Friday, September 30, 2011

శివరాజు సుబ్బలక్ష్మి

స్వాతంత్య్రానికి పూర్వమూ ,తరువాతి తొలి దినాలలోనూ ఆంధ్ర దేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబా

లలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి.ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే వుంటాయవి. 1925 లో జన్మించి.న సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రయివేటుగా మెట్రిక్ వరకూ చదివారు. ఇంట్లో స్త్రీల సంభాషణల ద్వారా భాష లోని సొబగులు అర్థం చేసుకోవచ్చని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్లు ,సుబ్బలక్ష్మి గారి కథల్లో ఎక్కడా సంస్కృత ఛాయలు కనపడవు,పాఠకులని కూచోబెట్టి అచ్చమైన తెలుగులో కథలు చెబుతారామె

దాదాపు ఆమె అరవై సంవత్సరాల కాలంలో వ్రాసిన ఇరవై ఎనిమిది కథలతో మనో వ్యాధికి మందుందిఅనే కథా సంకలనం 1998 లో బుచ్చిబాబు స్మారక కథా కదంబం శీర్షికన వేదగిరి కమ్యూని కేషన్స్ ప్రచురించింది..

ఈ కథల్లో చాలావరకూ సుబ్బలక్ష్మి గారు పెరిగే వయసునాటి ఆడపిల్లల జీవితాన్ని.చిత్రించినవే.చాలామంది ఆడపిల్లలకు చదవులు లేవు.వున్నా చాలా తక్కువ .చిన్నవయసులో వివాహాలు.పెద్దవాళ్లలో చేరగానే( పెద్దమనిషి కాగానే) అత్తగారింటికి పంపడం. భర్తలు చదువుకుంటూనో ఉద్యోగాలు చేస్తూనో పట్నాలలో వుంటే ఈ పిల్లలు అత్తగారింటో వుండి చాకిరి చేస్తూ మాటలు పడుతూ కళ్ళు తుడుచుకుంటూ భర్త ఎప్పుడు తీసుకు వెడతాడా అని ఏళ్లకొద్దీ ఎదురు చూస్తూ వుండాలి.ఒక పట్టాన కొడుకునీ కోడల్నీ కలవనివ్వరు అత్తలు.ఆడబడుచులు.వాళ్లకి కొత్త పిల్లమీద ఎప్పుడూ నిఘా.ఒక అహేతుకమైన అసూయ.తప్పులు పట్టడం పుట్టింటివారిని దెప్పడం.ఏదో ఒకటి అని ఏడిపించడం ..పెళ్ళి చేసి పంపడం వరకే తమ బాధ్యత.ఆ పైన పిల్ల అదృష్టం అనుకుని ఆమె కర్మకి ఆమెని ఒదిలిపెట్టే తల్లితండ్రులు.ఏ మాత్రం చనువూ ప్రేమా లేని చోట భర్త తనని ఎప్పుడు పట్నం తీసుకు వెడతాడా అని ఏళ్ళూ పూళ్ళూ ఎదురు చూపు...తమ్ముళ్ళ చదువులు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఇన్ని బాధ్యతలను మోయాల్సిన ఆ భర్త గారికి భార్య మనసులోకి చూసే తీరుబడీ ధైర్యమూ వుండవు.తన భార్యను తను ఉండే చోటికి పంపమని తల్లి తండ్రులను అడగడానకి కూడా బెరుకూ భయమూ ...అత్తగారింటి సౌడభ్యం అలా వుంటే ఇక పుట్టింట్లోనూ అనేక కుటుంబరాజకీయాలు.. పిల్లకూ పిల్లకూ మధ్య తేడా చూపించే తల్లులు,,ఒక్కొక్క చోట సవతి తల్లుల ధాష్టీకం ,అసమర్థులైన తండ్రులు ,వయసెక్కువైన వాడితో రెండో పెళ్ళికి ముడిపెట్టి చేతులు దులిపేసుకోడాలు, కాటుక కన్నీళ్ళతో నల్లపడిపోయిన గుంటల మధ్య ఉబ్బిపోయిన కళ్ళు, ఆత్మ హత్యలు ,పిచ్చాసుపత్రి కటకటాలు వెరసి చదువులేని, పుట్టింటి అండ లేని, చొరవలేని, ధైర్యం లేని అప్పటి ఆడపిల్ల జీవితం. అయతే ఈ నిరాశా మయ వాతావరణంలో కూడా అక్కడక్కడా తమ భార్యల్ని కాపాడుకున్న భర్తలున్నారు. అతను కాపాడి అక్కున చేర్చుకుంటే తప్ప ఎక్కడినించీ ఏ సహాయమూ లేదు వాళ్ళకి.

పెళ్ళంటే ఏమిటో తెలియని ప్రాయంలో పెళ్ళళ్ళు కుదిరిపోతాయి .కాపురంఅనే కథలో జానకి అనే అమ్మాయికి పెళ్ళి కుదిరిన పద్ధతి ఇలా వుంటుంది

ఇంకా చీకటి వుండగానే వాళ్లమ్మ నిద్రలేపింది. వాళ్ళ పిన్ని ఆ పిల్లకి ముస్తాబు చేసింది.ఎందుకో ఏమిటో ఎవరూ చెప్పలేదు. గజ్జల పట్టెడ పెట్టింది.వాళ్లక్కకి అత్తగారు పెట్టిన చంద్రహారం వేసింది అప్పుడు అక్కడున్న వాళ్లక్క అత్తగారు దాన్ని కాస్తా ఊరేగించేవు జాగ్రత్త అని వెటకరించింది. వాళ్ళు చూసుకోడం లాంఛనాలు మాట్లాడుకోవడం నాలుగు రోజుల వ్యవధిలో ముహూర్తం పెట్టడం, వైభవంగా పెళ్ళి జరిగిందని నలుగురూ చెప్పుకోడం మాత్రం తెలుసు ఆ పిల్లకి.ఈ జానకి ఆ ఇంటి పెద్దకోడలుగా వెళ్ళి చాకిరీ చేసి అవమానాలు పడి ఆఖరికి పుస్తెల గొలుసుకూడా ఉమ్మడి కుటుంబానికి ధారపోసి,ఏడ్చుకుంటూ స్నేహితురాలింటికి వెడితే అప్పటికి భర్తగారికి ఆమె మీద ప్రేమ పుట్టుకొచ్చి వెతుక్కుంటూ వెళ్ళాడు.

