Monday, June 27, 2011

తురగా జానకీరాణి

స్వాతంత్ర్యానంతర తొలి తెలుగు కథా రచయిత్రులలో ప్రసిద్ధులైన జానకీ రాణి ,గాయని ,నర్తకి,వక్త కూడా.యాభైయ్యవ దశకంలోనే కథారచన ప్రారంభించిన మంటపాక జానకీరాణి ప్రఖ్యాత రచయిత తురగా కృష్ణమోహనరావుని వివాహం చేసుకున్న తరువాత తురగా జానకీరాణి పేరుతో వ్రాయడం మొదలుపెట్టారు. ఇకనమిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత సోషల్ సైన్సెస్ లో డిప్లొమా చేసి కొంతకాలం సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లో వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేశాక ,ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైరయ్యారు . నలభై రేడియో నాటకాలు రూపకాలు వ్రాసారు నాలుగు జాతీయ బహుమతులు పొందారు మూడు నవలలు, వాస్తవగాథలు కొన్ని కాలమ్స్ వ్రాసారు, సర్పంచులకోసం పంచాయతీ రాజ్ శాఖకు పాఠాలు కూడా వ్రాసారు నేషనల్ బుక్ ట్రస్ట్ కి పిల్లల కథల పుస్తకాలు వ్రాసారు సృజనాత్మక సాహిత్యమే కాక సాంఘిక సేవా కార్యక్రమాలపై చాలా కృషి చేశారు.యోజన పత్రిక లో డ్వాక్రా గ్రూపులకొసం ప్రత్యేక అనుబంధానికి రూపకల్పన చేశారు.

స్త్రీల పవిత్రతపై సమాజంలో ప్రయత్నపూర్వకంగా నిలబెడ్దబడ్ద అనేక భ్రాంతి భావనల్ని చెదరగొట్టే పవిత్ర అనే నాటకం వ్రాశారు.మాతృత్వం పైనా స్త్రీపురుషుల మధ్య వుండవలసిన సున్నితమైన ప్రేమానుబంధాల మీద ఆమెకు చాలా గౌరవం. ఆప్రేమ పూసల్లో దారంలా వుండాలని ,ఒకరి మనసు ఒకరికి తెరిచిన పుస్తకంలా వుండాలని ఆంకాక్షిస్తారు .మన పరిథి కథలే కనుక ఆమె కథల్నిగురించే ప్రస్తావించుకుందాం.

జానకీరాణిగారి కథల్లో ప్రథాన పాత్రలు ఎక్కువగా స్త్రీలే .అందులోనూ 1950 దశకంలో ఆమె వ్రాసిన అనేక కథల్లో ఆనాటి యువతుల మనస్తత్వ చిత్రణ ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడప్పుడే ఆడపిల్లల చదువుకు కూడా ప్రాధాన్యత వస్తున్నది. కాలేజీకి వెళ్ళి చదువుకోడం వాళ్ళకి కాస్త గర్వకారణంగా కూడా వుంది. 1956 లో ఈమె వ్రాసిన గళంలో గరళం కథలో సరళ అనె అమ్మాయి ఎస్సెసెల్సి (S.S.L.C)లో మంచిమార్కులు తెచ్చుకుని ఇంటర్ లో చేరింది.దానికి తగ్గట్టుగా వస్త్ర ధారణ చేసుకుని ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తోంది.అదే పెట్టెలో వున్న ఇద్దరు ఆడవాళ్ళు తనని పలకరించాలనీ అప్పుడు తను ఇంటర్ చదువుతున్నానని చెప్పాలనీ ,ఉవ్విళ్ళూరింది..కానీ వాళ్ళిద్దరూ తమలో తాము ఏవో మాట్లాడుకుని సరళని అడక్కుండానే దిగిపోయారు.అప్పుడు సరళకి గట్టిగా అరిచి చెప్పాలనిపించిందిఏమండోయ్ నేను పదహారేళ్ళకే ఇంటర్ చదువుతున్నాను.ఎస్సెసెల్సీ లో మంచి మార్కులు తెచ్చుకున్నాను అని.అట్లాగే భూతద్దంలోనించీ,వాస్తవికతకి వన్నెచిన్నెలు , తీరా ఖాళీ చేస్తే కథానాయకుడు,మరలి వచ్చిన మైత్రి నిచ్చెన అనే కథలు కూడా మనస్తత్వ చిత్రణకు సంబంధించినవే.భూతద్దంలోనించీ కథలో రాత్రివేళ వంటరిగా వానలో రిక్షాలో వస్తూ, రిక్షా అతన్ని గురించి అనేక అపోహలూ అనుమానాలూ పడి, తన వంటిమీది నగలు తీసి కనపడకుండా దాచేసుకుని బ్రతుకు జీవుడా అని ఇంటికొచ్చి పడ్ద యువతికి ,ఇంటివారు తలుపు తీసేదాకా తోడుండి తరువాత వెళ్ళిన రిక్షా ఆయనకి ఒక రూపాయి ( 1950 దశకం) అదనంగా ఇచ్చి, తరువాత ఈ రూపాయి తనకేం ఉపకారం చేశాడని ఇచ్చినట్టూ అని ఆలోచిస్తే అది:అతను చెయ్యని అపకారానికి అనిపించింది.

జీవిత సత్యాలు అనే కథలో సుమిత్ర ఇరవైరెండేళ్ల ఆనర్స్ చదివే అమ్మాయి.సెలవులకి తన పల్లెకొచ్చింది.ఆ ఇంట్లో ఆమెకు గారాబం.వారింట్లో ఆశ్రితుడు నాగభూషణం.పద్దెనిమిదేళ్ళవాడు మెట్రిక్ తప్పి పూర్తిచేసుకుంటున్నవాడు..ఆమె మల్లెపూలడిగితే బస్తీనించీ తెచ్చిపెట్టాడు.ఆమెకతన్ని చూస్తే జాలి. ఒక రోజు ఆమె పాదాలను ముద్దుపెట్టుకుంటాడతను. సుమిత్ర కి తన అంతస్థు తెలుసు.తన వయసూ చదువూ తెలుసు.అతను తమ ఆశ్రితుడనీ తెలుసు.తన భవిష్యత్తేమిటో తెలుసు.ఆ ప్రకారమే ఆమెకు రెండేళ్ల తరువాత ఆమె అంతస్థుకు తగిన వాడితో వివాహం అయింది.ఒక రోజు చలికి ముడుచుకుని కూచున్న ఆమె పాదాల్ని ఆమె భర్త ముద్దుపెట్టుకుంటే పాత సంగతిచెప్పి నా వయసూ నాచదువూ నా అంతస్తూ ఎరిగి కూడా అతనలా ప్రవర్తించడం ఏమిటో? అంది.దానికి ఆమె భర్త చాలా మామూలుగా నువ్వు స్త్రీవి,అతను పురుషుడు అని ఒక జీవిత సత్యాన్ని తేలిగ్గా చెప్పేసాడు.ఈ కథలో సుమిత్ర చాలా ప్రాక్టికల్ ఆలోచనల యువతి. యువతుల మనస్తత్వాలను చిత్రించిన కథలు స్నేహం పరిణయం మౌనం వహించని మనస్సాక్షి స్నేహం కథ కలంస్నేహాల లో స్నేహితులు కులుసుకోక ముందు భావాలకే ప్రాముఖ్యం,, కలుసుకున్నాక రూపానికుండే ప్రభావం భావాలపై పడి స్నేహం చెదరడం, అందుకు తరువాత పశ్చాత్తాప పడడం చిత్రించారు. ఇప్పటిలా టీవీ వీడియో కంప్యూటర్ లేని ఆ కాలంలో స్నేహాలు,కలంస్నేహాలు ఉత్తరాలు వ్రాసుకోడాలూ చాలా సహజంగా జరిగిపోతుండేవి. యువతీ యువకుల్లో భావుకత్వం పాలు కాస్త ఎక్కువే వుండేది.మౌనం వహించని మనస్సాక్షి కథలో చిన్నప్పుడు తన బదులు శిక్షింపబడిన స్నేహితురాలికి క్షమాపణ చెప్పలేక ఆ అపరాధభావం మనసులోనించీ చెరిపేసుకోలేక పెద్దయనతరువాత ఆ స్నేహితురాలే మళ్ళీ కలిస్తే ఆమెకు పడవలసిన శిక్ష తనకు తనే వేసుకుంటుంది రేణుక అనే యువతి.

స్త్రీ పురుష సంబంధాలను గురించి వ్రాసిన కథలలో పూసలలో దారం ఆవలి కోణం,స్వయంకృతం,అనేకథలు...తనూ తన భర్తా చదువుకోలేదని అతని స్నేహితుడూ స్నేహితుని భార్యలాగా పనులు పంచుకుంటూ ఒకర్నొకరు గౌరవించుకుంటూ లేమనీ చాలా అసంతృప్తి పడుతుంది సుభద్ర...కానీ ఆస్నేహితులు వెళ్ళాక తనకూ తనభర్తకూ ఉండే అన్యోన్యం పూసలలో దారం వంటిదనీ తామిద్దరూ తెరిచిన పుస్తకాలలాంటీ వాళ్లమనీ అర్థం చేసుకుంటుంది.ఆవలికోణం లో వివాహం చేసుకోకుండా మంచి ఉద్యోగం చేసుకుంటూ నృత్యంలో రాణిస్తూ హుందాగా జీవిస్తున్న స్నేహితురాల్ని చూసి,చదువు మధ్యలో ఆపేసి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని మార్పులేని జీవితంతో కుస్తీ పట్టే తనజీవితాన్ని పోల్చుకుని అసంతృప్తి తో వేగిపోయింది సీత..కానీ స్నేహితురాలు మాత్రం సీతదే సంతోషకరమైన జీవితం అని చెబుతుంది.

మానవత్వం ఇంకా మిగిలే వుందని చాలా కథల్లో జానకీరాణి చెబుతారు.ఒక్క క్షణం మనసు చలించినా తిరిగి దాన్ని దారిలో పెట్టుకుని విలువలని కాపాడుకునే వ్యక్తులు ఆమె కథల్లో ఎక్కువ కనిపిస్తారు.నవ్వని పువ్వు అనే కథలో శ్రీనాథ్ మల్లిక నృత్యం చూసి ముచ్చటపడి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.అయితే పెళ్ళి తరువాత నృత్య ప్రదర్శన లివ్వకూడదని ఆంక్షపెట్టాడు.అందుకు అంగీకరించే పెళ్ళి చేసుకుంది మల్లిక.అయితే ఆమే మన్సు నృత్యం నించీ మళ్ళనే లేదు .అనుకోకుండా తన కాలేజీలోనే ఓల్డ్ స్టూడెంట్స్ డే న నాట్యం చెయ్యమని స్నేహుతురాలి బలవంతం మీద ఒప్పుకుని రహస్యంగా ప్రదర్శన ఇచ్చి వచ్చింది. మర్నాడుదయం అది పేపర్లో రావడం అశాంతి భగ్గుమనడం, ఆమె పుట్టింటికి రావడం జరిగిపోయాయి. తనమాట వినకుండా ప్రదర్శన ఇచ్చినందుకు కోపంవచ్చిన శ్రీనాథ్ ,తరువాత వివేకం మేల్కొన్న వాడై ఆమెకోసం అత్తగారింటికి వెళ్ళాడు..అదే సమయానికి ఆమెకూడా అతని దగ్గరకు బయలు దేరింది.కలలు పండిన రోజుకథలో కుటుంబం కోసం కట్నం తీసుకుని అందంలేని సుబ్బలక్ష్మిని చేసుకుని మామగారి ద్వారా ఉద్యోగం కూడా పొందిన సుధాకరం సుబ్బలక్ష్మిమీద విసుక్కుని ,తరువాత నెమ్మదిగా ఆలోచించి తను త్యాగంచేసినదానికన్న ఆమె చేసిందేమీ తక్కువ లేదని గహించుకుని పశ్చాత్తాపపడతాడు.మరలి వచ్చిన మనస్సుకథలో మాధవరావు కావాలని అనాథాశ్రమంనీంచీ వితంతును ఎంపిక చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు .అందుకోసం తన తల్లి తండ్రులకి దూరమై పోయానన్న వేదన తో ఆమెమనసు నొప్పించే మాటలని తల్లితండ్రులని చూడ్డానికి వెళ్ళాడు.వాళ్ళు కోడలిమీద ఏమాత్రం కోపం చూపకపోగా జాలిపడ్డారు.అతను పశ్చాత్తాపపడి త్వరగా భార్య దగ్గరకు వెళ్లిపోయాడు..మాను వంగింది కథలో టీచర్ సూర్యకాంతమ్మ తప్పు చేసిన పిల్లల్ని చాలా కఠినంగా శిక్షిస్తుంది.అదే తప్పు తనూ చేయబోయి తమాయించుకుని సరిదిద్దుకుంటుంది.

