమని గత పదిరోజులుగా నిర్మాతలు చెవిలో  ఇల్లు కడుతున్నారు.అందుచేత కాలేజీ నుంచీ వచ్చి అబ్బాయి వెంటనే తినడానికి  స్వయంగా పీజ్జా తయారుచేసి పెట్టి, రాత్రిభోజనంలోకి వాడికిష్టనైనవి వండి ,అమ్మమ్మకోసం రాగిజావ కాచి ,తనకోసం పుల్కాలు చేసుకుని ఇటీవలే కొని గోడకి అమర్చిన పెద్ద బుల్లితెరముందు కుదురుకున్నదివిజయ.
  అమ్మమ్మ సావిత్రమ్మకు ఎనభై ఏడేళ్ళు..  ఆమెను తన దగ్గర పదిరోజులుంచుకు పంపిద్దామని  మొన్న తీసుకొచ్చుకుంది విజయ..... విజయ వాళ్ళాయన  ఏదో సమావేశంకోసం సింగపూర్ వెళ్ళి వున్నాడు.కూతురికి వివాహం అయి అమెరికా వెళ్ళింది.కొడుకు  ఇంజినీరింగ్ చదువుతున్నాడు.  నమూనా కుటుంబం.
 అమ్మమ్మకి బుల్లితెర కార్యక్రమాలు నచ్చవు. గదిలో కూచోడమూ గిట్టదు .ఆకాశంలో ఒక చిన్న ముక్కా , నాలుగుచుక్కలూ, రెండు మొక్కలూ కనపడతాయని సాయంత్రం కాగానే బాల్కనీ లోకి చేరుతుంది . అలా బాల్కనీలో కూచున్న అమ్మమ్మ హడావిడిగా లోపలికొచ్చి బాగా మబ్బేసింది.చినుకులు కూడా మొదలయినై. .ఇంకా పిల్లాడు రాలేదే! అంది
రాజాగారి కోడలు కోడలికి కోడలు పాత్రధారిణి సకలాలంకార భూషితంగా అప్పుడే తెరమీదకొచ్చి వీక్షకులకు వినమ్రంగా నమస్కారం చేసింది.ఆ పిల్ల పెట్టుకున్ననెక్లేసు చాలాబాగుంది  అనుకుంటూన్న విజయ, అమ్మమ్మ మాటలకి ఉలిక్కి పడింది.అవునూ రాత్రి ఎనిమిదౌతున్నా పిల్లాడింకా ఇంటికి రాలేదేమిటీ? అయ్యో పిల్లాడు రాలేదు. రోజూకన్న ఒక అరగంట ఆలస్యమైనా అమ్మ కంగారుపడుతుందని ఫోన్ చేసి చెబుతాడు కదా?
వాడు ఫోన్ కూడా ఎత్తడంలేదే! ఏమైంది వీడికి?
దబ దబ చినకులు.
ఒరేయ్ మోటూ,చింటూ ,బబ్లూ బంటీ ,మున్నా ,రహీం రాజా ,మా వాడేడిరా? ఫొన్ మీద ఫోను.
ఏమో ఆంటీ  వాళ్లంతా.
మీరంతా ఇంటికొస్తే వాడెందుకు రాలేదు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి మా బాబులు కదూ?
మాకూ పలకడం లేదు ఆంటీ
వందోసారికూడా వాడి ఫోన్.స్విచ్డ్ ఆఫ్.
రోజూ ఏడుగంటలలోపు వచ్చేవాడు పదైనా రాలేదు.ఏం చెయ్యాలిప్పుడు?
వాళ నాన్నకూడా దేశంలో లేడే!! ఇప్పుడు ఫోన్ చేసి చెబితే కంగారుపడిపోడా?
వస్తాడులే అమ్మా! ఎక్కడో చిక్కడిపోయి వుంటాడు .వాన తగ్గనీ వాడే వస్తాడూఅని ,తనకోసం పెట్టిన జావ తాగేసి   సోఫామీద ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ.
వాడు వెళ్ళే చోట్లు ,వాడికున్న స్నేహితులు పరిచయస్తులు అన్ని నంబర్లూ అయిపోయాయి
పన్నెండు.
చుట్టుపక్కల ఇళ్లల్లో టీవీ లన్నీ బందయ్యాయి.అపార్త్మెంట్ సెల్లార్ లోకి రావాల్సిన వాహనాలన్నీ వచ్చేశాయి.