మట్టిగోడల మధ్య గడ్డిపోచ కథలో అక్క పెళ్ళినాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు పార్వతికి. ఆ వయసు పిల్ల దృష్టి తోనే అక్క పెళ్ళి వేడుకలనీ బావగార్నీ చూసింది. అక్క పెళ్ళి కాగానే ఆమె మామగారు, ఆ తరువాత కొన్నాళ్ళకి మరిదీ పోయారని అక్కని అత్తగారు ఈసడించింది. ఒక సారి పుట్టింటికి వచ్చిన అక్క చాలా చిక్కి పోయి వుంది.తిరిగి వెళ్ళేటప్పుడు పార్వతికి ఇప్పుడే పెళ్ళి చెయ్యొద్దు నాన్నా దాన్ని చదివించండి అని మరీ చెప్పి పోయింది..పార్వతి పెద్ద మనిషి అవగానే ఇంట్లో నిబంధనలు మొదలయ్యాయి ఇలా నడవకు ఇలా మాట్లాడకు ఇక్కడికి వెళ్ళకు అక్కడకు వెళ్లకు అని .అక్క చదివించమందే కానీ ఆమెనెవరూ స్కూల్ కి పంపలేదు కావ్యాలు చదివంచమన్నారు గానీ అదీ కొనసాగలేదు. పార్వతిని అత్త కొడుకు రామం బావకి ఇవ్వాలని బామ్మ అనకుందే కాని అతడు కిరస్తానీ అమ్మాయిని చేసేసుకున్నాడు.పార్వతి బాధపడింది నాకేం చదువా? సంగీతమా? ఎలా చేసుకుంటాడు బావ?అని సమాధానపడింది. అంతలోనే అక్క నూతిలో దూకేసింది. అక్క నూతిలో ఎందుకు దూకిందో పార్వతికి అర్థం కాలేదు. కొన్ని నెలలు గడిచాక ఒక రోజు చీకట్లో కొంతమంది పెద్దలు దిగబడ్డారు తండ్రీ బామ్మా ఏమిటో మాట్లాడుకున్నారు.తల్లి వచ్చి తనకి రహస్యంగా నువ్వు ఒప్పుకోకు వాళ్ళు అడిగితే అని చెప్పింది.వాళ్ళెవరూ పార్వతినేమీ అడగలేదు.అక్కభర్తతో పార్వతి పెళ్ళీ జరిగిపోయింది...పార్వతి ఆవూరికి కాపరానికి వచ్చింది.భర్తకి ఎవరో స్త్రీతో సంబంధం వుందని తెలిసింది.తనని పట్టించుకోనేలేకపోయినా అక్క చావుకు కారణమెదో అర్థమైనట్లు తోచింది.భర్త నిర్లక్ష్యం గమనించిన అత్తగారు ఆమెని ఆదరించడం మొదలు పెట్టింది.ఇక ఈవిడ వెంటే నాబ్రతుకు ఇలా గడిచిపోవాల్సిందే అనుకుంటుండగా అతనొక రోజు పార్వతి గదిలోకొచ్చాడు. మరునాడు ఆమెను చూసి నవ్వులు చిలకరించడం అత్తగారు చూసింది.ఆవిడకి ఒళ్ళుమండింది.కోడలి పైన ఆదరం తగ్గింది ..పార్వతికి అర్థమైంది. మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం అక్కయ్య జీవితం.శూన్యంలో వెలిగించిన ప్రమిదలా ఎంతకాలం నిలవగలనో!! అనుకుంది ఆ వూరిలాంటిదే ఆ ఇల్లు దుప్పలూ ,పుంతలూ శిధిలాలూ,వాటిని చుట్టి మొండి గోడలు .అందులోనే తను జీవించాలి.గడ్డిపోచలా. .అనుకుంది.కాలం వేసిన ఎగుడు దిగుడు బండల పైన జీవితం సాగుతోంది పార్వతికి.

శిల్పపరంగా కధన పరంగా వర్ణనల పరంగా సుబ్బలక్ష్మి గారి కథలన్నింటిలోకీ అగ్ర స్థానం లో వుండే కథ ఇది

తెల్లవారింది కథలో మల్లికాంబ,మగతజీవి చివరి చూపులో కాంతమ్మ రెండో పెళ్లి కి కట్టబడ్డ వాళ్ళే అందులో మల్లికాంబ భర్త డబ్బుని లెక్క బెట్టి దాచి అప్పగించాలే కానీ, రూపాయి తనకి వాడుకోకూడదు.ఒక సారి చెయ్యని నేరానికి దెబ్బలు కూడా తింటుంది.కానీ ఒక సారి తన స్వంత తమ్ముడి చదువుకోసం భర్త డబ్బు దొంగలించి నేరభావంతో కుమిలిపోతుంది.రెండవ భార్యమీద మొదటి భార్య సంతానం ఈసడింఫూ అనుమానాలూ ,అవమానాలూ వాళ్ళ బంధువుల వెటకారాలు భరిస్తూ రోజులు గడుపుక పోయే వాళ్ళు కొందరైతే ,సవతి పిల్లలను నరక యాతనకు గురి చేసేవాళ్లు మరికొందరు.

పోస్ట్ చెయ్యని ఉత్తరం కథలో ఇందిర ఆ ఇంట్లో అడుగు పెట్టి పదేళ్ళు ఇట్టే తిరిగి పోయాయి. పెద్ద మార్పులు లేవు .అప్పుడప్పుడూ అత్తగారిమీద అలగడం,ఆడబిడ్దని కసరడం, అత్తగారు కూకలెయ్యడం,మరుదుల పుస్తకాలు తీసుకుని చదవడం,అట్టలు నలిగాయని ఫిర్యాదులు, పనిమనిషి నాగాలు ,పెరట్లో కళ్ళాపులు, పక్కింటి ముచ్చట్లు చెప్పుకోడం , దడి అవతల గుడిసెల్లో తగాదాలు విని నవ్వుకోడం ఇది ఆమె దిన చర్య.పదేళ్ళుగా ఆమె భర్త పట్నంలో వుండి చదువూ ఉద్యోగం వెలగబెట్టి తమ్ముళ్ల చదువుకి డబ్బు పంపుతున్నాడు .ఇందిరని తన దగ్గిరకి తీసుకు వెళ్ళడు.ఈ లోగా ఆమె ఆడబిడ్డ భర్త ఆడబిడ్దని కాపురానికి తీసుకు వెళ్ళాడు. వాళ్ల అన్యోన్యం చూసి ఇందిర బాధ ఎక్కువైంది.అప్పుడు ఇందిర భర్త ఒక ఉత్తరం వ్రాసాడు చాలా పెద్దది దాన్ని మరిది లాక్కు పోయి ముందుగా చదివి ఇచ్చాడు..తనని రమ్మనే రాసి ఉంటాడని ఉత్సాహ పడింది ఇందర.తననొకమ్మాయి ప్రేమించిందట.తను కాదంటే ఆత్మహత్య చేసుకుంటుందట .ఆమె ఆత్మ హత్య చేసుకుంటే తను బ్రతకలేడట.ఆమె అతనితో వుండడానికి ఇందిర సమ్మతి తెలుపుతూ వుత్తరం వ్రాయాలట.అప్పుడు ఆమెను ఒప్పించి ఇందిరను తీసుకు వెడతాడట.పదేళ్ళ నిరీక్షణ కు అందిన ఫలితం.భర్తను తన వైపు తిప్పకునే చాక చక్యం ఇందిరకు లేదని అత్తగారు ఆమెనే తిట్టింది. అతను కోరినట్లే ఉత్తరం వ్రాసి పరుపు కింద పెట్టి,తను మాత్రం అఖండంగా మండుతున్న నీళ్ళపొయ్యికి కొంగు అంటించుకుని సమస్య పరిష్కరించుకుంది ఇందిర. కథలు చెప్పే గౌరి కథలో గౌరిని ఒక బండరాయిలాంటి వాడికి కట్టబెట్టారు.అతని తల్లి తగనిది.ఆమె జీవితంలో వెలుగునింపిన వాడు గిరి.అనే బంధువు.