కౌమార దశలో పిల్లల్ని పర్యవేక్షించి సరైన దారిలో పెట్టడం అనేది ఎంత కష్టమైన పనో సొరంగం””వయసు గతి ఇంతే కథల్లొ చెప్పారు.సొరంగం కథలో పల్లెటూరి పిల్లల్ని అతి క్రమశిక్షణతో పెంచి చదువుకుని బాగుపడతారని బస్తీకి పంపి అన్ని హంగులూ అమరిస్తే ,కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయి పోయి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు వాళ్ళు. వయసు గతి ఇంతే లో తల్లి తండ్రులు చదువుకున్న వాళ్లు.పిల్లల్ని అర్థం చేసుకుని మలుచుకోగల వాళ్ళు... తన స్నేహితురాలిని కాపాడుకోవాలని ఎంతగా మనసులో వున్నా సమయానికి కాపాడుకోలేక పోయి తరువాత అమితంగా బాధపడ్డ హైస్కూల్ విద్యార్ధి,నూతన ప్రేమికుడు అయిన అనిల్ నిజాయితీతో కూడిన ఆవేదన ఆమె బేల అతను ధీరుడు అయితేనేంఅనే కథ..

అగాథాలుఅనే కథలో శాంత భర్త ఆమె ను విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే ఆమెను చేసుకున్నాడు.శాంత స్కూల్లో టీచర్ గా వుంటూ తన కొడుకు శేషును పెంచుకుంటోంది. అతను మళ్ళీ కొడుకునీ శాంతనీ రమ్మని కబుర్లు పెడుతున్నాడు శాంతకిష్టం లేదు.కానీ కొడుక్కోసం వెళ్లమంటారు అందరూ.. తండ్రి కావద్దా?అతనికి? మంచి పొజిషన్ లోవున్నాడు..ఢిల్లీలో ఎక్సర్షన్ కి వెళ్ళినప్పుడు తండ్రిని చూసిరమ్మని తనే పంపింది..శేషు వెళ్ళొచ్చేశాడు.తన తల్లి వయస్సుకు మించిన వృద్ధాప్యాన్ని మొస్తూ కష్టపడుతుంటే ఆవిడ హాయిగా వుండడం నచ్చలేదు వాడికి .అక్కడికి వెళ్ళనంటాడు.సరిగ్గా దీనికి విరుద్ధమైన కథ సాలెగూడు రోహిణిని భర్త వదిలేసి వెళ్ళి పదిహేనేళ్ళయింది. ఈమెను వదిలి అమెరికా వెళ్ళొచ్చాక ఎవర్నో చేసుకున్నాడతను.వాళ్ళకొక కూతురుకూడా పుట్టింది. ఇప్పుడావిడ అతన్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఈమెకు కబురుపెట్టాడు.పదిహేనేళ్ళు ఏడ్చి కళ్ళుతుడుకుని, బి.యే చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఎవర్నీ నిందించకుండా ఏమీ అడక్కుండా విడాకులైనా అడక్కుండా మళ్ళీ పెళ్ళిమాట తలపెట్టకుండా గడిపి ,స్నేహితురాలు ఎంతవారించినా వినకుండా అతని దగ్గరకే వెళ్ళిపోయింది రోహిణి.,తిరిగి వచ్చెయ్యమని స్నేహితురాలు ఉత్తరం వాసింది.రానో రాకపోవునో ఏమోకానీ గర్భవతి అయిన ఆమె పురిటికి పుట్టింటికొచ్చింది. నోథాంక్స్ కథలో కేవలం పిల్లల పెపంకం కోసమే పెళ్ళికి అంగీకరించిన బాస్ కి నో థాంక్స్ చెప్పేసింది పెళ్లికోసం తపించిన అమ్మాయి.

వాస్తవ గాథలు శీర్షికన పడుపువృత్తిలోకి దింపబడ్ద యువతుల కథలు కొన్ని వ్రాసారు జానకీరాణి. .ఇందులో థర్మసాధనం నమ్మి వచ్చిన వాడు విడిచిపెట్టి వెడితే తనదగ్గరున్నది శరీరమే కనుక దానినే నమ్ముకుంది ఆమె.

కాలం తీరిన కొలువులో ఎంత చిన్న ఉద్యోగానికైనా లంచం తప్పదు.ఎన్ని రిజర్వేషన్లున్నా లంచం తప్పదు కాస్త చదువుకుని కూడా అట్టడుగునించీ ఒక్క అడుగు పైకి వెయ్యడం లక్ష్మీబాయిలాంటి వాళ్ళకి ఎంతకష్టమో ,చదువురాక బయటి ప్రలోభాలకి లొంగిపోయే ఆమె తమ్ముడు యాదయ్య లాంటి పిల్లలకి చావే గతి ఈ దేశంలో ,...

బ్రతుకంతా కష్టపడి సుఖాలేవీ కోరుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పంపించి విశ్రాంత జీవనంలోకి అడుగుపెట్టాక అరియర్స్ రూపంలో మూడులక్షల రూపాయల అదృష్టం అందివచ్చింది ఆయనకి....దానితో తనూ భార్యా కాస్త సౌకర్యంగా జీవించాలని యాత్రలు చేసి రావాలని ఇంట్లోకి సామాన్లు కొనుక్కోవాలని ముచ్చట పడ్దాడాయన.భార్యేమో పిల్లల అవసరాలు చూడమంది ..కానీ వినలేదు.అనుకున్నంతా చేశాడు.ఇంట్లోకి అన్నీ కొన్నాడు ఆవిడకో నగ కూడా,యాత్రకి టికెట్టొచ్చింది.కానీ అది తీర్థ యాత్ర కాలేక పోయింది.అంతిమ యాత్రే అయింది.ఈ కథలో పిల్లల కోరికలూ సబబే .ఆవిడ పిల్లలకు సాయపడమనడమూ సబబే,ఆయన అప్పటికైనా కాస్త సౌకర్యంగా బ్రతకాలనుకోడమూ సబబే కానీ అప్పుడు మృత్యువురావడం మాత్రం సబబుగా లేదుయాత్ర కథలో

గౌతముడిచేత శాపంపెట్టించుకుని శిలలా పడివుండక తెలివితో కోపంతో జ్వలించిన ఒక అహల్య కథ జ్వలించిన శిల భర్త భావుకుడు కాదు.సంగీత సాహిత్యాల పట్ల అంత అభిరుచీ లేదు.బ్యాంక్ లో ఉద్యోగం చేసే అహల్య గౌతం ని ఆకర్షించింది.స్నేహం కుదిరింది.పరిధుల్లో వున్న స్నేహమే.అయితే ఆమె మనసు విప్పి తన అభిప్రాయాలన్నీ గౌతమ్ కి ఉత్తరాలు వ్రాసింది. ఆమె తరువాత ట్రాన్స్ఫర్ మీద వెళ్లిపోయింది.కొన్నాళ్ళకి మళ్ళీ అదే వూరు బదిలీమీద వచ్చింది.తన దగ్గరున్న వుత్తరాల ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పర్సనల్ లోన్ సాంక్షన్ చేయించుకోవాలని ఎత్తువేశాడు.నిజానికి అతను పెట్టిన స్యూరిటీకీ ఆ లోను వచ్చే అవకాశం లేదు.ఉత్తరాలు భర్తకి పోస్ట్ చేస్తానని బెదిరించి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాడతను.ఉత్తరాలు చటుక్కున అందుకుని సొరుగులో వేసుకుని అప్లికేషన్ తీసుకుంది అహల్య ..చచ్చినట్టు లోన్ వచ్చితీరుతుందనుకున్నాడతను.కానీ అహల్య ఆ ఉత్తరాలు తీసేసుకుని ఎంచక్కా నెల్లాళ్ళు సెలవు పెట్టి తరువాత మళ్ళీ బదిలీకి పెట్టుకుంది. ఇంటి బయటికొచ్చి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసుకునే స్త్రీలకి తెలివి వుంటుందనే జ్ఞానం వుండదు గౌతమ్ లాంటివాళ్ళకి.

పుష్పమ్మకి హటాత్తుగా మాట పడిపోయింది,ఎన్ని వైద్యాలు చేసినా మాటే రాలేదు.ఆమెనెవరో తీవ్రంగా బాధ పెట్టివుంటారనీ పెళ్ళై పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదని మొగుడే బాగా సతాయించివుంటాడనీ సైకియాట్రిస్ట్ అన్నాడు.ఏది ఏమైనా ఆమె మాట మాత్రం పోయింది.ఇంతలో వాళ్ళ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలొచ్చాయి.ఆ పోస్ట్ ఎస్సీ మహిళకి రిజర్వ్ అయివుండడాన ,సంతకం చేయొచ్చిన మహిళ అక్కడ ఆమె ఒకతే కావడాన .ఏకగ్రీవంగా ఎన్నికై పోయింది.తన భార్య సర్పంచయితే తనే అయినట్టు భావించిన ఆమె మొగుడు, ఆమెను గుమ్మంలో నిలబెట్టి తను ఆఫీసర్ ఎదుట ఆమెకుద్దేసించిన కుర్చీలో కూర్చున్నాడు.ఆమె అతని చెయ్యిపట్టుకు గుంజి తన కుర్చీ తనకిచ్చెయ్యమంటే చెంప చెళ్ళుమనిపించాడు,దాంతో పుష్పమ్మ నోరు తెరిచి అది నాకుర్చీ నేనే కూచోవాలిఅని గట్టిగా అనేసింది.పదవితో పాటు నోరూ వచ్చిందన్నమాట.అసలు ఆమె నోరు పోవడానికి కారణం కూడా అతనే,పిల్లలు పుట్టలేదు కనుక మళ్ళీ పెళ్ళి చేసుకుంటానన్నాడట,దాంతో దుఃఖం వచ్చి గొంతు పూడుకు పోయింది,చిలుక పలికింది కథలో

పెళ్ళి కాకుండానే తల్లి అయిన రుక్మిణిని చూసి ,ఆమెను బంధువులంతా వదిలేశారు గనుక రెండు ఓదార్పు మాటలు మాట్లాడి వద్దామని ఆమె స్నేహితురాళ్ళిద్దరు వెళ్ళారు.అందులో ఒకరికి రుక్మిణిమీద చాలా అసహ్యంగా వుంది..పుట్టిన పిల్ల వాడిని శరణాలయంలో ఇచ్చేసిరమ్మని సలహా ఇవ్వాలని వెళ్ళింది..కానీ రుక్మిణి పరమానందంగా వుంది.ఎవరూ లేని తనకి భగవంతుడే పాపాయిని పంపాడని అనుకుంటూ మాతృత్వపు వెలుగులో ధగధగ లాడుతోంది. ఆమె ఏడవందే వాళ్ళేం ఓదారుస్తారు? హిమాలయ శిఖరం మీద కూచుని మనబోటి వాళ్ళందర్నీ చిన్నచూపు చూస్తున్న జగన్మాత అది ఎందుకేడుస్తుందీ అనుకుంటుంది మొదట్లో ఆమెని ఏవగించుకున్న స్నేహితురాలే..మాతృత్వం ఒక అపురూపమైన వరం దానికి న్యాయ సమ్మతమా?కాదా అనే ప్రశ్నే లేదు.చాలా అండర్ టోన్ లో వ్రాసిన ఈ కథ కి ఆ అండర్ టోనే గొప్ప శిల్పం అనిపిస్తుంది.