పిల్లాడురాలేదు
వాడెక్కడో చిక్కుపడి వుంటాడు  అని చెప్తున్నా కదా!!నువ్వలా జావకారిపోకు.వెళ్ళి కాస్త ఎంగిలి పడు అంది అమ్మమ్మ మళ్ళీ
విజయకి ఒళ్ళుమండింది.
వాడు రాలేదని నేనిక్కడ భయపడి చస్తుంటే తినమంటావేమిటీ? నువ్వు జావ తాగేశావుగా పడుకో! అని కసిరింది
 నేను నీరసంతో కళ్ళుతిరిగి పడిపోతే నా సేవ చెయ్యాలి నువ్వు... అందుకని ఎక్కడున్నా ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నా సంగతి  నేను చూసుకుంటాను అట్లా వూరికే కంగారు పడి ఏం చేస్తావ్?  అంది ఆవిడ.
బుల్లితెర రూపం సంతరించుకున్న విజయ మెదడు పైన   ఎర్రని భయంకర దృశ్యాలు.
అంతులేని వేగంతో వస్తున్న మోటర్ సైకిల్ మీద ముగ్గురు పిల్లలు. ముగ్గురి చెవుల్లోనూ సెల్ఫోన్లు .మద్యం మత్తులో జోగుతూ అంతకన్న వేగంగా వస్తున్న లారీ డ్రయివర్!    రోడ్డుమీద అడ్దదిడ్దంగా నెత్తురోడుతూ మూడు శవాలు.తెల్లటి టీషర్టు ఎర్రగా తడిసి ముద్దై!
 వానలో వస్తున్న మోటర్ సైకిల్.....చెయ్యి ఊపి లిఫ్ట్ అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి.మోటర్ సైకిల్ ఆగింది.ఆ వ్యక్తి వీడిని రోడ్డు మీదకి ఈడ్చి బాగాకొట్టి ల్యాప్టాపూ సెల్ఫోనూ పర్సూ ,మోటర్ సైకిల్ తాళాలూ లాక్కుని    వెనక్కి తిరిగిచూడకుండా పోయాడు,వీడు స్పృహలేకుండా రోడ్డుమీద.పడి వున్నాడు...   వెంకటేశ్వరస్వామీ అలా జరగనివ్వకు .మెట్లన్నీ ఎక్కి కొండకొస్తాను.
ఎవడిదో పుట్టిన రోజు.. వాడు వీడిని. పార్టికి రమ్మన్నాడు.వీడు రానంటాడు.వాడు వెక్కిరిస్తాడు. వీడికి రోషమొచ్చి వెడతాడు .. అక్కడ వాదాలు.. వాదాల్లోనించీ ముష్టి యుద్ధాలు. కొట్టుకోడాలు,వీడి గర్ల్ ఫ్రెండ్ ని వాడేదో అన్నాడనీ వాడి  గర్ల్ ఫ్రెండ్ ని వీడేదో అన్నాడనీ ! ఆ వూపులో .. ఎవడిప్రాణం పోతుందో తెలీదు.
కృష్ణలో ఈతకి పోయి  మునిగిపోయిన యువకుడు.  
కొన్ని వేల రూపాయల క్రికెట్ బెట్టింగ్ లు! డబ్బొచ్చిందా జల్సాలే జల్సాలు. ఎక్కడినించీ తేవాలి ఓడిపోయిన డబ్బు? స్కూటర్లు మోటర్ బైకులు ల్యాప్టాపులు దొంగిలించి అమ్మాలి.పోలీసులు పట్టుకుని మొహనికి ముసుగేసి వీక్షకులముందు పెడతారు. ఆ ముసుగుల్లో అమాయకుడైన మనవాడు తెలీకుండా ఇరుక్కోలేదు కదా?