తమ అజ్ఞానంతో మూర్ఖత్వంతో కొడుకుల్ని కోడళ్ళని కలవనీకుండా చేసి,ఆకొడుకులు ప్రత్యామ్నాయాలు వెతుక్కోడాన్ని కోడళ్ళ అసమర్థత కింద చిత్రించడం ,కాలంతో పాటు కోడళ్ల హృదయాలు మొద్దబారడం, అణచి పెట్టుకున్న కోపాలు ఆవేదనలు కోరికలు అన్నీ తమకూ కోడళ్ళొచ్చే వేళకు పడగ విప్పడం అట్లా తరాల తరబడి అత్తా కోడళ్ళ వైరి సంబంధం కొనసాగుతుంది. అభమూ శుభమూ ఎరుగని వయసులో పెళ్ళి చేసుకుని అత్తతో కాపురం చెయ్యడానికి వెళ్ళిన ఈ చిన్న పిల్లలకి పుట్టింటి ఆసరా కూడా తక్కువే. ముంజేతి కంకణం అనే కథలో శాంత కు తండ్రి కొ౦త పొలం ఇస్తే ఆమె భర్తతో బొంబాయి నగరం లో వుంటూ డబ్బుకు ఇబ్బంది పడుతున్నా అన్న ఆమెకు పొలం తాలుకు అయవేజు ఒక్క రూపాయి కూడా ఇవ్వక అందరితో డబ్బిచ్చి పొలం రాయించేసుకున్నానని చెప్పుకుంటాడు.ఇంట్లో వున్న మేనత్తల బంగారాలు కూడా తనే తీసుకుంటాడు.ఒక మేనత్త మాత్రం శాంత కివ్వమని ఒక గొలుసు వీరయ్య కిచ్చి పోయింది..అన్న మంచి ఇల్లు కట్టుకుని వదిన వంటినిండా బంగారం దిగేసి కూతురికి బాగా కట్నం ఇచ్చి పెళ్ళీ చేయడం తను పుట్టింటికి రావడానికి కూడా రైలు ఖర్చులకి తడుముకోడం చూసిన శాంత తన పొలం అమ్ముకుని వెళ్ళిపోయింది.అదికూడా అన్నకు తెలియకుండా రహస్యంగా.మరొక కథలో పెద్దకూతురు జబ్బుతో వున్నా పట్టించుకోని తల్లి,ఇంకొక కథలో ఒక కూతురి నగ మరొక కూతురికోసం వాడి ,ఆ నగ లేనిదే అత్తగారు రానివ్వక పోతే నగ ఇచ్చి కాపురానికి పంపకుండా, ఆపిల్ల చేత ఇంటి చాకిరి చేయించుకున్న తల్లి, పిల్లల మధ్య వలపక్షం చూపే తల్లులు ,వెనకా ముందూ ఆలోచించకుండా గుమ్మంలో కొచ్చిన సంబంధాలకి ఆడపిల్లల్ని కట్టబెట్టే తండ్రులు ..అదృష్ట దేవతనో మొగుడి కరుణా కటాక్షవీక్షణాలకోసమో వేడుకుంటూ కాలం గడుపుకు పోవడమే జీవితం.

ఇంక వితంతువులై పుట్టింటి కొచ్చి అన్నగారి కుటుంబానికి సర్వ శక్తులూ ధార పోసిన ఆశమ్మను ఆమె చివరి క్షణాలలో అన్నకొడుకులు ఎలా వేధించారో చెప్పే కథ,ఒడ్దుకు చేరిన వొంటరి కెరటం.చిన్నతనంలోనే భర్తలను పోగొట్టుకుని పుట్టింటికి చేరిన వితంతువుల రెక్కలు ముక్కలు చేసిన సంసారాలెన్నో ఆ రోజుల్లో!!

మనసు తెచ్చిన మార్పు అనే కథలో కథకురాలిని చదువు మాన్పించి చిన్నప్పుడే బాగా పొలం వున్న సంసారంలో పడేశారు.అక్కడ అత్తగారు,పెద్దత్తగార్ల పెత్తనం. మామగారికి కూడా నోరు లేదు.భర్త కి ఎప్పుడూ పొలమూ ఆవులూ ఎడ్లూ ,

మొదటి పిల్లవాడు పుట్టేవరకూ భర్త బాగానే చూసుకునే వాడు.ఇంట్లో వాళ్లకి తెలియకుండా పౌడరూ అదీ కొనిచ్చేవాడు.ఆ అమ్మాయికి వరసగా అయిదుగురు పిల్లలు పుట్టారు .అప్పుడింక ఎవరూ పట్టించుకోరు. తనూ ఇంట్లో ఒక మనిషి అంతే.. ఆఖరికి పిల్లలకి పేర్లు కూడా అత్తగారూ పెద్దత్తగారే నిర్ణయిస్తారు.ఆమె స్నేహితురాలు చదువుకుని డాక్టరైంది.మరో డాక్టర్ని పెళ్ళి చేసుకుంది. అప్పుడా స్నేహితురాలు చచ్చి పోతే బావుండును అనకుంటుంది కథకురాలు. సుబ్బలక్ష్మి గారి కథలన్నీ అండర్ టోన్స్ లోనూ ,వ్యాఖ్యానరహితంగా రచయిత ఏమాత్రం కల్పించుకోకుండా జరిగింది నిబ్బరంగా చెప్పినట్లు వుంటాయి. పల్లెటూరి జీవితం కళ్ళముందుంటుంది.

సుబ్బలక్ష్మి గారికి తన పన్నెండవ ఏట(1937) అప్పటికి ఎం.ఏ చదువుతున్న బుచ్చిబాబు గారితో వివాహం అయింది..

.బుచ్చిబాబు గారి కథల్లో వర్ణనలు ఎక్కువ నాకు వర్ణనలు లేకుండా వ్రాయడం ఇష్టం అని చెప్పుకున్నారే కాని.సహజంగా చిత్రకారిణి కూడా అయిన ఈమె కథల్లో ప్రకృతి వర్ణనలు తప్పకుండా వుంటాయి. గ్రామాలలో ఇళ్ల నూ స్త్రీల స్వభావాలనూ వాళ్ల ముచ్చట్లనూ వర్ణించకుండా ఏ కథా పొడి పొడిగా వుండదు

సంస్కృత సాహిత్యం గురించి ఏమైనా వివరాలు కావాలంటే బుచ్చిబాబు గారు నన్ను అడిగేవారు.అలాగే ఆంగ్ల సాహిత్యం గురించి నాకెన్నో వివరించేవారు..ఆయన ప్రోత్సాహం తోనే నేను కథలు వ్రాయడం ప్రారంభించాను .బుచ్చిబాబుగారు ఏమివ్రాసినా నేను చదివిన తరువాతే ఎక్కడికైనా ప్రచురణకు పంపేవారు.అంత అదృష్టాన్ని కలిగించిన ఆయనే నాకు పెద్ద స్పూర్తి అంటారు..బుచ్చిబాబు గారితో పంచుకున్న జీవితాన్ని ఆమె ప్రస్తుతం పాలపిట్ట మాసపత్రికలో అక్షర బద్ధం చేస్తున్నారు.అందులో బుచ్చిబాబు గారి ఉద్యోగ రీత్యా అనేకమంది రచయితలతో, కవులతో పరిచయాలు, తను చేసిన ప్రయాణాలు, హాజరైన సభలు సమావేశాలు వర్ణిస్తూ ఆనాటి సాహిత్య సాంస్కృతిక వాతావరణాన్ని అందిస్తున్నారు. ఇటువంటి రచనలు స్త్రీల జీవితాలను కాలానుగతంగా పరిశీలించడానికి చాలా విలువైనవి.