జానకీ రాణి కథలు సూటిగా వుంటాయి.కథకు తగ్గ వాతావరణం వివరణాత్మకంగా వుంటుంది.కుట్రలు ద్వేషాలు,మోసాలు హిపోక్రసీ లేని మనుషులే ఎక్కువ వుంటారు .కొన్ని విలువలని గౌరవిస్తారు.చాదస్తాల మధ్యతరగతి మనుషులు,విచిత్ర మనస్తత్వం కలవాళ్లు కూడా వుంటారు.వన్నెచిన్నెలతో ఊదరగొట్టని వాస్తవ సంఘటనలే ఆమె కథలకి వస్తువులు.త్వరలో ఆమె కథలన్నింటినీ ఏర్చి కూర్చిన సంపుటి రానున్నది. జానకీ రాణి గారికి గృహలక్ష్మి స్వర్ణకంకణం సుశీలా నారాయణరెడ్డి అవార్డు, పొట్తిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు, మాదిరెడ్డి సులోచన అవార్డు,బాలబంధు బిరుదు వచ్చాయి.

Thursday, May 26, 2011

పి.యశోదారెడ్డి

1960 లలోనే పి.యశోదారెడ్ది. పాఠకులను కుచ్చుల సవారికచ్చెరంలో మెత్తలు పరిచి కూచోపెట్టి బిజినపల్లి తీసుకు వెళ్ళి అక్కడి చిత్రాలన్నీ తీరొక్కటిగా అచ్చమైన తెలంగాణా నుడికారంలో చెప్పారు .కథ చెప్పడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య, అంటే అందులో అతిశయోక్తి అసలు లేదు. ఆమె తాను పుట్టి పెరిగిన మహబూబ్ నగర్ జిల్లా మాడలికంలో కథ మొదలు పెడితే ఉపమానాలు, సామెతలు. చమత్కారాలు, అన్నీకలుపుకుని పరిగెత్తే ఓ ప్రవాహమే అది. అచ్చమైన తెలంగాణా నుడికారంలో మా ఊరిముచ్చట్లుచ్చమ్మ కథలు వ్రాసిన ఎచ్చమ్మ( యశోదని అంటా యశా అని పిలిచేవారట.చిన్నప్పుడు తనపేరేమిటంటే ఎచ్చమ్మ అని చెప్పేదట యశోద ,ఆఎచ్చమ్మే ఈ కథల్లో ఎచ్చమ్మ) తరువాత పత్రికల భాషలో ధర్మశాల కథా సంపుటి ప్రచురించారు. యశోదారెడ్డి మంచి వక్త .బహుశా ఆ ధారే రచనలో కూడా కనిపిస్తుంది.

ఉస్మానియా యూనివర్సిటీ నించి తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్న యశోదారెడ్ది , హిందీ ఉర్దూ కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు. కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా ,కేంద్ర సాహిత్య అకాడమీ మహావక్తగా ,అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా ,పదవులు సత్కారాలూ పొందారు.మహబూబ్ నగర్ జిల్లా బిజినాపల్లి ఆమె స్వగ్రామం.రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్యలో అడుగు పెట్టిన యశోద లోని వాక్పటిమ , అప్పుడప్పుడే బొంబాయి జె.జె ఆర్ట్స్ స్కూల్ నించీ వచ్చిన ప్రసిద్ద చిత్రకారుడు పి.టి .రెడ్డి మనసు చూరగొన్నది. వివాహానంతరం కూడా ఆమె చదువు సాగించారు.ఎవరి ప్రవృత్తులలో వాళ్లు విజయాలు అందుకున్న మంచి స్నేహితులు .ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు,సుశీలా నారాయణ రెడ్డి అవార్డు,నాళం కృష్ణారావు అవార్డు,సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్నారు,.మూడు కథా సంపుటులే కాక,ఉగాదికి ఉయ్యాల” :భావిక కవితా సంపుటులు,కథలూ నవలలూ-ఒక పరిశీలన కథా చరిత్ర భారతంలో స్త్రీ ఆంధ్ర సాహిత్య వికాసం హరివంశము ఉత్తర భాగము పారిజాతాపహరణం తెలుగులో హరివంశములు అనే వ్యాస సంపుటులు వెలువరించారు.1951 నించే కథలు వ్రాసారని ఆమె పై పరిశోధన చేసిన సుజాత చెప్పారు. ఏ సంపుటి లోనూ ఏ కథ కిందా అది వ్రాసి ప్రచురించిన తేదీ లేదు,

మావూరి ముచ్చట్లు లో పది కథలు,ఎచ్చమ్మ కథలు లో ఇరవై,ధర్మశాలలో ఇరవై నాలుగు కథలు వున్నాయి .ఎచ్చమ్మ కథలూ మాఊరి ముచ్చట్లు, తెలంగాణా గ్రామీణ నేపధ్యంలో మాండలిక గుబాళింపుతో వుండగా ధర్మశాలలోని కొన్ని కథలు తను వార్తాపత్రికలో చదివిన సంఘటనలపై స్పందించి వ్రాసానని ఆమె వ్రాసుకున్నారు. మొత్తం యాభై కథల్లోనించీ కొన్నింటిని విశ్లేషించుకుని ఆమె శైలినీ శిల్పాన్ని,తాత్విక దృక్పథాన్ని తెలుసుకుందాం

ఈ యాభై కథల్లోనూ మొదట నిలిచే కథ గంగరేగిచెట్టు.ఇది కొంత ఆత్మ కథాత్మక కథ అనొచ్చు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఎచ్చమ్మ మంచి నక్షత్రంలో పుట్టలేదన్న పేరు పడి ,తండ్రికూడా ఆమెను దగ్గరుంచుకోక రుక్మిణమ్మ అనే ఆమెకు పెంచుకోమని ఇచ్చాడు.తరువాత ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు.రుక్మిణమ్మ దగ్గర పెరిగుతున్న ఎచ్చెమ్మ మహబూబ్ నగర్లో చదువుకుంటూ చూడచక్కగా అంతా తనతండ్రి పోలికలో వుంటుంది.తండ్రి ఆమెను పెంపకానికైతే ఇచ్చాడుగానీ అప్పుడప్పుడూ వెళ్ళి చూసుకొస్తూనే వుంటాడు ఆమెకు తొమ్మిదేళ్ళప్పుడు.ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఆపిల్ల తన దగ్గరగా వస్తే ఆపిల్ల అంతా తన పోలికేనని, కదిలి పోయాడు.ముద్దు చేశాడు. అంతకు ముందు ఆయన చెల్లెలు ముత్యాలమ్మ ,తన కొడుక్కు ఆయన కూతుర్నివ్వమనీ,అట్లా సంబంధం కలుపుకుంటే పరువూ ప్రతిష్టలు కల అన్న అండ తనకి వుంటుందనీ ,భర్త బిర్రు కాస్త సడలుతుందనీ అడుగుతూ వుంటుంది. అప్పుడు తన రెండో భార్య కూతురు నీలిని ఇస్తానంటాడు.ఎచ్చమ్మని చూసి మనసు కరిగిపోయిన తరువాత నీలిని కాదు ఎచ్చమ్మని ఇస్తానంటాడు.మొదట్లో ముత్యాలమ్మకి ఎచ్చమ్మ ని అంతా నష్ట జాతకురాలనడం తండ్రికూడా దగ్గరుంచుకోక పాలమూరు పంపడం గుర్తొచ్చి కాస్త సందేహించినా అన్నతో సంబంధం ముఖ్యం అనీ, నీలి కన్న ఎచ్చమ్మే బాగుంటుందనీ అసలు తనే ఆపిల్లను తెచ్చి పెంచుకుంటే బాగుండేదనీ సర్ది చెప్పుకుని సరే నంటుంది.సంక్రాంతి పండక్కి నెల రోజులముందుగానే అన్న ఇంట్లో మకాంపెట్టి ,వదిన మర్యాదలోపంచేసినా సహించుకుని వుంటుంది.అప్పుడు ఎచ్చమ్మని కూడా తీసుకుని రుక్మిణమ్మ కూడా వస్తుంది.ఎచ్చమ్మరాకతో బంతిపూలు పూసినట్టు , పచ్చతోరణాలు గట్టినట్టు ,ఎన్నెల గాసినట్టు ఆ యిల్లు కళకళ లాడింది. తొమ్మిదేళ్ళ ఎచ్చమ్మ ఇంగ్లీషు లో పద్యాలు అవీ చెప్పడం పిల్లలందర్నీ ఆకట్టుకోడం మేనత్త కొడుకు రఘునాథ రెడ్డి చూస్తాడు.అతనేమో ఉర్దూ మీడియంలో చదువుకుని వచ్చాడు. ఎట్లాగైనా ఆమె దగ్గర అంగిరేజ్నేర్చుకోవాలనుకున్నాడు. అయితే ఆ పిల్ల ఒక షరతు పెట్టింది. కాశిరెడ్డి పెరట్లో పెద్దగంగరేగు చెట్టుంది.సంక్రాంతి రోజుల్లో నిండా కాయలతో వుంది.. ఆ గంగరేగు కాయలు కోసిస్తే అంగిరేజు నేర్పుతానంటుంది. కానీ అక్కడేదో దయ్యం వుందని పిల్లల్ని పోనివ్వరు. అయనా గానీ సరే అన్నాడు ఆ పిల్లవాడు...మధ్యాహ్న భోజనాల వేళ వాళ్ళిద్దరూ గంగరేగు చెట్టు దగ్గరకు పోయి అక్కడ గోడ మీద కూచుని ఎచ్చమ్మ చదువుతుంటే అతను మళ్ళీ అని ఆమె చెప్పినవి వల్లె వేస్తున్నాడు.ఇది చూసిన పిల్లలు కొంతమంది పోయి, అతనితల్లి ముత్యాలమ్మకి ఎచ్చక్క దగ్గర బావ అంగ్రీజు నేర్చుకుంటున్నాడని చెప్పారు..కొడుకు అంగ్రీజు నేర్చుకుంటున్నాడంటే ముందు సంతోషమైనా వెంటనే ,రేపు తన కొడుకు అదుపాజ్ఞలలో వుండవలసిన పోరి గురువాలె వాడికి అంగ్రీజు నేర్పడమేమిటని కోపం వచ్చింది.అంగ్రీజు నేర్చుకోడం తరువాత ఇద్దరూ ఒడుపుగా చెట్టెక్కి కాయలు కోసుకుని తిన్నారు.మరి రఘునాథ రెడ్దయితే దిగాడు గానీ ఎచ్చెమ్మకు దిగరాలేదు.అతనే ఉపాయం చెప్పాడు,తను కింద వొంగి నిలబడితే, తన వీపు మీద కాలు పెట్టిదిగ మన్నాడు.అట్లాగే దిగుతోంది ఆపిల్ల .కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన ముత్యాలమ్మ కంట తన కొడుకు సల్వ అంగి మీద కాలు పెట్టి దిగుతున్న పిల్ల!! తిప్పికొడ్తే పదేండ్లు లేని ఈ పిల్ల ఇప్పట్నించే తన కొడుకుని కర్రె కుక్కను చేసి తిప్పు తుండది .దీనికీ దీని సంబంధానికీ ఒక దండం అనేసి కొడుకుని తీసుకుని వెళ్లిపోయింది..బాల్య వివాహమూ చదువుకు స్వస్తి మొదలైనవి తప్పిపోయిన ఆ పిల్ల ఏ ప్రొఫెసరో అయుండచ్చు..మేనత్త దయ వల్ల...ఇందులో మేనత్త పాత్ర ని ఆ నాటికి అత్యంత సహజంగా చూపించారు యశోదారెడ్డి....,మ్యానరికం అనే మరో కథ, మేనరికం పేరిట బాల్యం లోనే పిల్లల పెళ్ళిళ్ళు నిశ్చయం అవడాన్ని వ్యతిరేకించిన కథ. పల్లెలో పీర్ల పండగ,హిందూ ముస్లిం ల మైత్రి, భంగుతాగి సన్యాసులెంటబడి ఆరునెలలు తిరిగి ఇంటికొచ్చి మళ్ళీ భార్యను చూసి ఆమెకు అంటుకుపోయిన జోగుళయ్య అప్పటి గ్రామణ జీవితాన్ని కళ్ళకు కట్టిస్తారు.