 “ మన  పిల్లాడు అట్లాంటి వాటి జోలికి పోడు. ఊరికే పిచ్చి ఆలోచనల చెయ్యకు..  ఇరవై ఏళ్లకి పైగా పెంచుకొస్తున్నావు నీకొడుకు ఎలాంటివాడో నీకు తెలీదా? చూడు ఎట్లా చెమటతో తడిసిపోతున్నవో నిస్త్రాణ వస్తుంది.. కాసిన పాలు తాగు మళ్ళీ అమ్మమ్మ
నా పిల్లాడొచ్చేదాకా పచ్చిమంచినీళ్ళుకూదా ముట్టను. నా ఒక్కగా నొక్క కొడుకు నా ప్రాణం
అమ్మమ్మ మాట్లాడలేదు
 “ఈ మధ్య వీడు మన సందుచివరి ఇంట్లో వుండే సంధ్య ని నాలుగైదు సార్లు మోటర్ సైకిల్ ఎక్కించుకొచ్చాడు. అదేమైనా ప్రేమ వ్యవహారం అనుకుని వాళ్ల వాళ్ళు వీణ్ణి చావకొట్టారేమో! మనకులంకాదు కదా వాళ్ళు. .మన వెంకట్రత్నంగారి మనవణ్ణి అట్లాగే కొట్టి పడేశారు తెలసుగా?విజయ చెప్పింది మౌనంగా విని ఊరుకుంది అమ్మమ్మ
రెండు ,మూడు నాలుగు గంటలు
గదిలో పచార్లు చేస్తూ ప్రతిచిన్న అలికిడికీ ఉలిక్కిపడుతున్న విజయకి ఉన్నట్లుండి వాంతి అయింది.అమ్మమ్మే మెల్లిగా ఆమెని మంచందాకా నడిపించి మార్చకోడానికొక నైటీ ఇచ్చింది
మంచం మీద పడుకున్న విజయను శోకపు వరద ముంచెత్తింది. నిస్సహాయంగా ఆ వెక్కిళ్ళు వింటూ వుండిపోయింది అమ్మమ్మ. విజయ ఇంకా చెప్పింది.. మొన్నటికి మొన్న స్నేహితులే ఒక పిల్లాడిని చంపేసి కాలవలో పడేశారు.ఇప్పుడెవరు స్నేహితులో ఎవరు శత్రువులో కనుక్కోలేం అమ్మమ్మా!
నీకన్నీ ఇట్లాంటి ఆలోచనలే ఎందుకొస్తయ్ తల్లీ ! రాత్రి నుంచీ నువ్వు అన్నీ అపశకునాలే మాట్లాడుతున్నావ్? మీ తాతయ్య ఉద్యమంలో పనిచేసేటపుడు పదేసిరోజులు ఇంటికొచ్చేవారే కాదు .అప్పుడిట్లా సెల్ఫోన్లా ఏమన్నానా? అట్లాగ ఎదురుచూస్తూ మాపన్లు మేం చేసుకునే వాళ్ళం.. అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంది అమ్మమ్మ
తన పెళైన మూడేళ్ళకే  అత్తగారు పోతే  మావగారు తన ఈడావిడని మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ పిల్లల్నీ తన పిల్లల్నీ కలిసి ఇద్దరూ పెంచేవాళ్ళు.అదీకాక . మావగారి పెద్ద భార్య తాలూకు ఆడపిల్లలు పురుళ్ళు పోసుకోడానికొచ్చేవాళ్ళు. ఎడపిల్లలు పసిపిల్లలు ఇంటనిండా!! ఆ గుంపెడు పిల్లల్లో ఎవడెప్పుడు ఇంటికొచ్చేవాడొ ఎందుకు రాలేదో ఇట్లా ఊహించుకుంటూ ఏడుస్తూ కూచోడానికి ఎవరికి తీరింది? ? పిల్లలతో కూచుని కాసేపు మంచీ చెడూ మాట్లాడుకోడానికి సమయం ఎక్కడిది? మావగారే పిల్లందర్నీ కూచోబెట్టి ఎపుడైనా కథలు చెప్పేవాడు.ఆడవాళ్ళకి ఇంట్లో పనులే సరిపోయేవి.  తన భర్తకి  ఉద్యమాలు. మీటింగులు.  పెద్దకొడుక్కి ఇరవై ఏళ్ళోచ్చాయోలేదో  సంఘాలు ఊరేగింపులు! పోలీస్ భయాలు ,అజ్ఞాత వాసాలు.. .వాళ్ళేవో మంచిపన్లు చేస్తున్నారనే నమ్మకంతో తమ పన్లు తము చేసుకుంటూ వుండేవాళ్లు.  ఎప్పుడూ ఇట్లా హైరాన పడలా...ఒక వేళ వీడూ ఏదో మంచిపని కోసం ఎక్కడైనా ఆగిపోయాడేమో !ఎవరికైనా సాయం చేయడానికి వుండిపోయాడేమో! అని ఎందుకనుకోదీ పిల్ల?  తన పిల్లాడిమీద తనకే నమ్మకం లేకపోయే! లోకం మీదా నమ్మకం లేకపోయే ! అనుకుని అమ్మమ్మ కాస్త చిరాకుపడింది
 “ఆ రోజులు వేరమ్మమ్మా! ..ఇప్పటి పిల్లల సంగతి నీకు తెలీదు రోజూ పేపర్ చదువు తెలుస్తుంది.”