కథలే కాక నీలంగేటు అయ్యగారు అదృష్ట రేఖ అనే నవలలు కూడా వ్రాసిన సుబ్బలక్ష్మి ఇప్పుడు బెంగుళూరు లో వుంటున్నారు.

Friday, September 02, 2011

ఇల్లిందల సరస్వతీదేవి

స్వాతంత్ర్యానికి పూర్వమే తెలుగు సాహితీ రంగంలోకి అడుగు పెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ విస్త్రుతంగా స్పృశించి వందలాది కథలూ కొన్ని నవలలూ లెక్కకు మిక్కిలి వ్యాసాలూ రేడియో నాటికలూ వ్రాసిన ఇల్లిందల సరస్వతీదేవి రచయిత్రే కాక క్రియాశీలికూడా.ఆంధ్రయువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు.కొన్నాళ్ళు జైలు విజిటర్ గా పనిచేశారు.1958 లో ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా నామినేట్ అయి ఎనిమిది సంవత్సరాలు కొనసాగారు.1982 లో స్వర్ణకమలాలు సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.కేసరి కుటిరం స్వర్ణకంకణం సుశీలా నారాయణ రెడ్డి అవార్డు,రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

దేశకాల పాత్రల కతీతమైనది మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వ ధోరణులను,వివిధ వాతావరణాలలో అవి చెందే పరిణామ క్రమాన్ని, విశ్లేషించడం నా మొదటి ఆశయం.అలాగే విశ్వజనీనమైన భావాలను దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యడానికే నా కలం మొగ్గు చూపుతుంది.అనేది తన దృక్పధం అని ఆవిడ చెప్పుకున్నారు.

అలాగేనేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ,ఓరిమి మంచితనం ముందు చూపు కలిగి ప్రవర్తిస్తాయి.స్త్రీలలో వుండే ఓరిమిని చేతకానితనం కింద ఎప్పుడూ అనుకోకూడదు. నా రచనలో స్త్రీ పురుష సమైక్యతను చాటి చెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నించాను కానీ ఏ ఒకరినో సమర్ధించడానికో విమర్శించడానికో ప్రయత్నించలేదు................నినాదాల వలన ఎవరైనా ఏమైనా సాధంచగలరా? ఈ విమెన్స్ లిబ్ అనేది పాశ్చాత్య దేశాల నించీ దిగుమతి అయిన నినాదం.ఈ దేశంలో ఇది ఎంత వరకూ అవసరమో ఆలోచించాలి. నాకు తోచినంత వరకూ స్త్రీలకు సమాన హక్కులు అంటె స్త్రీ పురుషులు కలిసి కట్టుగా జీవించాలే తప్ప స్త్రీలను బడుగు వర్గాలుగా చిత్రీకరించి రిజర్వేషన్లు ఇవ్వడం నా అభిమతం కాదు అంటారు సరస్వతీ దేవి 1992 లో. ఆమె రచనలలో ఈ అభిప్రాయాలనే పొందుపరిచారు. ఆమె వ్రాసిన నవలలలో నీ బాంచను కాల్మొక్కుతా ఎక్కువ పాఠకాదరణ పొందింది.అట్లాగే తేజోమూర్తులుఅనే వ్యాససంపుటి కూడా

నలభై అయిదు సంవత్సరాల సాహిత్య సృజనలో రెండు వందల పైగా వున్న ఆమె కథలలోనించీ ఆమె కథనాన్నీ తాత్వికతనూ ప్రాపంచిక దృక్పధాన్నీతెలిపే కొన్నింటిని మాత్రమే ప్రస్తావించుకోడం సాధ్యం. అన్ని ప్రక్రియలలోకీ కథా రచనే తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పుకున్నారు సరస్వతీదేవి..స్త్రీల చదువుకూ వివాహ వయస్సు పెంపుకూ ప్రాముఖ్యత పెరుగుతున్న తొలి దినాలలో ,జీవితంలోకీ రచనలోకీ ప్రవేశించిన సరస్వతీదేవి కథల్లో వాటికి ప్రాముఖ్యత వుండడం సహజమే.సువిశాలమైన ఆమె కథా క్షేత్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మేలు కీడుల గురించి,మానవుల మనస్తత్వాల గురించి, వాళ్ళు అధిగమించలేకపోతున్న తమోగుణం ప్రభావం గురించీ స్త్రీల క్షమాగుణం గురించీ అట్లాగే కొందరు పురుషులలో వలే స్త్రీలలో కూడా వుండే వ్యామోహాల గురించీ ఎన్నో సంఘటనలు సందర్భాలు ఉదాహరణలు కనిపిస్తాయి.

నూరుకథల సమాహారమైన స్వర్ణకమలాలు లోని మొదటి కథ,కొండమల్లెలుచివరి కథ స్వర్ణ కమలాలు అనేక సంకలనాలలోనూ పాఠ్య పుస్తకాలలోనూ చేర్చబడ్డాయి.స్త్రీ పురుషుల మధ్య ప్రేమ నిలిచి వుండడానిక డబ్బు ప్రధానం కాదు హృదయం ముఖ్యం తృప్తి ముఖ్యం అని చెప్పిన కథ.స్వర్ణకమలాలు లో వర్గ భేదాన్ని కళ్ళకు కట్టించారు. వరకట్నం మూలంగా అవివాహితలుగా వుండి పోతున్న స్త్రీలని వరి దయనీయ స్థితిని చూపించారు.స్త్రీలు విద్యావతులూ ఉద్యోగినులూ అయనా కూడా ఇంటిని తీర్చుకోగలిగినప్పుడే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అనెక కథల్లో సూచించారు.కొందరు స్త్రీలు తమ కోరికలను భర్తతో చెప్పుకోలేక మానసికం గా అసాంతికి లోనవుతారు.ఉదాహరణకి కాత్యాయని అనే ఆమెకి ఫిడేల్ వాద్య కచేరి చేశాక మనసు కుదుట పడింది.ఇలాంటి పాత్రలతో రెండు మూడు కథలున్నాయి.