ఎచ్చమ్మ కథలలోనూ ధర్మశాలలోనూ ఒక చెల్లెలు (ఎచ్చమ్మ) అక్కకు వ్రాసే ఉత్తరాల రూపంలో కొన్నికథలున్నాయి. ఈ కథలన్నీ మాండలికం లోనే ఉన్నాయి.అట్లాగే తెలంగాణా గ్రామాలలోని పెళ్లి వేడుకలు ,నగలు ,రైకపై కుట్టుపని ,పండగలు ఆచారాలు ఎన్నో తెలుసుకోదగ్గ విశేషాలున్నాయి. ఎచ్చెమ్మ అక్కకు వ్రాసే ఉత్తరాలన్నింటిలో ఆమె అక్కా బావల అనురాగ దాంపత్యాన్ని, అన్యోన్యతనూ ప్రస్తావించకుండా వుండదు.అట్లాగే అమె కథల్లో ఆడపిల్లలంతా చంద్ర దీపాలు.తండ్రులు ఆపిల్లల్ని ఎంతగానో అక్కున చేర్చుకుంటారే గానీ ఎక్కడా వివక్ష చూపరు.సీతక్క పెండ్లి అనేకథలో కూతురుపాపెట తీర్పుకు, నాబిడ్డ కాటిక సక్కనకు, నాతల్లి బొట్టు పొందికకు, బాసికపు కూర్పుకు,నాపండు ఒడిబియ్యానికి, నామొల్క ఎదుగుకు ,నాకంటిసలవకు ఆసీతారాముల జంటకు,ఆజత ముద్దు మురిపానికి తనకున్న పొలం తనఖా పెట్టడానికి కాళ్ళరిగేలా తరిగిన సీత తండ్రి ,అదంతా తనబిడ్డకోసమని తన అంతస్తుకు మించిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్ళి సామానుకు పందిర్లకు మండపాలకు తెచ్చిందంతా ఖర్చుచేసినా .కట్నం దగ్గర పేచీలొచ్చి పెళ్ళి ఆగపోయింది. పెళ్ళికొడుకు విలాయతుకి వెళ్ళిపోయాడు.నిజానికి సీతక్కమీద మనసు పడింది అతనే..కానీ సంవత్సరం తిరిగే సరికి అతనే వచ్చి సీతని అక్కున చేర్చుకుని మామ కాళ్ళకి మొక్కాడు. ఆమె కథల్లో ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయిలని తప్పకుండా పెళ్ళి చేసుకుంటారు అంతస్తుల తేడాలున్నా...పెద్దలు అంగీకరించినా లేకపోయినా చేసుకుంటారు. మావూరిముచ్చట్లు అనే పెద్దకథలో ఆ వూరికి జానపద కళలపై పరిశోధన కొచ్చిన యువతీయువకుల ఎదుట తమ కళల్ని ప్రదర్శించడానికి సిద్ధమౌతున్న వివిథ కళాకారుల్ని మనకి పరిచయం చేస్తూ పనిలో పనిగా అందులోనే ఒక ప్రేమ కథను కూడా చెప్తారు .కురువల పెళ్లి సంబరాలు చూడ్దానికి పోయి వాళ్ల పెళ్ళి తంతుల్లో ఇరుక్కుపోయిన ఒక కాపింటి బిడ్ద ,అనుకోకుండా ఒక బ్రాహ్మణ యువకుడికి భార్య అయిపోవడం, ఆఇద్దర్నీ పెద్దలుఅంగీకరించకపోతే ,వాళ్ళు వెళ్ళిపోవడం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వాళ్ల మధ్య. చివరికి వాళ్ళు ఈ జానపద సంఘంతో ఆవూరొచ్చినప్పుడు ఆమె వరుస చెల్లెలు ఆమెని తమ ఇంటికి పిలవడం కథ...ఇందులో పల్లెల్లో వుండే ఎంతో మంది జానపద కళాకారులు వాళ్ల విద్యలూ, అన్నీ పూసగుచ్చారు యశోదారెడ్ది..జమ్మి కథలో పల్లెటూర్లో దశరా పండగ సంబరాల్లో భాగంగా జమ్మి కొట్టే టప్పుడు ఊరి ఆసాముల సంభాషణ ల ద్వరా వారి మనస్తత్వాలు అద్దంలో లాగా కనపడతాయి,,పర్పుబండ ,బొక్కిందే దక్కుడు,రాజుగారి ఒకనాటి ప్రచారం కథలు అద్భుతమైన రాజకీయ వ్యంగ్యాస్త్రాలు. ఎలెక్షన్లు రాబోయేముందురాంగ రాంగ నెలలునిండి పురిటిదినాలు దగ్గర పడ్దట్లు ..ఎన్నికలు రేపో మాపో..ఇవే నాల్గు రాళ్ళు రాలంగ రెండురాళ్ళు.వెనకేసుకునే దినాలు..పల్లె ఒళ్ళువిరుచుకుని లేచి ఉత్సాహం పుంజుకునే వైనం.

అప్పటి పల్లెల్లో కొందరు దొరసాండ్ల కెంత అసూయ పొగరు వుండేవో ఎన్ని కుటిల బుద్ధులుండెవో కాలం చెప్పిన తీర్పు కథలో .పాపవ్వ దొరసాని ఉదాహరణ.మంచి దొరసాంద్లకుసంజ కథలో దొరసాని ఉదాహరణ. ఎచ్చమ్మ కోరి చేసుకుంటినమ్మ కోతిశివుణ్ణిఅని ఏరికోరి ఒక వన్నెల మొగోడు,చిత్రకారుణ్ణి పెళ్ళి చేసుకుంది.వాళ్ళు చెమడోడ్చి ఒక ఇల్లు కట్టుకున్నారు .దాని పేరు సుధర్మ.అదొక బొమ్మల కొలువు..అంతా బాగానే వుంది కానీ ఆఇంటిచుట్టూ బస్తీ రొద పెరిగింది..అక్కడొక చెత్తకుండీ వెలిసింది.ఆ చెత్తకుండీలో చిత్తుకాగితాలేరుకునే వాళ్లు మొదలయ్యారు.అప్పుడు కుండీ ఖాళీ చేసే మున్సిపాలిటీ మనిషి చిత్తుకాయితాల వాళ్లని రూపాయకట్టి కాయితాలు ఏరుకోమని ఆర్డరేశాడు.ఆ రూపాయి కట్టలేని వాడొకడు కుండీ లో దిగి కూచుని కాగితాలు మూటగట్టుకుని బయట కుక్కల్ని బెదరగొట్టడానికి తనూ కుక్కలాగా అరుస్తాడు.ఒకావిడ సీసాపెంకులు తెచ్చి, కుండీలోపోయగా అతని తలకు ,వంటికి గాయాలై నెత్తురోడుతూ బయటి కొచ్చాడు.ఈ కథని యశోదారెడ్ది వ్రాసిన తీరు ఒక క్యామెరా పట్టుకుని ఆ వీధిని ,అందులో పొద్దుటి నించీ సాయంత్రం దాకా నడిచి వెళ్ళే రకరకాల మనుషుల్నీ, వాహనాల్నీ క్లోజప్ షాట్లు తీసి అంతాకలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. ఒకప్పుడు మారియో మిరండా అనె చిత్రకారుడు ఒక బొమ్మ వేస్తే అతి చిన్న వివరాన్ని కూడా వదిలే వాడు కాడు.అలా వుంటుంది యశోదారెడ్ది కథనం .పెళ్ళి తంతుల్ని గురించి చెప్పినా,ఉయ్యాల వేడుక గురించి చెప్పినా ప్రయాణానికి కచ్చరం బండి తయారుచెయ్యడం గురించి చెప్పినా బండికి ఏ ఎద్దుల్ని కట్టాలో అందులో ఎలాంటి మెత్తలు పరవాలో. ఏమేమి అలంకారాలు చెయ్యాలో ఏ ఒక్క వివరమూ వదలదు ఆమె. ఆమె కథలన్నీ కథా చిత్రాలే..ఆమె భాషలోనే చెప్పాలంటే పూరాగా చిత్తారి దించినట్లువుంటాయి..మనుషుల పట్ల ప్రేమ కథల్నిండా పరుచకుని వుంటుంది,శాంత గంభీరమైన కథలు ఆమెవి.

ఇక ఉపమానాలైతే ఏరుకోవాలి గానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి.అవి శ్రమ పడి వెతికి తెచ్చి అతికించినవి కావు.అలా అశువుగా పాళీలోంచి సిరా ప్రవహించినంత సహజంగా ప్రవహిస్తాయి సామెతలూ అంతే ఆ రెండూ నావి..అనే కథలో ముసలి ఎలమందని గురించి ఆకు రాలిన సెట్టోలె,దురమాగిన పండోలె పండువారిన ఆకోలె,పీసువారిన బీరకాయోలే,వొట్టివోయిన సెర్వోలె, రెక్కలూడిన పక్షోలె వున్న ఎలమంద, పసినిమ్మ పండోలె,పచ్చని సిగురోలె,దోరకాయోలె,దానిమ్మపూవోలె,రెక్కలొచ్చిన చిల్కోలె,పులిబెదురు తాకని జింకపిల్లోలె, కొబ్బరిగిన్నోలే వున్న మన్మరాలిని వెంటబెట్టుకుని..., ఇటువంటి ఉపమానాలు కథల్నిండా వుంటాయి.ఇంక బీర పువ్వులన్నా చిలకపచ్చ చీరెలన్నా చాలా ఇష్టం.ఆమెకు.