అవున్లే అమ్మా! అప్పుడు వాళ్లకి ఏవో ఆశయాలనీ అవీ వుండేవి..కోరికలూ డబ్బులూ కూడా తక్కువే  ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ మామయ్య అక్కడ ఉండిపోయేవాడు,వాడికి తిండీ నీళ్ళూ కూడా గుర్తొచ్చేవి కాదు వీడికి వాడి పోలిక వచ్చిందేమో .అనుకుంటూన్నాను..అంది అమ్మమ్మ .
వాడికి ప్రతిరోజూ చెబుతాను. తనకు మాలిన ధర్మానికి పోయి నువ్వు అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకు,  లేని పోని బురద అంటించుకోకు అని,.మనం ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదు మనని మనం ఉద్ధరించుకుంటే చాలనీ  ! మన చదువేదో మనం చూసుకుని జీవితంలో స్థిరపడాలని!!. అడిగిన వన్నీ ఇస్తాను .ఏదిష్టమో అదే వండిపెడతాను. బయటికెళ్లాక ఎట్లా వుంటాడో ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది ”  కళ్ళు తుడుచుకుంటూ అంది విజయ.
అంటే ,వాడు ఎవరికోసమూ ఏమీ చెయ్యడనీ ఇట్లా తను ఊహించే ప్రమాదాల్లో ఇరుక్కుంటాడనీ విజయ ఉద్దేశమా ఒక వేళ వాడికే ఏ ప్రమాదమన్నా జరిగుంటే వాడికి సాయం చేసి ఇంటికి తెచ్చేవాళ్ళే వుండరా? ఆ ఊహ కూడా రావడం లేదు.,ఆ ఇంట్లో పుట్టి పెరిగిన తన మనవరాలికి! పైగా గట్టి నమ్మకంతో వుంది ఏదో చెడే జరిగిందని! పరిస్థితుల్లో అంత మారొచ్చిందా అని ఆశ్చర్యపోయింది అమ్మమ్మ.
కొన్ని యుగాలకి సూర్యుడొచ్చాడు.పిల్లాడురాలేదు.వాకిట్లో పడివున్న పాల పొట్లాలూ వార్తాపత్రికా తీసుకుని పని చేసిపెట్టే దుర్గ వచ్చింది.
లేమ్మా ! లేచి కాసిని కాఫీ తాగి ఇప్పుడేం చెయ్యాలో చూడు .నీ స్నేహితులెవరికైనానో మీ ఆయన స్నేహితులకెవరికైనానో ఫోన్ చేసి పిలు . అట్లా ఏడిస్తే ఏమవుతుంది అని మళ్ళీ బ్రతిమిలాడింది అమ్మమ్మ
విజయ పత్రికలోని  సిటీ టాబ్లాయిడ్ తీసుకుని అందులో హత్యలు, ప్రమాదాలూ దొంగతనాలూ వేసే పేజీ చూసింది. ఎక్కడా తన పిల్లవాడికి సంబంధించిన వార్తలాంటిది కనిపించలేదు. రోజూ వుండే వివాహితల ఆత్మహత్యలూ రోడ్డుప్రమాదాలూ వైగైరాలున్నాయి.కాస్త కుదుటపడి కాఫీ తాగుదాం అనుకుంది కానీ అది నోటికి పోలేదు. కడుపులో తిప్పింది. అయినా రాత్రి జరిగిన సంఘటన అప్పుడే పేపర్లోకి ఎట్లా ఎక్కుతుంది? ప్రమాదం పాలై రోడ్డు మీద పడి వున్న వాడిని పట్టించుకునేదెవరు? పోలీసులకో, నూట ఎనిమిదికో ఫోన్ చేసే తీరిక ఎవరికి? లేనిపోని బురద అంటించుకోడం ఎందుకు, మన పని మనం చూసుకుపోదాం అనుకుంటారు కదా అందరూ!