తులసి దళాలు సంపుటిలో పంచలింగాల గుడి అండర్ టోన్ లో చెప్పిన మంచి కథ. ఆమె కథలన్నీ కూడా సూటిగా పాఠకులకెదురుగా కూర్చుని చెబుతున్నట్లుంటాయి.ప్రమాదకర పరిస్థితుల్లో చిన్న పిల్లలతో వున్న వూరొదిలి పరాయి వూరొచ్చిన అంకమ్మ ఊరు బయట ఖాళీ జాగాలో ఒక గోనె పట్టా కప్పి చిన్ని గూడు ఏర్పాటు చేసుకుంది.ఆ గూట్లో ఒక చోట కన్నం వుంటే గుండ్రని రాళ్ళు ఒక యిదు ఏరుకొచ్చి అడ్దంపెట్టింది.క్రమంగా జనం దృష్టిలో అది పాము పుట్టగానూ ఆ రాళ్ళూ పంచలింగాలు గానూ మారి అక్కడొక వీధి గుడి వెలిసి దానితో పాటు ఆమె వుండడానికి కూడా వసతి ఏర్పడింది.ఆ పంచలింగాల గుడి స్థల పురాణం అది. ఇందులో జనం మూర్ఖ భక్తి మాట అసలు ప్రస్తావించకుండా కేవలం అంకమ్మ కష్టాలనే ప్రస్తావిస్తూ ,అమాయకురాలైన అంకమ్మ తన గూడు పడగొట్టనివ్వకుండా రోడ్డు వేసే ఇంజినీర్ని కూడా ఆపగలగడాన్ని నెమ్మదిగా చెబుతారు సరస్వతీదేవి. డాక్టర్ శాంతి ,మీనాక్షీ హౌసింగ్ కాలనీ ,ప్రాణమిత్రుడు వంటి కథల్లో లోకం పోకడను అంత సునాయాసంగానూ చెప్పారు.సరస్వతీదేవి కథల్లో కష్టపడి చదివి ఉన్నత ఆర్థిక స్థాయికి ఎదిగిన పేద యువకులు ఎక్కువ కనిపిస్తారు .అతి బీదరికంలోనించీ ఏదో ఒకవిధంగా నీతి బద్ధంగానే పైకి వస్తారు.ఇంటి దగ్గర కష్టాలు భరించలేకనో ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేకనో ఇల్లువదిలి బయటికొచ్చిన ఆదపిల్లలకి కూడా ఏదో ఒక విధంగా సహాయం అంది విజయం సాధిస్తారు.

స్త్రీలకు క్షమా ఓరిమీ వుండాలని చెప్పినా అవి ఆత్మాభిమానాన్ని చంపుకుని అలవరచుకోవలసిన గుణాలనీ స్త్రీలెప్పడూ అణిగి వుండాలనీ ఆమె ఎక్కడా చెప్పలేదు.స్వాభిమానం కలస్త్రీలు ప్రేమానురాగాలకు ప్రతీకలైన స్త్రీలు చాలా కథల్లో కనిపిస్తారు..వసంతమ్మ మనమరాలు అనే కథలో రాజీ ,ఎదురుచూడని సంఘటనలో పావని స్వాభిమానంతో తమ జీవితాలపై తామే నిర్ణయాలు తీసుకుంటారు..కూతురుబిడ్దని కని మరణిస్తే,అల్లుడు ఆ బిడ్డని పట్టించుకోకపోతే ఆ బిడ్దల్ని కంటికి రెప్పలా సాకిన అమ్మమ్మలుంటారు. చెమటోడ్చిబిడ్దల్ని పెద్ద చేసిన తల్లులంటారు.తప్పటడుగులు వేయబోయే విద్యార్థినులను చక్కదిద్దే అధ్యాపకురాళ్ళుంటారు.తమ పాకెట్ మనీ తో బీదపిల్లల్న అదుకునే ఆదర్శ విద్యార్దులంటారు.

మానవులు గెలవలేని బలహీనతలు గురించిన కథలుఆరవదొంగ మానవులు గెలవలేనిది భార్యని నిష్కారణంగా అనుమానించిన కోటయ్య ,వరదలో చిక్కుకుపోయి కాపాడమని ఎంత వేడుకున్నా ఆమెనూ కొడుకునీ కాపాడకుండా వచ్చేస్తాడు.తల్లి మరణించగా బిడ్దని అతని తల్లి రక్షించి తీసుకొచ్చింది.కానీ ఆ బిడ్ద వున్న ఇంట్లో వుందడం ఇష్టం లేక వేరే పాక వేసుకుంటాడు కోటయ్య..ఈ కథలో వరద భీబత్సాన్ని ,సంపన్నుల నిర్దయనూ కోటయ్య తల్లి మంచితనాన్నీ చక్కగా చూపించారు.అట్లాగే ఆరవ దొంగ కథలో ఆత్మ న్యూనతా భావంతో బాధపడే విశ్వపతి ఎవరి సమర్థతనూ అంగీకరించలేక అసంతృప్తితో అశాంతితో వేగిపోతూవుంటాడు.

సంపన్న స్త్రీలలో వుండ వ్యానిటీ, గుర్తింపుకోసం ఆరాటం,భర్త ఉద్యోగంతో వచ్చే గుర్తింపే శాశ్వతం అనే భ్రమల్లో బ్రతికే స్త్రీలు ,వింత మనస్తత్వాలు.మత కలహాలలో ప్రాణాలు పోగొట్తుకున్న యువకులు,గ్రామీణ రాజకీయాలు, పైకి రావడంకోసం ధన సంపాదన కోసం రంగులు మార్చే ఊసరవెల్లులు,స్వంత అన్నతమ్ముల్నే మోసం చేసి పొలాలు స్థలాలూ లాక్కునే వాళ్ళూ ,నిరాదరణకు లోనయే నిరుద్యోగులు ,ఒకరి సంపాదనమీదే ఆదారపడే ఉమ్మడి కుటుంబంలో రాజకీయాలు ,వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఇట్లా సమాజాన్ని సూక్ష్మంగా దర్శించి కథల్లో ప్రతిబింబించారు .ఆమెకు నగర జీవితంతో ఎంత పరచయముందో గ్రామీణ జీవితంతో కూడా అంతే పరిచయం వుంది.

స్వర్ణకమలాలు,తులసిదళాలు కాక రాజహంసలు అనే అయిదు కథలతో మరొక సంపుటి ప్రచురించారు.అందులో బుద్ధి పిలిచింది మనసు పలికింది కొండంత మబ్బు, ఓ గూటి పక్షులు ,మూగవాడు,మంచివాడు అనే కథలున్నాయి .వీటన్నింటికీ తను కంటితో చూసిన దృశ్యాలే ముడిసరుకు అంటార సరస్వతీదేవి.ఈ కథలు మనుషుల మన్స్తత్వాలకు అద్దంపట్టేవి. ఇవి కాక చందన అనే పెద్దకథ యువ మాస పత్రికలో వ్రాశారు.

దాదాపు పన్నెండు నవలలు వ్రాసారు..కల్యాణ కల్పవల్లి,వ్యాసతరంగిణి,జీవన సామరస్యము,నారీ జగత్తు ,వెలుగుబాటలు,భారతనారి,నాడు నేడు, తేజోమూర్తులు,అనే వ్యాససంకలనాలు, వెలువరించారు. వివిధ పత్రికలలో కాలమ్స్ వ్రాసారు.రేడియో నాటికలు బాల సాహిత్యం కూడా వ్రాశారు.జీవించినంత కాలం జీవించి వుండడం అనే మాటని సార్థకం చేసారు.స్త్రీల అక్షరాశ్యత కోసం స్వావలంబన కోసం వారి ఆలోచనలు విశాలం చెయ్యడం కోసం కృషి చేశారు.

1918 జూన్ పదిహేనో తేదీని జన్మించిన సరస్వతీదేవి 1998 జూలై ముఫై ఒకటిన కనుమూశారు.