.మోనా అనే కథలో ఇతివృత్తం పాతదే అయినా ఆ కథ మొదట్లో ఆమె వరదను వర్ణించిన తీరు అద్భుతం...మొగులు చిల్లివోయినట్టు.ముంతన గుమ్మరించినట్ల,,మిన్నూ మన్నూ కలిసి ఏకంకవొడికినట్ల, ఏకసిస్తుగవాన., వొర్రెలు, వొంపులు ,కాల్వలు .మడుగులు ,కుంటలు,చెర్లు ఏర్లు నదులు అన్నీనీళ్లు నిండంగ,పిక్కటిల్లి ,గండ్లువడి,కట్టలు దెంపుకోని ,ఏకమై,ఒడ్లెక్కి,అలుగులు దుంకి,చిన్నా పెద్దా తారతమ్యాలుడిగి,మిర్రు పల్లాలు ఒకటై, వొంపులుదీరి,ఈసురోసాలు ఇడ్సి,ఒక్కబాటగా ,ఒక్క సూటిగా ,జతజతగా కలెగల్పుగా సముద్రయ్య దిక్కు నడిసినై, ఇట్లా సాగుతుంది.

1929 లో జన్మించిన ఈ విదుషి ,2009 మరణించారు.త్వరలోనే ఈమె కథా సంకలనం నేషనల్ బుక్ ట్రస్టు ద్వారా వెలువడనున్నది.

Sunday, April 03, 2011

ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి


భావుకతతో కూడిన గ్రామీణ జీవన చిత్రణ ,ప్రకృతి వర్ణనలు ,సంస్కృత భాషాభినివేశం, సంగీతంలో అభిరుచి ,ప్రవేశం,పరిజ్ఞానం, కలిస్తే ఐ.వి.ఎస్ అచ్యుతవల్లి,..1954 లోనే తొలికథ జగతిపత్రికలో వ్రాశారు.తరువాత భారతిలో వ్రాసిన దీపకరాగం ఆమెను పాఠకుల కు చేరువ చేసింది.అక్కడనించీ ఎనిమిది కథా సంకలనాలు అనేక నవలలు,,పత్రికలలో కాలమ్స్ విస్తృతంగా వ్రాశారు..ఎనిమిదింటిలో ప్రస్తుతం నాలుగు మాత్రమే కథానిలయం లో దొరికాయి.కొన్ని కథలు అక్కడక్కడా లభించాయి. నాలుగు సంపుటాల లోని కథలు ఏఏ పత్రికల్లో వచ్చిందీ ఎప్పుడెప్పుడు వ్రాసిందీ చెప్పలేదు.ప్రకృతి అందాలను వర్ణించడం అప్పటి ,గ్రామ జీవితం లోని సూక్షాంశాలను కూడా పరిశీలించడం,మనస్తత్వ పరిశీలన,అప్పటి స్త్రీల పరిస్థితులు, ఆమె కథల్లో కనిపిస్తాయి. దాదాపు ఎనభై ల చివర్లో కలం పక్కన పెట్టిన అచ్యుతవల్లి, గృహలక్ష్మి స్వర్ణకంకణం ,సుశీలా నారాయణరెడ్డి అవార్డ్, తెలుగువిశ్వవిద్యాలయం విశిష్ఠ పురస్కారం మొదలైన అవార్డులను స్వంతం చేసుకున్నారు ప్రస్తుతానికి మనకి దొరికిన ఆమె కథలని ,గ్రామీణజీనన నేపథ్యంగా కలవి ,స్త్రీల జీవితాలను చిత్రించినవి,మనస్తత్వాలను,లోక రీతిని చిత్రించినవిగా మూడు విధాలుగా విభజించవచ్చు.

అప్పటి గ్రామీణ జీవితాన్ని చిత్రించే మూగబోయిన ప్రకృతి పుట్టిల్లు,ముత్యాల చెరువు,మబ్బు వేట కథల్లో పుట్టిల్లు నిడివిలో నవలకన్న చిన్నదీ కథ కన్న పెద్దది ,దాన్ని పెద్ద కథ లేదా నవలిక అనొచ్చు.మూగబోయిన ప్రకృతి కథలో మూగపిల్ల శంకరిని ఇష్టపడ్డ పట్నం యువకుని భావుకత,పల్లె ప్రకృతి,శంకరి తల్లి జీవితం,కథ ముగించిన పద్ధతి కల్యాణ సుందరిని గుర్తు చేయిస్తుంది.పుట్టిల్లులో సిద్ధేశ్వరి ముఖ్య పాత్ర..ఆమెది కాస్త కలిగిన సంసారం.మరిది కుటుంబరావు చిన్నవాడు కనుక అతని ఆస్తికూడా సిద్ధేశ్వరి భర్త అజమాయిషీ కిందే వుంది .సిద్ధేశ్వరికొక చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు...చెల్లెల్ని వృద్ధుడికి కట్టబెట్టి అతని ద్వారా కొంత లబ్ది పొందుదామని తండ్రి ఆశిస్తే అది బెడీసి కొట్టింది.అతనకి జబ్బు చేస్తే పడుచు భార్య తనకి విషం పెట్టిందేమోనని అనుమానం వచ్చి తన ఆస్తంతా పసిపిల్లల హాస్పిటల్కి వ్రాసేసి చనిపోయాడు..ఆమె పుట్టింటికొచ్చింది.. పుట్టింటి లేమి సిద్ధేశ్వరిని భర్తకు తెలియకుండా వారికి సాయపడేలా చేస్తుంది.పురిలోంచి వడ్లు తస్కరించి పంపుతుంటుంది.తననగలన్నీ అమ్మి ఇస్తుంది.మరిది ఆస్తికూడా తామే అనుభవిస్తూండడంతో అతనికి పెళ్ళికాకుండా చూసింది కొన్నాళ్ళు..పెళ్ళయినాక భార్యని కాపురానికి తెచ్చుకోకుండా చూసింది. అట్లా ఆమె మరిది జీవితాన్ని అల్లకల్లోలంచేసింది.పిల్ల పెళ్ళీడుకొచ్చేవరకూ కూడా తోటి కోడల్ని కాపురానికి రానీకుండా జాగ్రత్తపడింది..ఆమె చెల్లెలు అరుంధతి అమ్మవారి అవతారమెత్తి సంపాదించిన డబ్బంతా తమ్ముళ్ళకి పెట్టి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి ఇళ్ళు ఏర్పాటు చేసింది.ఒక భక్త శిఖామణి వల్ల గర్భవతైన అమ్మవార్ని తమ్ముళ్ళిద్దరూ ఛీ కొట్టారు.ఆమె ఆత్మహత్య చేసుకుంది..వదిన గారివల్ల తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంటాడు మరిది.అతని కూతురు తల్లిని వెంటబెట్టుకుని తండ్రి దగ్గరకు వస్తుంది.స్వాతంత్య్రానంతర తొలి రోజుల్లో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ సంసారాలలో ముఖ్య ఆదాయం భూమి నించీ వచ్చేదే..అది వసూలు చేసుకునేదీ ఖర్చు చేసేదీ పురుషులే.ఒక్క రూపాయిరావాలన్న ఆచేతిమీదుగా రావాల్సిందే..తను కడుపునిండా తింటూ ఒంటినిండా బట్టకడుతూ తనకు జన్మనిచ్చిన కుటుంబం పస్తులుంటే ఏ ఆడపిల్లా సహించలేదు.సహించక చేసేదీ లేదు.భర్తని అడిగి లేదనిపించుకుంటే లోకువ, అవమానం .ఈ పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు అట్లా రహస్యంగా పుట్టింటిని ఆదుకునేవారు. స్వంతంగా సంపాదించే వనరు లేదు కనుక..అయితే పుట్టింటివారు ఈ అదును చూసుకుని వీళ్ళని దోపిడీ చెయ్యడం కూడా వుండేది.ఒక్కొక్కచోట...సిద్ధేశ్వరికి వుండే అభద్రతా అజ్ఞానమే ఆమెని అనేక తెలిమాలిన పనులకి ప్రేరేపించివుంటాయి.. తన తమ్ముడి బ్రతుకుతో ఇట్లా చెలగాటమాడిన భార్య మనస్తత్వం ఆమె భర్త కి తెలుసు.ఒక పురుషుడుగా ఆమెని అదుపుచేసే శక్తి అతనికుంది,కానీ ఆపని చెయ్యడు.అందువల్ల కొంత తనకీ లాభంవుండడాన. చూసీ చూడనట్లు వూరుకుంటాడు.భార్య గయ్యాళితనం మాత్రం లోకవిదతమవుతూ వుంటుంది..అయితే రచయిత్రికి సిద్ధేశ్వరి మీద సానుభూతిలేకపోవడం, మధ్య మధ్య వ్యాఖ్యానాలు చెయ్యడం వల్ల సిద్ధేశ్వరి ని పాఠకులు ఆకోణంలోనించీ చూసే అవకాశం లేదు.పల్లె వాతావరణం చక్కగా చిత్రితమైన కథ ఇది. ముత్యాలచెరువు కూడా పెద్దకథే.అందులో ఒక దళిత యువతికి చదువుకున్నఅగ్రవర్గ యువతికీ స్నేహం ,దళిత యువతి అమాయకత్వం,పల్లెలలో సాగుతున్న పెత్తందారీ తనం,కులవివక్ష చిత్రిత మైనాయి.విఫలప్రేమ కారణంగా ముత్యాలు అనే దళిత యువతి చెరువు లో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది.ఈ నాలుగు కథల్లోకి అగ్ర భాగాన నిలిచే కథ మబ్బువేట. కమతాన్ని కున్న జీతగాళ్లని ఖామందులు ఏడిపిస్తుంటే,మధ్యలో ఆ కమతం విడిచిపెట్టి ఎక్కువ డబ్బులకి మరో చోట పనిచేసుకునే వీల్లేక, జరుగుబాటుకోసం చీకటివేళల్లో పురులలోనించీ ధాన్యం దొంగిలింఛడాన్నే మబ్బువేట అంటారు.పురులకి కాపలా వుండే వాళ్ళుకూడా ఒక్కొక్కసారి వీళ్ళకి సహకరించి తమ వాటా తీసుకుంటారు.అట్లా మబ్బు వేటలో ఆరితేరిన రాజయ్య ,కమతాలు మానేసి స్వంత వ్యవసాయం చూసుకుంటూ మాణిక్యాన్ని పెళ్లిచేసుకుని ఆమె అందాలనూ అభిరుచుల్ని చూసి మురుసుకుంటూ వుంటాడు.మాణిక్యం కూడా ఒకప్పుడు మబ్బువేటలో నిపుణురాలే.కానీ ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ భర్తకు సహకరిస్తోంది. ఆమెకి బయస్కోపులంటే పిచ్చి.అప్పుడప్పుడూ అవి చూడ్డానికి వెళ్ళి వస్తూంటుంది .ఆమె వంక సన్నాలు తప్ప తినదు,వాయిల్ చీరెలు తప్పకట్టదు.అదంతా ఆమె కష్టపడి సంపాదించి తెచ్చుకుంటోందని మహా ఆనందపడిపోతాడు రాజయ్య..కానీ ఆమె ఇప్పుడు చేస్తున్న మబ్బువేట వేరు. బైస్కోపుకని చెప్పి ఆమె చీకటిరాత్రులలో వెళ్ళేది బాపయ్య అనే ఖామందు దగ్గరకు.వంకసన్నాలు అతనిచ్చేవే..ఈ కథకు చివర రచయిత్రి వ్యాఖ్యానం లేకపోతే బాగుండేది.