అప్పుడు
పిలిచే గంట మోగింది;
ఎవరే వార్త మోసుకొచ్చారో అని సోఫాలో కూలబడి పోయింది విజయ
ఒకవేళ పిల్లాడే వచ్చాడేమో! దుర్గమ్మా త్వరగా తలుపు తియ్ తల్లీ అంది అమ్మమ్మ
**************************************************************************************











Wednesday, November 05, 2014

సీపురు

                  సీపురు                              పి.సత్యవతి
మా అన్న పేపర్లేసేకాడ  ఇచ్చిన జీతం కూడ బెట్టి సెల్లు కొన్న కాడ్నించీ రోజూ అయిదింటికే అలారం మోగుద్ది .సచ్చినట్టు .అప్పుడే అందరం లెగిసిపోతున్నాం! పొగమంచుపట్టేసి ఏడైనా ఎనిమిదైనా ఎలుగే రాడంలేదిప్పుడు. అంతపొద్దున్నే లెగిస్తే గాని పన్లుగావట్లేదని అందర్నీ లేపేస్తుంది మా యమ్మ. మా నాన అటో తోలుకుని టేషన్కాడికెళ్ళాల .తెల్లారెతలికల్లా బోలెడు రైళ్ళొస్తయ్ గందా!!.అమ్మ పంపుకాడ నీళ్ళు పట్టాలి . నేను పాలుత్యావాలి .టీ పెట్టాలి.  ఒకటేమిటి ,శానా పన్లుంటయ్. ఇయ్యాళైతే నేనసలు లెగదల్చుకోలేదు. పాలు త్యాదల్చుకోలేదు .పనికి పోదలుచుకోలేదు .అబ్బో దానికి శానా కథుంది. అందుకే బాగా ముసుగేసుకుని ముడుచుకుని పడుకున్నా.. అన్న పేపర్లెయ్యడానికి పోయినాడు.. వాడొచ్చేతలికి అన్నం కూరా వండాలి.డబ్బా పెట్టుకుని కాలేజీకి పోతాడు. మహాతల్లి  ఏం జేసుకుంటుందో చేసుకోనియ్! ముసుగులో దూరి చెవికాడ గుయ్యిమంటున్నయ్ సన్నాసి దోమలు. పడుకోబుద్ధి కాకుండా....కానీ పడుకోవాలి తప్పదు. అంతలోకే దుప్పటిమీదినించీ నడ్డిమీద ఒకటేసి, మొహంమీద ముసుగులాగి .పో! పో !పాల్తాపో అని గసిరింది.మా యమ్మ..
నా సీపిరి డబ్బులు నాకిచ్చెయ్ ! లాపోతే ఇయ్యాళ నేను పనికి పోను ఎండొచ్చినాకే లెగుస్తాఅని మొండికేశాను
నీ ఎదవ సీపిరీ నువ్వూ ! ఇవ్వనా ఏంటి? రేపిస్తాలే! ఇయ్యాళ కూడా కొట్లో కొత్త సీపుర్లు రాలేదని చెప్పు. అని పాలకోసం ఇరవై రూపాయల కాగితం నామీదకి విసిరేసింది.
నేను ఇంక అబద్ధాలు సెప్పను. అని మళ్ళీ మొహం మీదకి ముసుగు లాక్కున్నాను.