(డాక్టర్ ముక్తేవి బారతి గారు రచించిన సాహిత్య అకాడమీ ప్రచురణ నించీ కొంత సమాచారాన్ని వాడుకున్నాను .భారతి గారికి కృతజ్ఞతలతో)

Sunday, August 07, 2011

చాగంటి తులసి

వలయం తిరోగామి వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946 లో బాల పత్రికలో మొదటి కథ వ్రాశారు.యాభయ్యవ దశకం నించే పురోగామి దృక్పథంతో కథలు వ్రాస్తున్నారు. పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకమైన కథలు ఆమెవి. పథ్నాలుగు కథలతో వచ్చిన తులసి కథలు కథా సంపుటి ,”యాత్ర చిన్న నవల ,సాహితీ తులసి అనే వ్యాససంపుటి ,తులసి కథలుప్రచురణానంతరం వ్రాసిన కొన్ని కథలు ,తగవు అనే నాటిక ఆమె తెలుగు రచనలు కాగా, అనువాదాలు ఎక్కువ చేసారు.హిందీ నుంచీ రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా నుంచి గంగ వరకు,సఫ్దర్ అస్మి హల్లాబోల్ ,డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అనువదించారు.ఒరియానించీ సచ్చి రౌత్రాయ్ కథలు గోపీనాథ్ మహంతిబ్రతుకు తెరువు ,ఇంగ్లిష్ నుంచి కేంద్ర సాహిత్య అకాడమి కోసం సరళాదాసు,కాజీ నస్రుల్ ఇస్లాం మోనోగ్రాఫ్ లు ,తెలుగు నించీ హిందీకి సీతా రామ్ కి క్యా లగతీ హై (రాముడికి సీత ఏమౌతుంది (ఆరుద్ర) ) అనువదించారు ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీలోకి ఒరియా లోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు..హిందీలో మహాదేవీకీ కవితామే సౌందర్య భావన్ అనే విషయం పై డాక్టరేట్ తీసుకున్న తులసి ,ఒడిశా ప్రభుత్వ విద్యా శాఖలో రీడర్ గా పని చేశారు తరువాత దక్షిణ కొరియా సియోల్ లోని హాంకుక్ యూనివర్సిటీలో గెస్ట్ ప్రొఫెసర్ గా హిందీ బోధించారు.పదవీ విరమణ తరువాత ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నారు.

యాత్ర నవలలో సీతమ్మ ,తిరోగామి కథలో చిత్ర,.ఆవిడ “ “యాష్ ట్రే” “వలయంకథల్లో కథకులు హుందా కథలో అక్కయ్యా, స్త్రీల పట్ల తులసికి వుండే అభిప్రాయాలకీ గౌరవానికీ రూపకల్పనలు.యాత్ర ని నవలగా కాక పెద్ద కథ కింద విశ్లేషించుకున్నట్లయితే ఇందులో సీతమ్మ ,అమ్మన్న అనే ఇద్దరు పెద్దవాళ్ళమధ్య కల వైరుద్ధ్యాన్ని చెప్పకనే చెబుతూ ,మారిన దేశ కాల పరిస్థితుల్లో ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో పెద్దలు కూడా వాటికనుగుణంగా హృదయాన్ని విశాలం చేసుకోవలసిన అవసరాన్ని, ఒడిశా లోని దర్శనీయ ప్రాంతాల వర్ణనతో కలిపి, తులసి వ్రాసిన పద్ధతి ప్రశంసనీయం. సీతమ్మ కొడుకూ కోడలు మనమలతో కలిసి వుంటూ తన హుందా తనాన్ని, పెద్దరికాన్నీ నిలుపుకుంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ,పొరుగురాష్ట్రంలోని బస్తీ జీవితానికి తగ్గట్టు తన ఆచారాలను సవరించుకుని తను సంతోషంగా వుండి తనతో వున్న వాళ్లని సంతోష పెట్టే పరిణతి చెందిన బామ్మ.ఆచార వ్యవహారాలే ముఖ్యం అనుకుంటూ కొడుకు కోడళ్లలో లోపాలు మాత్రమే చూసి వాళ్లమీద అలిగివచ్చిన అమ్మన్న పై కూడా సీతమ్మ వెలుగు ప్రసరించగలిగింది..1970 దశకంలో వచ్చిన వలయం కథ ఆనాటి మధ్యతరగతి జీవితానికే కాక దేశంలోని పరిస్థితులకు కూడా అద్దం పడుతుంది. ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం కథ గా కనిపించినా ఇందులో నిరుద్యోగం లంచగొండి తనం విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులకు విద్యాబోధనపై ఆసక్తికాక ఇతరవిషయాలపైనే ఆసక్తి వుండడం ,ఆ క్రమంలో ఎంతకాలనికీ పరిశోధనలు పూర్తికానివ్వక పోవడం, పూర్తయినా ఉద్యోగాలు దొరకక పోవడం యువతలో అలజడి ఇవ్వన్నీ కూడా వలయం కథలో అంతర్లీనంగా చర్చకు పెట్టారు రచయిత్రి.అంతే కాదు మానవసంబంధాలను ఆర్థిక కారణాలు ఎలా ప్రభావితం చేస్తాయో కూడా సున్నితంగా స్పృశించారు.ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు వివాహం చేసుకున్నాక రిసెర్చి కోనసాగిస్తూ ఆ వచ్చే స్కాలర్ షిప్పులో సగం ఇంటికి పంపిస్తూ అటు ఇంట్లో వాళ్ళూ ఇటు వీళ్ళూ కూడా చాలీ చాలకుండా కాలక్షేపం చేస్తున్న పెద్ద కుటుంబం అది.ఆ కుటుంబంలో కోడలు దశరాకి అత్తగారింటికి వచ్చి అక్కడి కష్టాలను చూసింది.ఏమీ చేయలేని అశక్తత ఆమెను నీరస పరిచింది. అప్పడు వీస్తున్న ఉద్యమ గాలులకు ప్రభావితుడౌతున్న ఒక మరిది. ట్యూషన్ చెప్పించుకోలేని పరిస్థితిలో ఒక మరిది,చదువు మానిపించి కూర్చోపెట్టిన ఆడబడుచు,పూజలూ ఉపోషాలతో ఆరోగ్యం చెడుతున్న అత్తగారు.కొడుకు ఉత్తరం కోసం ఆశగాఎదురు చూసే మామగారు.ఎప్పుడెప్పుడూ కొడుకూ కోడలూ ఉద్యోగాలు తెచ్చుకుని కుటుంబ భారాన్ని పంచుకుంటారా అని వాళ్ల ఎదురుచూపులు,వచ్చిన రిసెర్చి అవకాశాన్ని వదులుకోలేని తాము!!. కనీసం తన గాగుల్స్ అయినా మరిది ముచ్చట పడితే ఇచ్చి వెళ్లలేని తన ఆర్థిక పరిస్థితి.ఆ పరిస్థితి తామొక్కరిదే కాదనీ ఉత్సాహం తెచ్చుకుని కొనసాగమని మరిది ఓదార్పు వాక్యాలతో రైలెక్కుతుంది ఆమె.ఈ కథను కొడుకు ద్వారా కూడా చెప్పించవచ్చు.కానీ కోడలు ద్వారా చెప్పించడమే ఈ కథ ప్రత్యేకత .స్త్రీల మనసులోని సున్నితత్వం సంవేదన .మళ్ళీ తనవిలువ తనకు తెలియడం ఆత్మగౌరవం అన్నీ కలగలసిన వ్యక్తిత్వం ఈ కథ లో కథకురాలిది. ఇదంతా పట్టించుకోవద్దని వూరికి వెళ్లవద్దనీ భర్త చెప్పినా ఆమె వాళ్లను చూడ్డానికి వస్తుంది.వాళ్లకెలా సాయం చేయాలో తోచక మధన పడుతుంది.చివరికి మరిదికి నోట్సువ్రాసి పోస్ట్ లో పంపుతానంటుంది.అదొక్కటే ప్రస్తుతం ఆమె చెయ్యగల సాయం.