అచ్యుతవల్లి అప్పటి స్త్రీల జీవితాన్ని గురించి వ్రాసిన కథల్లో ఆండాళ్ళూ వుల్లిపాయలు అనేది అధ్భుతమైన కథ.స్త్రీలు తమకి ఇష్టమైన తిండి వండుకు తినడాన్ని కూడా ఆచార ,సంప్రదాయాలెలా .అడ్దుకుంటాయో ,నవ్విస్తూన్నట్లు కనిపిస్తూ జాలిగొలిపే కథ.ఈ కథని అచ్యుతవల్లి చాలా సౌలభ్యం తో వ్రాసారు. వైష్ణవుల ఇంటికోడలైన ఆండాళ్ళు మొదటిసారి గర్భవతైంది.ఆ సమయంలో స్త్రీలకు కొన్ని కొన్ని ఆహార పదార్థాలమీద మనసుపోతుందంటారుకదా? అట్లా మనసుపడినది తినకపోతే పుట్టబోయే బిడ్ద చెవిలో చీము వస్తుందనే మూఢనమ్మకం కూడా వుంది.వైష్ణవులు ఉల్లిపాయలు తినకూడదు .నీరుల్లైనా,వెల్లుల్లైనా..ఆండాళ్ళుకి ఉల్లిపాయలమీద మనసుపోయింది.ఉల్లిపాయ పకోడీలూ,ఉల్లిపాయ పచ్చిపులుసు..ఉల్లిపాయ పెసరట్లు..భర్త ఆఫీసుకు పోగానే కాసిని ఉల్లిపాయలు కొనుక్కుని భద్రంగా పొట్లంకట్టి బట్టల బీరువాలో చీరెలకింద దాచింది.తరువాత ఎన్నిసార్లు ఆమె ఉల్లిపాయలు తరిగి ఏదోఒకటి చేసుకోబోయినా ఎవరో ఒకరు రావడం ఆ ముక్కలు పారబోయడం జరిగి ఆ కోరిక తీరనే లేదు.ఒకరోజు భర్తకి ఏదో అవసరపడి ఆమె బీరువా తీసి వాసన గమనించి ఉల్లిపాయల పొట్లం బయటికి తీసి ఆండాళ్ళు తీరని కోరిక తెలుసుకుని కరిగి నీరై, రామయ్య హోటల్ కు వెళ్ళి ఉల్లిపాయ పెసరట్టు కట్టించుకొచ్చాడు. ఆవురుమంటూ దాన్ని విప్పుతూండగానే ఆమె అన్న ఆమెను పుట్టింటికి పురిటికి తీసుకుపోడానికొచ్చి తలుపుతట్టాడు.పెసరట్టు పెరటిపాలు.పుట్టింట్లో ఉల్లిపాయల మాటే ఎత్తకూడదు.ఇప్పుడు ఆండాళ్ళు బాధ ఒకటే.పుట్ట బోయె బిడ్దకు చెవిలో చీము వస్తుందేమోనని ..బిడ్డపుట్టాక అది లేదని తెలిసి ఊపిరి పీల్చుకుంది.ఇంట్లో ఉల్లిపాయలు వాడకూడదే కానీ మగవాళ్ళు హోటళ్ళలో తినొచ్చు .

అమె వ్రాసిన మరొక పెద్దకథ ఎగిరే పిట్టలు.ఇందులో కథానాయకి వసుంధర అందకత్తె కాదు.ఆమె తండ్రి ధనవంతుడూ కాదు..ఆమె కి చిన్నప్పుడు సంగీతం చెప్పించాడు.ఆమె కంఠం బాగుంటుందనీ సంగీతంలో ప్రజ్ఞ సాధిస్తుందనీ మాస్టారు ఎంత చెప్పినా ఆతండ్రి ఆమె వివాహం మీదే ఎక్కువ దృష్టి పెట్టి తెలుగు ట్యూటర్ అప్పాదురైకిచ్చి పెళ్ళి చేసి.ఆమె పెళ్ళికైన అప్పుతీర్చడానికి ఇల్లమ్ముకుని కాశీ వెళ్ళిపోయాడు.మిగిలిన డభ్భు కూతురికివ్వలేదని ఆమె అత్తా భర్తా ఆమెను వేధించి వెళ్ళగొడితే అన్నలదగ్గరకు కాక సంగీతం మాస్టారిదగ్గరకు వెళ్ళింది. నీ గానం అమరమౌతుంది అందుకే నీకీ సంసార విఛ్చేదం జరిగిందిఅని ఆశీర్వదించాడాయన..సంగీతం ప్రయివేట్లు చెప్పుకుని బ్రతికే స్థాయినించీ పట్టమ్మాళ్ వంటి మహా గాయనులు పాడిన వేదికలదాకా ఎదిగి సంగీత కచేరీలలో తనకొక స్వంత ముద్ర ఏర్పరుచుకుంది వసుంధర. విద్వన్మణి వసుంధర అప్పుడావూర్లో కచేరీ చెయ్యడాని కొచ్చింది ..ఆమె భర్త అప్పాదురై సంసారం డబ్బు చాలక కుంటినడక నడుస్తోంది.ఆడపిల్లలు పెళ్ళికెదిగి వచ్చారు.అతని రెండవ భార్య ,వసుంధరని ఇంటికి తీసుకురమ్మని భర్తని పోరింది.ఆమె తమదగ్గర వుంటే లక్ష్మీ దేవి వున్నట్లే.అప్పాదురై కచేరీ అయేవరకూ ఓపిగ్గా కూచుని ఆమెని తనతో ఇంటికి రమ్మన్నాడు.అతన్నే ఆమె తనుండే హోటల్ కి రమ్మంది.అప్పటికీ అప్పాదురై అహంకారంతోనే గా వున్నాడు.భర్త వదిలేసిన స్త్రీ అనే కళంకం పోగొడతాను ఇంటికి రమ్మంటాడు.ఆమె లోపలికి వెళ్లి కొంత డబ్బు తెచ్చిచ్చి అవసరమైతే అడుగుతూ వుండు సాయంచెస్తానని హుందాగా చెప్పి అతన్ని పంపేసింది.ఇది కావడానికి మామూలు కథే అయినా ఇందులో అచ్యుతవల్లి సంగీత పరిజ్ఞానం అడుగడుగునా అద్దింది.

ఇంకా వెన్నెలనీడ,అందనిలోతులు ఇజ్జత్,అభిశంస,.కదలని బాట ,చర్విత చర్వణం స్వయంబద్ధ నిర్మల,వంటికథలలో కూడా స్త్రీల జీవితాలలో తారసపడె అనేక సమస్యలు మనోవ్యధలు వాటిని వాళ్ళు స్వీకరించే పద్ధతీ చిత్రించారు. తిరుగుబాటు తక్కువ .స్త్రీలను అర్థం చేసుకుని పశ్చాత్తాప పడే పురుషులు అక్కడడక్కడా కనిపిస్తారు. స్వయంబద్ధనిర్మల లో నిర్మల వివాహానికి ముందు కథలు వ్రాసేది.పెళ్ళయినాక కూడా వ్రాసుకోలెమ్మని ఆమె భర్త వరమిచ్చాడు.ఆమె వ్రాసింది.అయితే ఆమె వ్రాసిన కథలో తనకుటుంబం లోని వ్యక్తుల ఛాయలు కనపడ్దాయి భర్తగారికి.చాలాకోపం వచ్చేసింది ఆయనకి.కథలు వ్రాసుకోమంటే ఇలాగా అని గంతులుపెట్టాడు. ఆమె పూజ్యులైన భర్తగారికిఅని సంబోధిస్తూ ఒకలేఖ వ్రాసిపెట్టి అతని అక్కగారింటికి వెడుతూ ఆ కథ బాయిలర్ లో వేసి పోయింది.భారతీయ స్త్రీకి కథలు వ్రాసుకోడం కన్న సంసారం ముఖ్యంకదా అని కాస్త వ్యంగ్యంగా..ఆడవాళ్ళు రాయాలంటే ఎన్ని ఎడిటింగ్ లు ఎంత సెన్సారింగ్?

మానవ మనస్తత్వాలనూ లోకరీతులనూ చెప్పే కథలలో వర్షం వచ్చినరోజు సన్నాటా ఎక్కువ పాఠకాదరణ పొందిన కథలు.వర్షంవచ్చినరోజు కథలో ఒక ధనిక యువకుడు అతని రోగిష్టి భార్య ,మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకునే పేదరాలు,టీ అంగడినడిపే అతనూ ..ఎవరెవరుఆ వర్షపు రోజున ఎట్లా ఆలోచించిందీ ఈ కథ .వర్షంలో తడిసి ఒంటి వొంపులు దాచుకోలేని ఎల్లమ్మ కప్పు టీ అయినా అమ్ముడుపోని అప్పిగాడూ తమకన్న అదృష్టవంతులని ఆ ధనిక దంపతులు అనుకుంటారు.సన్నాటా కథలో చాలాకుటుంబాలు అద్దెకున్న పాత మేడ ముందొక కారు ఆగితే అది తమకోసమేనని ఎవరిమటుకు వాళ్లు అనుకోడం చివరికి ఆ మేడ యజమాని దాన్ని అమ్మబోతున్నట్లు చెప్పడం కథ. ఆమె వ్రాసిన వందలాది కథల్లో ఇవికొన్ని

అచ్యుతవల్లిది చదివించే శైలి.చక్కని తెలుగు భాష.పరిశీలనాసక్తి ఎక్కువ.అప్పట్లో విస్తృతంగా వ్రాసిన రచయిత్రి...వివాహానికి ముందు కె.వి.ఎస్ అచ్యుతవల్లి అనేపేరుతోనూ కొంత కాలం రాఘవేంద్ర అనే కలం పేరుతోనూ వ్రాసారు ...చాలా నవలలు వ్రాశారు.బాతోంమే ఖూనీ అనే కాలమ్ నడిపారు.

1943 లో జన్మించిన అచ్యుతవల్లి 2010 లో మృతి చెందారు

..