ఏందే గొడవ ! సొర్ణమ్మా! లెగమ్మా .అంటూ వచ్చాడు నాన
ఇక తప్పదని .లేచి  బయటిగుమ్మంకాడున్ననాన  సెప్పలు తగిలంచుకుని సందు సివరికిపోయి ,పాలపాకెట్టు తెచ్చి టీ పెట్టాను  ఇయ్యాళ పనికి పోకపోతే శానా గొడవవుతుందని తెలుసు. ఆడపిల్లల ఆస్టల్లో వుండి మూడేళ్ళకాణ్ణించీ ఇంజినీర్ చదువుతున్న ఆళ్ళమ్మాయీ, ముసలాళ్ళ ఆస్టల్లో వుంటున్న ఆళ్లత్తా వస్తారంట. అంతా కలిసి కట్టకట్టుకుని పొద్దున్నే ఏడకో పోతారంట .సార్ అఫీస్ కెళ్ళేదాకా నేనుండాలంట...ఏందేందో సెప్పింది మేడంగారు. ఇయ్యాళకూడా సీపురు తీసుకుపోకపోతే ఆంగారు అసలు ఊర్కోదు. నాలుగు రోజులాయె వందరూపాయలిచ్చి.సర్లే కానియ్ మరి! ఏదో ఒకటి సెప్పి తప్పించుకుందాం! పాపం అవసరానికి ఇబ్బంది పెట్టకూడదు గందా! అనుకుని  ఒణుక్కుంటూ స్తానం కానిచ్చి జడేసుకుందామని అద్దం ముందు నుంచుంటే  గడ్డం మీద అప్పుడప్పుడే మొలుస్తోంది ఎదవ మొటిమ! నిన్న సాయంతరంలేదు. తెల్లారేటప్పటికి మొలుచుకొస్తోంది. చిదుపుతేనో అని ఆలోచించాను. అసలుకి నెయ్యీ నూనా కేకులూ మిఠాయిలూ తింటే మొటాలొస్తయ్యని కూతుర్ని అట్టాంటియి తినొద్దని మేడం గారు చెబుతుంటుంది .మరి మనం నెయ్యే కొనం గందా? మిఠాయిలా నా తలకాయా? ఏవైనా కానీ ఈ నెల మొటాలకి రాసే క్రీము కొనాల్సిందే! అయ్యో! దేముడా! మా అమ్మ వుందే! ఆంగారికి ఎక్కడెక్కడి డబ్బులూ సాలవు .ఒకనాడు స్టోర్ బియ్యానికి డబ్బుల్తక్కువైనైయ్యంటది. ఒకనాడు గ్యాసు కి  ఏడొందలు పెరిగిందంటది.
ఇదిగో ఇట్టాగే   నాలుగురోజుల నాడు మేడంగారు,
ఏంటా చిమ్ముడూ?ఎక్కడి కసువు అక్కడే! కాస్త వొంగి సుబ్బరంగా చిమ్ము అని కేకలేసింది
ఈ ఎదవ పొట్టి సీపురుతో   ఎట్టా సిమ్మాలి? నా వల్లగాదు కొత్త సీపురు కొనమని నెలకాణ్ణించీ సెప్తున్నా అని ఆవిడ భాషలోఎదురు సమాధానం సెప్పేను
అప్పుడావిడ విసురుగా పోయి ఓ యాభై కాగితం పట్టుకొచ్చి రేపొద్దున పనికొచ్చేటప్పుడు చీపురు కొనుక్కురాఅంది
అయ్యో! మేడం ఇప్పుడు కుంచె సీపురు డేభ్భై ,ఎనబై తక్కువకి రాదు ,, అంటే విసుక్కుంటూ ఇంకో యాభై కాయితం ఇచ్చింది. ఇచ్చి ఇన్ని డబ్బులుపోసి పిచ్చి చీపిరి తేకు. బాగా పొడుగుండి మంచి కుంచె వుండి ఆరు నెలలైనా వచ్చే గట్టి చీపురు ఏరి తీసుకురా అని పది సార్లు చెప్పింది
. అప్పటికి చీకటి పడిందిగందా,రేపొద్దున కొనుక్కుపోదాంలే అనుకుని ఇంటికి వచ్చానా,.అప్పుడే అమ్మ సంచితీసుకుని బజారుకి బయల్దేరింది .
స్టోర్ లో సరుకులిచ్చేందుకు ఇయ్యాళ ఆకర్రోజంట. నాదగ్గర వంద తక్కువైనై .సరోజక్క నడిగి తేపో ! మీ నానొచ్చిన్నాక ఇద్దాం అన్నది
అప్పుడు సరోజక్క ఇంటికి పోయే ఓపిక లేక నా దగ్గరుండై తీస్కో ! నానొచ్చినాక ఇయ్యి అని గభిక్కిన ఇచ్చాను .అదీ నేంజేసిన తప్పు నాన ఆ వందా అప్పుడే ఇచ్చాడు.ఈంగారే దాన్ని దేనికో వాడేసింది. అప్పటాల్నుంచీ చీపురేదీ? అని మేడంగారూ “”కొట్లో మంచి సీపుళ్ళు లేవమ్మా రేపో ఎల్లుండో వస్తంయ్యంటఅని నేనూ !