తలసి కథ యాష్ ట్రే వంటి కథలు తెలుగులో చాల వచ్చినప్పుటికీ ఈ కథలో యాష్ట్రేని ఒక ప్రతీకగా వాడుకోడం ప్రత్యేకత..పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఎక్కువ కట్నం కోసం మరో అమ్మాయిని కట్టుకుని విదేశాలకి వెళ్ళిపోయి.పదిహేనేళ్ళ తరువాత మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు ఆ పెద్ద మనిషి...ఆ వెతుక్కుంటూ రావడం పశ్చాత్తాపం ప్రకటించడానికో, తను తిరస్కరించినా ఆత్మ స్థైర్యంతో నిలబడి, ఆర్థిక సుస్థిరతా సంఘంలో పేరు ప్రతిష్ఠలూ హోదా సంపాదించుకున్నందుకు అభినందించడానికో కాదు.చనిపోయిన తన భార్య స్థానాన్ని ,తన పిల్లవాడి తల్లి స్థానాన్ని భర్తీ చెయ్యమని అడగడానికి..అతనెప్పుడూ ఒకటే తన మేలు చూసుకునే వ్యక్తి.పదిహేనేళ్ళు అవివాహితగా వుండిపోయిన ఆమె తను మళ్ళీ అడగ్గానే అంగీకరిస్తుందనే అతని ఆశ.అతను మారలేదని ఆమెకి తెలుసు.జీవితానికి పెళ్ళే పరమావధి కాదనీ తెలుసు .అందుకే అంతే సున్నితంగా తిరస్కరించింది. తులసి వ్రాసిన మరో కదిలించే కథ చిన్న దేవేరి ఈ కథంతా విజయనగరం గోదావరి జిల్లాల యాసలో వుంటుంది..ఆడదానికీ మగవాడికీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి.తీరక పోతే అందులో ఆడపిల్ల దాని దారి అది వెతుక్కున్నా అది నిప్పుల కుంపటే అనే లీడ్ తో మొదలైన ఈ కథలోఒక మధ్య తరగతి అమ్మాయి హైస్కూల్లో రాష్ట్రానికంతా ప్రధమంగా పాసైంది.కానీ ఇంకాచదవాల్సిన మగపిల్లలుండ డాన వాళ్ళకే చెప్పించడం న్యాయమని ఈమెని మాన్పించేశారు.పెళ్ళి చేసేద్దామని.కట్నాలు కుదరక పెళ్ళి వాయిదాల మీద వాయిదాలు పడింది.ఊర్కే కూచోడమెందుకు టైపూ షార్ట్ హ్యాండూ నెర్చుకోమన్నారు. అందునా బాగా నెర్చుకుంది.పోనీ ఉద్యోగం చేసుకోమన్నారు.పిల్ల బుద్ధిమంతురాలు .దేనికీ నోరు విప్పదు.చెయ్యమన్నపని చేస్తుంది.ఉద్యోగం చేసి ఇంటికి డబ్బు తెస్తోంది.ఇక పెళ్ళి మాట మర్చి పోయిన పుట్టిల్లు ఆమెను ఆధ్యాత్మికం వైపుకి మళ్చించి భజనకి వెళ్ళి రమ్మంది.అదుగో అక్కడే గొడవైపోయింది.ఐహికానికీ ఆముష్మికానికీ లంకె పడింది.ఒక పెళ్ళీ, ఎనిమిది మంది పిల్లలూ ఉన్నవాడిని కట్టుకుంది( ఈ కథలో పట్టుకుంది అంటారు) ఇదేమిటంటే అప్పుడు నోరేత్తి అన్నను కడిగి పడేసింది.నామీద మీకున్న ప్రేమేమిటీ?అని ప్రశ్నించింది.నాడబ్బు మీరు తిన్నట్టే అతనూ తింటే తప్పేమిటంది.నాసంగతి నేను చూసుకుంటాను పొమ్మంది. ఒక నిప్పుల కుంఫటినించీ ఇంకొక దాన్లోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది..మధ్య తరగతి ఆడపిల్లల పెళ్ళిసమస్యని తులసి ఈ కథలోనే కాక వైవాహికం అప్పగింతల పాట అనే కథల్లో కూడా చర్చించింది. మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పట్ల కనపడని వివక్ష,పెళ్ళే పరమార్థం అన్న ఆచారం ఇంకా వాళ్ళ చదువుల పట్ల రాని అవగాహన ఈ కథల్లొ చూస్తాము. బామ్మ రూపాయి కథలో పెద్ద వాళ్ల లౌక్యం చిన్నపిల్లల అమాయకత్వం నిష్కల్మషమైన మనసుని సున్నితమైన హాస్యంతో చిత్రించారు. హుందా కథలో అక్కయ్య ఆత్మగౌరవానికి స్త్రీ రూపం.తన తమ్ముళ్ల ఐశ్వర్యం ముందు తన స్థాయి తక్కువైనా ఆత్మగౌరవంలో వాళ్లకన్న ఒక స్థాయి ఎక్కువగానే వుంటుంది, ఊళ్ళో వున్న ఆరు హైస్కూళ్లల్లోనూ పదో క్లాసులో ప్రధమంగా వచ్చి కాలేజీ చదువు కాకపోయినా టీచర్ ట్రెయినింగ్ చేసి భర్తలాగా టీచర్ అవు.తానన్నా అటు అత్తింటి వాళ్ళూ ఇటు పుట్టింటి వాళ్ళూ ఒప్పుకోలేదు టీచర్ భర్తకన్న తనే తన పిల్లలకు బాగా చదువు చెప్పగలదు.మగపిల్లల చదువులకోసం చదువు మానుకున్న వాళ్లలొ ఈమె కూడా ఒకతె.