Wednesday, March 02, 2011

కె.రామలక్ష్మి




తన అభిప్రాయాలను, సూటిగా నిర్మొహమాటంగా,ఒకింత హాస్యం రంగరించి చెబుతూ, జవాబుల శీర్షికతో అనేకమంది పాఠకులను ఆకట్టుకుని, ఎన్నో ఆకతాయి ప్రశ్నలకు మొట్టికాయలు వేసిన సీనియర్ రచయిత్రి రామలక్ష్మి, శతాధికంగా కథలు వ్రాసారు.యాభైయ్యో దశకానికే ఆమె ఇంగ్లిష్ స్వతంత్రలో జర్నలిష్టు గా ఖాసా సుబ్బారావుగారివంటి ప్రఖ్యాత సంపాదకుని వద్ద శిక్షణ పొందారు.అక్కడ పనిచేస్తూ, తెలుగు రచనలకి శ్రీకారం చుట్టడమే కాక అనేక మంది రచయిత మిత్రులతో సాహిత్య చర్చలు చేసే అవకాశాన్ని పొంది తన రచనలకు మెరుగులు దిద్దుకున్నారు. స్వాతంత్ర్యానంతర తొలి తరం యువతిగా ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలిగి ,చదువూ ఉద్యోగం ,జీవన సహచరుణ్ణి స్వయంగా ఎంపిక చేసుకునే స్వేచ్చనూ అందిపుచ్చుకున్నారు ఆరుద్రను జీవన భాగస్వామిని చేసుకున్నారు. . 1954 నాటికే ఆమె తొలి కథా సంపుటి ’విడదీసే రైలుబళ్ళు” ప్రచురించారు.1961 లో ’తొణికినస్వప్నం” ప్రచురిం చారు 2007లో దాదాపు ఎనభై కథల్ని రెండు. సంపుటాలుగా ప్రచురించారు.అలవాటుగానే ఆ యా కథలు ఏ ఏ సంవత్సరాల్లో వచ్చాయో వాటి కింద వెయ్యలేదు.యాభైయ్యో దశకం లో ఆమె వ్రాసిన పార్వతీ కృష్ణమూర్తి కథలు బహుళ పాఠకాదరణ పొందాయి.
స్టువార్టుపురం నేపధ్యంలో “గురు దక్షిణ “అనే నవల కాకుండా ఒకతండ్రికథ మరికొన్ని నవలలు వ్రాశారు.ఇప్పుడు అందుబాటులో వున్నవి ’ఒక జీవికి స్వేచ్చ” “అద్దం”అనే రెండు కథా సంఫుటాలు. త్వరలోనే పార్వతీ కృష్ణమూర్తి కథలు ప్రచురించాలనుకుంటున్నారు.గృహలక్ష్మి స్వర్ణకంకణం,పందిరి మల్లికార్జున రావు వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు.ఆంధ్ర పత్రికలో ప్రశ్నలు జవాబులే కాక ఉదయం వార పత్రిక లో నారీదృక్పధం శీర్షిక ను కూడా సమర్థ వంతంగా నిర్వహించారు.తన భావాలను నిర్మొహమాటంగా నిర్ద్వందంగా చెప్పటం ఆమె ప్రత్యేకత.

1954 లో వచ్చిన విడదీసే రైలు బళ్లు సంపుటిలో చీలిన దారులు అనే కథ వుంది.అందులో ప్రేమించుకున్న యువతీ యువకులు పెళ్లిచేసుకోడానికిష్టపడరు.కారణం పెళ్ళి వలన ఏర్పడే నిరంతర సాన్నిహిత్యం ప్రేమను మాయం చేస్తుందని.అప్పటికే వివాహ వ్యవస్థ పట్ల రామలక్ష్మి గారి అభిప్రాయాన్ని ఈ కథ సూచిస్తుంది.
ఆత్మ గౌరవం స్త్రీలకి గానీ పురుషులకు గానీ ఒకరిచ్చేది ,ఒకరినించీ లాక్కునేదీ కాదు .అది వాళ్లంతట వాళ్ళే అలవర్చుకోవాలనే నమ్మకాన్ని అనేక కథల్లో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు రామలక్ష్మి.అయితే ఆమె ఎక్కువగా కథలు వ్రాసిన నాటికి అది అందరు స్త్రీలకి సాధ్యమైన విషయం కాదనే నిజాన్ని కూడా చాలా కథల్లో ప్రస్థావించారు.రామలక్ష్మిగారి కథలన్నీ స్త్రీల జీవితాలని ,వాళ్ళు యువతులుగా,గృహిణులుగా ,వృద్ధులుగా ఎదుర్కుంటున్న సమస్యల్ని,చిత్రించినవే. అందుకు ఒక కారణం ఆమె కొన్ని సేవాసంస్థలలో పనిచేస్తూ బాధిత స్త్రీలను సన్నిహితంగా చూడడం కూడా కావచ్చును.మానసిక రోగులను,ఫౌండ్లింగ్ సంస్థలను వికలాంగుల పాఠశాలను సందర్శించడం కూడా కావచ్చు..స్త్రీలపట్ల సహానుభూతి పెంచడానికవి దోహదం చేసి వుండొచ్చు.

రామలక్ష్మి గారి కథలలో పార్వతీ కృష్ణమూర్తి కథలు ఇద్దరు సమ చైతన్య స్థాయి వ్యక్తుల ప్రేమమయమైన సంసార జీవనాన్ని చిత్రించేవి.. అప్పటి వరకూ ఎక్కువమంది వ్రాసిన కథల్లో చూసింది ఒక పురుషుడు భార్య పట్ల చూపే ప్రేమ .ఆమెకి పండక్కి చీరె కొనడం సాయంత్రం మల్లెపూలు తేవడం లేదా ,లేదా కాస్త సానుభూతితో మాట్లాడ్డం.ఆమె అందాన్ని పొగడడం ..దానికి స్త్రీలు ఉబ్బి తబ్బిబ్బైపోవడం..ఇక స్త్రీలు భర్తకీ పిల్లలకీ సేవ చెయ్యడం ఏ కాస్త మెప్పు దొరికినా కృతజ్ఞతా భారంతో కళ్ళు తుడుచుకోడం ..కానీ స్త్రీ తరఫునించీ భర్తని ముద్దు చెయ్యడం అతనితో స్నేహంగా వుండడం కనపడవు.భార్యని తనతో సమానమైన మేధో జీవిగా స్నేహితురాలిలా కాక పేట్రనైజింగ్ గా చూసే భర్తలే సాహిత్యంలో తారసపడతారు.ఇట్లాకూడా వుంటుంది సాహచర్యం అనే కొత్త విషయాన్ని రామలక్ష్మి ఈ కథల ద్వారా ప్రవేశ పెట్టారు.పార్వతిని ప్రొటాగనిష్ట్ చేశారు. కొండొకచో అమాయకురాల్లా కనిపించే పార్వతి చాలా తెలివికలది .సమర్థురాలు.ప్రేమించే హృదయం కలది. చిన్నచిన్న సరదాలూ సంతోషాలూ అలకలూ అసూయలూ వున్న నిండైన మనిషి..విషయ పరిజ్ఞానం కలది..ఆ విషయాన్ని ఒక్కొక్క సారి దాచిపెట్టి కృష్ణమూర్తి పెద్దరికం నిలబెడుతూ కూడా వుంటుంది.పిల్లలకి మంచి స్నేహితురాలు.అల్లరి సహిస్తుంది. తన పిల్లలు తన కళ్ళెదుటే పెద్దవాళ్లవడాన్ని చూస్తూ ఆ ప్రకృతి సహజత్వాన్ని అర్థం చేసుకోగలదు..అయితే పార్వతికి ఆమెను ఆరాధించే సహచరుడూ,డబ్బుకు తడుముకునే పరిస్థితి లేకపోవడం నూకాలు వంటి నమ్మిన బంటూ వున్నారు కదా!!అయినా మనం పార్వతి సృష్టికర్తను మెచ్చుకుని తీరాలి..ఎందుకంటే అన్నీ వున్నా కూడా అట్లా భర్త పక్కన కూచుని అతని ఉంగరాల జుట్టులో వేళ్ళు జొనిపి ఒక్కొక్కసారి ముద్దు పెట్టి సంసారాన్ని ప్రేమమయం చేసుకోగల స్త్రీలు అప్పటికెంతమంది? భర్తలు అట్లా భార్యల్ని ఆరాధించాలని చెప్పిన రచయితలెంతమంది? ఇప్పటికీ అదొక “విష్ ఫుల్ థింకింగ్’గానే వుందికదా చాలామందికి!!

“ఒక జీవికి స్వేచ్ఛ” కథా సంపుటిలో పార్వతీ కృష్ణమూర్తి కథలు ఏడేనిమిది వున్నాయి .అద్దం సంపుటిలో మూడున్నాయి.పార్వతి కూతురు బేబీ కౌమార దశలో తను అందంగాలేనని బాధపడిపోతే తల్లి ఆపిల్లకు ఆత్మ విశ్వాసం కలిగించిన కథ,అట్లాగే బేబీ తన స్నేహితుణ్ని ఇంటికి పిలిచి కాస్త హడావిడి చేస్తే ఆపిల్ల అతన్ని ప్రేమిస్తోందనుకుని తను కృష్ణమూర్తిని మొదటిసారి ఇంటికి పిలిచినప్పుడు పడిన ఆదుర్దా కాలు నిలవక ఇంట్లో తిరిగిన తీరు తలుచుకుంటుంది. అతను రాడు.దాన్ని ఆపిల్ల చాలా కూల్ గా తీసుకోడం పార్వతికి ఆశ్చర్యం కలిగిస్తుంది.. తరానికీ తరానికీ ఆడపిల్లల్లో వచ్చిన వివేకంతో కూడిన మార్పుని ...,ఇప్పటి పిల్లలకి స్నేహం వేరు ప్రేమ వేరూ అనే విషయాన్ని కష్ణమూర్తి చెప్పగా అర్థం చేసుకుంటుంది.పిల్లల సందేహాలను సుతారంగా తీర్చడంలో నేర్పరి( రాలిన తార) ..మొత్తానికి ఇంట్లో అందరికీ ఆమె ఒక చలువ పందిరి..ఇంటి పని చేస్తూ తమని తాము మర్చిపోయిన స్త్రీలను గురించి 80 వ దశకంలో కూడా మనం మాట్లాడుకున్నాం కానీ అప్పటికే పార్వతి తన అభిరుచుల్ని వ్యాపకాలనీ నిలుపుకుంటూనే సంసారాన్ని భారంగా కాక ఒక పాటలా సాగించింది.అందుకు పునాది ఆమె స్వయంగా వేసుకుంది.తన జీవన సహచరుణ్ణి తనే ఎంచుకుంది.పరస్పరం కోరుకున్నాకే అతన్ని జీవితంలోకి ఆహ్వానించింది.(ఏకోన్ముఖులు).యాభైల నాటి తల్లితండ్రుల మనస్తత్వాల రీత్యా ఆడపిల్లలిలా తమ జీవితాలను చక్కదిద్దుకోగలగడం కష్టమే అయినా దిద్దుకోవచ్చు అని చెప్పడం చేస్తాయి ఈ కథలు. ఓల్డ్ రేరిటి కథలో కృష్ణమూర్తి ”ప్రేమకి మించిన ఓల్డ్ రేరిటీ లేదోయ్ పార్వతీ !అది మనం కొనలేం!!కనుక భద్రపరుచుకోవాలి” అంటాడు.
నలభయ్యో పడి, తగ్గు,రాలిన తార మంచి కథలు 80 ల తరువాత ఉధృతంగా వచ్చిన స్త్రీవాద సాహిత్యానికి స్వాతంత్ర్యానంతర తొలి రోజుల్లోనే బీజాలుపడ్దం అప్పటి రచయిత్రుల కథల్లో చూస్తాం ఉదాహరణకి రామలక్ష్మి గారి పేపర్ టైగర్స్ కథలో సుందరి ,మూర్తి ని ప్రేమించింది .అతను పెళ్ళి చేసుకుంటానంటే నమ్మింది..అతను వేరే పెళ్లికి సిద్ధపడి ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అప్పటికే ఆమె గర్భవతి.. సుందరి అన్న ఆమెను నిలదీసి ,నానా మాటలని ,ఇంక ఉద్యోగం మానేసి ఇంట్లో వుండమంటాడు .సుందరి తిరగబడింది.ఉద్యోగం మాననంది పిల్లని కని పెంచుకుంటానంది. తల్లి తండ్రులని కూడా తనే చూసుకుంటానంది.ఈ కథ ముగింపులో రచయిత్రి “ఆ రోజు ఆ ఇంట్లో విస్తళ్ళు లేవలేదు. నిజమే..కానీ అలా శాశ్వతంగా వుండిపోదుకదా!!” అంటారు.శివారెడ్డి అన్నట్లు తెరిపిలేని దేదీ లేదు.అంతం కానిదేదీ లేదు.ఎవర్ని వారు పునః ప్రతిష్ఠించుకోడం వుంటుంది.సంప్రదాయాలు, ఆధిపత్యాలు మారితీరతాయి తప్పదు..