ఎంత సేపు నించుంటావే అద్దం కాడ! ఈ మద్దెన నీకు సోకులెక్కువైనై అంటోంది అప్పుడే! ఎప్పుడూ కళ్ళు నామీదే మా యమ్మకి
నా సీపిరి డబ్బులిచ్చై .పనికి పోతా అన్నాను ఠక్కుమని
ఇంక మొదలేసింది సొద. ముక్కు సీదింది .అరిసి గోలెట్టింది ఒయ్ నాయనోయ్.!ఆపు తల్లీ! ఇంటికన్న పనికాడే నయం.
 ఈ ఎదవ మొటిమఒకటి! ఎప్పుడూ సెయ్యి దానిమీదకే పోతది ! గిల్లిపారేద్దామా అనిపిస్తది ! బయటికి బాగానె పొడుచుకొచ్చింది.
ఆదిలచ్చమ్మత్తయ్య కొడుకు పనికి పోయేటప్పుడు ఒచ్చేటప్పుడూ మిర్రి మిర్రి సూస్తావుంటాడు.ఆడ్ని పెళ్ళి చేసుకుంటే ఎట్టా వుంటుందబ్బా? పని సెయ్యనియ్యకుండా ఇంటో కూచోబెడతాడేమో! ఆ అదిలచ్చమ్మ మా యమ్మకి తగిందే!! ! ఎప్పుడూ కీచుగొంతుతో అరుస్తానే వుంటది. ఒద్దులే నాయనోయ్! మాయమ్మే నయం. మానాన  కూడా శాన మంచోడు. ఆళ్ళనాన మంచోడు కాదు. తాగేసి ఊ అరుస్తా వుంటాడు,
ఎందే! అద్దం ముందునించీ కదలవూ? మళ్ళీ పెద్ద కేక
మాలావు అరిచ్చంద్రుడు బయల్దేరింది అబద్ధాలు సెప్పదంట.అని  గొణుగుతోంది.
పొగమంచు వదిలి ఎండ బయటికొస్తావుంది. అన్ని ఈధుల్లో ముగ్గులే ముగ్గులు.ముగ్గుల్లో రంగులు. నేనూ నిన్న సాయంతరమే ఆళ్ల వాకిట్లో ఇరవై సుక్కల పెద్ద ముగ్గేసొచ్చా. ముగ్గేస్తున్నప్పుటకే బాగా సీకటిపడింది. వంగి ముగ్గేస్తుంటే సార్ ఆఫీస్ నించీ ఎప్పుడొచ్చాడో ఎనకాతలే నించుని వున్నాడు. నేను ఉలిక్కి పడ్డాను.
అబ్బో స్వర్ణా! నువ్వు పెద్ద ఆర్టిస్టువి.ఈ నెలరోజులూ ఇంతబాగా వాకిలి అలంకరించినందుకు నీకు పండక్కి పెద్ద బహుమతి ఇవ్వాలి అని భుజం మీద కొట్టి పోయాడు. ఏందో ఈ పని? అని కాస్త ఆశ్చర్యమేసింది.
అనుకున్నట్టె ఆళ్ళిల్లంతా మా సందడిగా వుంది. ముసలమ్మా మనవరాలూ వచ్చారు. అంతా అమరావతో అన్నారమో ఏడికో పోతారంట. వాకిట్లో  పెద్ద కారొకటుంది. మేడమ్గారు సీపురు మాటెత్తకుండావుంటే బాగుండున్రాదేవుడా అనుకుంటు లోపలికొచ్చాను. లోపలికొచ్చానంటే ఇక అది చెయ్ ఇది చెయ్ .ఇట్రా ,అటుపో. ఇది తియ్ .అది కడుగు అంటూ పన్ల మీద పన్లు .అట్టా కాసేపయినాక కారు కదిలింది.ఇంక సారు ఆఫీసుకెళ్ళిపోతే నేనింటికి పోవచ్చు. అమ్మయ్య! సీపురు గండం గడిచింది ఇయ్యాళ్టికి!
ఇదుగో స్వర్ణా కాస్త కాఫీ కలిపిస్తావా?అన్నాడు సారు
ఇపుడేం కాఫీ సార్ ! అంటే ,కాదులే కలుపుఅన్నాడు
కాఫీ కలపటానికి స్టౌ దగ్గరికి పోయాను. సార్ నావెనకాలే!