ప్రేమ వివాహం చేసుకుని ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని ఆత్మ విశ్వాసమిచ్చి పెంచుతూ నిబ్బరంగా నిలబడ్ద ఆధునిక స్త్రీ చిత్ర.. వాళ్ల ఇల్లు విభిన్న వ్యక్తులకు చర్చావేదిక.ఒక ఆదర్శ సమాజాన్ని కల గనే వ్యక్తులు అక్కడ తమ వూహలు కలబోసుకుంటారు.చర్చలు చేస్తారు.పిల్లల పెంపకం పైన .సెక్స్ పైన ఒకటేమిటీ అన్ని విషయాలు బాహాటంగా పిల్లలముందే చర్చిస్తారు.ఉత్తమ పురుషలో సాగిన ఈ కథ ని మనకి చెప్పేది బంధువులదృష్టిలో చిత్ర అనే కులం తక్కువ పిల్లను పెళ్ళి చేసుకుని వాళ్లను వెలి పెట్టేసి ,చిత్రలాంటి సహచరి దొరకడం తన అదృష్టమని మనసారా నమ్మిన ఆమె సహచరుడు.అతని కూతురు రచన పిక్నిక్ కు వెళ్ళి రాత్రి ఎనిమిదైనా ఇంటికి రాలేదు.అతని మనసు ఒక సగటు తండ్రి మనసులాగా అనేక కీడులను శంకించింది. ఆ పిల్లతో కలిసి వెళ్ళిన కుర్రవాడిని శంకించింది.పిల్లను పంపివుండకూడదనిపించింది. పిల్ల మీద చెక్ పెట్టాలనిపించింది.పిల్ల అమాయకురాలు ఎవరిచేతైనా మోసపోతుందేమో అనిపించింది కూతురు ఇంటికి రాకపోయినా నిమ్మకు నీరెత్తినట్టు తన వ్రాత పనిలో మునిగిపోయిన సహచరిని విసుక్కుంది. ఒత్తిడి భరించలేక చలిలోనే ఆమె చదివే కాలేజీ వరకూ వెళ్ళొచ్చాడు.అప్పటికే తొమ్మిదైంది.ఇంటికొచ్చేసరకి పిల్లలూ తల్లీ కిలకిలలాడుతూ భోజనానికి ఉపక్రమించి అతడినీ రమ్మన్నారు. దూరపు ఇళ్ళ పిల్లల్ని దింపి రావడంలో ఆలస్యమైందని తొణక్కుండా చెప్పింది కూతురు.ఇన్నాళ్ళుగా తను పోషించుకున్న అభ్యుదయ భావాలు కదల బారుతున్నాయా? తనలో ఏదో మార్పు వస్తున్నది ..ఏ భావాలనయితే వదుల్చుకుని ఇంత దూరం వచ్చాడో అవి తిరిగి తన మీద ప్రభావం చూపించి వెనక్కి లాగుతున్నాయా?అని మధన పడ్దాడు. బహుశా సంఘంలో పొడచూపుతున్న అభద్రతా వాతావరణం కూడా తిరోగామి భావాలను కలిగిస్తున్నదేమో!! ఈ కథను మంచి శిల్ప నైపుణ్యంతో వ్రాసారు తులసి. తులసి కథల్లో చాలా వరకు ఉత్తమ పురుషలో వ్రాసినవే.అలా వ్రాయడం వల్ల కథ పాఠకులకు మరింత సన్నిహితంగా వచ్చింది. స్త్రీలకి రిజర్వేషన్ల పుణ్యమా అని తనకి పదవి రాక పోయినా తన భార్య ద్వారా దాన్ని సాధించుకునే అవకాసం దక్కింది పురుషులకి.అంతకు ముందు వేష భాషల్లోనూ జ్ఞానంలోనూ ఒక ఇల్లాలుగా మాత్రమే వుండిపోయిన స్త్రీ ఆ పట్టణానికి ప్రధమ మహిళగా ఎన్నికవగానే ఆమెను తనకు నకలుగా గ్రూమ్ చేస్తాడు భర్త. స్వలాభ రాజకీయాలను క్షుణ్ణంగా అభ్యసించింది ఆవిడ. అతనికి నకలుగా తయారైంది. స్త్రీలకు రిజర్వేషన్ల పేరు మీద ఇలాంటి వాళ్ళను తయారు చెయ్యడం దేశానికి లాభమా?ప్రమాదమా? ఆవిడ కథలో ఈ ప్రధమ మహిళ ఆవూరు బదిలీ మీద వచ్చిన ఒక ఉద్యోగస్తురాలితో స్నేహం చేసి తనమనసులో మాటలన్నీ దాచుకోకుండా చెబుతుంది. తను ఎవరితోనైన అల్లుకు పోగలనని ఆ ఉద్యోగస్తురాలు తన భర్తతో చెప్పినప్పుడు అతనంటాడు.నువ్వు అన్నీ వింటావు దేన్నీ ఖండించవు.ఒక సారి ఖండించి చూడు నీకు ఎవరూ ఏమీ చెప్పరు అని .ఆమెకు అప్పుడనిపించింది.ఈ ప్రధమ మహిళ గ్రూమింగ్ స్టేజి లో తను కల్పించుకుని ఖండించవలసిందేమో అని. ఆ చట్రంలో బిగుసు కోక ముందే ఆవిడని తప్పించక తను తప్పు చేసానేమో అనుకుంది. చదువుకుని జ్ఞానవంతులైన స్త్రీలు ఆవిడల తయారీని కాస్తైనా అడ్డుకోకపోవడం తప్పు కాదా అనే ఆలోచన కలిగిస్తుంది ఈ కథ,అలాగే తగవు నాటికలో కుటుంబాన్ని ఒక దరి చేర్చడానికి పెద్దకొడుక్కి ఎంత బాధ్యత వుందో, పెద్ద కూతురికీ అంతే వుంది కనుక ,నువ్వు నీ వాళ్లనీ నేను మావాళ్ళనీ చూసుకోవాలి, అందుకని మా వాళ్ళు కూడా మనదగ్గరే వుంటారంటుంది ఉద్యోగం చేస్తున్న విజయ.ఆమె భర్త అందుకు ఒప్పుకుని ఆమెను పెళ్ళి చేసుకున్నాడు.కానీ కోడలు కుటుంబం తమతో వుండడం సంప్రదాయం కాదనే అభిప్రాయం పాతుకు పోయిన మధ్య తరగతి కుటుంబంలో అది పొసిగే విషయం కాదని తేలి పోయింది.ఎవరికి వారు విడిపోక తప్ప లేదు ఎవరికి అనువుగా వున్న సంప్రదాయాలను వాళ్ళు వదులుకోరు..ప్రతిపాదిత విషయం చాలా ప్రజాస్వామికమైన దైనా సరే. తులసి విజయనగరం జిల్లా మాండలికంలో చెయ్యి తిరిగిన రచయిత.ఆమె వ్రాసిన ఆడదాయికి నోరుండాలి చోద రెండూ ఆ మాండలికం లో వ్రాసిన ఉత్తమ పురుష కథలే. మధ్య తరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారు. గుడిసె వాసులకి బుల్ డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ స్వర్గారోహణ లో తన సత్తు బిందెకోసం ఇంట్లో కి వెళ్లి ముంపు లో మునిగి పోయింది పోలి...వ్రాసినవి తక్కువ కథలే అయినా శిల్పంలోను వస్తువులోనూ తాత్వికతలోనూ గుణాత్మకమైన వి తులసి కథలు, తులసి కథలకు ముందుమాట వ్రాసిన రోణంకి అప్పలస్వామిగారు చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని కితాబిచ్చారు.

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్వోత్తమ కథా రచయిత పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సమ్మాన్,కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం తాపీ ధర్మారావు పురస్కారం,అరసం సత్కారం.నాళం కృష్నారావు స్మరక సత్కారం, మొదలైన పురస్కారలను అందుకున్నారు. ప్రసిద్ధ కథా రచయిత చాగంటి సోమయాజులు గారి ;చిన్నమ్మాయి అయిన తులసి ఆయన పేరున 1994లో చాసో సాహిత్య ట్రస్టు ను స్థాపించి ప్రతి సంవత్సరం ఉత్తమ సాహిత్య స్రష్టలకు చాసో స్పూర్తి అవార్డు ఇస్తున్నారు.

Tuesday, August 02, 2011

we miss you


“చప్పుడు చెయ్యని
చెప్పులురెండూ
రెండు అరచేతుల్లో పెట్టుకుని
తాళం వేసివున్న
ఆ చిన్నప్పటి ఇంట్లో వాళ్ళకి
నువ్వు కొట్టేసిన పలకా బలపం ఇచ్చేశావనుకో
ఓ పనై పోతుంది” mo
Posted by Picasa