రామలక్ష్మి చాలా కథల్లో పిల్లల నిరాదరణకి బలైన తల్లి తండ్రులు ,ముఖ్యంగా తల్లులు కనిపిస్తారు.” అదెక్కడ” అనే కథలో పద్మావతి కుటుంబ సభ్యులందరి దృష్టి లో కేవలం “అది”కింద దిగిపోయింది.ఆమె లేనిదే ఆ ఇల్లు నడవదు.ఉద్యోగం చేసే కోడలూ కొడుక్కు స్కూల్ కి వెళ్ళె మనవలకు.రిటైరై ఇంట్లో వుండే భర్తకు.అందరికీ ఆమె జీతం లేని సేవకురాలు.కోడలి మెప్పుకోసం భార్యని సతాయించే భర్త,కోడలికి ఎప్పుడూ వత్తాసు పలికే కొడుకు..ఆమెకి విసుగొచ్చేసి ఇల్లువదిలి పోయి పనిచేసుకు బ్రతికే స్వతంత్రులైన స్త్రీలతో చేరిపోయింది.అక్కడ తనకొక పేరుంది.కొంత జీతముంది..తనకొక బ్రతుకుంది..అదెక్కడ అని వాళ్లు తరువాత ఏడవనీ..”టిపికల్ సన్” కథలో వృద్ధాశ్రమంలో చేరిన మిసెస్ జకరియా చివరి క్షణాల్లో కొడుకుని చూడాలని తపించినా అదంతా నాటకమని కొట్తిపారేస్తాడు కొడుకు. ఆమె పోయాక కట్టిన డిపాజిట్ లెక్కలు త్వరగా తేల్చమంటాడు.

“ఒక జీవికి స్వేఛ్చ” కథలో కొడుకులు తండ్రికి తద్దినం పెట్టడానికి బాధపడిపోవడమే కాక తల్లి ని దగ్గర పెట్టుకోడానికి కూడా వచ్చందాలు పడి చివరికి వితంతువైన అక్క దగ్గర వుంచుతారు.డబ్బు పంపితే ఉంచుకుంటా అంటుంది...భర్తకు తద్దినాలు పెట్తక పోవడానికి చాలా కలత పడి తమ పురోహితుదైన శాస్త్రి చేత ఆయనకు గయలో పిండం పెట్టించి తృప్తిగా కళ్ళుమూసిందావిడ.శాస్త్రిగారు ఆవిడకైనా పిండం పెట్తమని కొడుకుల్ని మందలిస్తారు.”అద్దం’కథలొ లక్ష్మికి అద్దంలో తనని చూసుకోవాలని కోరిక .కానీ ఆ అద్దం ఎన్ని సార్లు చూసుకున్నా తన ముఖం కనపడదు. గతమంతా జ్ఞాపకముందికానీ అద్దంలో ముఖమే కనిపించడంలేదు. అంటె తన ఉనికి ,తన వ్యక్తిత్వం కనపడకుండా పోయిన వైనం..ఒకరోజు అద్దం పగిలింది.అప్పుడా పగిలిన ముక్కల్లో ఆమె ముఖం కనపడింది.ఆమె వుండడం వల్ల ఆమెకొచ్చే కుటుంబ పెన్షన్ కొడుక్కి లాభం...రాగానే తీసేసుకుంటాడు.అద్దంలో తన ముఖం కనపడంగానే ఆమె చనిపోయింది ఆమె పోవడం ఆమెకి లాభం కొడుక్కి పెన్షన్ నష్టం..కుటుంబ పెన్షనున్న తల్లుల్ని ఏదో ఒకరకంగా భరించవచ్చు. అదికూడా లేనివాళ్లకి కష్టమే! అలాగే తన అన్నతమ్ములు తల్లిని సరిగ్గా చూడకపోతే తనే ఆమెను చూడ్డానికి ముందుకొచ్చిన కూతురు కథ “రా అమ్మా రా” తనకన్న ఎక్కువ హోదా లో వున్న భార్యని భరించడం భర్తలకి ఇప్పుడీ ఇరవైయొకటో శతాబ్దంలో కూడా కష్టమే..ఆత్మ న్యూనతతో అతను చేసే అవమానాన్ని కన్నీళ్ళలా మింగి సహించడమే..అంటుంది వర్కింగ్ వైఫ్ కథ. ఇట్లా స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం సామాజిక హోదా భర్తల ఆత్మన్యూనతను పెంచడమే కానీ తగ్గించడంలేదని చెప్పే కథ.

“నో నో ప్లీజ్” కథ కనిపడెసే అనాథ శిశువుల గురించిన కథ.”హావ్ సెక్స్ బట్ నాట్ అ బేబీ” అంటాడు అట్లా పారేయబడి ఒక మంచి వ్యక్తిచేత పెంచబడి డాక్టర్ అయిన కుర్రవాడు ఒక పోస్ట్ మార్టెమ్ చేసొచ్చి.,తన పెంపుడు తల్లి స్నేహితులైన స్త్రీ వాదులతో కలిసి పిక్నిక్ కి వెడుతూ. ఆసందర్భంగా కొంత స్త్రీవాద చర్చ నడుస్తుంది ;ఈ కథ గురించి చాగంటి తులసి ఇలా అంటారు” “ఆడవాళ్ళ్కో నీతి మగవాళ్ళకో నీతి అని మడి కట్టుకు కూచో నక్కరలెదు “హావ్ ఇట్ “అని చెప్పించారు.అయితే ఎంతగానో చైతన్య వంతురాలైన నిజమైన స్త్రీ వాది తనకి పిల్లలు కావాలనుకుంటే ఆ బాధ్యతను ఎరిగే పిల్లని కంతుంది.అంత చైతన్యవంతుదైన మగవాడినే సహచరుడిగానూ పెళ్ళి చేసుకోకపోయినా సంతానానికి తండ్రిగానూ అంగీకరిస్తుంది. కానీ అక్రమ సంతానంగా పారెయ్యడానికి కంటుందా? ఆవిడకి కడుపు దించుకోవలసిన అవసరం ఏముంది? ఇది ఆలోచించాల్సిన విషయం. పోతే ఆడదానికైనా మగవాడికైనా విశ్రుంఖల సెక్స్ స్వేఛ్చకు అనుమతి ఆమోదయోగ్యమూ భావ్యమూనా?అక్రమ సంతానాన్నిఅందిస్తోదంటే సమాజపు కట్టుబాట్లకు భయపడుతోందనే కదా తాత్పర్యం?కనిపారెయ్యడం,కడుపు దించుకోడం ఐదు నెలల పిండంతో సహా ఆత్మహత్య చేసుకోడం ,సమాజపు కట్టుబాట్లకు భయపడే కదా?సమాజపు అవక తవకలను ప్రశ్నించే చైతన్యవంతులైన మహిళలు ఈ పనులు చెయ్యమని చెప్పరు.......హావ్ సెక్స్ బట్ నాట్ అ బేబీ అనేది పరిష్కారం కాజాలదు”
ప్రేమించిన వాడు వేరే పెళ్లి చేసుకోడానికి వెళ్ళిపోతే తన కడుపులో పిల్లని పెంచుకుంటానని ధైర్యంగా చెప్పిన పిల్ల (పేపర్ టైగర్స్)కథ యాభైల్లోనే వ్రాసారు రామలక్ష్మి.

స్నేహితురాలు లాయర్ శాంత చెప్పినట్లుగా కొన్ని న్యాయ సంబంధమైన కథలు కూడా వ్రాసారు.పిల్లల్ని తండ్రి కష్టడీ లో వుంచాలనే తీర్పు వలన దుర్మార్గులైన భర్తలతోనే దినదిన గండమైన కాపరాలలో చిక్కుపడి వుండే స్త్రీల గురించి చెబుతూ చట్టాలు ఒక్కొక్కసారి స్త్రీలకు వ్యతిరేకంగా ఎలా వుంటాయో “”ఓడిపోయాను” కథలో చెప్పారు “80 వ దశకానికి రెండు మూదు తరాల చదువుకున్న తల్లు లొచ్చారు.వీరు ఆడదాని ఎదుగుదలని మొగ్గలో తుంచేయ్యడాన్ని సహించలేకుండా వున్నారు.ఇలా తుంచివెయ్యడాన్ని క్రిమినల్ తత్వంగా భావిస్తున్నారు . అన్నిరంగాల్లో సమానత్వం అవకాశాలు సాధింఛడానికి , అన్యాయాలను సమస్యలను కోర్టుకీడ్చి న్యాయం పొందవచ్చుననుకుంటే,కోర్టు కెడితే అసలు సమస్య జటిలమై అడుక్కి పోయి మరుగున పడిపోతుంది .న్యాయ స్థానాలు సెక్సువల్ పాలిటిక్స్ కి,మనుధర్మ శాస్త్రానికీ ,మతపరమైన ఆటంకాలకీ అతతంగా వున్నప్పుడె సాంఘిక న్యాయం చేకూరుతుంది ఆస్థితి మనకు లేదు”అంటారు రామలక్ష్మి ఒకచోట.అధికారంలోకి వచ్చిన స్త్రీలు ఆ పార్టి సూచించిన చిలక పలుకులు పలుకుతూ వ్యక్తిగతంగా దిగజారుతున్నారనీ దీనికి విరుద్ధంగా పోరాడాలనీ అంటారు ఇంకొక చోట.స్త్రీలు మేము మానవులం, వ్యక్తులం అని గట్టిగా నోరు తెరవనంతకాలం సంఘ సంస్కరణలు కాగితాలకే పరిమిత మౌతాయంటారు.మార్పు స్త్రీల నించే రావాలి..

రామలక్ష్మి గారి కథల్లో ఎక్కువ స్త్రీలు అప్పటికీ ఇప్పటికీ అనుభవిస్తున్న పరాధీనత అసహాయత ఎక్కవగా కనిపిస్తుంది. అట్లా అని ఆమె కథల్లో స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న స్త్రీలు లేరని కాదు.ఈ కథల్లో ఒక నలుగురు స్నేహితులు కనిపిస్తూ వుంటారు.వాళ్ళు పెళ్ళై సంసారం చేస్తున్నవాళ్లు.అయితే వాళ్ళు తమ స్నేహాన్నీ ఏళ్ళకొద్దీ కాపాడుకుంటారు.తరుచూ కలుస్తారు.కలిసి ప్రదేశాలు చూడ్డానికి వెడతారు.వాళ్ల స్వంత స్పేస్ ని హాయిగా వినియోగించుకుంటారు. ఇప్పటికీ చాలామందికి అటువంటి స్పేస్ లేదని వాపోయే పరిస్థితి వుంది. యాభై అరవైల నాటికే ఆ పరిస్థితి వుందని చెబుతాయి ఈ కథలు.

“జీవితాన్ని వెనక్కి తిగి చూసి తప్పులు దిద్ది తిరగరాయలేం కదా?అందుకే ముందుకే చూడ్దం అలవాటు చేసుకున్నా ఇప్పటిదాకా సాగి వచ్చినంత దూరం-సాగవలసి వుండదుకదా? ఆవిషయం నాకెప్పుడూ సంతోషమే కలిగిస్తుంది”అది ఆమె ప్రాపంచిక దృష్టి,..తరగని జీవనోత్సాహం, సెన్స్ ఆఫ్ హ్యూమర్.స్నేహించే గుణం ఆమెలో ఆకర్షణలు..