నాకు కాఫీ దగ్గరుండి కలిపించుకోటం అలవాటు..ముందు కప్పులో నీళ్ళు కొలిచి పెట్టు స్టొవ్ మీద
నా వెనకాలనించీ కదలడు.!అప్పుడే గడ్డం చేసుకుని చెంపలకి ఏదో పూసుకుని  వచ్చాడు. ఏదో వాసన !మంచి వాసనే అనుకో! అయినా బాగా అనిపించలేదు.
మీరెళ్ళండి సార్ ! నేను కలిపి తెస్తాగా! నాకు తెలుసు చిరాకుపడుతూ అన్నాను.
కొంచెం వెనక్కి జరిగాడు. అప్పుడాయన సెల్ మోగింది. అమ్మయ్య! సెల్లాయన ఎంత మంచోడో! అనుకుంటూ కాఫీ కలిపాను,
సెల్ తీసుకుని లోపలికొచ్చాడు. సెల్ నా వైపు తిప్పాడు. నామొహం మీద ఒక మెరుపు మెరిసింది
 ఇవ్వాళ చాలా బావున్నావు నువ్వు .ఈ పోటో నీకు ఇస్తాను పెళ్లి చూపులకి వాడుకో అన్నాడు చెమటపోస్తోంది.  సార్ ఇవ్వాళ కొత్తగా వున్నాడు. మళ్ళీ ఆయన సెల్ మోగింది.
ఇంక నేను ఇంటికి పోతా సార్! మీరు ఆఫిస్ కి పోండి అన్నాను చున్నీతో మొహానికి పడుతున్న చెమట తుడుచుకుంటూ
మీ మేడం ఇవ్వాళ ఇల్లేమీ సద్దకుండా పోయింది.కాస్త ముందు గదిలో పేపర్లవ్వీ సరిగ్గా పెట్టుఅంటూనే
ఫ్రిజ్ తీశాడు అందులోనుంచీ ఆ మధ్య అమెరికా చుట్టాలెవరో తెచ్చిచ్చిన  చాక్లెట్ ఒకటి తీసితిను బాగుంటుంది అన్నాడు
ఒద్దు సార్! చాక్లెట్లు తినను...అలవాట్లేదు అన్నాను
ఏం ?లావవుతానని భయమా? ఫర్లేదు ఒకటి తింటే ఏంకాదు అన్నాడు
తీసుకోలేదు.స్టౌ దగ్గర పెట్టాడు. కాఫీ ఇచ్చాను.
సరే ! నేను స్నానం చేసొస్తాను .నువ్వు పనిచేసుకుంటూ వుండు అని  బాత్ రూమ్లోకి పోయాడు.
పేపర్లు బొత్తి పెట్టాను .అక్కడక్కడా దుమ్ముంటే దులిపేసాను.
స్నానం చేసొచ్చాడు రోజూ ఈపాటికి ఆఫీసుకు పోతాడు..ఇయ్యాళ ఆలీసం చేస్తున్నాడు,
గూడ్ ! చక్కగా సద్దేశావు.. మంచిపిల్లవి! ఈ డబ్బుల్తీసుకో ! ఏవైనా కొనుక్కో! అని వంద రూపాయల కాయితం  పర్సులోనుంచి తీసి చేతిలో పట్టుకున్నాడు,
వద్దుసార్!
ఫర్లేదుతీసుకో..చాలాపని చేస్తావు పాపంఅన్నాడు
ఈ ఎదవ మొటిమ అప్పుడే దురద పుట్టింది చూపుడేలితో గోక్కున్నాను
 ఏవైనా కొనుక్కో! ఫెయిర్నెస్ క్రీమో. మొటిమల మందో.అన్నాడు కాయితాన్ని నా కళ్ళముందు ఆడిస్తూ
సరే సార్! అని కాగితం లాగేసుకుని  తలుపు తీసుకుని బయటికి పరుగో పరుగు.   .చాలా పొడుగ్గా వుండి మంచి కుంచె వున్న గట్టి సీపురుతో ఎప్పటకైనా పనిబడుద్దిగందా!  మన సేతికి డబ్బొచ్చినపుడే  కొనుక్కొచ్చిపెడితే పోలా!!!!...
     (చినుకు మాస పత్రిక 2014 )    *****************************************************************************************